10-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - శివబాబా మరియు బ్రహ్మాబాబా, ఇరువురి మతము ప్రసిద్ధమైనది, మీరు ఇరువురి మతముపై నడుస్తూ మీ కళ్యాణము చేసుకోవాలి’’

ప్రశ్న:-
నంబరు వన్ ట్రస్టీ ఎవరు మరియు ఎలా?

జవాబు:-
శివబాబా నంబరు వన్ ట్రస్టీ, వారికి అస్సలు ఆసక్తి ఉండదు. భక్తి మార్గములో కూడా మీరు వారి పేరు మీద ఏదైతే దాన-పుణ్యాలు మొదలైనవి చేస్తారో, అదంతా ఇన్ష్యూర్ (బీమా) అయిపోతుంది, దాని ఫలము మరుసటి జన్మలో లభిస్తుంది. ఇప్పుడు కూడా తండ్రి పేరు మీద మీదంతా ఏదైతే ఇన్ష్యూర్ చేస్తారో, దానికి పూర్తి రిటర్న్ తండ్రి ఇస్తారు, ఎందుకంటే బాబా అంటారు - నేను స్వయమైతే సుఖము అనుభవించను, ఇక నేను మీది తీసుకుని ఏమి చేసుకుంటాను.

పాట:-
ప్రతిజ్ఞ చేసి మీ ద్వారము వద్దకు వచ్చాము...

ఓంశాంతి
మధురాతి-మధురమైన చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలు పాట విన్నారు. ఎవరైతే తండ్రికి చెందినవారిగా అవుతారో, వారిని పిల్లలు అని అనడము జరుగుతుంది. తండ్రి అర్థం చేయించారు - ఇది అంతిమ మరజీవా జన్మ, జీవిస్తూ తండ్రికి చెందినవారిగా అవ్వాలి. శ్రీమతము గాయనము చేయబడిందని పిల్లలకు తెలుసు. శ్రీమత్ భగవానువాచ. గీతలో శ్రీకృష్ణుని పేరును వేసారు కానీ శ్రీమతము శివబాబాది. వారి తర్వాత బ్రహ్మా, ఆ తర్వాత శ్రీకృష్ణుడు. శ్రీమతము శ్రీకృష్ణుడిది అని అనరు. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు మన శివబాబా. పతిత-పావన అని శ్రీకృష్ణుడిని గాని, రాధ మొదలైనవారిని గాని అనరు. వారు దైవీ గుణాలు కల మనుష్యులు. మనుష్యులను పతిత-పావనులని అనరు. సత్యయుగములో, పతిత-పావనా రండి అని అనరు. పతితులను పావనముగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే, వారి శ్రీమతముపై మీరు నడుస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మా యొక్క మతము కూడా ప్రసిద్ధమైనది. శ్రీమతము కూడా ప్రసిద్ధమైనది. శివబాబా వచ్చి మిమ్మల్ని తమవారిగా చేసుకుంటారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తండ్రికి చెందినవారిగా అయ్యాము అని అంటారు. కావున వారి డైరెక్షన్లపై నడవాల్సి ఉంటుంది. మీరు తండ్రికి మీ మతాన్ని ఇవ్వాల్సిన అవసరము ఉండదు. వారు స్వయం మతాన్ని ఇచ్చేవారు. మీరంతా పిల్లలే. శివబాబా ప్రసిద్ధమైనవారు. వారు ఏ మతాన్ని అయితే ఇస్తారో, ఏదైతే చేస్తారో అదంతా రైట్. ఇది చేయండి అని ఈ బ్రహ్మాకు కూడా వారు మతాన్ని ఇస్తారు. మీ కనెక్షనే శివబాబాతో ఉంది. ఎవరి అవగుణాలను చూడకూడదు, శ్రీమతముపై నడవాలి. శివబాబా అయితే నిరాకారుడు. వారి ఇల్లు ఇదైతే కాదు. మీరు ఇక్కడ పాత ఇంటిలో ఉంటున్నారు, ఆ తర్వాత స్వర్గములోకి వెళ్ళి మీ ఇంటిలో ఉంటారు. నేనైతే ఉండను అని శివబాబా అంటారు. నేనైతే ఇప్పుడు కొద్ది సమయము కోసం ఇక్కడకు వస్తాను.

మీరు సత్యాతి-సత్యమైన ఆత్మిక ముక్తిదళము. డ్రామా ప్లాన్ అనుసారముగా, కల్పక్రితం వలె సుప్రీమ్ ఆత్మ డైరెక్షన్లు ఇస్తున్నారు. కల్ప-కల్పము ఏ డైరెక్షన్లు అయితే ఇస్తూ ఉంటారో, అవే ఇస్తారు. రాత్రింబవళ్ళు గుహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు. కొత్తవారు ఎవరూ ఇవి అర్థం చేసుకోలేరు. కొందరు 35-40 సంవత్సరాల నుండి ఉంటారు, కానీ ఈ గంభీరమైన విషయాలను అర్థం చేసుకోనివారు చాలామంది ఉన్నారు. బాబా అయితే రోజూ కొత్తవి వినిపిస్తూ ఉంటారు. కరాచీ నుండి మొదలుకుని మురళీని పంపిస్తూ వచ్చారు. మొదటిలో బాబా మురళీని వినిపించేవారు కాదు. రాత్రి 2 గంటలకు లేచి 10-15 పేజీలు వ్రాసేవారు. బాబా వ్రాయించేవారు, ఆ తర్వాత దాని కాపీలు తీసేవారు. భక్తి మార్గములోనైతే శాస్త్రాలు మొదలైనవాటి కాగితాలను సంభాళిస్తారు. రోజురోజుకు పెద్ద-పెద్ద పుస్తకాలను తయారుచేస్తూ ఉంటారు. ఎన్ని బయోగ్రఫీలను తయారుచేస్తూ ఉంటారు. వాటిని చదువుకుని అలా ఉంచుకుంటారు. మీరైతే మురళీని చదువుకుని వదిలేస్తారు. వాస్తవానికి ఈ మహావాక్యాలను సదా కోసం ఉంచుకోవాలి. కానీ ఇవన్నీ వినాశనమైపోతాయని తెలుసు. చిత్రాలు మొదలైనవి ఏవైతే మీరు తయారుచేస్తారో, అవి కొద్ది సమయము కోసమే ఉంటాయి. ఆ తర్వాత అవి భూమిలో పూడ్చుకుపోతాయి. ఇక అక్కడ ఈ శాస్త్రాలు, చిత్రాలు మొదలైనవేవీ ఉండవు. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, ఇదంతా కల్పము తర్వాత కూడా జరుగుతుంది. శాస్త్రాలు మొదలైనవి మళ్ళీ ద్వాపరము నుండి ప్రారంభమవుతాయి. గ్రంథ్ కూడా మొదటిలో చేతితో వ్రాయబడినదిగా, చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు పెద్దదిగా తయారుచేశారు. రోజురోజుకు పెద్దదిగా తయారుచేస్తూ ఉంటారు. అలా చూస్తే, శివబాబా జీవిత కథను ఎంత వ్రాయాలి. పరమపిత పరమాత్ముని జీవిత కథ మాకు తెలుసు అని ఇప్పుడు పిల్లలైన మీరు అంటారు. తాను భక్తి మార్గములో ఏం చేస్తారు అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గములో కూడా ఇన్ష్యూరెన్స్ చేస్తాను. ఈశ్వరార్థము మనుష్యులు దాన-పుణ్యాలు చేస్తారు కదా. ఫలానావారు ఈశ్వరార్థము దాన-పుణ్యాలు చేశారని, అందుకు ఈశ్వరుడు పెద్ద ఇంటిలో జన్మనిచ్చారని అంటారు. భక్తి మార్గములో ధర్మాత్ములు చాలామంది ఉంటారు. ఈశ్వరార్థము, శ్రీకృష్ణార్థము దాన-పుణ్యాలు చేస్తారు, అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను పిల్లలకు మరుసటి జన్మకు అల్పకాలం కోసం ఫలాన్ని ఇస్తూ వచ్చాను. మంచి లేక చెడు ఫలమైతే లభిస్తుంది కదా. ఎంత ఇన్ష్యూరెన్స్ అయ్యింది. ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారో, దాని అనుసారముగా ఫలం లభిస్తుంది. మాయ తప్పుడు కర్మలు చేయిస్తుంది, వాటి వల్ల మీరు దుఃఖము పొందుతారు. ఇప్పుడు నేను మీకు ఎటువంటి కర్మలు నేర్పిస్తానంటే, ఇక మీకు ఎప్పుడూ దుఃఖము కలగదు మరియు మాయ కూడా అక్కడ ఉండదు. ఇకపోతే, ఎవరు ఎంత ఇన్ష్యూర్ చేసుకుంటే, అంత పదవి లభిస్తుంది. శివబాబా కూడా ట్రస్టీ కదా. వారు నంబరు వన్ ట్రస్టీ. వేరే ట్రస్టీలకు ఆసక్తి కలుగుతుంది, కొందరు ట్రస్టీలైతే ఇతరులదంతా నాశనము చేస్తారు. బాబా ఎటువంటి ట్రస్టీనో చూడండి, ఇదంతా పిల్లల కోసమే అని అంటారు. మీ కనెక్షన్ అంతా శివబాబాతో ఉంది. తండ్రి అంటారు, నేను సత్యమైన ట్రస్టీని. నేను స్వయము సుఖము తీసుకోను, పిల్లలకు మొత్తం రాజధాని అంతా ఇస్తాను. లౌకిక తండ్రి కూడా పిల్లలకు అంతా వారసత్వముగా ఇచ్చి వెళ్తారు. నేనైతే స్వర్గములో ఏమీ తీసుకోను. మీకే అంతా ఇస్తాను. కావున మీ కనెక్షన్ అంతా శివబాబాతో ఉంది. నేను కూడా పూర్తిగా ఇన్ష్యూర్ చేసుకున్నానని ఈ బాబా అంటారు. తనువు-మనసు-ధనము, అంతా తండ్రి సేవలో ఉంది. సింధీలో ఒక నానుడి ఉంది - ఎవరి చేతులు ఇలా (దాత రూపములో) ఉంటాయో, వారికే మొట్టమొదటి పంట లభిస్తుంది అని. తండ్రి వద్ద అంతా ఇన్ష్యూర్ చేసుకోవాలి. రెండు పిడికెళ్ళ బియ్యాన్ని ఇస్తే మహల్ లభించింది. ఇప్పుడు చూడండి, ఇల్లు తయారయ్యింది, మా ఇటుక కూడా పెట్టండి అని ఒకరు ఒక రూపాయిని పంపించారు. బాబా వారికి ఇలా వ్రాశారు - మీకైతే అందరికన్నా మంచి మహల్ లభిస్తుంది ఎందుకంటే మీరు పేదవారు. నేను ఉన్నదే పేదల పెన్నిధిని. పేదవారి ఒక రూపాయి షావుకారుల పదివేల రూపాయలతో సమానము. ఇద్దరికీ ఒకే పదవి లభిస్తుంది. షావుకారులు చాలా కష్టము మీద వస్తారు. అందరికన్నా కన్యలు ఫ్రీ గా ఉంటారు. మమ్మా నంబరు వన్ అయ్యారు చూడండి. ఆమె వద్దనైతే ఏమీ లేదు. పేద కుటుంబము నుండి వచ్చారు, అయినా కానీ నంబరు వన్ లోకి వెళ్ళిపోయారు. ఇతను (బ్రహ్మాబాబా) తనదంతా ఇచ్చారు, అయినా కానీ ముందు లక్ష్మీ, ఆ తర్వాత నారాయణుడు అని అంటారు. ఇది ఎంత అద్భుతమైన ఆట. కావున ఎప్పుడూ ఏ విషయములోనూ సంశయము ఉండకూడదు. బాప్ దాదా తక్కువేమీ కాదు. ఇందులో కొద్దిగా కూడా సంశయము రానివ్వకూడదు. చాలా మధురముగా కూడా అవ్వాలి. అడుగడుగునా శ్రీమతము తీసుకోవాలి. లేదంటే మాయ చాలా నష్టము కలిగిస్తుంది. పిల్లలకు ఎన్ని డైరెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. బాబా అంటారు - పూర్తి సమాచారము వ్రాయండి. బాబా అన్ని రకాలుగా సంభాళిస్తారు. ఫలానా బడ్డ ఉన్నతిలోకి వెళ్ళాలని బాబాకు చాలా సంకల్పము ఉంటుంది. చదువు పట్ల పూర్తి అటెన్షన్ ఉండాలి. మనము మోస్ట్ బిలవెడ్ గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్ (అత్యంత ప్రియమైన ఈశ్వరీయ విద్యార్థులము). భగవానువాచ అని కూడా వ్రాయబడి ఉంది కానీ శ్రీకృష్ణుడి పేరును వేసారు. శ్రీకృష్ణుడు కూడా మనుష్యులందరిలోనూ ఉన్నతోన్నతమైనవారు కదా. వారు మొదటి రాకుమారుడు. శ్రీకృష్ణుని పేరు తీసుకుంటారు కానీ శ్రీనారాయణుని పేరును ఎందుకు తీసుకోరు? శ్రీకృష్ణుడు చిన్న బాలుడు. చిన్నతనములో బాలుడు సతోప్రధానముగా ఉంటాడు. తర్వాత బాల్యము నుండి యువావస్థ, ఆ తర్వాత వృద్ధావస్థ వస్తుంది. పిల్లలకే మహిమ చేస్తారు ఎందుకంటే పిల్లలు పవిత్రమైనవారు కదా. పిల్లలను బ్రహ్మా జ్ఞానుల సమానమైనవారు అని అంటారు. పిల్లల ద్వారా ఏ పాపము జరగదు. కావున, శ్రీకృష్ణుడు కూడా చిన్న బాలుడు అయిన కారణముగా వారి జన్మదినాన్ని జరుపుకుంటారు. అయినా కానీ శ్రీకృష్ణుడిని ద్వాపరములో చూపించారు. ఇవన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ విషయాలన్నీ తెలిసినవారు బ్రాహ్మణులైన మీరు తప్ప ఈ ప్రపంచములో ఇంకెవరూ ఉండరు. బ్రాహ్మణులు ఉత్తమమైనవారు. బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానము. సత్యయుగములో ఈశ్వరీయ సంతానమని అనరు. ఈశ్వరుని ద్వారా తప్పకుండా స్వర్గ ప్రాప్తి లభిస్తుంది. ఇది మీకు అతి అరుదైన, అమూల్యమైన జీవితము. అందరికీ ఇలా ఉండదు. ఈ డ్రామా ఇలా తయారై ఉంది. కల్పక్రితం ఎవరైతే చదువుకున్నారో, వారు చదువుకుంటున్నారు. భగవంతుడు తప్పకుండా భగవాన్-భగవతీలను సృష్టించారు కానీ వారిని భగవాన్-భగవతి అని అనలేరు. గాడ్ ఈజ్ వన్ (భగవంతుడు ఒక్కరే). నిరాకారుడికి మహిమ ఉంది. సాకారునికి మహిమ ఉండదు కదా. ఈ లక్ష్మీ-నారాయణులను నిరాకారుడే ఈ విధముగా తయారుచేసారు. వీరు ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. రాజధాని స్థాపన అయినప్పుడు, ఆ సమయములో వినాశనము కూడా జరిగింది. తండ్రి తప్పకుండా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడిది సంగమము యొక్క విషయము. శివబాబా వచ్చినప్పుడు ఆట పూర్తవుతుంది, ఆ తర్వాత శ్రీకృష్ణుని జన్మ జరుగుతుంది. మనుష్యులు పాపం తికమకలో ఉన్నారు, అందుకే తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా శాస్త్రాలన్నింటి సారాన్ని తెలియజేస్తారు. ఇప్పుడు మీరు మాస్టర్ నాలెడ్జ్ పుల్ గా అయ్యారు. మహిమ అంతా ఆత్మదే. జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, బ్లిస్ ఫుల్ - ఇది తండ్రి మహిమ. తండ్రి అంటారు - ఈ భారత్ అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానము. కానీ శ్రీకృష్ణుని పేరు వేయడముతో మహిమను అంతా మాయము చేసారు. లేదంటే అందరూ శివుని మందిరాలలో పుష్పాలు అర్పిస్తారు, సర్వుల సద్గతిదాత వారొక్కరే. అర్ధకల్పము మీరు ప్రారబ్ధాన్ని అనుభవించి, ఆ తర్వాత కిందకు వస్తారు. అందరూ తమోప్రధానముగా అవ్వాల్సిందే. ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలైన మీ కోసం కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాను. అక్కడకు నేను రాను, అంతా పిల్లలైన మీ కోసమే. ఇది స్పష్టమైన విషయము. మనుష్యులు తమ కోసం చేసుకుంటారు కానీ నిష్కామ సేవ చేస్తున్నామని అంటారు. కానీ నిష్కామ సేవను ఎవ్వరూ చేయలేరు. ప్రతీ దానికి ఫలం తప్పకుండా లభిస్తుంది. నేను పిల్లలైన మీకు అవినాశీ జ్ఞాన రత్నాలను ఇస్తాను. మీ కోసమే వైకుంఠాన్ని తీసుకువచ్చాను. పిల్లలకు సావనీయర్ ఆఫ్ సావరినిటీ (రాజ్యాధికార స్మారక) ను ఇస్తారు కావున అది తీసుకునేందుకు ఆ విధముగా యోగ్యులుగా అవ్వాలి. స్వర్గానికి యజమానులుగా అవ్వాలి. అరచేతిలో స్వర్గము లభిస్తుంది. క్షణములో జీవన్ముక్తి అనగా క్షణములో రాజ్యాధికారము. దివ్యదృష్టి దాత శివబాబా. వారు క్షణములో వైకుంఠములోకి తీసుకువెళ్తారు, ఈ బాబా (బ్రహ్మా) చేతిలో తాళంచెవి ఏమీ లేదు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు రాజ్యాన్ని ఇస్తాను, నేను రాజ్యము చేయను. తర్వాత ఎప్పుడైతే మీరు భక్తి మార్గములోకి వెళ్తారో, అప్పుడు, మిమ్మల్ని దివ్యదృష్టితో ఆహ్లాదపరచవలసి ఉంటుంది. ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఇటువంటి బాబా కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమయుగములో ఒక్కసారి మాత్రమే వస్తారు. ముందే నిశ్చితమై ఉన్న డ్రామా యథావిధిగా జరుగుతోంది, ఇక కొత్తగా ఏదీ రూపుదాల్చదు, అంతా ఇప్పటికే క్రమబద్ధంగా నడుస్తోంది, మరి ఆందోళన ఎందుకు? ఏదైతే జరుగుతుందో, అది డ్రామాలో నిశ్చితమై ఉంది. దానిని సాక్షీగా అయి చూడండి. బాబా చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తారు. పిల్లలూ, నేను మీ ఇన్ష్యూరెన్స్ మ్యాగ్నెట్ ను. మీ ఒక్క పైసాను కూడా నేను వ్యర్థముగా పోగొట్టను. గవ్వ నుండి మిమ్మల్ని వజ్రతుల్యముగా తయారుచేస్తాను. ఇదంతా శివబాబా వీరి ద్వారా చేస్తారు, శివబాబా కరన్ కరావన్ హార్ (చేసేవారు, చేయించేవారు). వారు నిరాకారుడు, నిరహంకారి. గాడ్ ఫాదర్ ఎలా కూర్చుని చదివిస్తున్నారు. చరణాలపై పడండి అని వారు అనరు. తండ్రి విధేయుడైన సేవకుడు. తండ్రి అంటారు - ఎవరినైతే యజమానులుగా చేసానో, వారు సుఖాన్ని అనుభవించి-అనుభవించి ఇప్పుడు దుఃఖితులుగా అయ్యారు. సుఖము కూడా చాలా లభిస్తుంది. ఇంత సుఖము ఏ ధర్మము వారికీ లభించదు. భారతవాసులకే ఎందుకు లభిస్తుంది, మిగిలినవారు ఏమి చేసారు అని అనలేము. అరే, ఇంతమంది మనుష్యులు ఉన్నారు, అందరూ అయితే రాలేరు కదా. డ్రామా ఆ విధముగా తయారై ఉంది. భారత్ లోనే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండేది. భగవంతుడు వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పించారు. తండ్రి అంటారు - నేను మళ్ళీ వచ్చి ఉన్నాను. 84 జన్మల పాత్రను అభినయించాము, ఇప్పుడు మళ్ళీ మనము ఇంటికి వెళ్తామని మీకు కూడా తెలుసు. ఇది చాలా పాత శరీరము అయిపోయింది (సర్పము యొక్క ఉదాహరణ). సన్యాసులేమో ఆత్మ పరమాత్మలో లీనమవుతుందని అంటారు. ఇటువంటి అవస్థలో ఉంటూ-ఉంటూ శరీరాన్ని వదిలేస్తారు కానీ బ్రహ్మతత్వములో ఎవరూ లీనమవ్వరు. వారిలో కూడా కొందరు చాలా చురుకుగా ఉంటారు. శాంతిగా కూర్చుని శరీరము వదిలి వెళ్ళిపోతారు, అప్పుడు ఆ వాయుమండలములో 2-3 రోజుల వరకు నిశ్శబ్దత ఏర్పడుతుంది. ఈ పాత శరీరాన్ని వదిలి బాబా వద్దకు వెళ్తామని మీకు తెలుసు. బ్రహ్మతత్వము బాబా కాదు, ఇది పాపం వారి భ్రమ. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని సాక్షీగా చూడాలి ఎందుకంటే ముందే నిశ్చితమై ఉన్న డ్రామా యథావిధిగా జరుగుతోంది. ఎప్పుడూ ఏ విషయములోనూ సంశయము రానివ్వకూడదు.

2. తండ్రి ఇన్ష్యూరెన్స్ మ్యాగ్నెట్, అందుకే తనువు-మనసు-ధనములను తండ్రి సేవలో సఫలం చేసుకుని తమ భవిష్యత్తును తయారుచేసుకోవాలి. తండ్రితో పూర్తి కనెక్షన్ ను పెట్టుకోవాలి. వారికి పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి.

వరదానము:-
మరజీవా స్థితి ద్వారా ధైర్యము మరియు ఉల్లాసముల అవినాశీ స్టాంపును వేసే ప్రాప్తి సంపన్న భవ

ఎవరైతే ప్రాప్తులతో సంపన్నముగా ఉంటారో, వారి ప్రతి నడవడిక, నయనాలు మరియు హావభావాల ద్వారా ఉల్లాస-ఉత్సాహాలు కనిపిస్తాయి. కానీ ధైర్యము మరియు ఉల్లాసము యొక్క అవినాశీ స్టాంపును వేసేందుకు మీ గతం యొక్క లేక ఈశ్వరీయ మర్యాదలకు విరుద్ధమైన సంస్కారాలు, స్వభావాలు, సంకల్పాలు మరియు కర్మలు ఏవైతే ఉంటాయో, వాటి నుండి మరజీవాగా అవ్వండి. ప్రతిజ్ఞ రూపీ స్విచ్ ను సెట్ చేసుకుని ప్రాక్టికల్ గా ప్రతిజ్ఞ అనుసారముగా నడుస్తూ ఉండండి. ధైర్యముతో పాటు ఉల్లాసము కూడా ఉన్నట్లయితే ప్రాప్తి యొక్క మెరుపు దూరము నుండే కనిపిస్తుంది.

స్లోగన్:-
మేళాలో మరియు గందరగోళములో డబుల్ లైట్ గా ఉండేవారే ధారణామూర్తులు.

అవ్యక్త ప్రేరణలు - సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి

మీ ప్రతి సంకల్పములో, ప్రతి మాటలో విశేషత ఉండాలి. సదా సరళ స్వభావము, సరళమైన మాటలు, సరళతా సంపన్నమైన కర్మలు ఉండాలి, ఇటువంటి సరళ స్వరూపులుగా ఉండండి. సదా ఒక్కరి మతముపై, ఒక్కరితో సర్వ సంబంధాలు, ఒక్కరి నుండి సర్వ ప్రాప్తులు, ఇలా ఒక్కరి ద్వారా సదా ఏకరసముగా ఉండే సహజ అభ్యాసులుగా అవ్వండి. సదా సంతోషముగా ఉండండి, సంతోషమనే ఖజానాను పంచండి. సంతోషమనే అలను అందరిలోనూ వ్యాపింపజేయండి, ఇదే సత్యమైన సేవ.