09-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - వృక్షపతి అయిన తండ్రి పిల్లలైన మీపై బృహస్పతి దశను కూర్చోబెట్టారు, ఇప్పుడు మీరు అవినాశీ సుఖము యొక్క ప్రపంచములోకి వెళ్తున్నారు’’

ప్రశ్న:-
అవినాశీ బృహస్పతి దశ ఏ పిల్లలపై కూర్చుంటుంది, వారి గుర్తులు ఏమిటి?

జవాబు:-
ఏ పిల్లలైతే జీవిస్తూనే దేహపు సర్వ సంబంధాలను త్యజించి స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుంటారో, అటువంటి నిశ్చయము ఉన్న ఆత్మిక బుద్ధి కల పిల్లలపై బృహస్పతి దశ కూర్చుంటుంది. అతీంద్రియ సుఖము గురించి గోప-గోపికలను అడగండి అని వారి సుఖము గురించే గాయనముంది. వారి సంతోషము ఎప్పుడూ కూడా మాయమవ్వలేదు.

పాట:-
ఓం నమః శివాయ...

ఓంశాంతి
పిల్లలు తండ్రి మహిమను విన్నారు. ఈ రోజును వృక్షపతి రోజు అని అంటారు, దీనినే బృహస్పతి రోజు అని కూడా అంటారు. దీనినే గురువారమని కూడా అంటారు. కేవలం గురువారము కాదు, ఇది సద్గురువారము. దీనిని బెంగాల్ లో చాలా నమ్ముతారు. మనుష్య సృష్టికి బీజరూపుడని అంటూ ఉంటారు, అందుకే వారిని వృక్షపతి అని అంటారు. వారు బీజము కూడా మరియు నాథుడు కూడా. వృక్షము యొక్క బీజాన్ని తండ్రి అని కూడా అంటారు. వారి నుండి వృక్షము ఉత్పన్నమవుతుంది. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షము. దీని బీజము పైన ఉన్నారు. పిల్లలైన మనపై ఇప్పుడు అవినాశీ వృక్షపతి దశ ఉందని మీకు తెలుసు ఎందుకంటే అవినాశీ స్వరాజ్యము లభిస్తూ ఉంది. సత్యయుగాన్ని అవినాశీ సుఖధామమని అంటారు. కలియుగాన్ని వినాశీ దుఃఖధామమని అంటారు. ఇప్పుడు దుఃఖధామము వినాశనము అవ్వనున్నది. సుఖధామము అవినాశీ, అది అర్ధకల్పము నడుస్తుంది, దానిని అవినాశీ వృక్షపతి స్థాపన చేస్తున్నారు. ప్రదర్శనీలో ముఖ్యముగా ఈ-ఈ పాయింట్లు అర్థం చేయించాలని సేవ కోసం పిల్లలు పాయింట్లు నోట్ చేసుకోవాలి ఎందుకంటే మనుష్యులకైతే ఏమీ తెలియదు. వాస్తవానికి ఇది జ్ఞానము. ఇప్పుడు కొత్త ప్రపంచానికి మరియు పాత ప్రపంచానికి మధ్యలో తండ్రి ఈ జ్ఞానాన్ని ఇస్తారు, తర్వాత ఇది కనుమరుగైపోతుంది. దేవతలకు ఈ జ్ఞానము ఉండదు. ఒకవేళ వారికి ఈ చక్రము యొక్క జ్ఞానము ఉన్నట్లయితే, ఇక వారికి రాజ్యము యొక్క ఆనందము ఉండదు. ఇప్పుడు కూడా మీకు ఆలోచన వస్తుంటుంది కదా - రాజ్యము తీసుకున్న తర్వాత మళ్ళీ మా పరిస్థితి ఇలా అయిపోతుందా అని. కానీ డ్రామా ఇలా తయారై ఉంది. చక్రమైతే తిరగాల్సిందే. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతున్నాయి. ఎలా రిపీట్ అవుతున్నాయి - ఇది పిల్లలైన మీకు తెలుసు. ఇది మనుష్య సృష్టి. మీ బుద్ధిలో మూలవతనము యొక్క వృక్షము కూడా ఉంది. సెక్షన్లు అందరివీ వేరు-వేరుగా ఉంటాయి. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ ఎప్పుడూ ఉండవు. ఇవి ఏ శాస్త్రాలలోనూ వ్రాసి లేవు. ఆత్మలమైన మనము వాస్తవానికి శాంతిధామ నివాసులము, అవినాశీ అయినవారము, మనము ఎప్పటికీ వినాశనము చెందము. నీటి బుడగలు నీటి నుండి వెలువడి మళ్ళీ నీటిలోనే కలిసిపోతాయని వారు భావిస్తారు. మీ బుద్ధిలో మొత్తము రహస్యమంతా ఉంది. ఆత్మ అవినాశీ, ఆత్మలో పాత్ర అంతా నిశ్చితమై ఉంది. అక్కడక్కడ స్వస్తిక్ ను చూపిస్తారు కానీ ఈ చక్రము గురించిన జ్ఞానము ఏ శాస్త్రాలలోనూ లేదు. చక్రానికి సంబంధించి కొన్ని గీతలు గీస్తారు, దీని ద్వారా అనేక ధర్మాలుండేవని నిరూపించబడుతుంది. తండ్రి అర్థం చేయించారు - ముఖ్యమైన ధర్మాలు మరియు శాస్త్రాలు 4, సత్య-త్రేతాయుగాలలోనైతే ఏ ధర్మ స్థాపన జరగదు, అలాగే అక్కడ ఏ ధర్మ శాస్త్రాలు ఉండవు. ఇవన్నీ ద్వాపరము నుండి మొదలవుతాయి. ఆ తర్వాత ఎంత వృద్ధి జరుగుతుందో చూడండి. అచ్ఛా - గీత ఎప్పుడు వినిపించడము జరిగింది? తండ్రి అంటారు - నేను కల్పము యొక్క సంగమయుగములోనే వస్తాను. వారేమో కల్పము అన్న పదాన్ని తొలగించి కేవలం సంగమయుగే-యుగే అని వ్రాసేసారు. వాస్తవానికి సంగమయుగములో ఇంకెవ్వరూ ధర్మ స్థాపన చేయరు. త్రేతా అంతిమము మరియు ద్వాపరయుగ ఆది యొక్క సంగమములో ఇస్లామ్ ధర్మము యొక్క స్థాపన జరిగిందని కాదు. ద్వాపరయుగములో ఇస్లామ్ ధర్మము యొక్క స్థాపన జరిగిందని అంటారు. ఇది సంగమము యొక్క మనోహరమైన సమయము, దీనిని కుంభమేళా అని అంటారు. కుంభ్ అని సంగమాన్ని అంటారు. ఇది ఆత్మలు మరియు పరమాత్మల మిలనము యొక్క సంగమము. ఈ ఆత్మిక మేళా సంగమములోనే జరుగుతుంది. వారు నీటి గంగ యొక్క పేరును ప్రఖ్యాతము చేసారు. వారికి జ్ఞానసాగరుడు, పతిత-పావనుడి గురించి తెలియనే తెలియదు. వారు ఏ విధముగా పతిత ప్రపంచాన్ని పావనముగా తయారుచేసారు అనేది ఏ శాస్త్రాలలోనూ లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి చెప్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేయండి, దేహపు సర్వ ధర్మాలను త్యజించండి. ఇలా ఎవరికి చెప్తున్నారు? ఆత్మలకు. దీనినే జీవిస్తూ మరణించడమని అంటారు. మనుష్యులు శరీరము వదిలినప్పుడు దేహపు సంబంధాలన్నీ దూరమైపోతాయి.

తండ్రి అంటారు - దేహము యొక్క సంబంధాలేవైతే ఉన్నాయో, వాటన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి. నిశ్చయము ఉన్న ఆత్మిక బుద్ధి కలవారిగా అవ్వండి. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో, అంతగా బృహస్పతి దశ ఉంటుంది. మేము శివబాబాను ఎంత స్మృతి చేస్తున్నాము అనేది చెక్ చేసుకోండి! స్మృతి ద్వారానే తుప్పు వదులుతూ ఉంటుంది మరియు మీకు సంతోషము కలుగుతుంది. ఆత్మలమైన మనము తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాము అనేది మీరు రియలైజ్ అవ్వగలరు. ఒకవేళ తక్కువగా స్మృతి చేసినట్లయితే, తుప్పు కూడా తక్కువగా వదులుతుంది, సంతోషము కూడా తక్కువగా ఉంటుంది, పదవి కూడా తక్కువదే పొందుతారు. ఆత్మయే సతో, రజో, తమోగా అవుతుంది. గోప-గోపికల అతీంద్రియ సుఖము గురించిన గాయనము ఈ సమయానికి సంబంధించినదే. తండ్రి తప్ప ఇంకేదీ గుర్తుకు రానప్పుడే సంతోషపు పాదరసము పైకి ఎక్కుతుంది. మనపై బృహస్పతి దశ మరియు సద్గురువు యొక్క దశ ఉంది. మళ్ళీ ఎప్పుడైనా సంతోషము మాయమైతే, బృహస్పతి దశ మారి రాహు దశ కూర్చుందని అంటారు. కొందరు చాలా షావుకారులుగా ఉంటారు, కానీ ఒకవేళ ఏవైనా పందేలు కాస్తే చివరికి దివాలా తీయవచ్చు. భారత్ లోనే గ్రహణము పట్టినప్పుడు, దానమిచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుందని అంటారు. మీ దేవీ-దేవతా ధర్మము కూడా 16 కళల సంపూర్ణముగా ఉండేది, ఇప్పుడు దానికి గ్రహణము పట్టి ఉంది. రాహు దశ కూర్చుంటుంది, అందుకే దేవతల ఎదురుగా వెళ్ళి - మీరు సర్వ గుణ సంపన్నులు... మేము పాపులము, కపటులము అని పాడుతారు. రాహు గ్రహణము పట్టడముతో అందరూ నల్లగా అయిపోయారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. చంద్రునిలో చివరికి ఒక రేఖ (నెలవంక) మిగిలి ఉంటుంది. తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు, దేవీ-దేవతలైన మీ చిత్రాలు కూడా ఉన్నాయి. గీతయే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క శాస్త్రము. కానీ వారికి తమ ధర్మము గురించి తెలియదు. రిలీజియస్ హెడ్స్ యొక్క కాన్ఫరెన్స్ లు (ధర్మనేతల సమ్మేళనాలు) ఏర్పాటు చేస్తుంటారు. మీరు అక్కడ కూడా ఇలా అర్థం చేయించవచ్చు - ఈశ్వరుడైతే సర్వవ్యాపి కారు, వారు అనంతమైన తండ్రి, వారు వచ్చి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు అని. సాధు-సత్పురుషులు మొదలైనవారికైతే వారసత్వము లభించదు కావున వారెలా నమ్ముతారు! పిల్లలైన మీకు మాత్రమే వారసత్వము లభిస్తుంది. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అన్నదే ముఖ్యముగా నిరూపించాల్సిన విషయము. శివజయంతి జరుగుతుంది. శివజయంతి అనండి లేక రుద్ర జయంతి అనండి - రుద్రుడు ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు. వారే శివుడు. ఇదే గీతా జ్ఞాన యజ్ఞము, దీని ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితమైంది. నిరాకార తండ్రి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని ఎలా రచించారు అనేది ప్రాక్టికల్ గా మీరు చూస్తారు. సాకారుడైతే ఏమీ చేయలేరు. ఇది అనంతమైన యజ్ఞము, ఇందులో పాత ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది. మిగిలినవన్నీ భౌతిక యజ్ఞాలు. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. తండ్రి అంటారు - ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము, వినాశనము కూడా జరగనున్నది. మీరు పాస్ అయినప్పుడు, పూర్తి యోగులుగా మరియు జ్ఞానులుగా అయినప్పుడు, మీ కోసం కొత్త ప్రపంచమైన స్వర్గము కావాలి. నరకము తప్పకుండా వినాశనమవ్వాలి. రాజస్వ అశ్వమేధ అన్న పదము కూడా సరిగ్గా ఉంది. వారు గుర్రాన్ని స్వాహా చేస్తారు. వాస్తవానికి ఇది మీ రథము. దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని కూడా రచిస్తారు, వారికి సంబంధించిన కథ కూడా ఉంది.

మమ్మల్ని వృక్షపతి అయిన తండ్రి చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి. మాపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది, మా అవస్థ చాలా బాగుంది అని అంటారు. తర్వాత నడుస్తూ-నడుస్తూ ఇలా వ్రాస్తారు - బాబా, మేమైతే తికమకలో పడ్డాము, ఇదివరకు మేము చాలా సంతోషముగా ఉండేవారము, ఇప్పుడు ఏమైందో తెలియడము లేదు అని. ఇక్కడకు వచ్చి తండ్రికి చెందినవారిగా అవ్వడము అనేది పెద్ద యాత్ర. అక్కడ తీర్థ యాత్రలకు వెళ్ళినప్పుడు ఎంత ధనాన్ని ఖర్చు చేస్తారు. ఇప్పుడు, ఇక్కడైతే దానము చేసే విషయమేమీ లేదు. ఇక్కడ ధనమేమీ ఖర్చు చేయాల్సిన పని లేదు. అవి దైహిక యాత్రలు, మీది ఆత్మిక యాత్ర. దైహిక యాత్రలతో లాభమేమీ లేదు. నలువైపులా తిరిగి వచ్చాము కానీ జన్మ-జన్మల నుండి దూరముగా ఉన్నామని పాటలో కూడా ఉంది కదా. మనము ఎన్ని యాత్రలు చేసి ఉండవచ్చు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మనుష్యులు తప్పకుండా ఏదో ఒక చోటుకు వెళ్తూ ఉంటారు. హరిద్వార్ లో గంగ వద్దకు తప్పకుండా వెళ్తారు. గంగను పతిత-పావనిగా భావిస్తారు కదా. ఇప్పుడు వాస్తవానికి మీరు సత్యాతి-సత్యమైన జ్ఞాన గంగలు. మీ వద్దకు కూడా చాలా మంది వచ్చి జ్ఞాన స్నానము చేస్తారు. బాబా అర్థం చేయించారు - సద్గురువు ఒక్కరే. సర్వుల సద్గతిదాత ఒక్క సద్గురువు తప్ప ఇంకే గురువు కాదు. తండ్రి అంటారు - నేను కల్ప-కల్పము సంగమయుగములో వచ్చి మీకు సద్గతినిచ్చి మిమ్మల్ని పూజారుల నుండి పూజ్యులుగా చేస్తాను. తర్వాత మీరు పూజారులుగా అయ్యి దుఃఖితులుగా అయిపోతారు. ఇది కూడా ఇప్పుడే మీకు తెలిసింది. తప్పకుండా అర్ధకల్పము మన రాజ్యము నడుస్తుంది, తర్వాత ద్వాపరములో దేవీ-దేవతలైన మనమే వామ మార్గములోకి వెళ్ళిపోతాము. రావణ రాజ్యము మొదలైనప్పటి నుండి వామ మార్గము మొదలవుతుంది. దాని గుర్తులు కూడా ఉన్నాయి. జగన్నాథుని మందిరానికి వెళ్ళినట్లయితే, లోపల నల్లని మూర్తి ఉంటుంది. బయట దేవతలకు సంబంధించిన అశుద్ధమైన చిత్రాలు ఉన్నాయి. ఆ సమయములో వాటి అర్థం మనకు కూడా తెలిసేది కాదు. వికారీ మనుష్యులు వికారీ దృష్టితో చూస్తారు కావున దేవతలు కూడా వికారులేనని అనుకున్నారు. దేవతలు వామ మార్గములోకి వెళ్తారని వ్రాయబడి ఉంది. వస్త్రాలు కూడా దేవతలవే చూపించారు. ఇక్కడ కూడా దిల్వాడా మందిరానికి వెళ్ళినట్లయితే పైన స్వర్గము ఉంది, కింద తపస్యలో కూర్చుని ఉన్నారు. ఈ రహస్యాలన్నింటి గురించి ఇంకెవరికీ తెలియదు. బాబాదైతే అనుభవీ రథము కదా.

ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అందరికన్నా ముందు దూరమైన మీరే మళ్ళీ ముందు వచ్చి నన్ను కలుసుకుంటారు. సత్యయుగము యొక్క మొదటి రాకుమారుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడికి తండ్రి కూడా ఉంటారు కదా. శ్రీకృష్ణుడి తల్లిదండ్రుల గురించి అంతగా ఏమీ చూపించరు. తండ్రి వారిని తలపై పెట్టుకుని నదిని దాటి తీసుకువెళ్ళినట్లుగా మాత్రమే చూపిస్తారు. రాజ్యము మొదలైనవేవీ చూపించలేదు. వారి తండ్రి మహిమ ఎందుకని లేదు! ఇప్పుడు మీకు తెలుసు - ఈ సమయములో శ్రీకృష్ణుని ఆత్మ చాలా బాగా చదువుకున్నారు, దాని కారణముగా వారి తల్లి-తండ్రి కన్నా కూడా ఉన్నతమైన పదవిని పొందారు. మనము శ్రీకృష్ణుని రాజధానిలో ఉండేవారమని మీరు భావిస్తారు, మనము స్వర్గములోనైతే ఉండేవారము కదా. ఆ తర్వాత మనము చంద్రవంశీయులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ సూర్యవంశీయులుగా అయ్యేందుకు శ్రీమతముపై నడుస్తూ పావనముగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతాము. ప్రతి ఒక్కరూ తమ అవస్థను చూసుకోగలరు. ఒకవేళ ఈ సమయములో నేను శరీరాన్ని వదిలేస్తే ఏ గతిని పొందుతాను - ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి. మనుష్యులకు ఏవైనా ఆపదలు వచ్చినప్పుడు లేక దుఃఖము కలిగినప్పుడు లేక దివాలా తీసినప్పుడు వారు వెళ్ళి సాధువులతో సాంగత్యము చేస్తారు. ఈ సాధువులు భక్తుల వంటివారు, వీరు మోసం చేయరు అని భావిస్తారు. కానీ అలాంటివారు కూడా 2-4 సంవత్సరాలలో చాలా ధనవంతులుగా అయిపోతారు. వారు దాచిపెట్టుకున్న ధనము చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. మీలో కూడా చాలా తక్కువగా స్మృతి చేసేవారు చాలామంది ఉన్నారు, అందుకే బాబా అంటారు - మీరు మీ కళ్యాణాన్ని కోరుకున్నట్లయితే మీ వద్ద నోట్ బుక్ పెట్టుకోండి. మేము రోజంతటిలో ఎంత సమయము స్మృతిలో ఉన్నాము అని చార్టు నోట్ చేసుకోండి. మనుష్యులైతే పూర్తి జీవితము యొక్క చరిత్రను కూడా వ్రాస్తారు. మీరైతే కేవలం స్మృతి చార్టును వ్రాయాలి, దీనితో మీ ఉన్నతే జరుగుతుంది. బాబాను స్మృతి చేయకపోతే ఉన్నత పదవిని పొందలేరు. వికర్మలే వినాశనము కాకపోతే ఇక ఉన్నత పదవిని ఎలా పొందుతారు. అప్పుడు శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఎవరైతే శిక్షలు అనుభవించరో, వారికి మంచి పదవి లభిస్తుంది. శిక్షలు అనుభవించిన తర్వాత ఎంతో కొంత పదవిని పొందితే ఏమి లాభము. ధర్మరాజు శిక్షలను అనుభవించకూడదు, గౌరవము పోకూడదు - ఈ పురుషార్థము చేయాలి. శివబాబా కూర్చుని ఉంటారు, వారితో పాటు ధర్మరాజు కూడా ఉంటారని మీరు చూస్తారు. మీకు అంతా సాక్షాత్కారము చేయిస్తారు. మీరు ఇవి-ఇవి చేసారు, గుర్తుందా, ఇప్పుడు శిక్ష అనుభవించండి అని అంతా సాక్షాత్కారము చేయిస్తారు. అప్పుడు, ఆ సమయములోని శిక్షలు జన్మ-జన్మల శిక్షలు అనుభవిస్తున్నట్లుగా ఉంటాయి. చివరిలో కొద్దిగా రొట్టె ముక్క లభిస్తే, దానితో ఏమి లాభము. శిక్షలనైతే అనుభవించకూడదు. మీ అవస్థను చెక్ చేసుకుంటూ ఉండాలి. కొందరు 6 నెలలు లెక్కలను, కొందరు 12 నెలల లెక్కలను తీస్తారు. కొందరైతే రోజువారీ లెక్కను కూడా తీస్తారు. తండ్రి అంటారు - మీరు కూడా వ్యాపారులే. ఎవరో అరుదైన వ్యాపారులు మాత్రమే అనంతమైన తండ్రితో వ్యాపారము చేస్తారు. ధనము లేకపోతే తనువు, మనసు అయితే ఉన్నాయి కదా. వారిని వ్యాపారి అని కూడా అంటారు. ఇచ్చి-పుచ్చుకునే వ్యాపారము చేస్తారు కదా. మీరు తనువు-మనసు-ధనము ఇస్తారు, దానికి రిటర్న్ లో 21 జన్మలకు ఎంత వారసత్వాన్ని పొందుతారు. బాబా, నేను మీ వాడిని, మా ఆత్మ మరియు శరీరము ఈ లక్ష్మీ-నారాయణుల వలె తయారయ్యేందుకు ఏదైనా యుక్తిని తెలియజేయండి అని అంటారు. బాబా అంటారు - నేను మిమ్మల్ని ఎంత సుందరముగా తయారుచేస్తాను. మీ రూపాన్ని పూర్తిగా మార్చేస్తాను. మరుసటి జన్మలో మీకు ఫస్ట్ క్లాస్ శరీరము లభిస్తుంది. మీరు వైకుంఠములో కూడా చూస్తారు. ఈ మమ్మా-బాబా తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అవుతారని మీకు తెలుసు. లక్ష్యము-ఉద్దేశ్యమును కూడా చూపిస్తారు. ఇప్పుడిక ఎవరెంత పురుషార్థము చేస్తే, అంత పొందుతారు. ఒకవేళ పురుషార్థము పూర్తిగా చేయకపోతే, అలజడి సృష్టించినట్లయితే తమ పదవిని భ్రష్టము చేసుకుంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయము యొక్క అవస్థను స్వయమే చెక్ చేసుకోవాలి. తమ కళ్యాణము కోసం రోజువారీ డైరీని పెట్టుకోవాలి, అందులో స్మృతి చార్టును నోట్ చేసుకోవాలి.

2. అనంతమైన తండ్రితో సత్యాతి-సత్యమైన వ్యాపారము చేయాలి. తమ తనువు-మనసు-ధనములను తండ్రికి అర్పించి 21 జన్మల కొరకు రిటర్న్ తీసుకోవాలి. నిశ్చయబుద్ధి కలవారిగా అయి తమ కళ్యాణము చేసుకోవాలి.

వరదానము:-
సంతోషముతోపాటు శక్తిని ధారణ చేసి విఘ్నాలను దాటివేసే విఘ్నజీత్ భవ

ఏ పిల్లలకైతే జమ చేయడము వస్తుందో, వారు శక్తిశాలిగా అవుతారు. ఒకవేళ ఇప్పుడిప్పుడే సంపాదించారు, ఇప్పుడిప్పుడే పంచేశారు కానీ స్వయములో ఇముడ్చుకోలేదు అంటే ఆ శక్తి ఉండదు, అప్పుడు కేవలం పంచాము లేక దానము చేసాము అన్న సంతోషము మాత్రమే ఉంటుంది. సంతోషముతోపాటు శక్తి కూడా ఉన్నప్పుడు సహజముగానే విఘ్నాలను దాటివేసి విఘ్నజీతులుగా అవుతారు. అప్పుడిక ఏ విఘ్నమూ మీ తపనను డిస్టర్బ్ చేయదు. అందుకే ఏ విధముగా ముఖము ద్వారా సంతోషపు ప్రకాశము కనిపిస్తుందో, అదే విధముగా శక్తి యొక్క ప్రకాశము కూడా కనిపించాలి.

స్లోగన్:-
పరిస్థితులలో భయపడేందుకు బదులుగా వాటిని టీచరుగా భావిస్తూ పాఠాన్ని నేర్చుకోండి.

అవ్యక్త ప్రేరణలు - జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి

లాస్ట్ సో ఫాస్ట్ పురుషార్థము జ్వాలా రూపముదే మిగిలి ఉంది. పాండవుల కారణముగా యాదవులు ఆగి ఉన్నారు. పాండవుల శ్రేష్ఠమైన స్థితి, ఆత్మిక మహిమకు చెందిన స్థితి యాదవుల అలజడితో కూడిన పరిస్థితిని సమాప్తము చేస్తుంది. కావున మీ స్థితి ద్వారా అలజడిలో ఉన్న ఆత్మలకు శాంతి మరియు ప్రశాంతతల వరదానాన్ని ఇవ్వండి. జ్వాలా స్వరూపము అనగా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ స్థితిని అర్థం చేసుకుంటూ ఇదే పురుషార్థములో ఉండండి.