08-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీది ఇప్పుడు ఈశ్వరీయ కొత్త రక్తము, మీరు చాలా నషాతో భాషణ చేయాలి, శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారనే నషా ఉండాలి’’

ప్రశ్న:-
మీకు మీ లక్ష్యము-ఉద్దేశ్యము పట్ల స్థిరమైన నషా ఉండాలంటే, దాని కోసం ఏ యుక్తిని అలవరచుకోవాలి?

జవాబు:-
మీ రాజ్యపు పాస్ పోర్టు తయారుచేసి పెట్టుకోండి. కింద మీ సాధారణ చిత్రము, పైన రాజ్య వస్త్రాలలో అలంకరించబడిన చిత్రము మరియు దాని పైన శివబాబా చిత్రము ఉండాలి. అప్పుడు లక్ష్యము-ఉద్దేశ్యము యొక్క స్మృతి సహజముగా ఉంటుంది. ఈ పాస్ పోర్టు మీ జేబులో ఉండాలి. ఎప్పుడైనా మాయా తుఫానులు వస్తే - ఇప్పుడిక మా ఈ పాస్ పోర్టు క్యాన్సల్ అయిపోతుంది, మేము స్వర్గములోకి వెళ్ళలేము అన్న ఆలోచన వస్తుంది.

పాట:-
రాత్రి ప్రయాణీకుడా, అలసిపోకు...

ఓంశాంతి
పిల్లలు ఈ పాట అర్థాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు భక్తి మార్గపు ఘోర అంధకారమయ రాత్రి పూర్తి అయ్యింది. కాలుడు ఇప్పుడు మా వద్దకు రాలేడని పిల్లలకు తెలుసు. మనం ఇక్కడ కూర్చుని ఉన్నాము, మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడమే మన లక్ష్యము-ఉద్దేశ్యము. మీరు స్వయాన్ని గేదెగా భావిస్తే, అదే రూపాన్ని పొందుతారని సన్యాసులు అంటారు కదా. అది భక్తి మార్గము యొక్క ఉదాహరణ. అలాగే, రాముడు వానర సైన్యము తీసుకుని రావణుడిపై విజయము పొందారు అనేది కూడా ఒక ఉదాహరణ కదా. మీరు ఇక్కడ కూర్చున్నారు, మనమే దేవీ-దేవతలుగా, డబల్ కిరీటధారులుగా అవుతామని మీకు తెలుసు. స్కూల్లో చదువుకునేటప్పుడు, నేను ఇది చదువుకుని డాక్టరుగా అవుతాను, ఇంజనీరుగా అవుతాను అని అంటారు. మనం ఈ చదువుతో దేవీ-దేవతలుగా తయారవుతున్నామని మీకు తెలుసు. ఈ శరీరాన్ని వదిలేస్తాము, తర్వాత మన శిరస్సుపై కిరీటము ఉంటుంది. ఇది చాలా అశుద్ధమైన ఛీ-ఛీ ప్రపంచము. కొత్త ప్రపంచము ఫస్ట్ క్లాస్ ప్రపంచము. పాత ప్రపంచము పూర్తిగా థర్డ్ క్లాస్ ప్రపంచము వంటిది. ఈ ప్రపంచమైతే సమాప్తము అవ్వనున్నది. మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేసేవారు తప్పకుండా విశ్వ రచయితే అవుతారు, ఇతరులెవ్వరూ చదివించలేరు. శివబాబాయే మనల్ని చదివించి రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి అర్థం చేయించారు, ఆత్మాభిమానులుగా అవ్వండి. ఆత్మాభిమానులుగా అవ్వడములోనే శ్రమ ఉంది. పూర్తిగా ఆత్మాభిమానులుగా అయినట్లయితే ఇంకేమి కావాలి. మీరు ఎలాగూ బ్రాహ్మణులే, మనం దేవతలుగా తయారవుతున్నామని మీకు తెలుసు. నేను ఇలా తయారవుతున్నాను అనే నషా ఉంటుంది. ముందు మనం కలియుగీ నరకములో పతితులుగా ఉండేవారము. అసురులకు మరియు దేవతలకు ఎంత తేడా ఉంది. దేవతలు ఎంత పవిత్రమైనవారు. ఇక్కడ మనుష్యులు ఎంత పతితముగా ఉన్నారు. ముఖము మనుష్యుల వలె ఉన్నా కానీ గుణము ఎలా ఉందో చూడండి. స్వయంగా దేవతల పూజారులు కూడా వారి ఎదురుగా - మీరు సర్వగుణ సంపన్నులు... మాలో ఏ గుణాలు లేవు అని అంటూ మహిమను పాడుతారు. ఇప్పుడు మీరు పరివర్తన చెంది దేవతలుగా అవుతారు. తాము కృష్ణపురిలోకి వెళ్ళాలనే శ్రీకృష్ణుడిని పూజిస్తారు. కానీ ఎప్పుడు వెళ్తాము అనేది వారికి తెలియదు. భగవంతుడు వచ్చి ఫలమిస్తారని భక్తి చేస్తూ ఉంటారు. భక్తి ఫలము సద్గతి. ఇది చదువు. ముందుగా, మమ్మల్ని చదివించేవారు ఎవరు అనే నిశ్చయము కావాలి. వీరు శ్రీ శ్రీ... తండ్రి మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఎవరికైతే ఈ విషయము తెలియదో, వారు శ్రేష్ఠముగా ఎలా అవ్వగలరు. ఈ రోజుల్లోనైతే ఒకరినొకరు భ్రష్టముగా తయారుచేసుకునే మతాన్ని ఇచ్చుకుంటున్నారు. భ్రష్ట మతము అనగా ఆసురీ మతము. ఇంతమంది బ్రాహ్మణులందరూ శ్రీ శ్రీ శివబాబా మతాన్ని అనుసరిస్తున్నారు. పరమాత్ముని మతముతోనే శ్రేష్ఠముగా తయారవుతారు. ఎవరి భాగ్యములో ఉంటే, వారి బుద్ధిలోనే కూర్చుంటుంది, లేదంటే ఏమీ అర్థం చేసుకోరు. అర్థం చేసుకున్నప్పుడు వారంతట వారే సహాయము చేయడం మొదలుపెడతారు. చాలామందికి, వీరు (బ్రహ్మా) ఎవరు అనేది తెలియను కూడా తెలియదు, అందుకే బాబా ఎవరినీ కలవరు కూడా. వాళ్లు ఇంకా ఆసురీ మతాన్ని తెలుపుతూ ఉంటారు. ఇప్పుడు అందరూ మానవ మతాన్నే అనుసరిస్తున్నారు. శ్రీమతము గురించి తెలియని కారణముగా బ్రహ్మాబాబాకు కూడా తమ మతాన్ని ఇవ్వడం మొదలుపెడతారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని శ్రేష్ఠముగా తయారుచేయడానికే వచ్చారు.

ఇప్పుడు పిల్లలంటారు - బాబా, 5 వేల సంవత్సరాల క్రితం వలె మేము మిమ్మల్ని కలిసాము. ఎవరికైతే ఈ విషయము తెలియదో, వారు ఈ రకమైన జవాబు ఇవ్వలేరు. పిల్లలకు చదువు పట్ల చాలా నషా ఉండాలి. ఇది చాలా ఉన్నతమైన చదువు. కానీ మాయ కూడా చాలా విరుద్ధముగా ఉంది. ఏ చదువు ద్వారానైతే మన శిరస్సుపై డబల్ కిరీటము లభిస్తుందో, మనం ఆ చదువును చదువుతున్నామని మీకు తెలుసు. భవిష్య జన్మజన్మల కొరకు డబల్ కిరీటధారులుగా అవుతారు. మరి దాని కోసం అటువంటి పురుషార్థము చేయాలి. దీనిని రాజయోగము అని అంటారు. ఇది ఎంత అద్భుతము. లక్ష్మీ-నారాయణుల మందిరాలకు వెళ్ళండి అని బాబా ఎప్పుడూ అర్థం చేయిస్తూ ఉంటారు. పూజారులకు కూడా మీరు అర్థం చేయించవచ్చు. వారిని అడగండి - లక్ష్మీ-నారాయణులకు ఈ పదవి ఎలా లభించింది, వీరు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు? ఈ విధముగా కూర్చుని ఎవరికైనా వినిపిస్తే, పూజారుల కళ్యాణము కూడా జరుగుతుంది. ఈ లక్ష్మీ-నారాయణులకు రాజ్యము ఎలా లభించింది అనేది మేము మీకు అర్థం చేయిస్తాము అని మీరు చెప్పవచ్చు. నేను మీకు రాజయోగాన్ని నేర్పించి రాజులకే రాజులుగా తయారుచేస్తాను అని గీతలో కూడా భగవానువాచ ఉంది కదా. కావున పిల్లలకు, మేము ఇలా తయారవుతున్నాము అని ఎంత నషా ఉండాలి. మీ ప్రస్తుత చిత్రాన్ని మరియు రాజ్యపు చిత్రాన్ని తీయించుకుని పెట్టుకోండి. కింద మీ చిత్రము ఉండాలి, పైన రాజ్యపు చిత్రము ఉండాలి, దీనికి ఖర్చు ఏమీ అవ్వదు. రాజ్య వస్త్రాలైతే వెంటనే తయారుచేయవచ్చు. ఆ చిత్రాన్ని మీ వద్ద పెట్టుకుంటే - మేమే దేవతలుగా తయారవుతున్నాము అని పదే-పదే గుర్తుకువస్తూ ఉంటుంది. ఆ పైన శివబాబా చిత్రముండాలి. ఈ చిత్రాలన్నీ తయారుచేయించుకోవాలి. మనం మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతాము. ఈ శరీరాలను వదిలి వెళ్ళి మనం దేవతలుగా తయారవుతాము ఎందుకంటే ఇప్పుడు ఈ రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. ఈ ఫోటో సహాయపడుతుంది. పైన శివబాబా, దాని కింద రాజ్య వస్త్రాలలో ఉన్న చిత్రము, దాని కింద మీ సాధారణ చిత్రము ఉండాలి. శివబాబా నుండి మనం రాజయోగాన్ని నేర్చుకుని, డబుల్ కిరీటధారులైన దేవతలుగా తయారవుతున్నాము. ఈ చిత్రము మీ దగ్గర ఉంటే, ఎవరైనా అడిగినప్పుడు, మాకు నేర్పించేవారు ఈ శివబాబా అని వారికి తెలియజేయవచ్చు. చిత్రాన్ని చూస్తే పిల్లలకు నషా ఎక్కుతుంది. దుకాణాలలో కూడా ఈ చిత్రాన్ని పెట్టుకోండి. భక్తి మార్గములో బాబా, నారాయణుడి చిత్రాన్ని పెట్టుకునేవారు, అది జేబులో కూడా ఉండేది. మీరు కూడా మీ ఫోటో పెట్టుకుంటే, మేమే దేవీ-దేవతలుగా తయారవుతున్నామని గుర్తుంటుంది. తండ్రిని స్మృతి చేసే ఉపాయాలను వెతుకుతూ ఉండాలి. తండ్రి స్మృతిని మర్చిపోతేనే పడిపోతారు. వికారాల్లో పడిపోతే, ఇప్పుడిక మేము ఈ దేవతలుగా తయారవ్వలేము అని సిగ్గు అనిపిస్తుంది. ఇప్పుడిక మేము దేవతలుగా ఎలా అవ్వగలము - అని హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. బాబా అంటారు - వికారాల్లో పడిపోయిన వారి ఫొటోలను పక్కకు తీసేయండి. మీరు స్వర్గములోకి వెళ్ళేందుకు యోగ్యులు కారు, మీ పాస్ పోర్టు క్యాన్సల్ అయిపోయిందని వారికి చెప్పండి. స్వయం వారు కూడా - మేము పడిపోయాము, ఇప్పుడిక స్వర్గములోకి ఎలా వెళ్తాము అని ఫీల్ అవుతారు. బాబా నారదుని ఉదాహరణను ఇస్తారు. మీ ముఖాన్ని చూసుకోండి, లక్ష్మిని వరించేందుకు యోగ్యులుగా ఉన్నారా? అని వారితో అన్నారు. అప్పుడు నారదునికి తన ముఖము కోతి వలె కనిపించింది. అలాగే మనుష్యులకు కూడా - మాలోనైతే ఈ వికారాలు ఉన్నాయి, మరి శ్రీ లక్ష్మీ-నారాయణులను ఎలా వరించగలము అని సిగ్గు అనిపిస్తుంది. బాబా అయితే చాలా యుక్తులను తెలియజేస్తారు. కానీ ఎవరైనా విశ్వాసము కూడా పెట్టుకోవాలి కదా. వికారాల నషా కలిగితే, ఈ లెక్కన మేము రాజులకే రాజులుగా, డబల్ కిరీటధారులుగా ఎలా అవుతాము అని అనుకుంటారు. పురుషార్థమైతే చేయాలి కదా. బాబా అర్థం చేయిస్తున్నారు - ఇటువంటి సుందరమైన యుక్తులను రచించండి మరియు అందరికీ అర్థం చేయిస్తూ ఉండండి. ఈ రాజయోగము ద్వారా స్థాపన జరుగుతూ ఉంది. ఇప్పుడు వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. రోజురోజుకు తుఫానుల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. బాంబులు మొదలైనవి కూడా తయారవుతూ ఉన్నాయి.

పిల్లలైన మీరు ఉన్నత పదవిని పొందడానికే ఈ చదువు చదువుకుంటున్నారు. మీరు ఒక్కసారి మాత్రమే పతితము నుండి పావనముగా అవుతారు. మేము నరకవాసులుగా ఉన్నామని మనుష్యులు అర్థం చేసుకోరు ఎందుకంటే రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. ఇప్పుడు మీరు రాతిబుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా తయారవుతున్నారు. భాగ్యములో ఉంటే వెంటనే అర్థం చేసుకుంటారు. లేదంటే ఎంతగా కష్టపడినా సరే, బుద్ధిలో కూర్చోదు. తండ్రి గురించే తెలియదు అంటే వారు నాస్తికులు అనగా అనాథలు. శివబాబాకు పిల్లలు అన్నప్పుడు ఆ నాథుడికి చెందినవారిగా అవ్వాలి కదా. ఇక్కడ ఎవరికైతే జ్ఞానముంటుందో, వారు తమ పిల్లలను వికారాల నుండి రక్షిస్తూ ఉంటారు. అజ్ఞానులైతే తమ వలె తమ పిల్లలను కూడా వికారాల్లో చిక్కుకునేలా చేస్తుంటారు. ఇక్కడ వికారాల నుండి రక్షించడము జరుగుతుందని మీకు తెలుసు. ముందు కన్యలను రక్షించాలి. తల్లి-తండ్రి అయితే వికారాల్లోకి తోసేస్తున్నట్లుగా చేస్తారు. ఇది భ్రష్టాచారీ ప్రపంచమని మీకు తెలుసు. శ్రేష్ఠాచారీ ప్రపంచాన్ని అయితే అందరూ కోరుకుంటారు కానీ దానిని ఎవరు తయారుచేస్తారు? భగవానువాచ - నేను ఈ సాధు-సత్పురుషులను కూడా ఉద్ధరిస్తాను. భగవంతుడే అందరినీ ఉద్ధరించాలని గీతలో కూడా వ్రాయబడి ఉంది. భగవంతుడైన తండ్రి మాత్రమే వచ్చి అందరినీ ఉద్ధరిస్తారు. నిజంగా గీతా భగవానుడు శివుడు అని ఒకవేళ ఈ సమయములో తెలిస్తే, ఏం జరుగుతుందో ఊహించలేము! కానీ దానికి ఇంకాస్త సమయముంది. లేదంటే అందరి సింహాసనాలు కదలడం మొదలవుతాయి. సింహాసనాలు కదులుతాయి కదా. యుద్ధము మొదలైనప్పుడు, వీరి సింహాసనము కదలడం మొదలయ్యింది, ఇప్పుడిక పడిపోతారని తెలుస్తుంది. అవి ఇప్పుడే కదిలితే, అలజడి రేకెత్తుతుంది. మున్ముందు అలా జరగనున్నది. కావున భాషణలో కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఎవరికైతే సంస్కృతము బాగా వచ్చో, వారు శ్లోకాలను వినిపించవచ్చు. తప్పకుండా బ్రహ్మా తనువు ద్వారా స్థాపన చేస్తున్నాను అని పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత స్వయంగా చెప్తున్నారు. సర్వులకు సద్గతినిస్తున్నారు అనగా ఉద్ధరిస్తున్నారు. భాషణ చేయడములో చాలా నషా ఉండాలి. కన్యలది కొత్త రక్తము. జ్ఞానమనే రాళ్ళను వేయగలరు. విద్యార్థులకు కొత్త రక్తము ఉంటుంది కదా, కావున చాలా హంగామా చేస్తారు, రాళ్ళు విసురుతారు. వారు ఇందులో చురుకుగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మీది కూడా కొత్త రక్తము. ఆ విద్యార్థులు ఎంత నష్టము కలిగిస్తున్నారు అనేది మీకు తెలుసు. ఇక్కడ మీది ఈశ్వరీయ కొత్త రక్తము. మీరు పాతవారి నుండి కొత్తవారిగా అవుతున్నారు. మీ ఆత్మ ఏదైతే పాతదిగా, ఇనుప యుగముదిగా అయిపోయిందో, అది ఇప్పుడు కొత్తదిగా, బంగారు యుగముదిగా అవుతూ ఉంది. పిల్లలకు చాలా అభిరుచి ఉండాలి. నషా స్థిరముగా ఉంచుకోవాలి. తమ తోటివారిని మేలుకొలపాలి. గురు మాత అని అంటూ ఉంటారు కూడా. మాత గురువుగా ఎప్పుడు అవుతారు అనేది మీకు తెలుసు. గురువుల పరంపర ఇప్పుడు నడుస్తుంది. మాతలపై తండ్రి వచ్చి జ్ఞానామృత కలశాన్ని పెడతారు. మొదలవ్వడం కూడా ఇలాగే మొదలవుతుంది. సెంటర్ల కోసం కూడా, బ్రాహ్మణి కావాలి అని అంటారు. బాబా అయితే, మీ అంతట మీరు నడిపించండి అని అంటారు. అంత ధైర్యము లేదు బాబా, ఒక మాత కావాలి అని అంటారు. ఇది కూడా మంచిదే, వారికి గౌరవమిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రపంచములో ఒకరికొకరు కుంటి గౌరవాన్ని ఇచ్చుకుంటున్నారు. ఎవరికీ స్థిరమైన గౌరవము లభించడము లేదు. ఈ సమయములో పిల్లలైన మీకు స్థిరమైన రాజ్య భాగ్యము లభిస్తూ ఉంది. తండ్రి మీకు ఎన్ని రకాలుగా అర్థం చేయిస్తారు. స్వయాన్ని సదా హర్షిత ముఖులుగా ఉంచుకునేందుకు తండ్రి చాలా మంచి-మంచి యుక్తులను తెలియజేస్తారు. ఓహో, మేము ఈ లక్ష్మీ-నారాయణులుగా తయారవుతున్నాము అనే శుభ భావన పెట్టుకోవాలి. ఒకవేళ ఎవరి భాగ్యములోనైనా లేకపోతే, ఇక పురుషార్థము ఏం చేస్తారు. బాబా అయితే పురుషార్థము తెలియజేస్తారు, పురుషార్థము ఎప్పుడూ వ్యర్థమవ్వదు. అది సదా సఫలమవుతుంది. రాజధాని స్థాపనైపోతుంది. వినాశనము కూడా మహాభారీ మహాభారత యుద్ధము ద్వారా జరగనున్నది. మున్ముందు మీరు కూడా తీవ్రతను పెంచుతారు, అప్పుడు వారంతా వస్తారు. ప్రస్తుతము అర్థం చేసుకోరు, లేదంటే వారి రాజ్యము సమాప్తమైపోతుంది. మీ వద్ద చాలా మంచి చిత్రాలు ఉన్నాయి. ఇది సద్గతి అనగా సుఖధామము, అది ముక్తిధామము. ఆత్మలమైన మనమంతా నిర్వాణధామములో ఉంటామని బుద్ధి కూడా చెప్తుంది. అక్కడ నుండి తర్వాత టాకీ ధామములోకి వస్తాము. ఆత్మలమైన మనము అక్కడ ఉండేవారము. ఈ ఆటయే భారత్ పై తయారుచేయబడింది. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. తండ్రి అంటారు - నేను వచ్చాను, కల్పము తర్వాత మళ్ళీ వస్తాను. భారత్ యే స్వర్గముగా ఉండేది. క్రైస్టుకు ఇన్ని సంవత్సరాల క్రితం స్వర్గముండేదని అంటారు కూడా. ఇప్పుడు లేదు, మళ్ళీ వస్తుంది. కావున తప్పకుండా నరకవాసుల వినాశనము, స్వర్గవాసుల స్థాపన జరగాలి. మీరు స్వర్గవాసులుగా తయారవుతున్నారు, నరకము వినాశనమైపోతుంది. ఈ వివేకము కూడా ఉండాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ప్రతి ఒక్కరి పట్ల శుభ భావన పెట్టుకోవాలి. అందరికీ సత్యమైన గౌరవాన్ని ఇవ్వాలి. సత్యయుగీ రాజధానిలో ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థము చేయాలి.

2. ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. మానవ మతాన్ని వదిలి ఒక్క శ్రీమతాన్నే అనుసరించాలి. చదువు యొక్క నషాలో ఉండాలి.

వరదానము:-
సర్వాత్మల పతిత సంకల్పాలను మరియు వృత్తులను భస్మము చేసే మాస్టర్ జ్ఞాన సూర్య భవ

ఎలాగైతే సూర్యుడు తన కిరణాలతో చెత్తను మరియు మురికిలోని క్రిములను భస్మము చేస్తాడో, అలా మీరు మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయి ఎటువంటి పతిత ఆత్మనైనా చూసినప్పుడు, వారి పతిత సంకల్పాలు, పతిత వృత్తి మరియు దృష్టి భస్మమైపోతాయి. పతిత-పావని ఆత్మపై పతిత సంకల్పాలు దాడి చేయలేవు. పతితాత్మలు పతిత-పావని అయినవారిపై బలిహారమైపోతారు. దీని కోసం మైట్ హౌస్ అనగా మాస్టర్ జ్ఞాన సూర్యుని స్థితిలో సదా స్థితులై ఉండండి.

స్లోగన్:-
తమ ధారణా స్వరూపముతో యోగీ జీవితము యొక్క ప్రభావాన్ని చూపించడము - ఇది చాలా పెద్ద సేవ.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి

భాగ్యవిధాత అయిన బాబా బ్రహ్మా ద్వారా భాగ్యాన్ని పంచారు అన్న గాయనము ఉంది, కనుక బ్రహ్మా కార్యము ఏదో అదే బ్రాహ్మణుల కార్యము. ప్రపంచములోని వారు బట్టలు పంచుతారు, బియ్యము పంచుతారు, నీటిని పంచుతారు, కానీ శ్రేష్ఠ భాగ్యాన్ని అయితే భాగ్యవిధాత పిల్లలైన మీరే పంచగలరు. ఎవరికైతే భాగ్యము ప్రాప్తిస్తుందో, వారికి అన్నీ ప్రాప్తిస్తాయి, అందుకే భాగ్యాన్ని పంచటములో విశాలహృదయులుగా అవ్వండి.