08-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - శాంతిగా ఉండే స్వభావము చాలా మంచిది,
శాంత స్వభావము కలవారు చాలా మధురముగా అనిపిస్తారు, వ్యర్థమైన మాటలు మాట్లాడటం కంటే
మాట్లాడకపోవటం మంచిది’’
ప్రశ్న:-
ఏ పిల్లలను
అందరూ ప్రేమిస్తారు? స్వయాన్ని సురక్షితముగా ఉంచుకునేందుకు సాధనమేమిటి?
జవాబు:-
ఎవరైతే అందరికీ
చాలా అభిరుచితో, ప్రేమగా సేవ చేస్తారో, వారిని అందరూ ప్రేమిస్తారు. మీకు ఎప్పుడూ
సేవ యొక్క అహంకారము రాకూడదు. తండ్రి ద్వారా జ్ఞానము యొక్క కస్తూరి ఏదైతే లభించిందో,
దానిని ఇతరులకు ఇవ్వాలి, అందరికీ శివబాబా స్మృతినిప్పించాలి. ఈ స్మృతియాత్రతోనే మీరు
చాలా-చాలా సురక్షితముగా ఉంటారు. ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా సంతోషము కూడా ఉంటుంది
మరియు మ్యానర్స్ కూడా బాగవుతూ ఉంటాయి.
ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఇలా అర్థం
చేయిస్తూ-చేయిస్తూ ఎంతటి తెలివైనవారిగా తయారుచేస్తారు. చదువు కూడా సహజమైనదే కదా. అది
స్థూలమైన చదువు మరియు ఇది సూక్ష్మమైన చదువు. ఈ చదువును తండ్రి తప్ప ఇంకెవ్వరూ
చదివించలేరని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి, పవిత్రముగా తయారుచేయడానికి మరియు
చదివించడానికే వచ్చారు. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా ఉంది. ఇటువంటి తండ్రిని స్మృతి
చేస్తూ సంతోషములో రోమాలు నిక్కబొడుచుకోవాలి. రోజురోజుకు మనము శాంతిలోకే వెళ్ళాలని
కూడా పిల్లలకు తెలుసు. శాంతి అంటే అందరికీ చాలా ఇష్టమనిపిస్తుంది. పెద్ద వ్యక్తులు
ఎక్కువగా మాట్లాడరు మరియు గట్టిగా మాట్లాడరు. మీరు చాలా-చాలా పెద్ద వ్యక్తులుగా
అవుతారు కదా. వాస్తవానికి మిమ్మల్ని వ్యక్తులని అనకూడదు, మీరు దేవతలుగా అవుతారు.
దేవతలు చాలా తక్కువగా మాట్లాడుతారు. మీరు కూడా దేవతలుగా అవ్వాలి కనుక టాకీ నుండి
మారి సైలెన్స్ లో ఉండే అభ్యాసము చేయండి. శాంతిగా ఉండేవారి విషయములో, వారికి స్వయం
పట్ల అటెన్షన్ ఉందని భావిస్తారు. మీరు శాంతిధామానికి వెళ్ళేది ఉంది కనుక మాట్లాడటము
కూడా చాలా నెమ్మదిగా మాట్లాడాలి. నెమ్మదిగా మాట్లాడుతూ-మాట్లాడుతూ శాంతిధామానికి
వెళ్ళిపోవాలి. మీరు ఎంతగా శాంతిగా ఉంటారో, అంతగా శాంతిని వ్యాపింపజేస్తారు. మీరు
చాలా శాంతిగా ఉండాలి. గట్టిగా మట్లాడటము మంచిగా అనిపించదు. క్రోధము కూడా మంచిది కాదు.
పిల్లల్లో ఏ వికారాలు ఉండకూడదు. మేము ఎవరితోనూ కొట్లాడటము-గొడవపడటము లాంటిది చేయడము
లేదు కదా అని చూసుకోవాలి. తండ్రి అర్థం చేయించారు - చెడు వినకండి, చెడు మాట్లాడకండి...
ఏ విషయాలైతే మీకు ఇష్టమనిపించవో, ఆ చెడు విషయాల నుండి మీరు పక్కకు వచ్చేయాలి,
అప్పుడు ఇరువురి నోర్లు మూతపడి ఉంటాయి. ప్రతి విషయములోనూ దైవీ గుణాలను ధారణ చేయాలి.
ఎవరైనా గట్టిగా మాట్లాడితే - శాంతిగా ఉండండి, శబ్దము చేయకండి అని చెప్పండి. మనము
శాంతి స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. సత్యయుగములో శాంతి ఉంటుంది కదా.
మూలవతనములోనైతే ఎలాగూ శాంతియే ఉంటుంది. శరీరమే లేనప్పుడు ఇక ఎలా మాట్లాడుతారు.
తండ్రి పిల్లలకు చాలా మంచి శ్రీమతాన్ని ఇస్తారు. వారు అర్థం చేయిస్తున్నారు -
మధురమైన పిల్లలూ, ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళాలి, టాకీ నుండి మూవీలోకి రావాలి,
తర్వాత సైలెన్స్ లోకి వెళ్ళిపోతారు. ఎవరు కలిసినా వారికి ఇదే సందేశాన్ని ఇవ్వాలి.
మీరు ఎంతగా సైలెన్స్ లో ఉంటారో, అంతగా - వీరు ఏదో ధ్యాసలో ఉన్నారని భావిస్తారు.
శాంతిగా ఉండే స్వభావము చాలా మంచిది. అలా ఉండేవారు చాలా మధురముగా అనిపిస్తారు.
వ్యర్థమైన మాటలు మాట్లాడటము కంటే మాట్లాడకుండా ఉండటము మంచిది.
మీరు సత్యాతి-సత్యమైన సందేశకులు. మీకు అందరి పట్ల దయ (కృప) ఉండాలి. దయ చూపించే
పిల్లలు చాలా శాంతిగా, తండ్రి స్మృతిలో ఉంటారు. అనంతమైన తండ్రిని స్మృతి
చేసినట్లయితే అనంతమైన సుఖ-శాంతులు లభిస్తాయని కేవలం ఈ సందేశాన్ని ఇవ్వాలి. లౌకిక
తండ్రి వద్ద చాలా ధనము ఉంటే చాలా వారసత్వము లభిస్తుంది కదా. అనంతమైన తండ్రి వద్దనైతే
విశ్వ రాజ్యాధికారము ఉంది కావున ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీకు విశ్వ
రాజ్యాధికారము లభిస్తుంది.
పిల్లలైన మీరు చాలా అభిరుచితో అందరికీ సేవ చేయాలి. ప్రతి ఒక్కరూ సేవకు యోగ్యులుగా
అవ్వాలి. ఎవరైతే ఇతరులకు ప్రేమగా సేవ చేస్తారో, వారిని అందరూ ప్రేమిస్తారు. ఎప్పుడూ
సేవ యొక్క అహంకారము రాకూడదు. మీకు తండ్రి ద్వారా జ్ఞానము యొక్క కస్తూరి లభించింది,
దానిని ఇతరులకు ఇవ్వాలి. శివబాబా గుర్తు ఉన్నారా అని ఒకరికొకరు స్మృతిని
ఇప్పించుకుంటూ ఉండండి. దీనితో సంతోషము కూడా కలుగుతుంది. స్మృతిని ఇప్పించేవారికి
థాంక్స్ చెప్పాలి. స్మృతియాత్ర ద్వారా పిల్లలైన మీరు చాలా-చాలా సురక్షితముగా ఉంటారు.
ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా సంతోషము కూడా ఉంటుంది మరియు మ్యానర్స్ కూడా బాగవుతూ
ఉంటాయి. మీరు మీ క్యారెక్టర్ లను తప్పకుండా బాగు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ
హృదయాన్ని ప్రశ్నించుకోండి - నా స్వభావము చాలా-చాలా మధురముగా ఉందా? ఎప్పుడూ ఎవరినీ
కోపగించుకునేలా చేయడము లేదు కదా. ఎవరైనా కోపగించుకునేటువంటి వాతావరణము ఎప్పుడూ
ఉండకూడదు. దాని కోసం ప్రయత్నము చేయాలి ఎందుకంటే పిల్లలైన మీరు చాలా ఉన్నతమైన సేవలో
ఉన్నారు. మీరు ఈ మొత్తం స్టేజ్ కు ప్రకాశాన్ని ఇవ్వాలి. మీరు ధరిత్రి యొక్క
చైతన్యమైన సితారలు. నక్షత్ర దేవత... అని అంటూ ఉంటారు కూడా. ఇప్పుడు ఆ నక్షత్రాలేమీ
దేవతలు కావు. మీరు వాటికంటే మహా బలశాలులు ఎందుకంటే మీరు మొత్తం విశ్వానికి
ప్రకాశాన్ని ఇస్తారు. మీరే దేవతలుగా అయ్యేవారు. ఎలాగైతే పైన ఉన్న నక్షత్రాలు
మెరుస్తూ ఉంటాయో, ఒక్కో నక్షత్రము చాలా ప్రకాశిస్తూ ఉంటుంది, ఒక్కోటి తక్కువగా
ప్రకాశిస్తూ ఉంటుంది, ఒక్కోటి చంద్రునికి దగ్గరగా ఉంటుంది. పిల్లలైన మీరు కూడా
యోగబలముతో సంపూర్ణముగా పవిత్రముగా అవుతారు కనుక ప్రకాశిస్తారు.
ఇప్పుడు పిల్లలైన మీకు అవినాశీ జ్ఞాన రత్నాల లాటరీ లభిస్తూ ఉంది కనుక ఎంత సంతోషము
ఉండాలి. లోలోపల సంతోషముతో గంతులు వేస్తూ ఉండండి. మీ ఈ జన్మ వజ్రతుల్యమైనదిగా మహిమ
చేయబడుతుంది. బ్రాహ్మణులైన మీరే జ్ఞానవంతులుగా అవుతారు కనుక మీకు జ్ఞానము గురించిన
సంతోషమే ఉంటుంది. మీరు ఈ దేవతల కంటే కూడా శ్రేష్ఠమైనవారు. మీ ముఖము సదా సంతోషముతో
వికసించి ఉండాలి. తండ్రి పిల్లలను ఆశీర్వదిస్తారు - మధురమైన పిల్లలూ, సదా శాంత భవ!
చిరంజీవి భవ! అనగా చాలా జన్మలు జీవించండి. ఆశీర్వాదమైతే తండ్రి నుండి లభిస్తుంది
కానీ ప్రతి ఒక్కరూ - మేము చిరంజీవులుగా ఎలా అవ్వాలి అని తమ పురుషార్థము చేసుకోవాలి.
తండ్రిని స్మృతి చేయడముతో మీరు చిరంజీవులుగా అవుతున్నారు. ఈ ఆశీర్వాదాన్ని తండ్రి
ఇస్తారు. బ్రాహ్మణులు కూడా ఆయుష్మాన్ భవ అని అంటారు. తండ్రి కూడా, ‘పిల్లలూ, సదా
జీవిస్తూ ఉండండి’ అని అంటారు. మిమ్మల్ని అర్ధకల్పము వరకు మృత్యువు కబళించదు.
సత్యయుగములో మరణించడమనే మాటే ఉండదు. ఇక్కడైతే మనుష్యులు మరణమంటే భయపడతారు కదా.
మీరైతే మరణించేందుకు పురుషార్థము చేస్తున్నారు. బాబాను స్మృతి చేస్తూ-చేస్తూ మనము ఈ
శరీరాన్ని వదిలి మన శివబాబా వద్దకు వెళ్తామని, తర్వాత స్వర్గవాసులుగా అవుతామని మీకు
తెలుసు.
ఇప్పుడు మీరు అత్యంత ప్రియమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు కనుక మీరు కూడా తండ్రి వలె
చాలా-చాలా మధురముగా, చాలా ప్రియముగా అవ్వాలి. బాబా ఉత్తరాలలో కూడా ‘మధురాతి మధురమైన
ప్రియమైన, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలూ...’ అని వ్రాస్తుంటారు. బాబా చాలా
మధురమైనవారు కదా. బాబా ఎంత మధురమైనవారు, ఎంత ప్రియమైనవారు అనేది ప్రాక్టికల్ గా
అనుభవం చేస్తారు. వారు మనల్ని కూడా అలా తయారుచేస్తారు. మనము ఎంత మధురముగా, ఎంత
ప్రియముగా ఉండేవారము అనేది కూడా మీకు తెలుసు. మనమే పూజ్యుల నుండి మళ్ళీ పూజారులుగా
అయ్యాము, అప్పుడిక మనల్ని మనమే పూజించుకుంటూ ఉన్నాము. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన
చాలా అద్భుతమైన విషయాలు.
మన అర్ధకల్పపు దుఃఖాలన్నింటినీ దూరము చేసే బాబా ఇప్పుడు వచ్చి ఉన్నారని పిల్లలైన
మీకు తెలుసు. హరహర మహాదేవ అని అంటారు. ఇప్పుడు శంకరుడు మహాదేవ అయితే కాదు. దుఃఖాన్ని
అయితే తండ్రియే హరిస్తారు. దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారు తండ్రి. అర్ధకల్పము
మీరు చాలా దుఃఖాన్ని చూసారు. 5 వికారాల రోగము చాలా పెరిగిపోయింది. ఈ రోగము చాలా
దుఃఖితులుగా చేసింది. అందుకే తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, ఈ కర్మల ఖాతా ఏదైతే
ఉందో దానిని ఇప్పుడు సరి చేసుకోండి. వ్యాపారస్థులు కూడా 12 నెలల ఖాతాను
పెట్టుకుంటారు కదా.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఇప్పుడు మొత్తం సృష్టిలో ఎంత చెత్త ఉందో
చూడండి. ఇది ఉన్నదే నరకము, అందుకే నరకాన్ని స్వర్గముగా తయారుచేయడానికి తండ్రికి
రావాల్సి ఉంటుంది. బాబా చాలా ప్రేమతో వస్తారు. నేను పిల్లల సేవ కోసం వెళ్ళాలి అని
వారికి తెలుసు. నేను కల్ప-కల్పము పిల్లలైన మీ సేవలో ఉపస్థితుడినై ఉంటాను. వారు
స్వయంగా వచ్చినప్పుడు, తండ్రి మా సేవలో ఉపస్థితులై ఉన్నారని పిల్లలు భావిస్తారు.
వారు ఇక్కడ కూర్చుని ఉండగా అందరి సేవ జరుగుతుంది. మొత్తం సృష్టి అంతటికీ కళ్యాణకారీ
దాత అయితే ఒక్కరే కదా. మొత్తం ప్రపంచములోని ఆత్మలందరికీ నేను వారసత్వాన్ని
ఇవ్వడానికి వస్తాను అని తండ్రికి తెలుసు. అనంతమైన తండ్రి దృష్టి ప్రపంచములోని ఆత్మల
వైపుకు వెళ్తుంది. ఇక్కడ కూర్చుని ఉన్నా కానీ వారి దృష్టి మొత్తం విశ్వముపై మరియు
విశ్వములోని మనుష్యమాత్రులందరిపై ఉంది, ఎందుకంటే వారు మొత్తం విశ్వమంతటినీ పూర్తిగా
సంతృప్తి పరచాలి. డ్రామా ప్లాన్ అనుసారముగా కల్పక్రితం వలె మొత్తం విశ్వములోని
ఆత్మలు సంతృప్తి చెందబోతున్నారు. తండ్రి పిల్లలందరినీ గుర్తు చేస్తారు, అందరిపై
దృష్టి పడుతుంది కదా. సంగమయుగములోనే తండ్రి పిల్లల సేవలో ఉపస్థితులై ఉంటారు, వారిలా
ఎవ్వరూ సేవ చేయలేరు. వారిది అనంతమైన సేవ. పిల్లలైన మీరు కూడా వారిలా సేవ చేసినప్పుడు
బాబాను షో (ప్రత్యక్షము) చేయగలరు. సేవ చేసేవారికి ఫలం కూడా చాలా భారీగా లభిస్తుంది.
మేము శ్రీమతమనుసారముగా మొత్తం విశ్వములోని మనుష్యులకు సుఖాన్ని ఇస్తామని పిల్లలకు
నషా కూడా ఎక్కుతుంది.
తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, ఇప్పుడు జ్ఞాన రత్నాలతో మీ జోలిని బాగా నింపుకోండి,
ఎంత నింపుకోవాలనుకుంటే అంత నింపుకోండి. మీ సమయాన్ని వృధా చేసుకోకండి. తండ్రి
స్మృతిలో సమయాన్ని సద్వినియోగము చేసుకోండి. ఎవరైతే మంచి రీతిలో ధారణ చేస్తారో, వారు
తప్పకుండా ఇతరులకు కూడా మంచి సేవను చేస్తారు. వారు సమయము వృధా చేసుకోరు. పిల్లలు
పురుషార్థము చేసి అంతర్ముఖులుగా అవ్వాలి. అంతరాత్మ ఉంటుంది కదా. ఆత్మలైన మనకు తండ్రి
అర్థం చేయిస్తున్నారనే నిశ్చయము ఏర్పరచుకోవాలి. ఆత్మాభిమానులుగా అయి ఉండటమే
సత్యాతి-సత్యముగా అంతర్ముఖులుగా అవ్వడము. అంతర్ముఖి అనగా లోపల ఏదైతే ఆత్మ ఉందో, ఆ
ఆత్మ అంతా తండ్రి నుండే వినాలి. తండ్రి ప్రేమతో పదే-పదే అర్థం చేయిస్తున్నారు.
మాత-పితల నుండి మరియు మంచి సేవ చేసే మంచి అనన్యులైన పెద్ద అన్నయ్యలు, అక్కయ్యలు
ఎవరైతే ఉన్నారో, వారి నుండి నేర్చుకుంటూ వెళ్ళండి. మేము సమయాన్ని వృధాగా
పోగొట్టుకోకూడదు అని లోపల నిశ్చయము ఏర్పరచుకోండి. శరీర నిర్వహణ కూడా చేసుకోవాలి, తమ
రచనను కూడా చూసుకోవాలి. కేవలం మమకారము పెట్టుకోకూడదు. మమకారము పెట్టుకోవడము వలన
నష్టము కలుగుతుంది. మమకారమనేది ఒక్క తండ్రి పట్ల మాత్రమే పెట్టుకోండి. ఇక్కడ మీరు
తండ్రి సమ్ముఖములో ఉన్నారు. ఆత్మలు మరియు పరమాత్మ ఒకరికొకరు సమ్ముఖముగా ఉన్నారు
ఎందుకంటే ఇక్కడ స్వయంగా తండ్రి ఆత్మలను చదివిస్తారు. అక్కడ ఆత్మలు ఆత్మలను
చదివిస్తారు.
ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు లోలోపల మంథనము జరగాలి. విద్యార్థుల బుద్ధిలో మొత్తం
రోజంతా చదువే ఉంటుంది కదా. మీ బుద్ధిలో కూడా మొత్తం చదువంతా ఉంది. ఇది ఆత్మిక చదువు.
మంచి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, వారు సదా ఏకాంతములోకి వెళ్ళి చదువుకుంటారు.
విద్యార్థులు పరస్పరములో కలుసుకున్నప్పుడు చదువు గురించే చర్చించుకుంటూ ఉంటారు. ఈ
అనంతమైన చదువులోనైతే మరింత సంతోషముగా నిమగ్నమైపోవాలి.
పిల్లలైన మీరు ఇప్పుడు తండ్రికి సహాయకులుగా అవుతారు. స్మృతిలో ఉండటమే సహాయము చేయడము
ఎందుకంటే స్మృతి యాత్ర అంటే శాంతి యాత్ర. అందుకే, ప్రతి ఒక్కరూ తమ ఇంటిని స్వర్గముగా
చేసుకోండని అంటారు. ప్రతి ఒక్కరి బుద్ధిలో భగవంతుడు మరియు వారసత్వము ఉన్నాయి.
భగవంతుడిని స్మృతి చేసినట్లయితే రాజ్యాధికారము లభిస్తుంది, ఇంకేమీ చేయనవసరము లేదు.
కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే ఇక రాజ్యము మీదే.
పిల్లలైన మీరు అందరికీ ఇదే సందేశాన్ని ఇస్తూ ఉండండి - తండ్రిని స్మృతి చేసినట్లయితే
స్వర్గ రాజ్యము లభిస్తుంది అని. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల హృదయపూర్వకమైన ప్రేమతో
ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి స్మృతిలో తమ సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. ఈ అమూల్యమైన సమయాన్ని
ఎక్కడా కూడా పాడు చేసుకోకూడదు. పురుషార్థము చేసి అంతర్ముఖులుగా అనగా ఆత్మాభిమానులుగా
అయి ఉండాలి.
2. ఇప్పుడు మనము దేవతల కన్నా శ్రేష్ఠమైన బ్రాహ్మణులము. ఇప్పుడు తండ్రి ద్వారా
అవినాశీ జ్ఞాన రత్నాల లాటరీ లభించింది, జ్ఞానవంతులుగా అయ్యారు, కనుక ముఖము సదా
సంతోషముతో వికసించి ఉండాలి. లోలోపల సంతోషముతో గంతులు వేస్తూ ఉండండి.
వరదానము:-
మనసా మహాదానము ద్వారా ప్రతి సంకల్పములోనూ సిద్ధిని ప్రాప్తి
చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ
ఏ పిల్లలైతే మనసు ద్వారా శక్తులను దానము చేస్తారో, వారికి
మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క వరదానము ప్రాప్తిస్తుంది, ఎందుకంటే మనసా ద్వారా
శక్తులను దానము చేయడముతో, సంకల్పాలలో ఎంతటి శక్తి జమ అవుతుందంటే, వారికి ప్రతి
సంకల్పములోనూ సిద్ధి ప్రాప్తిస్తుంది. వారు వారి సంకల్పాలను ఎక్కడ కావాలంటే అక్కడ
ఒక్క క్షణములో స్థిరపరచగలరు, సంకల్పాలు వారి వశములో ఉంటాయి. వారు వారి సంకల్పాలపై
విజయులుగా ఉన్న కారణముగా చంచల సంకల్పాలు కలిగినవారిని కూడా కొంత సమయము కోసం అచలముగా
మరియు శాంతిగా చేయగలరు.
స్లోగన్:-
నిరంతరము ఒక్క
తండ్రి సాంగత్యములో ఉన్నట్లయితే సాంగత్య దోషము నుండి రక్షించబడతారు.
అవ్యక్త ప్రేరణలు -
అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా)
అవ్వండి
ఏదైనా వికర్మ గాని
లేక వ్యర్థ కర్మ గాని ఒకవేళ పదే-పదే జరుగుతున్నట్లయితే, అందుకు కారణము - సదా
సహచరుడిని తోడుగా ఉంచుకోవడము లేదు మరియు తోడు యొక్క అనుభవాన్ని చెయ్యడము లేదు. ఏ
విధముగా శక్తులు ఒక్క క్షణములో దృష్టి ద్వారా అసురులను సంహరిస్తారో, అలా కంబైండ్
రూపపు స్మృతి ద్వారా మీ ఆసురీ సంస్కారాలను మరియు అపవిత్రతా సంకల్పాలను క్షణములో
సంహరించండి.