10-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 30.01.2010


‘‘నాలుగు సబ్జెక్టులలోనూ స్వమానాల అనుభవీ స్వరూపులుగా అయ్యి అనుభవము యొక్క అథారిటీని కార్యములోకి తీసుకురండి’’

ఈ రోజు బ్రాహ్మణ ప్రపంచము యొక్క రచయిత అయిన బాప్ దాదా తమ నలువైపులా ఉన్న బ్రాహ్మణ ప్రపంచాన్ని చూస్తున్నారు. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ పూర్తి ప్రపంచములోనే విశేషమైన ఆత్మలు, కోట్లలో కొద్దిమంది, ఎందుకంటే సాధారణ తనువులో వచ్చిన తండ్రిని గుర్తించారు. బాప్ దాదా కూడా హృదయములో ఇమిడిపోయే పిల్లలకు హృదయపూర్వకముగా హృదయ ప్రేమను ఇస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమను తాము తండ్రికి ప్రియమైనవారిగా, హృదయములో తండ్రిని ఇముడ్చుకున్నవారిగా అనుభవము చేస్తున్నారు! బాబాకైతే పిల్లలు ప్రతి ఒక్కరూ అతి ప్రియమైనవారు, సర్వులకు ప్రియమైనవారు. పిల్లలైన మీరందరూ సర్వాత్మల ముందు ఛాలెంజ్ చేసింది ఏమిటంటే - మేము యోగీ జీవితము కలవారము అని. కేవలం యోగము జోడించేవారము కాదు, యోగీ జీవితము కలవారము. జీవితమంటే రెండు, నాలుగు గంటలకు మాత్రమే ఉండేది కాదు. జీవితమంటే అది సదాకాలం ఉంటుంది. కనుక నడుస్తూ, తిరుగుతూ, కర్మలు చేస్తూ యోగీ జీవితము కలవారు నిరంతర యోగులు. యోగములో కూర్చున్నా, కర్మలు చేస్తున్నా గానీ కర్మయోగులు. జీవిత లక్ష్యమే సదా యోగి. మరి మీ జీవితాన్ని ఈ విధమైన యోగీ జీవితముగా, న్యాచురల్ జీవితముగా అనుభవము చేస్తున్నారా? బాప్ దాదా ప్రతి బిడ్డ మస్తకములో మెరుస్తున్న భాగ్యాన్ని చూస్తున్నారు. ఏమి చూస్తున్నారు? నా పిల్లలు ప్రతి ఒక్కరూ స్వమానధారులు, స్వరాజ్య అధికారులు. ఎందుకని? ఎక్కడైతే స్వమానము ఉంటుందో అక్కడ దేహ భానము రాలేదు. ఆది నుండి అంతిమము వరకు, ఇప్పటివరకు బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ భిన్న-భిన్న స్వమానాలను ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడైనా స్వమానాలను గుర్తు తెచ్చుకుంటూ ఒక్కొక్క స్వమాన మాలను తిప్పుతూ ఉన్నట్లయితే అనేక స్వమానాల స్వరూపులుగా అయి స్వమానములో లవలీనమైపోతారు. కానీ బాప్ దాదాకు పిల్లల్లోని ఒక్క విషయము ఇప్పటికీ నచ్చడము లేదు, అది ఏమిటో తెలుసా? స్వమానములో స్థితి అవ్వడమనేది మాకు అప్పుడప్పుడు కష్టమవుతుంది, స్థితి అవ్వాలని ఉంటుంది కానీ అప్పుడప్పుడు కష్టమవుతుంది అని ఏ బిడ్డ అయినా అన్నప్పుడు, సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లల కష్టాన్ని చూడలేరు ఎందుకంటే ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ కష్టము ఉండదు. ఎక్కడైతే కష్టముంటుందో అక్కడ ప్రేమలో లోపముందని అర్థం.

ఈ రోజు అమృతవేళ బాప్ దాదా నలువైపులా ఉన్న బ్రాహ్మణుల వద్దకు, దేశములోనైనా లేక విదేశాలలోనైనా అంతా చుట్టి వచ్చినప్పుడు, అక్కడ ఏం చూసారు? కొంతమంది పిల్లలు స్వమానములో కూర్చుని ఉన్నారు. నేను బాప్ దాదా హృదయ సింహాసనాధికారిని అని ఆలోచిస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ కూడా ఉన్నారు మరియు స్వమానములో స్థితులవ్వడానికి పురుషార్థము కూడా చేస్తూ ఉన్నారు, కానీ ఏ లోపము కనిపించింది? స్వమానము గుర్తుంది, దాని గురించి ఆలోచిస్తున్నారు, కానీ స్వమాన స్వరూపులుగా అయి, అనుభవీమూర్తులుగా అయి అనుభవము యొక్క అథారిటీ స్వరూపులుగా అవ్వడములో లోపము కనిపించింది ఎందుకంటే అథారిటీలైతే అనేకమున్నాయి కానీ అన్నింటికంటే పెద్ద అథారిటీ అనుభవము యొక్క అథారిటీ మరియు ఆ స్వమానాల అనుభూతిని ఆల్మైటీ అథారిటీ ఇచ్చారు. కష్టపడుతున్నారు కానీ అనుభవీ స్వరూపులుగా అవ్వడము లేదు. బాప్ దాదా ఏం చూసారంటే - పిల్లలు కూర్చుంటున్నారు, ఆలోచిస్తున్నారు కూడా కానీ అనుభవీ స్వరూపులుగా కొద్దిమంది మాత్రమే అవుతున్నారు. అనుభవము ఉన్న చోట ఏ విధమైన దేహాభిమానమైనా కొద్దిగా కూడా తనవైపుకు ఆకర్షితము చెయ్యలేదు. కనుక అనుభవీ స్వరూపులుగా అవ్వండి, కర్మలు చేస్తూ కూడా కర్మయోగీ యొక్క అనుభవీ స్వరూపములో నిమగ్నమైపోండి, ఇది ఇప్పుడు మరింత అవసరము. స్వరూపములో స్థితులవ్వండి, ప్రతి విషయములోనూ, ప్రతి సబ్జెక్టులోనూ అనుభవీ స్వరూపులుగా అవ్వండి. జ్ఞానములో, యోగములో, ధారణలో మరియు సేవలో, నాలుగు సబ్జెక్టులలోనూ అనుభవీ స్వరూపులుగా అవ్వండి. అనుభవీని మాయ కూడా కదిలించలేదు. అందుకే బాప్ దాదా ఈ రోజు పిల్లలందరినీ అనుభవీ స్వరూపులుగా చూడాలని కోరుకుంటున్నారు. వినడములో మరియు ఆలోచించడములో తేడా ఉంది, కానీ అనుభవీ స్వరూపులుగా అవ్వండి. ఏదైతే అనుకుంటారో, ఏ స్వమానములోనైతే స్థితులవ్వాలనుకుంటారో, ఆ అనుభవ స్వరూపములో స్థితులైపోవాలి. అనుభవీని ఎవ్వరూ కదిలించలేరు ఎందుకంటే స్వమానము మరియు దేహభానము - ఎక్కడైతే స్వమాన స్వరూపము ఉంటుందో, స్వమానము యొక్క అనుభవములో స్థితులై ఉంటారో అక్కడ దేహ భానము రాలేదు. ఎలాగంటే చూడండి, అంధకారము ఉందనుకోండి, కానీ మీరు లైట్ యొక్క స్విచ్ ను ఆన్ చెసినట్లయితే అంధకారము ఆటోమేటిక్ గా మాయమైపోతుంది. అంధకారాన్ని తొలగించడానికి, అంధకారాన్ని పారద్రోలడానికి శ్రమించనవసరము లేదు. అలాగే స్వమానమనే సీట్ పై అనుభవమనే స్విచ్ ఆన్ అయినట్లయితే ఏ విధమైన దేహ భానము రాదు. భిన్న-భిన్న రకాల దేహ భానాలు కూడా ఉన్నాయి మరియు భిన్న-భిన్న రకాల స్వమానాలను కూడా బాబా ఇచ్చి ఉన్నారు. స్వమానాలు తెలుసు, పురుషార్థము కూడా చేస్తున్నారు కానీ అనుభవము చేసేందుకు పురుషార్థము చెయ్యడములో మరియు అనుభవీ స్వరూపులుగా అవ్వడములో తేడా ఉంది, అందుకే కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడు సమయమనుసారముగా బాబా సమానముగా అయ్యే లక్ష్యాన్ని సంపన్నము చేసే సమయములో పిల్లలు కష్టపడటం బాప్ దాదాకు మంచిగా అనిపించడము లేదు. నేను కర్మయోగీ జీవితము కల ఆత్మనా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. జీవితమనేది న్యాచురల్ గా, సదాకాలం కోసం ఉంటుంది, అప్పుడప్పుడూ ఉండదు. ఇటువంటి అనుభవీ స్వరూపులుగా అవ్వండి. యోగీ జీవితము యొక్క లక్ష్యమేదైతే పెట్టుకున్నారో, అనుభవీమూర్తులుగా అవ్వాలి అన్న లక్ష్యమేదైతే పెట్టుకున్నారో, ఆ లక్ష్యము సంపన్నమవుతుందా? మస్తకముపై మెరుస్తున్న ప్రకాశము సదా స్వయానికి కూడా అనుభవమవ్వాలి, స్వయము కూడా ఆ స్వరూపములో స్థితులవ్వాలి, స్మృతి స్వరూపులుగా ఉండాలి. స్మృతి చేసేవారిగా కాదు, స్మృతి స్వరూపులుగా ఉండాలి మరియు స్మృతి స్వరూపులుగా ఉన్నారా లేదా అన్నదానికి ప్రమాణము ఏమిటంటే - ఎక్కడైతే స్మృతి యొక్క అనుభవీ స్వరూపులుగా ఉంటారో, అక్కడ ప్రతి కార్యాన్ని చేస్తూ స్వయములో సమర్థత అనుభవమవుతుంది. భిన్న-భిన్న కార్యాలు ఉండవచ్చు కానీ అనుభవ స్వరూపము యొక్క స్థితి భిన్న-భిన్నముగా ఉండదు.

అసలు ఎందుకు కష్టపడాల్సి వస్తుంది అనేది ఈ రోజు బాప్ దాదా చూసారు. అనుభవీ స్వరూపముగా అవ్వడములో నంబరువారు పురుషార్థానుసారముగా ఉండటాన్ని చూసాము. బాప్ దాదాకు ప్రతి బిడ్డ పట్ల గాఢమైన ప్రేమ ఉంది. ఎవరి పట్లనైతే ప్రేమ ఉంటుందో వారు కష్టపడటాన్ని చూడలేము. ఏ సబ్జెక్టులో కష్టపడాల్సి వస్తున్నా, అప్పుడప్పుడు అన్న పదాన్ని ఉపయోగించాల్సి వస్తున్నా, దానికి కారణమేమిటంటే - అనుభవీ స్వరూపులుగా అవ్వడములో లోటు. పురుషార్థులుగా ఉన్నారు కానీ స్వరూపులుగా అవ్వలేదు. ఒక్క క్షణములో నాలుగు సబ్జెక్టులలోనూ తమ స్వమానాల అనుభవీ స్వరూపము యొక్క అనుభూతి కలగాలి, దేహాభిమానము దగ్గరకు కూడా రాలేకపోవాలి. ఏ విధముగా ప్రకాశము ముందు చీకటి నిలవలేదు. అంధకారాన్ని తొలగించాల్సిన అవసరము ఉండదు. ఎక్కడైతే అంధకారము ఉంటుందో, అక్కడ ప్రకాశము తక్కువగా ఉంటుంది లేక అసలు ఉండనే ఉండదు, అది న్యాచురల్. కావున అన్నిటికన్నా అతి పెద్ద అథారిటీ అనుభవము అని అంటూ ఉంటారు. అనుభవాన్ని వేలాదిమంది మార్చాలనుకున్నా మార్చలేరు. ఉదాహరణకు, మీరందరూ చక్కెర తియ్యగా ఉంటుందని అనుభవము చేసి ఉన్నారు, ఈ విషయములో ఒకవేళ వేలాదిమంది మిమ్మల్ని మార్చాలని అనుకున్నా మీరు మారుతారా? అలాగే ఏయే సబ్జెక్టులైతే ఉన్నాయో, జ్ఞానము, యోగము, ధారణ మరియు సేవ, ఈ నాలుగింటిలోనూ ఏ ఒక్క దానిలో కష్టముగా అనిపించినా కానీ తప్పకుండా అది అనుభవములో లోపము. సేవలో సఫలత, ధారణలో స్వభావ-సంస్కారాల పరివర్తన, యోగములో అచలముగా ఉండటము, యోగీ జీవితాన్ని అనుభవము చెయ్యడము, వీటిలో ఎక్కడైతే కష్టముంటుందో లేక ఎక్కడైతే అప్పుడప్పుడు అని అంటారో, దాని అర్థమేమిటంటే, ఆ సబ్జెక్టులో మీరు అనుభవీమూర్తులుగా అవ్వలేదు అని. అనుభవమనేది అప్పుడప్పుడు ఉండదు, అది న్యాచురల్ నేచర్ గా ఉంటుంది. మరి కష్టపడటానికి కారణమేమిటో ఇప్పుడు విన్నారా? ఏ సమయములోనైతే అనుభవమనే సీట్ పై సెట్ అవుతారో, ఏదో ఒక వరదానము యొక్క స్వరూపములో అనుభవీలుగా అయి అనుభవము చేస్తారో, ఆ సమయములో కష్టపడాల్సిన అవసరము రాదు, న్యాచురల్ అనుభూతి కలుగుతుంది, అందుకే ఇప్పుడు సమయమనుసారముగా అన్నీ అకస్మాత్తుగా జరగనున్నాయి. ఏదీ చెప్పి జరగదు. ఎలా అయితే ఇప్పుడు ప్రకృతిలో అన్నీ ఆకస్మిక ఆటలే జరుగుతున్నాయో, ఇప్పుడది ఆరంభమయింది, కొత్త-కొత్త విషయాలు అకస్మాత్తుగా జరుగుతున్నాయి, ఉదాహరణకు భూకంపము వచ్చింది, కొద్ది సమయములోనే లక్షలాదిమంది ఆత్మలు వెళ్ళిపోయాయి. రేపు మేము ఉంటామా లేదా అని వారికి తెలుసా? ఇలాగే అనేక ప్రమాదాలు భిన్న-భిన్న స్థానాలలో అకస్మాత్తుగా జరగడము ఆరంభమయ్యాయి. గుంపులు గుంపులుగా ఒకే సమయములో అనేకుల టికెట్ కట్ అయిపోతుంది. అటువంటి సమయానికి మీరు ఎవర్రెడీగా ఉన్నారా? పురుషార్థము చేస్తున్నాను అని అప్పుడు చెప్పరు కదా? ఎవర్రెడీ అనగా ఏ వరదానమునైనా, స్వమానాన్ని అయినా, సంకల్పము చెయ్యగానే ఆ స్వరూపములోకి వచ్చేయాలి. అందుకే బాప్ దాదా ఈ రోజు ఈ విషయము పట్ల అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఏ వరదానమునైనా ఫలప్రదం చేసి వరదానము లేక స్వమాన స్వరూపము యొక్క అనుభవీలుగా అవ్వగలరా? అవ్వాల్సిందే. ప్రయత్నిస్తున్నాను అని అంటే, ఒకవేళ ప్రయత్నించాలనుకున్నా అది ఇప్పటినుండే చేయండి ఎందుకంటే బహుకాలపు అభ్యాసము సమయానికి సహాయము చేస్తుంది. పురుషార్థీలుగా కాదు, అనుభవీలుగా అవ్వండి ఎందుకంటే అనుభవమనే అథారిటీని మీ అందరికీ ఆల్మైటీ అథారిటీ ఇచ్చారు. ఎలాగైతే దేహభానము యొక్క అనుభవము ఉంది కదా, కావున నేను ఫలానాను అని దేహ భానాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరము ఉంటుందా! ఉదాహరణకు, మీ పేరు దేహము ఆధారముగా వచ్చింది, అక్కడ అది దేహ భానము కలిగినట్లే కదా, నేను ఫలానాను అని అనుకుంటారు. ఒకవేళ వేలాదిమంది వచ్చి - మీరు ఫలానా కాదు, మీరు ఇంకేదో అని చెప్పినా, మీ పేరును మార్చి చెప్పినా, అక్కడ మీరు ఒప్పుకుంటారా? మీ పేరును మర్చిపోతారా! జన్మ తీసుకోగానే ఏదైతే పేరు వచ్చిందో, ఆ దేహ భానము ఎంత పక్కాగా, న్యాచురల్ గా ఉంటుంది. వేరే ఎవరినైనా మీ పేరుతో పిలిచినా కూడా, మిమ్మల్ని పిలవడము లేదు, కానీ మీ పేరున్న వారిని ఇంకొకరిని పిలిచినా కానీ, మీ పేరును వినగానే మిమ్మల్ని పిలుస్తున్నారేమో అని మీ చెవులు అటెన్షన్ పెడతాయి. దేహ భానము అంతగా పక్కా అయిపోయింది. అలాగే దేహీ-అభిమాని, స్వమానధారి, స్వరాజ్య అధికారి - ఇవి కూడా అంత పక్కా అయిపోవాలి. మీరంటారు కదా, మా జీవితము పరివర్తన చెందింది అని, మరి ఏ పరివర్తన తీసుకువచ్చారు? దేహ భానము నుండి స్వమానము, స్వరాజ్య అధికారులుగా అయ్యారు. కావున చెక్ చేసుకోండి, జ్ఞాన స్వరూపునిగా అయ్యానా? లేక జ్ఞానాన్ని వింటూ వినిపించేవానిగా అయ్యానా? జ్ఞానము అంటే నాలెడ్జ్, నాలెడ్జ్ యొక్క ప్రాక్టికల్ స్వరూపము. నాలెడ్జ్ ఈజ్ లైట్ (జ్ఞానము ప్రకాశమువంటిది), నాలెడ్జ్ ఈజ్ మైట్ (జ్ఞానము శక్తివంటిది) అని నాలెడ్జ్ గురించి అంటారు. కనుక జ్ఞాన స్వరూపులుగా అవ్వడమంటే ఏ కర్మను చేసినా అది లైట్ మరియు మైట్ కలిగి ఉంటుంది, యథార్థముగా ఉంటుంది. దీనినే జ్ఞాన స్వరూపులుగా అవ్వడము అని అంటారు. జ్ఞానాన్ని వినిపించేవారిగా కాదు, జ్ఞాన స్వరూపులుగా అవ్వడము. యోగ స్వరూపులు అంటే కర్మేంద్రియజీతులుగా అవ్వడము అని అర్థము. ప్రతి కర్మేంద్రియముపై స్వరాజ్యాధికారము. దీనినే యోగము అనగా యుక్తీయుక్త జీవితము అని అంటారు. ఈ విధముగా జ్ఞాన-యోగాల స్వరూపులుగా ఉన్నట్లయితే ప్రతి గుణము యొక్క ధారణ ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఎక్కడైతే జ్ఞానము, యోగము ఉంటాయో, యోగయుక్తముగా ఉంటారో, అక్కడ గుణాల ధారణ ఆటోమేటిక్ గా జరుగుతుంది, సేవ ప్రతి సమయము ఆటోమేటిక్ గా జరుగుతుంది. సమయమనుసారముగా మనసా సేవనైనా చేయండి, వాచా సేవనైనా చేయండి, కర్మణా సేవనైనా, స్నేహ సంబంధాలలోనైనా చేయండి, సేవ కూడా అన్ని వేళలా అఖండముగా జరుగుతూనే ఉంటుంది. సంబంధ-సంపర్కాలలో కూడా సేవ జరుగుతుంది. ఉదాహరణకు, మీ బ్రాహ్మణ పరివారములో మీ సోదరి లేక సోదరుడు నిరాశతో ఉన్నారనుకోండి, పురుషార్థములో కాస్త డల్ గా ఉన్నారనుకోండి, ఏదైనా సంస్కారానికి వశమై ఉన్నారనుకోండి, సంపర్కములో ఉన్న అటువంటి ఆత్మకు మీరు ఉల్లాస-ఉత్సాహాలను అందించారంటే, సహయోగాన్ని అందించారంటే, స్నేహాన్ని అందించారంటే, మీ సేవలో దీనికి కూడా పుణ్యము జమ అవుతుంది. పడిపోయిన వారిని లేపడాన్ని పుణ్యమని అంటారు. కనుక, సంబంధ-సంపర్కాలలో కూడా సేవ చెయ్యడమే సత్యమైన సేవాధారుల కర్తవ్యము. సేవ లభించినప్పుడు లేక సేవ ఇవ్వడము జరిగినప్పుడు అదే సేవ అని అనుకోకండి. స్వయము మనసా, వాచా, కర్మణా, సంబంధ-సంపర్కాలలో సేవ ఆటోమేటిక్ గా జరుగుతూ ఉండాలి. కొన్నిసార్లు బాప్ దాదా ఏమి చూసారంటే, సంపర్కములో ఉన్నవారి స్వభావ-సంస్కారాలు కొంచెం ఉండాల్సిన విధముగా లేనప్పుడు - వీరింతే, వీరు మారరు, వీరి సేవ చెయ్యడము టైమ్ వేస్ట్ అని సంకల్పము చెయ్యడము - ఇది యథార్థమా? మేము ప్రకృతిని కూడా సతోప్రధానముగా చేసేవారము అని మీరు స్వయము గురించి భావిస్తున్నప్పుడు, వీరంతా మనుష్యాత్మలు, బ్రాహ్మణులు అని పిలవబడుతున్నవారు, కాకపోతే సంస్కారానికి వశమై ఉన్నారు. ప్రకృతి యొక్క సంస్కారాన్ని మారుస్తాము అని ఛాలెంజ్ చేసినప్పుడు ప్రకృతితో పోల్చి చూస్తే వీరు పురుష్, ఆత్మ. మీ సంబంధములో ఉన్నవారు. సత్యమైన సేవాధారి తమ సేవా పుణ్యాన్ని జమ చేసుకోవడానికి శుభ భావనను తప్పకుండా ఉంచుకుంటారు. వీరింతే, వీరు ఇక మారనే మారరు - దీనిని శుభ భావన అని అనరు, ఇది సూక్ష్మ ద్వేష భావము. ఎంతైనా వారు మన సోదరీ-సోదరులే కదా, ఎంతైనా నా బాబా అనైతే అంటారు కదా! సత్యమైన సేవాధారులు శుభ భావనలు ఇచ్చే సేవలో కూడా పుణ్యాన్ని సంపాదించుకుంటారు. పడిపోయిన వారిని మరింత పడేయకండి, లేపండి, వారికి సహయోగాన్ని ఇవ్వండి, అటువంటివారిని సత్యమైన సేవాధారి, పుణ్యాత్మ అని అంటారు. మరి స్వయాన్ని ఈ విధముగా చెక్ చేసుకోండి - అంతటి సేవా ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయా? అటువంటివారినే అనుభవము యొక్క అథారిటీ కలవారు అని అంటారు. ఇప్పుడు బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు, అనుభవీ మూర్తులుగా అవ్వండి, అనుభవము యొక్క అథారిటీని కార్యములోకి తీసుకురండి.

నాలుగు సబ్జెక్టులలోనూ ఎవరైతే స్వయాన్ని అనుభవీ స్వరూపులుగా చేసుకుని అనుభవము యొక్క అథారిటీని కార్యములోకి తీసుకువస్తాము అని అంటారో, ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని తొలగించుకుంటామని అంటారో, అంతగా స్వయముపై అటెన్షన్ పెడతాము అని అంటారో, వారు చేతులెత్తండి. మనసు యొక్క చేతిని ఎత్తుతున్నారు కదా! శరీరము యొక్క చేతిని కాదు, మనసు యొక్క చేతిని ఎత్తండి. మనసు యొక్క చేతిని ఎత్తాలి ఎందుకంటే బాప్ దాదా శివరాత్రికి రిజల్టును చూస్తారు. ఎవరిలోనైనా బలహీనతతో కూడిన సంస్కారము ఉంటే, దాని వలన మీ మనసులోని శుభ భావనను తగ్గించుకోకూడదు. వారి సంస్కారము బలహీనముగా ఉంది కానీ అది ఎంత శక్తివంతముగా ఉందంటే, అది మీలోని శుభ భావనను తగ్గించేస్తుంది. బ్రహ్మాబాబా చూడలేనిది ఏముంది! చెయ్యలేనిది ఏముంది! బాధ్యత ఉన్నప్పటికీ కూడా అంతిమములో శుభ భావన, శుభ కామనలతో కూడిన మూడు పదాల శిక్షణను అందరికీ ఇచ్చి వెళ్ళారు. గుర్తుంది కదా! మూడు పదాలు గుర్తున్నాయి కదా! స్వయము కూడా నిరాకారి, నిరహంకారి, నిర్వికారి, ఈ స్థితిలోనే అవ్యక్తమయ్యారు, ఎవ్వరికీ కూడా కర్మభోగము యొక్క ఫీలింగ్ ను తెప్పించలేదు, వారి కర్మభోగము సమాప్తమవుతూ ఉంది అని ఎవరికైనా అనిపించిందా! ఏమైంది? అవ్యక్తమైపోయారు. ఈ విధముగా బ్రహ్మాబాబా సమానముగా ఫరిశ్తా భవ అనే వరదానమేదైతే బాబా చేసి చూపించారో, ఫాలో బ్రహ్మాబాబా. నా బాబా అని మీరు అంటారు కదా, మరి బాబా ఏమంటారు? నా పిల్లలు అని అంటారు. ఇటువంటి శుభ భావన పరస్పరము పరివారములో కూడా ఉండటము అవసరము. స్వభావాన్ని చూడకండి. భావ స్వభావాలు ఉన్నాయని బాబాకు తెలుసు, కానీ భావ స్వభావాలు ప్రేమను సమాప్తము చేయకూడదు, సంబంధాలను సమాప్తము చేయకూడదు, కార్యాన్ని తక్కువ సఫలము చెయ్యకూడదు, అది రైట్ కాదు. ఇది పరివారము. ఏ పరివారము? ప్రభు పరివారము, పరమాత్మ పరివారము. ఏ కారణము చేతనైనా ఇందులో ప్రేమ తగ్గకూడదు. ప్రేమ అనగా శుభ భావన తప్పకుండా ఉండాలి. ఎటువంటివారైనా కానీ, వారు పరమాత్ముని పరివారము. నేను ప్రభు పరివారానికి చెందినవాడిని అని భావించినప్పుడు, మరి పరివారము అనగా ప్రేమ. ఒకవేళ పరివారములో ప్రేమ లేకపోతే పరివారమే లేనట్లు. ఈ పరమాత్మ పరివారము ఒక్క సమయములోనే ఉంటుంది, ఇంత పెద్ద పరివారము పరమాత్మునికి తప్ప మరెవ్వరికీ ఉండనే ఉండదు. కావున చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇది కూడా పురుషార్థములో విఘ్నముగా అవుతుంది. విఘ్నముక్తులుగా అయినప్పుడే అనుభవీలుగా అయ్యి అనుభవము యొక్క అథారిటీ ద్వారా అందరినీ అనుభవీలుగా చేస్తారు. అచ్ఛా!

నలువైపులా ఉన్న పిల్లలను బాప్ దాదా చూస్తూ-చూస్తూ సంతోషముతో - వాహ్ పిల్లలు వాహ్! అన్న పాటను పాడుతున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయములో బాబా ఉన్నారు మరియు బాబా హృదయములో పిల్లలు ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఇక్కడ ఇంతటి పరివారాన్ని, మధుబన్ నివాసులను చూసి - వాహ్ మధుబన్ వాహ్! అన్న సంతోషము కూడా కలుగుతుంది. అందరి ఆశ్రయ స్థానము మధుబనే, అందుకే మధుబన్ కు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఇప్పుడు బాబా ఆశను త్వరత్వరగా పూర్తి చేయాలి. నాలుగు సబ్జెక్టులలోనూ అనుభవీ స్వరూపులుగా అవ్వాల్సిందే. దేశ-విదేశాలలో నలువైపులా కూర్చుని ఉన్న పిల్లలను, వారు ఎక్కడ కూర్చుని ఉన్నా బాప్ దాదా వారిని చూస్తున్నారు. అందరూ చూస్తూ-చూస్తూ ఎంతగా సంతోషిస్తున్నారు. ఈ సాధనాలు, ఈ సైన్స్ ఈ సమయములోనే ఉన్నతిలోకి వెళ్తున్నాయి, కొత్త-కొత్త ఇన్వెన్షన్లను ప్రపంచములో చేస్తున్నారు, మీ లాభము కోసం మంచి-మంచి సాధనాలను తయారుచేస్తున్నారు. దూరముగా ఉన్నప్పటికీ తోడుగా ఉన్నారు. కనుక ఈ సాధనాలను తయారుచేసినందుకు సైన్సువారికి కూడా అభినందనలు. అచ్ఛా. దేశ-విదేశాలలోని పిల్లలందరూ చాలా-చాలా హృదయపూర్వక ప్రేమను మరియు స్మృతిని స్వీకరించండి మరియు విశేషముగా ఇటువంటి విశేషమైన పిల్లలకు నమస్తే.

వరదానము:-
జ్ఞానమనే లైట్ ద్వారా పురుషార్థ మార్గాన్ని సహజము మరియు స్పష్టము చేసే ఫరిశ్తా స్వరూప భవ

ఫరిశ్తా జీవితములో లైట్ మరియు మైట్, రెండూ స్పష్టముగా కనిపిస్తాయి. కానీ లైట్ మరియు మైట్ రూపముగా అయ్యేందుకు మననము చేసే శక్తి మరియు సహనము చేసే శక్తి అవసరము. మనసు కోసం మనన శక్తిని మరియు వాచా-కర్మణాల కోసం సహన శక్తిని ధారణ చేయండి, ఇక అప్పుడు ఏ మాటలు మాట్లాడినా, ఏ కర్మలు చేసినా, అవి దాని అనుసారముగానే జరుగుతాయి. ఒకవేళ ఈ రెండు శక్తులు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరి కోసం పురుషార్థ మార్గము సహజమవుతుంది మరియు స్పష్టమవుతుంది.

స్లోగన్:-
వ్యర్థము మాట్లాడటము అనగా అనేకులను డిస్టర్బ్ చేయడము.

అవ్యక్త ప్రేరణలు - ‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి’’

పిల్లలైన మీరు మాస్టర్ ప్రకృతిపతులు, ఈ ప్రకృతి యొక్క ఆటను చూస్తూ సంతోషిస్తూ ఉండండి. ప్రకృతి అలజడి చేసినా, సుందరమైన ఆటను చూపించినా, ప్రకృతిపతి ఆత్మలు రెండింటిలోనూ సాక్షీగా ఉంటూ ఆటను చూస్తారు మరియు ఆటలో ఆనందాన్ని అనుభవము చేస్తారు, అంతేకాక భయపడరు, అందుకే బాప్ దాదా తపస్య ద్వారా సాక్షీతనపు స్థితి అనే ఆసనముపై అచంచలముగా, స్థిరముగా ఉండే విశేష అభ్యాసాన్ని చేయిస్తున్నారు.