12-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - స్మృతిలో ఉన్నట్లయితే మంచి దశ కూర్చుంటుంది, ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉంది, అందుకే మీది ఎక్కే కళ’’

ప్రశ్న:-
ఒకవేళ యోగము పట్ల పూర్తి అటెన్షన్ లేకపోతే దాని పరిణామము ఏమిటి? నిరంతరము స్మృతిలో ఉండేందుకు యుక్తులు ఏమిటి?

జవాబు:-
ఒకవేళ యోగము పట్ల పూర్తి అటెన్షన్ లేకపోతే నడుస్తూ-నడుస్తూ మాయ ప్రవేశిస్తుంది, కింద పడిపోతారు. 2- దేహాభిమానులుగా అయి అనేక పొరపాట్లు చేస్తూ ఉంటారు. మాయ తప్పుడు కర్మలు చేయిస్తూ ఉంటుంది, పతితులుగా చేసేస్తుంది. నిరంతరము స్మృతిలో ఉండేందుకు నోటిలో నాణెము వేసుకోండి, క్రోధము చేయకండి, దేహ సహితముగా అన్నింటినీ మరచి, నేను ఆత్మను, పరమాత్ముని బిడ్డను అనే అభ్యాసాన్ని చేయండి. యోగబలముతో ఏయే ప్రాప్తులు కలుగుతాయో, వాటిని స్మృతిలో ఉంచుకోండి.

పాట:-
ఓం నమః శివాయ...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు తమ ఆత్మిక తండ్రి అయిన శివబాబా మహిమను విన్నారు. ఎప్పుడైతే పాపాలు పెరుగుతాయో అనగా మనుష్యులు పాపాత్ములుగా అవుతారో, అప్పుడే పతిత-పావనుడైన తండ్రి వస్తారు, వచ్చి పతితులను పావనముగా తయారుచేస్తారు. ఇది ఆ అనంతమైన తండ్రి మహిమనే, వారిని వృక్షపతి అని కూడా అంటారు. ఈ సమయములో అనంతమైన తండ్రి ద్వారా బృహస్పతి యొక్క అనంతమైన దశ మీపై కూర్చుని ఉంది. ‘ప్రత్యేకము’ మరియు ‘సాధారణము’ అనే రెండు పదాలు ఉంటాయి కదా, వాటి అర్థం కూడా ఇక్కడే నిరూపించబడుతుంది. బృహస్పతి దశ ద్వారా ప్రత్యేకముగా భారత్ కు జీవన్ముక్తి లభిస్తుంది అనగా తమ స్వరాజ్య పదవిని పొందుతారు ఎందుకంటే సత్యమైన తండ్రి, ఎవరినైతే ట్రూత్ (సత్యము) అని అంటారో, వారు వచ్చి మనల్ని నరుని నుండి నారాయణునిగా చేస్తారు. మిగిలినవారంతా నంబరువారుగా తమ-తమ ధర్మాల సెక్షన్లలోకి వెళ్ళి కూర్చుంటారు మరియు రావడము కూడా నంబరువారుగా వస్తారు. కలియుగ అంతిమము వరకు వస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క ఆత్మకు తమ-తమ ధర్మాలలో తమ-తమ పాత్రలు లభించి ఉన్నాయి. రాజ్యములో రాజు నుండి మొదలుకుని ప్రజల వరకు అందరికీ తమ-తమ పాత్రలు లభించి ఉన్నాయి. నాటకములో కూడా రాజు నుండి మొదలుకుని ప్రజల వరకు, అందరూ తమ-తమ పాత్రలను అభినయించాల్సి ఉంటుంది. మనపై ఇప్పుడు బృహస్పతి దశ కూర్చుని ఉందని ఇప్పుడు పిల్లలకు తెలుసు. ఈ దశ ఒక్క రోజు మాత్రమే కూర్చుంటుందని కాదు. అలా కాదు. మీపై బృహస్పతి దశయే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మీది ఎక్కే కళ. ఎంత స్మృతి చేస్తే, అంత ఎక్కే కళ ఉంటుంది. స్మృతిని మర్చిపోయినట్లయితే మాయ విఘ్నాలు వస్తాయి. స్మృతి ద్వారా మంచి దశ కూర్చుంటుంది. మంచి రీతిలో స్మృతి చేయకపోతే తప్పకుండా పడిపోతారు. అప్పుడిక వారి ద్వారా ఏవో ఒక పొరపాట్లు జరుగుతాయి. బాబా అర్థం చేయించారు, డ్రామానుసారముగా అన్ని ధర్మాలవారు ఒకరి తర్వాత ఒకరు పాత్రను అభినయించడానికి వస్తారు. స్వర్గము యొక్క దశ అనగా జీవన్ముక్తి దశ ఇప్పుడు మనపై కూర్చుందని పిల్లలకు తెలుసు. ఈ డ్రామా చక్రము ఎలా తిరుగుతుంది అనేది కూడా వివరముగా అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి డ్రామా చక్రము ప్రత్యేకముగా భారత్ పైన తయారై ఉంది. తండ్రి కూడా భారత్ లోనే వస్తారు. ఆశ్చర్యము కలిగించేలా వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు... అని అంటూ ఉంటారు. నడుస్తూ-నడుస్తూ మాయ ప్రవేశించిన కారణముగా పడిపోతారు. యోగము పట్ల పూర్తి అటెన్షన్ పెట్టరు, అప్పుడిక తండ్రి వచ్చి సంజీవని మూలికను ఇస్తారు అనగా మేలుకొలిపే మూలికను ఇస్తారు. హనుమాన్ కూడా మీరే. తండ్రి అర్థం చేయించారు, ఈ సమయములో రావణుడిని పారద్రోలేందుకు ఈ మూలిక వాసనను చూపిస్తాను.

తండ్రి మీకు అన్నీ సత్యమైన విషయాలను తెలియజేస్తారు. తండ్రి ఒక్కరే సత్యము, వారు వచ్చి మీకు సత్యనారాయణుని కథను వినిపించి సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. వారిని ట్రూత్ అని, సత్యాన్ని వినిపించేవారని అంటారు. మీరు శాస్త్రాలను నమ్ముతారా అని మిమ్మల్ని అడుగుతారు. మీరు చెప్పండి - అవును, మేము శాస్త్రాలను ఎందుకు నమ్మము, అవన్నీ భక్తి మార్గములోని శాస్త్రాలని మాకు తెలుసు, మేము వాటిని నమ్ముతాము. జ్ఞానము మరియు భక్తి, రెండు వేర్వేరు. జ్ఞానము లభించినప్పుడు ఇక భక్తి అవసరమేముంది. భక్తి అనగా దిగే కళ. జ్ఞానము అనగా ఎక్కే కళ. ఈ సమయములో భక్తి నడుస్తుంది. ఇప్పుడు మనకు జ్ఞానము లభించింది, దాని ద్వారా సద్గతి కలుగుతుంది. భక్తులను రక్షించేవారు భగవంతుడు ఒక్కరే. రక్షించడమంటే శత్రువుల నుండి రక్షించడము జరుగుతుంది కదా. తండ్రి అంటారు - నేను వచ్చి మిమ్మల్ని రావణుడి నుండి రక్షిస్తాను. రావణుడి నుండి ఎలా రక్షించబడతారు అనేది మీరు చూస్తున్నారు కదా. ఈ రావణుడిపై విజయము పొందాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, ఈ రావణుడు మిమ్మల్ని తమోప్రధానముగా చేసాడు. సత్యయుగాన్ని సతోప్రధానమని, స్వర్గమని అంటారు. తర్వాత కళలు తగ్గుతూ ఉంటాయి. చివరిలో పూర్తిగా దేహాభిమానములోకి వచ్చినప్పుడు పతితులుగా అయిపోతారు. కొత్త ఇల్లు తయారైనప్పుడు, నెల తర్వాత లేక 6 నెలల తర్వాత ఎంతో కొంత కళ తగ్గిపోతుంది. ప్రతి సంవత్సరము ఇంటిని వైట్ వాష్ చేస్తారు. కళ అయితే తగ్గిపోతూ ఉంటుంది కదా. కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి మళ్ళీ కొత్తదిగా, మొదటి నుండి ప్రతి వస్తువు ఈ విధముగా అవుతూ వచ్చింది. ఈ ఇల్లు 100, 150 సంవత్సరాల వరకు నిలుస్తుందని భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, కొత్త ప్రపంచాన్ని సత్యయుగమని అంటారు, తర్వాత త్రేతాయుగము 25 శాతం తక్కువ అని అంటారు ఎందుకంటే కొద్దిగా పాతబడుతుంది. వారు చంద్రవంశీయులు. వారికి గుర్తుగా క్షత్రియులను చూపిస్తారు ఎందుకంటే వారు కొత్త ప్రపంచానికి యోగ్యులుగా అవ్వలేదు కనుక పదవి తగ్గిపోయింది. అందరూ శ్రీకృష్ణపురికి వెళ్ళాలని కోరుకుంటారు. రామపురికి వెళ్ళాలని ఎప్పుడూ, ఎవరూ అనరు. అందరూ కృష్ణపురి కోసమే అంటారు. బృందావనానికి పదండి, రాధా గోవిందుల భజన చేయండి... అని పాడుతారు కూడా. ఇది బృందావనానికి సంబంధించిన విషయము. అయోధ్య గురించి ఇలా అనరు. శ్రీకృష్ణుని పట్ల అందరికీ చాలా ప్రేమ ఉంటుంది. శ్రీకృష్ణుడిని చాలా ప్రేమగా స్మృతి చేస్తారు. శ్రీకృష్ణుడిని చూసినప్పుడు - వీరిలాంటి పతి లభించాలి, వీరిలాంటి బిడ్డ లభించాలి, వీరిలాంటి సోదరుడు లభించాలని అంటుంటారు. బుద్ధిశాలులైన పిల్లలు శ్రీకృష్ణుని వంటి బిడ్డ లభించాలని వారి మూర్తిని ఎదురుగా పెట్టుకుంటారు. వారు శ్రీకృష్ణుని ప్రేమలో చాలా లీనమై ఉంటారు కదా. కృష్ణపురిని అందరూ కోరుకుంటారు. ఇప్పుడిది కంసపురి, రావణపురి. కృష్ణపురికి చాలా మహత్వముంది. శ్రీకృష్ణుడిని అందరూ స్మృతి చేస్తారు. అందుకే తండ్రి అంటారు - మీరు ఇంత సమయము బట్టి స్మృతి చేస్తూ వచ్చారు, ఇప్పుడు కృష్ణపురిలోకి వెళ్ళే పురుషార్థము చేయండి, వారి వంశములోకైనా వెళ్ళండి. సూర్యవంశీయులు 8 తరాల పాటు ఉంటారు కావున రాజ్యములోకి వచ్చి రాకుమారునితో పాటు ఊయల ఊగే అంత పురుషార్థము చేయండి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము కదా.

తండ్రి అంటారు - పిల్లలూ, ఎంత వీలైతే అంత మన్మనాభవగా ఉండండి. స్మృతిలో ఉండకపోతే కింద పడిపోతారు. జ్ఞానము ఎప్పుడూ పడేయదు. స్మృతిలో ఉండకపోతే పడిపోతారు. దీనికి సంబంధించి - అల్లా అవల్దీన్, హాతమతాయి నాటకాలు కూడా తయారుచేయబడి ఉన్నాయి. స్మృతిలో ఉండేందుకనే నోటిలో నాణము వేసేవారు. ఎవరికైనా కోపం వస్తే, ఏదోకటి అనేస్తారు, అందుకే నోటిలో ఏదైనా వేసుకోండి అని అంటారు. ఏమీ అనకపోతే, కోపమే రాదు. తండ్రి అంటారు - ఎప్పుడూ ఎవరిపైనా క్రోధము చేయకండి. కానీ ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా శాస్త్రాలలో ఏదేదో వ్రాసేసారు. తండ్రి కూర్చుని యథార్థముగా అర్థం చేయిస్తున్నారు. తండ్రి వచ్చినప్పుడే ఈ విషయాలను అర్థం చేయిస్తారు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో, వారి మహిమ గాయనము చేయబడుతుంది. ఠాగూర్, ఝాన్సీ రాణి ఒకప్పుడు ఉండి వెళ్ళారు, వారి నాటకాలను తయారుచేస్తారు. అచ్ఛా, శివుడు కూడా ఉండి వెళ్ళారు, అందుకే శివజయంతిని జరుపుకుంటారు కదా. కానీ శివుడు ఎప్పుడు వచ్చారు, వచ్చి ఏమి చేసారు అనేది తెలియదు. వారు మొత్తం సృష్టికి తండ్రి. వారు వచ్చి తప్పకుండా అందరికీ సద్గతిని ఇచ్చి ఉంటారు. ఇస్లాముల ధర్మము, బౌద్ధుల ధర్మము మొదలైన ధర్మాలను ఎవరైతే స్థాపన చేసి వెళ్ళారో, వారి జయంతిని జరుపుకుంటారు. అందరికీ తిథి, తారీఖులు ఉన్నాయి కానీ శివుని తిథి, తారీఖులు ఎవరికీ తెలియదు. క్రైస్టుకు ఇన్ని సంవత్సరాల ముందు భారత్ ప్యారడైజ్ గా ఉండేదని అంటారు కూడా. స్వస్తికను తయారుచేసినప్పుడు దానిని మొత్తం 4 భాగాలుగా చేస్తారు. 4 యుగాలు ఉన్నాయి. వాటి కాల వ్యవధి ఎక్కువ తక్కువ అవ్వదు. జగన్నాథపురిలో బియ్యాన్ని అండాలో తయారుచేస్తారు. అది పూర్తిగా 4 భాగాలుగా అవుతుంది. తండ్రి అంటారు - భక్తి మార్గములో అంతా కలగాపులగము చేసేసారు. ఇప్పుడు తండ్రి అంటారు, దేహ సహితముగా ఇవన్నీ మర్చిపోండి. నేను ఆత్మను, పరమపిత పరమాత్ముని బిడ్డను - ఈ అభ్యాసము చేయండి. బాబా స్వర్గ రచయిత కావున తప్పకుండా మనల్ని స్వర్గములోకి పంపించి ఉంటారు. నరకములోకైతే పంపించరు. తండ్రి ఎవరినీ నరకములోకి పంపించరు. మొట్టమొదట అందరూ సుఖము అనుభవిస్తారు. ముందు సుఖము, ఆ తర్వాత దుఃఖము. తండ్రి అయితే సర్వుల దుఃఖహర్త-సుఖకర్త కదా. ఆత్మ ముందు సుఖాన్ని, ఆ తర్వాత దుఃఖాన్ని అనుభవిస్తుంది. మనము ముందు సతోప్రధానముగా ఉంటాము, ఆ తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తామని వివేకము కూడా చెప్తుంది. విదేశీయులు తెలివైనవారని మనుష్యులు కూడా భావిస్తారు. అక్కడ ఎటువంటి బాంబులను తయారుచేస్తారంటే, వాటితో ఒక్కసారిగా అందరూ సమాప్తమైపోతారు. ఎలాగైతే ఈ రోజుల్లో శవాలను కరెంటుతో ఒక్కసారిగా సమాప్తము చేస్తారో, అలా బాంబులు వేయడముతో నిప్పు అంటుకుంటుంది, అప్పుడు మనుష్యులు కూడా వెంటనే సమాప్తమైపోతారు. ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది. గ్రామాలకు గ్రామాలే సమాప్తమయ్యేలా తుఫానులు వస్తాయి. ఇక ఆ సమయములో రక్షించడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. వినాశనమైతే తప్పకుండా జరిగేదే ఉంది. పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. గీతలో కూడా దాని వర్ణన ఉంది. తండ్రి అర్థం చేయించారు - యూరోప్ వాసులు బాంబులను ఎలా వేస్తారంటే, వాటిని వేస్తున్నట్లుగా అసలు తెలియను కూడా తెలియదు. కల్పక్రితం కూడా వినాశనము జరిగిందని, ఇప్పుడు కూడా జరగనున్నదని పిల్లలైన మీకు తెలుసు. మీరు కూడా కల్పక్రితం వలె చదువుకుంటున్నారు. నెమ్మది-నెమ్మదిగా వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. వృద్ధి చెందుతూ-చెందుతూ మళ్ళీ స్థాపన జరుగుతుంది. మాయ తుఫానులు చాలా మంచి-మంచి పుష్పాలను కూడా పడేస్తాయి. యోగములో పూర్తిగా లేనట్లయితే మాయ విఘ్నాలను కలిగిస్తుంది.

బాబాకు బిడ్డగా అయ్యి, పవిత్రతా ప్రతిజ్ఞను చేసి, మళ్ళీ ఒకవేళ వికారాలలోకి పడినట్లయితే పేరును అప్రతిష్ఠపాలు చేస్తారు. అప్పుడిక చాలా గట్టిగా ఎదురుదెబ్బ తగులుతుంది. తండ్రి అంటారు - ఈ కామము యొక్క దెబ్బను ఎప్పుడూ తినకండి. ఇక్కడ రక్తపు నదులు ప్రవహించనున్నాయని పిల్లలకు తెలుసు. సత్యయుగములో పాల నదులు ప్రవహిస్తాయి. అది కొత్త ప్రపంచము, ఇది పాత ప్రపంచము. కలియుగములో ఏమున్నాయో చూడండి, కొత్త ప్రపంచ వైభవాలను చూడండి. ఇక్కడ అసలేమీ లేదు. కుమార్తెలు సాక్షాత్కారములో చూసి వస్తుంటారు. సూక్ష్మవతనములో శూబీరసాన్ని తాగినట్లుగా, ఏదో చేసినట్లుగా, అంతా సాక్షాత్కారమవుతాయి. మేము మూలవతనములోకి వెళ్తాము, అక్కడ నుండి బాబా వైకుంఠములోకి పంపిస్తారు అని చెప్తూ ఉంటారు. ఈ సాక్షాత్కారాలు మొదలైనవన్నీ డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి, వీటి ద్వారా ఏమీ లభించదు. చాలామంది కుమార్తెలు సూక్ష్మవతనములోకి వెళ్ళేవారు, శూబీరసము మొదలైనవి తాగేవారు, కానీ వారు ఈ రోజు లేరు. మంచి-మంచి ఫస్ట్ క్లాస్ పిల్లలు మాయమైపోయారు. ఎక్కువగా ధ్యానములోకి, సాక్షాత్కారాలలోకి వెళ్ళినవారు వివాహము చేసుకున్నారు. అసలు మాయ ఎలాంటిది అని ఆశ్చర్యము కలుగుతుంది. భాగ్యము ఏ విధముగా తలకిందులుగా అయిపోతుంది. చాలామంది మంచి-మంచి పాత్రలను అభినయించారు. అవసరమైన సమయములో చాలా సహాయము కూడా చేసారు, అయినా కూడా వారు ఈ రోజు లేరు. అందుకే తండ్రి అంటారు - మాయ, నీవు చాలా శక్తివంతమైనదానివి. మాయతో మీ యుద్ధము జరుగుతుంది. దీనిని యోగబలముతో చేసే యుద్ధమని అంటారు. యోగబలముతో ఏమి ప్రాప్తిస్తుంది అనేది ఎవరికీ తెలియదు. కేవలం భారత్ యొక్క ప్రాచీన యోగము అని అంటారు. ప్రాచీన రాజయోగము అని అంటూ ఉంటారని మధురాతి మధురమైన పిల్లలకు యోగము గురించి అర్థం చేయించడము జరుగుతుంది. తత్వవేత్తలు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వారెవ్వరిలోనూ ఈ ఆధ్యాత్మిక జ్ఞానము లేదు. ఆత్మిక తండ్రియే జ్ఞానసాగరుడు. వారి కోసమే శివాయ నమః అని పాడుతారు. వారి మహిమనే పాడారు. తండ్రి వచ్చి మీకు ఎంత జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. దీనినే జ్ఞానము యొక్క మూడవ నేత్రమని అంటారు, మిగిలినవారెవరికీ మేము త్రికాలదర్శులము అని చెప్పుకునే శక్తి లేదు. త్రికాలదర్శులు కేవలం బ్రాహ్మణులు మాత్రమే, ఆ బ్రాహ్మణుల ద్వారానే యజ్ఞాన్ని రచించారు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము కదా. శివుడిని రుద్రుడు అని కూడా అంటారు. వారికి అనేక పేర్లు పెట్టేసారు. ప్రతి దేశములోనూ వేరు-వేరు పేర్లు చాలా ఉన్నాయి. ఒక్క తండ్రికి తప్ప ఇంకెవరికీ ఇన్ని పేర్లు లేవు. బబుల్ నాథ్ అని కూడా వీరినే అంటారు. ఎవరిలోనైతే ముళ్ళు ఉంటాయో, వారిని బబుల్ అని అంటారు. బాబా ముళ్ళను పుష్పాలుగా చేసేవారు, అందుకే వారికి బబుల్ నాథ్ అన్న పేరును పెట్టారు. బొంబాయిలో బబుల్ నాథ్ మందిరము వద్దన చాలా మేళాలు జరుగుతాయి. కానీ అర్థమేమీ తెలియదు. తండ్రి యొక్క కరెక్టు పేరు శివ అని బాబా కూర్చుని అర్థం చేయిస్తారు. వ్యాపారస్థులు కూడా బిందువును శివ అని అంటారు. ఒకటి, రెండు అని లెక్క పెట్టినప్పుడు, 10 వస్తే శివ అని అంటారు. నేను బిందువును, నక్షత్రాన్ని అని తండ్రి కూడా అంటారు. చాలామంది ఈ విధముగా మాతా, పిత అన్నదానికి గుర్తుగా రెండు తిలకాలను కూడా పెట్టుకుంటారు. అవి జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రునికి గుర్తు. కానీ వారికి అర్థం తెలియదు. బాబా యోగము గురించి అర్థం చేయిస్తున్నారు. యోగము ఎంత ప్రసిద్ధమైనది. ఇప్పుడు పిల్లలైన మీరు యోగమనే పదాన్ని వదిలేయండి, స్మృతి చేయండి. తండ్రి అంటారు - యోగము అనే పదముతో అర్థం చేసుకోరు, స్మృతి అంటే అర్థం చేసుకుంటారు. తండ్రిని చాలా స్మృతి చేయాలి. వారిని ప్రియుడని కూడా అంటారు. వారు పట్టపురాణులుగా తయారుచేస్తారు కదా. విశ్వ రాజధాని వారసత్వాన్ని తండ్రి ఇస్తారు. సత్యయుగములో ఒకే తండ్రి ఉంటారు, భక్తిలో ఇద్దరు తండ్రులు ఉంటారు మరియు జ్ఞాన మార్గములో ఇప్పుడు మీకు ముగ్గురు తండ్రులు ఉన్నారు. ఇది ఎంత అద్భుతమైన విషయము. మీరు అర్థ సహితముగా తెలుసుకున్నారు - సత్యయుగములో అందరూ సుఖముగా ఉంటారు, అందుకే వారికి పారలౌకిక తండ్రి గురించి అసలు తెలియదు. ఇప్పుడు మీకు ముగ్గురు తండ్రుల గురించి తెలుసు. ఇవి ఎంత సులభముగా అర్థం చేసుకునే విషయాలు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్మృతిలో ఉండేందుకు నోటితో ఏమీ మాట్లాడకండి. నోటిలో నాణెము వేసుకుంటే క్రోధము సమాప్తమైపోతుంది. ఎవరిపైనా క్రోధము చేయకూడదు.

2. ఈ దుఃఖధామానికి ఇప్పుడు నిప్పు అంటుకోనున్నది, అందుకే దీనిని మర్చిపోయి కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాలి. పవిత్రముగా ఉంటామని తండ్రికి ఏ ప్రతిజ్ఞనైతే చేసారో, అందులో పక్కాగా ఉండాలి.

వరదానము:-
నిరాకారీ స్థితి యొక్క అభ్యాసము ద్వారా మై పన్ ను (నేను అనే భావాన్ని) సమాప్తము చేసే నిరహంకారీ భవ

వర్తమాన సమయములో అన్నింటికన్నా సూక్ష్మమైన మరియు సుందరమైన దారము - ఈ మై పన్ (నేను అనే భావన). ఈ నేను అనే పదమే దేహాభిమానము నుండి అతీతముగా తీసుకువెళ్ళేది కూడా, అలాగే దేహాభిమానములోకి తీసుకువచ్చేది కూడా. ఎప్పుడైతే ఈ నేను అనే భావన వ్యతిరేక రూపములో వస్తుందో, అప్పుడు తండ్రికి ప్రియముగా చేయడానికి బదులుగా, ఎవరో ఒక ఆత్మకు ప్రియముగా చేస్తుంది లేదా పేరు-గౌరవము-కీర్తి ప్రతిష్టలకు ప్రియముగా చేస్తుంది. ఈ బంధనము నుండి ముక్తులుగా అయ్యేందుకు నిరంతరము నిరాకారీ స్థితిలో స్థితులై సాకారములోకి రండి - ఈ అభ్యాసాన్ని న్యాచురల్ నేచర్ గా (సహజ స్వభావముగా) చేసుకోండి, అప్పుడు నిరహంకారులుగా అయిపోతారు.

స్లోగన్:-
ఎవరి గురించైనా చెడు విషయాన్ని లేక మంచి విషయాన్ని విని, సంకల్పములోనైనా ద్వేష భావము రావడము - ఇది కూడా పరమతమే.

అవ్యక్త ప్రేరణలు - అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా) అవ్వండి

సంకల్పములోనైనా లేక స్వప్నములోనైనా అపవిత్రత అంశమాత్రము కూడా లేనప్పుడే సత్యమైన బ్రాహ్మణుడు అని అంటారు, ఈ ధారణకు చెంది ఉన్న గాయనమే ఏమిటంటే - ‘ప్రాణము పోయినా కానీ ధర్మాన్ని వదలకూడదు.’ ఈ విధముగా ధైర్యాన్ని, దృఢ నిశ్చయాన్ని పెట్టుకున్నవారు ఎటువంటి పరిస్థితులలో కూడా తమ ధర్మము కొరకు అనగా ధారణ కొరకు ఏది త్యాగము చేయాల్సి వచ్చినా, సహనము చేయాల్సి వచ్చినా, ఎదుర్కోవాల్సి వచ్చినా, ధైర్యాన్ని పెట్టాల్సి వచ్చినా, దానిని చాలా సంతోషముగా చేస్తారు, వెనుదిరగరు.