08-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - పుణ్యాత్మగా అయ్యేందుకు ఎంత వీలైతే అంత మంచి కర్మలు చేయండి, ఆల్రౌండర్ గా అవ్వండి, దైవీ గుణాలను ధారణ చేయండి’’

ప్రశ్న:-
ఏ కృషి చేసినట్లయితే పిల్లలైన మీరు పదమాపదమ పతులుగా అవుతారు?

జవాబు:-
అన్నింటికన్నా పెద్ద కృషి ఏమిటంటే - వికారీ దృష్టిని శుద్ధముగా చేసుకోవడము. కళ్ళే చాలా మోసము చేస్తాయి. కళ్ళను శుద్ధముగా చేసుకునేందుకు తండ్రి తెలియజేసిన యుక్తి ఏమిటంటే - పిల్లలూ, ఆత్మిక దృష్టితో చూడండి. దేహాన్ని చూడకండి. ‘నేను ఒక ఆత్మను’ అన్న ఈ అభ్యాసాన్ని పక్కా చేసుకోండి. ఈ కృషి ద్వారానే మీరు జన్మజన్మాంతరాల కొరకు పదమపతులుగా అయిపోతారు.

పాట:-
ఓర్పు వహించు మానవా...

ఓంశాంతి
ఇలా ఎవరు అన్నారు? శివబాబా శరీరము ద్వారా అన్నారు. ఏ ఆత్మ అయినా శరీరము లేకుండా మాట్లాడలేదు. తండ్రి కూడా శరీరములోకి ప్రవేశించి ఆత్మలకు ఇలా అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఇప్పుడు మీది దైహిక సంబంధము కాదు, ఇది ఆత్మిక సంబంధము. ఆత్మకు పరమపిత పరమాత్మ ద్వారా జ్ఞానము లభిస్తుంది. దేహధారులెవరైతే ఉన్నారో అందరూ చదువుతున్నారు. తండ్రికైతే తమదంటూ దేహము లేదు. కావున కొద్ది సమయము కొరకు వీరి ఆధారాన్ని తీసుకున్నారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుని కూర్చోండి. అనంతమైన తండ్రి ఆత్మలైన మనకు అర్థం చేయిస్తున్నారు. వారు తప్ప ఇంకెవరూ ఈ విధంగా అర్థం చేయించలేరు. ఆత్మ, ఆత్మకు ఎలా అర్థం చేయిస్తుంది. ఆత్మలకు అర్థం చేయించేందుకు పరమాత్మ కావాలి. వారి గురించి ఎవరికీ తెలియదు. త్రిమూర్తులలో కూడా శివుడిని తొలగించివేశారు. బ్రహ్మా ద్వారా స్థాపనను ఎవరు చేయిస్తారు. బ్రహ్మా అయితే కొత్త ప్రపంచ రచయిత కాదు. అందరికీ రచయిత, అనంతమైన తండ్రి అయిన శివబాబా ఒక్కరే. బ్రహ్మా కూడా కేవలం ఇప్పుడు మాత్రమే మీకు తండ్రిగా ఉన్నారు, మళ్ళీ తరువాత అలా ఉండరు. అక్కడైతే లౌకిక తండ్రి మాత్రమే ఉంటారు. కలియుగములో లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి ఉంటారు. ఇప్పుడు సంగమములో లౌకిక తండ్రి, అలౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి, ముగ్గురు తండ్రులు ఉన్నారు. తండ్రి అంటారు, సుఖధామములో నన్ను ఎవరూ స్మృతి చేయరు. అక్కడ తండ్రి విశ్వానికి యజమానులుగా తయారుచేసారు కావున, ఇక ఆర్తనాదాలు చేసి ఎందుకు పిలుస్తారు? అక్కడ ఇతర ఖండాలు ఏవీ ఉండవు. కేవలం సూర్యవంశీయులు మాత్రమే ఉంటారు. చంద్రవంశీయులు కూడా తరువాత వస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలూ, ఓర్పు వహించండి, ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి, పురుషార్థము బాగా చేయండి. దైవీ గుణాలను ధారణ చేయకపోతే పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇది చాలా పెద్ద లాటరీ. బ్యారిస్టర్, సర్జన్ మొదలైనవారిగా అవ్వడము కూడా లాటరీయే కదా. వారు చాలా ధనాన్ని సంపాదిస్తారు. ఎంతోమందిపై వారికి అధికారము ఉంటుంది. ఎవరైతే బాగా చదువుతారో, చదివిస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. తండ్రిని స్మృతి చేయడము ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. తండ్రిని కూడా ఘడియ-ఘడియ మర్చిపోతూ ఉంటారు. మాయ స్మృతిని మరపింపజేస్తుంది, జ్ఞానాన్ని మరపింపజేయదు. తండ్రి అంటారు కూడా, మీ ఉన్నతిని చేసుకోవాలనుకుంటే చార్టు పెట్టండి - రోజంతటిలో పాప కర్మలేవీ చేయలేదు కదా. లేకపోతే వంద రెట్ల పాపము తయారవుతుంది. యజ్ఞాన్ని సంభాళించేవారు కూర్చుని ఉన్నారు, వారి సలహా తీసుకుని ఏదైనా చేయండి. నీవు ఏది తినిపిస్తే అది తింటాము, ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చుంటాము అని అంటారు కూడా. కావున మిగిలిన ఆశలన్నింటినీ వదిలి వేయాలి. లేకపోతే పాపము తయారవుతూ ఉంటుంది. ఆత్మ పవిత్రముగా ఎలా అవుతుంది. యజ్ఞములో ఎటువంటి పాప కర్మలు చేయకూడదు. ఇక్కడ మీరు పుణ్యాత్మగా అవుతారు. దొంగతనము మొదలైనవి చేయడము పాపము కదా. మాయ ప్రవేశిస్తుంది. అప్పుడు వారు యోగములోనూ ఉండలేరు, జ్ఞాన ధారణ కూడా చేయలేరు. తమ హృదయాన్ని ఇలా ప్రశ్నించుకోవాలి - నేను ఒకవేళ అంధులకు చేతికర్రగా అవ్వలేదు అంటే మరి నేను ఏమిటి అన్నట్లు! అంధులు అనే అంటారు కదా. ధృతరాష్ట్రుని పిల్లలు అని ఈ సమయములోనివారి గురించే అంటారు. వాళ్ళు రావణ రాజ్యములో ఉన్నారు, మీరు సంగమములో ఉన్నారు. మీరు మళ్ళీ రామ రాజ్యములో సుఖాన్ని పొందబోతున్నారు. పరమపిత పరమాత్మ ఏ విధంగా సుఖాన్ని ఇస్తారు అనేది ఎవరి బుద్ధిలోకి రాదు. మీరు ఎంత బాగా అర్థం చేయించినా కానీ బుద్ధిలో కూర్చోదు. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడే పరమాత్మ జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోగలరు. ఆత్మ ఎలా పురుషార్థము చేస్తుందో అలా తయారవుతుంది. అంత్యకాలములో ఎవరైతే స్త్రీని స్మృతి చేస్తారో... అన్న గాయనము కూడా ఉంది. తండ్రి అంటారు, ఎవరైతే నన్ను స్మృతి చేస్తారో వారు నన్ను పొందుతారు, లేకపోతే చాలా-చాలా శిక్షలు అనుభవించి వస్తారు. వారు సత్యయుగములోకి కూడా రారు, త్రేతాలో కూడా చివరిలో వస్తారు. సత్య, త్రేతాయుగాలను బ్రహ్మా యొక్క పగలు అని అంటారు. బ్రహ్మా ఒక్కరే ఉండరు కదా, బ్రహ్మాకు అయితే ఎంతోమంది పిల్లలు ఉన్నారు కదా. బ్రాహ్మణుల పగలు, ఆ తరువాత బ్రాహ్మణుల రాత్రి ఉంటుంది. ఇప్పుడు తండ్రి రాత్రిని పగలుగా చేయడానికి వచ్చారు. బ్రాహ్మణులే పగలులోకి వెళ్ళేందుకు తయారీ చేసుకుంటున్నారు. తండ్రి ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. దైవీ ధర్మ స్థాపన అయితే తప్పకుండా జరగనున్నది. కలియుగ వినాశనము కూడా తప్పకుండా జరగనున్నది. ఎవరికైనా లోపల ఏదైనా సంశయము ఉన్నట్లయితే వారు వెళ్ళిపోతారు. మొదట నిశ్చయము ఏర్పడుతుంది, ఆ తరువాత సంశయము వచ్చేస్తుంది. వారు ఇక్కడ మరణించి మళ్ళీ పాత ప్రపంచములోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. వారు వినాశనమైపోతారు. తండ్రి ఇచ్చే శ్రీమతము పైనైతే నడవాలి కదా. పాయింట్లు అయితే తండ్రి ఎంతో మంచి-మంచివి పిల్లలకు ఇస్తూ ఉంటారు.

మొట్టమొదటైతే మీరు అర్థం చేయించండి - నీవు ఒక ఆత్మవు, దేహము కాదు, లేకపోతే లాటరీ అంతా మాయమైపోతుంది. అక్కడ రాజులు, ప్రజలు అందరూ సుఖముగానే ఉంటారు కానీ పురుషార్థము అయితే ఉన్నత పదవిని పొందేందుకు చేయాలి కదా. సుఖధామములోకైతే వెళ్తాము కదా అని భావించకూడదు. అలా కాదు. ఉన్నత పదవిని పొందాలి. మీరు రాజులుగా అయ్యేందుకు వచ్చారు. ఇటువంటి తెలివైనవారు కూడా కావాలి. తండ్రి యొక్క సేవను చేయాలి. ఆత్మిక సేవను చేయలేకపోతే స్థూల సేవ కూడా ఉంది. కొన్నిచోట్ల అన్నయ్యలు కూడా పరస్పరము క్లాస్ నడిపిస్తూ ఉంటారు. ఒక అక్కయ్య మధ్యమధ్యలో వెళ్ళి క్లాస్ చేయిస్తారు. వృక్షము మెల్లమెల్లగా వృద్ధిని పొందుతుంది కదా. సెంటర్లకు ఎంతమంది వస్తారు, మళ్ళీ నడుస్తూ-నడుస్తూ మాయమైపోతారు. వికారాలలోకి పడిపోతే ఇక సెంటర్లకు రావడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది. ఢీలాగా అయిపోతారు. వీరు రోగగ్రస్తులు అయ్యారు అని అంటారు. తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. మీ లెక్కాపత్రాన్ని రోజూ వ్రాయండి. జమ అవ్వడము మరియు నష్టపోవడము జరుగుతుంది. నష్టము మరియు లాభము. ఆత్మ పవిత్రముగా అయిపోయిందంటే 21 జన్మల కొరకు జమ అయినట్లు. తండ్రి స్మృతి ద్వారానే జమ అవుతుంది, పాపాలు నాశనమవుతాయి. ఓ పతిత-పావన బాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా తయారుచేయండి అని అంటారు కూడా కదా. అంతేకానీ, మీరు వచ్చి మమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేయండి అని అనరు. అలా అనరు. ముక్తి మరియు జీవన్ముక్తి, ఈ రెండూ పావనమైన ధామాలే అని పిల్లలైన మీకే తెలుసు. మనము ముక్తి మరియు జీవన్ముక్తుల వారసత్వాన్ని పొందుతామని మీకు తెలుసు. ఎవరైతే బాగా చదవరో వారు చివరిలో వస్తారు. వారూ స్వర్గములోకైతే వస్తారు కానీ అందరూ తమ-తమ సమయాలలో వస్తారు. అన్ని విషయాలనూ అర్థం చేయించడం జరుగుతుంది. వెంటనే అయితే ఎవరూ అర్థం చేసుకోరు. ఇక్కడ మీకు తండ్రిని స్మృతి చేయడానికి ఎంత సమయము లభిస్తుంది. మీ వద్దకు ఎవరు వచ్చినా ముందుగా వారికి చెప్పండి - మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ జ్ఞానాన్ని తండ్రియే ఇస్తారు. వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఆత్మ జ్ఞానాన్ని తీసుకుంటుంది. తండ్రి అయిన పరమాత్మను స్మృతి చేయడము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. రచయితను స్మృతి చేయడము ద్వారానే పాపాలు భస్మమవుతాయి. రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని అర్థం చేసుకోవడము ద్వారా మీరు చక్రవర్తీ రాజులుగా అవుతారు. ఈ జ్ఞానాన్ని ఇక ఇతరులకు కూడా వినిపించాలి. చిత్రాలు కూడా మీ వద్ద ఉన్నాయి. ఇది రోజంతా మీ బుద్ధిలో ఉండాలి. మీరు విద్యార్థులు కూడా కదా. చాలామంది గృహస్థులు కూడా విద్యార్థులుగా ఉంటారు. అలా మీరు కూడా గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా అవ్వాలి. సోదరీ-సోదరులకు ఎప్పుడూ పరస్పరము వికారీ దృష్టి ఉండజాలదు. ఇక్కడైతే అందరూ బ్రహ్మా యొక్క ముఖవంశావళి కదా. వికారీ దృష్టిని శుద్ధముగా చేయడానికి ఎంతో శ్రమించవలసి ఉంటుంది. అర్ధకల్పముగా అలవాటైపోయింది, దానిని తొలగించేందుకు ఎంతో శ్రమించవలసి ఉంటుంది. అందరూ ఏమని వ్రాస్తూ ఉంటారంటే - వికారీ దృష్టిని తొలగించుకోవాలి అన్న పాయింటు ఏదైతే బాబా వినిపిస్తారో, అది చాలా కష్టము. ఘడియ-ఘడియ బుద్ధి వెళ్ళిపోతుంది, ఎన్నో సంకల్పాలు వస్తాయి. ఇప్పుడు మరి ఈ కళ్ళను ఏం చేయాలి? సూరదాసు ఉదాహరణను ఇస్తారు. దానిని ఒక కథగా తయారుచేసారు. కళ్ళు నన్ను మోసగిస్తున్నాయని గమనించి అతను కళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆ విషయము కాదు. ఈ కళ్ళు అయితే అందరికీ ఉన్నాయి కానీ అవి అశుద్ధముగా ఉన్నాయి, వాటిని శుద్ధముగా తయారుచేయాలి. ఇంటిలో ఉంటూ ఇది సంభవము కాదని మనుష్యులు భావిస్తారు. అది సంభవమేనని తండ్రి అంటారు, ఎందుకంటే ఇక్కడ సంపాదన చాలా-చాలా ఉంది. మీరు జన్మజన్మాంతరాల కొరకు పదమపతులుగా అవుతారు. అక్కడ లెక్క అనేదే ఉండదు. ఈ రోజుల్లో బాబా పదమపతి, పద్మావతి అన్న టైటిల్స్ ను ఇస్తున్నారు. మీరు లెక్కలేనంత పదమపతులుగా అవుతారు. అక్కడ లెక్క అనేదే ఉండదు. లెక్క ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, రూపాయలు, పైసలు మొదలైనవి వెలువడినప్పుడు. అక్కడైతే బంగారము, వెండి నాణాలను ఉపయోగిస్తారు. ఇంతకుముందు సీతా-రాముల రాజ్యములోని నాణాలు లభించేవి. కానీ సూర్యవంశీ రాజ్యములోని నాణాలను ఎప్పుడూ చూడలేదు. చంద్రవంశీయుల నాణాలను చూస్తూ వచ్చాము. మొదటిలోనైతే అన్నీ బంగారు నాణాలే ఉండేవి, ఆ తరువాత వెండి నాణాలు వచ్చాయి. ఈ రాగి నాణాలు మొదలైనవి ఆ తరువాత వచ్చాయి. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి నుండి మళ్ళీ వారసత్వాన్ని తీసుకుంటారు. సత్యయుగములో ఏ ఆచార-పద్ధతులైతే నడిచేది ఉందో, అవి ఎలాగూ ఉంటాయి, మీరు మీ పురుషార్థము చేయండి. స్వర్గములో చాలా తక్కువమంది ఉంటారు, ఆయుష్షు కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడ అకాల మృత్యువు ఉండదు. మేము కాలుడిపై విజయాన్ని పొందుతామని మీరు భావిస్తారు. అక్కడ మృత్యువు అన్న పేరే ఉండదు. దానిని అమరలోకము అంటారు, ఇది మృత్యులోకము. అమరలోకములో హాహాకారాలు ఉండవు. ఎవరైనా వృద్ధులు మరణించినా ఇంకా సంతోషిస్తారు, ఎందుకంటే వారు వెళ్ళి చిన్న బిడ్డగా అవుతారు. కానీ ఇక్కడ ఎవరైనా మరణిస్తే ఏడవడం మొదలుపెడతారు. మీకు ఎంత మంచి జ్ఞానము లభిస్తోంది, మరి ఎంత ధారణ ఉండాలి. ఇతరులకు కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. ఎవరైనా, నేను ఆత్మిక సేవను చేయాలనుకుంటున్నాను అని బాబాకు చెప్తే, బాబా వెంటనే అంటారు, తప్పకుండా చేయండి. బాబా ఎవరినీ వద్దనరు. జ్ఞానము లేకపోతే మరి అజ్ఞానమే ఉన్నట్లు. అజ్ఞానము వలన ఎంతో డిస్సర్వీస్ చేస్తారు. సేవనైతే బాగా చేయాలి కదా, అప్పుడే లాటరీ లభిస్తుంది. ఇది చాలా గొప్ప లాటరీ. ఇది ఈశ్వరీయ లాటరీ. (లౌకికములో) మీరు రాజులుగా, రాణులుగా అయితే మీ మనవలు, మనవరాళ్ళు అందరూ తింటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రము ప్రతి ఒక్కరూ తమ కర్మల అనుసారముగా ఫలాన్ని పొందుతారు. ఎవరైనా చాలా ధనాన్ని దానము చేస్తే రాజులుగా అవుతారు. తండ్రి పిల్లలకు అంతా అర్థం చేయిస్తారు. బాగా అర్థం చేసుకుని ధారణ చేయాలి. సేవ కూడా చేయాలి. వందలాందిమంది సేవ జరుగుతుంది. కొన్ని-కొన్ని చోట్ల భక్తి భావము కలవారు చాలా మంచిగా ఉంటారు. చాలా భక్తి చేసి ఉంటేనే జ్ఞానము కూడా మంచిగా అనిపిస్తుంది. వారి ముఖము ద్వారానే తెలిసిపోతుంది. జ్ఞానాన్ని వింటూ సంతోషపడుతూ ఉంటారు. ఎవరికైతే అర్థమవ్వదో వారు ఇటూ-అటూ చూస్తూ ఉంటారు లేక కళ్ళు మూసుకుని కూర్చుంటారు. బాబా అన్నీ చూస్తారు. ఇతరులకు నేర్పించకపోతే వారు ఏమీ అర్థం చేసుకోలేదని అర్థము. ఒక చెవితో విని ఇంకొక చెవి నుండి తీసేస్తారు. ఇప్పుడు ఈ సమయము అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునే సమయము. ఎంతగా తీసుకుంటారో అంతగా జన్మ-జన్మాంతరాలు, కల్ప-కల్పాంతరాలు మీకు లభిస్తుంది. లేకపోతే చివరిలో బాగా పశ్చాత్తాపపడతారు. అప్పుడు అందరికీ సాక్షాత్కారమవుతుంది. నేను బాగా చదవలేదు, అందుకే పదవిని కూడా పొందలేకపోతున్నాను అని భావిస్తారు. మరి వారు అక్కడికి వెళ్ళి ఏమవుతారు? పనివారిగా, సాధారణ ప్రజలుగా అవుతారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది. ఎవరు ఎలా చేస్తే దాని అనుసారముగా ఫలము లభిస్తుంది. కొత్త ప్రపంచము కోసం కేవలం మీరు మాత్రమే పురుషార్థము చేస్తారు. మనుష్యులు దాన-పుణ్యాలు చేస్తారు, అది కూడా ఈ ప్రపంచము కొరకే, అది చాలా సామాన్యమైన విషయము. మనము మంచి పనులు చేస్తే దానికి మరుసటి జన్మలో మంచి ఫలము లభిస్తుంది. మీదైతే 21 జన్మల విషయము. ఎంత వీలైతే అంత మంచి కర్మలు చేయండి, ఆల్రౌండర్ గా అవ్వండి. ముందుగా జ్ఞానీ ఆత్మలు మరియు యోగీ ఆత్మలు కావాలి. జ్ఞానీలు కూడా కావాలి. భాషణ ఇచ్చేందుకు మహారథులను పిలుస్తారు కదా. ఎవరైతే అన్ని రకాల సేవలను చేస్తారో వారికి పుణ్యము తప్పకుండా లభిస్తుంది. సబ్జెక్టులు ఉన్నాయి కదా. యోగములో ఉంటూ ఏ పని చేసినా మంచి మార్కులు లభించగలవు. తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - నేను సేవ చేస్తున్నానా? లేక కేవలం తింటున్నాను మరియు పడుకుంటున్నానా? ఇక్కడ ఇది చదువు, ఇంకే విషయమూ లేదు. మీరు మనుష్యుల నుండి దేవతలుగా, నరుడి నుండి నారాయణుడిగా అవుతారు. అమరకథ, మూడవ నేత్రము యొక్క కథ ఇది ఒక్కటే. మనుష్యులు వెళ్ళి అన్నీ అసత్యమైన కథలను వింటారు. మూడవ నేత్రాన్ని అయితే తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు మీకు మూడవ నేత్రము లభించింది, దీని ద్వారా మీరు సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకుంటారు. ఈ చదువులో కుమార, కుమారీలు చాలా బాగా ముందుకు వెళ్ళాలి. చిత్రాలు కూడా ఉన్నాయి. ఎవరినైనా గీతా భగవానుడు ఎవరు? అని అడగాలి. ముఖ్యమైన విషయము ఇదే. భగవంతుడనేవారు ఒక్కరే ఉంటారు, వారి నుండి ముక్తిధామము యొక్క వారసత్వము లభిస్తుంది. మనము అక్కడ ఉండేవారము, పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చాము. ఇప్పుడు పావనముగా ఎలా అవ్వాలి. పతిత-పావనుడైతే తండ్రి ఒక్కరే. మున్ముందు పిల్లలైన మీ అవస్థ కూడా చాలా మంచిగా తయారవుతుంది. తండ్రి ఎన్నో రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఒకటేమో, తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడు జన్మజన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - నేను ఎంతగా స్మృతి చేస్తున్నాను? చార్ట్ పెట్టుకోవడం మంచిది, మీ ఉన్నతిని చేసుకోండి. మీపై మీరే దయ చూపించుకుని మీ నడవడికను చూసుకుంటూ ఉండండి. ఒకవేళ మనము తప్పులు చేస్తూ ఉంటే రిజిస్టర్ పాడైపోతుంది. ఇందులో దైవీ నడవడిక ఉండాలి. నీవు ఏది తినిపిస్తే అది తింటాము, ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చుంటాము, ఏ డైరెక్షన్ ఇస్తే అది చేస్తాము అన్న గాయనము కూడా ఉంది కదా. డైరెక్షన్లు అయితే తప్పకుండా తనువు ద్వారానే ఇస్తారు కదా. గేట్ వే టు హెవెన్ (స్వర్గానికి ద్వారము) అన్న పదాలు బాగున్నాయి కదా. ఇది స్వర్గానికి వెళ్ళే ద్వారము. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పుణ్యాత్మగా అయ్యేందుకు మిగిలిన ఆశలన్నింటినీ వదిలి ఇది పక్కా చేసుకోవాలి - బాబా ఏది తినిపిస్తే అది తినాలి, ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోవాలి. ఎటువంటి పాప కర్మ చేయకూడదు.

2. ఈశ్వరీయ లాటరీని ప్రాప్తి చేసుకునేందుకు ఆత్మిక సేవలో నిమగ్నమవ్వాలి. జ్ఞానాన్ని ధారణ చేసి ఇతరులతో చేయించాలి. మంచి మార్కులు తీసుకునేందుకు ఏ కర్మనైనా స్మృతిలో ఉండి చేయాలి.

వరదానము:-
మాయను మరియు ప్రకృతిని దాసీగా చేసుకునే సదా స్నేహీ భవ

ఏ పిల్లలైతే సదా స్నేహీలుగా ఉంటారో, వారు లవలీనులై ఉన్న కారణముగా శ్రమ మరియు కష్టము నుండి సదా రక్షింపబడి ఉంటారు. వారి ఎదురుగా ప్రకృతి మరియు మాయ, రెండూ ఇప్పటినుండే దాసీలుగా అవుతాయి అనగా సదా స్నేహీ ఆత్మ యజమానిగా అవుతుంది. కనుక సదా స్నేహీగా ఉండే ఆత్మ యొక్క సమయాన్ని మరియు సంకల్పాలను వాటివైపుకు తిప్పుకునేందుకు ప్రకృతికి మరియు మాయకు ధైర్యము ఉండదు. వారి ప్రతి సమయము, ప్రతి సంకల్పము ఉన్నదే తండ్రి స్మృతి మరియు సేవ పట్ల. స్నేహీ ఆత్మల స్థితికి కల గాయనమేమిటంటే - ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు, తండ్రియే ప్రపంచము. వారు సంకల్పాలలో కూడా ఆధీనులవ్వలేరు.

స్లోగన్:-
నాలెడ్జ్ ఫుల్ గా అయినట్లయితే సమస్యలు కూడా మనోరంజనము కల ఆటలా అనుభవమవుతాయి.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి

ఈ కలియుగీ తమోప్రధానమైన శిథిలావస్థలో ఉన్న పాత వృక్షాన్ని భస్మము చేసేందుకు సంగఠిత రూపములో ఫుల్ఫోర్స్ తో యోగ జ్వాలను ప్రజ్వలితము చేయండి. కానీ ఇటువంటి జ్వాలా స్వరూపపు స్మృతి ఎప్పుడు ఉంటుందంటే, స్మృతి యొక్క లింకు సదా జోడింపబడి ఉన్నప్పుడు. ఒకవేళ పదే-పదే లింక్తెగిపోతే దానిని జోడించడానికి సమయము కూడా పడుతుంది, శ్రమ కూడా పడుతుంది మరియు శక్తిశాలిగా అయ్యేందుకు బదులుగా బలహీనముగా అయిపోతారు.