08-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు శూద్ర వంశము నుండి బయటకు
వచ్చి బ్రాహ్మణ వంశములోకి వచ్చారు, తండ్రి బ్రహ్మా ముఖము ద్వారా మిమ్మల్ని దత్తత
తీసుకున్నారు - కనుక ఇదే సంతోషములో ఉండండి’’
ప్రశ్న:-
ఏ
గుహ్యమైన రహస్యాన్ని బ్రాహ్మణ కులం పిల్లలే అర్థం చేసుకోగలరు?
జవాబు:-
నిరాకార
శివబాబా మా తండ్రి మరియు ఈ బ్రహ్మా మా తల్లి. నిరాకార భగవంతుడు ఏ విధముగా
తల్లి-తండ్రి, బంధు-సఖునిగా అవుతారు అనేటువంటి ఈ గుహ్యమైన, గుప్తమైన రహస్యాన్ని
బ్రాహ్మణ కులం పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు. అందులోనూ ఎవరైతే దైవీ కులంలో
ఉన్నత పదవిని పొందేవారు ఉంటారో, వారే ఈ రహస్యాన్ని యథార్థ రీతిలో అర్థం చేసుకుంటారు.
ఓంశాంతి
పిల్లలు కూర్చుని ఉన్నారు, మా బాప్ దాదా వచ్చి ఉన్నారని అర్థం చేసుకుంటున్నారు.
తండ్రి అయితే దాదాతో కలిసి ఉంటారు, అందుకే బాప్ దాదా వచ్చారని అంటారు. వారు టీచరు
కూడా. దాదా లేకుండా తండ్రి ఏమీ చెప్పలేరు. బుద్ధిని ఉపయోగించాలి ఎందుకంటే ఇది కొత్త
విషయము కదా. అజ్ఞాన కాలంలో ఒక్కరినే స్మృతి చేస్తారు. మా గురువు ఫలానా స్థానములో
ఉన్నారని అంటారు, అతని శరీరము పేరు వారికి తెలిసి ఉంటుంది. అలాగే, మా తండ్రి, మా
తల్లి ఫలానా స్థానములో ఉన్నారని అంటారు. వారికి పేరు, రూపము అన్నీ ఉంటాయి. మనుష్యులు
ఏదైతే వ్రాసారో, అది క్లుప్తముగా వ్రాసేసారు, మనుష్యులు ఏదైతే తయారుచేసారో, అందులో
ఎంతోకొంత తప్పు ఉంది. త్వమేవ మాతాశ్చ పితా... అని గాయనము ఉంది, అది ఒక్కరి కోసమే
గాయనము చేయడము జరుగుతుంది. బ్రహ్మా కోసం ఇలా గాయనము చేయడము జరగదు. అక్కడ అతని
నామ-రూపాలు బుద్ధిలోకి రావు. అలాగే విష్ణువు యొక్క నామ-రూపాలు గాని లేక శంకరుని
యొక్క నామ-రూపాలు గాని బుద్ధిలోకి రావు. నీవు తల్లివి, తండ్రివి, మేము నీ సంతానము...
అని అయితే పాడుతారు. అప్పుడు కూడా బుద్ధి పైకి వెళ్తుంది. శ్రీకృష్ణుడిని ఎవరూ
స్మృతి చేయలేరు. ఎంతైనా నిరాకారుడినే స్మృతి చేస్తారు, వారికే మహిమ ఉంది. తండ్రి
అర్థం చేయిస్తున్నారు - ఇక్కడ ఎప్పుడైతే కూర్చుంటారో, అప్పుడు లౌకిక సంబంధీకుల నుండి
బుద్ధియోగాన్ని తొలగించి, పారలౌకిక తండ్రిని స్మృతి చేయండి. ఈ సమయములో వారు
సమ్ముఖముగా ఉన్నారు. భక్తి మార్గములో పాడేటప్పుడు, కళ్ళతో పైకి చూస్తూ - నీవే
తల్లివి-తండ్రివి... ఓ భగవంతుడా అని అంటూ స్మృతి చేస్తారు. భగవంతుడా, అని అన్నప్పుడు
శివలింగాన్ని కూడా స్మృతి చేయరు. చిలుక వలె పాడుతారు అంతే. లక్ష్మీ-నారాయణుల గురించి
కూడా అలా అనలేరు, వారు మహారాజు-మహారాణి. వారి పిల్లలు మాత్రమే వారిని తల్లి-తండ్రి
అని అంటారు, అంతేకాక వారిని బంధువు అని అనరు. భక్తులు పతిత-పావన అని పాడుతారు కానీ
వారు శివలింగమై ఉంటారని బుద్ధిలోకి రాదు. ఓ భగవంతుడా, అని ఊరికే అలా అనేస్తారు! ఓ
భగవంతుడా, అని ఎవరు అన్నారు, ఎవరిని అన్నారు - ఏమీ తెలియదు. నేను ఆత్మను, వారిని
పిలుస్తున్నాను అని ఒకవేళ జ్ఞానము ఉన్నట్లయితే, అప్పుడు - వారు నిరాకార పరమాత్మ అని,
వారి రూపము లింగమని అర్థం చేసుకుంటారు. యథార్థ రీతిలో తండ్రిని ఎవరూ స్మృతి చేయడము
లేదు. వారి నుండి ఏమి ప్రాప్తి లభిస్తుంది, ఎప్పుడు లభిస్తుంది అనేది ఏమీ తెలియదు.
ఇంతకుముందు మీకు కూడా తెలియదు. ఇప్పుడైతే తండ్రికి చెందినవారిగా అయ్యారు. మమ్మల్ని
శివబాబా బ్రహ్మా ద్వారా తమ పిల్లలుగా చేసుకున్నారని మీకు తెలుసు. ఈ బ్రహ్మా తల్లి.
ఈ బ్రహ్మా తల్లి ద్వారా శివబాబా దత్తత తీసుకున్నారు. మేము శివబాబా సంతానమని ఈ
సమయములో మీకు మంచి రీతిలో తెలుసు. మళ్ళీ సాకారములో మీరు ప్రజాపిత బ్రహ్మాకు సంతానము.
ప్రజాపిత బ్రహ్మా ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. అలాగని ఏదో కొత్త సృష్టిని
రచిస్తారని కాదు. అలా జరగదు, ఈ సమయములో వచ్చి ఒడిలోకి తీసుకుంటారు, దత్తత
తీసుకుంటారు. ఇప్పుడు తల్లి-తండ్రి అని అంటున్నారంటే శివుడు తండ్రి అవుతారు మరియు
బ్రహ్మా తల్లి అవుతారు. వారిని తల్లి-తండ్రి అని అంటారు. తండ్రి బ్రహ్మా ద్వారా -
ఆత్మలైన మీరు నా సంతానమని అంటున్నారు. తర్వాత ఆత్మ అంటే ఏమిటి అని ఆత్మకు పరిచయాన్ని
ఇస్తారు. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుందని, నక్షత్రములా ఉంటుందని అంటారు కూడా, కానీ ఇంక
వేరే ఏమీ తెలియదు. ఆత్మ 84 జన్మలను అనుభవిస్తుందని చెప్పలేకపోతారు. ఆత్మ శరీరము
ద్వారా పాత్రను అభినయిస్తుంది. రకరకాల నామ, రూప, దేశ, కాలాలతో ఉన్న ఆత్మ, ఒక
శరీరాన్ని వదిలినప్పుడు, పూర్తి పరివారమంతా మారిపోతుంది. ఎవరైనా దత్తత
తీసుకున్నప్పుడు కూడా పరివారము మారిపోతుంది. ఏ తల్లిదండ్రుల వద్దనైతే జన్మ
తీసుకున్నారో, వారి గురించి కూడా తెలిసి ఉంటుంది. కానీ ఎవరైతే దత్తత తీసుకున్నారో,
వారి ఇంటివారిగా అయిపోతారు. ఇక్కడ మీరు శూద్ర వంశము నుండి బయటకు వచ్చి ఇప్పుడు
బ్రాహ్మణ వంశములోకి వచ్చారు. బ్రహ్మా తనువు ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు.
మీరైతే బ్రాహ్మణ కులంలోకి వచ్చేసారు. ఈ విషయాలను శాస్త్రాలలో వ్రాయలేరు, వీటిని
అర్థం చేయించడము జరుగుతుంది. వీటిని వ్రాయడము ద్వారా ఎవరూ అర్థం చేసుకోరు.
మేము పరమపిత పరమాత్ముని సంతానముగా అయ్యామని ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు.
వీరు (బ్రహ్మా) తల్లి అయ్యారు. బ్రహ్మాను ప్రజాపిత అనే అంటారు. వీరి ద్వారా
పిల్లలైన మిమ్మల్ని దత్తత తీసుకుంటాను - ఇది ఎంత గుప్తమైన విషయము. సమ్ముఖముగా
ఉన్నవారు తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. అది కూడా, ఈ బ్రాహ్మణ కులానికి చెందినవారు
ఎవరైతే ఉంటారో, వారే అర్థం చేసుకుంటారు. వారు దైవీ కులములో ఉన్నత పదవిని పొందేవారిగా
ఉంటారు. ఈ విషయాలు కొత్తవారెవరి బుద్ధిలోనూ కూర్చోవు. వారి బుద్ధిలోనూ కూర్చోవు,
అలాగే వారు ఎవరికీ అర్థం చేయించలేరు కూడా. మీకు కూడా నంబరువారు పురుషార్థానుసారముగా
బుద్ధిలో కూర్చుంటాయి. త్వమేవ మాతాశ్చ పితా... అని గాయనము చేయడము జరుగుతుంది.
శివబాబాను స్మృతి చేయడము జరుగుతుంది. మళ్ళీ నీవే తల్లివి-తండ్రివి అని అంటారు. ఒక్క
తండ్రియే తల్లి-తండ్రిగా ఎలా అవుతారు? ఈ విషయాలను ఇతరులెవరూ అర్థం చేయించలేరు.
ఎలాగైతే శాస్త్రాలలో వ్యాసుడు వ్రాసినదానిని మనుష్యులు కంఠస్థము చేసారో, అలాగే -
మీకు ఎవరో చెప్పారని, దానిని మీరు కంఠస్థము చేసారని మనుష్యులు మీతో కూడా అంటారు.
కొత్తవారికి ఇది అర్థం చేసుకోవడము చాలా కష్టము. మీరు ఆత్మ అని, మీ తండ్రి పరమపిత
పరమాత్మ అని ఇక్కడ ఉన్నవారెవరూ ఎవరికీ ఈ మాత్రం కూడా అర్థం చేయించలేరు. ఆ అనంతమైన
తండ్రియే అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. ఇంతకుముందు వారసత్వాన్ని ఇచ్చారు, తర్వాత
పునర్జన్మలను తీసుకుంటూ-తీసుకుంటూ 84 జన్మలు పూర్తయ్యాయి, ఇప్పుడు తండ్రి మళ్ళీ
వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇది ఎవరికైనా అర్థం చేయించడము ఎంత సహజము. నీవే
తల్లివి-తండ్రివి అని ఎవరిని అంటారు - ఇది ఆలోచించాల్సిన విషయము కదా. బ్రహ్మా ద్వారా
దత్తత తీసుకుంటారు, తర్వాత తల్లి కూడా తప్పకుండా కావాలి. కనుక అనన్యమైన కుమార్తె
ఎవరైతే ఉన్నారో, డ్రామా ప్లాన్ అనుసారముగా వారికి జగదంబ అన్న టైటిల్ ను ఇవ్వడము
జరుగుతుంది. పురుషుడిని జగత్ అంబ అని అనలేము, వారిని జగత్ పిత అని అంటారు. వారికి
ప్రజాపిత అనే పేరు ప్రసిద్ధమైనది. అచ్ఛా, మరి ప్రజా మాత ఎక్కడున్నారు? మాతను దత్తత
తీసుకోవడము జరుగుతుంది. ఆదిదేవ్ అయితే ఉన్నారు, తర్వాత ఆదిదేవిని నియమించడము
జరుగుతుంది. జగదంబ అయితే ఒక్కరే - వారికే మహిమ ఉంటుంది. జగదంబకు ఎన్ని మేళాలు
జరుగుతాయి. కానీ వారి కర్తవ్యము గురించి ఎవరికీ తెలియదు. కలకత్తాలో కాళీ మందిరముంది,
బొంబాయిలో కూడా జగదంబ మందిరముంది. కానీ ముఖకవళికలు వేర్వేరుగా ఉంటాయి. జగదంబ ఎవరు
అనేది ఎవరికీ తెలియదు. ఆమెను భగవతి అని కూడా అంటారు. కానీ ఇప్పుడు జగదంబను భగవతి అని
అనలేము. ఆమె బ్రాహ్మణి, జ్ఞాన-జ్ఞానేశ్వరి, ఆమెకు తండ్రి నుండి జ్ఞానము లభించింది.
మీరంతా జగదంబ సంతానము. మీరు జ్ఞానాన్ని విని, మళ్ళీ వినిపిస్తారు. మీ వ్యాపారమే ఇది.
మిమ్మల్ని ఈశ్వరుడు చదివిస్తున్నారు, మనుష్యులెవరూ చదివించడము లేదు. ఈ బ్రహ్మా కూడా
మనిషే. మనుష్యులు ఎవరినీ పావనముగా చేయలేరు. మనుష్యుల బుద్ధి ఎంత డల్ గా అయిపోయిందంటే,
అసలు ఏమీ అర్థం చేసుకోవడము లేదు. పతిత-పావనుడు అయితే ఒక్క తండ్రి మాత్రమే. వారు
పతితులను పావనముగా చేసేందుకే వస్తారు. ఈ మొత్తము ప్రపంచమంతా తమోప్రధానముగా ఉంది,
అందరూ పతితముగా ఉన్నారు. కొత్త ప్రపంచము పావనమైనది, పాత ప్రపంచము పతితమైనది. పాత
ప్రపంచములో నరకవాసులు ఉంటారు, కొత్త ప్రపంచములో స్వర్గవాసులు ఉంటారు. సత్యయుగములో
కేవలం భారతవాసులైన దేవీ-దేవతలు మాత్రమే ఉంటారని, ఇంకెవరూ ఉండరని బుద్ధి కూడా
చెప్తుంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానము లభించింది. కొత్త ప్రపంచములో మొదట
సూర్యవంశీ దేవతలు ఉండేవారు, తర్వాత చంద్రవంశీయులు ఉండేవారు, అంటే సూర్యవంశము
గతించిపోయింది అని అర్థం. చంద్రవంశీయుల తర్వాత మళ్ళీ వైశ్యవంశీయులు... మొదలైనవారు
వస్తారు. తప్పకుండా లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. అచ్ఛా, వారికన్నా ముందు ఏముండేది,
ఇది ఎవరూ అర్థం చేసుకోలేరు. పిల్లలైన మీకు తండ్రి చక్రము యొక్క రహస్యాన్ని అర్థం
చేయించారు. ద్వాపరములో వైశ్యవంశీయులు ఉంటారు. కలియుగములో శూద్రవంశీయులు ఉంటారు.
మేము బ్రాహ్మణులుగా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు. మిమ్మల్ని తండ్రి తమవారిగా
చేసుకున్నారు అనగా శూద్ర ధర్మము నుండి దేవతా ధర్మములోకి ట్రాన్స్ఫర్ చేసారు.
ఇప్పుడైతే సూర్యవంశీయులు, చంద్రవంశీయులు లేరు. లక్ష్మీ-నారాయణుల రాజ్యము లేదు, రామ
రాజ్యము లేదు. ఇప్పుడిది కలియుగ అంతిమము. కలియుగము తర్వాత తప్పకుండా సత్యయుగము
వస్తుంది. కలియుగములో ఈ పాత పతిత ప్రపంచముంది, మహాన్ దుఃఖితులుగా ఉన్నారు, అందుకే
వెళ్ళి దేవతల మహిమను పాడుతారు, వారికి తల వంచి నమస్కరిస్తారు. అచ్ఛా,
లక్ష్మీ-నారాయణులకు ఈ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు? ఇది చెప్పగలిగేవారు ఎవరైనా ఉన్నారా.
ఇది ఎవరి ఆలోచనలోనూ ఉండదు, ఎందుకంటే కలియుగము ఇప్పుడింకా చిన్న బిడ్డలా ఉందని, ఇంకా
40 వేల సంవత్సరాలు ఉన్నాయని వారి బుద్ధిలో ఉంది. అందుకే వారికి ఈ ఆలోచనే రాదు.
ఇప్పుడు మీకు ఈ ఆలోచన వస్తుంది. మాకు స్మృతి ఉండడము లేదని చాలామంది పిల్లలంటారు.
ఎందుకు ఉండడము లేదు? ఎందుకంటే ఉదయాన్నే లేచి స్మృతిలో కూర్చుని ధారణ చేయరు. అర్థం
చేసుకుంటారు కూడా, కానీ ఎవరికీ అర్థం చేయించలేరు. తప్పకుండా ఇలా జరుగుతుంది. అందరూ
ఒకేలాంటి తెలివైనవారిగా అవ్వలేరు. తెలివైనవారు కూడా కావాలి, తెలివితక్కువవారు కూడా
కావాలి. చాలా తెలివైనవారైతే వెళ్ళి రాజా-రాణులుగా అవుతారు. ఎవరైతే ఎంతో ఎక్కువగా
అర్థం చేసుకుంటారో మరియు అర్థం చేయిస్తారో, వారి పేరు ప్రసిద్ధమవుతుంది. ప్రదర్శనీలు
జరిగేటప్పుడు, బాబా, ఫలానావారిని పంపించండి అని వ్రాస్తారు. అప్పుడు, మీరు అర్థం
చేయించలేరా అని బాబా అడుగుతారు. బాబా, వారికి ఎక్కువ ప్రాక్టీస్ ఉంది, మేము కాస్త
కచ్చాగా ఉన్నామని అంటారు. బాబా స్వయంగా కూడా అంటారు - ఎక్కడ నుండైనా ఆహ్వానము
లభించినప్పుడు, ఎవరెవరికి ఆహ్వానము లభించింది అన్నది వ్రాసి పంపించండి, అప్పుడు
ఎవరెవరిని పంపాలి అనేది నేను చూస్తాను. ఆ ఆహ్వానములో సన్యాసులు కూడా ఉన్నారా? అలా
అయితే, చాలా మంచి బ్రహ్మాకుమారీని పంపించవలసి ఉంటుంది. అచ్ఛా, కుమారకా ఉన్నారు,
మనోహర్ ఉన్నారు, గంగే ఉన్నారు - వీరిలో ఎవరినైనా పంపించండి. పిల్లలైతే ఎంతోమంది
ఉన్నారు. జగదీష్ ను పంపించండి, రమేష్ ను పంపించండి. వీరు ఒకరికన్నా ఒకరు
తెలివైనవారని మీకు కూడా తెలుసు. ఎలా అయితే జడ్జి, మెజిస్ట్రేట్ ఉంటారు, వారు
ఒకరికన్నా ఒకరు తెలివైనవారిగా ఉంటారు. వారు ఒకరికన్నా ఒకరు తెలివైనవారని గవర్నమెంట్
కు తెలుసు. అందుకే కేసు ఒక కోర్టు నుండి పై కోర్టుకు వెళ్తుంది, ఆ తర్వాత హైకోర్టుకు
వెళ్తుంది, ఆ తర్వాత దాని కన్నా పై కోర్టుకు వెళ్తుంది. అక్కడ కూడా సరైన తీర్పు
ఇవ్వకపోతే, మళ్ళీ దాని కన్నా పై కోర్టుకు వెళ్తారు. మీరు వీరిపై దయ చూపించండి అని
అడుగుతారు. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి, సత్య, త్రేతాయుగాలలో ఉండవు. తర్వాత
ద్వాపరములో రాజు-రాణుల రాజ్యముంటుంది. అక్కడైతే మహారాజు-మహారాణులే కేసులను
సంభాళిస్తారు. కేసులు కూడా కొన్నే ఉంటాయి. ఇప్పుడైతే తమోప్రధానముగా, పతితముగా
ఉన్నారు కదా. అక్కడ చక్రవర్తి వద్దకు కేసు వెళ్తే, కొద్దిగా శిక్ష విధిస్తారు.
కఠినమైన పొరపాటు జరిగినట్లయితే, కఠినమైన శిక్షను విధిస్తారు. ఇక్కడైతే జడ్జిలు,
వకీళ్ళు ఎంతోమంది ఉన్నారు. కార్యవ్యవహారాలలో ఎంతో తేడా ఉంటుంది. సత్యయుగములో ఏమి
జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు - ఈ
లక్ష్మీ-నారాయణుల గురించి తెలుసా అని ఎవరినైనా అడగండి. ఉదాహరణకు బిర్లా ఉన్నారు,
వారు చాలా మందిరాలను నిర్మిస్తూ ఉంటారు. ఎవరైనా మంచి బిడ్డ ఉంటే, వారు బిర్లాకు ఇలా
లెటర్ వ్రాయండి - మీరు లక్ష్మీ-నారాయణుల మందిరాలనైతే చాలా కట్టిస్తూ ఉంటారు కదా,
సత్యయుగానికి ముందు కలియుగముండేది అన్నప్పుడు మరి ఆ రాజధాని వారికి ఎలా లభించింది
అని అడగండి. కలియుగములోనైతే ఏమీ లేదు. దేవతలైతే ఎవరితోనూ యుద్ధము చేసి ఉండరు.
యుద్ధము ద్వారా ఎవరూ విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. విశ్వానికి యజమానులుగా ఎవరైతే
ఉండేవారో, ఆ లక్ష్మీ-నారాయణుల చిత్రాలే పెట్టి ఉన్నాయి. ఇప్పుడైతే ఇది కలియుగము,
ఇక్కడ ఆయుధాలతో యుద్ధాలు జరుగుతాయి. తండ్రి అర్థం చేయించారు, క్రిస్టియన్ ధర్మము
వారు పరస్పరము ఒక్కటైనట్లయితే, పరస్పరము ప్రీతిని కలిగి ఉన్నట్లయితే, విశ్వానికి
యజమానులుగా అవ్వగలరు. కానీ విశ్వానికి యజమానులుగా అయితే లక్ష్మీ-నారాయణులే అవుతారు.
వారు పరస్పరము ఒక్కటైతే, యజమానులుగా అవ్వగలరని బుద్ధి చెప్తుంది, కానీ సత్యయుగ
రాజు-రాణులుగా అయితే ఎవరూ అవ్వలేరు. డ్రామాయే ఈ విధముగా తయారుచేయబడి ఉంది. ఇప్పుడు
మనము మళ్ళీ యోగబలముతో స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. కల్పక్రితం కూడా
సంగమములో, తండ్రి నుండి పదవిని పొందామని, 84 జన్మలను పూర్తి చేసుకుని, మళ్ళీ
వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీరు తెలియజేయవచ్చు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్వయములో ధారణ చేసేందుకు మరియు ఇతరులచేత చేయించేందుకు - ఉదయాన్నే లేచి తండ్రి
స్మృతిలో కూర్చోవాలి. ఏదైతే అర్థం చేసుకున్నారో, దానిని ఇతరులకు అర్థం చేయించే
ప్రాక్టీస్ చేయాలి.
2. లౌకిక సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తొలగించి, ఒక్క పారలౌకిక తండ్రిని స్మృతి
చేయాలి. తండ్రి నుండి ఏ జ్ఞానమైతే లభించిందో, దానిని విని అందరికీ వినిపించాలి. ఇదే
మీ వ్యాపారము.
వరదానము:-
ఇముడ్చుకునే శక్తి ద్వారా ఏకమత వాతావరణాన్ని తయారుచేసే
ఉదాహరణ రూప భవ
ఎవరైతే ఒకే విధమైన మణులుగా ఉన్నారో, ఒక్కరి తపనలోనే మరియు
ఏకరస స్థితిలోనే స్థితులై, ఒక్కరి మతముపైనే నడిచేవారిగా ఉన్నారో, పరస్పరములో
సంకల్పాలలో కూడా ఏకమతము కలిగి ఉన్నారో, వారే మాలలో కూర్చబడతారు. కానీ ఏకమతము యొక్క
వాతావరణము ఎప్పుడు తయారవుతుందంటే, ఇముడ్చుకునే శక్తి ఉన్నప్పుడు. ఒకవేళ ఏదైనా
విషయములో భిన్నత్వముంటే, ఆ భిన్నత్వాన్ని ఇముడ్చుకోండి, అప్పుడు పరస్పరములో ఐక్యతతో
సమీపముగా వస్తారు మరియు అందరి ముందు ఉదాహరణ రూపులుగా అవుతారు.
స్లోగన్:-
ప్రతి
సంకల్పము, వాణి మరియు కర్మలో ఆత్మికతను ధారణ చేసినట్లయితే సేవలో శోభ వస్తుంది.
అవ్యక్త ప్రేరణలు -
‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చెయ్యండి’’
ఎటువంటి బాధాకరమైన
దృశ్యాన్ని చూస్తున్నా కూడా నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు) అన్నట్లు ఉండాలి. ఎవరికైతే
ఈ నథింగ్ న్యూ అనే పాఠము పక్కాగా ఉంటుందో వారు గాభరా పడరు. ఏమైంది, ఎలా అయ్యింది,
ఇది జరిగింది... ఇలా సమాచారాన్ని వింటూ, చూస్తూ కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్న విధిని
శక్తిశాలిగా అయ్యి చూస్తూ, ఇతరులకు కూడా శక్తిని ఇస్తూ వెళ్ళండి. ప్రపంచములోని వారు
భయపడతారు కానీ మీరు ఏకరస స్థితిలో ఉంటూ ఆ ఆత్మలలో శక్తిని నింపుతారు. సంపర్కములోకి
ఎవరు వచ్చినా కానీ వారికి శక్తుల దానాన్ని, శాంతి దానాన్ని ఇస్తూ వెళ్ళండి.
| | | |