12-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఈ చదువు సంపాదనకు ఆధారము, దీని ద్వారా
మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు, 21 జన్మల కొరకు సత్యమైన సంపాదన జరుగుతుంది’’
ప్రశ్న:-
బాబా
ఏవైతే మధురాతి మధురమైన విషయాలను వినిపిస్తారో, అవి ఎప్పుడు ధారణ అవుతాయి?
జవాబు:-
ఎప్పుడైతే
బుద్ధిపై పరమతము లేక మన్మతము యొక్క ప్రభావముండదో, అప్పుడు ధారణ అవుతాయి. ఏ పిల్లలైతే
చెప్పుడు మాటలపై నడుచుకుంటారో, వారి బుద్ధిలో ధారణ జరగదు. ఎవరైనా జ్ఞానము కాకుండా
వేరే ఏవైనా విషయాలను వినిపిస్తే వారు శత్రువు వంటివారు. అసత్యమైన మాటలను
వినిపించేవారు చాలామంది ఉన్నారు, అందుకే చెడు వినకండి, చెడు చూడకండి, మనుష్యుల నుండి
దేవతలుగా అయ్యేందుకు ఒక్క తండ్రి శ్రీమతముపైనే నడుచుకోవాలి.
పాట:-
మా తీర్థము
అతీతమైనది...
ఓంశాంతి
ఈ పాటలో మన మహిమను మనము చేసుకున్నట్లుగా ఉంది. వాస్తవానికి స్వయము యొక్క మహిమను
చేసుకోవడము జరగదు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. ఏ భారతవాసులైతే చాలా
తెలివైనవారిగా ఉండేవారో, వారు ఇప్పుడు తెలివిహీనులుగా అయిపోయారు. అయితే, ఇంతకీ
తెలివైనవారిగా ఎవరు ఉండేవారు అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. ఇది ఎక్కడా కూడా
వ్రాసి లేదు. మీరు గుప్తముగా ఉన్నారు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. ఒకటేమో తండ్రి
అంటారు, నా ద్వారానే పిల్లలు నన్ను తెలుసుకోగలరు, ఆ తర్వాత నా ద్వారా అన్నీ
తెలుసుకుంటారు. సృష్టి ఆదిమధ్యాంతాల ఆట ఏదైతే ఉందో, దానిని అర్థం చేసుకుంటారు.
ఇంకెవ్వరికీ తెలియదు. వారు ఒక ముఖ్యమైన పొరపాటును చేసారు, అదేమిటంటే - నిరాకార
పరమపిత పరమాత్మ శివునికి బదులుగా శ్రీకృష్ణుని పేరు వేసారు. మొదటి నంబరు శాస్త్రముగా
పిలవబడే శ్రీమత్ భగవద్గీతనే రాంగ్ అయిపోయింది, అందుకే, మొట్టమొదట భగవంతుడు ఒక్కరే
అన్నది నిరూపించాలి. ఆ తర్వాత గీతా భగవానుడు ఎవరు అని అడగాలి. భారత్ ది ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మము. ఒకవేళ కొత్త ధర్మము అంటే, అది బ్రాహ్మణ ధర్మమనే అంటారు. మొదట
పిలక స్థానములో బ్రాహ్మణులుంటారు, ఆ తర్వాత దేవతలు. ఉన్నతోన్నతమైనది బ్రాహ్మణ ధర్మము.
ఆ బ్రాహ్మణులను బ్రహ్మా ద్వారా పరమపిత పరమాత్మ రచిస్తారు, ఆ బ్రాహ్మణులే తర్వాత
దేవతలుగా అవుతారు. ముఖ్యమైన విషయము, భగవంతుడు అందరికీ తండ్రి, వారు కొత్త ప్రపంచ
రచయిత. తప్పకుండా కొత్త ప్రపంచాన్నే రచిస్తారు కదా. కొత్త ప్రపంచములో కొత్త భారత్
ఉంటుంది. వారు జన్మ కూడా భారత్ లోనే తీసుకున్నారు. వారు భారత్ నే స్వర్గముగా
తయారుచేస్తున్నారు, బ్రహ్మా ద్వారా. మిమ్మల్ని తమవారిగా చేసుకుని, మనుష్యుల నుండి
దేవతలుగా తయారుచేయడానికి చదివిస్తారు. మొదట మీరు శూద్ర వర్ణానికి చెందినవారిగా
ఉండేవారు, ఆ తర్వాత బ్రాహ్మణ వర్ణములోకి వచ్చారు, ఆ తర్వాత దైవీ వర్ణములోకి వెళ్తారు.
తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒక ధర్మము నుండి అనేక ధర్మాలు ఏర్పడతాయి. ఆ తర్వాత
అన్ని ధర్మాలలో కొమ్మలు-రెమ్మలు కూడా తయారవుతాయి, ప్రతి ధర్మము నుండి వెలువడుతాయి.
మూడు శాఖలు ఉంటాయి కదా. అవి ముఖ్యమైనవి. ప్రతి ధర్మము నుండి వాటి-వాటి శాఖలు
వెలువడుతాయి. ముఖ్యమైనది పునాది, ఆ తర్వాత మూడు శాఖలు ముఖ్యమైనవి. కాండము ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మము. దానికి సంబంధించిన మీరంతా ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు.
దిల్వాడా మందిరము చాలా బాగా నిర్మించబడింది, అందులో మొత్తం వివరణ ఉంది. పిల్లలైన
మీరు ఇక్కడ కూర్చున్నారు, కల్పక్రితం కూడా మీరు రాజయోగ తపస్య చేసారు. ఏ విధముగా
క్రైస్ట్ స్మృతిచిహ్నము క్రిస్టియన్ దేశములో ఉంటుందో, అదే విధముగా పిల్లలైన మీరు
ఇక్కడ తపస్య చేసారు కావుననే మీ స్మృతిచిహ్నము కూడా ఇక్కడ ఉంది. వాస్తవానికి ఇది చాలా
సహజమే, కానీ దీని గురించి ఎవ్వరికీ తెలియదు. సన్యాసులు - ఇదంతా ఊహ, ఎవరు ఎలా ఊహిస్తే
అలా అని అనుకుంటారు. వారు మీ గురించి కూడా - ఈ చిత్రాలు మొదలైనవన్నీ మీరు ఊహతో
తయారుచేసారు అని అంటారు. ఎప్పటివరకైతే తండ్రిని తెలుసుకోరో, అప్పటివరకు ఊహ అనే
భావిస్తారు. నాలెడ్జ్ ఫుల్ అయితే ఒక్క తండ్రియే కదా. కావున ముఖ్యమైనది తండ్రి
పరిచయాన్ని ఇవ్వడము. ఆ తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు, కల్పక్రితము కూడా
ఇచ్చారు. ఆ తర్వాత 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది. భారతవాసులకే 84 జన్మలు ఉంటాయి. ఆ
తర్వాత సంగమయుగములో తండ్రి వచ్చి రాజధానిని స్థాపన చేస్తారు. పిల్లలైన మీరు తండ్రి
ద్వారా అర్థం చేసుకున్నారు. మంచి రీతిలో అర్థం చేసుకున్నప్పుడు, బుద్ధిలో
కూర్చున్నప్పుడు సంతోషము కూడా ఉంటుంది.
ఈ చదువు సంపాదనకు గొప్ప ఆధారము. చదువు ద్వారానే మనుష్యులు బ్యారిస్టర్
మొదలైనవారిగా అవుతారు. కానీ ఈ చదువు మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేటటువంటిది.
ప్రాప్తి ఎంత భారీగా ఉంది, ఇటువంటి ప్రాప్తిని ఇంకెవ్వరూ అందించలేరు. మనుష్యుల నుండి
దేవతలుగా తయారుచేయడానికి భగవంతునికి ఎంతో సమయము పట్టదు అని గ్రంథ్ లో చెప్తూ ఉంటారు.
కానీ మనుష్యుల బుద్ధి నడవదు. తప్పకుండా ఆ దేవీ-దేవతా ధర్మము కనుమరుగైపోయింది, అందుకే
మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారని వ్రాస్తారు. దేవతలు సత్యయుగములో ఉండేవారు, వారిని
తప్పకుండా భగవంతుడు సంగమములో రచించి ఉంటారు. ఎలా రచించారు? అది తెలియదు. గురునానక్
కూడా పరమాత్ముని మహిమను గానము చేసారు, వారిని మహిమ చేసినట్లుగా ఇంకెవ్వరికీ మహిమ
చేయలేదు, అందుకే గ్రంథ్ ను భారత్ లో చదువుతారు. గురునానక్ అవతరణ కలియుగములో
జరుగుతుంది, వారు ధర్మస్థాపకుడు. రాజ్యమైతే తర్వాత ఏర్పడింది. తండ్రి అయితే ఈ
దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేసారు. వాస్తవానికి కొత్త ప్రపంచము బ్రాహ్మణులదనే
అనాలి. పిలక బ్రాహ్మణులకు గుర్తు, కానీ రాజధాని దేవీ-దేవతలతో ప్రారంభమవుతుంది.
బ్రాహ్మణులైన మీరు రచింపబడ్డారు. మీకు రాజధాని లేదు. మీరు మీ కోసం రాజధానిని స్థాపన
చేసుకుంటారు. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. మనుష్యులకైతే ఏమీ తెలియదు. మొట్టమొదట మనకు
తెలుస్తుంది, ఆ తర్వాత మన ద్వారా ఇతరులకు తెలుస్తుంది. మీరు శూద్రుల నుండి
బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రహ్మాకు కూడా ఇప్పుడు తండ్రి ద్వారా తెలుస్తుంది. ఒక్కరికి
తెలియజేసినట్లయితే, పిల్లలందరికీ కూడా తెలియజేయవలసి ఉంటుంది. వారి తనువు ద్వారా
కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఇవి అనుభవముతో కూడిన విషయాలు. శాస్త్రాల
ద్వారానైతే ఎవరూ ఏమీ అర్థం చేసుకోలేరు. తండ్రి అంటారు, మొత్తం కల్పములో ఒక్కసారి
మాత్రమే నేను ఈ విధముగా వచ్చి అర్థం చేయిస్తాను మరియు అనేక ధర్మాల వినాశనాన్ని, ఏక
ధర్మస్థాపనను చేయిస్తాను. ఇది 5 వేల సంవత్సరాల ఆట. మనము 84 జన్మలను తీసుకున్నామని
పిల్లలైన మీకు తెలుసు. విష్ణు నాభి నుండి బ్రహ్మా వెలువడినట్లుగా చూపిస్తారు.
బ్రహ్మా మరియు విష్ణువు ఎవరి పిల్లలు? ఇరువురు శివుని పిల్లలు. వారు (శివుడు) రచయిత,
వీరు రచన. ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇవి పూర్తిగా కొత్త విషయాలు. ఇవి
కొత్త విషయాలని బాబా కూడా అంటారు. ఏ శాస్త్రాలలోనూ ఈ విషయాలు ఉండవు. జ్ఞానసాగరుడు
తండ్రి, వారే గీతా భగవానుడు. భక్తి మార్గములో శివజయంతిని కూడా జరుపుకుంటారు, సత్య,
త్రేతాయుగాలలో జరుపుకోరు, అంటే వారు తప్పకుండా సంగమములోనే వచ్చి ఉంటారు. ఈ విషయాలను
మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు మరియు అర్థం చేయిస్తూ ఉంటారు. మీకు తండ్రి మహిమను ఏదైతే
అర్థం చేయిస్తున్నారు, ఆ మహిమ పిల్లలకు కూడా ఉండాలి. మీరు కూడా మాస్టర్
జ్ఞానసాగరులుగా అవ్వాలి. ప్రేమసాగరులుగా, సుఖసాగరులుగా ఇక్కడే తయారవ్వాలి. ఎవరికీ
దుఃఖము ఇవ్వకూడదు. చాలా మధురముగా తయారవ్వాలి. పూర్వము పూర్తి చేదుగా విషము వలె ఉన్న
మీరు నిర్వికారీ బ్రాహ్మణులుగా అవుతున్నారు, ఈశ్వరుని సంతానముగా అవుతున్నారు. వికారీ
నుండి నిర్వికారీ దేవతలుగా అవుతున్నారు. అర్ధకల్పము నుండి మీరు పతితముగా అవుతూ-అవుతూ,
ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నారు. పాతబడిపోయిన వస్త్రాలను కర్రతో
బాదినట్లయితే అవి చిరిగిపోయి పీలికలుగా అయిపోతాయి. ఇక్కడ కూడా జ్ఞానమనే కర్రతో
కొట్టినట్లయితే ముక్కలు, ముక్కలుగా అయిపోతారు. కొన్ని వస్త్రాలు ఎంత మురికిగా
ఉన్నాయంటే, వాటిని శుభ్రము చేయడానికి చాలా సమయము పడుతుంది. ఆ తర్వాత అక్కడ కూడా
వారికి చిన్న పదవి లభిస్తుంది. బాబా చాకలివాడు. మీరు కూడా వారితో పాటు సహాయకులు.
చాకలివారు కూడా నంబరువారుగా ఉంటారు. ఇక్కడ కూడా నంబరువారుగా ఉన్నారు. చాకలివాడు
వస్త్రాలను బాగా శుభ్రము చేయకపోతే, ఇతను మంగలివాడిలా ఉన్నాడే అని అంటారు కదా. ఈ
రోజుల్లో వస్త్రాలను శుభ్రముగా ఉతకడము నేర్చుకున్నారు. ఇంతకుముందు పల్లెల్లోనైతే
చాలా మురికిపట్టిన వస్త్రాలను ఉతికేవారు. ఈ నైపుణ్యము కూడా బయటివారి (విదేశీయుల)
నుండి వచ్చింది. విదేశాల వారు కొంత గౌరవాన్ని ఇస్తారు, ధనము మొదలైనవాటి విషయములో
సహాయము చేస్తారు. వీరు చాలా గొప్ప వంశానికి చెందినవారని, ఇప్పుడు కింద పడిపోయారని
వారికి తెలుసు. పడిపోయినవారిపై దయ కలుగుతుంది కదా. తండ్రి అంటారు, మిమ్మల్ని ఎంత
ధనవంతులుగా చేసాను, మాయ ఎలాంటి పరిస్థితికి తీసుకువచ్చింది. మనము విజయమాలలో
ఉండేవారము, ఆ తర్వాత 84 జన్మలను తీసుకుని ఎలా తయారయ్యాము అని మీరిప్పుడు అర్థం
చేసుకున్నారు. ఆశ్చర్యము కదా. భారతవాసులైన మీరు స్వర్గవాసులుగా ఉండేవారని మీరు అర్థం
చేయించవచ్చు. భారత్ యే స్వర్గముగా ఉండేది, ఆ తర్వాత కిందకు పడిపోతూ-పడిపోతూ
నరకవాసులుగా కూడా అవ్వవలసి వచ్చింది. ఇప్పుడు తండ్రి అంటారు - పవిత్రముగా అయి
స్వర్గవాసులుగా అవ్వండి. మన్మనాభవ. శివ భగవానువాచ, నన్నొక్కరినే స్మృతి చేయండి.
స్మృతియాత్ర ద్వారా మీ పాపాలన్నీ నశిస్తాయి. పట్టపురాణిగా చేసుకునేందుకు
శ్రీకృష్ణుడు ఎత్తుకువెళ్ళిపోయారని శాస్త్రాల్లో వ్రాసారు. మీరంతా చదువుకుంటున్నారు,
పట్టపురాణులుగా అవుతున్నారు. కానీ ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు తండ్రి
వచ్చి పిల్లలకు అర్థం చేయించారు. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పము మీకు అర్థం
చేయించడానికి వస్తాను, కనుక మొదట భగవంతుడు ఒక్కరేనని ఋజువు చేసి, ఆ తర్వాత గీతా
భగవానుడు ఎవరు, రాజయోగాన్ని ఎవరు నేర్పించారు అనేది చెప్పండి. భగవంతుడే బ్రహ్మా
ద్వారా స్థాపన చేయిస్తారు మరియు వినాశనాన్ని చేయిస్తారు, ఆ తర్వాత పాలన చేయిస్తారు.
బ్రాహ్మణులుగా ఉన్న వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. ఈ విషయాలు కూడా ఎవరికి
అర్థమవుతాయంటే, ఎవరైతే కల్పక్రితము అర్థం చేసుకున్నారో వారికి. సెకండు, సెకండు ఏదైతే
ఇంతవరకు జరిగిందో, అదంతా అర్థం చేసుకుంటారు. డ్రామాలో మీరు చాలా పురుషార్థము చేయాలి.
ఇప్పుడింకా మాకు అటువంటి అవస్థ ఏర్పడలేదని పిల్లలు అర్థం చేసుకుంటారు. సమయము
పడుతుంది. కర్మాతీత అవస్థ ఏర్పడినట్లయితే, అందరూ నంబరువన్ లో పాస్ అయిపోతారు,
అప్పుడిక యుద్ధము కూడా మొదలవుతుంది. పరస్పరములో గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ
చూసినా సరే, యుద్ధానికి ఏర్పాట్లు చేస్తున్నారని మీకు తెలుసు. అన్ని వైపుల నుండి
ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు ఏదైతే దివ్యదృష్టితో చూసారో, అది మళ్ళీ ఈ కనులతో
చూడాలి. వినాశనము యొక్క సాక్షాత్కారము కలిగింది కదా, దానిని మళ్ళీ అలాగే కనులతో
చూస్తారు. స్థాపన యొక్క సాక్షాత్కారము కూడా కలిగింది, మళ్ళీ ప్రాక్టికల్ గా
రాజ్యాన్ని కూడా చూస్తారు. పిల్లలైన మీకైతే చాలా సంతోషముండాలి. ఇదైతే పాత తనువు.
యోగముతో ఆత్మ పవిత్రముగా అయిపోతుంది, అప్పుడిక ఈ పాత శరీరాన్ని కూడా వదిలేయాలి. 84
జన్మల చక్రము పూర్తవుతుంది, ఆ తర్వాత తప్పకుండా అందరికీ కొత్త శరీరాలు లభిస్తాయి.
ఇవి కూడా అర్థం చేసుకోవలసిన చాలా సహజమైన విషయాలు. కలియుగము తర్వాత సత్యయుగము
తప్పకుండా వస్తుందని అర్థం చేయించవచ్చు కూడా. అనేక ధర్మాల వినాశనము తప్పకుండా
జరుగుతుంది. ఆ తర్వాత ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపనార్థం తండ్రికి
రావలసి ఉంటుంది. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకని బ్రాహ్మణులుగా అయ్యారు,
ఇతరులెవ్వరూ ఇలా అవ్వలేరు. మనము శివబాబాకు చెందినవారిగా అయ్యామని, శివబాబా మనకు
వారసత్వాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు.
శివజయంతి అంటేనే భారత్ కు వారసత్వము లభించింది. శివబాబా వచ్చారు, వచ్చి ఏమి
చేసారు. ఇస్లాములు, బౌద్ధులు మొదలైనవారైతే వచ్చి వారి-వారి ధర్మాలను స్థాపన చేసారు.
బాబా వచ్చి ఏమి చేసారు. తప్పకుండా స్వర్గాన్ని స్థాపన చేసారు. స్థాపనను ఎలా చేసారు,
స్థాపన ఎలా జరుగుతుంది, అది మీకు ఇప్పుడు తెలుసు. తర్వాత సత్యయుగములో ఇవన్నీ
మర్చిపోతారు. 21 జన్మల వారసత్వాన్ని మనము ఇప్పుడు తీసేసుకుంటామని కూడా మీకు తెలుసు.
ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. అతను తండ్రి, ఇతను కొడుకు, పిల్లలకు వారసత్వము
లభిస్తుంది అని స్వర్గములో భావిస్తారు కానీ అది ఇప్పటి ప్రారబ్ధము. సత్యమైన సంపాదనను
చేసుకుని మీరు ఇప్పుడు 21 జన్మల కోసం వారసత్వాన్ని పొందుతున్నారు. 84 జన్మలనైతే
తీసుకోవలసిందే. సతోప్రధానము నుండి మళ్ళీ సతో, రజో, తమోలలోకి వస్తారు. దీనిని మంచి
రీతిలో స్మృతి చేసినట్లయితే సంతోషముగా కూడా ఉంటారు. అర్థం చేయించడానికి చాలా కృషి
చేయవలసి ఉంటుంది. ఇక అర్థం చేసుకున్న తర్వాత వారికి చాలా సంతోషము కలుగుతుంది. ఏ
పిల్లలైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారో, వారు తిరిగి అనేకులకు అర్థం చేయిస్తూ
ఉంటారు, ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తూ ఉంటారు. ఇది అనంతమైన చదువు, వారసత్వము కూడా
అనంతమైనదే లభిస్తుంది. అయితే, ఇందులో త్యాగము కూడా అనంతమైనదే. గృహస్థ వ్యవహారములో
ఉంటూ మొత్తం ప్రపంచమంతటినీ త్యాగము చేయాలి, ఎందుకంటే ఈ పాత ప్రపంచము
సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. ఇప్పుడు కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి, అందుకే
అనంతమైన సన్యాసము చేయిస్తారు. సన్యాసులది హద్దు సన్యాసము మరియు వారిది హఠయోగము.
ఇందులో హఠము యొక్క మాటే ఉండదు. ఇది చదువు. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు
పాఠశాలలో చదువుకోవాలి. ఇది శివ భగవానువాచ, శ్రీకృష్ణునిది కాదు. శ్రీకృష్ణుడిని
హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అనరు, హెవెన్లీ ప్రిన్స్ అని అంటారు. ఇవి ఎంత మధురాతి
మధురమైన విషయాలు, ఇవి అర్థం చేసుకోవలసినవి మరియు ధారణ చేయవలసినవి. దైవీ లక్షణాలు
కూడా కావాలి. ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలను నమ్మకూడదు. వ్యాసుడు వ్రాసిన విషయాలను
నమ్ముతూ, నమ్ముతూ చెడు గతి ఏర్పడింది కదా. జ్ఞానము తప్ప ఇంకేమి వినిపించినా సరే,
వీరు నా శత్రువు, దుర్గతిలోకి తీసుకువెళ్తారు అని భావించండి. ఎప్పుడూ కూడా పరమతాన్ని
అనుసరించకూడదు. మన్మతాన్ని, పరమతాన్ని అనుసరించినట్లయితే మరణించినట్లే. తండ్రి అర్థం
చేయిస్తూ ఉంటారు, అసత్యమైన విషయాలను చెప్పేవారైతే చాలామంది ఉన్నారు, మీరైతే తండ్రి
నుండే వినాలి. చెడు వినకండి, చెడు చూడకండి... బాప్ దాదా వచ్చిందే మనుష్యుల నుండి
దేవతలుగా తయారుచేయడానికి, కావున వారి శ్రీమతముపై నడుచుకోవాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇక్కడ తండ్రి సమానముగా సుఖ సాగరులుగా, ప్రేమ సాగరులుగా అవ్వాలి. సర్వ గుణాలను
ధారణ చేయాలి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు.
2. చెప్పుడు మాటలను ఎప్పుడూ నమ్మకూడదు, పరమతాన్ని అనుసరించకూడదు. చెడు వినకండి,
చెడు చూడకండి...
వరదానము:-
నేను అనే భావన యొక్క భారాన్ని సమాప్తము చేసి ప్రత్యక్ష
ఫలాన్ని అనుభవము చేసే బాలకుల నుండి యజమానులుగా కండి
ఏ విధమైన నేను అన్న భావన వచ్చినా కానీ భారము తల పైకి
ఎక్కుతుంది. కానీ - మీ అన్ని భారాలను నాకు ఇచ్చేయండి, మీరు కేవలము నాట్యము చేయండి,
ఎగరండి... అని బాబా ఆఫర్ చేస్తున్నప్పుడు, మరి - సేవ ఎలా జరుగుతుంది, భాషణ ఎలా
చేస్తాము అనేటువంటి ప్రశ్నలు ఎందుకు? మీరు స్వయాన్ని కేవలం నిమిత్తముగా భావిస్తూ
కనెక్షన్ ను పవర్ హౌస్ తో జోడించి కూర్చోండి, నిరాశకు, దుఃఖానికి లోనవ్వకండి,
అప్పుడు బాప్ దాదా స్వతహాగా అంతా చేయించేస్తారు. బాలకుల నుండి యజమానులుగా అవుతాము
అని భావిస్తూ శ్రేష్టమైన స్టేజ్ పై స్థితులై ఉండండి, అప్పుడు ప్రత్యక్షఫలము యొక్క
అనుభూతిని చేస్తూ ఉంటారు.
స్లోగన్:-
జ్ఞాన
దానముతో పాటుగా గుణ దానము చేయండి, అప్పుడు సఫలత లభిస్తూ ఉంటుంది.
అవ్యక్త సూచనలు -
‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా, నిశ్చింతగా ఉండండి’’
ఎటువంటి కఠినమైన
పరిస్థితి అయినా కానీ దానిని ఆటగా భావించటము ద్వారా కఠినమైన సమస్య కూడా తేలికగా
అయిపోతుంది. కొంతమంది పిల్లలలో ధైర్యము ఉంది, అందుకే ఏ విషయము జరిగినా కానీ - సరే
చేస్తాము, ఆలోచిస్తాము అని అంటారు. ధైర్యమైతే ఉంది, కానీ నమ్మకము లేదు. నమ్మకము
ఉన్నవారి మాటలు ఇలా ఉండవు. నమ్మకము ఉంది అంటే అర్థము - మనసా, వాచా, కర్మణా, ప్రతి
విషయములోనూ నిశ్చయబుద్ధి కలిగి ఉండటము, వారి నోటి నుండి ఎప్పుడూ ధైర్యహీనులుగా చేసే
మాటలు వెలువడవు.
| | | |