08-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఎప్పుడూ కూడా అసత్యమైన అహంకారములోకి రాకండి, ఈ రథము పట్ల కూడా పూర్తి గౌరవాన్ని ఉంచండి’’

ప్రశ్న:-
పిల్లలైన మీలో పదమాపదమ భాగ్యశాలురు ఎవరు మరియు దుర్భాగ్యశాలురు ఎవరు?

జవాబు:-
ఎవరి నడవడిక అయితే దేవతల వలె ఉందో, ఎవరైతే అందరికీ సుఖాన్ని ఇస్తారో, వారు పదమాపదమ భాగ్యశాలురు మరియు ఎవరైతే ఫెయిల్ అవుతారో, వారిని దుర్భాగ్యశాలురు అని అంటారు. కొందరు మహాన్ దుర్భాగ్యశాలురుగా అవుతారు, వారు అందరికీ దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. వారికి సుఖాన్ని ఇవ్వడమనేది తెలియనే తెలియదు. బాబా అంటారు - పిల్లలూ, స్వయాన్ని మంచి రీతిలో సంభాళించుకోండి. అందరికీ సుఖాన్ని ఇవ్వండి, యోగ్యులుగా అవ్వండి.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు ఈ పాఠశాలలో కూర్చుని ఉన్నతమైన హోదాను పొందుతారు. మేము ఎంతో ఉన్నతోన్నతమైన స్వర్గ పదవిని పొందుతామని మనసులో భావిస్తారు. ఇటువంటి పిల్లలకైతే చాలా సంతోషముండాలి. ఒకవేళ అందరికీ నిశ్చయమున్నా, అందరూ ఒకే విధముగా ఉండలేరు. ఫస్ట్ నుండి లాస్ట్ నంబరు వరకు అయితే తప్పకుండా ఉంటారు. పరీక్షలలో కూడా ఫస్ట్ నుండి లాస్ట్ నంబరు వరకు నంబర్లు ఉంటాయి. కొందరు ఫెయిల్ అవుతారు, కొందరు పాస్ అవుతూ కూడా ఉంటారు. కావున ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి - బాబా నన్ను ఇంత ఉన్నతముగా తయారుచేస్తున్నారు కదా, మరి నేను ఎంతవరకు అర్హునిగా అయ్యాను? ఫలానావారి కంటే బాగున్నానా లేక తక్కువగా ఉన్నానా? ఇది చదువు కదా. ఎవరైనా ఏదైనా సబ్జెక్టులో బలహీనముగా ఉంటే వారు కిందకు వెళ్ళిపోతారు అన్నది కనిపిస్తుంది కూడా. క్లాస్ లీడర్ గా ఉన్నా కానీ ఏదైనా సబ్జెక్టులో బలహీనముగా ఉంటే కిందకు వెళ్ళిపోతారు. ఎవరో అరుదుగా స్కాలర్షిప్ తీసుకుంటారు. ఇది కూడా స్కూల్. మనమంతా చదువుకుంటున్నామని మీకు తెలుసు, ఇందులో మొట్టమొదటి విషయము పవిత్రత. పవిత్రముగా అయ్యేందుకని తండ్రిని పిలిచారు కదా. ఒకవేళ క్రిమినల్ దృష్టి కలిగి ఉన్నట్లయితే, వారికి స్వయము అది ఫీల్ అవుతుంది. బాబా, మేము ఈ సబ్జెక్టులో బలహీనముగా ఉన్నామని బాబాకు వ్రాస్తారు కూడా. నేను ఫలానా సబ్జెక్టులో చాలా-చాలా బలహీనముగా ఉన్నానని విద్యార్థికి తప్పకుండా బుద్ధిలో ఉంటుంది. కొందరైతే, మేము ఫెయిల్ అవుతామని కూడా భావిస్తారు. ఇందులో మొదటి నంబరు సబ్జెక్ట్ - పవిత్రత. బాబా, మేము ఓడిపోయాము అని చాలామంది వ్రాస్తారు, మరి వారిని ఏమనాలి? ఇప్పుడు నేను ఎక్కలేను అని వారి మనసుకు అనిపిస్తూ ఉండవచ్చు. మీరు పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కదా. మీ లక్ష్యము-ఉద్దేశ్యమే ఇది. తండ్రి అంటారు - పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు పవిత్రముగా అవ్వండి, అప్పుడు ఈ లక్ష్మీ-నారాయణుల వంశావళిలోకి వెళ్ళగలరు. ఫలానావారు ఇంత ఉన్నత పదవిని పొందగలరా లేదా అన్నది టీచర్ అయితే అర్థం చేసుకుంటూ ఉండవచ్చు. వారు సుప్రీమ్ టీచర్. ఈ దాదా కూడా స్కూల్ లో చదువుకున్నారు కదా. కొంతమంది పిల్లలు ఎలాంటి చెడు పనులు చేస్తారంటే, ఇక చివరికి మాస్టర్ శిక్షించవలసి వస్తుంది. పూర్వము చాలా తీవ్రముగా శిక్షించేవారు, ఇప్పుడు శిక్షలు మొదలైనవి తగ్గించేసరికి విద్యార్థులు ఇంకా ఎక్కువగా పాడైపోతున్నారు. ఈ రోజుల్లో విద్యార్థులు ఎంత హంగామా చేస్తున్నారు. విద్యార్థులది కొత్త రక్తమని అంటారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి! నిప్పు అంటించేస్తారు, తమ యువ శక్తిని చూపిస్తారు. ఇది ఉన్నదే ఆసురీ ప్రపంచము. యువకులే చాలా చెడ్డగా ఉంటారు, వారి కనులు చాలా క్రిమినల్ గా ఉంటాయి. చూడడానికి చాలా మంచివారిలా ఉంటారు. ఏ విధముగా ఈశ్వరుని గురించి సంపూర్ణముగా తెలుసుకోలేరని అంటారో, అదే విధముగా వాళ్ళు ఏ రకమైన మనుష్యులు అని వాళ్ళ గురించి కూడా పూర్తిగా తెలుసుకోలేరు. అయితే, వారి జ్ఞానము గురించి బుద్ధి ద్వారా తెలుస్తుంది, వారు ఎలా చదువుతున్నారు, వారి నడవడిక ఎలా ఉంది అనేది తెలుస్తుంది. కొందరు మాట్లాడేటప్పుడు వారి నోటి నుండి పుష్పాలు వెలువడుతున్నట్లుగా ఉంటుంది, కొందరైతే రాళ్లు వెలువడుతున్నట్లుగా మాట్లాడుతారు. చూడడానికి చాలా బాగుంటారు, పాయింట్లు మొదలైనవి కూడా వ్రాస్తారు కానీ రాతిబుద్ధి కలవారిగా ఉంటారు. బాహ్య ఆర్భాటము ఉంటుంది. మాయ చాలా శక్తివంతమైనది, అందుకే గాయనముంది - ఆశ్చర్యవంతులై వింటారు, మేము శివబాబా సంతానమని చెప్పుకుంటారు, ఇతరులకు వినిపిస్తారు, వర్ణన చేస్తారు, మళ్ళీ పారిపోతారు అనగా ద్రోహులుగా అవుతారు. అలాగని తెలివైనవారు ద్రోహులుగా అవ్వరని కాదు, మంచి-మంచి తెలివైనవారు కూడా ద్రోహులుగా అవుతారు. ఆ సైన్యములో కూడా ఇలాగే జరుగుతుంది. ఏరోప్లేన్ సహితముగా వేరే దేశములోకి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా అలా జరుగుతుంది. స్థాపనలో చాలా శ్రమ ఉంటుంది. పిల్లలకు కూడా చదువులో శ్రమ ఉంటుంది, టీచరుకు కూడా చదివించడములో శ్రమ ఉంటుంది. ఫలానావారు అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు, చదవడము లేదు అని గమనిస్తే స్కూళ్ళలో కొరడాతో శిక్షిస్తారు. వీరైతే తండ్రి, తండ్రి ఏమీ అనరు. బాబా వద్ద ఈ చట్టము లేదు, ఇక్కడైతే పూర్తిగా శాంతిగా ఉండవలసి ఉంటుంది. తండ్రి అయితే సుఖదాత, ప్రేమసాగరుడు. కావున పిల్లల నడవడిక కూడా అలాగే ఉండాలి కదా, దేవతల వలె ఉండాలి. పిల్లలైన మిమ్మల్ని బాబా - మీరు పదమాపదమ భాగ్యశాలురు అని సదా అంటూ ఉంటారు. కానీ పదమాపదమ దుర్భాగ్యశాలురుగా కూడా అవుతారు. ఎవరైతే ఫెయిల్ అవుతారో, వారినైతే దుర్భాగ్యశాలురు అని అంటారు కదా. ఇది అంతిమము వరకు జరుగుతూ ఉంటుందని బాబాకు తెలుసు. కొంతమంది మహాన్ దుర్భాగ్యశాలురుగా కూడా తప్పకుండా అవుతారు. వారి నడవడిక ఎలా ఉంటుందంటే, ఇక వారు నిలవలేరని అర్థం చేసుకోవడము జరుగుతుంది. వారు అంత ఉన్నతముగా అయ్యేందుకు యోగ్యులుగా లేరు, అందరికీ దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు, సుఖాన్ని ఇవ్వడము తెలియనే తెలియదు అంటే ఇక వారి పరిస్థితి ఏమవుతుంది! బాబా సదా చెప్తూ ఉంటారు - పిల్లలూ, స్వయాన్ని మంచి రీతిలో సంభాళించుకోండి, ఇది కూడా డ్రామానుసారముగా జరగవలసిందే, లోహము కంటే కూడా నీచముగా అయిపోతారు. మంచి-మంచి పిల్లల్లో కొందరు ఎప్పుడూ ఉత్తరము కూడా వ్రాయరు. పాపం వారి పరిస్థితి ఎలా ఉంటుంది!

తండ్రి అంటారు - నేను సర్వుల కళ్యాణము చేయడానికి వచ్చాను. ఈ రోజు సర్వుల సద్గతి చేస్తాను, రేపు మళ్ళీ దుర్గతి జరుగుతుంది. నిన్న మేము విశ్వానికి యజమానులుగా ఉండేవారము, ఈ రోజు బానిసలుగా అయిపోయామని మీరంటారు. ఇప్పుడు మొత్తము వృక్షమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇది అద్భుతమైన వృక్షము. మనుష్యులకు ఇది కూడా తెలియదు. కల్పము అనగా పూర్తి 5 వేల సంవత్సరాల ఏక్యురేట్ వృక్షమని ఇప్పుడు మీకు తెలుసు. ఒక్క క్షణము కూడా తేడా రాదు. ఈ అనంతమైన వృక్షము గురించి పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానము లభిస్తోంది. జ్ఞానాన్ని ఇచ్చేవారు వృక్షపతి. బీజము ఎంత చిన్నగా ఉంటుంది, దాని నుండి ఎంత పెద్ద ఫలము వెలువడుతుందో చూడండి. ఇది అద్భుతమైన వృక్షము, దీని బీజము చాలా చిన్నది. ఆత్మ ఎంత చిన్నది. తండ్రి కూడా రూపములో చాలా చిన్నగా ఉంటారు, ఈ కనులతో చూడలేము కూడా. వివేకానందుని గురించి చెప్తారు కదా - రామకృష్ణ పరమహంస నుండి జ్యోతి వెలువడి నాలో ఇమిడిపోయిందని అతను అన్నారు. ఆ విధముగా జ్యోతి వెలువడి మళ్ళీ అలా ఇమిడిపోలేదు. ఇంతకీ ఏం వెలువడింది అనేది అర్థం చేసుకోరు. ఇటువంటి సాక్షాత్కారాలైతే ఎన్నో జరుగుతుంటాయి, కానీ ఆ మనుష్యులు వారిని గౌరవిస్తారు, ఇంకా మహిమను కూడా వ్రాస్తారు. భగవానువాచ - ఏ మనిషికీ మహిమ లేదు. మహిమంటూ ఉంది అంటే కేవలం దేవతలకు మాత్రమే ఉంది మరియు ఎవరైతే ఆ విధముగా దేవతలుగా తయారుచేసేవారు ఉన్నారో, వారికి మహిమ ఉంది. బాబా కార్డును చాలా బాగా తయారుచేయించారు. జయంతిని జరుపుకోవాలంటే ఒక్క శివబాబాదే జరుపుకోవాలి. వీరిని (లక్ష్మీ-నారాయణులను) కూడా ఈ విధముగా తయారుచేసేవారు శివబాబాయే కదా. కేవలం ఒక్కరికే మహిమ ఉంది, ఆ ఒక్కరినే స్మృతి చేయండి. నేను ఉన్నతోన్నతముగా అవుతాను, మళ్ళీ కిందకు కూడా దిగిపోతాను అని వీరు స్వయముగా అంటారు. ఉన్నతోన్నతమైన లక్ష్మీ-నారాయణులే మళ్ళీ 84 జన్మల తర్వాత కిందకు దిగుతారు, తతత్వమ్, ఇది ఎవ్వరికీ తెలియదు. మీరే విశ్వానికి యజమానులుగా ఉండేవారు, ఆ తర్వాత ఎలా అయిపోయారు! సత్యయుగములో ఎవరు ఉండేవారు? మీరందరే ఉండేవారు, నంబరువారు పురుషార్థానుసారముగా ఉండేవారు. రాజా-రాణులు కూడా ఉండేవారు, సూర్యవంశమువారు, చంద్రవంశమువారు కూడా ఉండేవారు. బాబా ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఈ సృష్టి చక్రము యొక్క జ్ఞానము పిల్లలైన మీ బుద్ధిలో నడుస్తూ-తిరుగుతూ ఉండాలి. మీరు చైతన్యమైన లైట్ హౌస్ లు. మొత్తం చదువంతా బుద్ధిలో ఉండాలి. కానీ ఆ అవస్థ ఇంకా ఏర్పడలేదు, అది ఇంకా ఏర్పడనున్నది. ఎవరైతే పాస్ విత్ ఆనర్ గా అవుతారో, వారికి ఆ అవస్థ ఉంటుంది. మొత్తము జ్ఞానమంతా బుద్ధిలో ఉంటుంది. అప్పుడు తండ్రికి గారాబాల, ప్రియమైన పిల్లలు అని కూడా పిలవబడతారు. ఇటువంటి పిల్లలపై తండ్రి స్వర్గ రాజ్యాన్ని బలిహారము చేస్తారు. తండ్రి అంటారు - నేను రాజ్యము చేయను, మీకు ఇస్తాను, దీనినే నిష్కామ సేవ అని అంటారు. బాబా మనల్ని తలపైకి ఎక్కించుకుంటారని పిల్లలకు తెలుసు కావున అటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. ఇది కూడా డ్రామాగా తయారుచేయబడి ఉంది. తండ్రి సంగమములో వచ్చి అందరికీ సద్గతినిస్తారు, నంబరువారు పురుషార్థానుసారముగా. నంబరువన్ హైయ్యెస్ట్ అయినవారు పూర్తి పవిత్రమైనవారు, నంబరు లాస్ట్ వారు పూర్తిగా అపవిత్రమైనవారు. ప్రియస్మృతులనైతే బాబా అందరికీ ఇస్తారు.

బాబా ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు, ఎప్పుడూ కూడా మిథ్య అహంకారము రాకూడదు. తండ్రి అంటారు, అప్రమత్తముగా ఉండాలి, రథము పట్ల కూడా గౌరవముంచాలి. వీరి ద్వారానే కదా తండ్రి వినిపిస్తారు. వీరైతే ఇంతకుముందు ఎప్పుడూ నిందలు పడలేదు. వీరిని అందరూ ప్రేమించేవారు. ఇప్పుడు చూడండి, ఎన్ని నిందలు పడుతున్నారు. ఎంతోమంది ద్రోహులుగా అయి పారిపోయారు, ఇక వారి గతి ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతారు కదా! తండ్రి అర్థం చేయిస్తున్నారు, మాయ అటువంటిదే, అందుకే చాలా అప్రమత్తముగా ఉండండి. మాయ ఎవ్వరినీ విడిచిపెట్టదు. అన్ని రకాలుగా నిప్పు అంటించేస్తుంది. తండ్రి అంటారు, నా పిల్లలందరూ కామచితి పైకి ఎక్కి నల్లగా బొగ్గులా అయిపోయారు. అందరూ అయితే ఒకే విధముగా ఉండరు. అలాగే, అందరి పాత్ర ఒకే విధముగా ఉండదు. దీని పేరే వేశ్యాలయము, ఎన్నిసార్లు కామచితి పైకి ఎక్కి ఉంటారు. రావణుడు ఎంత శక్తివంతమైనవాడు, బుద్ధినే పతితముగా చేసేస్తాడు. ఇక్కడకు వచ్చి తండ్రి వద్ద శిక్షణ తీసుకునేవారు కూడా అలా అయిపోతారు. తండ్రి స్మృతితో తప్ప క్రిమినల్ దృష్టి ఎప్పటికీ మారలేదు, అందుకే సూరదాసుని కథ ఉంది. వాస్తవానికి అది కల్పించిన విషయమే, ఉదాహరణ కూడా ఇస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభిస్తుంది. అజ్ఞానము అనగా అంధకారము. మీరు అంధులు, అజ్ఞానులు అని అంటారు కదా. ఇప్పుడు జ్ఞానము గుప్తమైనది, ఇందులో ఏమీ మాట్లాడవలసిన అవసరము లేదు. ఒక్క క్షణములో పూర్తి జ్ఞానమంతా వచ్చేస్తుంది, ఇది అన్నింటికంటే సులభమైన జ్ఞానము. అయినా కూడా చివరి వరకు మాయ యొక్క పరీక్షలు నడుస్తూనే ఉంటాయి. ఈ సమయములోనైతే తుఫానుల మధ్యలో ఉన్నారు, పక్కాగా అయిపోయిన తర్వాత ఇక ఇన్ని తుఫాన్లు రావు, కిందపడరు. ఇక తర్వాత మీ వృక్షము ఎంతగా పెరుగుతుందో చూడండి. పేరు అయితే ప్రఖ్యాతమవ్వవలసిందే. వృక్షమైతే పెరుగుతూనే ఉంటుంది. కొద్దిగా వినాశనము జరిగితే ఇక మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉంటారు. అప్పుడు తండ్రి స్మృతికి పూర్తిగా వేలాడుతూ ఉంటారు. సమయము చాలా తక్కువగా ఉందని భావిస్తారు. పరస్పరములో చాలా ప్రేమగా నడుచుకోండి, కన్నెర్ర చేయకండి అని తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. క్రోధమనే భూతము రావడముతో ముఖమే పూర్తిగా మారిపోతుంది. మీరైతే లక్ష్మీ-నారాయణుల వంటి ముఖము కలవారిగా అవ్వాలి. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా ఉంది. చివరిలో ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు సాక్షాత్కారము జరుగుతుంది. ఏ విధముగా ప్రారంభములో సాక్షాత్కారాలు జరిగాయో, అదే విధముగా అంతిమ సమయములో కూడా చాలా పాత్రను చూస్తారు. మీరు చాలా సంతోషముగా ఉంటారు. వేటకు మృత్యువు, వేటగాడికి వేట..... చివరిలో చాలా దృశ్యాలు చూడాలి, అప్పుడు - మేము ఇలా చేసామే... అని పశ్చాత్తాపపడతారు కదా. అప్పుడు దానికి శిక్ష కూడా చాలా కఠినమైనది లభిస్తుంది. తండ్రి వచ్చి చదివిస్తారు, వారి పట్ల కూడా గౌరవము ఉంచకపోతే శిక్షలు లభిస్తాయి. ఎవరైతే వికారాలలోకి వెళ్తారో లేదా ఎవరైతే శివబాబాను ఎంతగానో నిందింపజేసేందుకు నిమిత్తులుగా అవుతారో, వారికి అందరికన్నా కఠినమైన శిక్ష లభిస్తుంది. మాయ చాలా శక్తివంతమైనది. స్థాపనలో ఏమేమి జరుగుతాయి. మీరైతే ఇప్పుడు దేవతలుగా అవుతారు కదా. సత్యయుగములో అసురులు మొదలైనవారు ఉండరు. ఇది సంగమము యొక్క విషయమే. ఇక్కడ వికారీ మనుష్యులు ఎంత దుఃఖాన్ని ఇస్తారు, కుమారీలను కొడతారు, వివాహము తప్పకుండా చేసుకోవాలని అంటారు. పత్నిని వికారాల కోసం ఎంతగా కొడతారు, ఎంతగా ఎదిరిస్తారు. సన్యాసులు కూడా ఉండలేరు అన్నప్పుడు పవిత్రముగా ఉండి చూపించే వీరెవరు అని అంటారు. మున్ముందు తప్పకుండా అర్థం చేసుకుంటారు. పవిత్రత లేకుండా దేవతలుగా అవ్వలేరు. మాకు ఇంతటి ప్రాప్తి కలుగుతుంది, అందుకే వదిలేసామని మీరు అర్థం చేయిస్తారు. భగవానువాచ - కామజీతులే జగత్ జీతులు. ఈ విధముగా లక్ష్మీ-నారాయణులుగా అవుతుంటే పవిత్రముగా ఎందుకు అవ్వరు. మళ్ళీ మాయ కూడా చాలా కింద పడేస్తుంది. ఇది ఉన్నతమైన చదువు కదా. తండ్రి వచ్చి చదివిస్తారు - పిల్లలు దీనిని మంచి రీతిలో స్మరణ చేయకపోతే మాయ చెంపదెబ్బ వేస్తుంది. మాయ ఎన్నో ఆజ్ఞలను ఉల్లంఘించేలా కూడా చేస్తుంది, ఇక తర్వాత వారి పరిస్థితి ఏమవుతుంది. మాయ ఎటువంటి నిర్లక్ష్యులుగా చేస్తుందంటే, అహంకారములోకి తీసుకువస్తుందంటే ఇక అడగకండి. నంబరువారుగా రాజధాని తయారవుతుంది, మరి ఏదో ఒక కారణముతోనే అలా తయారవుతుంది కదా. ఇప్పుడు మీకు భూత, భవిష్యత్త్, వర్తమానాల జ్ఞానము లభిస్తుంది కావున ఎంత మంచి రీతిలో ధ్యానముంచాలి. అహంకారము వచ్చిందంటే మరణించినట్లే. మాయ ఒక్కసారిగా పైసకు కొరగానివారిగా చేసేస్తుంది. తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే ఇక మళ్ళీ తండ్రిని స్మృతి చేయలేరు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పరస్పరములో చాలా ప్రేమగా నడుచుకోవాలి. ఎప్పుడూ కూడా క్రోధములోకి వచ్చి ఒకరిపై ఒకరు కన్నెర్ర చేయకూడదు. తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించకూడదు.

2. పాస్ విత్ ఆనర్ గా అయ్యేందుకు చదువును బుద్ధిలో ఉంచుకోవాలి. చైతన్యమైన లైట్ హౌస్ గా అవ్వాలి. రాత్రింబవళ్ళు బుద్ధిలో జ్ఞానము మెదులుతూ ఉండాలి.

వరదానము:-
ఆల్మైటీ తండ్రి యొక్క అథారిటీతో ప్రతి కార్యాన్ని సహజము చేసే సదా స్థిరమైన నిశ్చయబుద్ధి భవ

మనము అందరికంటే శ్రేష్ఠమైన ఆల్మైటీ తండ్రి యొక్క అథారిటీ ద్వారా అన్ని కార్యాలను చేసేవారము - ఈ నిశ్చయము ఎంత స్థిరముగా ఉండాలంటే దీనిని ఎవరూ కదిలించలేకపోవాలి, దీని ద్వారా ఎంత పెద్ద కార్యము చేస్తున్నా సరే, అది అతి సహజముగా అనుభవము చేస్తారు. ఏ విధముగా ఈ రోజుల్లో సైన్స్ వారు ఎటువంటి మెషినరీని తయారుచేసారంటే దాని ద్వారా ఏ ప్రశ్న యొక్క సమాధానమైనా సహజముగా లభించేస్తుంది, బుద్ధిని ఉపయోగించడము నుండి విముక్తులవుతారు, అదే విధముగా ఆల్మైటీ అథారిటీని ఎదురుగా ఉంచుకున్నట్లయితే అన్ని ప్రశ్నలకు సమాధానము సహజముగా లభిస్తుంది మరియు సహజ మార్గము యొక్క అనుభూతి కలుగుతుంది.

స్లోగన్:-
ఏకాగ్రతా శక్తి పరవశ స్థితిని కూడా పరివర్తన చేస్తుంది.

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్త మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చెయ్యండి

బ్రాహ్మణ జీవితము యొక్క ఆనందము జీవన్ముక్త స్థితిలో ఉంది. అతీతముగా అవ్వటము అనగా ముక్తులుగా అవ్వటము. సంస్కారాలకు కూడా వశమవ్వకూడదు. ఏం చేయను, ఎలా చేయను, చేయాలనుకోలేదు కానీ జరిగిపోయింది - ఇది జీవన బంధనులుగా అవ్వటము. కోరిక లేదు కానీ మంచిగా అనిపించింది, శిక్షణ ఇచ్చేది ఉంది కానీ క్రోధము వచ్చేసింది - ఇది జీవన బంధన స్థితి. బ్రాహ్మణులు అనగా జీవన్ముక్తులు. వారు ఎప్పుడు కూడా ఇలా ఏ బంధనములోనూ బంధింపబడలేరు.