11-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఈ అంతిమ జన్మలో గృహస్థ వ్యవహారములో
ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా అవ్వండి, ఒక్క తండ్రిని స్మృతి చేయండి, ఇదే
గుప్తమైన శ్రమ’’
ప్రశ్న:-
జ్ఞానము యొక్క
మూడవ నేత్రము లభించగానే ఏ తేడా స్పష్టముగా అనుభవమవుతుంది?
జవాబు:-
భక్తిలో
భగవంతుడిని పొందేందుకని ఎంతగా ప్రతి ముంగిట భ్రమిస్తూ ఉండేవారము, ఎన్ని ఎదురుదెబ్బలు
తింటూ ఉండేవారము. ఇప్పుడు మనకు వారు లభించారు. 2. దానితో పాటు, పాపం మనుష్యులు
ఇప్పటికీ ఇంకా భ్రమిస్తున్నారు, మార్గాన్ని వెతుకుతున్నారు అని వారిపై దయ కలుగుతుంది.
బాబా మనల్ని భ్రమించడము నుండి విడిపించారు. మనం బాబాతో పాటు వెళ్ళేందుకు ఏర్పాట్లు
చేసుకుంటున్నాము.
పాట:-
నేడు మానవుడు
అంధకారములో ఉన్నాడు...
ఓంశాంతి
ఒకవైపు భక్తులు
స్మృతి చేస్తున్నారు. ఇంకొక వైపు ఆత్మలకు మూడవ నేత్రము లభించింది అనగా ఆత్మలకు
తండ్రి పరిచయము లభించింది. వారేమో, మేము భ్రమిస్తున్నామని అంటారు. కానీ మీరు ఇప్పుడు
భ్రమించరు. ఎంత తేడా ఉంది. తండ్రి పిల్లలైన మిమ్మల్ని తనతో పాటు తీసుకువెళ్ళేందుకు
తయారుచేస్తున్నారు. మనుష్యులు గురువుల వెనుక, అలానే తీర్థయాత్రలు, మేళాలు మొదలైనవాటి
వెనుక ఎంతగా భ్రమిస్తున్నారు. మీ భ్రమించడము ఇప్పుడు సమాప్తమైపోయింది. ఈ భ్రమించడము
నుండి విడిపించేందుకు తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలకు తెలుసు. ఎలాగైతే కల్పక్రితం
తండ్రి వచ్చి చదివించారో మరియు రాజయోగాన్ని నేర్పించారో, మళ్ళీ అదే విధముగా
చదివిస్తున్నారు. మనం 5 వికారాలపై విజయము పొందుతూ ఉన్నామని పిల్లలకు తెలుసు. మాయను
జయించినవారే జగజ్జీతులని అంటారు. మాయ అని 5 వికారాల రూపీ రావణుడిని అంటారు. మాయ
శత్రువు వలె ఉంది. మాయ అని ధన-సంపదలను అనరు. పంచ వికారాల రూపీ రావణుడు లేక మాయ...
అని వ్రాయాలి కూడా. అప్పుడు మనుష్యులు కొద్దిగానైనా అర్థం చేసుకుంటారు. లేదంటే అర్థం
చేసుకోలేరు. మాయను జయిస్తే జగత్తును జయిస్తారు. ఇందులో యాదవులు మరియు కౌరవులు లేక
అసురులు మరియు దేవతల విషయమేమీ లేదు. స్థూలమైన యుద్ధమేమీ జరగదు. యోగబలముతో మాయా
రావణుడిపై విజయము పొందినట్లయితే జగజ్జేతలుగా అవుతారని అంటూ ఉంటారు. జగత్తు అని
విశ్వాన్ని అంటారని పిల్లలైన మీకు తెలుసు. విశ్వముపై విజయాన్ని ప్రాప్తి
చేయించేందుకు విశ్వ యజమానియే వస్తారు. వారే సర్వశక్తివంతుడు. తండ్రిని స్మృతి
చేసినట్లయితేనే పాపాలు భస్మమవుతాయని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ముఖ్యమైన
విషయము స్మృతియే. స్మృతి చేసినట్లయితే మీ ద్వారా ఎలాంటి వికర్మలు జరగవు మరియు మీరు
సంతోషముగా ఉంటారు. పతిత-పావనుడైన తండ్రి పావనముగా తయారుచేయడానికి వచ్చారు కనుక మనం
వికర్మలు ఎందుకు చేయాలి. స్వయాన్ని సంభాళించుకోవాలి. మనుష్యులకు బుద్ధి అయితే
ఉంటుంది కదా. ఇందులో యుద్ధము మొదలైనవి చేసే విషయమేమీ లేదు. కేవలం పంచ వికారాలను
జయించేందుకు తండ్రిని స్మృతి చేయడం చాలా సహజము. అయితే, ఇందులో శ్రమ అనిపిస్తుంది,
సమయము పడుతుంది. మాయ, దీపాన్ని ఆర్పి వేసేందుకని పదే-పదే తుఫానులను తీసుకువస్తుంది.
ఇకపోతే, ఇందులో యుద్ధము యొక్క విషయమేమీ లేదు. అక్కడ ఉండేదే దేవతల రాజ్యము,
అసురులెవ్వరూ ఉండరు.
మనం బ్రాహ్మణులము,
బ్రహ్మా ముఖవంశావళి. ఎవరైతే బ్రాహ్మణ కులానికి చెందినవారో, వారే తమను తాము
బ్రాహ్మణులుగా భావిస్తారు. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మలైన మనకు జ్ఞానాన్ని ఇస్తారు.
జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు, సద్గతిదాత కేవలం ఒక్కరే. వారే స్వర్గ స్థాపన చేసేవారు.
పిల్లలైన మీకైతే చాలా సంతోషముండాలి. విదేశీయులకు కూడా తెలిసిపోతుంది - వీరు సింధ్
దేశములోని ఆ బ్రహ్మాకుమార-కుమారీలే, వీరే శ్రీమతాన్ని అనుసరించి ప్యారడైజ్ ను (స్వర్గాన్ని)
స్థాపన చేసి చూపిస్తామని అంటారు. ఆత్మ శరీరము ద్వారా అంటుంది కదా. ఆత్మయే వింటుంది
మరియు డైరెక్షన్లపై నడుస్తుంది. కల్ప-కల్పము తండ్రియే వచ్చి యుక్తిని తెలియజేస్తారు.
తండ్రి గుప్తముగా ఉన్నారు. వారి గురించి ఎవ్వరికీ తెలియదు. ఎంతమంది మనుష్యులకు అర్థం
చేయిస్తారు కానీ కోట్లలో కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు. మనది ఆల్రౌండ్ పాత్ర అని
పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. తండ్రి అర్థం చేయించారు - మీరే రాజ్యము
తీసుకుంటారు, ఇంకెవ్వరూ తీసుకోలేరు. స్వయాన్ని హిందువులుగా పిలుచుకునే భారతవాసులైన
మీరు తప్ప ఇంకెవ్వరూ ఆ రాజ్యాన్ని తీసుకోలేరు. జనాభా లెక్కలలో కూడా మనం ఏ పేరు
చెప్పినా సరే, వారు హిందువు అనే వ్రాస్తారు. వాస్తవానికి మనం ఆది సనాతన దేవీ-దేవతా
ధర్మానికి చెందినవారము. వారు దైవీ ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయిన కారణముగా
తమను తాము హిందువులని చెప్పుకుంటారు. హిందువు అనే పేరు ఎందుకు వచ్చింది - ఇది కూడా
ఎవ్వరికీ తెలియదు. మీ హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారో చెప్పండి అని అడగాలి.
హిందుస్థాన్ అనేది దేశము పేరు, దీని గురించి ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు బ్రాహ్మణ,
దేవత, క్షత్రియ ధర్మాలు స్థాపన అవుతున్నాయని పిల్లలైన మీకు తెలుసు. బ్రాహ్మణ
దేవీ-దేవతాయ నమః అని అంటారు. బ్రాహ్మణులు సర్వోత్తములు, మొదటి నంబరువారు.
వాస్తవానికి స్వర్గము అని సత్యయుగాన్ని అంటారు. రామచంద్రుని రాజ్యాన్ని కూడా
స్వర్గమని అనలేము. అర్ధకల్పము రామ రాజ్యము, అర్ధకల్పము ఆసురీ రాజ్యము. వీటన్నింటినీ
హృదయములో ధారణ చేయాలి. ఇప్పుడు మనం స్వర్గములోకి వెళ్ళేందుకు ఏం చేయాలి?
పవిత్రముగానైతే తప్పకుండా ఉండాల్సిందే. తండ్రి అంటారు - పిల్లలూ, కామము మహాశత్రువు.
దీనిపై విజయము పొంది పవిత్రముగా ఉండాలి, అందుకే కమలపుష్పము గుర్తును కూడా చూపించారు.
గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా అవ్వాలి. ఈ ఉదాహరణ మీకు సంబంధించినదే.
హఠయోగులైతే గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా ఉండలేరు. వారు తమ నివృత్తి
మార్గపు పాత్రను అభినయిస్తారు, వారు గృహస్థ వ్యవహారములో ఉండలేరు. అందుకే
ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్ళిపోతారు. మీరు రెండు రకాల సన్యాసాలను పోల్చవచ్చు.
ప్రవృత్తి మార్గములో ఉండేవారి సన్యాసానికి మహిమ ఉంది. తండ్రి అంటారు - గృహస్థ
వ్యవహారములో ఉంటూ కేవలం ఈ ఒక్క అంతిమ జన్మ ధైర్యము ఉంచి కమలపుష్ప సమానముగా
పవిత్రముగా ఉండండి. మీరు మీ గృహస్థ వ్యవహారములోనే ఉండండి. ఆ సన్యాసులైతే
ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్ళిపోతారు. ఎంతోమంది సన్యాసులు ఉన్నారు, వారికి భోజనము
ఇవ్వాల్సి ఉంటుంది. ముందు వారు కూడా సతోప్రధానముగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానముగా
అయిపోయారు. డ్రామాలో వారికి ఈ పాత్ర ఉంది. మళ్ళీ ఇదే విధముగా జరుగుతుంది. తండ్రి
అర్థం చేయిస్తున్నారు, ఈ పతిత ప్రపంచ వినాశనమైతే జరగాల్సిందే. చిన్న-చిన్న విషయాలకే
ఒకరినొకరు బెదిరించుకుంటూ ఉంటారు - ఒకవేళ ఇలా జరగకపోతే పెద్ద యుద్ధము జరిగిపోతుంది
అని బెదిరిస్తారు. కల్పక్రితం కూడా ఇలాగే జరిగిందని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు.
కడుపు నుండి ముసలం వెలువడిందని, ఇలా జరిగిందని... శాస్త్రాలలో వ్రాసేసారు. హోలీ నాడు
మారువేషాలు తయారుచేస్తారు. వాస్తవానికి అవి మిసైల్స్ కు చిహ్నము, వాటి ద్వారా
వినాశనము చేస్తారు. ఏదైతే గతించిపోయిందో, అది మళ్ళీ జరగనున్నదని కూడా పిల్లలకు
తెలుసు. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా... (ఈ సృష్టి నాటకము తయారై సిద్ధముగా ఉన్నది,
అదే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు, జరగరానిదేదైనా జరగదు
కావున చింతించాల్సిన అవసరమేమీ లేదు) ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం రహస్యమంతా ఉంది. ఇది
కేవలం నోటితో చెప్పే విషయము కాదు. ఎవరిపైనా దోషము మోపలేము. డ్రామాలో పాత్ర అలా ఉంది.
మీరు కేవలం తండ్రి సందేశాన్ని వినిపించాలి. ఈ డ్రామా అయితే అనాది, అవినాశీ అయినది.
విధి అంటే ఏమిటి అనేది కూడా మీరు అర్థం చేసుకున్నారు. కలియుగాంతము మరియు సత్యయుగ ఆది
యొక్క ఈ సంగమము ప్రసిద్ధమైనది. దీనినే పురుషోత్తమ యుగమని అంటారు. ఈ రోజుల్లో
పిల్లలకు పురుషోత్తమ యుగము గురించి బాగా అర్థం చేయిస్తున్నారు. ఇది ఉత్తమ పురుషులుగా
తయారయ్యే యుగము. అందరూ సతోప్రధానముగా, ఉత్తములుగా తయారవుతారు. ఇప్పుడు తమోప్రధానముగా,
కనిష్టులుగా ఉన్నారు. ఈ పదాలను కూడా మీరు అర్థం చేసుకుంటారు. కలియుగము పూర్తయ్యి
సత్యయుగము వస్తుంది. అప్పుడిక జయజయకారాలు జరుగుతాయి. దీని గురించి కథ వినిపిస్తారు
కదా. ఇది అతి సులభమైనది. అసత్యపు కథలైతే చాలా ఉన్నాయి. ఇప్పుడు తండ్రి స్వయంగా
కూర్చుని అర్థం చేయిస్తున్నారు - భక్తి మార్గములో మీరు నా మహిమను పాడుతూ వచ్చారు.
ఇప్పుడు ప్రాక్టికల్ గా నేను మీకు సుఖధామానికి మరియు శాంతిధామానికి మార్గము
తెలియజేస్తున్నాను. సద్గతిని సుఖపు గతి అని, దుర్గతిని దుఃఖపు గతి అని అంటారు.
కలియుగములో దుఃఖముంటుంది, సత్యయుగములో సుఖముంటుంది. అర్థం చేయిస్తే అందరూ అర్థం
చేసుకుంటారు. మున్ముందు అర్థం చేసుకుంటూ ఉంటారు. సమయము చాలా కొద్దిగా ఉంది, గమ్యము
చాలా ఉన్నతమైనది. మీరు కాలేజీలకు వెళ్ళి అర్థం చేయిస్తే, వారు ఈ జ్ఞానాన్ని బాగా
అర్థం చేసుకుంటారు. తప్పకుండా ఈ డ్రామా చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇంకే ప్రపంచము
లేదు. వారు, పైన ఇంకొక ప్రపంచము ఉందని భావిస్తారు. అందుకే, నక్షత్రాల వైపుకు వెళ్తూ
ఉంటారు. వాస్తవానికి అక్కడేమీ లేదు. భగవంతుడు ఒక్కరే, సృష్టి కూడా ఒక్కటే. మనుష్య
సృష్టి ఇదొక్కటే. మనుష్యులు మనుష్యులే. కేవలం దేహ ధర్మాలు అనేకమున్నాయి. ఎన్ని
వెరైటీలు ఉన్నాయి. సత్యయుగములో ఒకే ధర్మముండేది. దానిని సుఖధామమని అంటారు. కలియుగము
దుఃఖధామము. ఇది సుఖ-దుఃఖాల ఆట కదా. తండ్రి ఎప్పుడూ పిల్లలకు దుఃఖమివ్వరు. తండ్రి
వచ్చి దుఃఖము నుండి విముక్తులుగా చేస్తారు. దుఃఖహర్త అయిన వారు ఎవరికీ దుఃఖము ఇవ్వరు.
ఇప్పుడిది రావణ రాజ్యము. మనుష్యులలో పంచ వికారాలు ప్రవేశించి ఉన్నాయి, అందుకే దీనిని
రావణ రాజ్యమని అంటారు. ప్రపంచ చరిత్ర-భౌగోళికాల రహస్యాలు ఇప్పుడు పిల్లలైన మీ
బుద్ధిలోకి వచ్చాయి. మీరు వీటిని ప్రతి రోజూ వింటున్నారు, ఇది చాలా గొప్ప చదువు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే ఉంది. ఈ సమయములోనే తండ్రి
నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ఈశ్వరుని మార్గాన్ని తప్పకుండా వీరే అర్థం
చేయిస్తారు అని మనుష్యులు కూడా నెమ్మది-నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. ప్రపంచములో
ఇంకెవ్వరూ కూడా ఈశ్వరుడిని పొందే మార్గాన్ని తెలపరు. ఈశ్వరుడిని పొందే మార్గాన్ని
ఈశ్వరుడే తెలియజేస్తారు. వారి సంతానమైన మీరు సందేశాన్ని ఇచ్చేవారు. కల్పక్రితం కూడా
ఎవరైతే నిమిత్తులుగా అయి ఉంటారో, వారే ఇప్పుడు కూడా అవుతారు మరియు వారే ఇతరులను కూడా
తయారుచేస్తూ ఉంటారు. పిల్లలు విచార సాగర మంథనము చేయాలి. బాబా, ఫలానా చిత్రము ఉండాలని
మాకు అనిపిస్తుంది, దాని ద్వారా మనుష్యులు బాగా అర్థం చేసుకుంటారని అనిపిస్తుంది -
అని సలహా ఇవ్వాలి. బాబా తక్కువ చిత్రాలు ఉండాలని ఎందుకు చెప్తారంటే, చాలా సెంటర్లు
చాలా చిన్నవిగా ఉన్నాయి. అక్కడ 5-7 చిత్రాలు కూడా కష్టం మీద పెట్టగలుగుతారు.
బాబా అంటారు -
ఇంటి-ఇంటిలోనూ గీతా పాఠశాల ఉండాలి. ఒకే గదిలోనే అంతా నడిపించేవారు కూడా చాలా మంది
ఉన్నారు. అక్కడ ముఖ్యమైన చిత్రాలను పెడితే మనుష్యులకు - చివరికి భగవంతుడని అసలు
ఎవరిని అంటారు, వారి నుండి ఏం లభిస్తుంది అనేది అర్థమవుతుంది. భగవంతుడిని బాబా అని
అంటారు. బబుల్ నాథ్ బాబా అని అనరు, రుద్ర బాబా అని కూడా అనరు. శివబాబా అనే పేరు
ప్రసిద్ధమైనది. బాబా అంటారు, ఇది కల్పక్రితం జరిగిన ఆ జ్ఞాన యజ్ఞమే. అనంతమైన తండ్రి
అయిన శివుడు యజ్ఞాన్ని రచించారు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను రచించారు. బ్రహ్మాలో
ప్రవేశించి స్థాపన చేసారు. ఇది రాజయోగము యొక్క జ్ఞానము. అంతేకాక, ఇది యజ్ఞము కూడా,
ఇందులో మొత్తం పాత ప్రపంచమంతా ఆహుతి అవుతుంది. వారొక్కరే తండ్రి కూడా, టీచరు కూడా,
గురువు కూడా, జ్ఞానసాగరుడు కూడా. ఈ విధముగా ఇంకెవ్వరూ లేరు. ఈ రోజుల్లో యజ్ఞము
రచిస్తే దానికి నలువైపులా శాస్త్రాలను పెడతారు. ఆహుతి చేయడానికి ఒక యజ్ఞ కుండాన్ని
కూడా తయారుచేస్తారు. వాస్తవానికి ఇది జ్ఞాన యజ్ఞము, దీనిని వారు కాపీ చేసారు. ఇక్కడ
స్థూల వస్తువులు మొదలైనవేవీ లేవు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన తండ్రి లభించారు,
అనంతమైన జ్ఞానము లభించింది. ఇతరులెవ్వరికీ ఈ విషయము తెలియదు. అనంతమైన ఆహుతి
జరగనున్నదని మీకు తెలుసు. పాత ప్రపంచము సమాప్తమైపోతుంది. రామ రాజ్యము స్థాపనవుతుందని,
ఇది చాలా మంచిదని సంతోషము కలుగుతూ ఉంటుంది. కానీ ఎవరైనా ఏదైనా స్థాపన చేస్తే, అది
తమ కోసమే చేసుకుంటారు కదా. అందరూ స్వయం కోసమే కృషి చేస్తారు. మహాభారత యుద్ధము కూడా
ఈ యజ్ఞము నుండి ప్రజ్వలితమైందని మీకు తెలుసు. ఆ హద్దు విషయాలెక్కడ, ఈ అనంతమైన
విషయాలెక్కడ. మీరు మీ కోసమే పురుషార్థము చేస్తారు. ఎప్పటివరకైతే తండ్రిని తెలుసుకోరో,
అప్పటివరకు వారసత్వము లభించదు. తండ్రియే వచ్చి ఆత్మలకు శిక్షణనిస్తారు. మీదంతా
గుప్తము. హింసాత్మకముగా తయారైన ఆత్మ అహింసాత్మకముగా తయారవ్వాలి. ఎవరిపైనా క్రోధము
కూడా చేయకూడదు. పంచ వికారాలను ఎప్పుడైతే దానమిస్తారో, అప్పుడు గ్రహణము వదిలిపోతుంది.
ఈ వికారాల వలనే నల్లగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ సర్వగుణ సంపన్నులుగా, 16 కళల
సంపూర్ణులుగా ఎలా తయారవ్వాలి - ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ
లక్ష్మీ-నారాయణులను ఈ విధముగా ఎవరు తయారుచేసారు? ఎవరైనా గురువులు లభించారా? వీరు
విశ్వానికి యజమానులుగా ఉండేవారు. తప్పకుండా ముందు జన్మలో మంచి కర్మలు చేసారు కావుననే
మంచి జన్మ లభించింది. మంచి కర్మలతో మంచి జన్మ లభిస్తుంది. బ్రహ్మా మరియు విష్ణువుకు
సంబంధము కూడా తప్పకుండా ఉంది. ఒక్క సెకండులో బ్రహ్మా నుండి విష్ణువుగా అవుతారు,
మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు, దీనినే సెకండులో జీవన్ముక్తి అని అంటారు. తండ్రికి
చెందినవారిగా అయ్యారు, ఇక జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని పొందారు. అక్కడ రాజు,
ప్రజలు అందరూ జీవన్ముక్తులుగానే ఉంటారు. ఎవరైతే అక్కడికి వెళ్ళేది ఉందో, వారు
జీవన్ముక్తులుగా అవ్వాలి. తండ్రి అయితే అందరికీ అర్థం చేయిస్తారు. అయినా ఉన్నత
పదవిని పొందేందుకు పురుషార్థము చేయాలి. అంతా పురుషార్థముపైనే ఆధారపడి ఉంది.
పురుషార్థము చేస్తూ-చేస్తూ మనం ఉన్నత పదవిని ఎందుకు పొందకూడదు. తండ్రిని చాలా స్మృతి
చేసినట్లయితే తండ్రి హృదయాన్ని అనగా సింహాసనాన్ని అధిరోహిస్తారు. తండ్రి ఏ శ్రమను
ఇవ్వరు. అబలల చేత ఇంకేమి శ్రమ చేయిస్తారు. తండ్రి స్మృతి గుప్తమైనది. జ్ఞానమైతే
ప్రత్యక్షమవుతుంది. ఫలానావారి భాషణ చాలా బాగుంది అని అంటారు కానీ వారు యోగములో
ఎంతవరకు ఉన్నారు? తండ్రిని స్మృతి చేస్తున్నారా? ఎంత సమయము స్మృతి చేస్తున్నారు?
స్మృతితోనే జన్మ-జన్మల వికర్మలు వినాశనమవుతాయి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కల్ప-కల్పము
ఆత్మిక తండ్రి అయిన శివుడే వచ్చి ఇస్తారు. ఇంకెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. అచ్ఛా!
మధురాతి మధురమైన
సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక
పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. అవినాశీ డ్రామా రహస్యాలను బుద్ధిలో ఉంచుకుని ఎవ్వరినీ దోషిగా చేయకూడదు.
పురుషోత్తములుగా అయ్యే పురుషార్థము చేయాలి. ఈ కొద్ది సమయములో తండ్రి నుండి పూర్తి
వారసత్వాన్ని తీసుకోవాలి.
2. డబల్ అహింసకులుగా అయ్యేందుకు ఎప్పుడూ ఎవరిపైనా క్రోధము చేయకూడదు. వికారాలను
దానమిచ్చి సర్వగుణ సంపన్నులుగా తయారయ్యే పురుషార్థము చేయాలి.
వరదానము:-
సెకండులో సర్వ బలహీనతల నుండి ముక్తిని ప్రాప్తి చేసుకుని
మర్యాదా పురుషోత్తములుగా అయ్యే సదా స్నేహీ భవ
స్నేహీ ఆత్మ వారికి ఎవరి పట్ల అయితే స్నేహము ఉంటుందో, వారి
కోసం తమదంతా బలిహారము చేస్తారు అనగా అర్పణ చేస్తారు. స్నేహీ ఏదైనా సమర్పించేందుకు
ఆలోచించాల్సిన అవసరముండదు. కావున ఏవైతే మర్యాదలు మరియు నియమాలు వింటారో, వాటిని
ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చేందుకు అనగా సర్వ బలహీనతల నుండి ముక్తిని పొందేందుకు
సహజమైన యుక్తి - సదా ఒక్క తండ్రికి స్నేహీగా అవ్వండి. ఎవరికైతే స్నేహీగా ఉన్నారో,
నిరంతరం వారి సాంగత్యములో ఉన్నట్లయితే ఆత్మికత యొక్క రంగు అంటుకుంటుంది మరియు ఒక్క
సెకండులో మర్యాదా పురుషోత్తములుగా అవుతారు ఎందుకంటే స్నేహీకి తండ్రి సహయోగము
స్వతహాగా లభిస్తుంది.
స్లోగన్:-
నిశ్చయము
యొక్క పునాది దృఢముగా ఉన్నట్లయితే సంపూర్ణత వరకు చేరుకోవడము నిశ్చితము.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి
వర్తమాన సమయములో
సర్వాత్మలు బికారి రూపములో భగవంతుడి నుండి ఏదో ఒకటి అడుగుతూ ఉన్నారు. అందరి నోటి
నుండి మరియు మనసు నుండి - ఏదో ఇవ్వండి అనే వస్తుంది. కొందరు ధనము కోసం బికారులుగా
ఉన్నారు, కొందరు సహయోగము కోసం బికారులుగా ఉన్నారు, కొందరు సంబంధాల కోసం, కొందరు
కొద్ది సమయము కోసమైనా సుఖ-శాంతులు కావాలని, కొందరు ప్రశాంతత లేక నిద్ర కోసం, కొందరు
ఫాలోవర్స్ కోసం బికారులుగా ఉన్నారు. దాత పిల్లలైన మీరు మాస్టర్ దాతలుగా అయ్యి మీ
శుభ భావనతో కూడిన వృత్తులతో బికారీ ఆత్మల ఆకలిని తీర్చండి.