12-11-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు, మీకు ఈ పాత కలియుగీ ప్రపంచానికి సంబంధించిన ఏ ఆలోచన రాకూడదు’’

ప్రశ్న:-
తండ్రి పిల్లలకు శ్రేష్ఠ కర్మలు చేయడానికి మరియు కర్మలను సరిదిద్దుకోవడానికి ఏ విధిని తెలియజేశారు?

జవాబు:-
తమ కర్మలను సరిదిద్దుకోవడానికి సత్యమైన తండ్రితో సదా సత్యముగా ఉండండి. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటుగానైనా ఏదైనా తప్పుడు కర్మ జరిగితే, అది బాబాకు వెంటనే వ్రాయండి. సత్యముగా బాబాకు వినిపించినట్లయితే దాని ప్రభావము తగ్గుతుంది. లేదంటే వృద్ధి అవుతూ ఉంటుంది. బాబా వద్దకు సమాచారము వస్తే బాబా దానిని సరిదిద్దేందుకు శ్రీమతాన్ని ఇస్తారు.

ఓంశాంతి
శివబాబా బ్రహ్మా ద్వారా పిల్లలను అడుగుతున్నారు - పిల్లలూ, మీరు ఇక్కడ ఉదయము నుండి కూర్చుని ఏం చేస్తున్నారు? మీరు ఎలాగూ విద్యార్థులే. కావున తప్పకుండా ఇక్కడ కూర్చుని, శివబాబా మమ్మల్ని చదివించడానికి వచ్చారు అని ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ చదువుతో మీరు సూర్యవంశీయులుగా అవుతారు ఎందుకంటే మీరు రాజయోగము నేర్చుకుంటున్నారు. విష్ణుపురికి యజమానులుగా అయ్యే ఆలోచనలో కూర్చున్నారా లేక ఎవరికైనా బాధ్యతలు, పిల్లలు, వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి గుర్తుకువస్తున్నాయా? ఇది గీతా పాఠశాల అని, మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని మరియు మేము లక్ష్మీ-నారాయణులుగా లేక వారి కుటుంబ సభ్యులుగా అవుతాము అని బుద్ధిలో ఉండాలి. ఇది రాజయోగము. మేము బాబా నుండి డైరెక్టుగా విని సూర్యవంశీ కుటుంబ సభ్యులుగా అవుతామని పిల్లల బుద్ధిలో ఉండాలి. లక్ష్మీ-నారాయణుల చిత్రము ఎదురుగా ఉంది, అక్కడ మన రాజ్యము ఉంటుంది. ప్రపంచములోని వారికి స్వర్గమని దేనినంటారో తెలియదు. పిల్లలైన మీరంటారు - మేము ఇప్పుడు బాబా నుండి స్వర్గము యొక్క స్వరాజ్య విద్యను నేర్చుకుంటున్నాము, మేమే స్వర్గానికి యజమానులుగా అవ్వబోతున్నాము. దీనిని లోలోపల స్మరించాలి. ఎలాగైతే స్కూల్లో విద్యార్థుల బుద్ధిలో, మేము బ్యారిస్టరు, ఇంజనీరు మొదలైనవారిగా అవ్వడానికి చదువుకుంటున్నాము అని ఉంటుంది. మీకు ఇదైనా గుర్తుంటుందా లేక మర్చిపోతారా? మీరు ఉన్నతోన్నతమైన భగవంతుని విద్యార్థులు. మిమ్మల్ని ఉన్నతోన్నతమైన దేవతలుగా తయారుచేయడానికి తండ్రి చదివిస్తున్నారు, మీరు వారి పిల్లలు. ఆత్మలు ఈ శరీరము ద్వారా తమ భవిష్య పదవిని గుర్తు చేస్తున్నారా లేదా శారీరక సంబంధీకులను, దైహిక ఆస్తిని, వ్యాపార-వ్యవహారాలను గుర్తు చేస్తున్నారా? ఇక్కడకు వచ్చినప్పుడు - మమ్మల్ని అనంతమైన యజమానులుగా చేయడానికి అనంతమైన తండ్రి చదివించడానికి వస్తారు అని అర్థం చేసుకోవాలి. ఇక రాజు-రాణులుగా అయినా అవ్వండి లేక ప్రజలుగా అయినా అవ్వండి! యజమానులుగా అయితే అవుతారు కదా. కొత్త ప్రపంచములో ఉన్నదే సూర్యవంశము. మేము అక్కడ మా రాజ్యము చేస్తాము అని అయితే అర్థం చేసుకున్నారు కదా.

పిల్లలు బయట ఉన్నప్పుడు, ఇళ్ళు-వాకిళ్ళలో, వ్యవసాయములో ఉన్నప్పుడు బాబా స్మృతి అంతగా ఉండదని బాబాకు తెలుసు. కనుక ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని ఆలోచనలను వదిలి రండి. మీరు ఇప్పుడు ఆ కలియుగీ ప్రపంచములో లేనే లేరు. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. కలియుగాన్ని వదిలేశారు, బయట కలియుగము ఉంది. విశేషముగా ఉన్న ఈ మధుబన్ సంగమము, అందుకే మధుబన్ కు మహిమ ఉంది. ఇక్కడ ఈ మురళినే స్మరించాలి. ఏదైతే వింటారో, దానిని రిపీట్ చేయండి మరియు విచార సాగర మంథనము చేయండి. ఎంత సమయము లభిస్తే అంత, చిత్రాల ఎదురుగా వచ్చి కూర్చోండి. వాటిని చూస్తూ మరియు చదువుతూ ఉండండి. బ్రాహ్మణీలు ఎవరైతే తీసుకువస్తారో, వారిపై చాలా బాధ్యత ఉంటుంది. చాలా చింత పెట్టుకోవాలి. ఎలాగైతే టీచర్లకు చింత ఉంటుంది - మా స్కూలు నుండి ఒకవేళ తక్కువమంది పాస్ అయితే పరువు పోతుంది అని. స్కూల్లో చాలామంది పాస్ అయితే, ఆ టీచరును మంచి టీచరుగా భావించడము జరుగుతుంది. బ్రాహ్మణీలు విద్యార్థుల పట్ల అటెన్షన్ పెట్టాలి. ఇక్కడ మీరు సంగమములోకి వచ్చారు. ఇక్కడ డైరెక్టుగా బాబా వినిపిస్తారు. ఇక్కడి ప్రభావము చాలా బాగుంటుంది. ఒకవేళ ఇక్కడ ఇళ్ళు-వాకిళ్ళు, వ్యాపారాలు గుర్తుకువస్తే, వీరు సాధారణ ప్రజలుగా అవుతారని బాబా భావిస్తారు. వచ్చారు రాజులుగా అవ్వటానికి కానీ... లేదంటే నిజానికి పిల్లలకు లోలోపల చాలా సంతోషముండాలి. చిత్రాలు కూడా మీకు చాలా సహాయము చేస్తాయి. మనుష్యులు స్మృతి చేయడము కోసమని అష్ట దేవతలు మరియు గురువుల చిత్రాలను ఇంటిలో పెట్టుకుంటారు. కానీ వారిని స్మృతి చేయడము వలన ఏమీ లభించదు. భక్తి మార్గములో ఏం చేసినా, కిందకు దిగుతూనే వచ్చారు. పిల్లలైన మీరు ఉన్నతిలోకి వెళ్ళే పురుషార్థము చేయాలి. ఇంటిలో శివబాబా చిత్రాన్ని పెట్టుకున్నట్లయితే, పదే-పదే స్మృతి కలుగుతుంది. ఇంతకుముందు మీరు హనుమంతుడిని, కృష్ణుడిని, రాముడిని గుర్తు చేసేవారు. ఇప్పుడు శివబాబా, నన్ను స్మృతి చేయండి అని సమ్ముఖముగా చెప్తున్నారు. త్రిమూర్తి చిత్రము చాలా బాగుంటుంది, ఈ చిత్రాన్ని సదా జేబులో పెట్టుకోండి. పదే-పదే చూస్తూ ఉన్నట్లయితే స్మృతి ఉంటుంది. బాబా భక్తునిగా ఉన్నప్పుడు లక్ష్మీ-నారాయణుల ఫోటోను జేబులో పెట్టుకునేవారు. గద్దె కింద కూడా వారితో పాటు పెట్టుకునేవారు, దాని వలన ఏమీ లభించలేదు. ఇప్పుడు బాబా నుండి చాలా ప్రాప్తి లభిస్తూ ఉంది, వారినే స్మృతి చేయాలి, ఇందులో మాయ ఎదిరిస్తుంది. జ్ఞానాన్ని అయితే చాలా వింటారు, వినిపిస్తారు, అందులో చురుకుగా వెళ్తారు. 84 జన్మల చక్రాన్ని మర్చిపోతామని అనరు కదా. అలాగని, ఇక్కడ ఉండేవారు ఎక్కువ స్మృతి చేస్తారని కూడా కాదు. అలా కాదు. ఇక్కడ ఉంటూ కూడా దుమ్ము-ధూళితో సమానమైనవాటిని గుర్తు చేస్తూ ఉండేవారు చాలామంది ఉంటారు. మనము ఏ తండ్రి ద్వారానైతే సుందరముగా అయ్యేందుకు వచ్చామో, వారి గురించే తెలియదు. మాయ నీడ చాలా పడుతుంది. ముఖ్యమైన విషయము స్మృతి. చాలా మంచి-మంచి పిల్లలు కూడా స్మృతిలో ఉండరని బాబాకు తెలుసు. యోగములో ఉండటముతోనే దేహాభిమానము తగ్గుతుంది, చాలా మధురముగా ఉంటారు. దేహాభిమానము ఉన్నట్లయితే మధురముగా అవ్వరు, డిస్టర్బ్ అవుతూ ఉంటారు. బాబా అందరి కోసం చెప్పడము లేదు. కొందరు సుపుత్రులు కూడా ఉన్నారు. ఎవరైతే యోగములో ఉంటారో, వారిని సుపుత్రులుగా భావించడము జరుగుతుంది. వారి ద్వారా ఎలాంటి తప్పుడు పని జరగదు. మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరినీ మర్చిపోతారు. మనము వివస్త్ర (అశరీరి)గా వచ్చాము, ఇప్పుడు అశరీరిగా అయి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది, దాని ద్వారా మీరు మీ ఇంటిని తెలుసుకుంటారు, రాజధానిని కూడా తెలుసుకుంటారు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు, వారు చూపించినట్లుగా శివబాబా నల్లని లింగమేమీ కాదు, వారు బిందువు వలె ఉంటారు. ఇది కూడా మనకు తెలుసు. ఇప్పుడు మనము ఇంటికి వెళ్తాము, అక్కడ మనము అశరీరిగా ఉంటాము. ఇప్పుడు మనము అశరీరిగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పతిత-పావనుడైన తండ్రిని స్మృతి చేయాలి. మీకు ఇలా అర్థం చేయించడము జరుగుతుంది - ఆత్మ అవినాశీ, అందులో 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది, అది ఎప్పుడూ అంతం కాదు. కొంత సమయము ముక్తిధామానికి వెళ్ళి మళ్ళీ పాత్రలోకి రావాలి. మీరు ఆల్రౌండ్ పాత్రను అభినయిస్తారు, ఇది సదా గుర్తుండాలి. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి. బాబాను స్మృతి చేయడముతో మనము తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతాము. ఇక్కడ మీరు వ్యాపార-వ్యవహారాలేవీ గుర్తు చేయకూడదు.

ఇక్కడ మీరు పూర్తిగా సంగమయుగములో ఉన్నారు. ఇప్పుడు మీరు నావలో కూర్చున్నారు. కొందరు మధ్యలో దిగిపోతారు, అప్పుడు చిక్కుకుని మరణిస్తారు. దీని గురించి కూడా శాస్త్రాలలో ఒక కథ ఉంది. ఇప్పుడు మీకు తెలుసు - మనము ఆవలి తీరానికి వెళ్తున్నాము, నావికుడు శివబాబా. శ్రీకృష్ణుడిని నావికుడు లేక తోట యజమాని అని అనరు. శివ భగవానువాచ. పతిత-పావనుడు శివబాబా. శ్రీకృష్ణుని వైపుకు బుద్ధి వెళ్ళలేదు. మనుష్యుల బుద్ధి అయితే భ్రమిస్తూ ఉంటుంది, బాబా వచ్చి భ్రమించడము నుండి విడిపిస్తారు. కేవలం ఈ విషయమే చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయండి, అప్పుడే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఈ విషయాలను మర్చిపోకూడదు. ఇక్కడ నుండి మీరు చాలా రిఫ్రెష్ అయ్యి వెళ్తారు. మీ అనుభవాన్ని కూడా వినిపిస్తారు - బాబా, మేము మళ్ళీ ఎలా ఉన్నామో అలాగే అయిపోతాము, మిత్ర-సంబంధీకులు మొదలైనవారి ముఖాలను చూస్తాము, ఆకర్షణకు లోనవుతాము. పిల్లలైన మీరు ప్రేయసులు, కార్య-వ్యవహారాలు చేసుకుంటూ ప్రియుడిని స్మృతి చేయండి, అప్పుడు ఉన్నత పదవిని పొందుతారు. ఒకవేళ ఇప్పుడు పురుషార్థము చేయకపోతే, సింగిల్ కిరీటము కూడా లభించదు. పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు సమయము వృధా చేయకూడదు. ఇక్కడ ఇంకేమీ ఉండదు. కేవలం దిల్వాడా మందిరము మీ స్మృతిచిహ్నము, అది మీరు చూడవచ్చు. పైన వైకుంఠము ఉంది. మీ కల్పవృక్షము కూడా స్పష్టముగా ఉంది. కింద రాజయోగములో కూర్చున్నారు, పైన రాజ్యము ఉంది. దిల్ వాలా మందిరము లాగే తయారై ఉంది. శివబాబా మనకు మళ్ళీ జ్ఞానాన్ని ఇచ్చి స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తున్నారని మీకు తెలుసు. ఈ కలియుగ వినాశనము జరగనున్నది. ఈ ఆది దేవ్, ఆది నాథ్ ఎవరు. మీకు అందరి కర్తవ్యాల గురించి తెలుసు కదా. ఈ సమయములోని చర్చ మళ్ళీ భక్తి మార్గములో నడుస్తుంది. పండుగలు, వ్రతాలు అన్నీ ఈ సమయానికి చెందినవే. సత్యమైన వ్రతము మన్మనాభవ. అంతేకానీ, నీళ్లు తాగకుండా ఉండడము, భోజనము తినకుండా ఉండడము - ఇవేవీ వ్రతాలు కావు. ప్రపంచములో ఈ సమయములో మాయ ఆర్భాటము చాలా ఉంది. ఇంతకుముందు ఈ విద్యుత్తు, గ్యాస్ మొదలైనవి ఉండేవి కావు, తర్వాత వెలువడ్డాయి. 100 సంవత్సరాలైంది, వీటిలో మనుష్యులు చిక్కుకుపోయారు. మాకైతే స్వర్గము ఇక్కడే ఉంది అని అంటారు. మాయ తీవ్రత ఎంతగా ఉందంటే, తండ్రిని అసలు స్మృతే చేయరు. మేము స్వర్గములో ఎలా కూర్చుని ఉన్నామో మీరు వచ్చి చూడండి అని అంటారు. ఇప్పుడు స్వర్గము ముందైతే అసలు ఇవేమీ కానే కాదు. స్వర్గమెక్కడ, నరకమెక్కడ. స్వర్గములోని ఒక్క వస్తువు కూడా ఇక్కడ ఉండలేదు. అక్కడ ప్రతి వస్తువు సతోప్రధానముగా ఉంటుంది. ఆవులు కూడా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. మీరు కూడా ఫస్ట్ క్లాస్ గా అవుతారు కనుక మీ ఫర్నీచర్, ఆహార-పానీయాలు మొదలైనవన్నీ ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. సూక్ష్మవతనములో ఫలాలు మొదలైనవి చూసి వస్తారు కదా. పేరు కూడా శూబీరసము అని పెడతారు. ప్రపంచము వారికి స్వర్గము ఎక్కడ ఉంది అన్న విషయము కూడా తెలియదు. అక్కడ అంతా సతోప్రధానముగా ఉంటుంది. ఈ మట్టి మొదలైనవి అక్కడ ఉండవు. దుఃఖము యొక్క విషమేమీ ఉండదు. కానీ పిల్లలకు - బాబా మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేయడానికి ఈ చదువును చదివిస్తున్నారు అన్న నషా ఇప్పుడు ఇంకా ఎక్కలేదు. చిత్రాలు ఎంత స్పష్టముగా ఉన్నాయి. చిత్రాలు తయారవ్వడానికి సమయమైతే పడుతుంది. బాబా అన్నీ సేవ కోసం తయారుచేయిస్తూనే ఉంటారు. కానీ కొంతమందైతే తమ వ్యాపార-వ్యవహారాలలో ఎంతగా చిక్కుకుని ఉన్నారంటే బాబాను అసలు స్మృతి కూడా చేయరు. ప్రదర్శనీ చిత్రాల మ్యాగజీన్ కూడా ఉంది, అది కూడా చదవాలి. గీతను చదివే నియమమున్నవారు ఎక్కడికి వెళ్ళినా సరే, గీతను తప్పకుండా చదువుతారు. ఇప్పుడు మీకు సత్యమైన గీత చిత్రాల సహితముగా లభించింది. ఇప్పుడు మంచి రీతిలో శ్రమించాలి. లేదంటే ఉన్నత పదవిని పొందలేరు. తర్వాత సాక్షాత్కారాలు జరిగినప్పుడు అయ్యో-అయ్యో అని అనవలసి ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక తర్వాత క్లాసులో నంబరువారుగా కూర్చుంటారు. ఇక్కడ కూడా సాక్షాత్కారాలు జరిగినప్పుడు, నంబరువారుగా రుద్రమాలలోకి, ఆ తర్వాత విజయమాలలోకి వెళ్తారు. స్కూలులో కొంతమంది పిల్లలు ఫెయిల్ అయినప్పుడు ఎంత దుఃఖితులుగా అవుతారు. మీది కల్ప-కల్పము యొక్క ఆట.

కొంతమంది పిల్లలు పూర్తి మ్యాగజీన్ ను చదవరు. పిల్లలు మ్యాగజీన్ ను చదివి సేవ చేయాలి. బాబా, ఫలానా వారిని ట్రాన్స్ఫర్ చేయండి, మంచి బ్రాహ్మణీని పంపించండి అని వ్రాస్తారు. కొంతమంది బ్రాహ్మణీల పట్ల ఎంత ప్రేమ ఏర్పడుతుందంటే బ్రాహ్మణీ ట్రాన్స్ఫర్ అయితే కింద పడిపోతారు. సెంటరుకు రావడమే మానేస్తారు. ఏదైనా తప్పుడు కర్మ జరిగినట్లయితే సత్యతతో వెంటనే బాబాకు వ్రాయాలి, అప్పుడు పాపం యొక్క ప్రభావము తగ్గుతుంది. లేదంటే వృద్ధి అవుతూ ఉంటుంది. బాబా సరిదిద్దేందుకు చెప్తారు, కానీ కొందరికి బాగుపడేది లేదు అంటే పాప కర్మలు చేయడము వదలనే వదలరు. భాగ్యములో లేకపోతే బాబాకు సత్యమైన సమాచారాన్ని ఇవ్వరు. బాబా వద్దకు రిపోర్టు వస్తే, సరిదిద్దేందుకు ప్రయత్నిస్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అశరీరిగా అయ్యేందుకు పూర్తి అభ్యాసము చేయాలి. ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. చాలా మధురముగా అవ్వాలి. ఏ విషయములోనూ డిస్టర్బ్ అవ్వకూడదు.

2. మురళీని స్మరణ చేయాలి. ఏదైతే వింటారో దానిపై విచార సాగర మంథనము చేయాలి. మన్మనాభవ యొక్క వ్రతాన్ని పెట్టుకోవాలి.

వరదానము:-
సదా దేహాభిమానము మరియు దేహము యొక్క దుర్గంధము నుండి దూరంగా ఉండే ఇంద్రప్రస్థ నివాసీ భవ

ఇంద్రప్రస్థములో దేవదూతలు తప్ప ఇతర మనుష్యులెవరూ నివసించలేరని అంటారు. మనుష్యులు అనగా స్వయాన్ని ఆత్మగా భావించకుండా దేహముగా భావించేవారు. కావున దేహాభిమానము మరియు దేహపు పాత ప్రపంచము, పాత సంబంధాల నుండి సదా పైకి ఎగురుతూ ఉండండి. మనుష్యతనపు దుర్గంధము ఏ మాత్రమూ ఉండకూడదు. దేహీ-అభిమాని స్థితిలో ఉండండి, జ్ఞానము మరియు యోగమనే రెక్కలు దృఢముగా ఉండాలి, అప్పుడు ఇంద్రప్రస్థ నివాసీ అని అంటారు.

స్లోగన్:-
తమ తనువు, మనసు, ధనాన్ని సఫలం చేసుకునే మరియు సర్వ ఖజానాలను వృద్ధి చేసుకునేవారే వివేకవంతులు.

అవ్యక్త ప్రేరణలు - బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి

సంపూర్ణత నంబరువారుగా ఉంటుంది. మాలలో 108 మణులు ఉంటాయి. అందులో నంబర్ వన్ మణిని మరియు 108వ మణిని, రెండింటినీ సంపూర్ణ రత్నము లేక విజయీ రత్నము అనే అంటారు. విజయీ రత్నము అనగా తమ నంబరు అనుసారముగా సంపూర్ణతను ప్రాప్తి చేసుకుంటారు, వారి కోసం మొత్తము డ్రామాలో అదే సంపూర్ణత యొక్క ఫస్ట్ స్టేజ్.