09-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - యోగబలముతోనే మీరు మీ వికర్మలపై విజయము పొంది వికర్మాజీతులుగా అవ్వాలి’’

ప్రశ్న:-
ఏ ఆలోచన పురుషార్థీ పిల్లలను కూడా పురుషార్థ హీనులుగా చేస్తుంది?

జవాబు:-
ఒకవేళ పురుషార్థులు ఎవరికైనా, ఇప్పుడు ఇంకా చాలా సమయముంది, చివరిలో గ్యాలప్ చేస్తాము (వేగముగా ముందుకు వెళ్తాము) అనే ఆలోచన వస్తే, వారు పురుషార్థ హీనులుగా అయిపోతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మృత్యువు వచ్చే సమయము నిశ్చితము కాదు, రేపు-రేపు అంటూ మరణిస్తే ఇక ఏం సంపాదన జరుగుతుంది. అందుకే ఎంత వీలైతే అంత శ్రీమతాన్ని అనుసరిస్తూ తమ కళ్యాణాన్ని మరియు ఇతరుల కళ్యాణాన్ని చేస్తూ ఉండండి. సమయము ఉంది కదా అని ఆలోచిస్తూ పురుషార్థ హీనులుగా అవ్వకండి.

పాట:-
ఓం నమః శివాయ...

ఓంశాంతి
నిరాకారుడు, సాకారుడు లేకుండా ఏ కర్మ చేయలేరని, పాత్రను అభినయించలేరని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఆత్మిక తండ్రి వచ్చి బ్రహ్మా ద్వారా ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. యోగబలముతోనే సతోప్రధానముగా అవ్వాలి మరియు విశ్వానికి యజమానులుగా అవ్వాలి. కల్ప-కల్పము తండ్రి వచ్చి బ్రహ్మా ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తారని మరియు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని అనగా మనుష్యులను దేవతలుగా తయారుచేస్తారని పిల్లల బుద్ధిలో ఉంది. దేవీ-దేవతలుగా, పావనముగా ఉన్న మనుష్యులే ఇప్పుడు 84 జన్మల తర్వాత మారిపోయి పతితులుగా అయిపోయారు. భారత్ పారసపురిగా ఉన్నప్పుడు పవిత్రత, సుఖ-శాంతులు అన్నీ ఉండేవి. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము. తిథి-తారీఖులతో సహా తండ్రి మొత్తం లెక్క అంతటినీ అర్థం చేయిస్తారు. వీరి కంటే ఉన్నతమైనవారైతే ఎవ్వరూ లేరు. సృష్టి లేక వృక్షము, దేనినైతే కల్పవృక్షమని అంటారో, దాని ఆదిమధ్యాంతాల రహస్యాన్ని కూడా తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. ఒకప్పుడు భారత్ లో ఉన్న దేవీ-దేవతా ధర్మము ఇప్పుడు కనుమరుగైపోయింది. కేవలం చిత్రాలు మాత్రం ఉన్నాయి. సత్యయుగములో లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేదని భారతవాసులకు తెలుసు. అయితే, శాస్త్రాలలో శ్రీకృష్ణుడిని ద్వాపరములోకి తీసుకువెళ్ళి పొరపాటు చేసారు. తండ్రియే వచ్చి దారి తప్పిన వారికి దారిని తెలియజేస్తారు. వారిని ముక్తి-జీవన్ముక్తుల గైడ్ అని అంటారు. సర్వులకు ముక్తి-జీవన్ముక్తులను ఇచ్చేవారు ఒక్కరే. భారత్ జీవన్ముక్తిలో ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామములో ఉన్నాయి, అందుకే వారిని ముక్తి-జీవన్ముక్తి దాత అని అంటారు. రచయిత ఒక్కరే, సృష్టి కూడా ఒక్కటే, ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు కూడా ఒక్కటే. అవే రిపీట్ అవుతాయి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము... ఆ తర్వాత సంగమయుగము ఉంటుంది. కలియుగము పతిత యుగము, సత్యయుగము పావన యుగము. సత్యయుగము రానున్నది అంటే, అంతకుముందు తప్పకుండా కలియుగ వినాశనము జరుగుతుంది. వినాశనానికి ముందే స్థాపన జరుగుతుంది. సత్యయుగములో స్థాపన జరగదు. పతిత ప్రపంచాన్ని పావనముగా తయారుచేయాల్సి వచ్చినప్పుడు భగవంతుడు వస్తారు. ఇప్పుడు తండ్రి సహజమైన యుక్తిని తెలియజేస్తారు, అదేమిటంటే - దేహ సహితముగా దేహ సంబంధాలన్నింటినీ తెంచి దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయండి. తండ్రి భక్తులకు ఫలాన్ని ఇచ్చేవారు. భక్తులకు పావనముగా అయ్యేందుకు జ్ఞానము ఇస్తారు. అందరినీ పావనము తయారుచేసేది యోగము. జ్ఞానసాగరుడు వచ్చి నోటి ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారు, పతితులను పావనముగా తయారుచేస్తారు. ఈ సమయములో ఆత్మలందరూ పతితముగా తయారయ్యారు, అందుకే తండ్రిని పిలుస్తారు ఎందుకంటే తండ్రి తప్ప ఇంకెవ్వరూ పావనముగా తయారుచేయలేరు. ఒకవేళ గంగ పతిత-పావని అయితే, మళ్ళీ పతిత-పావన సీతారామ అని ఎందుకు పిలుస్తారు. పరమపిత పరమాత్మ తప్పకుండా మళ్ళీ కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనము కోసం వస్తారని బుద్ధి చెప్తుంది. కల్పవృక్షానికి కూడా ఆయువు ఉంటుంది. ఏ వస్తువైతే శిథిలావస్థకు చేరుకుంటుందో, దానినే తమోప్రధానము అని అంటారు. దీనిని కొత్త ప్రపంచమని అనరు, ఇది ఇనుపయుగ ప్రపంచము. ఇతరులకు అర్థం చేయించేందుకు ఈ విషయాలన్నీ బుద్ధిలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇంటి-ఇంటికి సందేశము ఇవ్వాలి. పరమాత్మ వచ్చేసారని నేరుగా చెప్పకూడదు, యుక్తిగా అర్థం చేయించాలి. లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి - ఇద్దరు తండ్రులున్నారని ఇలా చెప్పండి. దుఃఖము సమయములో పారలౌకిక తండ్రినే స్మృతి చేయడం జరుగుతుంది. సుఖధామములో పరమాత్మను ఎవరూ స్మృతి చేయరు. సత్యయుగములో, లక్ష్మీ-నారాయణుల రాజ్యములో సుఖము, శాంతి, పవిత్రత అన్నీ ఉండేవి. తండ్రి నుండి వారసత్వము లభించిన తర్వాత ఇక వారిని ఎందుకు పిలుస్తారు? అక్కడ అంతా సుఖమే ఉంటుంది. తండ్రి దుఃఖము కోసం ప్రపంచాన్ని రచించలేదు. ఇది తయారై, తయారుచేయబడిన ఆట. ఎవరి పాత్ర అయితే చివరిలో ఉంటుందో, వారు 2-4 జన్మలు తీసుకుంటారు, మిగతా సమయము శాంతిధామములో ఉంటారు. ఇకపోతే, ఈ ఆట నుండి ఎవరైనా బయటకు వెళ్ళిపోవడమనేది జరగదు. 1-2 జన్మలు తీసుకుంటారు, మిగిలిన సమయమంతా మోక్షములో ఉన్నట్లు. ఆత్మ పాత్రధారి. కొందరిది ఉన్నతమైన పాత్ర, కొందరిది తక్కువ పాత్ర ఉంటుంది. ఈశ్వరుని గురించి ఎవరూ సంపూర్ణముగా తెలుసుకోలేరని అంటూ ఉంటారు. ఈశ్వరుడే వచ్చి రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను, నేను ఏ తనువులోకైతే ప్రవేశిస్తానో, వారికి తమ జన్మల గురించి తెలియదు, నేను వీరి 84 జన్మల కథను వినిపిస్తాను. ఏ పాత్రా మారదు. ఇది తయారై, తయారుచేయబడిన ఆట. ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. పవిత్రముగా అయి అర్థం చేసుకున్నప్పుడే బుద్ధిలో కూర్చుంటుంది. మంచి రీతిలో అర్థం చేసుకునేందుకు 7 రోజుల భట్టీలో ఉండాలి. భాగవతము మొదలైనవి కూడా 7 రోజులు వినిపిస్తారు. కొందరు 7 రోజుల్లో బాగా అర్థం చేసుకుంటారు. కొందరైతే, మా బుద్ధిలో ఏమీ కూర్చోలేదని అంటారు. ఉన్నత పదవి పొందేది లేదు అన్నప్పుడు బుద్ధిలో ఎలా కూర్చుంటుంది. అచ్ఛా, అయినా కళ్యాణమైతే జరిగింది కదా! ప్రజలైతే ఈ విధముగానే తయారవుతారు. ఇకపోతే, రాజ్య భాగ్యము తీసుకోవడములోనే శ్రమ ఉంది. తండ్రిని స్మృతి చేస్తేనే వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడిక చేయండి, చేయకపోండి, మీ ఇష్టము. కానీ తండ్రి అయితే డైరెక్షన్ ఇచ్చారు. ప్రియమైన వస్తువును గుర్తు చేయడము జరుగుతుంది కదా. భక్తి మార్గములో కూడా, ఓ పతిత-పావనా, రండి, అని అంటారు. ఇప్పుడు వారు లభించారు. వారంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే తుప్పు తొలగిపోతుంది. రాజ్యాధికారము ఊరికే లభించదు కదా. స్మృతిలోనే కొంత శ్రమ ఉంది. చాలా స్మృతి చేసేవారే కర్మాతీత అవస్థను పొందుతారు. పూర్తిగా స్మృతి చేయకపోతే వికర్మలు వినాశనమవ్వవు. యోగబలముతోనే వికర్మాజీతులుగా అవ్వాలి. కలియుగాంతములో ఎవ్వరూ పవిత్రముగా లేనప్పుడు లక్ష్మీ-నారాయణులు ఇంత పవిత్రముగా ఎలా అయ్యారు? ఈ సమయములో గీతా జ్ఞాన అధ్యాయము రిపీట్ అవుతూ ఉంది. శివ భగవానువాచ, పొరపాట్లు అయితే అందరి ద్వారా జరుగుతూ ఉంటాయి, నేను వచ్చి అందరినీ పొరపాట్లు చేయనివారిగా తయారుచేస్తాను. భారత్ యొక్క శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. తండ్రి అంటారు - నేను వచ్చి ఏవైతే తెలియజేస్తానో, అవి ఎవరికీ తెలియవు. ఎవరైతే నా ద్వారా విన్నారో, వారు 21 జన్మల ప్రారబ్ధాన్ని పొందారు, తర్వాత జ్ఞానము కనుమరుగైపోతుంది. మీరే చక్రమంతా తిరిగి మళ్ళీ ఈ జ్ఞానాన్ని వింటున్నారు.

మనం మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసే అంటు కడుతున్నామని మీకు తెలుసు. ఇది దైవీ వృక్షపు అంటు. వాళ్ళు అయితే ఆ వృక్షాలకు అంటు కడుతూ ఉంటారు. తండ్రి వచ్చి తేడాను తెలియజేస్తారు. వారి ప్లాన్ ఏమిటి, మీ ప్లాన్ ఏమిటి అనేది మీరు చూపిస్తారు కూడా. ప్రపంచములో జనాభా సంఖ్య పెరగకూడదని వారు ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తారు. తండ్రి అయితే చాలా మంచి విషయము తెలియజేస్తున్నారు - అనేక ధర్మాలు వినాశనమవుతాయి మరియు దేవీ-దేవతా ధర్మము యొక్క ఫ్యామిలీ స్థాపనవుతుంది. సత్యయుగములో ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క ఫ్యామిలీ ఉండేది, అప్పుడు ఇంకే ఇతర ఫ్యామిలీలు ఉండేవే కావు. ఈ సమయములో భారత్ లో ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయో చూడండి. గుజరాతీ ఫ్యామిలీ, సిక్కు ఫ్యామిలీ... వాస్తవానికి భారత్ లో ఒకే ఫ్యామిలీ ఉండాలి. చాలా ఫ్యామిలీలు ఉంటే తప్పకుండా గొడవలు జరుగుతాయి, తర్వాత సివిల్ వార్స్ (అంతర్యుద్ధాలు) జరుగుతాయి. ఫ్యామిలీలలో కూడా అంతర్యుద్ధాలు జరుగుతాయి. ఉదాహరణకు క్రిస్టియన్లు పరస్పరములో ఒక ఫ్యామిలీ, ఒకే ఫ్యామిలీ అయినా సోదరులిరువురూ పరస్పరములో కలవరు. ఘర్షణ జరుగుతుంది. నీటిని కూడా విభజించుకుంటారు. సిక్కు ధర్మము వారు, మేము మా ధర్మానికి చెందిన ఫ్యామిలీకి ఎక్కువ సుఖము ఇవ్వాలని భావిస్తారు, మోహముంటుంది కదా. ఎంతో కష్టపడుతూ ఉంటారు. అంతిమ సమయము వచ్చినప్పుడు పరస్పరములో కొట్లాడుకోవడము మొదలుపెడతారు. వినాశనమైతే జరగాల్సిందే. ఎన్నో బాంబులను తయారుచేస్తూ ఉంటారు. పెద్ద యుద్ధము జరిగినప్పుడు రెండు బాంబులు వేసారు. ఇప్పుడైతే అలాంటివి ఎన్నో తయారుచేసారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము కదా. ఇది అదే మహాభారత యుద్ధమని మీరు అర్థం చేయించాలి. ఒకవేళ యుద్ధము ఆపకపోతే ప్రపంచమంతటికీ నిప్పు అంటుకుంటుందని పెద్ద-పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు. నిప్పు అయితే అంటుకోవాల్సిందేనని మీకు తెలుసు.

తండ్రి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. రాజయోగము ఉన్నదే సత్యయుగము కోసము. ఏ దేవీ-దేవతా ధర్మమైతే కనుమరుగైపోయిందో, దానిని మళ్ళీ స్థాపన చేస్తారు. ఇప్పుడిది కలియుగము, దీని తర్వాత సత్యయుగము కావాలి. ఇప్పుడు కలియుగ వినాశనము కోసం ఈ మహాభారీ మహాభారత యుద్ధము ఉంది. ఈ విషయాలన్నింటినీ మంచి రీతిలో ధారణ చేసి అర్థం చేయించాలి ఎందుకంటే మనుష్యులు ఆసురీ సాంప్రదాయానికి చెందినవారిగా ఉన్నారు, అందుకే జాగ్రత్తగా ఉండాలి. కల్పక్రితం వలె ఏ విఘ్నాలైతే రానున్నాయో, అవి తప్పకుండా వస్తాయి. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా. ఇందులో మనం బంధించబడి ఉన్నాము. స్మృతియాత్రను ఎప్పుడూ మర్చిపోకూడదు. రాత్రి ప్రయాణీకుడా అలసిపోకు... అనే పాట ఉంది కదా. దీని అర్థాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు. రాత్రి పూర్తి అయ్యి పగలు రానున్నది. అర్ధకల్పము పూర్తయ్యింది, ఇప్పుడు సుఖము మొదలవుతుంది. తండ్రి ‘మన్మనాభవ’ అర్థాన్ని కూడా తెలియజేశారు. కేవలం గీతలో శ్రీకృష్ణుని పేరు వ్రాయడముతో అందులో అంత శక్తి లేకుండా అయిపోయింది. శ్రీకృష్ణుడిని ఎప్పుడూ సర్వశక్తివంతుడు అని అనలేరు. వారు పూర్తి 84 జన్మలు తీసుకుంటారు, అందుకే గీతలో అంత శక్తి లేదు. ఇప్పుడు మనం మనుష్యమాత్రులందరి కళ్యాణము చేస్తూ ఉన్నాము. ఎవరైతే కళ్యాణకారులుగా అవుతారో, వారికి వారసత్వము లభిస్తుంది. స్మృతియాత్ర లేకుండా కళ్యాణము జరగదు. ఈ సమయములో అందరూ విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారు. వారు పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు. వారు అనంతమైన తండ్రి అని మీరు అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి నుండే భారతవాసులకు అనంతమైన వారసత్వము లభించింది. భారతవాసులే 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నారు, జ్ఞానమైతే మీరు వింటూనే ఉంటారు. రోజురోజుకు మీ వద్దకు చాలామంది కొత్త-కొత్త వారు వస్తూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడే పెద్ద-పెద్దవారు వస్తే, ఇక ఆలస్యమవ్వదు, వెంటనే శబ్దము వ్యాపిస్తుంది, అలజడి ప్రారంభమైపోతుంది. అందుకే యుక్తిగా, నెమ్మది-నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. ఇది ఉన్నదే గుప్త జ్ఞానము. మీరు ఏం చేస్తున్నారు అనేది ఎవరికీ తెలియను కూడా తెలియదు. భక్తిలో దుఃఖము ఉంటుంది, జ్ఞానములో సుఖముంటుంది. రావణుడితో మీ యుద్ధము ఎటువంటిదో మీకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. భగవానువాచ, తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలంటే నన్ను స్మృతి చేయండి, అప్పుడు మీ పాపాలు వినాశనమవుతాయి. పవిత్రముగా అయినట్లయితే నాతో పాటు తీసుకువెళ్తాను. ముక్తి అయితే అందరికీ లభించనున్నది. అందరూ రావణ రాజ్యము నుండి విముక్తులవుతారు. శివశక్తులైన బ్రహ్మాకుమార-కుమారీలే శ్రేష్ఠాచారీ ప్రపంచాన్ని స్థాపన చేస్తారని మీరు చెప్తారు. అది కూడా పరమపిత పరమాత్ముని శ్రీమతాన్ని అనుసరిస్తూ కల్పక్రితం వలె చేస్తారు. 5 వేల సంవత్సరాల క్రితం శ్రేష్ఠాచారీ ప్రపంచము ఉండేదని బుద్ధిలో కూర్చోబెట్టాలి. ముఖ్యమైన పాయింట్లు బుద్ధిలో ధారణ అయినప్పుడు స్మృతియాత్రలో ఉంటారు. కొంతమంది, ఇప్పుడింకా సమయముంది, చివరిలో పురుషార్థము చేసేస్తాము అని భావిస్తారు. కానీ మృత్యువుకు నియమమంటూ లేదు. రేపే మరణిస్తే! అందుకే చివరిలో గ్యాలప్ చేసేస్తాము (వేగముగా ముందుకు వెళ్ళిపోతాము) అని భావించకండి. ఈ ఆలోచన మరింత పడేస్తుంది. ఎంత వీలైతే అంత పురుషార్థము చేస్తూ ఉండండి. శ్రీమతాన్ని అనుసరిస్తూ ప్రతి ఒక్కరూ తమ కళ్యాణము చేసుకోవాలి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాను మరియు తండ్రి సేవను ఎంతగా చేస్తున్నాను అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఆత్మిక ఈశ్వరీయ సేవాధారులు మీరే కదా. మీరు ఆత్మలను రక్షిస్తారు. ఆత్మ పతితము నుండి పావనముగా ఎలా తయారవుతుంది అనే యుక్తిని తెలియజేస్తారు. శ్రీకృష్ణుడిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనము అవ్వవు. వారు రాకుమారుడు, వారు ప్రారబ్ధాన్ని అనుభవించారు, వారిని మహిమ చేయాల్సిన అవసరము కూడా లేదు. దేవతలను ఏమి మహిమ చేస్తారు! అయితే, జన్మదినాన్ని అయితే అందరూ జరుపుకుంటారు. ఇది కామన్ విషయము. ఇకపోతే వారు ఏం చేసారని? మెట్లు అయితే దిగుతూనే వచ్చారు. మంచి లేదా చెడు మనుష్యులైతే ఉంటారు. ప్రతి ఒక్కరికి తమ-తమ పాత్ర ఉంది. ఇది అనంతమైన విషయము. ముఖ్యమైన కొమ్మలు-రెమ్మలు లెక్కించబడతాయి. ఇకపోతే, ఆకులైతే ఎన్నో ఉన్నాయి. వాటిని ఎంతవరకని మీరు లెక్కిస్తూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు - పిల్లలూ, కృషి చేయండి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తే తండ్రితో బుద్ధియోగము జోడించబడుతుంది. తండ్రి అంటారు - పవిత్రముగా అయినట్లయితే ముక్తిధామానికి వెళ్ళిపోతారని అందరికీ చెప్పండి. మహాభారత యుద్ధము వలన ఏం జరుగుతుంది అనేది ప్రపంచము వారికి తెలియదు. కొత్త ప్రపంచము కావాలి కావున ఈ యజ్ఞాన్ని రచించారు. మన యజ్ఞము పూర్తి అయితే, అందరూ ఈ యజ్ఞములో స్వాహా అవ్వనున్నారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సత్యాతి-సత్యమైన ఈశ్వరీయ సేవాధారులుగా అయి ఆత్మలందరినీ రక్షించే సేవ చేయాలి. అందరి కళ్యాణము చేయాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి.

2. అత్యంత ప్రియమైన వస్తువును (తండ్రిని) ప్రేమగా స్మృతి చేయాలి. తయారై, తయారుచేయబడిన డ్రామాపై స్థిరముగా ఉండాలి. విఘ్నాలకు భయపడకూడదు.

వరదానము:-
మన్మనాభవ విధి ద్వారా మనోరస స్థితిని అనుభవము చేసే మరియు చేయించే సర్వ బంధనముక్త భవ

ఏ పిల్లలైతే ఇనుప సంకెళ్ళ బంధనాలను మరియు సూక్ష్మ దారాల బంధనాలను తెంచుకుని బంధనముక్త స్థితిలో ఉంటారో, వారు కలియుగములోని స్థూల వస్తువుల పట్ల ఆకర్షణ మరియు మనసు యొక్క ఆకర్షణ నుండి విముక్తులైపోతారు. వారిని దేహాభిమానము లేదా దేహానికి సంబంధించిన పాత ప్రపంచములోని వస్తువేదీ కొద్దిగా కూడా ఆకర్షించదు. ఎప్పుడైతే ఏ ఇంద్రియాల రసం అనగా వినాశీ రసం వైపు ఆకర్షణ ఉండదో, అప్పుడు అలౌకిక అతీంద్రియ సుఖము మరియు మనోరస స్థితి అనుభవమవుతుంది. దీని కోసం నిరంతర మన్మనాభవ స్థితి కావాలి.

స్లోగన్:-
ఎందులోనైతే అందరి ఆశీర్వాదాలతో పాటు సంతోషము యొక్క అనుభూతి ఉంటుందో, అదే సత్యమైన సేవ.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి

ప్రపంచములో కూడా దానము ఇవ్వటాన్ని పుణ్యముగా భావిస్తారు. దాత పిల్లలైన మీరు సదా దానము చేసేటటువంటి పుణ్య ఆత్మలు. మీరు ఏ ఆత్మ నుండి కూడా అల్పకాలికమైన ప్రాప్తిని తీసుకోవాలనే కోరికను పెట్టుకోలేరు. ఈ ఆత్మ ఏదైనా ఇస్తే నేను ఇస్తాను, వీరు ఏదైనా చేస్తే నేను కూడా చేస్తాను - ఇటువంటి హద్దు కోరికలను పెట్టుకోకూడదు. దాత పిల్లలుగా అయ్యి అందరికీ స్నేహాన్ని, సహయోగాన్ని, శక్తిని ఇచ్చే పుణ్య ఆత్మలుగా అవ్వండి.