09-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఆత్మలందరూ అనంతమైన తండ్రి నుండి చదువుకోరు కానీ వారితోపాటు తప్పకుండా కలిసి వెళ్తారని మీకు తెలుసు’’

ప్రశ్న:-
చక్రవర్తి రాజులుగా అయ్యే పిల్లలకు ఏ విషయము పట్ల చాలా-చాలా గౌరవముంటుంది?

జవాబు:-
వారికి చదువు పట్ల చాలా గౌరవముంటుంది. ఎక్కడ ఉన్నా కానీ వారు చదువు తప్పకుండా చదువుకుంటారు. దానితోపాటు మిత్ర-సంబంధీకులతో యుక్తియుక్తముగా సంబంధాన్ని నిర్వర్తిస్తూ స్మృతిలో ఉండే అభ్యాసము చేస్తారు మరియు తండ్రిని స్మృతి చేసినట్లయితే శాంతిధామానికి, సుఖధామానికి వెళ్తారని అందరికీ ఇదే సందేశాన్ని ఇస్తారు. ఈ శ్రీమతాన్ని పూర్తిగా అనుసరించే పిల్లలే చక్రవర్తులుగా అవుతారు.

ఓంశాంతి
తండ్రి, ఆత్మిక పిల్లలందరితో పాటు సృష్టిలో ఉన్న జీవాత్మలందరినీ తిరిగి తీసుకుని వెళ్ళేదే ఉంది, ఎందుకంటే ఇప్పుడు అంధకారమయమైన రాత్రి సమాప్తమవుతుంది. పాత ప్రపంచము పూర్తి అయి కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. ప్రపంచమైతే ఉంది కానీ పాతది నుండి కొత్తదిగా అవుతుంది. సత్యయుగ ఆదిలో తప్పకుండా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే ఉండేది. ఇప్పుడు ఆ సూర్యవంశీయులు, చంద్రవంశీయులు లేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - వారు పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు 84 జన్మలు పూర్తి చేశారు. ఈ సమయములో పాత్రధారులందరూ తమోప్రధానముగా అయిపోయారు. రామ రాజ్యము కోరుకుంటారు కూడా, కొత్త ప్రపంచము, కొత్త ఢిల్లీ కావాలి. ఎలాగైతే పిల్లలు అంటారు కదా - మాకు కొత్త వస్తువులు కావాలని, అలా ఇక్కడ కూడా - బాబా, కొత్త ప్రపంచము కోసం మాకు కొత్త వస్త్రాలు కావాలని అంటారు. దీపావళి నాడు మనుష్యులు కొత్త వస్త్రాలను ధరిస్తారు. శ్రీకృష్ణ జయంతి నాడు కొత్త వస్త్రాలను ధరించాలనేమీ ఉండదు. ప్రత్యేకముగా దీపావళి నాడు కొత్త వస్త్రాలను ధరించేందుకని కొనడము మొదలైనవి చాలా చేస్తూ ఉంటారు. దీపావళి రోజున జ్యోతి వెలిగిస్తారు. ఇప్పుడు మీ జ్యోతి వెలిగింది, మీరు ఇతరుల జ్యోతిని కూడా వెలిగించాలి. వారిది భక్తి మార్గానికి సంబంధించిన దీపావళి, మీది జ్ఞానానికి సంబంధించిన దీపావళి. మీరు వస్త్రాలు మొదలైనవి మార్చాల్సిన అవసరము లేదు. మీ జ్యోతి పూర్తిగా వెలిగినప్పుడు, కొత్త ప్రపంచములో కొత్త వస్త్రాలు లభిస్తాయి. తండ్రి అంటారు - ఎవరైనా వెళ్ళాలని అనుకున్నా, అనుకోకపోయినా కానీ నేను అందరినీ తీసుకువెళ్తాను. ఓ పతిత-పావనా రండి అని పిలుస్తారు కూడా. వారేమో, ముక్తిదాత రండి అని పిలుస్తారు. కొందరు ఒక భాషలో పిలుస్తారు, కొందరు ఇంకొక భాషలో పిలుస్తారు. నేను కల్ప-కల్పము వచ్చి అందరినీ తీసుకువెళ్తాను. సత్యయుగములోనైతే చాలా కొద్దిమంది మనుష్యులు ఉంటారు. ఇప్పుడు ఎంతమంది పాత్రధారులు ఉన్నారు. వీరంతా జీవాత్మలు. శరీరాన్ని ‘జీవం’ అని అంటారు. అలాగని - నేను ఒక ఆత్మను వదిలి మరో ఆత్మను తీసుకుంటానని శరీరము అంటుందని కాదు. ఆత్మ అంటుంది - నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరము తీసుకుంటాను అని. కానీ, మనము 84 జన్మలు తీసుకుంటామనేది కూడా ఎవ్వరికీ తెలియదు. అలాగని, అందరికీ 84 జన్మలు లభిస్తాయని కాదు. ప్రతి ఒక్కరి లెక్క ఎవరిది వారిదే. ఎవరైతే మొట్టమొదట వస్తారో, వారు తప్పకుండా ఎక్కువ జన్మలు తీసుకుంటారు. ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు, తక్కువలో తక్కువ ఒక జన్మ కూడా ఉంటుంది. ఈ విషయాలు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. అందరినీ అయితే చదివించరు, కానీ అందరినీ తప్పకుండా తోడుగా తీసుకువెళ్తారు. డ్రామా ప్లాన్ అనుసారముగా అందరినీ తిరిగి తీసుకువెళ్ళడము నా పాత్ర. పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నదని ప్రపంచానికి తెలియదు. తండ్రి వచ్చి తప్పకుండా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. మనుష్యులకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము కొద్దిగా కూడా లేదు. అయితే, వారికి భక్తి మార్గము గురించి తెలుసు. భక్తి మార్గము యొక్క ఆచార-పద్ధతులు వేరు, జ్ఞాన మార్గము యొక్క ఆచార-పద్ధతులు పూర్తిగా వేరు. సత్యయుగము నుండి కలియుగము వరకు భక్తి మాత్రమే ఉంటుందని కాదు. జ్ఞానమంటే పగలు అని, భక్తి అంటే రాత్రి అని కూడా అంటూ ఉంటారు. అంధకారమయమైన రాత్రిలో మనుష్యులు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. తండ్రి అంటారు - రాళ్ళు, రప్పల్లో కూడా వెళ్ళి నన్ను వెతుకుతారు. కొందరికి హనుమంతుని సాక్షాత్కారము జరుగుతుంది, కొందరికి గణేశుని సాక్షాత్కారము జరుగుతుంది. ఇప్పుడు వారంతా భగవంతుడు కాదు. నాకు నా శరీరమంటూ ఏదీ లేదు. మాయా రావణుడు అందరినీ తెలివిహీనులుగా చేసేసాడు. రామరాజ్యమని దేనినంటారో కూడా భారతవాసులకు తెలియదు. లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఈ ప్రపంచములో ఉండేదని కూడా తెలుసు. కేవలం రామరాజ్యము కావాలని అంటారు. రాముడంటే రఘుపతి రాముడు కాదు, వారి గురించి శాస్త్రాలలో చాలా తప్పుడు విషయాలు వ్రాసేసారు. మనుష్యులు మృత్యువుకు ఎంతగా భయపడతారు. జీవితాన్ని రక్షించుకునేందుకు ఆశీర్వాదాలను అడుగుతూ ఉంటారు. ఇప్పుడైతే చాలామంది మరణించనున్నారు. మరి వారి గురించి ఏమంటారు! బాబా, మమ్మల్ని పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళండి అన్నదాని కోసమే తండ్రిని పిలిచారు. శాంతిధామానికి శరీరాలనైతే తీసుకువెళ్ళను. అక్కడికైతే ఆత్మలు వెళ్తారు. ఇది పాత ఛీ-ఛీ శరీరము. ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది, అందుకే అగ్ని గోళాలను (బాంబులను) తయారుచేస్తున్నారు. ఇప్పుడు వారు - బాంబులు తయారుచేయవద్దని అంటారు. ఎవరి వద్ద అయితే ఎక్కువ బాంబులుంటాయో, వారు తప్పకుండా శక్తిశాలిగా అవుతారన్న తెలివి కూడా లేదు. మరి బాంబులను తయారుచేయకపోతే ఇతరులు తమను తాము ఎలా రక్షించుకోగలరు. ఇప్పుడు ఉన్నవన్నీ సముద్రములో పడేస్తే, ఇక వేరేవారు కూడా తయారుచేయడము ఆపేస్తారు. కానీ సముద్రము నుండి కూడా మేఘాలు నీటిని పీల్చుకుంటాయి, ఇక వర్షము పడితే మొత్తం నష్టమైపోతుంది, పంటలు మొదలైనవన్నీ కాలిపోతాయి, అందుకే డ్రామాలో యుక్తి రచించబడి ఉంది. పూర్వము ఈ బాంబులు ఉండేవి కావు, ఇప్పుడు వెలువడ్డాయి, అందుకే ఈ రాధ్ధాతాలన్నీ జరుగుతున్నాయి. ఇదంతా నిశ్చయించబడి ఉందని ఇప్పుడు మీకు తెలుసు. మీలో కూడా చాలామందికి వినాశనము జరుగుతుందన్న దానిపై నిశ్చయము లేదు. ఒకవేళ నిశ్చయముంటే యోగములో చాలా బాగా ఉండేవారు. యోగబలముతో విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. మీదంతా గుప్తము, నేర్పించేవారు కూడా గుప్తము. ఈ కంటికి కనిపించరు. ఆత్మనైన నాలో 84 జన్మల పాత్ర నిండి ఉందని ఇప్పుడు మీరు ఆత్మను రియలైజ్ అయ్యారు. ఆత్మనైన నేను అవినాశీ. ఇది అతి గుహ్యమైన విషయము. వార్తాపత్రికలలో కూడా వ్రాసారు - శరీరములో ఉండే ఆత్మ అంటే ఏమిటో చెప్పండి, ఇది ఎవరైనా చెప్తే వారికి లక్షల రూపాయలు లభిస్తాయి అని. ఆత్మ అంటే ఏమిటి? ఎక్కడ నుండి వస్తుంది? పాత్రను ఎలా అభినయిస్తుంది? ఈ విషయాలు ఎవరికీ తెలియవు. కొందరు నీటి బుడగ వంటిదని అంటారు, కొందరు బ్రహ్మతత్వము పెద్ద జ్యోతి అని, అందులో ఆత్మలు లీనమైపోతాయని అంటారు. అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆత్మ బిందు సమానమైనది అని మీకు తెలుసు. ఆత్మలో పాత్రను అభినయించాలి అన్నది నిశ్చితమై ఉంది. ఇది అనాదిగా తయారై, తయారుచేయబడిన డ్రామా, ఇది ఎప్పటికీ వినాశనమవ్వదు. ఆత్మ కూడా అవినాశీ. ఆత్మ ఆ పాత్రనే అభినయించాలి. అందులో తేడా రాదు. కల్పక్రితం ఎవరి బుద్ధిలోనైతే ఈ విషయాలు కూర్చున్నాయో, వారి బుద్ధిలోనే కూర్చుంటాయి.

బాబా అంటారు - ఇంతమంది మనుష్యులను నేను ఎలా చదివిస్తాను. నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తున్నారు అని పిల్లలు అర్థం చేసుకుంటారు. అందరికీ సందేశము లభిస్తుంది, తండ్రి ఈ మంత్రాన్ని అందరి కోసం ఇస్తారు. బాబా అర్థం చేయిస్తున్నారు - పిల్లలైన మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి, అవగుణాలను వదలాలి, దేహాభిమానాన్ని వదలండి. అయినా కూడా వదలరు. పాపం వారికి ఏమి లభిస్తుంది? పరస్పరము ఒకరితో ఒకరు ప్రేమగా వ్యవహరించరు. మీరు చాలా మధురముగా అవ్వాలి. తండ్రి ప్రేమసాగరుడు. మీరు కూడా వారి పిల్లలు కనుక మీరు కూడా చాలా ప్రియముగా అవ్వాలి. ఎప్పుడైనా, ఎవరైనా, ఎంత కోపగించుకున్నా కానీ, నింద-స్తుతి మొదలైనవాటన్నింటినీ సహనము చేయాలి. ఎవరైనా దివాలా తీసినప్పుడు, బాబా వారికి సహాయము చేస్తే బాగుంటుందని పిల్లలు భావిస్తారు. అరే, అది మీ కర్మభోగము, దానిని మీరు సహనము చేయాలి. ఇందులో తండ్రి ఏం చేయగలరు. తండ్రి ఆత్మలందరినీ తీసుకువెళ్ళేందుకు వచ్చారు. ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ప్రపంచములోనివారంతా ఘోర అంధకారములో ఉన్నారు. భక్తి మార్గములో తప్పకుండా భక్తులను గౌరవించాలి. శంకరాచార్యులు మొదలైనవారంతా భక్తులు. వారిని పవిత్రమైన భక్తులని అంటారు. భక్తి సాంప్రదాయము ఉంది కదా. ఎవరైతే పవిత్రముగా ఉంటారో, వారికి పెద్ద-పెద్ద మఠాలు తయారై ఉన్నాయి. వారికి ఎంత గౌరవముంది. ధార్మిక పుస్తకాలకు కూడా చాలా గౌరవము ఉంది. వాటికి పెద్ద-పెద్ద ఉరేగింపులు చేస్తారు. భక్తికి చాలా గౌరవముంది. జ్ఞానము గురించి ఎవ్వరికీ తెలియదు. మీరు దేవతలుగా అయినప్పుడు మీకు ఎంత మహిమ ఉంటుంది. ఏ మందిరము మొదలైనవాటికి వెళ్ళని తల్లిదండ్రులు ఎవరు ఉండరు. ఏవో ఒక భక్తి చిహ్నాలు ఇళ్ళల్లో తప్పకుండా ఉంటాయి. ఓ భగవంతుడా - అని అనడము కూడా భక్తి మార్గమే. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. వీరు తండ్రి, వారు దాదా - అందుకే త్రిమూర్తి చిత్రము గురించి అర్థం చేయించడము చాలా మంచిది. దాదాను ఎందుకు చూపించారు అని ఎవరైనా అడిగితే, అరే, ప్రజాపిత బ్రహ్మా అయితే తప్పకుండా ఇక్కడే ఉండాలి కదా అని వారికి చెప్పాలి. ఇతను వృక్షములో కింద తపస్యలో కూర్చుని ఉన్నారు. ముఖ్యమైన వారు సదా స్థిరముగా ఉంటారు, మిగిలినవారు మారుతూ ఉంటారు. ఇందులో పిల్లలు చాలా మధురముగా అవ్వాలి. నడవడిక చాలా రాయల్ గా ఉండాలి, తక్కువగా మాట్లాడాలి. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఎక్కువగా మాట్లాడడము అనవసరము. చాలా తక్కువగా మాట్లాడండి. మీరు కూడా భక్తి మార్గములో చాలా మాట్లాడారు, ఆర్తనాదాలు చేసారు. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నారు. ఇప్పుడు మీకు సింపుల్ గా అర్థం చేయిస్తున్నారు - కేవలం బాబాను స్మృతి చేసినట్లయితే యోగబలము ద్వారా విశ్వానికి యజమానులుగా అవ్వగలుగుతారు. నంబరువారుగా ఎవరెవరు ఏమవుతారు అనేది మున్ముందు తెలుస్తుంది. ప్రజల లెక్కను తీయరు. వారు లక్షల్లో, కోట్లల్లో ఉంటారు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారే సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతారు. మున్ముందు చాలా స్మృతి చేయడము మొదలుపెడతారు. ఎప్పుడైతే మృత్యువు ఎదురుగా వస్తుందో, అప్పుడు వైరాగ్యము వస్తుంది. ఇది అదే మహాభారత యుద్ధము. ఆత్మలందరూ లెక్కాచారాలను సమాప్తము చేసుకుని వెళ్తారు, దీనినే వినాశన సమయమని అంటారు. ఈ శరీరాలన్నీ సమాప్తమైపోతాయి. ప్రకృతి వైపరీత్యాలు జరగనున్నాయి, ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇది కొత్త విషయమేమీ కాదు. కరువు కారణముగా మనుష్యులు ఆకలితో మరణిస్తారు.

నా పిల్లలు చాలా దుఃఖితులుగా ఉన్నారని తండ్రికి తెలుసు. అందరినీ దుఃఖము నుండి విడిపించి తిరిగి తీసుకువెళ్తాను. తండ్రి అంటారు - వీరంతా పరస్పరము గొడవపడతారు, తర్వాత వెన్న మీకు లభిస్తుంది, పూర్తి విశ్వానికి మీరు యజమానులుగా అవుతారు. నోటిలో చంద్రుని సాక్షాత్కారము కలిగేది కదా! నోటిలో ఈ విశ్వమనే గ్లోబ్ వచ్చేస్తుంది. మీరు రాకుమార- రాకుమారీలుగా అవుతారు. పూర్తి సృష్టి అంతా మీ గుప్పిట్లో ఉన్నట్లుగా ఉంటుంది. నోటిలో కూడా మరియు గుప్పిట్లో కూడా ఉన్నట్లు చూపిస్తారు. ఇప్పుడు స్వర్గమనే గ్లోబ్ మీ నోటిలో ఉంది. యోగబలముతో మనము విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. యోగముతో ఆరోగ్యము మరియు జ్ఞానముతో సంపద లభిస్తుంది. మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. కానీ పిల్లలకు చదువు పట్ల అంత గౌరవము లేదు. ట్రాన్స్ఫర్ అయినా కానీ, తండ్రి అంటారు - ఎక్కడ ఉన్నా తప్పకుండా చదువుకోండి. పవిత్రముగా ఉండండి, ఆహార-పానీయాలను శుద్ధముగా ఉంచుకోండి. అందరితో సంబంధాలను యుక్తియుక్తముగా నిర్వర్తించాలి కూడా. ఈ ప్రపంచము దుఃఖాన్ని ఇచ్చేది. ముఖ్యమైనది కామ ఖడ్గాన్ని ఉపయోగించడము, దానిని కూడా కష్టం మీద వదులుతారు. ఏదైనా అంటే ద్రోహులుగా అయిపోతారు. అబలలకు ఎన్ని విఘ్నాలు ఏర్పడతాయి. ఈ ఆర్య సమాజము వారు ఇప్పుడు వచ్చారు. ఇది చివరిలో వచ్చే కొమ్మ. వారు దేవతలను నమ్మరు. మహావీర్ అనేది హనుమంతుని పేరు, వారు ధైర్యాన్ని చూపించారు. జైనులు కూడా మహావీర్ అన్న పేరును పెట్టుకున్నారు. ఇప్పుడు దాని అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీరు కూడా మహావీరులే, మీరు రావణుడిపై విజయము పొందుతారు. ఇదంతా యోగబలానికి సంబంధించిన విషయము. మీరు తండ్రిని స్మృతి చేస్తారు, దాని ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి, అప్పుడిక సుఖ-శాంతులలోకి వెళ్ళిపోతారు. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఈ స్థాపన చాలా అద్భుతమైనది, దీని గురించి ఎవ్వరికీ తెలియదు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. లోలోపల ఏ వికారాలు ఉండకూడదు. ఆత్మకు తండ్రి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆత్మయే వికారీగా అవుతుంది, అన్నీ ఆత్మయే చేస్తుంది. ఇప్పుడు తండ్రి శ్రీమతాన్ని పూర్తిగా అనుసరించాలి. సద్గురువుకు సమ్ముఖముగా ఉంటూ వారిని నిందింపజేసినట్లయితే ఉన్నత స్థానాన్ని పొందలేరు. ఏదైనా పాపం చేయడము కూడా నిందింపజేయడమే. టీచర్ మతం అనుసారముగా నడుచుకోకపోతే ఉన్నత స్థానాన్ని పొందలేరు, ఫెయిల్ అయిపోతారు. టీచర్ యొక్క శిక్షణలను తీసుకుంటూ ఉంటే పాస్ విత్ ఆనర్ గా అవుతారు. అవి హద్దులోని విషయాలు, ఇవి అనంతమైన విషయాలు. భగవంతుడు ఎవరు అనేది ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. మాయ కూడా సతో, రజో, తమోగా ఉంటుంది. ఇప్పుడు మాయ కూడా తమోప్రధానముగా ఉంది. ఏమేమి చేస్తూ ఉన్నారో చూడండి. మనము దేనికి నిప్పు అంటిస్తున్నాము అనేది ఎవరి బుద్ధిలోనూ లేదు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఏది జరిగినా డ్రామానుసారముగానే జరుగుతుంది. యాదవుల ప్లాన్, కౌరవుల ప్లాన్ మరియు పాండవుల ప్లాన్... వారు ఏమేమి చేస్తున్నారు. పాండవులకు ఉన్నతోన్నతమైన ప్లాన్ ను తెలిపేవారు తండ్రి. కొత్త ప్రపంచములో లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. ఇప్పుడు పాత ప్రపంచ వినాశనము జరగనున్నది. అతి ప్రియమైన తండ్రి నుండి అతి ప్రియమైన పిల్లలైన మీరు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. నేను మిమ్మల్ని నాతోపాటు తీసుకువెళ్తానని తండ్రి తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. అందరూ పరమాత్మయేనని వారంటారు. అటువంటప్పుడు, ఇలా ఎలా అనగలరు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియదు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. వినాశనము జరగడము నిశ్చితము అని తెలుసుకుని పూర్తిగా శ్రీమతాన్ని అనుసరించాలి. స్మృతిబలముతో విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకునే పురుషార్థము చేయాలి, తమ వెలిగి ఉన్న జ్యోతితో అందరి జ్యోతిని వెలిగించి సత్యమైన దీపావళిని జరుపుకోవాలి.

2. నింద-స్తుతి అన్నింటినీ సహనము చేస్తూ తండ్రి సమానముగా ప్రేమ సాగరులుగా అవ్వాలి. నడవడికను చాలా రాయల్ గా ఉంచుకోవాలి. చాలా తక్కువగా మాట్లాడాలి.

వరదానము:-
సమయానికి ప్రతి గుణాన్ని మరియు శక్తిని ఉపయోగించే అనుభవీ మూర్త భవ

బ్రాహ్మణ జీవితము యొక్క విశేషత అనుభవము. ఒకవేళ ఒక్క గుణము లేక శక్తి యొక్క అనుభూతి లేకపోయినా కానీ ఎప్పుడో ఒకప్పుడు విఘ్నాలకు వశమవుతారు. ఇప్పుడు అనుభూతి యొక్క కోర్సును ప్రారంభించండి. ప్రతి గుణము మరియు శక్తి రూపీ ఖజానాను ఉపయోగించండి. ఏ సమయములో ఏ గుణము యొక్క అవసరముంటుందో, ఆ సమయములో దాని స్వరూపముగా అవ్వండి. ఖజానాలను జ్ఞానము రూపములో బుద్ధి అనే లాకర్ లో అలా పెట్టి ఉంచడము కాదు, వాటిని ఉపయోగించండి, అప్పుడు విజయులుగా అవ్వగలరు మరియు వాహ్ రే మై (వాహ్ నేను) అనే పాటను సదా పాడుతూ ఉంటారు.

స్లోగన్:-
నాజూకుతనపు సంకల్పాలను సమాప్తము చేసి శక్తిశాలి సంకల్పాలను రచించేవారే డబల్ లైట్ గా ఉంటారు.

అవ్యక్త ప్రేరణలు - పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి

ఎవరైతే స్వయం పట్ల ఇచ్ఛా మాత్రం అవిద్యగా (కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా) ఉంటారో, అఖండ దానులుగా ఉంటారో, వారే పరోపకారులు. ఏ విధముగా బాబా స్వయం యొక్క సమయాన్ని కూడా సేవకు కేటాయించారో, స్వయం నిర్మానులుగా అయ్యి పిల్లలకు గౌరవాన్ని ఇచ్చారో, ముందు పిల్లలు - పేరు పిల్లలకు, పని తండ్రిది, చేసినపనికి వచ్చిన పేరు యొక్క ప్రాప్తిని కూడా త్యాగము చేసారో, పేరులో కూడా పరోపకారిగా అయ్యారో, అదే విధముగా ఫాలో ఫాదర్ చేయండి.