07-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఆలస్యముగా వచ్చినా, వేగముగా పురుషార్థము చేసినట్లయితే చాలా ముందుకు వెళ్ళగలరు, ఇతరుల చింతను వదిలి మీ పురుషార్థములో నిమగ్నమవ్వండి’’

ప్రశ్న:-
మనుష్యమాత్రులెవ్వరూ చేయలేని ఏ కర్తవ్యము ఒక్క తండ్రిది మాత్రమే?

జవాబు:-
మనుష్యులను దేవతలుగా తయారుచేయడము, వారిని శాంతిధామానికి, సుఖధామానికి యజమానులుగా చేయడము, ఈ కర్తవ్యము ఒక్క తండ్రిది మాత్రమే, దీనిని మనుష్యులెవ్వరూ చేయలేరు. సంగమములోనే మేము భగవానువాచ వింటాము అని మీకు నిశ్చయముంది. ఇప్పుడు స్వయంగా భగవంతుడే కల్పక్రితం వలె రాజయోగాన్ని నేర్పిస్తున్నారు.

ఓంశాంతి
అనంతమైన ఆత్మిక తండ్రి అనంతమైన ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ ఒక్కొక్క అక్షరము లేక జ్ఞాన రత్నము లక్షల రూపాయల విలువైనది. పరమాత్మను రూప్-బసంత్ అని కూడా అంటారని తండ్రి అర్థం చేయించారు. వారికి రూపము కూడా ఉంది. వారి నామము శివబాబా. వారు జ్ఞానసాగరుడు, ఆ జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది. జ్ఞానము ధనము కూడా, అలానే జ్ఞానము చదువు కూడా. ఈ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక తండ్రి ఇస్తారు. ఆత్మను - స్పిరిచ్యుల్ రూహ్ అని అంటారు. భక్తి మార్గములో ఆత్మలు తండ్రిని కలుసుకునేందుకు ఎంతగా భ్రమిస్తారు. వారి కోసం వెతుకుతారు. భగవంతుడు ఒక్క శివుడేనని భావిస్తారు, అయినా కానీ భ్రమిస్తూనే ఉంటారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు - ఆత్మిక పిల్లలూ, మీరు అవినాశీ అయినవారు, మీరు పరంధామ నివాసులు, అక్కడ నుండి ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తారు. మీరు దూరదేశ నివాసులు. ఇది డ్రామా, దీని పేరు గెలుపు-ఓటముల ఆట, సుఖ-దుఃఖాల ఆట. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను మరియు మీరు, అందరము శాంతిధామ నివాసులము. దానిని నిర్వాణధామమని కూడా అంటారు. ముందుగా - మేము అక్కడి నివాసులము అని నిశ్చయము ఏర్పరచుకోవాలి. ఆత్మనైన నా స్వధర్మము శాంతి. బిందువైన ఆత్మలో మొత్తం అవినాశీ పాత్ర నిండి ఉంది. తండ్రి చదివించడము కూడా మిమ్మల్ని మాత్రమే చదివిస్తారు. మీరు ప్రపంచములోని మనుష్యుల గురించి చింతిస్తూ ఉంటారు. భగవానువాచ సంగమములోనే ఉంటుందని, ఇంకెప్పుడూ ఉండదని మీకు నిశ్చయముంది కదా. ఎవ్వరూ మనుష్యులను దేవతలుగా తయారుచేయలేరు, శాంతిధామానికి, సుఖధామానికి యజమానులుగా తయారుచేయలేరు. కల్పక్రితం కూడా తండ్రియే తయారుచేసారు. ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంటుగా అయ్యారో, 5000 సంవత్సరాల తర్వాత వారే అవుతారు. మొత్తం ప్రపంచములోని దృశ్యాలన్నీ 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతాయి. వృద్ధ మాతలు ఈ విషయాలన్నింటినీ ధారణ చేయలేరు కనుక వారికి కేవలం 3 విషయాలను గుర్తుంచుకోమని చెప్తారు - ఆత్మనైన నేను శాంతిధామ నివాసిని, తర్వాత సుఖధామములోకి వస్తాను, మళ్ళీ అర్ధకల్పము తర్వాత ఎప్పుడైతే రావణ రాజ్యము ప్రారంభమవుతుందో, అప్పుడు వికారులుగా అవుతాము, దీనిని దుఃఖధామమని అంటారు. ఎప్పుడైతే దుఃఖధామము పూర్తి అవుతుందో, అప్పుడు తండ్రి - నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. మిమ్మల్ని శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళేందుకు నేను రావాల్సి ఉంటుంది.

ఇప్పుడు ఎవరైతే వచ్చి తండ్రికి చెందినవారిగా అయ్యారో, వారే వారసత్వాన్ని పొందుతారు. ఈ సూర్యవంశీ, చంద్రవంశీ రాజధాని స్థాపనవుతూ ఉంది. కోట్లాదిమంది మనుష్యులు వచ్చి తండ్రి నుండి ఎంతోకొంత వింటారు, అర్థం చేసుకుంటారు. వృద్ధి జరుగుతూ ఉంటుంది. మీరు అన్ని వైపులకు వెళ్ళి అర్థం చేయించాల్సి ఉంటుంది. వార్తాపత్రికల ద్వారా కూడా చాలామంది వింటారు, పాకిస్థాన్ లో కూడా వార్తాపత్రికల ద్వారా చదువుతారు. అక్కడ కూర్చుని కూడా ఈ జ్ఞానాన్ని వింటారు. గీతకు మొత్తం ప్రపంచములో చాలా ప్రచారముంది. తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఈ విధముగా వ్రాయబడిన విషయాలను వార్తాపత్రికల్లో చదువుతారు, అందుకని కూడా చాలామంది బ్రాహ్మణులుగా అవుతారు. ఎవరైతే వారసత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుందో, వారు తప్పకుండా వచ్చి తీసుకుంటారు. ఇప్పుడింకా కొద్ది సమయమే మిగిలి ఉంది, వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఆలస్యముగా వచ్చినట్లయితే వేగముగా పురుషార్థము చేయాల్సి ఉంటుంది. కల్పక్రితము ఎంతమంది స్వర్గవాసులుగా అయ్యారో, ఇప్పుడు కూడా అంతమంది తప్పకుండా అవుతారు. ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. శాంతిధామము వారు శాంతిధామానికి వెళ్తారు. మళ్ళీ తమ-తమ సమయాలలో పాత్రను అభినయించేందుకు వస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ఇంటికి చేరుకుంటారు. సన్యాసులు ముక్తి కోసం కష్టపడుతూ ఉంటారు, అందుకే వారు అందరికీ - ముక్తియే మంచిదని, సుఖము కాకిరెట్టతో సమానమని చెప్తూ ఉంటారు. సత్యయుగములో కూడా దుఃఖపు విషయాలున్నట్లుగా శాస్త్రాలలో వ్రాశారు. ఏమీ అర్థం చేసుకోరు. పరమాత్మ రావాల్సి ఉంటుందని అంటారు. పతిత-పావన పరమాత్మా రండి, వచ్చి మాకు మార్గాన్ని తెలియజేయండి అని పిలుస్తారు. మరోవైపు పతిత-పావని గంగ అని, గంగా స్నానాలు, యజ్ఞతపాదులు, యాత్రలు చేయడము, ఇవన్నీ భగవంతుడిని చేరుకునేందుకు మార్గాలని చెప్తుంటారు. పరమాత్ముడిని పిలుస్తున్నప్పుడు మరి ఎందుకు భ్రమిస్తున్నారు! ఇదంతా భక్తి మార్గములో నిశ్చితమై ఉంది. మనుష్యులకు ఏది తోస్తే, అది చెప్తూ ఉంటారు. పరమాత్మను కలుసుకునేందుకు ఎంతగా శ్రమిస్తూ ఉంటారు. ఇప్పుడు భగవంతుడిని కలుసుకునేందుకు భక్తులు వెళ్తారా లేక భగవంతుడు ఇక్కడికి రావాల్సి ఉంటుందా? పతిత ఆత్మలైతే వెళ్ళలేరు. తండ్రి మనల్ని తీసుకువెళ్ళేందుకు వస్తారు. సర్వాత్మలకు పండా (మార్గదర్శకుడు) ఒక్కరే. మీరు కూడా పవిత్రమై వారి వెనుక వెళ్తారు. ప్రియుడు మిమ్మల్ని మహరాజు-మహారాణులుగా తయారుచేయడానికి జ్ఞాన రత్నాలతో అలంకరిస్తారు. శ్రీకృష్ణుడి గురించి - వారు ఫలానావారిని ఎత్తుకుపోయారని, పట్టపు రాణులుగా చేసుకున్నారని చూపిస్తారు. ఈ విషయాలు శ్రీకృష్ణునికి అన్వయించవు. మనము స్వర్గానికి మహారాణులుగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. మీరే స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి అలా తయారుచేయడానికి వచ్చారు. ఇది 84 జన్మల విషయము. 84 లక్షల జన్మలనైతే ఎవరూ గుర్తు చేసుకోలేరు. సత్యయుగానికి లక్షల సంవత్సరాలు చూపించారు, త్రేతాకు తక్కువగా చూపించారు. ఇలా అయితే లెక్క సరిపోదు. తండ్రి ఎంత సహజము చేసి అర్థం చేయిస్తున్నారు - కేవలం రెండు విషయాలను గుర్తుంచుకోవాలి, భగవంతుడు మరియు రాజ్యాధికారము. అప్పుడు మీరు పవిత్రముగా కూడా అవుతారు, ఎగరగలుగుతారు కూడా మరియు ఉన్నత పదవిని కూడా పొందుతారు. ఎలాగైనా సరే తండ్రిని స్మృతి చేయాలి అనే చింతను పెట్టుకోవాలి. మాయా తుఫానులు కూడా వస్తాయి, కానీ ఓడిపోకూడదు. ఎవరైనా క్రోధము చేసినా కానీ, మీరు ఏమీ మాట్లాడకండి. సన్యాసులు కూడా - నోటిలో నాణెము వేసుకోండి, అప్పుడు వారు మాట్లాడి-మాట్లాడి ఆగిపోతారు అని అంటారు. తండ్రి కూడా అంటారు - ఎవరైనా క్రోధముగా మాట్లాడితే, మీరు శాంతిగా ఉంటూ చూస్తూ ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీరు శివబాబాను స్మృతి చేయాలి. బాబా స్మృతితోనే వారసత్వము కూడా గుర్తుకువస్తుంది. మీ అతీంద్రియ సుఖము గురించి గాయనముంది - మేము 21 జన్మల కోసం స్వర్గములోని రాకుమార్తెలుగా అవుతాము అని. అక్కడ దుఃఖము అనే మాట కూడా ఉండదు. మీరు 50-60 జన్మలు సుఖాన్ని అనుభవిస్తారు, సుఖము లెక్క ఎక్కువ ఉంటుంది. సుఖ-దుఃఖాలు సమానముగా ఉంటే లాభమేముంది! మీ వద్ద ధనము కూడా చాలా ఉంటుంది. కొంతకాలం క్రితం ఇక్కడ కూడా ధాన్యము చాలా చవకగా ఉండేది. రాజులకు ఎంతో పెద్ద రాజ్యాలుండేవి. బాబా పది అణాలకు ఒక మణుగు జొన్నలను అమ్మారు (సుమారు 40 కిలోల సమానమైన తూకము). అంటే దానికంటే ముందు ఇంకెంత చవకగా ఉండి ఉంటుంది. మనుష్యులు తక్కువమంది ఉంటారు, భోజనము గురించి చింత ఉండదు. ముందు మనము ఇంటికి వెళ్ళి, ఆ తర్వాత కొత్త ప్రపంచములోకి వచ్చి కొత్త పాత్రను అభినయిస్తాము అనే స్మృతి ఇప్పుడు ఉండాలి. అక్కడ మన శరీరము కూడా సతోప్రధాన తత్వాలతో తయారవుతుంది. ఇప్పుడు 5 తత్వాలు పూర్తిగా తమోప్రధానముగా, పతితముగా అయిపోయాయి. ఆత్మ మరియు శరీరము, రెండూ పతితముగా ఉన్నాయి. అక్కడ శరీరము రోగగ్రస్థమవ్వదు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పిల్లలకు ఇక్కడ బాగా అర్థం చేయిస్తారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. ఇక్కడ మేఘాలను నింపుకుని ఎంత సంతోషిస్తారు, మళ్ళీ బయటకు వెళ్ళాక మర్చిపోతారు. ఇంతకుముందు ఆటలు-పాటలు చాలా జరుగుతూ ఉండేవి, తర్వాత అవన్నీ ఆపివేసారు. మనుష్యులు, ఇదొక ఇంద్రజాలమని భావించేవారు. భక్తిలో నవ విధ భక్తి చేసినప్పుడు, వారికి అతి కష్టం మీద సాక్షాత్కారమవుతుంది. ఇక్కడ భక్తి విషయమే లేదు. కూర్చుని-కూర్చునే సాక్షాత్కారాలలోకి వెళ్ళిపోయేవారు, అందుకే దీనిని ఒక ఇంద్రజాలముగా భావించేవారు.

ఈ రోజుల్లో ప్రపంచములో ఎంతమంది భగవంతులుగా పిలవబడుతున్నారు. సీతారామ్, రాధాకృష్ణ మొదలైన పేర్లు పెట్టుకుంటారు. ఆ స్వర్గాధిపతులు ఎక్కడ, ఈ నరకవాసులు ఎక్కడ. ఈ సమయములో అందరూ నరకవాసులుగా ఉన్నారు. మెట్ల వరుస చిత్రములో స్పష్టముగా చూపించారు. మెట్ల వరుస చిత్రాన్ని పిల్లలు తమ విచార సాగర మంథనముతో తయారుచేసారు. బాబా దానిని చూసి సంతోషించారు. మెట్ల వరుస చిత్రములో అన్ని విషయాలు వచ్చేస్తాయి. ద్వాపరము నుండి వికారీ రాజులు ఏ విధముగా భక్తి చేస్తూ-చేస్తూ కిందికి వచ్చారో, అది అందులో చూపించబడింది. ఇప్పుడైతే ఏ కిరీటము లేదు. చిత్రాలపై అర్థం చేయించడము సహజము. 84 జన్మలలో దిగే కళ ఎలా ఉంటుంది, మళ్ళీ ఎక్కే కళ ఎలా ఉంటుంది అనేది ఈ చిత్రము ద్వారా అర్థం చేయించవచ్చు. మీ ఎక్కే కళ ద్వారా సర్వుల మేలు జరుగుతుందని అంటూ ఉంటారు కూడా. తండ్రి వచ్చి అందరికీ సుఖాన్ని ఇస్తారు. ఓ బాబా, మా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వండి అని అందరూ పిలుస్తారు కానీ దుఃఖాన్ని ఎలా హరిస్తారు, సుఖము ఎలా లభిస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు.

ఈ రోజుల్లో మనుష్యులు గీతను కంఠస్థము చేసి వినిపిస్తారు, దాని అర్థాన్ని సారములో తెలియజేస్తారు. సంస్కృతములో శ్లోకాలను కంఠస్థము చేసి వినిపిస్తారు, అప్పుడు ఫలానా మహాత్మ చాలా మంచివారని అంటారు. లక్షలాది మంది మనుష్యులు వెళ్ళి వారి పాదాలకు నమస్కరిస్తారు. ఆ చదువులోనైతే (లౌకిక చదువులో) 15-20 సంవత్సరాలు పడుతుంది. కానీ ఎవరైనా వివేకవంతులు ఉన్నట్లయితే వెంటనే శ్లోకాలు మొదలైనవి కంఠస్థము చేసి వినిపించడము మొదలుపెడతారు. అప్పుడు వారి వద్ద చాలా ధనము పొగవుతుంది. ఇవన్నీ సంపాదనకు మార్గాలు. ఎవరైనా దివాలా తీసినప్పుడు కూడా వెళ్ళి సన్యాసాన్ని ధారణ చేస్తారు. అప్పుడు అన్ని చింతలు దూరమైపోతాయి. తర్వాత ఏవో కొన్ని మంత్ర-తంత్రాలను కంఠస్థము చేస్తారు, ఇక తిరుగుతూ ఉంటారు. ట్రైన్ లో కూడా తిరుగుతూ ఉంటారు. ఇక్కడైతే తండ్రి అంటారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. తండ్రి మరియు ఆత్మలు, అందరూ నిరాకార ప్రపంచములో ఉంటారు. అక్కడి నుండి సాకార ప్రపంచములోకి పాత్రను అభినయించేందుకు వస్తారు. ఇప్పుడు నాటకము పూర్తి అవ్వనున్నది. మీరు తమోప్రధానముగా అయిన కారణముగా తిరిగి వెళ్ళలేరు. ఇప్పుడు బాబా మిమ్మల్ని సతోప్రధానముగా తయారుచేయడానికి వచ్చారు. అందరూ తమ ఇంటికి వెళ్తారు. ఇకపోతే, స్వర్గములో కేవలం దేవీ-దేవతల రాజ్యముంటుంది. శాంతిధామము, సుఖధామము, దుఃఖధామము... ఇవి ఎప్పుడెప్పుడు ఉండేవి అనేది కూడా ఎవరి బుద్ధిలోకి రాదు ఎందుకంటే గాఢాంధకారములో ఉన్నారు. కలియుగాంతము దాదాపు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత జరుగుతుందని భావిస్తారు. ఎటువంటి లెక్క ఉండదు. మనుష్యులు పెరుగుతూ ఉంటారు. భోజనము లభించదు. ఇంకా 40 వేల సంవత్సరాలుంటే, ఇక ఎలా ఉంటుందో తెలియదు. వారు మాట్లాడేదంతా పూర్తిగా అసత్యము. సత్యమనేది ఇసుమంత కూడా లేదు. రావణుడిపై ఎలా విజయాన్ని పొందాలి అనేది ఇప్పుడు తండ్రి నేర్పిస్తారు. రావణుడిపై విజయాన్ని మీరే పొందుతారు. మొత్తం ప్రపంచాన్ని రావణుడి నుండి విడిపిస్తారు. మీది శక్తి సైన్యము, మీరు భారత్ ను స్వర్గముగా తయారుచేస్తున్నారు. ఎంత మంచి-మంచి విషయాలను అర్థం చేయిస్తారు. కనుక మీరు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఎంత సంతోషముగా ఉండాలి. జ్ఞాన మార్గములో చాలా సంతోషముంటుంది. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. ఇప్పుడు మనము ఈ పాత ప్రపంచము నుండి ఇక వెళ్ళిపోయినట్లే. బాబాను స్మృతి చేసినట్లయితే సతోప్రధానముగా అవుతారు. లేదంటే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది, అప్పుడు మహా అయితే ఒక రొట్టెముక్క లభించవచ్చు. దాని వలన లాభమేముంది. ఎంత వీలైతే అంత మీ పురుషార్థము చేయాలి. శ్రీమతముపై నడవాలి. అడుగడుగులోనూ బాబా నుండి సలహా తీసుకోవాలి. బాబా, వ్యాపారములో అసత్యము చెప్పాల్సి వస్తుందని కొందరు అంటారు. బాబా అంటారు - వ్యాపారములోనైతే అసత్యము ఉండనే ఉంటుంది, మీరు బాబాను స్మృతి చేస్తూ ఉండండి. అలాగని వికారాలలోకి వెళ్ళినప్పుడు నేను తండ్రి స్మృతిలో ఉన్నానని చెప్పటము కాదు. అలా కాదు. వికారాలలోకి వెళ్ళారు అంటే చనిపోయినట్లే. తండ్రితో ప్రతిజ్ఞ చేసారు కదా. పవిత్రత కోసమే రాఖీ కట్టడము జరుగుతుంది. క్రోధము కోసమెప్పుడూ రాఖీ కట్టడము జరగదు. రాఖీ బంధనము యొక్క అర్థమే - వికారాలలోకి వెళ్ళకూడదు అని. మనుష్యులు, పతిత-పావనా రండి అని పిలుస్తారు.

పిల్లలైన మీలో చాలా సంతోషముండాలి - బాబా మమ్మల్ని చదివిస్తున్నారు, తర్వాత వారితో పాటు తీసుకువెళ్తారు, అక్కడి నుండి స్వర్గములోకి వెళ్తాము అని. ఎంత వీలైతే అంత ఉదయాన్నే లేచి బాబాను స్మృతి చేయాలి. స్మృతి చేయడము అనగా సంపాదన చేసుకోవడము. ఇందులో ఆశీర్వదించడానికి ఏముంది. మీరు ఆశీర్వదించినట్లయితే మేము స్మృతి చేస్తామని అనకూడదు. అందరినీ ఆశీర్వదిస్తే అందరూ స్వర్గములోకి వెళ్తారు. ఇక్కడైతే కృషి చేయాలి. ఎంత వీలైతే అంత బాబాను స్మృతి చేయాలి. బాబా అనగా వారసత్వము. ఎంతగా స్మృతి చేస్తే, అంతగా రాజ్యము లభిస్తుంది. స్మృతితో చాలా లాభముంటుంది. ఇది తక్కువ ధర కల వ్యాపారము. ఇలాంటి తక్కువ ధర కల వ్యాపారాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. దీనిని కూడా ఎవరో అరుదుగా మాత్రమే తీసుకుంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎప్పుడైనా ఎవరైనా క్రోధము చేస్తే చాలా-చాలా శాంతిగా ఉండాలి. క్రోధము చేసేవారితో పాటు మీరు కూడా క్రోధము చేసేవారిగా అవ్వకూడదు. మాయ యొక్క ఏ తుఫానుతోనూ ఓడిపోకూడదు.

2. ఉదయముదయమే తండ్రిని స్మృతి చేయాలి, తమ సంపాదనను జమ చేసుకోవాలి. పవిత్రత యొక్క పక్కా రాఖీని కట్టుకోవాలి.

వరదానము:-
తమ అవ్యక్త శాంత స్వరూపము ద్వారా వాతావరణాన్ని అవ్యక్తముగా చేసే సాక్షాత్ మూర్త భవ

ఎలాగైతే సేవ కోసం ఇతర ప్రోగ్రాములు తయారుచేస్తారో, అలా ఉదయము నుండి రాత్రి వరకు స్మృతియాత్రలో ఎలా ఉండాలి మరియు ఎప్పుడు ఉండాలి అన్న ఈ ప్రోగ్రామ్ ను కూడా తయారుచేసుకోండి మరియు మధ్యమధ్యలో 2-3 నిమిషాల కోసం సంకల్పాల ట్రాఫిక్ ను స్టాప్ చేయండి. ఎప్పుడైనా ఎవరైనా వ్యక్త భావములో ఎక్కువగా కనిపిస్తే వారికి చెప్పకుండానే మీ అవ్యక్త శాంత రూపాన్ని ఎలా ధారణ చెయ్యండంటే, వారు కూడా సూచన ద్వారానే అర్థం చేసుకోవాలి, దానితో వాతావరణము అవ్యక్తముగా ఉంటుంది, ప్రత్యేకత కనిపిస్తుంది మరియు మీరు సాక్షాత్కారము చేయించే సాక్షాత్ మూర్తులుగా అయిపోతారు.

స్లోగన్:-
సంపూర్ణ సత్యతయే పవిత్రతకు ఆధారము.

అవ్యక్త ప్రేరణలు - పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి

ఒకవేళ మీకు సహయోగులుగా ఉన్న సోదరీ-సోదరులు, పరివారములోని ఆత్మలు, ఎవరైనా అవివేకముతో లేక మొండితనముతో అల్పకాలిక వస్తువును సదాకాలిక ప్రాప్తిగా భావించి, అల్పకాలిక పేరు-ప్రతిష్ఠ-గౌరవాలను కోరుకుంటే లేక అల్పకాలిక ప్రాప్తి కోసం కోరికను పెట్టుకుంటే, అప్పుడు వారికి గౌరవాన్ని ఇచ్చి స్వయం నిర్మానులుగా అవ్వటము - ఇదే పరోపకారము. ఈ ఇవ్వటమే సదా కోసం తీసుకోవటము.