10-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఏ తండ్రి అయితే మిమ్మల్ని వజ్ర సమానముగా తయారుచేస్తున్నారో, వారిపై ఎప్పుడూ సంశయము రాకూడదు, సంశయబుద్ధి కలవారిగా అవ్వడము అనగా స్వయాన్ని నష్టపరచుకోవడము’’

ప్రశ్న:-
మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే చదువులో పాస్ అయ్యేందుకు ముఖ్యమైన ఆధారమేమిటి?

జవాబు:-
నిశ్చయము. నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యేందుకు ధైర్యము కావాలి. మాయ ఈ ధైర్యాన్ని తెంచివేస్తుంది. సంశయబుద్ధి కలవారిగా చేసేస్తుంది. నడుస్తూ, నడుస్తూ ఉండగా ఒకవేళ ఈ చదువుపైన లేక చదివించే ఆ సుప్రీమ్ టీచర్ పైన సంశయము వచ్చిందంటే, దాని వల్ల వారు స్వయానికి మరియు ఇతరులకు ఎంతగానో నష్టము కలిగిస్తారు.

పాట:-
నీవు ప్రేమసాగరుడవు...

ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు శివబాబా అర్థం చేయిస్తున్నారు. నీవు ప్రేమ సాగరుడవు అని పిల్లలైన మీరు ఆ తండ్రిని మహిమ చేస్తారు. వారిని జ్ఞాన సాగరుడు అని కూడా అంటారు. జ్ఞానసాగరుడు అని ఒక్కరినే అంటారు కావున మిగిలినవారందరినీ అజ్ఞానులు అని అంటారు ఎందుకంటే ఇది జ్ఞానము మరియు అజ్ఞానముల ఆట. జ్ఞానము అనేది పరమపిత పరమాత్మ వద్దనే ఉంది. ఈ జ్ఞానము ద్వారా కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది. అలాగని ఒక ప్రపంచాన్ని సరికొత్తగా తయారుచేస్తారని కాదు. ప్రపంచమనేది అవినాశీగానే ఉంటుంది, కేవలం పాత ప్రపంచాన్ని మార్చి కొత్తదిగా తయారుచేస్తారు. ప్రళయము జరిగిపోతుందనేమీ కాదు. మొత్తం ప్రపంచమంతా ఎప్పుడూ వినాశనమవ్వదు. ఇప్పుడు ప్రపంచము పాతదిగా ఉంది, అది పరివర్తన చెంది కొత్తదిగా మారుతుంది. తండ్రి అర్థం చేయించారు, ఇప్పుడు మీరు కూర్చున్నది పాత ఇల్లు. మనము కొత్త ఇంటిలోకి వెళ్తామని మీకు తెలుసు. ఉదాహరణకు పాత ఢిల్లీ ఉంది, ఇప్పుడు ఈ పాత ఢిల్లీ అంతము కానున్నది, దానికి బదులుగా ఇప్పుడు కొత్తది తయారవ్వనున్నది. ఇప్పుడు కొత్తది ఎలా తయారవుతుంది? ముందుగా అందులో ఉండేందుకు అర్హులైనవారు కావాలి. కొత్త ప్రపంచములోనైతే సర్వగుణ సంపన్నులు ఉంటారు. పిల్లలైన మీకు ఈ లక్ష్యము, ఉద్దేశ్యము కూడా ఉంది. పాఠశాలలో లక్ష్యము, ఉద్దేశ్యము అయితే ఉంటుంది కదా. నేను సర్జన్ గా అవుతాను లేక బ్యారిస్టర్ గా అవుతాను... అని చదువుకునేవారికి తెలుస్తుంది. మనము మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చామని ఇక్కడ మీకు తెలుసు. పాఠశాలలో లక్ష్యము, ఉద్దేశ్యము లేకుండానైతే ఎవరూ కూర్చోలేరు. కానీ ఇది ఎటువంటి విచిత్రమైన పాఠశాల అంటే ఇందులో లక్ష్యాన్ని, ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకున్నప్పటికీ, దాని కోసం చదువుకుంటున్నప్పటికీ, మళ్ళీ ఈ చదువును వదిలేస్తారు. ఇది సరైన చదువు కాదని, ఈ లక్ష్యమనేది అసలు లేదని, అసలు అలా ఎప్పుడూ జరగదని భావిస్తారు. చదివించేవారిపై సంశయము వచ్చేస్తుంది. ఆ చదువులోనైతే ఒకవేళ చదవలేకపోతే లేకు డబ్బు లేకపోతే లేక ధైర్యము లేకపోతే చదువును వదిలేస్తారు. అంతేకానీ బ్యారిస్టరీకి సంబంధించిన జ్ఞానమే తప్పు అని, చదివించేవారే తప్పు అని అనరు కదా. ఇక్కడ మనుష్యులది విచిత్రమైన బుద్ధి. చదువుపై సంశయము వస్తే, ఇక ఈ చదువే తప్పు అని అనేస్తారు. అసలు భగవంతుడు చదివించరు, వారసత్వము మొదలైనదేదీ లభించదు, ఇవన్నీ ప్రగల్భాలే అని అంటారు. ఇలా చాలామంది పిల్లలు చదువుతూ, చదువుతూ వదిలేస్తారు. అప్పుడు అందరూ అడుగుతారు - మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని, దాని ద్వారా మేము మనుష్యుల నుండి దేవతలుగా అవుతామని మీరు అనేవారు కదా, మరి ఇప్పుడు ఏమైంది? అప్పుడు ఏమని జవాబిస్తారంటే - లేదు, అవన్నీ ప్రగల్భాలు మాత్రమే. ఈ లక్ష్యము, ఉద్దేశ్యము మాకు అర్థం కావడం లేదు అని అంటారు. కొందరు నిశ్చయముతో చదువుకునేవారు కానీ సంశయము రావడముతో చదువును వదిలేసారు. నిశ్చయము ఎలా ఏర్పడింది, మళ్ళీ సంశయబుద్ధి కలవారిగా ఎవరు తయారుచేసారు? మీరు అంటుంటారు - ఆ ఆత్మ కనుక చదువును కొనసాగించి ఉంటే చాలా ఉన్నత పదవిని పొందగలిగేవారు అని. చాలామంది చదువుతూ ఉంటారు, బ్యారిస్టరీని చదువుతూ, చదువుతూ సగంలో వదిలేస్తారు, ఇతరులు చదివి బ్యారిస్టర్లుగా తయారవుతారు. కొందరు చదువుకుని పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. అప్పుడు ఏదో ఒక చిన్న పదవిని పొందుతారు. ఇది చాలా పెద్ద పరీక్ష. ఇందులో చాలా సాహసము కావాలి. ఒకటేమో నిశ్చయబుద్ధితో కూడిన సాహసము కావాలి. మాయ ఎటువంటిదంటే, అది ఇప్పుడిప్పుడే నిశ్చయబుద్ధి కలవారిగా, మళ్ళీ ఇప్పుడిప్పుడే సంశయబుద్ధి కలవారిగా చేస్తుంది. చదువుకోవడానికి చాలామంది వస్తారు కానీ కొందరు డల్ బుద్ధి కలవారిగా ఉంటారు. నంబరువారుగా పాస్ అవుతారు కదా. వార్తాపత్రికల్లో కూడా వారి లిస్ట్ వస్తుంది. ఇది కూడా అలాంటిదే. ఇక్కడకు చదువుకునేందుకు చాలామంది వస్తారు. కొందరు మంచిబుద్ధి కలవారు ఉంటారు, కొందరు మందబుద్ధి కలవారు. మందబుద్ధి కలవారిగా అవుతూ, అవుతూ ఇక ఏదో ఒక సంశయములోకి వచ్చి చదువును వదిలి వెళ్ళిపోతారు. వారు ఇతరులను కూడా నష్టపరుస్తారు. సంశయబుద్ధి వినశ్యంతి అని అంటారు. వారు ఉన్నత పదవిని పొందలేరు. నిశ్చయము ఉన్నా, ఒకవేళ పూర్తిగా చదవకపోతే మరి పాస్ అవ్వరు, ఎందుకంటే వారి బుద్ధి ఎందుకూ పని చేయదు. అందులో ధారణ జరగదు. నేను ఒక ఆత్మను అన్నది మర్చిపోతారు. తండ్రి అంటారు, నేను ఆత్మలైన మీకు పరమపితను. తండ్రి వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. ఎవరికైనా చాలా విఘ్నాలు వస్తే వారికి సంశయము వచ్చేస్తుంది. ఫలానా బ్రాహ్మణిపై నిశ్చయం కలగడం లేదు అని అంటారు. అరే, బ్రాహ్మణి ఎలా ఉన్నా మీరైతే చదువుకోవాలి కదా. టీచర్ బాగా చదివించకపోతే వారిని ఆ చదువు చెప్పడం నుండి తొలగించాలి అని ఆలోచిస్తారు, కానీ మీరైతే చదవాలి కదా. ఈ చదువు తండ్రిది. చదివించేవారు ఆ సుప్రీమ్ టీచర్. బ్రాహ్మణి కూడా వారి జ్ఞానాన్నే వినిపిస్తారు, కావున మీ ధ్యాస అంతా చదువుపై ఉండాలి కదా. చదువు లేకుండా పరీక్షను పాస్ అవ్వలేరు. కానీ తండ్రిపై ఉన్న నిశ్చయము తొలగిపోతే ఇక చదువును వదిలేస్తారు. చదువుతూ, చదువుతూ - వీరి ద్వారా అసలు ఈ పదవి లభిస్తుందా, లేదా అని టీచరుపై సంశయము వస్తే, ఇక చదువును వదిలేస్తారు. వారు ఇతరులను కూడా పాడు చేస్తారు. గ్లాని చేయడముతో మరింత నష్టము కలిగిస్తారు. చాలా నష్టము కలుగుతుంది. తండ్రి అంటారు, ఇక్కడ ఒకవేళ ఎవరైనా పాపము చేస్తే వారికి వంద రెట్లు శిక్ష పడుతుంది. ఎంతోమందిని పాడు చేయడానికి ఒక్కరు నిమిత్తమవుతారు. ఎంతోకొంత పుణ్యాత్మలుగా అయినవారు మళ్ళీ పాపాత్ములుగా అయిపోతారు. పుణ్యాత్ములుగా తయారయ్యేది ఈ చదువు ద్వారానే మరియు పుణ్యాత్ములుగా తయారుచేసేది ఒక్క తండ్రియే. ఒకవేళ ఎవరైనా చదవలేకపోతున్నారంటే, తప్పకుండా ఏదో ఒక చెడు లోపల ఉంటుంది. ఇక అప్పుడు ఏమంటారంటే - నా భాగ్యమే ఇంత, నేనేమి చేయగలను. హార్ట్ ఫెయిల్ అయినట్లు అయిపోతారు. కావున ఎవరైతే ఇక్కడకు వచ్చి మరజీవులుగా అవుతారో, వారు మళ్ళీ రావణ రాజ్యములోకి వెళ్ళి మరజీవులుగా అవుతారు. వారు వజ్రసమానమైన జీవితాన్ని తయారుచేసుకోలేరు. మనుష్యులు హార్ట్ ఫెయిల్ అయితే వారు వెళ్ళి ఇంకొక జన్మను తీసుకుంటారు. అలాగే ఇక్కడ హార్ట్ ఫెయిల్ అయితే ఆసురీ సాంప్రదాయములోకి వెళ్ళిపోతారు. ఇది మరజీవా జన్మ. కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు తండ్రికి చెందినవారిగా అవుతారు. ఆత్మలే వెళ్తాయి కదా. ఆత్మ అయిన మనము ఈ శరీర భానాన్ని వదిలేస్తే, వీరు దేహీ-అభిమానులు అని భావించడం జరుగుతుంది. నేను వేరు, శరీరము వేరు. ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటున్నారంటే, తప్పకుండా ఆత్మ వేరు, శరీరము వేరు అన్నట్లు కదా. ఆత్మలమైన మనము శ్రీమతముపై ఈ భారత్ లో స్వర్గ స్థాపనను చేస్తున్నాము. మనుష్యులను దేవతలుగా తయారుచేసే ఈ కళను నేర్చుకోవలసి ఉంటుంది. సత్సంగాలు ఇంకేవీ లేవని కూడా పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. సత్యము అని ఒక్క పరమాత్మను మాత్రమే అంటారు. వారి పేరు శివ. వారే సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. కలియుగ ఆయువు తప్పకుండా పూర్తి కానున్నది. మొత్తం ప్రపంచ చక్రము ఎలా తిరుగుతుంది అనేది ఈ సృష్టి చక్రము చిత్రములో స్పష్టముగా ఉంది. దేవతలుగా అయ్యేందుకు సంగమయుగములో తండ్రికి చెందినవారిగా అవుతారు. తండ్రిని వదిలినట్లయితే మళ్ళీ కలియుగములోకి వెళ్ళిపోతారు. బ్రాహ్మణ జీవితముపై సంశయము వస్తే ఇక శూద్ర వంశములోకి వెళ్ళిపోతారు. వారు మరి దేవతలుగా అవ్వలేరు.

ఇప్పుడు స్వర్గ స్థాపన యొక్క పునాది ఎలా ఏర్పడుతుంది అనేది కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. శంఖుస్థాపన, ఆ తరువాత ప్రారంభోత్సవము, రెండూ జరుగుతాయి. ఇక్కడ గుప్తముగా జరుగుతాయి. మనము స్వర్గము కొరకు తయారవుతున్నామని ఇక్కడ మీకు తెలుసు. అప్పుడిక నరకము అన్న మాటే ఉండదు. ఎప్పటివరకైతే జీవించేది ఉందో, ఆ అంతిమము వరకు తప్పకుండా చదువుకోవాలి. పతిత-పావనుడు ఒక్క తండ్రే, వారే పావనముగా తయారుచేస్తారు.

ఇది సంగమయుగమని, ఇందులో తండ్రి పావనముగా తయారుచేయడానికి వస్తారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. పురుషోత్తమ సంగమయుగములో మనుష్యులు నరుడి నుండి నారాయణుడిగా అవుతారని వ్రాయాలి కూడా. ఇది మీ ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారము అని ఇది కూడా వ్రాయబడి ఉంది. తండ్రి ఇప్పుడు మీకు దివ్యదృష్టిని ఇస్తారు. నా 84 జన్మల చక్రము ఇప్పుడు పూర్తయిందని ఆత్మకు తెలుసు. ఆత్మలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఆత్మ చదువుతూ ఉంటుంది కానీ దేహాభిమానము ఘడియ-ఘడియ వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇది అర్ధకల్పపు దేహాభిమానము కదా. దేహీ-అభిమానులుగా అవ్వడానికి సమయము పడుతుంది. తండ్రి కూర్చుని ఉన్నారు, ఇప్పుడు సమయము లభించి ఉంది. బ్రహ్మా ఆయువును వంద సంవత్సరాలు అని అంటారు కదా, లేక తక్కువ కూడా ఉండవచ్చు. ఒకవేళ బ్రహ్మా వెళ్ళిపోయారనుకోండి, దాని వలన స్థాపన జరగదని కాదు. సైన్యమైన మీరైతే కూర్చుని ఉన్నారు కదా. తండ్రి మంత్రాన్ని ఇచ్చేసారు, మీరు చదువుకోవాలి. సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అన్నది కూడా బుద్ధిలో ఉంది. స్మృతియాత్రలో ఉండాలి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. భక్తి మార్గములో అందరి ద్వారా వికర్మలు జరిగాయి. పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచము, ఈ రెండు చిత్రాలు మీ ఎదురుగా ఉన్నాయి. కావున మీరు ఇలా వ్రాయవచ్చు - పాత ప్రపంచము రావణ రాజ్యము ముర్దాబాద్, కొత్త ప్రపంచము జ్ఞాన మార్గము రామ రాజ్యము జిందాబాద్. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో, వారే పూజారులుగా అయ్యారు. శ్రీకృష్ణుడు కూడా పూజ్యునిగా, తెల్లగా ఉండేవారు, మళ్ళీ రావణ రాజ్యములో పూజారిగా, నల్లగా అయిపోతారు. ఇది అర్థం చేయించడము సహజమే. మొట్టమొదట ఎప్పుడైతే పూజ ప్రారంభమవుతుందో అప్పుడు వజ్రాలతో పెద్ద-పెద్ద లింగాలను తయారుచేస్తారు, అవి చాలా విలువైనవిగా ఉంటాయి ఎందుకంటే తండ్రి ఇంతటి షావుకారులుగా తయారుచేసారు కదా. వారు స్వయమే వజ్రమువంటి వారు, కావున ఆత్మలను కూడా వజ్రసమానముగా తయారుచేస్తారు, కావున వారిని వజ్రములా చూపించాలి కదా. వజ్రాన్ని ఎప్పుడూ మధ్యలో పెడతారు. పుష్యరాగము మొదలైనవాటితో వారిని చూపిస్తే అంత విలువ ఉండదు, అందుకే వజ్రాన్ని మధ్యలో పెట్టడం జరుగుతుంది. వారి ద్వారా ఎనిమిది రత్నాలు విజయమాలలోని మణులుగా అవుతారు. అన్నింటికన్నా ఎక్కువ విలువ వజ్రానికి ఉంటుంది. మిగిలినవారు నంబరువారుగా తయారవుతారు. తయారుచేసేవారు శివబాబా. ఈ విషయాలన్నింటినీ తండ్రి తప్ప ఇంకెవరూ అర్థం చేయించలేరు. చదువుతూ, చదువుతూ ఆశ్చర్యము కలిగించేలా బాబా, బాబా అని అంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. శివబాబాను తండ్రి అని అంటారు కావున వారిని ఎప్పుడూ వదలకూడదు. అలా వదిలారంటే ఇక వారి భాగ్యమే అంత అని అంటారు. ఎవరి భాగ్యములోనైనా ఎక్కువగా లేకపోతే ఇక వారు ఎటువంటి కర్మలు చేస్తారంటే, వాటికి వంద రెట్లు శిక్షలు పడతాయి. పుణ్యాత్మగా అయ్యేందుకు పురుషార్థము చేసి మళ్ళీ పాపము చేసినట్లయితే వంద రెట్ల పాపము తయారవుతుంది. అప్పుడిక మరుగుజ్జులుగా ఉండిపోతారు, వృద్ధిని పొందలేరు. వంద రెట్ల శిక్ష పడినట్లయితే ఇక అవస్థ అంత వేగముగా తయారవ్వదు. ఏ తండ్రి ద్వారానైతే మీరు వజ్ర సమానముగా తయారవుతారో, వారిపై అసలు సంశయము ఎందుకు రావాలి. ఏ కారణము వల్లనైనా తండ్రిని వదిలారంటే వారిని దురదృష్టవంతులు అని అంటారు. ఎక్కడ ఉన్నా సరే తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడు శిక్షల నుండి ముక్తులవుతారు. ఇక్కడికి మీరు వచ్చేదే పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు. గతంలో అటువంటి కర్మలు చేసినట్లయితే ఇక వాటి ఫలితముగా శారీరక కర్మభోగము కూడా ఎంతగా నడుస్తుంది. ఇప్పుడు మీరు అర్ధకల్పము కొరకు వీటి నుండి విముక్తులవుతారు. స్వయాన్ని చూసుకోవాలి - నేను ఎంతవరకు నా ఉన్నతిని చేసుకుంటున్నాను, ఎంతవరకు ఇతరుల సేవను చేస్తున్నాను? లక్ష్మీ-నారాయణుల చిత్రముపై కూడా పైన ఈ విధంగా వ్రాయవచ్చు - ఇది విశ్వములో శాంతి రాజ్యము, ఇది ఇప్పుడు స్థాపన అవుతోంది. ఇదే లక్ష్యము, ఉద్దేశ్యము. అక్కడ 100 శాతము పవిత్రత, సుఖము, శాంతి ఉంటాయి. వీరి రాజ్యములో వేరే ఏ ధర్మము ఉండదు. కావున ఇప్పుడు ఇన్ని ధర్మాలేవైతే ఉన్నాయో, తప్పకుండా ఇవి వినాశనమవుతాయి కదా. అర్థం చేయించడానికి మంచి బుద్ధి కావాలి. లేదంటే తమ అవస్థ అనుసారముగానే అర్థం చేయిస్తారు. చిత్రాల ఎదురుగా కూర్చుని బాగా ఆలోచించాలి. మీకైతే అర్థం చేయించడం జరిగింది. మరి అర్థమైతే ఇతరులకు అర్థం చేయించాలి, అందుకే బాబా మ్యూజియంలను తెరిపిస్తూ ఉంటారు. గేట్ వే టు హెవెన్ - ఈ పేరు కూడా బాగుంది. అవి ఢిల్లీ గేట్, ఇండియా గేట్. అలాగే ఇది స్వర్గము యొక్క గేట్. మీరు ఇప్పుడు స్వర్గము యొక్క గేట్ ను తెరుస్తున్నారు. భక్తి మార్గములో ఎలా తికమకపడతారంటే, తికమకదారుల ఆటలో వలె తికమకపడతారు. అందరూ మాయ రాజ్యములో చిక్కుకుపోతారు. మళ్ళీ తండ్రి వచ్చి బయటకు తీస్తారు. ఎవరికైనా బయటకు రావడము ఇష్టము లేకపోతే, ఇక తండ్రి కూడా ఏమి చేస్తారు. అందుకే తండ్రి అంటారు, మహా దురదృష్టవంతులను కూడా ఇక్కడే చూడండి, ఎందుకంటే వారు చదువును వదిలేస్తారు. సంశయబుద్ధి కలవారిగా అయి ఇక జన్మ-జన్మాంతరాల కొరకు తమను తాము హత్య చేసుకుంటారు. భాగ్యము పాడైపోతే అలా జరుగుతుంది. గ్రహచారము కూర్చోవడం వల్ల తెల్లగా అయ్యేందుకు బదులుగా నల్లగా అయిపోతారు. ఆత్మ గుప్తముగా చదువుతుంది, ఆత్మయే శరీరము ద్వారా అన్నీ చేస్తుంది, శరీరము లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. ఆత్మగా భావించడములోనే శ్రమించవలసి ఉంటుంది. ఆత్మను అన్న నిశ్చయము ఏర్పరచుకోలేకపోతే ఇక దేహాభిమానములోకి వచ్చేస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సుప్రీమ్ టీచర్ చెప్పే చదువు మనల్ని నరుడి నుండి నారాయణుడిగా తయారుచేస్తుంది, ఈ నిశ్చయముతోనే అటెన్షన్ పెట్టి చదువును చదవాలి. చదివించే టీచర్ ను చూడకూడదు.

2. దేహీ-అభిమానులుగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి, మరజీవాగా అయ్యారంటే ఇక ఈ శరీర భానాన్ని వదిలేయాలి. పుణ్యాత్మగా అవ్వాలి, ఎటువంటి పాప కర్మలు చేయకూడదు.

వరదానము:-
స్వదర్శన చక్రము యొక్క స్మృతి ద్వారా సదా సంపన్న స్థితిని అనుభవం చేసే సుసంపన్న భవ

ఎవరైతే సదా స్వదర్శన చక్రధారులుగా ఉంటారో, వారు మాయ యొక్క అనేక రకాల చక్రాల నుండి ముక్తులుగా ఉంటారు. ఒక్క స్వదర్శన చక్రము అనేక వ్యర్థ చక్రాలను సమాప్తము చేసేస్తుంది, మాయను పారద్రోలుతుంది. వారి ఎదురుగా మాయ నిలవలేదు. స్వదర్శన చక్రధారులైన పిల్లలు సదా సంపన్నముగా ఉన్న కారణముగా అచలముగా ఉంటారు. వారు స్వయాన్ని సుసంపన్నముగా అనుభవం చేస్తారు. మాయ వారిని ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ వారు సదా అప్రమత్తముగా, సుజాగృతులుగా, వెలిగే జ్యోతులుగా ఉంటారు, అందుకే మాయ ఏమీ చేయలేకపోతుంది. ఎవరి వద్దనైతే అటెన్షన్ రూపీ కాపలాదారుడు సుజాగృతముగా ఉంటాడో వారే సదా సురక్షితముగా ఉంటారు.

స్లోగన్:-
మీ మాటలు ఎంత సమర్థముగా ఉండాలంటే వాటిలో శుభమైన మరియు శ్రేష్ఠమైన భావన ఇమిడి ఉండాలి.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి

శక్తిశాలి స్మృతి కొరకు సత్యమైన హృదయపూర్వకమైన ప్రేమ కావాలి. సత్యమైన హృదయము కలవారు క్షణములో బిందువుగా అయి బిందు స్వరూపుడైన బాబాను స్మృతి చేయగలుగుతారు. సత్యమైన హృదయము కలవారు సత్యమైన స్వామిని సంతుష్టపరిచిన కారణముగా వారు బాబా యొక్క విశేషమైన దీవెనలు ప్రాప్తి చేసుకుంటారు, దీని ద్వారా సహజముగానే ఒకే సంకల్పములో స్థితులై జ్వాలా రూపపు స్మృతిని అనుభవం చేయగలరు, శక్తిశాలి వైబ్రేషన్లను వ్యాపింపజేయగలరు.