09-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - సెల్ఫ్ ను (స్వయాన్ని) రియలైజ్ అయ్యేందుకు మీరు ఇక్కడకు వచ్చారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి అయిన పరమాత్మ నుండి వినండి, దేహీ-అభిమానులుగా ఉండే అభ్యాసము చేయండి’’

ప్రశ్న:-
మీరు ఆత్మ సాక్షాత్కారము చేసుకున్నారా అని పిల్లలను కొన్నిసార్లు కొంతమంది ప్రశ్నిస్తారు, అప్పుడు మీరు వారికి ఏమి సమాధానమివ్వాలి?

జవాబు:-
మీరు చెప్పండి - అవును, మేము ఆత్మ సాక్షాత్కారము పొందాము. ఆత్మ జ్యోతిర్బిందువు. ఆత్మలోనే మంచి మరియు చెడు సంస్కారాలు ఉంటాయి. ఆత్మ గురించిన పూర్తి జ్ఞానము ఇప్పుడు మాకు లభించింది. ఆత్మ సాక్షాత్కారము చేసుకోనంత వరకు దేహాభిమానులుగా ఉండేవారము. ఇప్పుడు మాకు పరమాత్ముని ద్వారా గాడ్ రియలైజేషన్ మరియు సెల్ఫ్ రియలైజేషన్ కలిగింది.

పాట:-
వారు మా నుండి దూరమవ్వలేరు...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మిక పిల్లలు శరీరము ద్వారా ఇలా అంటారు. మేము సాధు-సత్పురుషుల కోసం మరణిస్తామని ఎప్పుడూ ఎవరూ అనరు. మేము తండ్రితో పాటు వెళ్ళాలి, ఈ శరీరాన్ని వదిలేయాలి అని పిల్లలకు తెలుసు, అందుకే మేము ఈ శరీరాన్ని వదిలి తండ్రితో పాటు వెళ్తామని అంటారు. తండ్రి తమతో పాటు తీసుకువెళ్ళేందుకే వచ్చారు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయము. మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనముగా చేయండి అని పిల్లలు పిలుస్తారు, మరేమి చేయను. ఇక్కడే వదిలి వెళ్ళిపోను. ఈ ప్రపంచమంతా పతితముగా ఉంది, ఈ పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచానికి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. ఆత్మలైన మనల్ని తమతో పాటు తీసుకువెళ్తారు. ఈ ప్రపంచమంతా వికారీగా ఉంది - ఇది కూడా మీకు తెలుసు. మీరు ఎవరినైనా వికారులు, పతితులు అని అంటే వారు డిస్టర్బ్ అవుతారు. మనుష్యులకు చాలా యుక్తిగా అర్థం చేయించాలి. ఒక్క తండ్రి మహిమనే చేయాలి. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము లభించింది, మీరు చాలా తెలివిగా మాట్లాడాలి. ఎక్కడైనా ఎక్కువగా ప్రశ్నించడము చూసారనుకోండి, వారికి ఇలా చెప్పండి - మేము ఇంకా కచ్చాగా ఉన్నాము, పెద్ద అక్కయ్య వచ్చి మీకు సమాధానము చెప్తారు అని.

శివబాబా అర్థం చేయిస్తారని మీరు అంటారు, భగవానువాచ - మనుష్యులందరూ పతితులుగా ఉన్నారు. భగవంతుడు పతితముగా అవ్వరు. పతితముగా ఉన్న కారణముగా పతిత-పావనుడిని పిలుస్తారు. దేహధారులను భగవంతుడని అనలేరు. భగవంతుడని నిరాకారుడైన శివుడిని అంటారు, శివుని మందిరాలు కూడా చాలా ఉన్నాయి. మొట్టమొదటగా ఒక్క విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే నిలవగలరు. మొట్టమొదట, శివ భగవానువాచ - నన్నొక్కరినే స్మృతి చేయండి అని శివబాబా చెప్తున్నారని వారికి చెప్పండి. వారికి తమదంటూ శరీరము లేదు. బ్రహ్మా-విష్ణు-శంకరులకు కూడా తమ-తమ సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. వాళ్ళు కనిపిస్తారు. వీరైతే కనిపించరు. వీరిని పరమపిత పరమాత్మ అని అంటారు. నేను ఆత్మను, ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరము తీసుకుంటానని మీరు కూడా అంటారు. మీరు మీ ఆత్మ సాక్షాత్కారాన్ని చేసుకున్నారు. భక్తి మార్గములో సాక్షాత్కారము కోసం నవ విధ భక్తిని చేస్తారు. కానీ భక్తి చేసేవారు ఎప్పుడూ సాక్షాత్కారాన్ని పొందలేదు. భగవంతుడు ఎవరు అనేది వారికి అసలు తెలియదు. కేవలం వారు నిరాకారుడని అంటారు. ఆత్మే మాట్లాడుతుంది. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. ఆత్మ వెళ్ళిపోతే, ఆత్మ గాని, శరీరము గాని మాట్లాడలేవు. ఆత్మ లేకుండా శరీరము ఏమీ చేయలేదు. ముందు ఆత్మను గుర్తించాలి మరియు తండ్రి ద్వారానే తండ్రిని గుర్తించగలరు. ఆత్మ స్వయాన్నే తెలుసుకోలేనప్పుడు, స్వయాన్నే చూడలేనప్పుడు, ఆత్మకు పరమపిత పరమాత్ముని సాక్షాత్కారము ఎలా జరుగుతుంది. ‘‘ఒక అద్భుతమైన నక్షత్రము మెరుస్తుంది’’ అని అంటారు, కానీ ఆత్మలో 84 జన్మల పాత్ర ఇమిడి ఉందని ఎవరికీ తెలియదు. మనుష్యులు పూర్తిగా దేహాభిమానులుగా ఉంటారు. ఇప్పుడు తండ్రి అంటారు, దేహీ-అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి, అప్పుడు నా ద్వారా వినండి. వినేది ఆత్మ, ఆత్మకు వినిపించేందుకు పరమాత్మ కావాలి. మనుష్యులకు అర్థం చేయించేవారు మనుష్యులే అయ్యి ఉంటారు. ఈ ఆత్మ జ్ఞానము ఎవరికీ లేదు, అందుకే ముందు ఆత్మను తెలుసుకోండి, సెల్ఫ్ ను రియలైజ్ అవ్వండి అని అంటారు. నేను ఆత్మను ఎలా రియలైజ్ అవ్వాలి అని స్వయంగా ఆత్మనే అడుగుతుంది. మన ఆత్మలో మొత్తము పాత్ర అంతా ఎలా నిండి ఉంది అనేది ఎవరికీ తెలియదు. సాధువులు-సన్యాసులు మొదలైనవారెవరూ చెప్పలేరు. తండ్రియే వచ్చి పిల్లలను సెల్ఫ్ ను రియలైజ్ అయ్యేలా చేయవలసి ఉంటుంది. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నిరాకార పరమపిత పరమాత్మ అయిన నా ద్వారా వినండి. ఆత్మ మరియు పరమాత్మ కలుసుకున్నప్పుడే ఈ సంభాషణ జరగగలదు. పరమపిత పరమాత్మ ఎప్పుడు వస్తారు, ఎలా వచ్చి అర్థం చేయిస్తారు అనేది ప్రపంచానికి తెలియదు. తెలియని కారణముగా అభిప్రాయ బేధాలలోకి వస్తారు. వారిదంతా శాస్త్రాలపై ఆధారపడి ఉంది. తండ్రి అంటారు, వాటి ద్వారా మీరు నన్ను రియలైజ్ అవ్వలేరు, అలానే తమను తాము రియలైజ్ అవ్వలేరు. వారు ఆత్మనే పరమాత్మ అని అంటారు. అలా అనడం వలన ఏమి జరుగుతుంది? మనల్ని పతితుల నుండి పావనముగా ఎవరు తయారుచేస్తారు? త్రికాలదర్శులుగా ఎవరు తయారుచేస్తారు? ఆత్మ మరియు పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఎవరూ ఇవ్వలేరు, కావుననే ఏ ఆత్మలకైతే తమ తండ్రి గురించి తెలియదో, వారు నాస్తికులని మీరంటారు. కానీ వారేమో, ఎవరైతే భక్తి చేయరో, వారిని నాస్తికులని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు భక్తి చేయరు. మీ వద్ద చాలా మంచి చిత్రాలు ఉన్నాయి. చిత్రాల ద్వారానే అర్థం చేయించడము జరుగుతుంది. ఎవరైతే ప్రపంచ పటాన్ని చూసి ఉండరో, వారికి లండన్ ఎక్కడ ఉంటుందో, అమెరికా ఎక్కడ ఉంటుందో ఎలా తెలుస్తుంది. ఎప్పటివరకైతే టీచరు కూర్చుని ఆ పటం చూపించి అర్థం చేయించరో, అప్పటివరకు తెలియదు, అందుకే మీరు ఈ చిత్రాలను తయారుచేసారు, కానీ డీటైల్ గా ఎవరూ అర్థం చేసుకోలేరు. సూర్యవంశీయులు ఈ రాజధానిని ఎక్కడ నుండి తీసుకున్నారు? తర్వాత చంద్రవంశీయులు ఎలా తీసుకున్నారు? వారు సూర్యవంశీయులతో యుద్ధమేమైనా చేసారా? అందరికీ ఒక్క తండ్రి నుండే వారసత్వము లభిస్తుందని మీరు అర్థం చేసుకుంటారు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు అయితే విశ్వానికి యజమానులు. వేరే ధర్మమేదీ ఉండదు, అందుకే యుద్ధము యొక్క మాటే ఉండదు. మేము విశ్వానికి యజమానులుగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. సూర్యవంశీయులపై చంద్రవంశీయులు గెలుపొందారని లేదా యుద్ధము జరిగిందని కాదు. అలా జరగదు, అవి వేరు-వేరు వంశాలు.

ఇప్పుడు మీ బుద్ధిలో ఈ చిత్రాలకు సంబంధించిన జ్ఞానమంతా ఉంది. స్కూల్లో కూడా స్టూడెంట్ చదువుకుంటున్నప్పుడు, వారి బుద్ధిలోకి జ్ఞానమంతా వచ్చేస్తుంది. చిన్న పిల్లలకు - ఇది ఏనుగు, ఇది ఫలానా అని పుస్తకములో చూపించడము జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ డ్రామాను తెలుసుకున్నారు. ఈ మొత్తము చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. ఇవన్నీ కొత్త విషయాలు మరియు ఈ విషయాలను బ్రాహ్మణ కులం వారే అర్థం చేసుకుంటారు. ఇతరులు కూర్చుని అనవసరమైన వాదన చేస్తారు. అలాగని, అందరికీ ఒకేసారి అర్థం చేయించవచ్చు అని కూడా కాదు. వేరు-వేరుగా అర్థం చేయించాల్సి ఉంటుంది. ముందు తండ్రిని, ఆత్మను అర్థం చేసుకుని, తర్వాత క్లాసులో కూర్చోవాలి అన్న నియమము కూడా ఉంది, అప్పుడే అర్థమవుతుంది లేకపోతే అసలేమీ అర్థం చేసుకోలేరు. సంశయాలు కలుగుతూనే ఉంటాయి. భగవంతుడు ఒక్కరే, వారు ఉన్నతోన్నతమైనవారు అని మీరు అర్థం చేయించాలి. దేవతలను కూడా భగవంతుడని అనలేరు. ఆత్మ జ్ఞానము కూడా ఇప్పుడు మీకు లభించింది. కర్మ ఫలాన్ని ఆత్మనే అనుభవిస్తుంది. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా వింటుంది. భగవంతుడైన తండ్రి ఒక్కరే, వారసత్వము వారి నుండి లభిస్తుంది. మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుని తండ్రితో బుద్ధియోగాన్ని జోడించండి అని బాబా అర్థం చేయించారు. జన్మ-జన్మలుగా భక్తి చేస్తూ వచ్చారు. హనుమంతుని పూజారులైతే హనుమంతుడిని స్మృతి చేస్తారు మరియు శ్రీకృష్ణుని పూజారులైతే శ్రీకృష్ణుడిని స్మృతి చేస్తారు. మీరు ఆత్మ, పరమాత్మ మీ పరమపిత, వారిని స్మృతి చేయడము ద్వారానే తండ్రి వారసత్వము లభిస్తుంది అని ఇప్పుడు మీకు అర్థం చేయించడము జరుగుతుంది. ఆ తండ్రి స్వర్గ రచయిత కావున తప్పకుండా మనము స్వర్గములో ఉండాలి. భారత్ స్వర్గముగా ఉండేది. రాజ్యాధికారము ఉండడానికి ఇప్పుడు స్వర్గము లేదు. నరకములోనైతే రావణుడి రాజ్యముంది. మన రాజధాని ఎలా నడిచింది, తర్వాత ఎలా కిందకు దిగిపోయాము అనేది ఏమీ తెలియదు. పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ మనము కిందకు దిగాల్సిందేనని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అవుతారు, స్వర్గ వారసత్వము లభిస్తుంది. మనము తండ్రికి చెందినవారిగా అయినట్లయితే తండ్రి వారసత్వము లభిస్తుంది. కానీ ఎప్పటివరకైతే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వరో, యోగము ద్వారా పావనముగా అవ్వరో, అప్పటివరకు వారసత్వము లభించదు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయడముతో మీ వికర్మలు వినాశనమవుతాయి, వికర్మాజీతులుగా అవుతారు, ఇది గ్యారెంటీ. వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు తీక్షణ బుద్ధి కలవారు ఉంటే గొడవ చేయడము మొదలుపెడతారు. విఘ్నాలు వేసేవారు ఎవరో ఒకరు ఉంటారు. ఎవరైనా హంగామా చేసినట్లయితే, ఏకాంతములో వచ్చి అర్థం చేసుకోండి అని చెప్పాలి. 7 రోజుల భట్టీలో ఉంటూ అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడి నియమము, ఎందుకంటే ఈ జ్ఞానము కొత్తది అయిన కారణముగా మనుష్యులు తికమకపడతారు. ఏదైనా కొత్త సెంటరు తెరిచినప్పుడు, అందరికీ అర్థం చేయించగలిగే చురుకైనవారెవరైనా అక్కడ ఉండాలి. భగవంతుడు అందరికీ ఒక్కరే, ఆత్మలందరూ పరస్పరములో సోదరులు. పరమాత్మ అందరికీ తండ్రి. పతిత-పావనా రండి, అని పిలుస్తున్నారంటే తప్పకుండా వారు పావనమైనవారు, వారు ఎప్పుడూ పతితముగా అవ్వరు. తండ్రియే వచ్చి పతితులను పావనముగా చేస్తారు. సత్యయుగములో అందరూ పావనమైనవారు. కలియుగములో అందరూ పతితమైనవారు. పతితులు చాలామంది ఉంటారు, పావనులు కొద్దిమందే ఉంటారు. సత్యయుగములోకైతే అందరూ వెళ్ళరు. ఎవరైతే పతితుల నుండి పావనముగా అవుతారో, వారే పావన ప్రపంచములోకి వెళ్తారు. మిగిలినవారంతా నిర్వాణ ప్రపంచములోకి వెళ్ళిపోతారు. మొత్తం ప్రపంచమంతా వచ్చి మతాన్ని తీసుకోరని కూడా తెలుసు. మీరు మొత్తం ప్రపంచానికి మతాన్ని ఇవ్వడమనేది కష్టము. ఇప్పుడిది అందరికీ వినాశన సమయము. అందరి వినాశనము జరగనున్నది. వారు శాంతిగా కూర్చుని వినాలి, డిస్టర్బెన్స్ చేయకూడదు అంటే ఇదంతా అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తి కావాలి. మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. శివబాబాయే పతిత-పావనుడు, వారే అర్థం చేయిస్తారు. గీతలో కూడా ఈ మాట ప్రసిద్ధమైనది, అదేమిటంటే - నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని పతిత-పావనుడైన తండ్రియే చెప్తారు. ఈ పదాలు గీతతో సంబంధించినవి. శివబాబా అంటారు - నన్ను స్మృతి చేయండి, నేను సర్వశక్తివంతుడిని, పతిత-పావనుడిని, గీతా జ్ఞాన దాతను, జ్ఞానసాగరుడిని. ఇవి గీతలోని పదాలు కదా. వారు కేవలం శ్రీకృష్ణ భగవానువాచ అని అంటారు, మీరు శివ భగవానువాచ అని అంటారు. భగవంతుడు నిరాకారుడు, వారెప్పుడూ పునర్జన్మల్లోకి రారు, వారు అలౌకికమైన, దివ్యమైన జన్మను తీసుకుంటారు. నేను సాధారణ వృద్ధ తనువులోకి వస్తాను, అతడిని భగీరథుడు అని అంటారని బాబా స్వయంగా అర్థం చేయిస్తారు. బ్రహ్మా ద్వారానే రచనను రచిస్తారు. కావున మనిషి పేరును బ్రహ్మా అని పెట్టడము జరుగుతుంది. వ్యక్త బ్రహ్మా నుండి తర్వాత పావనమైన అవ్యక్త ఫరిశ్తాగా అవుతారు. పతితులను పావనముగా చేసేందుకే తండ్రి వస్తారు. కావున తప్పకుండా పతిత ప్రపంచములోకి, పతిత శరీరములోకి వస్తారు. ఇది విస్తారమైన వివరణ. కల్ప క్రితం వలె నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని భగవంతుడు అంటున్నారని మొట్టమొదట అర్థం చేయించాలి. పతితుల నుండి పావనముగా అవ్వండి. ఓ పతిత-పావనా రండి, అని పాడుతారు కూడా. గంగ అయితే ఎలాగూ ఉంది. మీరు పిలుస్తున్నారంటే తప్పకుండా ఎక్కడో ఒకచోట నుండి వస్తారు. పతితులను పావనముగా తయారుచేసే పాత్రను అభినయించేందుకు పతిత-పావనుడు వస్తారు. తండ్రి అంటారు - మీరు పావనముగా ఉండేవారు, ఆ తర్వాత మీలో మాలిన్యము చేరుకుంది, అది యోగబలము ద్వారానే తొలగుతుంది. మీరు పవిత్రముగా అయినట్లయితే పావన ప్రపంచములోకే వస్తారు. పతిత ప్రపంచము వినాశనమైపోతుంది. ఏదైతే అర్థం చేయించడము జరుగుతుందో, దానిని మంచి రీతిలో ధారణ చేయాలి. మనము కేవలం ఉన్నతోన్నతుడైన తండ్రి మహిమను చేస్తాము. అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు 84 జన్మల పాత్రను అభినయిస్తూ- అభినయిస్తూ ఎంత పతితముగా అయ్యారు. ముందు పావనముగా ఉండేవారు, ఇప్పుడు పతితముగా అయ్యారు. మళ్ళీ స్మృతియాత్రలో ఉండడము ద్వారా మీరు పావనముగా అవుతారు. భక్తి మార్గము నుండి మీరు మెట్లు దిగుతూనే వచ్చారు. ఇది చాలా సహజమైన విషయము. ఇది పిల్లల బుద్ధిలో కూర్చోవాలి. ఉదయాన్నే లేచి విచార సాగర మంథనము చేయాలి, తర్వాత ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించాలి. మురళీలోని ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకుని, మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. అప్పుడు మనసులో పక్కాగా నిలిచిపోతాయి.

మొట్టమొదటి ముఖ్యమైన విషయము - తండ్రిని స్మృతి చేయడము. మన్మనాభవ, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని తండ్రియే అంటారు. ఇప్పుడు చేస్తారా, చేయరా ఇక మీ ఇష్టం. తండ్రి ఆజ్ఞ అయితే లభించింది. పావన ప్రపంచములోకి వెళ్ళాలంటే ఇక పతిత ప్రపంచము వైపు మీ బుద్ధియోగము వెళ్ళకూడదు. వికారాల్లోకి వెళ్ళకూడదు. వివరణ అయితే చాలానే లభిస్తూ ఉంటుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఉదయాన్నే లేచి విచార సాగర మంథనము చేయాలి. తండ్రి ఏదైతే వినిపిస్తారో, దానిని నోట్ చేసుకుని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి, ఇతరులకు వినిపించాలి. అందరికీ మొట్టమొదటగా తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి.

2. పావన ప్రపంచములోకి వెళ్ళేందుకు ఈ పతిత ప్రపంచము నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి.

వరదానము:-
నంబరువన్ బిజినెస్ మ్యాన్ గా అయి ఒక్కొక్క సెకండులో మరియు సంకల్పములో సంపాదనను జమ చేసుకునే పదమపతి భవ

ఎవరికైతే స్వయాన్ని బిజీ పెట్టుకునే విధానము తెలుసో, వారే నంబరువన్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అనగా వారి ఒక్క సంకల్పము కూడా వ్యర్థముగా పోకూడదు, ప్రతి సంకల్పములో సంపాదన ఉండాలి. ఎలాగైతే ఆ వ్యాపారస్థులు ఒకొక్క పైసాను కార్యములో ఉపయోగించి పదమాల రెట్లుగా చేస్తారో, అదే విధముగా మీరు కూడా ఒక్కొక్క సెకండులో మరియు సంకల్పములో సంపాదన చేసి చూపించండి, అప్పుడు పదమపతులుగా అవుతారు. దీనితో బుద్ధి భ్రమించడము ఆగిపోతుంది మరియు వ్యర్థ సంకల్పాల ఫిర్యాదు కూడా సమాప్తమైపోతుంది.

స్లోగన్:-
ఎవరైతే యాచిస్తారో, వారు సంతోషమనే ఖజానాతో సంపన్నము కాలేరు.

అవ్యక్త ప్రేరణలు - ‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చెయ్యండి’’

సదా మాస్టర్ సర్వశక్తివాన్ అనే సీట్ పై సెట్ అయ్యి ఉండేవారే అచంచలముగా, స్థిరముగా ఉంటారు. బాప్ దాదా అంటారు - పిల్లలూ, శరీరము పోయినా కానీ మీ సంతోషము పోకూడదు. ధనమైతే దాని ముందు అసలేమీ కాదు. ఎవరి వద్దనైతే సంతోషమనే ఖజానా ఉంటుందో, వారికి ఏదీ పెద్ద విషయముగా అనిపించదు మరియు సదా సహయోగీ సేవాధారీ పిల్లలతో బాప్ దాదా ఉంటారు, అందుకే భయపడే విషయమేదీ లేదు.