10-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా
ఉపకారము చేస్తారో, అలా మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి, సుఖమిచ్చేవారిగా అవ్వండి, ఈ
దేహాన్ని మర్చిపోతూ వెళ్ళండి’’
ప్రశ్న:-
దేహీ-అభిమానులుగా ఉండే పిల్లల ముఖ్యమైన గుర్తులేమిటి?
జవాబు:-
1. వారికి
పరస్పరములో ఒకరి పట్ల ఒకరికి చాలా-చాలా ఆత్మిక ప్రేమ ఉంటుంది. 2. వారెప్పుడూ ఇతరుల
లోపాలను వర్ణించరు. 3. వారు చాలా-చాలా సుఖమిచ్చేవారిగా ఉంటారు. 4. వారి సంతోషము
ఎప్పుడూ మాయమవ్వదు. వారు సదా అపారమైన సంతోషములో ఉంటారు. 5. వారు ఎప్పుడూ అభిప్రాయ
భేదాలలోకి రారు. 6. మేము ఆత్మలము, పరస్పరములో సోదరులము, ఈ స్మృతితో గుణాలను
గ్రహించేవారిగా ఉంటారు. వారికి అందరిలోనూ గుణాలే కనిపిస్తాయి. వారు స్వయము కూడా
గుణవంతులుగా ఉంటారు మరియు ఇతరులను కూడా గుణవంతులుగా తయారుచేస్తారు. 7. వారికి ఒక్క
తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రారు.
ఓంశాంతి
ఉన్నతోన్నతమైన అనంతమైన తండ్రికి సమ్ముఖముగా పిల్లలైన మీరందరూ కూర్చుని ఉన్నారు.
ఇటువంటి తండ్రి లభించినందుకు మీరు ఎంతటి భాగ్యశాలి. మీరు జ్ఞాన రత్నాలతో జోలిని
నింపుకోవడానికని, సంపాదన చేసుకోవడానికని జ్ఞాన సాగరుడైన తండ్రి వద్దకు వచ్చారు.
తండ్రి మధురాతి-మధురమైన పిల్లలైన మిమ్మల్ని ఎంత ఉన్నతిలోకి తీసుకువెళ్తారు. తండ్రి
అయితే కేవలం పిల్లలైన మిమ్మల్నే చూస్తారు, వారికైతే ఎవరినీ గుర్తు చేయవలసిన అవసరము
లేదు. వీరి (బ్రహ్మా) ఆత్మ అయితే తండ్రిని గుర్తు చేయాలి. తండ్రి అంటారు, మేము
ఇరువురము పిల్లలైన మిమ్మల్నే చూస్తాము. ఆత్మనైన నేనైతే సాక్షీగా చూడవలసిన అవసరము
లేదు, కానీ తండ్రి సాంగత్యములో నేను కూడా అలానే చూస్తాను. తండ్రితో పాటే ఉంటాను కదా.
నేను వారి బిడ్డను కనుక వారితో పాటు చూస్తూ ఉంటాను. నేను విశ్వానికి యజమానిగా అయి
తిరుగుతూ ఉంటాను, నేనే ఇది చేస్తున్నట్లుగా భావిస్తాను. నేను దృష్టి ఇస్తాను. దేహ
సహితముగా అంతా మర్చిపోవాల్సి ఉంటుంది. ఇకపోతే, తండ్రి మరియు కొడుకు ఒకటైనట్లుగా
ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, బాగా పురుషార్థము చేయండి.
ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారము చేస్తారో, అలా మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి,
సుఖమిచ్చేవారిగా అవ్వండి. పరస్పరములో ఎప్పుడూ కొట్లాడుకోకండి, గొడవపడకండి. స్వయాన్ని
ఆత్మగా భావిస్తూ ఈ దేహాన్ని మర్చిపోతూ వెళ్ళండి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ
గుర్తుకు రాకూడదు. ఇది కూడా జీవిస్తూనే మరణించే అవస్థ వంటిది, ఈ ప్రపంచము నుండి
మరణించినట్లుగా ఉంటారు. మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచము మరణించినట్లే
అని అంటారు కూడా. ఇక్కడ మీరు జీవిస్తూ మరణించాలి, శరీర భానాన్ని తొలగించుకుంటూ
ఉండండి. ఏకాంతములో కూర్చుని అభ్యాసము చేస్తూ ఉండండి. ఉదయము వేళ ఏకాంతములో కూర్చుని
మీతో మీరు మాట్లాడుకోండి. చాలా ఉల్లాసముతో తండ్రిని స్మృతి చేయండి - బాబా, ఇప్పుడిక
మేము మీ ఒడిలోకి వచ్చేసినట్లే. కేవలం ఒక్కరి స్మృతిలోనే శరీరము అంతమైపోవాలి...
దీనినే ఏకాంతము అని అంటారు. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ ఈ శరీరము రూపీ తోలు
వదిలిపోతుంది.
ఈ పాత ప్రపంచము, పాత దేహము సమాప్తమవ్వనున్నాయని మీకు తెలుసు. ఇకపోతే, పురుషార్థము
కోసమని కొద్దిగా సంగమయుగ సమయము ఉంది. బాబా, ఈ చదువు ఎప్పటివరకు కొనసాగుతుంది అని
పిల్లలు అడుగుతారు. బాబా అంటారు - ఎప్పటివరకైతే దైవీ రాజధాని స్థాపన అవ్వదో,
అప్పటివరకు వినిపిస్తూ ఉంటాను, తర్వాత కొత్త ప్రపంచములోకి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇది
పాత శరీరము, ఏదో ఒక కర్మభోగము కూడా ఉంటూ ఉంటుంది, ఇందులో బాబా సహాయము చేయాలి అనే ఆశ
పెట్టుకోకూడదు. ఒకవేళ దివాలా తీసినా లేక అనారోగ్యము వచ్చినా, తండ్రి అంటారు, ఇవి మీ
లెక్కాచారాలు. అయితే, యోగముతో ఆయుష్షు పెరుగుతుంది. మీ కృషి మీరు చేయండి, అంతేకానీ
కృప చూపమని అడగకండి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా అందులో కళ్యాణముంటుంది.
ఎంత వీలైతే అంత యోగబలముతో పని చేయండి. నన్ను కనురెప్పలలో దాచుకోండి... అని భక్తి
మార్గములో పాడుతూ ఉంటారు. ప్రియమైనవారిని కంటి రత్నమని, ప్రాణ ప్రియమైనవారని అంటారు.
ఈ తండ్రి అయితే చాలా ప్రియమైనవారు, కానీ గుప్తముగా ఉన్నారు. వారి పట్ల ఎంతటి ప్రేమ
ఉండాలంటే, ఇక అడగకండి. తండ్రి అయితే పిల్లలను తమ కనురెప్పలలో దాచిపెట్టే ఉంచుతారు.
కనురెప్పలు అంటే ఈ కనులకు సంబంధించినవి కాదు, ఇది బుద్ధికి సంబంధించిన విషయము.
అత్యంత ప్రియమైన నిరాకార తండ్రి మనల్ని చదివిస్తున్నారు. వారు జ్ఞాన సాగరుడు, సుఖ
సాగరుడు, ప్రేమ సాగరుడు. ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉండాలి.
వారు పిల్లలకు ఎంతటి నిష్కామ సేవను చేస్తారు. పిల్లలైన మిమ్మల్ని వజ్ర సమానముగా
తయారుచేస్తారు. వారు ఎంత మధురమైన బాబా. వారు ఎంత నిరహంకారిగా అయి పిల్లలైన మీకు సేవ
చేస్తారు. కనుక పిల్లలైన మీరు కూడా అంత ప్రేమగా సేవ చేయాలి. శ్రీమతమనుసారముగా
నడుచుకోవాలి. ఎక్కడైనా సొంత మతాన్ని అనుసరిస్తే, అదృష్టానికి అడ్డుగీత పడుతుంది.
పిల్లలైన మీకు పరస్పరములో ఒకరి పట్ల ఒకరికి చాలా-చాలా ఆత్మిక ప్రేమ ఉండాలి, కానీ
దేహాభిమానములోకి వచ్చిన కారణముగా పరస్పరములో ఆ ప్రేమ ఉండటం లేదు. ఫలానావారు ఇలా
ఉన్నారు, వారు ఇది చేస్తారు... అని ఒకరిలో ఒకరు లోపాలనే చూస్తూ ఉంటారు. మీరు
దేహీ-అభిమానులుగా ఉండేటప్పుడు ఎవరిలోనూ లోపాలు చూసేవారు కాదు, పరస్పరములో చాలా
ప్రేమ ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ అవస్థను ధారణ చేయాలి. ముందు మీరు ఎంత మధురముగా
ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ అలా మధురముగా, సదా సుఖమిచ్చేవారిగా అవ్వండి.
దేహాభిమానములోకి రావడముతో దుఃఖమిచ్చేవారిగా అయ్యారు, అందుకే మీ ఆత్మిక సంతోషము
మాయమైపోయింది. ఆయుష్షు కూడా తక్కువైపోయింది. మిమ్మల్ని సతోప్రధానముగా తయారుచేసి, సదా
సుఖమిచ్చేవారిగా తయారుచేయడానికి ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. మీరు ఎంతగా తండ్రిని
స్మృతి చేస్తూ ఉంటారో, అంతగా లోపాలు తొలగిపోతూ ఉంటాయి, అభిప్రాయ భేదాలు తొలగిపోతూ
ఉంటాయి. మేము సోదరీ-సోదరులము అనేది పక్కాగా గుర్తుండాలి. ఆత్మలను సోదర రూపములో
చూసినట్లయితే ఎల్లప్పుడూ గుణాలే కనిపిస్తాయి. అందరినీ గుణవంతులుగా తయారుచేసే
ప్రయత్నము చేయండి. అవగుణాలను వదిలి గుణాలను ధారణ చేయండి. ఎప్పుడూ ఎవరినీ నిందించకండి.
కొంతమందిలో ఎటువంటి లోపాలు ఉన్నాయంటే, స్వయము వారు కూడా అవి అర్థం చేసుకోలేరు, వారు
తమను తాము చాలా మంచివారని భావిస్తారు, కానీ లోపాలు ఉన్న కారణముగా అక్కడక్కడ తప్పుడు
మాటలు మాట్లాడుతూ ఉంటారు. సతోప్రధాన అవస్థలో ఇటువంటి విషయాలు ఉండవు. తమను తాము
చూసుకోండి - నేను ఎంత మధురముగా అయ్యాను? నాకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉంది? తండ్రి
పట్ల ఎలాంటి ప్రేమ ఉండాలంటే, ఇక పూర్తిగా వారికి అతుక్కుని ఉండాలి. బాబా, మీరు
మమ్మల్ని ఎంత ఉన్నతముగా, తెలివైనవారిగా చేస్తున్నారు, స్వర్గానికి యజమానులుగా
చేస్తున్నారు - ఈ విధముగా లోలోపల తండ్రిని మహిమ చేస్తూ పులకరించిపోవాలి. ఆత్మిక
సంతోషములో ఉండాలి. సంతోషానికి మించిన ఔషధము లేదు అని అంటూ ఉంటారు కూడా. తండ్రిని
కలుసుకున్న సంతోషము కూడా ఎంత ఉండాలి. సంగమములోనే పిల్లలైన మీకు 21 జన్మల కొరకు సదా
సంతోషముగా ఉండే ఔషధము లభిస్తుంది, అప్పుడిక ఎవరికీ ఏ విషయములోనూ చింత ఉండదు. ఇప్పుడు
ఎన్ని చింతలు ఉన్నాయి, అందుకే వాటి ప్రభావము శరీరము మీద కూడా పడుతుంది. మీకైతే ఏ
విషయములోనూ చింత లేదు. ఈ సంతోషమనే ఔషధాన్ని మీరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి.
ఇలా చేస్తే ఒకరికొకరు చాలా మర్యాద ఇచ్చుకున్నట్లు. ఇటువంటి మర్యాదను మనుష్యులు,
మనుష్యులకు ఇవ్వలేరు. మీరు తండ్రి శ్రీమతమనుసారముగా ఈ విధముగా మర్యాద ఇస్తారు.
ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే వారి క్షేమ సమాచారాలను అడగడము వంటిది. ఇది
జ్ఞానము మరియు యోగము యొక్క ఫస్ట్ క్లాస్ వండర్ ఫుల్ ఔషధము. ఈ ఔషధము ఒకే ఒక్క ఆత్మిక
సర్జన్ ద్వారా లభిస్తుంది. ‘మన్మనాభవ’, ‘మధ్యాజీభవ’ - ఇది కేవలం రెండు మహావాక్యాల
ఔషధము. అత్యంత ప్రియమైన తండ్రి నుండి విశ్వ రాజ్యాధికారము లభిస్తుంది, ఇది తక్కువ
విషయమేమీ కాదు. ఈ రెండు వాక్యాలే ప్రసిద్ధమైనవి. ఈ రెండు వాక్యాలతో మీరు సదా
ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అవుతారు. కనుక పిల్లలైన మీరు ఈ విషయాలను
స్మరించుకుంటూ హర్షితముగా ఉండాలి. ఈశ్వరీయ విద్యార్థి జీవితము అత్యుత్తమమైనది - ఈ
మహిమ కూడా ఇప్పటిదే. ఎంత వీలైతే అంత ఒకరికొకరు ఈ ఆత్మిక ఔషధాన్ని అందించుకోండి,
ఒకరికొకరు ఉన్నతి చేసుకోండి, టైమ్ వేస్ట్ చేయకండి. చాలా ఓర్పుతో, గంభీరతతో, తెలివితో
తండ్రిని స్మృతి చేయండి, మీ జీవితాన్ని వజ్రతుల్యముగా తయారుచేసుకోండి.
మధురమైన పిల్లలూ, తండ్రి నుండి ఏ శ్రీమతమైతే లభిస్తుందో, అందులో నిర్లక్ష్యము
చేయకూడదు. తండ్రి సందేశాన్ని అందరికీ చేర్చాలి. తండ్రి సందేశము అందరికీ లభించాలి కదా.
సందేశము చాలా సహజమైనది - కేవలం ఇదే విషయము చెప్పండి - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ
తండ్రిని స్మృతి చేయండి మరియు మనసా-వాచా-కర్మణా కర్మేంద్రియాలతో ఎటువంటి చెడు కర్మలు
చేయకండి. ఒకానొక రోజు మీ ఈ సైలెన్స్ బలం యొక్క శబ్దము వెలువడుతుంది. రోజురోజుకు మీ
ఉన్నతి జరుగుతూ ఉంటుంది. మీ పేరు ప్రఖ్యాతి చెందుతూ ఉంటుంది. ఇది మంచి సంస్థ, మంచి
పని చేస్తున్నారు, మార్గము కూడా చాలా సహజమైనది తెలియజేస్తున్నారు అని అందరూ
భావిస్తారు. బ్రాహ్మణుల ఈ వృక్షము చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది, ప్రజలు తయారవుతూ
ఉంటారు. సెంటర్లు చాలా వృద్ధి చెందుతాయి. మీ ప్రదర్శనీ కూడా ప్రతి గ్రామములోనూ
ఉంటుంది. పిల్లలైన మీరు చాలా భారీ సర్వీస్ చేయాలి. కొత్త-కొత్త సెంటర్లు తెరుచుకుంటూ
ఉంటాయి. అక్కడికి అనేకమంది మనుష్యులు వచ్చి తమ జీవితాన్ని వజ్రతుల్యముగా చేసుకుంటూ
ఉంటారు. పాపం ఎక్కడా ఎవరి కాలు జారిపోకుండా, మీరు ఒక్కొక్కరినీ చాలా ప్రేమగా
సంబాళించాలి. ఎన్ని ఎక్కువ సెంటర్లు ఉంటాయో, అంత ఎక్కువమంది వచ్చి ప్రాణదానాన్ని
పొందుతారు. ఎప్పుడైతే పిల్లలైన మీ ప్రభావము వెలువడుతుందో, అప్పుడు చాలామంది
పిలుస్తారు - ఇక్కడికి వచ్చి మాకు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే రాజయోగాన్ని
నేర్పించండి అని. స్వయముగా ఆ భగవంతుడే ఆబూలో విచ్చేసారని మున్ముందు చాలా ఆర్భాటము
జరుగుతుంది.
ఈ సమయములో పాత ప్రపంచములో అనేక అంతర్జాతీయ గొడవలు ఉండటాన్ని పిల్లలైన మీరు
చూస్తున్నారు. ఇప్పుడు ఈ గొడవలన్నీ సమాప్తమవ్వనున్నాయి, వీటి గురించి మీరు ఏ చింత
చేయనవసరము లేదు. మీరు అందరికీ ఇలా వినిపించండి - వీటిని పట్టించుకోకండి, ఇప్పుడిక ఈ
పాత ప్రపంచము సమాప్తమైనట్లే, దీని పట్ల మోహము పెట్టుకోకూడదు, ఒకవేళ మోహము
ఉన్నట్లయితే, హృదయము శుద్ధముగా లేనట్లయితే, అపారమైన సంతోషము కూడా ఉండదు అని చెప్పండి.
పిల్లలకు అపారమైన జ్ఞాన ధనము యొక్క ఖజానా లభిస్తూ ఉంటుంది కనుక అపారమైన సంతోషము
ఉండాలి. హృదయము ఎంతగా శుద్ధముగా ఉంటుందో, అంతగా ఇతరులను కూడా శుద్ధముగా
తయారుచేస్తారు. యోగము యొక్క స్థితితోనే హృదయము శుద్ధముగా అవుతుంది. పిల్లలైన మీకు
యోగిగా అయ్యే మరియు తయారుచేసే అభిరుచి కూడా ఉండాలి. ఒకవేళ దేహము పట్ల మోహముంటే,
దేహాభిమానము ఉంటే, మీ అవస్థ చాలా కచ్చాగా ఉందని అర్థం చేసుకోండి. దేహీ-అభిమాని
పిల్లలే సత్యమైన డైమండ్ గా అవుతారు. అందుకే ఎంత వీలైతే అంత దేహీ-అభిమానులుగా అయ్యే
అభ్యాసము చేయండి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి సమానముగా నిరహంకారిగా అయి, చాలా ప్రేమగా అందరి సేవ చేయాలి.
శ్రీమతమనుసారముగా నడుచుకోవాలి. స్వయము యొక్క మతమనుసారముగా నడుచుకుని భాగ్యానికి
అడ్డుగీత గీసుకోకూడదు.
2. సంగమములో తండ్రి ద్వారా సంతోషమనే ఔషధమేదైతే లభించిందో, ఆ ఔషధాన్నే తింటూ మరియు
తినిపిస్తూ ఉండాలి. మీ టైమ్ వేస్ట్ చేసుకోకూడదు. చాలా ఓర్పుతో, గంభీరతతో, తెలివితో
తండ్రిని స్మృతి చేస్తూ తమ జీవితాన్ని వజ్రము వలె తయారుచేసుకోవాలి.
వరదానము:-
ఆసక్తిని అనాసక్తిలోకి పరివర్తన చేసే శక్తి స్వరూప భవ
శక్తి స్వరూపముగా అయ్యేందుకు ఆసక్తిని అనాసక్తిలోకి
పరివర్తన చేయండి. తమ దేహము పట్ల గాని, సంబంధాల పట్ల గాని, పదార్థాల పట్ల గాని,
ఎక్కడైనా అభిరుచి ఉన్నట్లయితే, మాయ కూడా రాగలదు మరియు మీరు శక్తి రూపముగా అవ్వలేరు.
అందుకే ముందు అనాసక్తులుగా అవ్వండి, అప్పుడు మాయ విఘ్నాలను ఎదుర్కోగలరు. విఘ్నాలు
వచ్చినప్పుడు, ఆర్తనాదాలు చేయడానికి బదులుగా లేదా భయపడేందుకు బదులుగా శక్తి రూపాన్ని
ధారణ చేసినట్లయితే విఘ్న వినాశకులుగా అయిపోతారు.
స్లోగన్:-
దయ అనేది
నిస్వార్థముగా మరియు మోహము నుండి ముక్తిగా ఉండాలి, అంతేకానీ స్వార్థము కలదిగా కాదు.
మాతేశ్వరిగారి
అమూల్యమైన మహావాక్యాలు - ‘‘జీవితములోని ఆశలు పూర్తి అయ్యే మనోహరమైన సమయము’’
ఆత్మలమైన మనందరికీ
చాలా కాలం నుండి ఈ ఆశ ఉంది, అదేమిటంటే జీవితములో సదా సుఖ-శాంతులు లభించాలి అని.
అయితే, అనేక జన్మల ఆశ ఎప్పుడో ఒకప్పుడైతే పూర్తి అవుతుంది. ఇప్పుడిది మన అంతిమ జన్మ,
ఈ అంతిమ జన్మలో కూడా ఇది అంతిమ సమయము. ఇప్పుడింకా నేను చిన్నగా ఉన్నాను కదా అని ఎవరూ
అనుకోకండి. చిన్నవారికైనా, పెద్దవారికైనా సుఖమైతే కావాలి కదా. కానీ దుఃఖమనేది దేని
వలన కలుగుతుంది, ముందు ఈ జ్ఞానము కూడా ఉండాలి. ఇప్పుడు మీకు ఈ జ్ఞానము లభించింది,
అదేమిటంటే - ఈ పంచ వికారాలలో చిక్కుకున్న కారణముగా ఈ కర్మ బంధనాలు ఏవైతే తయారయ్యాయో,
వీటిని పరమాత్ముని స్మృతి అనే అగ్నితో భస్మము చేసుకోవాలి, ఇదే కర్మ బంధనాల నుండి
విముక్తులయ్యేందుకు సహజమైన ఉపాయము. సర్వశక్తివంతుడైన ఈ బాబాను నడుస్తూ-తిరుగుతూ
శ్వాసశ్వాసలోనూ స్మృతి చేయండి. ఇప్పుడు స్వయముగా పరమాత్మ వచ్చి ఈ ఉపాయాన్ని
తెలియజేసే సహాయము చేస్తారు. కానీ ఇందులో పురుషార్థమైతే ప్రతి ఆత్మ చేయాలి. పరమాత్మ
అయితే తండ్రి, టీచరు, గురువు రూపములో వచ్చి మనకు వారసత్వాన్ని ఇస్తారు. కనుక ముందు
ఆ తండ్రికి చెందినవారిగా అవ్వాలి, ఆ తర్వాత టీచరు ద్వారా చదువుకోవాలి. ఈ చదువుతో
భవిష్య జన్మజన్మల కొరకు సుఖము యొక్క ప్రారబ్ధము తయారవుతుంది అనగా జీవన్ముక్తి పదవిలో
పురుషార్థమనుసారముగా పదవి లభిస్తుంది. మరియు గురువు రూపములో పవిత్రముగా తయారుచేసి
ముక్తిని ఇస్తారు. కనుక ఈ రహస్యాన్ని అర్థం చేసుకుని అటువంటి పురుషార్థము చేయాలి.
పాత ఖాతాను సమాప్తము చేసుకుని కొత్త జీవితాన్ని తయారుచేసుకునే సమయమిదే. ఈ సమయములో
ఎంతగా పురుషార్థము చేసి తమ ఆత్మను పవిత్రముగా తయారుచేసుకుంటారో, అంతగానే శుద్ధమైన
రికార్డ్ నిండుతుంది, అదే కల్పమంతా కొనసాగుతుంది. కనుక ఈ సమయము యొక్క సంపాదనపైనే
మొత్తం కల్పమంతా ఆధారపడి ఉంది. చూడండి, ఈ సమయములోనే మీకు ఆదిమధ్యాంతాల జ్ఞానము
లభిస్తుంది. మనమే దేవతలుగా అవ్వాలి. ఇప్పుడు మనది ఎక్కే కళ, తర్వాత అక్కడికి వెళ్ళి
ప్రారబ్ధాన్ని అనుభవిస్తాము. అక్కడి దేవతలకు, వారు తర్వాత పడిపోతారనే విషయము తెలియదు.
సుఖాన్ని అనుభవించిన తర్వాత పడిపోతారని ఒకవేళ తెలిస్తే, పడిపోతారనే చింతలో సుఖాన్ని
కూడా అనుభవించలేకపోతారు. కనుక ఈశ్వరీయ నియమము రచించబడి ఉంది, అదేమిటంటే - మనుష్యులు
సదా ఉన్నతి కొరకు పురుషార్థము చేస్తారు అంటే సుఖము కోసం సంపాదించుకుంటారు. కానీ
డ్రామాలో సగం-సగం పాత్ర తయారుచేయబడి ఉంది, ఈ రహస్యము మనకు తెలుసు, కానీ ఈ సమయము
సుఖము యొక్క వంతు కనుక పురుషార్థము చేసి సుఖము తీసుకోవాలి. ఇదే పురుషార్థము యొక్క
ప్రత్యేకత. పాత్రధారి పని ఏమిటంటే పాత్రను అభినయించే సమయములో సంపూర్ణ ప్రత్యేకతతో
పాత్రను అభినయించాలి, అది చూసేవారు - బాగుంది, బాగుంది (వాహ్, వాహ్) అని అనాలి.
అందుకే హీరో, హీరోయిన్ల పాత్ర దేవతలకు లభించింది. వారి స్మృతిచిహ్న చిత్రాలు
కీర్తించబడతాయి మరియు పూజించబడతాయి. నిర్వికారీ ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమాన
అవస్థను తయారుచేసుకోవడము, ఇదే దేవతల ప్రత్యేకత. ఈ ప్రత్యేకతను మర్చిపోవడము వలనే
భారత్ కు ఇటువంటి దుర్దశ కలిగింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి జీవితాన్ని తయారుచేసే
పరమాత్మ స్వయముగా వచ్చి ఉన్నారు. ఇప్పుడు వారి చేతిని పట్టుకోవడముతో జీవితమనే నావ
తీరానికి చేరుకుంటుంది. అచ్ఛా - ఓంశాంతి.
అవ్యక్త ప్రేరణలు -
అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా)
అవ్వండి
నేను సంగమయుగీ
బ్రాహ్మణాత్మను. ఈ వ్యర్థ సంకల్పాలు, అపవిత్రతా సంస్కారాలు శూద్రుల సంస్కారాలు మరియు
స్వరూపము. ఈ అపవిత్రత మరియు విస్మృతి యొక్క సంస్కారాలు నావి కావు అనగా
బ్రాహ్మణత్వానికి చెందినవి కావు, ఇవి శూద్రత్వానికి చెందినవి అని అనుభవమవ్వాలి.
వాటిని నావి అని భావించినట్లయితే మాయకు వశమై ఆందోళన చెందుతారు.