10-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మనసా-వాచా-కర్మణా ఎవరికీ దుఃఖమివ్వకండి, ఎప్పుడూ ఎవరిపైనా కోప్పడకండి, ప్రేమ చాలా మధురమైనది, దీని ద్వారా ఎవరినైనా వశము చేసుకోగలరు’’

ప్రశ్న:-
ద్వి కిరీటధారులైన విశ్వ యజమానులుగా అయ్యేందుకు మరియు ది బెస్ట్ (అతి శ్రేష్ఠము) గా అయ్యేందుకు బాబా పిల్లలకు ఏ యుక్తిని తెలియజేస్తారు?

జవాబు:-
దైవీ గుణాలను ధారణ చేసి చాలా-చాలా మధురముగా అవ్వండి. ఒకరినొకరు సోదర దృష్టితో లేక సోదరీ-సోదరుల దృష్టితో చూడండి. తమ పురుషార్థము ద్వారా స్వయానికి రాజ్యతిలకాన్ని దిద్దుకోండి. 2. స్వయంగా ఈశ్వరుడైన తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు కావున చదువులో రెగ్యులర్ అవ్వండి, ఎంతగా చదువుతారో, చదివిస్తారో అంతగా మీ మ్యానర్స్ మెరుగుపడుతూ ఉంటాయి, అంతగా ది బెస్ట్ గా అవుతారు.

ఓంశాంతి
ఇప్పుడు మనము నరకము యొక్క తీరాన్ని వదిలి ముందుకు వెళ్తున్నామని మధురాతి మధురమైన చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలకు తెలుసు. మధ్యలో ఉన్న ఈ పురుషోత్త సంగమయుగము పూర్తిగా వేరు. సముద్రము మధ్యలో మీ నావ ఉంది. మీరు ఇప్పుడు సత్యయుగానికి చెందినవారూ కాదు, కలియుగానికి చెందినవారూ కాదు. మీరు పురుషోత్తము సంగమయుగీ సర్వోత్తమ బ్రాహ్మణులు. సంగమయుగము ఉండేదే బ్రాహ్మణుల కొరకు. బ్రాహ్మణులు పిలకవంటివారు. ఇది బ్రాహ్మణుల అతి చిన్న యుగము. ఇది ఒకే జన్మ కలిగిన యుగముగా ఉంటుంది. ఇది మీ సంతోషపు యుగము, ఏ విషయము యొక్క సంతోషము? భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు. మరి అటువంటి విద్యార్థులకు ఎంత సంతోషము ఉంటుంది! మీకు ఇప్పుడు మొత్తము చక్రము యొక్క జ్ఞానము బుద్ధిలో ఉంది. ఇప్పుడు మనమే బ్రాహ్మణులము, తర్వాత మనమే దేవతలుగా అవుతాము. మొదట మన ఇల్లు అయిన స్వీట్ హోమ్ కు వెళ్తాము, ఆ తర్వాత కొత్త ప్రపంచములోకి వస్తాము. బ్రాహ్మణులైన మనమే స్వదర్శన చక్రధారులము. మనమే ఈ పిల్లిమొగ్గల ఆటను ఆడుతాము. ఈ విరాట రూపము గురించి కూడా బ్రాహ్మణులైన మీకే తెలుసు - బుద్ధిలో మొత్తము రోజంతా ఈ విషయాల స్మరణ జరుగుతూ ఉండాలి.

మీ ఈ పరివారము చాలా చాలా లవ్లీ అయినది (ప్రియమైనది), మీరు ప్రతి ఒక్కరూ చాలా చాలా లవ్లీగా ఉండాలి. తండ్రి కూడా మధురమైనవారు కావున పిల్లలను కూడా అలా మధురముగా తయారుచేస్తారు. ఎప్పుడూ ఎవరిపైనా కోప్పడకూడదు. మనసా, వాచా, కర్మణా ఎవరికీ దుఃఖము ఇవ్వకూడదు. తండ్రి ఎప్పుడూ ఎవరికీ దుఃఖము ఇవ్వరు, ఎంతగా తండ్రిని స్మృతి చేస్తామో అంతగా మధురముగా అవుతూ ఉంటాము. అంతే, ఈ స్మృతి ద్వారానే నావ తీరానికి చేరుకుంటుంది - ఇదే స్మృతియాత్ర. స్మృతి చేస్తూ-చేస్తూ వయా శాంతిధామము, సుఖధామానికి వెళ్ళాలి. బాబా వచ్చిందే పిల్లలను సదా సుఖవంతులుగా తయారుచేసేందుకు. నన్ను స్మృతి చేసినట్లయితే ఈ భూతాలు తొలగిపోతూ ఉంటాయని భూతాలను పారద్రోలే యుక్తిని తండ్రి తెలియజేస్తారు. ఎవరిలోనైనా భూతముంటే ఇక్కడే నా వద్ద వదిలి వెళ్ళండి. బాబా, మాలోని భూతాలను తొలగించి మమ్మల్ని పతితుల నుండి పావనముగా తయారుచేయండి అని మీరు అంటారు కూడా. బాబా ఎంతటి మంచి పుష్పాలను తయారుచేస్తారు. బాబా మరియు దాదా ఇరువురూ కలిసి పిల్లలైన మీ అలంకారము చేస్తారు. వారు హద్దు తండ్రి, వీరు అనంతమైన తండ్రి. కావున పిల్లలు చాలా ప్రేమగా నడవాలి మరియు నడిపించాలి. వికారాలన్నింటినీ దానము చేయాలి, దానమిచ్చినట్లయితే గ్రహణము వదులుతుంది, ఇందులో సాకులు మొదలైనవాటి విషయమేమీ లేదు. ప్రేమతో మీరు ఎవరినైనా వశము చేసుకోగలరు. ప్రేమగా అర్థం చేయించండి, ప్రేమ చాలా మధురమైనది. సింహము, ఏనుగు... మొదలైన జంతువులను కూడా మనుష్యులు ప్రేమతో వశము చేసుకుంటారు. వారైతే ఇంకా ఆసురీ మనుష్యులు, మీరైతే ఇప్పుడు దేవతలుగా అవుతూ ఉన్నారు. కావున దైవీ గుణాలను ధారణ చేసి చాలా-చాలా మధురముగా అవ్వాలి. ఇతరులను సోదర దృష్టితో లేక సోదరీ-సోదరుల దృష్టితో చూడండి. ఆత్మ ఆత్మకు ఎప్పుడూ దుఃఖము ఇవ్వలేదు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలూ, నేను మీకు స్వర్గ రాజ్య భాగ్యాన్ని ఇచ్చేందుకు వచ్చాను. ఇప్పుడు మీకు ఏది కావాలంటే దానిని నా నుండి తీసుకోండి. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా, ద్వికిరీటధారులుగా తయారుచేసేందుకు వచ్చాను, కానీ శ్రమ అయితే మీరే చెయ్యవలసి ఉంటుంది, నేను ఎవరిపైనా కిరీటము పెట్టను, మీరు మీ పురుషార్థము ద్వారానే మీకు మీరు రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి. ఇలా-ఇలా మీరు విశ్వానికి యజమానులుగా, ద్వికిరీటధారులుగా మిమ్మల్ని మీరు తయారుచేసుకోగలరు అని బాబా పురుషార్థపు యుక్తిని తెలియజేస్తారు. చదువు పట్ల పూర్తి ధ్యానము ఉంచండి, ఎప్పుడూ కూడా చదువును వదలకండి. ఏ కారణముగానైనా అలిగి చదువును వదిలేసినట్లయితే చాలా-చాలా నష్టము కలుగుతుంది. లాభాన్ని మరియు నష్టాన్ని చూసుకుంటూ ఉండండి. మీరు ఈశ్వరీయ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు, మీరు తండ్రి అయిన ఈశ్వరుడి నుండి చదువుకుంటున్నారు. చదువుకుని పూజ్య దేవతగా అవుతున్నారు. కావున విద్యార్థులు కూడా అలా రెగ్యులర్ గా అవ్వాలి. విద్యార్థి జీవితము అతి ఉత్తమమైన జీవితము. ఎంతగా చదువుకుంటూ, చదివిస్తూ ఉంటారో మరియు మ్యానర్స్ ను తీర్చిదిద్దుకుంటారో, అంతగా ది బెస్ట్ గా అవుతారు.

మధురమైన పిల్లలూ, ఇప్పుడు ఇది మీ తిరుగు ప్రయాణము. ఏ విధముగా సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాల నుండి కిందకు దిగుతూ వచ్చారో అలా ఇప్పుడు మీరు ఇనుపయుగము నుండి పైకి బంగారుయుగము వరకు వెళ్ళాలి. ఎప్పుడైతే వెండియుగము వరకు చేరుకుంటారో అప్పుడు ఈ కర్మేంద్రియాల చంచలత సమాప్తమైపోతుంది. అందుకే ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా ఆత్మలైన మీ నుండి రజో, తమోల తుప్పు వదులుతూ ఉంటుంది మరియు ఎంతగా తుప్పు వదులుతూ ఉంటుందో అంతగా అయస్కాంతము వంటి తండ్రి వైపుకు ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఆకర్షణ కలగడం లేదూ అంటే తప్పకుండా తుప్పు పట్టి ఉందని అర్థం. మొత్తము తుప్పు అంతా పూర్తిగా వదిలి స్వచ్ఛమైన బంగారముగా తయారవ్వాలి, అది అంతిమ కర్మాతీత అవస్థ.

బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్న ముఖ్యమైన విషయమేమిటంటే - దేహీ-అభిమానులుగా అవ్వండి. దేహ సహితముగా దేహము యొక్క సర్వ సంబంధాలనూ మరచి నన్నొక్కరినే స్మృతి చేయండి, పావనముగా కూడా తప్పకుండా అవ్వాలి. కుమారి పవిత్రముగా ఉన్నప్పుడు అందరూ ఆమెకు తల వంచి నమస్కరిస్తారు, మళ్ళీ వివాహము చేసుకున్నట్లయితే పూజారిగా అయిపోతుంది, అప్పుడు ఆమె అందరి ముందు తల వంచవలసి ఉంటుంది. కన్య మొదట తల్లిగారి ఇంటిలో ఉన్నప్పుడు ఇన్ని ఎక్కువ సంబంధాలు గుర్తుకురావు. వివాహమైన తర్వాత దేహ సంబంధాలు కూడా పెరుగుతూ ఉంటాయి, అప్పుడు పతి, పిల్లల పట్ల మోహము పెరుగుతూ ఉంటుంది. అప్పుడు అత్తవారింటివారు మొదలైనవారందరూ గుర్తుకువస్తూ ఉంటారు. మొదటైతే కేవలం తల్లి-తండ్రుల పైనే మోహము ఉంటుంది. ఇక్కడైతే ఆ అన్ని సంబంధాలనూ మర్చిపోవలసి ఉంటుంది ఎందుకంటే వీరు ఒక్కరే మీ సత్యాతి-సత్యమైన తల్లి-తండ్రి కదా. ఇది ఈశ్వరీయ సంబంధము. త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ... అని పాడుతూ ఉంటారు కూడా, ఈ తల్లి-తండ్రి అయితే మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. అందుకే తండ్రి అంటారు, అనంతమైన తండ్రినైన నన్ను నిరంతరం స్మృతి చేయండి మరియు ఇతర ఏ దేహధారిపైనా మమకారాన్ని పెట్టుకోకండి. ఈ అనంతమైన తండ్రి ఎవరైతే మిమ్మల్ని స్వర్గములోకి తీసుకువెళ్తారో, అటువంటి మధురమైన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేస్తూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. ఈ స్మృతి బలము ద్వారానే మీ ఆత్మ కాంచనముగా అయ్యి స్వర్గానికి యజమానిగా అయిపోతుంది. స్వర్గము అన్న పేరు వినటముతోనే మనసు సంతోషపడిపోతుంది. ఎవరైతే నిరంతరం స్మృతి చేస్తారో మరియు ఇతరుల చేత కూడా స్మృతి చేయిస్తూ ఉంటారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. ఈ పురుషార్థము చేస్తూ-చేస్తూ అంతిమములో అటువంటి మీ అవస్థ తయారవుతుంది. ఇక్కడైతే ప్రపంచము కూడా పాతది, దేహము కూడా పాతది, దేహ సహితముగా దేహము యొక్క సర్వ సంబంధాలు కూడా పాతవి, వాటన్నింటి నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క తండ్రితోనే సాంగత్యాన్ని జోడించాలి. అప్పుడు అంతిమ కాలములో కూడా ఆ ఒక్క తండ్రి స్మృతియే ఉంటుంది. ఇతర ఏ సంబంధమైనా గుర్తు ఉన్నట్లయితే అంతిమములో కూడా వారే గుర్తుకువస్తారు మరియు పదవి భ్రష్టమైపోతుంది. అంతిమ కాలములో ఎవరైతే అనంతమైన తండ్రి స్మృతిలో ఉంటారో, వారే నరుని నుండి నారాయణునిగా అవుతారు. తండ్రి స్మృతి ఉన్నట్లయితే ఇక శివాలయము ఎంతో దూరములో ఉండదు.

మధురాతి మధురమైన సికీలధే పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకే తండ్రి వద్దకు వస్తారు ఎందుకంటే అనంతమైన తండ్రి నుండి అనంతమైన విశ్వ రాజ్యాధికారము లభిస్తుందని పిల్లలకు తెలుసు, ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇది సదా గుర్తు ఉన్నా కూడా పిల్లలకు అపారమైన సంతోషము ఉంటుంది. ఈ బ్యాడ్జ్ ను నడుస్తూ-తిరుగుతూ అనుక్షణమూ చూసుకుంటూ ఉండండి, హృదయానికి పూర్తిగా హత్తుకోండి. ఓహో! భగవంతుని శ్రీమతము ద్వారా నేను ఇలా తయారవుతున్నాను. అంతే, బ్యాడ్జ్ ను చూస్తూ దానిని ప్రేమిస్తూ ఉండండి. బాబా-బాబా అని అంటూ ఉన్నట్లయితే సదా స్మృతి ఉంటుంది. మనము తండ్రి ద్వారా ఇలా తయారవుతాము.

మధురమైన పిల్లలకు చాలా విశాలమైన బుద్ధి కావాలి. మొత్తము రోజంతా సేవకు చెందిన ఆలోచనలే కలుగుతూ ఉండాలి. ఎవరైతే సేవ లేకుండా ఉండలేరో బాబాకు అటువంటి పిల్లలు కావాలి. పిల్లలైన మీరు మొత్తము విశ్వాన్ని చుట్టుముట్టాలి అనగా పతిత ప్రపంచాన్ని పావనముగా తయారుచేయాలి. మొత్తము విశ్వాన్ని దుఃఖధామము నుండి సుఖధామముగా తయారుచేయాలి. టీచరుకు కూడా చదివించటములో మజా వస్తుంది కదా. మీరు ఇప్పుడు చాలా ఉన్నతమైన టీచరుగా అయ్యారు. టీచరు ఎంత మంచిగా ఉంటారో అంతగా వారు అనేకులను తమ సమానముగా తయారుచేస్తారు, ఎప్పుడూ అలసిపోరు. ఈశ్వరీయ సేవలో చాలా సంతోషము ఉంటుంది, తండ్రి సహాయము లభిస్తుంది. ఇది చాలా పెద్ద అనంతమైన వ్యాపారము కూడా, వ్యాపారస్థులే ధనవంతులుగా అవుతారు. వారు ఈ జ్ఞాన మార్గములో కూడా చాలా ముందుకు వెళ్తూ ఉంటారు. తండ్రి కూడా అనంతమైన వ్యాపారి కదా. ఈ ఒప్పందము చాలా ఫస్ట్ క్లాస్ అయినది, కానీ ఇందులో చాలా సాహసాన్ని ధారణ చెయ్యవలసి ఉంటుంది. కొత్త-కొత్త పిల్లలు పాతవారికంటే కూడా పురుషార్థములో ముందుకు వెళ్ళగలరు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అదృష్టము ఉంటుంది, కావున పురుషార్థము కూడా ప్రతి ఒక్కరూ వ్యక్తిగతముగా చెయ్యవలసి ఉంటుంది, తమ పూర్తి చెకింగ్ ను చేసుకోవాలి. ఇటువంటి చెకింగ్ చేసుకునేవారు పూర్తిగా రాత్రింబవళ్ళు పురుషార్థములో నిమగ్నమైపోతారు, మేము మా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి అని అంటారు. ఎంత వీలైతే అంత సమయాన్ని పొదుపు చేసుకోవాలి. మేము బాబాను ఎప్పుడూ మర్చిపోము, స్కాలర్షిప్ తీసుకునే తీరుతాము అని స్వయముతో పక్కా ప్రతిజ్ఞను చేసుకుంటారు. ఇటువంటి పిల్లలకు సహాయము కూడా లభిస్తుంది. ఇటువంటి కొత్త-కొత్త పురుషార్థీ పిల్లలను కూడా మీరు చూస్తారు. సాక్షాత్కారాలు కూడా చూస్తూ ఉంటారు. ప్రారంభములో ఏ విధముగా జరిగిందో, దానినే మళ్ళీ చివరిలో చూస్తారు. ఎంతగా సమీపముగా వస్తూ ఉంటారో అంతగా సంతోషములో నాట్యము చేస్తూ ఉంటారు. అటువైపు అనవసరమైన రక్తసిక్తపు ఆట కూడా నడుస్తూ ఉంటుంది.

ఇప్పుడు పిల్లలైన మీ ఈశ్వరీయ రేస్ జరుగుతూ ఉంది, ఎంతగా ముందుకు పరుగెడుతూ ఉంటారో అంతగా కొత్త ప్రపంచ దృశ్యాలు కూడా సమీపముగా వస్తూ ఉంటాయి, సంతోషము పెరుగుతూ ఉంటుంది. ఎవరికైతే దృశ్యాలు దగ్గరగా కనిపించవో, వారికి సంతోషము కూడా ఉండదు. ఇప్పుడైతే కలియుగీ ప్రపంచము నుండి వైరాగ్యము మరియు సత్యయుగీ కొత్త ప్రపంచము పట్ల చాలా ప్రేమ ఉండాలి. శివబాబా గుర్తు ఉన్నట్లయితే స్వర్గ వారసత్వము కూడా గుర్తు ఉంటుంది. స్వర్గ వారసత్వము గుర్తు ఉన్నట్లయితే శివబాబా కూడా గుర్తు ఉంటారు. ఇప్పుడు మనము స్వర్గము వైపుకు వెళ్తున్నాము, కాళ్ళు నరకము వైపు ఉన్నాయి, తల స్వర్గము వైపు ఉంది అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడైతే చిన్న-పెద్ద అందరిదీ వానప్రస్థ అవస్థ. బాబాకు సదా ఈ నషా ఉంటుంది - ఓహో! నేను వెళ్ళి ఈ బాల కృష్ణునిలా అవుతాను. వీరి కొరకు ముందుగానే కానుకలను కూడా పంపిస్తూ ఉంటారు. ఎవరికైతే పూర్తి నిశ్చయము ఉంటుందో ఆ గోపికలే కానుకలను పంపిస్తారు, వారికి అతీంద్రియ సుఖము యొక్క అనుభవము కలుగుతుంది. మనమే అమరలోకములో దేవతలుగా అవుతాము, కల్పపూర్వము కూడా మనమే అయ్యాము, మళ్ళీ 84 పునర్జన్మలను తీసుకున్నాము. ఈ పిల్లిమొగ్గల ఆట గుర్తు ఉన్నా కూడా అహో సౌభాగ్యము - సదా అపారమైన సంతోషములో ఉండండి. చాలా పెద్ద లాటరీ లభిస్తూ ఉంది. 5000 సంవత్సరాల పూర్వము కూడా మనము రాజ్యభాగ్యాన్ని పొందాము, రేపు మళ్ళీ పొందుతాము, ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. కల్పపూర్వము ఏ విధముగా జన్మ తీసుకున్నామో అలాగే మళ్ళీ జన్మ తీసుకుంటాము, వారే మన తల్లిదండ్రులుగా ఉంటారు. శ్రీకృష్ణుని తండ్రి ఎవరైతే ఉన్నారో వారే మళ్ళీ తండ్రిగా అవుతారు. ఇలా-ఇలా మొత్తము రోజంతా ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో, వారు చాలా రమణీకతలో ఉంటారు. విచార సాగర మంథనము చెయ్యనట్లయితే అనారోగ్యులుగా ఉన్నట్లు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈశ్వరీయ సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు, మంచి టీచరుగా అయ్యి తమ సమానముగా తయారుచేసే సేవను చేయాలి.

2. స్మృతి బలముతో ఆత్మను కాంచనముగా తయారుచేసుకోవాలి, ఏ దేహధారి పట్ల మమకారము పెట్టుకోకూడదు.

వరదానము:-
సైలెన్స్ శక్తి ద్వారా క్షణములో ప్రతి సమస్యను పరిష్కరించే ఏకాంతవాసి భవ

ఎప్పుడైనా ఏదైనా కొత్త, శక్తిశాలి ఆవిష్కరణ చేసినప్పుడు దానిని అండర్ గ్రౌండ్ లో చేస్తారు. ఇక్కడ ఏకాంతవాసులుగా అవ్వడమే అండర్ గ్రౌండ్ గా అవ్వడము. ఏ మాత్రం సమయము లభించినా, కార్య-వ్యవహారాలు చేస్తూ కూడా, వింటూ-వినిపిస్తూ, డైరెక్షన్ లు ఇస్తూ కూడా ఈ దేహ ప్రపంచము మరియు దేహ భానము నుండి అతీతముగా సైలెన్స్ లోకి వెళ్ళిపోండి. ఈ అభ్యాసాన్ని మరియు అనుభవాన్ని చేసే-చేయించే స్థితి ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది. దీని ద్వారా ఒక్క క్షణములో ఎవరికైనా శాంతి మరియు శక్తి యొక్క అనుభూతిని చేయిస్తారు. ఎవరు ఎదురుగా వచ్చినా, వారు ఈ స్థితిలోనే సాక్షాత్కారాన్ని అనుభవం చేస్తారు.

స్లోగన్:-
వ్యర్థ సంకల్పాలు మరియు వికల్పాల నుండి పక్కకు తప్పుకుని ఆత్మిక స్థితిలో ఉండటమే యోగయుక్తులుగా అవ్వడము.

అవ్యక్త ప్రేరణలు - పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి

బ్రహ్మాబాబా పిల్లలను యజమానులుగా చేసారు మరియు స్వయాన్ని సేవాధారి రూపములో పెట్టుకున్నారు. యజమానత్వపు గౌరవాన్ని కూడా ఇచ్చారు, ప్రతిష్టను కూడా ఇచ్చారు, పేరును కూడా ఇచ్చారు. ఎప్పుడూ తమ పేరు రానివ్వలేదు - ఎప్పుడూ ‘నా పిల్లలు’ అనేవారు. ఏ విధముగా బాబా తమ పేరు, ప్రతిష్ట, గౌరవము మొదలైనవన్నీ త్యాగము చేసారో, పరోపకారము చేసారో, పిల్లల సుఖమే తన సుఖముగా భావించారో, పిల్లలు విస్మృతి కారణముగా ఏదైతే దుఃఖాన్ని అనుభవము చేసారో ఆ దుఃఖాన్ని వారి దుఃఖముగా భావించారో, అలా ఫాలో ఫాదర్ చేసి పరోపకార భావనతో సంపన్నులుగా అవ్వండి, అప్పుడు విశ్వ కళ్యాణ కార్యము సంపన్నమవుతుంది.