07-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 31.12.2006


‘‘దృఢత మరియు పరివర్తన శక్తితో‘కారణము’మరియు‘సమస్య’ అన్న పదాలకు వీడ్కోలు ఇచ్చి‘నివారణ’మరియు‘సమాధాన’ స్వరూపులుగా అవ్వండి’’

ఈ రోజు నవయుగ రచయిత అయిన బాప్ దాదా నలువైపులా ఉన్న తమ పిల్లలకు నూతన సంవత్సరము మరియు నవయుగము, రెండింటికీ అభినందనలు తెలపడానికి వచ్చారు. నలువైపులా ఉన్న పిల్లలు కూడా అభినందనలు తెలపడానికి చేరుకున్నారు. కేవలం నూతన సంవత్సరపు అభినందనలను తెలపడానికే వచ్చారా లేక నవయుగము యొక్క అభినందనలను కూడా తెలపడానికి వచ్చారా? ఏ విధంగా నూతన సంవత్సరానికి సంబంధించి సంతోషము ఉంటుంది మరియు సంతోషాన్ని ఇస్తారు కదా, అలా బ్రాహ్మణ ఆత్మలైన మీకు నవయుగము కూడా అంతగానే గుర్తుందా? నవయుగము కళ్ళ ముందుకు వచ్చేసిందా? ఏ విధంగా నూతన సంవత్సరము విషయములో, అది ఇప్పుడిక వచ్చేసినట్లే అని మీ హృదయములో అనిపిస్తుందో అలాగే మీ నవయుగము కొరకు కూడా అది ఇప్పుడిక వచ్చేసినట్లే అని అనుభవం చేస్తున్నారా? ఆ నవయుగపు స్మృతి అంతే సమీపముగా వస్తుందా? మీ ఆ శరీరము రూపీ డ్రేస్ మెరుస్తూ మీ ముందు కనిపిస్తోందా? బాప్ దాదా డబుల్ అభినందనలు తెలియజేస్తున్నారు. పిల్లల మనసులో, నయనాలలో నవయుగము యొక్క దృశ్యాలు ఇమర్జ్ అయి ఉన్నాయి. మన నవయుగములో తనువు, మనసు, ధనము, జనము ఎంత శ్రేష్ఠముగా ఉన్నాయి, అక్కడ సర్వ ప్రాప్తుల భాండాగారము ఉంది. ఈ రోజు మేము పాత ప్రపంచములో ఉన్నాము, మళ్ళీ ఇప్పటికిప్పుడే మా రాజ్యములో ఉంటాము అన్న సంతోషము ఉంది! మీ రాజ్యము గుర్తుందా? ఏ విధంగా ఈ రోజు డబుల్ కార్యము కొరకు వచ్చారు, పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడానికి మరియు కొత్త సంవత్సరానికి అభినందనలు తెలపడానికి వచ్చారు, అలాగే కేవలం పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారా లేక పాత ప్రపంచపు పాత సంస్కారాలకు, పాత స్వభావానికి, పాత నడవడికకు, వాటికి కూడా వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారా? పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడమనేది సహజమే, కానీ పాత సంస్కారాలకు వీడ్కోలు ఇవ్వడము కూడా అంతే సహజముగా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? మాయకు కూడా వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారా లేక కేవలం పాత సంవత్సరానికే వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారా? వీడ్కోలైతే ఇవ్వాలి కదా! లేక మాయ అంటే కొద్దిగా ప్రేమ ఉందా? మాయను కొద్ది కొద్దిగా ఉంచుకోవాలనుకుంటున్నారా?

బాప్ దాదా ఈ రోజు నలువైపులా ఉన్న పిల్లల ద్వారా పాత సంస్కార-స్వభావాలకు వీడ్కోలు ఇప్పించాలని కోరుకుంటున్నారు. ఇవ్వగలరా? ధైర్యము ఉందా లేక వీడ్కోలు ఇవ్వాలనుకుంటున్నాము కానీ మళ్ళీ మాయ వచ్చేస్తుంది అని ఆలోచిస్తున్నారా? ఈ రోజున దృఢ సంకల్పపు శక్తితో పాత సంస్కారాలకు వీడ్కోలు ఇచ్చి నవయుగ సంస్కారాలకు, జీవితానికి అభినందనలు ఇచ్చే ధైర్యము ఉందా? ఉందా ధైర్యము? ఇది జరగగలదు అని ఎవరైతే భావిస్తున్నారో, ఇది జరగగలదా లేక జరగవలసిందేనా, మీరు ధైర్యవంతులేనా? ధైర్యము ఉంది అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ధైర్యము ఉందా? అచ్ఛా, ఎవరైతే చేతులెత్తలేదో, వారు ఆలోచిస్తున్నారా? డబుల్ విదేశీయులు చేతులెత్తారు. ఎవరిలోనైతే ధైర్యము ఉందో, వారు చేతులెత్తండి, అందరూ కాదు. అచ్ఛా, డబల్ విదేశీయులైతే చురుకైనవారు, అందుకే డబుల్ నషా ఉంది. చూడండి, బాప్ దాదా ప్రతి నెల రిజల్టు చూస్తారు. పిల్లలు ధైర్యవంతులు అని బాప్ దాదాకు సంతోషము ఉంది. పిల్లలు చతురతతో జవాబిస్తారు. ఎందుకని? ఎందుకంటే పిల్లలకు తెలుసు, మేము ధైర్యముతో ఒక్క అడుగు వేస్తే బాబా నుండి వేలాది అడుగుల సహాయము లభించవలసిందే. మీరు అధికారులు. వేలాది అడుగుల సహాయానికి అధికారులు. కేవలం మాయ ధైర్యాన్ని చలింపజేసేందుకు ప్రయత్నిస్తుంది. ధైర్యాన్ని బాగా ఉంచుతున్నారు అన్నది బాప్ దాదా చూస్తుంటారు, దానికి బాప్ దాదా హృదయపూర్వకముగా అభినందనలు కూడా తెలియజేస్తారు. కానీ ధైర్యాన్ని ఉంచుతూ దానితోపాటుగా తమ లోలోపల వ్యర్థ సంకల్పాలను ఉత్పన్నము చేస్తారు. చేయడమైతే చేస్తున్నాము, మరి జరగడమైతే జరగాలి, చేయడమైతే తప్పకుండా చేస్తాము కానీ ఏమవుతుందో తెలియదు... ఈ ‘ఏమో తెలియదు’ అన్న సంకల్పము రావడము, ఇది ధైర్యాన్ని బలహీనము చేస్తుంది. ‘మరి, మరి’ అన్నది వచ్చేస్తుంది కదా, మరి చేయడమైతే చేస్తున్నాము, మరి చేయాల్సిందే కదా, మరి ముందుకు ఎగరాల్సిందే కదా... ఈ ఆలోచనలు ధైర్యాన్ని చలింపజేస్తాయి. కావున ఇలా ఆలోచించకండి. చేయాల్సిందే, ఎందుకు అవ్వదు అని ఆలోచించండి! బాబా తోడుగా ఉన్నప్పుడు బాబాతోపాటు ఈ ‘మరి, మరి’ అన్నది రాదు.

కావున ఈ కొత్త సంవత్సరములో ఏ నవీనతను తీసుకువస్తారు? ధైర్యము అనే పాదాన్ని దృఢముగా చేసుకోండి. ధైర్యము అనే పాదాన్ని ఎంత దృఢముగా చేసుకోండి అంటే మాయ స్వయము చలించాలే కానీ పాదము చలించకూడదు. కావున ఈ కొత్త సంవత్సరములో కొత్తదనాన్ని తీసుకువస్తారా లేక కాసేపు చలిస్తూ, కాసేవు దృఢముగా ఉంటూ... ఇలాగైతే చేయరు కదా! మీ అందరి కర్తవ్యము లేక వృత్తి ఏమిటి? మిమ్మల్ని మీరు ఏమని పిలుచుకుంటారు? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. విశ్వకళ్యాణకారులు, విశ్వపరివర్తకులు - ఇదే మీ కర్తవ్యము కదా! బాప్ దాదాకు అప్పుడప్పుడు మధురమైన చిరునవ్వు వస్తుంది. విశ్వపరివర్తకులు అన్న టైటిల్ అయితే ఉంది కదా! మీరు విశ్వపరివర్తకులేనా? లేక లండన్ పరివర్తకులా లేక ఇండియా పరివర్తకులా? మీరందరూ విశ్వపరివర్తకులే కదా? ఒక పల్లెలో ఉన్నా లేక లండన్ లో ఉన్నా లేక అమెరికాలో ఉన్నా, మీరు విశ్వకళ్యాణకారులే కదా? అవునంటే తల ఊపండి. పక్కా కదా! లేక 75 శాతమే అలా ఉన్నారా. 75 శాతము విశ్వకళ్యాణకారులు మరియు 25 శాతము పరవాలేదు అని భావిస్తున్నారా? మీరు చేసిన ఛాలెంజ్ ఏమిటి? ప్రకృతిని కూడా పరివర్తన చేయాల్సిందే అని ప్రకృతిని కూడా ఛాలెంజ్ చేసారు. కావున మీ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోండి. వాస్తవానికి ఇలా చేయకూడదు కానీ జరిగిపోతోంది అని అప్పుడప్పుడు స్వయము కోసము కూడా ఇలా ఆలోచిస్తుంటారు. మరి విశ్వపరివర్తకులు మరియు ప్రకృతి పరివర్తకులైనవారు, స్వపరివర్తకులుగా అవ్వలేరా? శక్తి సైన్యము ఏమి ఆలోచిస్తున్నారు? ఈ సంవత్సరములో విశ్వపరివర్తకులు అన్న మీ కర్తవ్యాన్ని గుర్తుంచుకోండి. స్వయము పట్ల మరియు మీ బ్రాహ్మణ పరివారము పట్ల కూడా పరివర్తకులుగా అవ్వండి, ఎందుకంటే మొదటైతే దానము ఇంటి నుండి ప్రారంభమవుతుంది కదా! కావున మీ కర్తవ్యము యొక్క ప్రాక్టికల్ స్వరూపాన్ని ప్రత్యక్షము చేస్తారు కదా! ఏ స్వ పరివర్తననైతే మీరు స్వయము కూడా కోరుకుంటున్నారో మరియు బాప్ దాదా కూడా కోరుకుంటున్నారో, అదేమిటో తెలుసు కదా! బాప్ దాదా అడుగుతున్నారు, పిల్లలైన మీ అందరి లక్ష్యము ఏమిటి? అప్పుడు మెజారిటీ ఒకటే జవాబు ఇస్తారు - బాబా సమానముగా అవ్వాలి. అంతే కదా! బాబా సమానముగా అవ్వవలసిందే కదా, లేక చూస్తాము, ఆలోచిస్తాము అని అంటారా...! కనుక బాబా కూడా ఇదే కోరుకుంటున్నారు, ఈ కొత్త సంవత్సరములో 70 సంవత్సరాలు పూర్తవుతున్నాయి, 2006లో ఇప్పుడు 71వ సంవత్సరములో ఏదైనా అద్భుతము చేసి చూపించండి. అందరూ సేవ పట్ల ఎంతో ఉత్సాహముతో భిన్న-భిన్న ప్రోగ్రామ్ లను తయారుచేస్తూ ఉంటారు, అందులో సఫలతను కూడా పొందుతూ ఉంటారు. ఏదైతే కష్టపడతారో అందుకు సఫలత కూడా లభిస్తోంది అని బాప్ దాదాకు సంతోషము కూడా కలుగుతుంది. అదేమీ వ్యర్థమవ్వదు కానీ సేవ ఎందుకు చేస్తారు అని అడిగితే ఏం జవాబు ఇస్తారు? బాబాను ప్రత్యక్షము చేయడానికి అని చెప్తారు. కావున బాబా ఈ రోజు పిల్లలను ప్రశ్న అడుగుతున్నారు, అదేమిటంటే - బాబాను ప్రత్యక్షమైతే చేయవలసిందే మరియు చేస్తారు కూడా, కానీ బాబాను ప్రత్యక్షము చేసేకంటే ముందు స్వయాన్ని ప్రత్యక్షము చేసుకోండి. శివశక్తులు చెప్పండి, ఈ సంవత్సరము శివశక్తి రూపములో స్వయాన్ని ప్రత్యక్షము చేస్తారా? చేస్తారా? జనక్ చెప్పండి? చేస్తారా? (చేయవలసిందే). తోడుగా ఉన్నవారు, మొదటి లైన్ లో, రెండవ లైన్ లో కూర్చున్న టీచర్లు, ఈ సంవత్సరము చేసి చూపించబోతున్నవారు చేతులెత్తండి. చేస్తాము అని అనడం కాదు, చేసి చూపించవలసిందే. అచ్ఛా - టీచర్లందరూ చేతులెత్తారా లేక ఎవరైనా ఎత్తలేదా.

అచ్ఛా - మధుబన్ వారు. చేయవలసిందే, చేయవలసే ఉంటుంది, ఎందుకంటే మధుబన్ అయితే అందరికన్నా దగ్గర ఉంది కదా. తారీఖును నోట్ చేసుకోండి. ఈ రోజు 31వ తారీఖు. టైమ్ కూడా నోట్ చేసుకోండి (9 గంటల 20 నిమిషాలు). మరి పాండవ సేనా, పాండవులు ఏం చూపించాలి? విజయీ పాండవులు. అప్పుడప్పుడు విజయులుగా కాదు, మీరు ఉన్నదే విజయీ పాండవులు. కావున ఈ సంవత్సరములో ఇలా తయారై చూపించండి. లేదా - ఏం చేయాలి, మాయ వచ్చేసింది కదా, మేం కావాలనుకోవడం లేదు కానీ అది వచ్చేసింది అని అంటారా! బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పారు - మాయ తన చివరి సమయము వరకు రావడము ఆపదు. కానీ మాయ పని రావడము, మరి మీ పని ఏమిటి? విజయులుగా అవ్వడము. కావున ఇలా అలోచించకండి - మేం కావాలనుకోవడం లేదు కానీ మాయ వచ్చేస్తుంది, అలా అయిపోతోంది... ఇప్పుడు బాప్ దాదా ఈ సంవత్సరముతో పాటుగా ఈ పదాలకు కూడా వీడ్కోలు ఇప్పించాలనుకుంటున్నారు. 12 గంటలకు ఈ సంవత్సరానికి వీడ్కోలు ఇస్తారు కదా! కావున ఏ గంటలనైతే మ్రోగిస్తారో, ఈ రోజు గంటలు మ్రోగించేటప్పుడు దేని గంటలు మ్రోగిస్తారు? ఈ రోజుకా, ఈ సంవత్సరానికా లేక మాయకు వీడ్కోలు తెలిపే గంటలు మ్రోగిస్తారా? రెండు విషయాలు ఉన్నాయి - ఒకటేమో పరివర్తన శక్తి, అందులో లోపముంది. ప్లాన్లు చాలా బాగా తయారుచేస్తారు, ఇలా చేస్తాము, ఇలా చేస్తాము, ఇలా చేస్తాము... అని. చాలా మంచి ప్లాన్లు తయారుచేసారు అని బాప్ దాదా కూడా సంతోషపడతారు కానీ పరివర్తనా శక్తి యొక్క లోపము ఉన్న కారణముగా కొంత పరివర్తన అవుతుంది, కొంత పరివర్తన అవ్వదు. మరియు రెండవ లోపము, దృఢత యొక్క లోపము. సంకల్పాలు మంచి-మంచివి చేస్తారు. ఈ రోజు కూడా చూడండి, ఎన్నో కార్డులను, ఎన్ని ప్రమాణాలను, ఎన్ని ప్రతిజ్ఞలను చూసారు, బాప్ దాదా చూసారు. చాలా మంచి-మంచి ఉత్తరాలు వచ్చాయి. (కార్డులు, ఉత్తరాలు అన్నీ స్టేజ్ పైన అలంకరించి ఉంచారు). కావున చేస్తారు, చూపిస్తారు, జరగవలసిందే, తయారవ్వవలసిందే, పదమాల, పదమాల రెట్లు ప్రియస్మృతులు, అన్నీ బాప్ దాదా వద్దకు చేరుకున్నాయి. మీరు ఎవరైతే సమ్ముఖముగా కూర్చున్నారో మీ హృదయములోని ధ్వనులు కూడా బాబా వద్దకు చేరుకున్నాయి. కానీ బాప్ దాదా ఈ రెండు శక్తులపైన అండర్ లైన్ చేయిస్తున్నారు. ఒకటేమో, దృఢతలో లోపము వచ్చేస్తుంది. ఆ లోపానికి కారణమేమిటంటే - నిర్లక్ష్యము, ఇతరులను చూడడము. అయిపోతుందిలే, చేయడమైతే చేస్తున్నాము కదా, చేస్తాములే, తప్పకుండా చేస్తాములే....

బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - ఈ సంవత్సరము ఒక్క పదానికి సదా కొరకు వీడ్కోలు ఇవ్వండి. అది ఏమిటి? చెప్పమంటారా, చెప్పనా? మరి వీడ్కోలు ఇవ్వవలసి ఉంటుంది. ఈ సంవత్సరము బాప్ దాదా కారణము అన్న పదానికి వీడ్కోలు ఇప్పించాలనుకుంటున్నారు. నివారణ ఉండాలి, కారణము సమాప్తమవ్వాలి. సమస్య సమాప్తమవ్వాలి, సమాధాన స్వరూపులుగా అవ్వాలి. స్వయము యొక్క కారణమైనా, తోటివారి యొక్క కారణమైనా, సంగఠన యొక్క కారణమైనా, ఏదైనా పరిస్థితి కారణమైనా, బ్రాహ్మణుల డిక్షనరీలో కారణము అన్న పదము, సమస్య అన్న పదము పరివర్తన అవ్వాలి, సమాధానము మరియు నివారణ జరగాలి, ఎందుకంటే చాలామంది ఈ రోజు అమృతవేళ కూడా బాప్ దాదాతో ఆత్మిక సంభాషణలో - కొత్త సంవత్సరములో ఏదైనా నవీనతను తీసుకురావాలి అని ఇదే మాట్లాడారు. కావున బాప్ దాదా కోరుకుంటున్నారు, ఈ కొత్త సంవత్సరాన్ని ఎలా జరుపుకోండంటే, ఈ రెండు పదాలు సమాప్తమైపోవాలి. పరోపకారులుగా అవ్వండి. స్వయమే కారణమైనా లేక ఇతరులెవరైనా కారణమైనా కానీ పరోపకారీ ఆత్మగా అయి, దయార్ద్ర హృదయ ఆత్మగా అయి, శుభభావన, శుభకామన యొక్క హృదయము కలవారిగా అయి సహయోగాన్ని ఇవ్వండి, స్నేహాన్ని తీసుకోండి.

మరి ఈ కొత్త సంవత్సరానికి ఏమి పేరు పెడతారు? పూర్వము ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెట్టేవారు, గుర్తుంది కదా? కావున బాప్ దాదా ఈ సంవత్సరాన్ని - శ్రేష్ఠ శుభ సంకల్పాల, దృఢ సంకల్పాల, స్నేహ సహయోగ సంకల్పాల సంవత్సరము అని అంటున్నారు, ఇది పేరు కాదు, కానీ ఇలా చూడాలనుకుంటున్నారు. దృఢత శక్తిని, పరివర్తన శక్తిని సదా సహచరులుగా చేసుకోండి. ఎవరు ఎంత నెగిటివ్ ఇచ్చినా కానీ, ఏ విధంగా మీరు ఇతరులకు నెగిటివ్ ను పాజిటివ్ లోకి మార్చండి అని కోర్సు చెప్తారో, అలా మీరు స్వయం నెగిటివ్ ను పాజిటివ్ లోకి మార్చలేరా? ఇతరులు పరవశమై ఉంటారు, పరవశమైనవారిపై దయ చూపించడం జరుగుతుంది. మీ జడచిత్రాలు మీ చిత్రాలే కదా. భారత్ లో డబుల్ విదేశీయుల చిత్రాలు కూడా ఉన్నాయి, అవి పూజింపబడతాయి. దిల్వాడా మందిరములోనైతే మీ చిత్రాలను చూసారు కదా! చాలా మంచిది. మీ జడ చిత్రాలు దయార్ద్ర హృదయము కలిగి ఉంటాయి. ఎవరైనా చిత్రాల ముందుకు వెళ్ళినప్పుడు ఏం కోరుకుంటారు? దయ చూపించండి, కృప చూపించండి, దయ చూపించండి, దయ, దయ... అని కోరుకుంటారు. కావున సదా మొదట స్వయముపై దయ చూపించుకోండి, ఆ తర్వాత బ్రాహ్మణ పరివారముపై దయ చూపించండి. ఒకవేళ ఎవరైనా పరవశులైతే, సంస్కారాలకు వశమైతే, బలహీనులైతే, ఆ సమయములో వివేకహీనులుగా అయిపోతారు, అందుకే క్రోధము చేయకండి. క్రోధము యొక్క రిపోర్ట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. క్రోధము కాకపోయినా దాని పిల్లా-పాపలపై ఎక్కువ ప్రేమ ఉంది. అధికార దర్పము వస్తుంది, ఈ అధికార దర్పము క్రోధము యొక్క సంతానము. ఏ విధముగానైతే పరివారములో పెద్ద పిల్లలపై ప్రేమ తగ్గిపోతుంది మరియు మనవలు, మనువరాళ్ళపై ఎక్కువ ప్రేమ ఉంటుంది. కావున క్రోధము తండ్రి లాంటిది మరియు అధికార దర్పము, తప్పుడు నషా, ఇవి సంతానము... నషా కూడా భిన్న-భిన్న రకాలుగా ఉంటుంది, బుద్ధి యొక్క నషా, డ్యూటీ యొక్క నషా, సేవ యొక్క నషా, ఏదైనా విశేష కర్తవ్యము యొక్క నషా, ఇదంతా అధికార దర్పమే... కావున దయాళువుగా అవ్వండి, కృపాళువుగా కండి. చూడండి, కొత్త సంవత్సరములో ఒకరికొకరు మిఠాయితో నోటిని తీపి చేసుకుంటారు. అభినందనలు తెలియజేస్తారు, అలాగే నోటిని కూడా తీపి చేసుకుంటారు కదా! కావున ఈ సంవత్సరమంతా చేదును చూపించవద్దు. వారు నోటిని మాత్రమే తీపి చేస్తారు, మీరు కేవలం నోటిని మాత్రమే తీపి చేయరు, కానీ మీ ముఖము కూడా తీయగా ఉండాలి. సదా మీ ముఖము ఆత్మికతతో కూడిన స్నేహము కలదిగా ఉండాలి, చిరునవ్వుతో కూడిన ముఖముగా ఉండాలి. చేదుతనము ఉండకూడదు. మెజారిటీ బాప్ దాదాతో ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు తమ గురించి తాము నిజాయితీ వినిపిస్తారు, అయినా వేరేవారు ఎవరూ వినరు కదా. కావున మెజారిటీ యొక్క రిజల్టులో ఇతర వికారాల కన్నా క్రోధము లేక క్రోధము యొక్క పిల్లా-పాపల రిపోర్ట్ ఎక్కువగా ఉంది.

బాప్ దాదా ఈ కొత్త సంవత్సరములో ఈ చేదుతనాన్ని తీసివేయాలని అనుకుంటున్నారు. మేము కావాలనుకోవడం లేదు కానీ అది వచ్చేస్తోంది అని చాలామంది తమ ప్రతిజ్ఞను కూడా వ్రాసారు. కావున బాప్ దాదా - ఇదంతా దృఢతలో లోపము వలన జరుగుతోంది అని కారణాన్ని వినిపించారు. బాబా ఎదురుగా సంకల్పము ద్వారా ప్రమాణము కూడా చేస్తారు. కానీ దృఢత అనేది ఎటువంటి శక్తి అంటే, ప్రపంచములోనివారు కూడా అంటుంటారు కదా, శరీరము పోయినా కానీ ఇచ్చిన మాట తప్పకూడదు అని. మరణించవలసి వచ్చినా, తలవంచవలసి వచ్చినా, మారవలసి వచ్చినా, సహించవలసి వచ్చినా, తాము ఇచ్చిన మాటలో దృఢముగా ఉండేవారు ప్రతి అడుగులోనూ సఫలతామూర్తులుగా ఉంటారు, ఎందుకంటే దృఢత సఫలతకు తాళంచెవి. ఈ తాళంచెవి అందరి వద్దా ఉంది కానీ అవసరమైన సమయానికి మాయమైపోతుంది. మరి మీరు ఏమి అనుకుంటున్నారు?

కొత్త సంవత్సరములో నవీనతను తీసుకురావలసిందే - స్వయం యొక్క, సహయోగుల యొక్క మరియు విశ్వపరివర్తన యొక్క నవీనతను తీసుకురావలసిందే. వెనుక ఉన్నవారు వింటున్నారా? మరి చెయ్యాలి కదా. మొదటైతే పెద్దవారు చేస్తారు కదా, మేమైతే చిన్నవారము కదా అని ఆలోచించకండి. చిన్నవారు తండ్రి సమానమైనవారు. పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా యొక్క అధికారులు. మీరు మొదటిసారి వచ్చినా కానీ ‘నా బాబా’ అని అన్నారంటే మీరు అధికారులే. శ్రీమతముపై నడవడములో కూడా అధికారులు మరియు సర్వ ప్రాప్తులకు కూడా అధికారులు. టీచర్లు పరస్పరము ప్రోగ్రామ్ ను తయారుచేయండి. విదేశీయులు కూడా తయారుచేయండి. భారత్ వారు కూడా కలిసి తయారుచేయండి. బాప్ దాదా ప్రైజ్ ఇస్తారు, ఏ జోన్ వారు, అది భారత్ వారైనా, విదేశాల వారైనా, ఏ జోన్ నంబర్ వన్ తీసుకుంటే, వారికి బంగారు కప్ ఇస్తారు. కేవలం మిమ్మల్ని మీరు తయారుచేసుకోవడమే కాదు, మీ తోటివారిని కూడా తయారుచేయాలి, ఎందుకంటే బాప్ దాదా చూసారు, పిల్లల పరివర్తన జరగకపోవడం వల్ల విశ్వపరివర్తన కూడా ఢీలా అవుతుంది మరియు ఆత్మలు కొత్త-కొత్త రకాల దుఃఖాలకు పాత్రులుగా అవుతున్నారు. దుఃఖము, అశాంతి యొక్క కొత్త-కొత్త కారణాలు తయారవుతున్నాయి. బాబా ఇప్పుడు పిల్లల యొక్క దుఃఖపు పిలుపును వింటూ పరివర్తన కోరుకుంటున్నారు. కావున - ఓ మాస్టర్ సుఖదాతలైన పిల్లలూ, దుఃఖితులపై దయ చూపించండి. భక్తులు కూడా భక్తిని చేసి-చేసి అలిసిపోయారు. భక్తులకు కూడా ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించండి. మీకు దయ కలుగుతోందా లేదా? మీ సేవలోనే, మీ దినచర్యలోనే బిజీగా ఉన్నారా? మీరూ నిమిత్తులే, అంతేకానీ పెద్దవాళ్ళు మాత్రమే నిమిత్తులు అని కాదు. ‘నా బాబా’ అని అన్న ఒక్కొక్క బిడ్డ మరియు అలా భావించిన ప్రతి ఒక్కరూ నిమిత్తులే. కొత్త సంవత్సరములో ఒకరికొకరు కానుకలు కూడా ఇచ్చుకుంటారు కదా. కావున మీరు భక్తుల ఆశలను పూర్తి చేయండి. వారికి కానుకను ఇప్పించండి. దుఃఖితులను దుఃఖము నుండి విడిపించండి, ముక్తిధామములో శాంతిని ఇప్పించండి - ఈ కానుకను ఇవ్వండి. బ్రాహ్మణ పరివారములో ప్రతి ఆత్మకు హృదయపూర్వకమైన స్నేహము మరియు సహయోగము యొక్క కానుకను ఇవ్వండి. మీ వద్ద కానుకల యొక్క స్టాక్ ఉందా? స్నేహము ఉందా? సహయోగము ఉందా? ముక్తిని ఇప్పించే శక్తి ఉందా? ఎవరివద్దనైతే స్టాక్ చాలా ఉందో వారు చేతులెత్తండి. ఉందా స్టాక్? స్టాక్ తక్కువగా ఉందా? మొదటి లైన్ లో ఉన్నవారి వద్ద స్టాక్ తక్కువగా ఉందా? ఈ బ్రిజ్ మోహన్ చేయి ఎత్తడం లేదు. స్టాక్ అయితే ఉంది కదా, స్టాక్ ఉందా? అందరూ చేతులెత్తారా? స్టాక్ ఉందా? మరి స్టాక్ ఉంచుకుని ఏమి చేస్తున్నారు? జమ చేసుకుని ఉంచుకున్నారు! టీచర్లు, స్టాక్ ఉంది కదా? మరి ఇవ్వండి కదా. విశాలహృదయులుగా అవ్వండి. మధుబన్ వారు ఏం చేస్తారు? ఉందా స్టాక్? మధుబన్ లో ఉందా? మధుబన్ లోనైతే నలువైపులా స్టాక్ నిండి ఉంది. కావున ఇప్పుడు దాతగా అవ్వండి. కేవలం జమ చేసుకోవడమే కాదు. దాతగా అవ్వండి, ఇస్తూ వెళ్ళండి. సరేనా. అచ్ఛా.

ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమను తాము తమ మనసుకు యజమానులుగా అనుభవం చేసి ఒక్క క్షణములో మనసును ఏకాగ్రము చేసుకోగలరా? ఆర్డర్ చేయగలరా? ఒక్క క్షణములో మీ మధురమైన ఇంటికి చేరుకోండి. ఒక్క క్షణములో మీ రాజ్యమైన స్వర్గములోకి చేరుకోండి. మనసు మీ ఆర్డర్ ను పాటిస్తుందా లేక అలజడి చేస్తుందా? యజమానులు ఒకవేళ యోగ్యులుగా, శక్తివంతులుగా ఉన్నట్లయితే మనసు మాట వినకపోవడమనేది జరగదు. కావున ఇప్పుడు అభ్యాసము చేయండి - ఒక్క క్షణములో అందరూ మీ మధురమైన ఇంటికి చేరుకోండి. ఈ అభ్యాసాన్ని రోజంతటిలో మధ్యమధ్యలో చేసే అటెన్షన్ ఉంచండి. మనసు యొక్క ఏకాగ్రత స్వయాన్ని కూడా మరియు వాయుమండలాన్ని కూడా శక్తిశాలిగా చేస్తుంది. అచ్ఛా!

నలువైపులా ఉన్న సర్వుల అతి స్నేహీ ఆత్మలకు, సర్వుల సహయోగులైన శ్రేష్ఠాత్మలకు, నలువైపులా ఉన్న విజయీ పిల్లలకు, నలువైపులా ఉన్న పరివర్తనా శక్తి కల పిల్లలకు, నలువైపులా ఉన్న సదా స్వయాన్ని ప్రత్యక్షము చేసి బాబాను ప్రత్యక్షము చేసే పిల్లలకు, సదా సమాధాన స్వరూపులైన విశ్వపరివర్తకులైన పిల్లలకు, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు హృదయపూర్వకమైన దీవెనలను స్వీకరించగలరు. దానితోపాటు పిల్లలందరికీ, ఎవరైతే బాబాకు కూడా శిరోకిరీటముగా ఉన్నారో, ఇటువంటి శిరోకిరీటాల వంటి పిల్లలకు బాప్ దాదాల నమస్తే.

వరదానము:-
మురళీధరుని మురళి పట్ల ప్రీతిని ఉంచే సదా శక్తిశాలి ఆత్మా భవ

ఏ పిల్లలకైతే చదువు పట్ల అనగా మురళి పట్ల ప్రేమ ఉంటుందో, వారికి సదా శక్తిశాలి భవ అన్న వరదానము లభిస్తుంది, వారి ఎదురుగా ఎటువంటి విఘ్నము నిలవలేదు. మురళీధరునిపై ప్రీతిని ఉంచడము అనగా వారి మురళి పట్ల ప్రీతిని ఉంచడము. ఒకవేళ ఎవరైనా నాకు మురళీధరునిపైనైతే చాలా ప్రీతి ఉంది కానీ చదువు కోసము సమయము లేదు అని అంటే తండ్రి ఒప్పుకోరు ఎందుకంటే ఎక్కడైతే ప్రేమ మరియు తపన ఉంటుందో అక్కడ ఎటువంటి సాకులు ఉండవు. చదువు మరియు పరివారము యొక్క ప్రేమ కోటగా అవుతుంది, తద్వారా వారు సురక్షితముగా ఉంటారు.

స్లోగన్:-
ప్రతి పరిస్థితిలోనూ స్వయాన్ని మలచుకున్నట్లయితే నిజమైన బంగారముగా అవుతారు.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి

యోగాన్ని జ్వాలారూపముగా, శక్తిశాలిగా చేసుకునేందుకు యోగములో కూర్చున్నప్పుడు ఇముడ్చుకునే శక్తిని ఉపయోగించండి. సేవ యొక్క సంకల్పాలు కూడా మర్జ్ అయిపోవాలి. ఎంతటి శక్తి ఉండాలంటే - స్టాప్అనగానే అవి స్టాప్ అయిపోవాలి. ఫుల్బ్రేక్పడాలి, బ్రేక్ ఢీలాగా పడకూడదు. ఒకవేళ ఒక్క క్షణానికి బదులుగా ఎక్కువ సమయము పట్టిందంటే ఇముడ్చుకునే శక్తి బలహీనముగా ఉంది అని అంటారు.