11-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - బాప్ దాదాల ప్రియస్మృతులను తీసుకోవాలంటే సర్వీసబుల్ గా అవ్వండి, బుద్ధిలో జ్ఞానము నిండుగా ఉన్నట్లయితే వర్షించండి’’

ప్రశ్న:-
ఏ యొక్క నషా నిండుగా ఉన్న మేఘాలను కూడా పక్కకు తీసుకువెళ్ళిపోతుంది, వాటిని కురవనివ్వదు?

జవాబు:-
ఒకవేళ అనవసరమైన దేహాభిమానపు నషా వచ్చిందంటే, నిండుగా ఉన్న మేఘాలు కూడా పక్కకు వెళ్ళిపోతాయి. ఒకవేళ వర్షించినా కానీ సర్వీస్ కు బదులుగా డిస్సర్వీస్ చేస్తారు. ఒకవేళ బాబా పట్ల ప్రేమ లేదు, వారితో యోగము లేదు అంటే జ్ఞానము ఉన్నా కూడా ఖాళీగా ఉన్నట్లు. ఈ విధమైన ఖాళీ మేఘాలు అనేకుల కళ్యాణాన్ని ఎలా చేస్తారు.

ఓంశాంతి
ఇంకా కొన్ని మేఘాలు మిగిలి ఉన్నాయి. ఏ విధంగా వర్షము తగ్గిన తర్వాత సాగరముపైన మేఘాలు ఉండవో, చల్లబడిపోతాయో, అదే విధంగా ఇక్కడ కూడా చల్లబడిపోతారు. ఎవరైతే రిఫ్రెష్ అయ్యి వెళ్ళి వర్షాన్ని కురిపిస్తారో, వారిని మేఘాలు అని అంటారు. ఒకవేళ ఎవరైనా వర్షించకపోతే, వారిని మేఘాలు అని అంటారా. ఇవి జ్ఞాన మేఘాలు. అవి నీటి మేఘాలు. ఎప్పుడైతే సీజన్ ఉంటుందో, అప్పుడు జ్ఞాన మేఘాలు వస్తారు. వారు రిఫ్రెష్ అయి వెళ్ళి ఇతరులను రిఫ్రెష్ చేస్తారు. మేఘాలు కూడా నంబరువారుగా ఉంటాయి. కొన్ని మేఘాలు చాలా తీవ్రంగా వర్షిస్తాయి. మేఘాల పనే - వర్షించడము మరియు వాడిపోయిన మొక్కలను రిఫ్రెష్ చేయడము. ఎవరిలోనైతే పూర్తి జ్ఞానముంటుందో, వారు దాగి ఉండరు. అటువంటివారికి బాబా డైరెక్షన్ కూడా అవసరముండదు. వారు మేఘాలు. వారు వచ్చేదే స్వయములో నింపుకుని వర్షించడానికి. ఎక్కడైనా బంజరు భూమిని చూసినట్లయితే, అక్కడకు వెళ్ళి దానిని సస్యశ్యామలంగా చేయాలి. మహారథి పిల్లలకు అన్ని సెంటర్ల గురించి బాగా తెలుసు. ఏ సెంటరు చల్లబడిపోయింది? ఏ సెంటరులోని పిల్లలకు ఎక్కువ తుఫానులు వస్తాయి? ఇవి మహారథి, సర్వీసబుల్ పిల్లలకు మంచి రీతిలో తెలుసు. సర్వీసబుల్ పిల్లలకు ప్రియస్మృతులు ఇవ్వండి అని బాబా కూడా ఎప్పుడూ అంటూ ఉంటారు. మంచి-మంచి మేఘాలు సేవ చేయడానికి వెళ్తారు. ప్రదర్శనీలో కూడా అందరూ ఒకే విధముగా ఏమీ అర్థం చేయించరు. ముఖ్యమైన విషయమే ఇది. గీతా భగవంతుడు నిరాకార పరమపిత పరమాత్మ, అంతేకానీ సాకారీ శ్రీకృష్ణుడు కాదు. అర్థము చేయించే విధానము చాలా బాగుండాలి. రోజంతా ఇవే ఆలోచనలు ఉండాలి - అందరినీ వెళ్ళి మేల్కొల్పాలి. అందరూ ఘోర అంధకారంలో ఉన్నారు. అందరికీ ప్రేమగా అర్థం చేయిస్తూ ఉండండి - ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు హద్దు తండ్రి మరియు ఇంకొకరు అనంతమైన తండ్రి. అనంతమైన తండ్రినే పతితపావనుడని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు బుద్ధి లభించింది. ప్రపంచంలోని మనుష్యులు చూడడానికి ఆర్భాటంగా కనిపిస్తారు కానీ రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. ఈ సాధువులు అని చెప్పుకుంటున్న వారందరినీ కూడా నేనే ఉద్ధరించాలి అని స్వయంగా తండ్రి చెప్తున్నారు. వారికి కూడా రచయిత మరియు రచనల గురించి తెలియదు. సత్యయుగము నుండి మళ్ళీ ఈ జ్ఞానము ప్రాయః లోపమైపోతుంది. కానీ ఈ విషయము ఎవరికీ తెలియదు. శాస్త్రాలలో ఈ జ్ఞానము లేదు. శాస్త్రాల ద్వారా ఎవరికీ సద్గతి కలగదు. గీతకు ఎంత గౌరవముంది, కానీ అది భక్తి మార్గము. తండ్రి పతితపావనుడు, వారు కూర్చుని రాజయోగాన్ని నేర్పిస్తారు. మరి రాజ్యము చేయడానికి తప్పకుండా కొత్త ప్రపంచము కావాలి. తండ్రియే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ విషయము కూడా ఇప్పుడు మీకు తెలిసింది, ఎవరికైతే కల్పక్రితం అర్థము చేయించి ఉంటారో, వారికే ఇప్పుడు అర్థము చేయిస్తారు, మళ్ళీ వారే అర్థము చేసుకుంటారు. ఇది ఎప్పుడూ జరుగుతూ ఉండే యుద్ధం వంటిదేమీ కాదు. ఆ యుద్ధాలు 8-10 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆగిపోతాయి. డ్రామానుసారంగా బాంబులు ఏవైతే తయారుచేసారో, అవి అలాగే దాచి పెట్టుకోవడానికేమీ కాదు. పతిత మనుష్యుల మృత్యువు జరగకుండా సత్యయుగము రాదు. శాంతి ఎలా స్థాపనవుతుంది అనేది కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. శాంతిని స్థాపన చేయడము మరియు శ్రేష్ఠాచారీ ప్రపంచాన్ని తయారుచేయడము ఒక్క తండ్రి పని మాత్రమే. తండ్రి అంటారు - ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్కరితోనే జోడించాలి. దేహ సహితంగా ఏవైతే కనిపిస్తాయో, వాటన్నింటి నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి. ఇప్పుడు మనము తిరిగి వెళ్ళాలి కావున ఇంటినే స్మృతి చేయాలి. ఇది మృత్యులోకము అని ఇప్పుడు మీరు అర్ధము చేసుకుంటారు. మనము అమరలోకానికి వెళ్ళేందుకు అమరకథను వింటున్నాము. దేవతలను దైవీ గుణాల కల మనుష్యులని అంటారు. ఇక్కడ అటువంటివారు ఒక్కరు కూడా ఉండరు. శ్రీకృష్ణుని గురించి కూడా ఎన్ని నిందలు రాసేసారు. అసలేమీ అర్థము కాదు.

ఇప్పుడు పిల్లలైన మీరు మంచి రీతిలో పురుషార్థము చేయాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి. దైవీ గుణాలు అని వేటినంటారో కూడా అర్థం చేయించడము జరుగుతుంది. సంపూర్ణ నిర్వికారులుగా తప్పకుండా అవ్వాలి. ఇది మొట్టమొదటి, ముఖ్యమైన గుణము. పవిత్రమైనవారి ఎదురుగా అపవిత్రులు తల వంచి నమస్కరించడాన్ని మీరు అంతటా చూస్తూ ఉంటారు. సత్యయుగంలో పవిత్రమైనవారు ఉంటారు కావున అక్కడ మందిరాలు ఉండవు. తర్వాత పూజారులుగా అయినప్పుడు మందిరాలను తయారుచేస్తారు, ఎవరైతే పావనంగా ఉండేవారో, వారే పతితులుగా అవుతారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ. తండ్రి అంటారు - ఈ పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని కూడా మర్చిపోవాలి. ఈ పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తమవ్వనున్నది. ఇది సమాప్తమవ్వడానికి సమయము పట్టదు. ఈ పాత ప్రపంచము, ధనము, సంపద, వైభవాలు అన్నీ సమాప్తమవ్వనున్నాయి. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పాత ప్రపంచం సమాప్తమవుతుందని ప్రపంచంలోని వారెవరికీ తెలియదు. మీరు చెప్తారు కానీ వారికి నమ్మకము కలగాలి కదా. ఇది భగవానువాచ అని అర్థము చేసుకున్నప్పుడే బుద్ధిలో కూర్చొంటుంది.

తండ్రి పిల్లలైన మీకు చెప్తారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. పిల్లలకు తెలుసు, అనంతమైన తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. వారు ఆత్మలందరికీ తండ్రి. అందరూ సోదరులు. స్వర్గములో సోదరులందరూ సుఖంగా ఉండేవారు, కలియుగంలో సోదరులందరూ దుఃఖితులుగా ఉన్నారు. ఆత్మలందరూ నరకవాసులుగా ఉన్నారు. కేవలం ఆత్మ ఒకటే ఉండదు కదా. శరీరము కూడా కావాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి, ఇందులోనే శ్రమ ఉంది. ఇది అంత సులభమేమీ కాదు. పరమపిత పరమాత్మ మమ్మల్ని చదివిస్తున్నారు అన్న నిశ్చయము ముందుగా ఉన్నట్లయితే, ఈ అవస్థ పక్కాగా తయారవుతుంది. ఈ శరీరము ద్వారా చదివించడానికే శివబాబా వస్తారు. మనము కూడా శరీరము ద్వారా వింటాము, ధారణ చేస్తాము. సంస్కారాల అనుసారంగానే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధారణ చేస్తారు. ఏ విధంగా బాబా యుద్ధం చేసేవారి ఉదాహరణను ఇస్తారు. యుద్ధం చేసే సంస్కారాన్ని తీసుకువెళ్తారు, మళ్ళీ ఆ కోవలోకే వచ్చేస్తారు. నిరాకార అనంతమైన తండ్రిలో ఏ సంస్కారాలున్నాయి అని తండ్రి సంస్కారాల గురించి కూడా ఇప్పుడు మీకు తెలుసు! వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, పతితపావనుడు, జ్ఞానసాగరుడు. వారే వచ్చి పావనంగా తయారుచేస్తారు. తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ జన్మజన్మల వికర్మలు వినాశనమవుతాయి, లేకపోతే చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఏ పదవి లభించదు.

బాబా మనకు సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారని ఇప్పుడు పిల్లలకు తెలుసు. మన్మనాభవ అని అంటారు. ఈ పదము కూడా గీతలో ఉంది కానీ దీని అర్థాన్ని తెలుసుకోరు. తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి, దేహ సహితంగా దేహపు ధర్మాలన్నింటినీ వదిలి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ, పరమపిత పరమాత్మనైన నన్ను స్మృతి చేయండి. స్మృతినే యోగాగ్ని అని అంటారు. యోగము అనేది కామన్ పదము. ఈ పదము గీతలో కూడా ఉంది కానీ శ్రీకృష్ణుని పేరు వేయడంతో ఘోర అంధకారము ఏర్పడింది. ఇప్పుడు మీరు దీని గురించి అర్థం చేయిస్తే, ఇదంతా మీ ఊహ అని అంటారు. అసలేమీ తెలియదు. వారు వారసత్వాన్ని తీసుకునేదే లేదు. ఎప్పుడైతే ఈ అనంతమైన తండ్రి, తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా, వారు మనల్ని చదివిస్తున్నారు అన్న విషయము ముందు అర్థము చేసుకోవాలి. ఈ నిశ్చయము పక్కాగా ఉండాలి. కొత్తవారికి నిశ్చయము ఏర్పడడము అనేది అసంభవము. కొందరు కొత్తవారు కూడా వివేకవంతులుగా ఉంటారు, వారు అర్థము చేసుకుంటారు. కొందరు ఇక్కడకు రావాలని కూడా అనుకోరు, అసలేమీ అర్థము చేసుకోరు. కొద్దిగా కూడా బుద్ధిలోకి వెళ్ళదు. ఇంతమంది బి.కె.లు ఉన్నారంటే తప్పకుండా వీరికి తండ్రి నుండి వారసత్వము లభించి ఉంటుంది. ఇదొక ఫ్యామిలీ అయినట్లు. పేరే బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలు అని రాసి ఉందంటే ఫ్యామిలీ అయినట్లు కదా. ప్రజాపిత బ్రహ్మా యొక్క ఫ్యామిలీ ఎంత పెద్దది కానీ ఈ విషయము ఎవరి బుద్ధిలోకీ రాదు. మీ లక్ష్యము-ఉద్దేశ్యము ఏమిటి అని ఎవరైనా అడిగితే ఈ విధంగా చెప్పండి - బయట బోర్డుపైన ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలు అని రాసి ఉందంటే ఫ్యామిలీ అయినట్లు. తాతగారి నుండి వారసత్వము లభిస్తుంది. ప్రజాపిత బ్రహ్మా నోటి ద్వారా శివబాబా రచనను రచిస్తారు. కావున వారు రచయిత అయినట్లు, వారు స్వర్గాన్ని రచిస్తున్నారంటే తప్పకుండా పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. మరి ఇది ఫ్యామిలీ అయినట్లు కదా. తండ్రి, కొడుకులు, కూతుర్లు మరియు తాతగారు ఉన్నారు. బ్రహ్మా కూడా ఉన్నారు, శివుడు కూడా ఉన్నారు. వారు రచయిత. వారు నిరాకారుడు, మరి పిల్లలకు వారసత్వాన్ని ఎలా ఇస్తారు. బ్రహ్మా ద్వారా వారసత్వాన్ని ఇస్తారు. దీనిని మంచి రీతిలో అర్థము చేయించాలి. వారికి చెప్పండి - ఇది మీ తండ్రి ఇల్లు. దీనిని రుద్ర జ్ఞాన యజ్ఞమని అంటారు. మనము బ్రాహ్మణులము, తండ్రి తప్ప ఇంకెవరూ రాజయోగాన్ని నేర్పించలేరు. గీతలో కూడా ఉంది కదా - మన్మనాభవ అనగా నన్నొక్కరినే స్మృతి చేయండి అని. కావున మనము ఆ తండ్రినే స్మృతి చేస్తాము. భక్తి మార్గంలో ఇలా పాడుతారు - బాబా, మీరు వస్తే మేము బలిహారమవుతాము, మీ వారిగా అవుతాము. ఆత్మలమైన మేము ఈ దేహాన్ని వదిలి మీతో పాటు వచ్చేస్తాము. మీ వారిగా అయ్యామంటే తప్పకుండా మీతో పాటు వస్తాము. నిశ్చితార్థం జరిగితే ప్రియుడు తమతో పాటు తీసుకువెళ్తారు కదా. ఈ ప్రియుడైన శివుడు కూడా ఈ విధంగా అంటారు - నేను మిమ్మల్ని ఈ దుఃఖము నుండి విడిపించి సుఖధామంలోకి తీసుకువెళ్తాను. తర్వాత తమ-తమ పురుషార్థము అనుసారంగా అక్కడకు వెళ్ళి రాజ్యము చేస్తారు. ఎవరెంత జ్ఞాన ధనాన్ని ధారణ చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. చిన్న-చిన్న కుమారీలు కూడా సేవ చేస్తున్నారు. వారే గొప్ప-గొప్ప విద్వాంసులు, పండితులు మొదలైనవారికి అర్థము చేయించాలి, అభిరుచి ఉండాలి. కుస్తీ జరిగినప్పుడు, ఫలానావారితో మేము పోరాడుతామని పెద్ద-పెద్ద ఛాలెంజ్ లను చేస్తుంటారు. సేవాధారీ పిల్లలు ప్రశాంతంగా నిద్రపోకూడదు. విశ్రాంతి తీసుకోవడము పాపము. ఎవరైతే స్వయాన్ని మహారథులుగా భావిస్తారో, వారు ప్రశాంతంగా నిద్రపోకూడదు. సేవలో తిరుగుతూ ఉండాలి. ఈ రోజుల్లో బాబా చాలా ప్రదర్శనీలను తయారుచేయిస్తూ ఉన్నారు. పెద్దవారికి ఆహ్వానము పంపించండి. ఇప్పుడు రాకపోతే చివర్లో వస్తారు. సాధువులు, సన్యాసులు, మహాత్ములు ఎవరైనా కానీ వారిని మేల్కొలుపుతూ ఉండండి, కానీ వారితో మాట్లాడేవారు మహారథులై ఉండాలి. ఎవరికైతే తండ్రితో యోగము లేదో, ప్రేమ లేదో వారు ఖాళీ మేఘాల వంటివారు. వారేమి చేస్తారు! చదువుకున్నవారి ముందు చదువుకోనివారు తల వంచి నమస్కరిస్తారని మీకు తెలుసు. నేనెంతవరకు చదువుకున్నాను అని ప్రతి ఒక్కరూ స్వయము గురించి అర్థం చేసుకోగలరు. సేవ చేసి చూపిస్తాను. ఒకవేళ మేఘం నిండి ఉంది కానీ వర్షించటం లేదు అంటే ఆ మేఘం ఎందుకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికీ ఎవరి అవగాహన వారికి ఉండాలి. అనవసరమైన దేహాభిమానపు నషాలో ఉన్నట్లయితే ఉన్నత పదవిని సదా కోసము పోగొట్టుకుంటారు. బాబాకు సేవ పట్ల ఎంత అభిరుచి ఉంది. గవర్నమెంట్ కు అర్థము చేయించాలి - మాకు హాలు ఇవ్వండి, అక్కడ మేము ఈ ఆత్మిక సేవను చేసి మనుష్యులను దేవతలుగా తయారుచేస్తాము. తండ్రి వచ్చిందే రాజయోగాన్ని నేర్పించడానికి కానీ ఈ విషయాన్ని యుక్తియుక్తంగా అర్థము చేయించాలి. ఎవరికైతే భాషణ ఇవ్వడము రాదో, వారు అర్థము చేయించలేరు. ఉన్నత పదవిని పొందలేరు. ఎవరైతే సేవ చేస్తారో వారు ఉన్నత పదవిని పొందగలరు. ఈ జ్ఞానము లేకుండా భారత్ కు మరియు ప్రపంచానికి కళ్యాణము జరగదని పెద్ద-పెద్దవారికి రాయండి. చదువు ముఖ్యమైనది. ఈ లక్ష్మీ-నారాయణులు కూడా చదువు ద్వారానే ఈ పదవిని పొందారు కదా. గత జన్మలో రాజయోగాన్ని నేర్చుకున్నారు. మనము కూడా ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్నాము. స్కూలులోని విద్యార్థులు - మేము ఈ పరీక్ష రాసి ఇలా తయారవుతాము అని భావిస్తారు. ఈ జ్ఞానము మీకు లభిస్తుంది, అది ఈ ప్రపంచము కోసము కాదు. మీరు కూడా భవిష్య 21 జన్మల కోసము ప్రారబ్ధాన్ని తయారుచేసుకునేందుకు చదువుకుంటున్నారు. ఈ జన్మలోని సుఖము కోసం వారు చదువుకుంటారు. కావున ఆ చదువును కూడా చదువుకోవాలి, దానితో పాటు ఈ శిక్షణను కూడా నేర్చుకోవాలి, ఇందులో భయపడే విషయమేమీ లేదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎందుకు తీసుకోకూడదు. చిత్రాలను తీసుకొని వెళ్ళి అర్థము చేయించాలి. ఈ జ్ఞానము అందరికీ అవసరము అని చెప్పండి, కానీ కొందరు పిల్లలు నిలబడడము లేదు. ఉద్యోగ బాధ్యతలలో చిక్కుకొని ఉంటారు. బంధనముక్తులుగా ఉన్నట్లయితే సేవలో నిమగ్నమవ్వాలి. శ్రీమతముపై అందరూ నడవరు. మధ్యలో మాయ అలజడి చేస్తుంది. కొంతమంది పిల్లలకు చాలా అభిరుచి ఉంది, కానీ మేము వెళ్ళి అనేకుల కళ్యాణము చేయాలి అన్న నషా ఎక్కడము లేదు. మేజర్ అయ్యారు కదా (పెద్దవారు అయ్యారు కదా), అయినా కూడా ఎందుకు ఇబ్బంది పడతారు అని బాబా కూడా అనుకుంటారు. మేము భారత్ ను ఉద్ధరించాలని అనవచ్చు. సత్యమైన సేవ చేసి మనుష్యులను దేవతలుగా తయారుచేయాలి. నషా ఎక్కడము లేదని బాబాకు ఆశ్చర్యము కలుగుతుంది, అందుకే రజో బుద్ధి కలవారిగా ఉన్నారని బాబా అంటారు. ఇది చాలా మంచి అవకాశము. జ్ఞానము యొక్క అహంకారము ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు, వారు చాలా డిస్సర్వీస్ చేస్తారు. దీని గురించి బెల్లానికి తెలుసు మరియు బెల్లం సంచికి తెలుసు. రాహు గ్రహణము కూర్చొంటుంది. బృహస్పతి దశ తొలగి రాహు దశ కూర్చొంటుంది. ఇప్పుడిప్పుడే బాగా నడుస్తున్నట్లు కనిపిస్తారు, ఇప్పుడిప్పుడే మళ్ళీ గ్రహచారము కూర్చొంటుంది, కింద పడిపోతారు. పిల్లలు చాలా ధైర్యవంతులుగా ఉండాలి. మేము ఈ భారత్ ను స్వర్గముగా తయారుచేసే తీరుతాము అని ప్రతిజ్ఞ చేయాలి. నరకవాసులను స్వర్గవాసులుగా చేయడము, భ్రష్టాచారులను శ్రేష్ఠాచారులుగా చేయడము మీ ధర్మము. బాబా చాలా బాగా నషా ఎక్కిస్తారు, కానీ పిల్లలకు నంబరువారుగా ఎక్కుతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బంధనముక్తులుగా అయి భారత్ యొక్క సత్యమైన సేవను చేయాలి. ఆత్మిక సేవ చేసి మనుష్యులను దేవతలుగా తయారుచేయాలి. జ్ఞానము యొక్క అహంకారంలోకి రాకూడదు. ఆత్మిక నషాలో ఉండాలి.

2. నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి ముందు తమ అవస్థను పక్కా చేసుకోవాలి. దేహ సహితంగా కనిపించే వాటన్నింటి నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి.

వరదానము:-
చేయడము మరియు చెప్పడము - ఈ రెండింటినీ సమానంగా చేసుకుని క్వాలిటీ సేవను చేసే సత్యమైన సేవాధారి భవ

ముందు చేయాలి, ఆ తర్వాత చెప్పాలి అని సదా అటెన్షన్ ఉండాలి. చెప్పడము సహజమే, చేయడంలో శ్రమ ఉంటుంది, శ్రమకు ఫలము మంచిగా ఉంటుంది. కానీ ఒకవేళ ఇతరులకు చెప్తున్నారు, స్వయము చేయటం లేదు అంటే సర్వీస్ తో పాటు డిస్ సర్వీస్ కూడా ప్రత్యక్షమవుతుంది. ఏ విధంగా అమృతంలో ఒక్క విషపు బిందువు పడినా అమృతమంతా విషమైపోతుందో, అదే విధంగా ఎంత సేవ చేసినా కానీ ఒక చిన్న పొరపాటు సర్వీస్ ను సమాప్తం చేసేస్తుంది, అందుకే ముందు స్వయము పట్ల అటెన్షన్ పెట్టండి, అప్పుడు సత్యమైన సేవాధారులు అని అంటారు.

స్లోగన్:-
అనేకతలో ఏకతను తీసుకురావడము, పాడైనదానిని బాగుచేయడము - ఇది అన్నింటికన్నా పెద్ద విశేషత.

అవ్యక్త ప్రేరణలు - అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా) అవ్వండి

ఎప్పుడైతే అపవిత్రత అనగా కామము మహాశత్రువు స్వప్నములో మరియు సంకల్పములో కూడా దాడి చెయ్యదో, అప్పుడు డబల్ అహింసకులు అని అంటారు. సదా సోదర భావము యొక్క స్మృతి సహజంగా మరియు స్వతహాగా స్మృతి స్వరూపములో ఉండాలి. ఎప్పుడూ మీ సంపూర్ణ సతోప్రధాన స్థితి నుండి కిందకు పడిపోయి స్వయాన్ని నష్టపరచుకోకూడదు. ఆత్మ యొక్క అసలైన గుణ స్వరూపపు మరియు శక్తి స్వరూపపు స్థితి నుండి కిందకు రావటము అనగా విస్మృతి చెందటము, ఇది కూడా పాపపు ఖాతాలో జమ అవుతుంది.