12-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ చదువు యొక్క ఆధారమంతా యోగముపైనే ఉంది, యోగము ద్వారానే ఆత్మ పవిత్రముగా అవుతుంది, వికర్మలు వినాశనమవుతాయి’’

ప్రశ్న:-
కొంతమంది పిల్లలు బాబాకు చెందినవారిగా అయ్యి మళ్ళీ చేతిని వదిలేస్తారు, దానికి కారణమేమిటి?

జవాబు:-
తండ్రిని పూర్తిగా గుర్తించని కారణముగా, పూర్తి నిశ్చయబుద్ధి కలవారిగా ఉండని కారణముగా 8-10 సంవత్సరాల తరువాత కూడా తండ్రికి వీడ్కోలు ఇచ్చేస్తారు, చేతిని వదిలేస్తారు. వారి పదవి భ్రష్టమైపోతుంది. 2- అశుద్ధమైన దృష్టి ఉన్న కారణముగా మాయ గ్రహచారము కూర్చుంటుంది, అవస్థ కిందికి-పైకి అవుతూ ఉంటుంది, దాని వలన కూడా చదువును వదిలేస్తారు.

ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మనమంతా అనంతమైన ఆత్మిక తండ్రికి పిల్లలమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, వీరిని బాప్ దాదా అని పిలుస్తారు. ఏ విధముగా మీరు ఆత్మిక పిల్లలో, అలాగే ఈ బ్రహ్మా కూడా శివబాబాకు ఆత్మిక బిడ్డ. శివబాబాకు రథమైతే తప్పకుండా కావాలి కదా, కావున ఏ విధముగా ఆత్మలైన మీకు కర్మలు చేయడానికి ఇంద్రియాలు లభించాయో, అలాగే శివబాబాకు కూడా ఇది రథము, ఎందుకంటే ఇది కర్మక్షేత్రము, ఇక్కడ కర్మలు చేయవలసి ఉంటుంది. అది ఇల్లు, అక్కడ ఆత్మలు ఉంటారు. మన ఇల్లు శాంతిధామము అని, అక్కడ ఈ ఆట ఉండదు అని ఆత్మ తెలుసుకుంది. అక్కడ లైట్లు మొదలైనవేవీ ఉండవు, కేవలం ఆత్మలే ఉంటాయి. అక్కడి నుండి ఇక్కడకు పాత్రను అభినయించడానికి వస్తారు. ఇది ఒక అనంతమైన డ్రామా అని మీ బుద్ధిలో ఉంది. పాత్రధారులు ఎవరైతే ఉన్నారో, వారి పాత్రను గురించి ప్రారంభము నుండి చివరి వరకు పిల్లలైన మీకు నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. ఇక్కడ సాధు-సన్యాసులు మొదలైనవారెవ్వరూ అర్థం చేయించరు. ఇక్కడ పిల్లలైన మనము అనంతమైన తండ్రి వద్ద కూర్చున్నాము. ఇప్పుడు మనము తిరిగి వెళ్ళాలి. ఆత్మ తప్పకుండా పవిత్రముగా అవ్వాలి. శరీరము కూడా ఇక్కడే పవిత్రముగా అవ్వాలి అని కాదు. ఆత్మ పవిత్రముగా అవుతుంది. శరీరము పవిత్రముగా ఎప్పుడు అవుతుందంటే, పంచ తత్వాలు కూడా సతోప్రధానముగా ఉన్నప్పుడు. ఇప్పుడు మీ ఆత్మ పురుషార్థము చేసి పావనముగా అవుతుంది. అక్కడ ఆత్మ మరియు శరీరము, రెండూ పవిత్రముగా ఉంటాయి. ఇక్కడ అలా ఉండడము జరగదు. ఆత్మ పవిత్రముగా అయితే ఇక పాత శరీరాన్ని వదిలేస్తుంది, ఆ తరువాత కొత్త తత్వాలతో కొత్త శరీరాలు తయారవుతాయి. ఆత్మనైన నేను అనంతమైన తండ్రిని స్మృతి చేస్తున్నానా లేదా అన్నది మీకు తెలుసు. ఈ విషయములో ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. చదువు యొక్క ఆధారమంతా యోగముపైనే ఉంది. చదువు అయితే సహజమైనది. చక్రము ఎలా తిరుగుతుంది అన్నది అర్థం చేసుకున్నారు, ముఖ్యమైనది స్మృతియాత్రయే. అది లోలోపల గుప్తముగా ఉంది. అది బయటకు కనిపించదు. ఫలానావారు బాగా స్మృతి చేస్తున్నారా లేదా తక్కువగా స్మృతి చేస్తున్నారా అన్నది బాబా చెప్పలేరు. అవును, జ్ఞానము విషయములోనైతే, ఫలానావారు జ్ఞానములో చాలా చురుకుగా ఉన్నారు అన్నది చెప్పగలరు. స్మృతి విషయములోనైతే బాహ్యముగా ఏమీ కనిపించదు. జ్ఞానము నోటి ద్వారా చెప్పడం జరుగుతుంది. స్మృతి అనేది అజపాజపము (నిరంతర స్మృతి). జపము అన్న పదము భక్తి మార్గానికి చెందినది, జపము అనగా ఎవరో ఒకరి నామాన్ని జపించడము. ఇక్కడైతే ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి.

మనం తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ, పవిత్రముగా అవుతూ-అవుతూ, ముక్తిధామమైన శాంతిధామానికి చేరుకుంటామని మీకు తెలుసు. అలాగని డ్రామా నుండి ముక్తులుగా అవుతారని కాదు. ముక్తి అంటే అర్థము దుఃఖము నుండి విముక్తులై శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామములోకి వస్తారు. ఎవరైతే పవిత్రముగా అవుతారో వారు సుఖాన్ని అనుభవిస్తారు. అపవిత్రమైన మనుష్యులు వారికి సేవ చేస్తారు. పవిత్రమైనవారికే మహిమ ఉంది, ఇందులోనే శ్రమ ఉంది. కళ్ళు చాలా మోసగిస్తాయి, పడిపోతారు. పైకీ-కిందికీ అయితే అందరూ అవ్వవలసిందే. గ్రహచారము అందరికీ పడుతుంది. పిల్లలు కూడా అర్థం చేయించవచ్చు అని బాబా అంటారు కానీ, మళ్ళీ గురువుగా మాత కావాలని కూడా అంటారు, ఎందుకంటే ఇప్పుడు మాత-గురువు అన్న సిస్టమ్ (పద్ధతి) నడుస్తుంది. పూర్వము పితలది ఉండేది. ఇప్పుడు మొట్టమొదట కలశము మాతలకు లభిస్తుంది. మాతలు మెజారిటీలో ఉన్నారు. కుమారీలు పవిత్రత గురించి రాఖీ కడతారు. భగవంతుడు అంటారు, కామము మహాశత్రువు, దీనిపై విజయము పొందండి. రక్షాబంధనము పవిత్రతకు గుర్తు. వారు రాఖీ కడతారు కానీ పవిత్రముగానైతే అవ్వరు. అవన్నీ కృత్రిమమైన రాఖీలు, అవేమీ పావనముగా చేయవు. ఇందులోనైతే జ్ఞానము కావాలి. ఇప్పుడు మీరు రాఖీ కడతారు, అర్థాన్ని కూడా వినిపిస్తారు. ఈ ప్రతిజ్ఞను చేయిస్తారు. సిక్కులకు పవిత్రతకు గుర్తుగా కంకణము ఉంటుంది, కానీ వారు పవిత్రముగానైతే అవ్వరు. పతితులను పావనముగా తయారుచేసేవారు, సర్వుల సద్గతిదాత ఒక్కరే, వారు దేహధారి కారు. నీటి గంగ అయితే చూడటానికి ఈ నేత్రాలకు కనిపిస్తుంది. సద్గతిదాత అయిన ఆ తండ్రిని ఈ నేత్రాలతో చూడలేరు. ఆత్మ అంటే ఏమిటి అని ఆత్మను ఈ నేత్రాలతో ఎవరూ చూడలేరు. నా శరీరములో ఆత్మ ఉంది, దానిని మీరు చూసారా అని ప్రశ్నిస్తే, లేదు అని చెప్తారు. మిగిలిన వస్తువులన్నీ వేటికైతే పేరు ఉందో, అవన్నీ ఈ నేత్రాలకు కనిపిస్తాయి. ఆత్మకు కూడా పేరు అయితే ఉంది. భృకుటి మధ్యలో ఒక అద్భుతమైన సితార మెరుస్తుంది అని అంటారు కూడా. కానీ అది నేత్రాలకు కనిపించదు. పరమాత్మను కూడా స్మృతి చేస్తారు, కానీ వారు ఈ నేత్రాలకు కనిపించరు. లక్ష్మీ-నారాయణులను ఈ నేత్రాల ద్వారా చూడడం జరుగుతుంది. లింగాన్ని పూజిస్తారు కానీ అదేమీ యథార్థమైన రూపము కాదు కదా. లింగము రూపాన్ని చూస్తున్నా కూడా పరమాత్మ ఎవరు అనేది వారికి తెలియదు. ఆ విషయాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఆత్మ అయితే చాలా చిన్న బిందువు. అది చూడటానికి కనిపించదు. ఆత్మను కానీ, పరమాత్మను కానీ చూడలేరు, వారిని తెలుసుకోగలరు.

మన బాబా వీరిలోకి వచ్చి ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఈ శరీరములో ఈ శరీరానికి చెందిన ఆత్మ కూడా ఉంది, అలాగే పరమపిత పరమాత్మ అంటారు, నేను కూడా ఇతని రథములో విరాజమానమై ఉన్నాను, కావుననే మీరు బాప్ దాదా అని పిలుస్తారు. ఇప్పుడు దాదానైతే ఈ కళ్ళ ద్వారా చూస్తారు, బాబాను చూడలేరు. బాబా జ్ఞానసాగరుడని, వారు ఈ శరీరము ద్వారా మనకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారని మీకు తెలుసు. ఆ జ్ఞానసాగరుడు పతిత-పావనుడు. మరి నిరాకారుడు దారిని ఎలా తెలియజేస్తారు? ప్రేరణ ద్వారానైతే ఏ పనులు జరగవు. భగవంతుడు వస్తారు అన్నది ఎవ్వరికీ తెలియదు. శివజయంతిని కూడా జరుపుకుంటున్నారంటే మరి తప్పకుండా వారు ఇక్కడికి వస్తారనే కదా. ఇప్పుడు వారు మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. బాబా వీరిలోకి వచ్చి చదివిస్తారు. బాబాను పూర్తిగా గుర్తించని కారణముగా, నిశ్చయబుద్ధి కలవారిగా లేని కారణముగా 8-10 సంవత్సరాల తరువాత కూడా వదిలి వెళ్ళిపోతారు. మాయ పూర్తిగా అంధులుగా చేసేస్తుంది. బాబాకు చెందినవారిగా అయి మళ్ళీ వదిలేస్తే పదవీభ్రష్టులుగా అయిపోతారు. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా పరిచయము లభించింది కావున దీనిని ఇతరులకు కూడా ఇవ్వాలి. ఋషులు, మునులు మొదలైనవారంతా మాకు తెలియదు, మాకు తెలియదు అని అంటూ వచ్చారు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు మీరు - అవును, మాకు తెలుసు అని అంటారు, కావున ఆస్తికులుగా అయ్యారు. సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అనేది కూడా మీకు తెలుసు. మొత్తం ప్రపంచము మరియు మీరు స్వయము కూడా ఈ చదువుకు ముందు నాస్తికులుగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు కావున - మాకు పరమపిత పరమాత్మ అయిన తండ్రి అర్థం చేయించారు, మమ్మల్ని ఆస్తికులుగా తయారుచేసారు అని మీరు అంటారు. ఇంతకుముందు మనకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను గురించి తెలియదు. తండ్రి రచయిత, తండ్రియే సంగమములో వచ్చి కొత్త ప్రపంచ స్థాపనను కూడా చేస్తారు మరియు పాత ప్రపంచ వినాశనాన్ని కూడా చేస్తారు. ఈ పాత ప్రపంచ వినాశనము కొరకే ఈ మహాభారత యుద్ధము ఉంది. ఆ సమయములో శ్రీకృష్ణుడు ఉన్నారని ఆ సమయము గురించే వారు భావిస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఆ సమయములో నిరాకారుడైన తండ్రి ఉన్నారు కానీ వారిని ఈ నేత్రాలతో చూడలేము. శ్రీకృష్ణునిదైతే చిత్రము ఉంది, దానిని చూడవచ్చు. శివుడిని చూడలేరు. శ్రీకృష్ణుడు అయితే సత్యయుగ యువరాజు. అవే మఖకవళికలు మళ్ళీ ఉండవు. శ్రీకృష్ణుడు కూడా ఎప్పుడు వచ్చారు మరియు ఎలా వచ్చారు, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. శ్రీకృష్ణుడిని కంసుడి జైలులో చూపిస్తారు. కంసుడు సత్యయుగములో ఉండేవారా? అది ఎలా సంభవము? కంసుడు అని అసురుడిని అంటారు. ఈ సమయములో అందరూ ఆసురీ సాంప్రదాయులుగా ఉన్నారు కదా. ఒకరినొకరు కొట్టుకుంటూ, హతమార్చుకుంటూ ఉంటారు. దైవీ ప్రపంచము ఉండేది, ఆ విషయాన్ని మర్చిపోయారు. ఈశ్వరీయ దైవీ ప్రపంచాన్ని ఈశ్వరుడు స్థాపించారు. ఈ విషయము కూడా నంబరువారు పురుషార్థానుసారముగా మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ పరివారమువారిగా ఉన్నారు, మళ్ళీ అక్కడ దైవీ పరివారమువారిగా ఉంటారు. ఈ సమయములో ఈశ్వరుడు మిమ్మల్ని స్వర్గపు దేవీ-దేవతలుగా తయారుచేసేందుకు యోగ్యులుగా తయారుచేస్తున్నారు. తండ్రి చదివిస్తున్నారు. ఈ సంగమయుగము గురించి ఎవరికీ తెలియదు. ఏ శాస్త్రములోనూ ఈ పురుషోత్తమ యుగము గురించి లేదు. పురుషోత్తమ యుగము అనగా పురుషోత్తములుగా తయారయ్యే యుగము. సత్యయుగాన్ని పురుషోత్తమ యుగము అని అంటారు. ఈ సమయములోనైతే మనుష్యులు పురుషోత్తములుగా లేరు. వీరిని కనిష్టులు, తమోప్రధానులు అని అంటారు. ఈ విషయాలన్నీ బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి అంటారు, ఇది ఆసురీ, భ్రష్టాచారీ ప్రపంచము. సత్యయుగములో ఇటువంటి వాతావరణమేదీ ఉండదు. అది శ్రేష్ఠాచారీ ప్రపంచము. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. తప్పకుండా వారు శ్రేష్ఠాచారీ ప్రపంచానికి యజమానులుగా ఉండేవారు. భారత్ యొక్క రాజులు ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళారు, వారు ఇప్పుడు పూజింపబడుతున్నారు. వారు పూజ్యులుగా, పవిత్రులుగా ఉండేవారు, వారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. పూజారులు అని భక్తి మార్గము వారిని, పూజ్యులు అని జ్ఞాన మార్గము వారిని అనడం జరుగుతుంది. పూజ్యుల నుండి పూజారులుగా, మళ్ళీ పూజారుల నుండి పూజ్యులుగా ఎలా అవుతారు. ఈ ప్రపంచములో పూజ్యులు ఒక్కరు కూడా ఉండరు అని ఇది కూడా మీకు తెలుసు. పూజ్యులు అని పరమపిత పరమాత్మను మరియు దేవతలను మాత్రమే పిలవడం జరుగుతుంది. పరమపిత పరమాత్మ అందరికీ పూజ్యుడు. సర్వ ధర్మాల వారు వారిని పూజిస్తారు. ఇటువంటి తండ్రి జన్మ ఇక్కడే జరిగిందని అంటూ ఉంటారు. శివజయంతి ఉంది కదా. కానీ వారి జన్మ భారత్ లో జరుగుతుందని మనుష్యులకు ఏమీ తెలియదు. ఈ రోజుల్లోనైతే శివజయంతికి సెలవు కూడా ఇవ్వడం లేదు. జయంతిని జరుపుకోవడం, జరుపుకోకపోవడం మీ ఇష్టము. కానీ అధికారిక సెలవు దినము లేదు. ఎవరైతే శివజయంతిని నమ్మరో వారు ఆ రోజు తమ పనులకు వెళ్ళిపోతారు. చాలా ధర్మాలు ఉన్నాయి కదా. సత్యయుగములో ఇటువంటి విషయాలు ఉండవు. అక్కడ ఈ వాతావరణమే లేదు. సత్యయుగము కొత్త ప్రపంచము, అక్కడ ఒకే ధర్మము ఉంటుంది. మా తరువాత చంద్రవంశీయుల రాజ్యముంటుందని అక్కడ వారికి తెలియదు. ఇది-ఇది గతములో జరిగిందని ఇక్కడ మీకు అంతా తెలుసు. సత్యయుగములో మీరు ఉంటారు, అక్కడ ఏ గతాన్ని గుర్తు చేసుకుంటారు? దానికి పూర్వము ఉన్నది కలియుగము. వారి చరిత్ర-భౌగోళికాల గురించి తెలుసుకోవడం వలన ఉపయోగమేముంది.

మనం బాబా వద్ద కూర్చున్నామని ఇక్కడ మీకు తెలుసు. బాబా టీచర్ కూడా, సద్గురువు కూడా. సర్వుల సద్గతిని చేయడానికి తండ్రి వచ్చారు. వారు ఆత్మలందరినీ తప్పకుండా తీసుకువెళ్తారు. మనుష్యులైతే దేహాభిమానములోకి వచ్చి - అంతా మట్టిలో కలిసిపోనున్నది అని అంటారు. అంతేకానీ, ఆత్మ వెళ్ళిపోతుందని, ఈ శరీరాలు మట్టితో తయారైనవని, ఈ పాత శరీరాలు అంతమైపోతాయని వారు అర్థం చేసుకోరు. ఆత్మ అయిన మనము ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాము. ఈ ప్రపంచములో ఇది మన అంతిమ జన్మ. ఇక్కడ అందరూ పతితముగా ఉన్నారు. సదా పావనముగానైతే ఎవ్వరూ ఉండలేరు. సతోప్రధానముగా, సతో, రజో, తమోగా తప్పకుండా అవుతారు. అందరూ ఈశ్వరుని రూపాలే అని వారు అంటారు. ఈశ్వరుడు ఈ ఆట ఆడేందుకు తన అనేక రూపాలను తయారుచేసారని వారు అంటారు. ఏ లెక్క గురించి వారికి తెలియదు. అలాగే ఈ ఆట ఆడేవారి గురించి కూడా తెలియదు. తండ్రియే కూర్చుని ప్రపంచ చరిత్ర-భూగోళికములను గురించి అర్థం చేయిస్తారు. ఆటలో ప్రతి ఒక్కరి పాత్ర వేర్వేరుగా ఉంటుంది. అందరి పొజిషన్ లు వేర్వేరుగా ఉంటాయి. ఎవరు ఏ పొజిషన్ లో ఉంటే వారికి అటువంటి మహిమ జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ తండ్రి సంగమములోనే అర్థం చేయిస్తారు. సత్యయుగములో మళ్ళీ సత్యయుగ పాత్ర కొనసాగుతుంది. అక్కడ ఈ విషయాలు ఉండవు. ఇక్కడ మీకు సృష్టి చక్రపు జ్ఞానము బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. మీ పేరే స్వదర్శన చక్రధారి. లక్ష్మీ-నారాయణులకు స్వదర్శన చక్రము ఇవ్వడం జరగదు. ఈ అలంకారాలు ఇక్కడివే. మూలవతనములో కేవలం ఆత్మలు మాత్రమే ఉంటాయి, సూక్ష్మవతనములో ఏమీ ఉండదు. మనుష్యులు, జంతువులు, పశుపక్ష్యదులు మొదలైనవన్నీ ఇక్కడే ఉంటాయి. సత్యయుగములో నెమలి మొదలైనవాటిని చూపిస్తారు. అక్కడ నెమలి ఈకలను తీసి ధరిస్తారని కాదు. నెమలికి దుఃఖమునివ్వరు కదా. అలాగని కింద పడిపోయిన నెమలి ఈకలను తీసి ధరిస్తారని కాదు. అలా కాదు. కిరీటములో కూడా అసత్యమైన గుర్తులను చూపించారు. అక్కడ అన్నీ సుందరమైన వస్తువులే ఉంటాయి. అశుద్ధమైన వస్తువుల యొక్క నామ-రూపాలు కూడా ఉండవు. చూస్తే అయిష్టము కలిగేలాంటి వస్తువులేవీ అక్కడ ఉండవు. ఇక్కడైతే అయిష్టము కలుగుతుంది కదా. అక్కడ జంతువులకు కూడా దుఃఖము ఉండదు. సత్యయుగము ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. దాని పేరే స్వర్గము, హెవెన్, కొత్త ప్రపంచము. ఇక్కడ ఈ పాత ప్రపంచములో చూడండి, వర్షాల కారణముగా ఇళ్ళు కూలిపోతూ ఉంటాయి, మనుష్యులు మరణిస్తారు. భూకంపాలు వస్తే అందరూ కూరుకుపోయి చనిపోతారు. సత్యయుగములో చాలా తక్కువమంది ఉంటారు, ఆ తరువాత వృద్ధి పొందుతూ ఉంటారు. మొదట సూర్యవంశీయులు ఉంటారు. ఎప్పుడైతే ప్రపంచము 25 శాతము పాతగా అవుతుందో అప్పుడు చంద్రవంశీయులు వస్తారు. సత్యయుగము 1250 సంవత్సరాలు ఉంటుంది, అది 100 శాతము కొత్త ప్రపంచము. అక్కడ దేవీ-దేవతలు రాజ్యము చేస్తారు. మీలో కూడా చాలామంది ఈ విషయాలను మర్చిపోతూ ఉంటారు. రాజధాని అయితే స్థాపన అయ్యేదే ఉంది. హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు (నిరాశకు లోనవ్వకూడదు). ఇది పురుషార్థానికి సంబంధించిన విషయము. పిల్లలందరి చేత తండ్రి ఒకేలాంటి పురుషార్థము చేయిస్తారు. మీరు మీ కొరకు విశ్వములో స్వర్గ రాజ్యాన్ని స్థాపన చేసుకుంటారు. నేను అందులో ఏమవుతాను అని స్వయాన్ని చూసుకోవాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పురుషోత్తమ యుగములో స్వర్గపు దేవీ-దేవతలుగా అయ్యే చదువును చదువుకుని స్వయాన్ని యోగ్యులుగా తయారుచేసుకోవాలి. పురుషార్థములో హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు (నిరాశకు లోనవ్వకూడదు).

2. ఈ అనంతమైన ఆటలో ప్రతి పాత్రధారి యొక్క పాత్ర మరియు పొజిషన్ వేర్వేరుగా ఉంటుంది, ఎవరి పొజిషన్ ఏ విధముగా ఉంటుందో వారికి ఆ విధమైన గౌరవము లభిస్తుంది. ఈ రహస్యాలన్నింటినీ అర్థం చేసుకుని ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాలను స్మరణ చేస్తూ స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి.

వరదానము:-
తండ్రి యొక్క ప్రతి శ్రీమతాన్ని పాలన చేసే సత్యమైన స్నేహీలుగా, ప్రియమైనవారిగా కండి

ఏ పిల్లలైతే సదా ఒక్క తండ్రి స్నేహములో లవలీనులై ఉంటారో, వారికి తండ్రి యొక్క ప్రతి మాట ప్రియముగా అనిపిస్తుంది, ప్రశ్నలు సమాప్తమైపోతాయి. బ్రాహ్మణ జన్మకు పునాది స్నేహము. ఎవరైతే స్నేహీ, ప్రియమైన ఆత్మలు ఉంటారో, వారికి తండ్రి శ్రీమతాన్ని పాలన చేయడములో కష్టము అనుభవమవ్వదు. స్నేహము కారణముగా సదా ఈ ఉత్సాహమే ఉంటుంది - బాబా ఏదైతే చెప్పారో, అది నా కోసమే చెప్పారు, అది నేను చేయాలి అని. స్నేహీ ఆత్మలు పెద్ద మనసు కలవారిగా ఉంటారు, అందుకే వారి కొరకు ప్రతి పెద్ద విషయము కూడా చిన్నదిగా అయిపోతుంది.

స్లోగన్:-
ఏ విషయములోనైనా ఫీల్ అవ్వడము - ఇది కూడా ఫెయిల్ అయినదానికి గుర్తు.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి

జ్వాలా స్వరూప స్థితిని అనుభవం చేసేందుకు నిరంతరము స్మృతి అనే జ్వాల ప్రజ్వలితమై ఉండాలి. దీని కొరకు సహజ విధి ఏమిటంటే - సదా స్వయాన్ని ‘‘సారథి’’గా మరియు ‘‘సాక్షీ’’గా భావిస్తూ నడుచుకోండి. ఆత్మ ఈ రథానికి సారథి - ఈ స్మృతి స్వతహాగానే ఈ రథము (దేహము) నుండైనా మరియు ఏ విధమైన దేహభానము నుండైనా అతీతముగా చేస్తుంది. స్వయాన్ని సారథిగా భావించినట్లయితే సర్వ కర్మేంద్రియాలు మీ కంట్రోల్ లో ఉంటాయి. సూక్ష్మ శక్తులు అయిన ‘‘మనసు-బుద్ధి-సంస్కారాలు’’ కూడా ఆర్డర్అనుసారముగా ఉంటాయి.