13-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 15.11.2011


‘‘ఇప్పుడు నిర్విఘ్నముగా మరియు ఎవర్రెడీగా ఉంటూ 108 మాలను తయారుచేయండి, బ్రహ్మాబాబా సమానముగా సంపన్నముగా మరియు సంపూర్ణముగా అవ్వండి’’

ఈ రోజు సర్వశక్తివంతుడైన బాబా, తమ మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలకు సర్వ శక్తుల ఖజానాను ఇవ్వడానికి వచ్చారు. సర్వ శక్తుల ఖజానా ఎంత సహజముగా ప్రాప్తిస్తుంది. ఒక్క క్షణములో ‘నా బాబా’ అని తెలుసుకున్నారు. బాబా ‘నా పిల్లలు’ అని అన్నారు. ఇంతలోనే ఖజానాలకు యజమానులుగా అయిపోయారు. మరి ప్రతి బిడ్డ వద్ద సర్వ ఖజానాలు సదా తోడుగా ఉన్నాయి కదా! బాబా ఖజానాయే నా ఖజానా అన్న నషా ఉందా! ఇప్పుడు చెక్ చేసుకోండి. బాబా అయితే ప్రతి బిడ్డకు సర్వ ఖజానాలను ఇచ్చారు. ఒక్క ఖజానా కూడా తక్కువగా లేదు. కానీ ఆ సర్వ ఖజానాలు ప్రతి ఒక్కరి వద్ద సదా తోడుగా ఉన్నాయా లేక కొన్ని-కొన్ని ఖజానాలు ఉన్నాయి మరియు కొన్ని ఖజానాల లోటు ఉందా? బాప్ దాదా అయితే ఇచ్చారు, కానీ ప్రతి ఒక్కరి వద్ద సర్వ ఖజానాలు సదా తోడుగా ఉన్నాయా? మరియు సర్వ ఖజానాలను సమయానికి కార్యములో ఉపయోగిస్తూ ఉన్నారా? యజమానిగా అయ్యి ఆర్డర్ చేసినప్పుడు ఆ సమయానికి ఆ ఖజానా అనుభవమవుతుందా? బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల సేవా ఉత్సాహాన్ని చూసారు కూడా మరియు విన్నారు కూడా. నలువైపులా మంచి ఉల్లాస-ఉత్సాహాలతో ఈ 75 సంవత్సరాల జయంతిని జరుపుకుంటున్నారు. ఇప్పుడిక పరివర్తన జరిగిపోయినట్లే అని ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజ్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. బాప్ దాదా పిల్లల ఉల్లాస-ఉత్సాహాలను చూస్తూ-చూస్తూ సంతోషిస్తున్నారు మరియు ఏమని పాట పాడుతారు? వాహ్ పిల్లలూ వాహ్! అంతేకాక బాప్ దాదా ఇంకా ఏమి చూసారంటే, ఉల్లాస-ఉత్సాహాలతో ఛాలెంజ్ అయితే చాలా బాగా చేస్తున్నారు, కానీ దానితోపాటు పిల్లల్లోని సర్వ ధారణల సఫలత స్వరూపాన్ని కూడా చూసారు. మీ అందరికీ కూడా మీ సంపన్న మరియు సఫలతా స్వరూపము తెలుసు ఎందుకంటే నిమిత్తమైన పిల్లలందరూ సదా సంపన్నముగా మరియు సఫలతామూర్తులుగా అయిపోయారా లేక ఇంకా అవ్వాలా? ఎందుకంటే సుఖమయ ప్రపంచానికి ఆధార స్వరూపము పిల్లలైన మీరే. బాప్ దాదా పిల్లలందరి రిజల్టును చూసారు. ఆధారమూర్తులైన మీరు కేవలం కొద్దిమంది పిల్లలే కాదు, మేము సుఖమయ ప్రపంచాన్ని తీసుకువచ్చేందుకు నిమిత్తులము అన్నది పిల్లలందరి ఛాలెంజ్.

బాప్ దాదా పిల్లలందరినీ అడుగుతున్నారు - సుఖమయ ప్రపంచాన్ని తీసుకువచ్చేందుకు నిమిత్తులైన పిల్లలు సంపూర్ణముగా, సంపన్నముగా, ఆధారమూర్తులుగా అయ్యారా? ప్రతి బిడ్డ సఫలతమూర్తిగా అవ్వాలని బాప్ దాదాకు పిల్లల పట్ల ఆశ ఉంది, ఎందుకంటే మీరు బాబాకు సహచరులుగా అయి సంకల్పము చేసారు మరియు ఇక పరివర్తన ఇంచుమించు జరిగిపోయినట్లే అని ఎంతో సంతోషముగా ఛాలెంజ్ కూడా చేసారు. మరి స్వయాన్ని ప్రశ్నించుకోండి, విశ్వ పరివర్తనకు నిమిత్తమైన పిల్లలు స్వయం సంపన్నముగా మరియు సంపూర్ణముగా ఎంతవరకు అయ్యారు? ఎందుకంటే రాజ్య స్థాపన అవ్వాలంటే ముందుగా రాజ్యానికి నిమిత్తమైన ఆత్మలు నిమిత్తమైతే ఆ తర్వాత ఇతరులు నిమిత్తమవ్వగలుగుతారు. అయితే బాప్ దాదా చూసారు, ఇప్పుడు సంపూర్ణము అవ్వడములో ఇంకా కొద్దిగా లోటు ఉంది. సేవ అయితే చేసారు కానీ సేవ రిజల్టులో మీ తోటివారిగా ఎంతమంది తయారయ్యారు? విన్నవారిలో ఎంతమంది సమీపముగా వస్తుంటారు అని లెక్క తీయండి. బాప్ దాదా పిల్లల ధైర్యాన్ని చూసి సంతోషిస్తున్నారు కానీ ఇప్పుడు సేవా రిజల్టులో మరింత తీవ్రతను తీసుకురావాలి. ప్రతి సమయము ఆత్మలను అంత సమీప సంబంధములోకి తీసుకురండి. ఇప్పుడు బ్రహ్మాకుమారీల కర్తవ్యాన్ని తెలుసుకోవడములో చాలా సమీపముగా వచ్చారని చాలా సంతోషిస్తారు, కానీ బాప్ దాదా ఇంతకుముందు కూడా ఒక విషయాన్ని చెప్పారు - వారసత్వము అనేది ఆత్మలకు బాబా ద్వారానే లభించనున్నది. కావున బాబాను తెలుసుకోవాలి, సమయాన్ని తెలుసుకోవాలి, స్వమానాన్ని తెలుసుకోవాలి, అప్పుడు వారసత్వానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. బాబా వారసత్వాన్ని ఇస్తున్నారు అని బుద్ధిలోకి వచ్చినప్పుడు వారసత్వాన్ని తీసుకుని రాజ్యాధికారులుగా అవుతారు.

మా బాబా వచ్చేసారు అన్న పాటనేదైతే మీరు పాడుతూ ఉంటారో, ఇప్పుడు ఆ ధ్వని నలువైపులా వ్యాపించాలి. ఇప్పుడు బాప్ దాదా ఈ రిజల్టును చూడాలనుకుంటున్నారు. పరివర్తన జరిగింది, సేవ వలన లాభము జరిగింది, కృషికి ఫలము లభించింది, కానీ ఇప్పుడింకా వారు బాబా వరకు చేరుకోలేదు. దీని కోసం ఏదైనా ప్లాన్ ను తయారుచేయండి. బాబా ప్రత్యక్షత ఎలా జరగాలి? రాజధానిలో రాజ్యము చేయాల్సినవారు కూడా నిర్విఘ్నముగా అయ్యారా? ఇప్పుడు పరివర్తన అన్న బటన్ ను డ్రామా నొక్కవచ్చా, ఎవర్రెడీనా? ఎవర్రెడీగా ఉన్నారా? బటన్ నొక్కచ్చా? ఏమంటారు, బటన్ నొక్కచ్చా? ఎవర్రెడీగా ఉన్నారా? ఎందుకంటే అందరూ తయారుగా ఉండాలి. రాజ్యాధికారులు కూడా, రాయల్ ఫ్యామిలీ కూడా, రాయల్ ప్రజలు కూడా. సాధారణ ప్రజలు తయారవ్వడమనేది పెద్ద విషయమేమీ కాదు. బాప్ దాదా ఈ రోజు పిల్లలను రిజల్టు అడుగుతున్నారు. ఏమని భావిస్తున్నారు? బాప్ దాదాకు బటన్ నొక్కడానికి పెద్ద సమయమేమీ పట్టదు. మొదటి లైన్ వారు ఏమనుకుంటున్నారు? శక్తులు ఏమనుకుంటున్నారు? పాండవులు ఏమనుకుంటున్నారు? జవాబు చెప్పండి. పాండవులు, జవాబు చెప్పండి. నొక్కమంటారా బటన్? ఎవర్రెడీనా? (బాబా, మీరు యజమాని, నొక్కాలి అని మీకు సంకల్పము వస్తే నొక్కండి). బాప్ దాదా పిల్లలను ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే బాబా అయితే రాజ్యములోకి వచ్చేది లేదు. బ్రహ్మాబాబా వచ్చేది ఉంది. (ఇక్కడ బాప్ దాదాను కలుసుకుంటూ ఉంటుంటే ఇది చాలా బాగా అనిపిస్తుంది) ఇది మంచిదే కానీ బాబా సమానముగా అయ్యి బాబాతోపాటు జీవితాన్ని అనుభవము చేయాలి, ఇది కూడా కావాలి కదా. అది ఉందా? తయారుగా ఉన్నారా? కేవలం మీరు మాత్రమే కాదు, రాజధాని ఉండాలి. మీరు రాజ్యము ఎవరిపై చేస్తారు? రాజధాని అయితే కావాలి కదా! (మేమందరము కలిసి ఉన్నాము) మరి అందరూ తయారుగా ఉన్నారా? (పూర్తిగా తయారుగా ఉన్నారు) సంపన్నముగా అవ్వడములో తయారుగా ఉన్నారా? అచ్ఛా, అందరూ ఆలోచిస్తున్నారు. ఏమీ పర్వాలేదు.

బాప్ దాదాకు తెలుసు - ప్రస్తుతము రెడీగా ఉన్నారు, కానీ ఎవర్రెడీగా అవ్వవలసి ఉంది. బాప్ దాదా రెండు విషయాలను చెప్పి ఉన్నారు కదా. క్షణములో ఫుల్ స్టాప్ పెట్టే పిల్లలు కావాలి. వ్యర్థ సంకల్పాల నామ-రూపాలు ఉండకూడదు. ఎవరెవరికి సందేశమిస్తారో, వారు సందేశము విని పరివర్తన అవ్వాలి అన్న ఉల్లాస-ఉత్సాహాలలోకి రావాలి. ఇప్పుడు బాప్ దాదా ఈ రిజల్టును కోరుకుంటున్నారు. దీని కోసం బాప్ దాదా పిల్లలకు సలహాను ఇస్తున్నారు, ఆజ్ఞాపిస్తున్నారు కూడా - సేవ అయితే చేస్తున్నారు, కానీ ఎవరి సేవనైతే చేస్తున్నారో, ఒకే సమయములో మూడు రూపాలలో మరియు మూడు రకాలుగా సేవ చేయండి. మూడు రూపాలేమిటంటే - నాలెడ్జ్ ఫుల్, పవర్ ఫుల్ మరియు లవ్ ఫుల్, ఈ మూడు రూపాలతో సేవ చేయండి మరియు మూడు రకాలుగా కూడా సేవ చేయండి. ఆ మూడు రకాలు ఏమిటంటే - మనసా-వాచా-కర్మణా ఒకే సమయములో జరగాలి. కేవలం వాణి ద్వారా మాత్రమే సేవ కాదు, కానీ వాణితోపాటు మనసా సేవ కూడా జరగాలి. పవర్ ఫుల్ మనసు కావాలి. ఇప్పుడు ఈ అవసరముంది. ఒకే సమయములో మనసు పవర్ ఫుల్ గా ఉండాలి, తద్వారా ఆత్మల మనసు కూడా పరివర్తన అవ్వాలి. అలాగే వాణి ద్వారా పూర్తి జ్ఞానమంతా స్పష్టమవ్వాలి. అలాగే కర్మణా ద్వారా. కర్మల ద్వారా చేసిన సేవతో ఆ ఆత్మలకు ఏమని అనుభవమవ్వాలంటే, నేను నిజంగా నా పరివారములోకి చేరుకున్నాను అని. పరివారము అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు సమీపముగా ఉన్నవారికి సహచరులుగా అవుతారు. మరి బాప్ దాదా ఇప్పుడు ఒకే సమయములో మూడు రూపాల సేవలు కలిపి జరగాలని కోరుకుంటున్నారు. వీలవుతుందా? వీలవుతుందా? చేతులెత్తండి, వీలవుతుందా? ఇప్పుడు బాప్ దాదా రిజల్టులో ఏమి చూసారంటే - వాణి ద్వారా నాలెడ్జ్ ఫుల్ గా అవుతున్నారు కానీ పరివారముతో కలిసి ఉండటములో ఇప్పుడింకా సమయము పడుతుంది. బాప్ దాదా ఏమి చూసారంటే, సమయము యొక్క ఛాలెంజ్ తో పాటుగా ఇప్పుడు సేవలో ఎటువంటి సేవ చేయండి అంటే, ఒకే సమయములో మూడు సేవల ద్వారా ప్రాప్తిని అనుభవము చేయాలి.

అందరూ కలుసుకోవడానికి ఉల్లాస-ఉత్సాహాలతో చేరుకున్నారు. బాప్ దాదా పిల్లల ఉల్లాసాన్ని చూసి సంతోషిస్తున్నారు. ఇప్పుడు సంపన్నముగా మరియు సంపూర్ణముగా అవ్వడము పట్ల అటెన్షన్ పెట్టాలి, ఎందుకంటే తక్కువలో తక్కువ 108 మణుల మాలను తయారుచేయగలగాలి. తయారుచేయగలరా? 108 మాల తయారుగా ఉందా? తయారుగా ఉందా? ఎందుకంటే రాజధానిలో రాజ్యాధికారులుగా వారే అవుతారు కదా. మరి 108 రత్నాల లిస్టును ఇప్పుడు తీయగలరా? సరే అని అనడం లేదే? 108 మంది రాజ్యాధికారులు, ఆ తర్వాత ఉన్న 16108 మంది రాజ్యాధికారులకు తోడుగా ఉండేవారు, ఆ తర్వాత నంబరువారుగా ఉంటారు. బాప్ దాదా ఇప్పుడు సమయమనుసారముగా సమయాన్ని సమీపముగా తీసుకువచ్చే పిల్లల నుండి ఇదే కోరుకుంటున్నారు - 108 మాల ఎవర్రెడీగా ఉండాలి, బాబా సమానముగా ఉండాలి అని. మొదటి లైన్ వారు 108 మంది పేర్లను తీయగలరా? అవును అనో కాదు అనో చెప్పండి కదా! సాకారములో బ్రహ్మాబాబా ఉన్నప్పుడు ఎన్నో సార్లు ప్రయత్నించారు కానీ ఫైనల్ అవ్వలేదు, కానీ ఇప్పుడైతే 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి, మరి ఈ 75 సంవత్సరాల జూబ్లీలో ఏదో ఒక నవీనత చేస్తారు కదా! నవీనత ఏమి చెయ్యండంటే ప్రతి ఒక్కరూ స్వయాన్ని 108 మాలలోని మణిగా తయారుచేసుకోండి. 108 మాల తయారైపోయింది అని లెక్కలోకి వచ్చేలా తయారవ్వండి, ఎందుకంటే ముందుగా రాజ్యాధికారులు తయారైతే, ఆ తర్వాత రాజ్య సంపర్కములోకి వచ్చేవారు తయారవుతారు. వారికి కూడా స్థానము కావాలి కదా! బాప్ దాదా చెప్తున్నదాని యొక్క సారమేమిటంటే - ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వయం కోసం తీవ్ర పురుషార్థము చేసి, నేను బాబా సమానముగా అవ్వాల్సిందే అన్న దృఢ సంకల్పాన్ని చేయాలి ఎందుకంటే అకస్మాత్తుగా పరివర్తన జరగనున్నది అన్నది బాప్ దాదా ముందుగానే వినిపించి ఉన్నారు. దానికంటే ముందే కనీసం ఎవరైతే సేవకు నిమిత్తమైనవారు ఉన్నారో, జోన్ హెడ్స్, సెంటర్ ఇన్ఛార్జులు, వారికి దగ్గరగా ఉన్న సహచరులైన పాండవులు, వారు సెంటర్ హెడ్ అవ్వరు కానీ ఏదో ఒక విశేష కార్యానికి నిమిత్తమై ఉన్నారు, వారిని అందరూ విశేష ఆత్మలు అన్న దృష్టితో చూస్తారు, అటువంటి పాండవులు కూడా ఇప్పుడు తీవ్ర పురుషార్థము చేసి స్వ పరివర్తన దృశ్యాన్ని బాహ్య స్టేజి మీదకు తీసుకురావాల్సి ఉంటుంది. దీని కోసం ఎవర్రెడీగా ఉన్నారా? ఎవరైతే - ఈ కార్యాన్ని అయితే చేయాల్సిందే, స్వయాన్ని బాబా సమానముగా తయారుచేసుకోవాల్సిందే, బ్రహ్మాబాబా సమానముగా ఫాలో ఫాదర్ చేయాల్సిందే అని భావిస్తున్నారో, చేయాల్సిందే అనేవారు చేతులెత్తండి. చేతులైతే ఎంతగా ఎత్తుతారంటే సంతోషపరుస్తారు. బాగా చేస్తారు. కానీ చేతులు ఎత్తడముతోపాటు దృఢ సంకల్పము కూడా చేయండి. దృఢతా శక్తి చాలా సహయోగాన్ని ఇస్తుంది.

బాప్ దాదా సంతోషిస్తున్నారు, చేతులెత్తడములో అందరూ తెలివైనవారే కానీ ఇప్పుడు దృఢతను ప్రాక్టికల్ లోకి తీసుకురండి. పిల్లలు తెలివైనవారు కదా, దృఢతతో ఉంటారు కూడా, కానీ ఆ దృఢత భిన్న-భిన్న రూపాలలోకి మారిపోతూ ఉంటుంది. ఇలా అయిపోయింది, అలా జరిగిపోయింది, ఇలా అయ్యుండకపోతే అలా జరిగేది కాదు... ఇటువంటి సాకులలో చాలా తెలివైనవారు. ఇప్పుడు బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాబా సమానముగా అవ్వాలి. మనసా-వాచా-కర్మణా, సంబంధ-సంపర్కములో మిమ్మల్ని ఎవరు చూసినా, ఎవరు కలిసినా, వారు - వాహ్ పరివర్తన వాహ్ అని అనాలి! బాప్ దాదాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఏ పిల్లలైతే నిమిత్తమై ఉన్నారో, వారిని చూసి కూడా సంతోషముగా అనిపిస్తుంది మరియు మిలనములో కూడా చాలా సంతోషముగా అనిపిస్తుంది.

మరి ఈ రోజు ఏ సంకల్పము చేసారు? అవ్వాల్సిందే. బ్రహ్మాబాబా సమానముగా అవ్వాల్సిందే. అవ్వాలి కాదు, అవ్వాల్సిందే. ఎటువంటి విషయాలు వచ్చినా కానీ, విషయాలను కాకుండా బాబాను ముందు పెట్టుకోండి. దూరంగా కూర్చుని ఉన్న పిల్లలందరూ, దగ్గరగా ఎదురుగా కూర్చుని ఉన్న పిల్లలు, ఇరువురిని బాప్ దాదా చూసి-చూసి హర్షిస్తున్నారు. పిల్లలందరూ ప్లాన్లు చాలా బాగా తయారుచేస్తారు, అమృతవేళ అందరూ చాలా మధురాతి మధురమైన మాటలను మాట్లాడుతారు. మెజారిటీ అందరూ ఎంత తియ్యని మాటలు మాట్లాడుతారంటే బాబా కూడా ఆ మాటలను విని బలిహారమైపోతారు. కానీ తర్వాత ఏమి జరుగుతుందో తెలుసా? కర్మక్షేత్రములోకి వచ్చినప్పుడు, సంబంధాలలోకి వచ్చినప్పుడు, సేవలోకి వచ్చినప్పుడు, ఏవైతే విషయాలు వస్తాయో, వాటిని చూసి కొద్దికొద్దిగా మారిపోతారు. అమృతవేళలో ఉన్న ఉల్లాస-ఉత్సాహాలు కర్మలు చేస్తున్నప్పుడు, సంబంధములోకి వస్తున్నప్పుడు కొద్దికొద్దిగా మారిపోతాయి.

ఇప్పుడు బాప్ దాదా ఒక కార్యాన్ని ఇస్తున్నారు, చెయ్యడానికి సిద్ధముగా ఉన్నారు కదా! తల ఊపండి. చేతులెత్తండి. బాప్ దాదా సంకల్పమేమిటంటే, ఒక్క నెల కోసం స్వయాన్ని దృఢ సంకల్పము ఆధారముగా బాబా సమాన స్థితిలో స్థితి చేసుకోగలరా? ఒక్క నెల, వీలవుతుందా? లేక ఎక్కువ సమయమంటారా? ఎవరైతే - ఒక్క నెల దృఢతతో చేస్తామని భావిస్తారో, దృఢతను తోడుగా పెట్టుకోండి, బాబాను సదా ఎదురుగా పెట్టుకోండి, బ్రహ్మాబాబాను నయనాలలో ఇముడ్చుకుని పెట్టుకోండి. బ్రహ్మాబాబా ఏమి చేసారో, మనసా-వాచా-కర్మణా అదే చేయాలి. బ్రహ్మాబాబాను ఎవరైనా ప్రాక్టికల్ గా చూసినా, చూడకపోయినా కానీ వారి గురించిన జ్ఞానమైతే ఉంది కదా! ఏ కర్మ అయినా చేసేకంటే ముందు ఇది చెక్ చేసుకోండి - బ్రహ్మాబాబాకు ఇటువంటి సంకల్పము ఉండేదా, ఇటువంటి మాటలు ఉండేవా, ఇటువంటి కర్మలు ఉండేవా, ఇటువంటి సంబంధాలు ఉండేవా, ఇటువంటి సంపర్కము ఉండేదా? ముందు ఆలోచించండి, ఆ తర్వాత చేయండి. వీలవుతుందా? ఇందులో చేతులెత్తండి. వీలవుతుంది అంటే చేతులు బాగా పైకి ఎత్తండి. మాతలు ఇక్కడ ఎక్సర్ సైజ్ చేస్తారు కదా, కావున చేతులు బాగా పైకి ఎత్తండి. ముందు ఉన్నవారు కూడా చేతులు ఎత్తుతారు కదా? మధుబన్ వారందరూ ఇందులో నంబర్ వన్ లోకి రండి. ముందున మధుబన్ వారు కూర్చుని ఉన్నారు కదా. మధుబన్ అంటే కేవలం శాంతివన్ కాదు. ఎవరైనా సరే, ఒక నెల నిర్విఘ్నముగా ఉండాలి, ప్రతి సెంటరు కూడా నిర్విఘ్నముగా ఉండాలి. గుజరాత్ టీచర్లు చేతులెత్తండి. గుజరాత్ టీచర్లు ఇది వీలవుతుందని భావిస్తున్నారా, ఇందులో చేతులు బాగా పైకి ఎత్తండి. ఇలా ఇలా అనకండి, చేతులను బాగా పైకి ఎత్తండి. వీలవుతుందా? అచ్ఛా! శాంతివన్ నివాసులు చేతులెత్తండి. కొద్దిమంది ఉన్నారు. ఎవరైతే కూర్చుని ఉన్నారో, వెనుక కూడా కూర్చుని ఉన్నారు, మధుబన్ యొక్క 4-5 స్థానాలేవైతే ఉన్నాయో, వారందరూ చేస్తారా? చేస్తారా, చేతులెత్తండి? మధుబన్ వారు రెండు చేతులెత్తండి. గుజరాత్ లోని జిజ్ఞాసువులు కూడా, నిమిత్త టీచర్లు కూడా మరియు నిమిత్త సోదరులు కూడా, అందరూ చేతులెత్తండి. చేస్తారా? చేతులు బాగా పైకి ఎత్తండి. వెనుక ఉన్నవారి చేతులు కనిపించడం లేదు. అచ్ఛా, గుజరాత్ వారు లేచి నిలబడండి. గుజరాత్ వారైతే చాలామంది వచ్చారు. సగం హాలైతే గుజరాత్ వారే. (గుజరాత్ వారు 15 వేల మంది ఉన్నారు, మిగిలినవారు 3 వేల మంది ఉన్నారు). గుజరాత్ వారికి బాప్ దాదా మరియు పరివారము తరఫు నుండి చాలా చాలా అభినందనలు, అభినందనలు. ఇప్పుడు ఎలా అయితే చప్పట్లు కొట్టారో, అలాగే ఒక నెల తర్వాత రిజల్టులో గుజరాత్ నంబర్ వన్ వస్తుందా! మంచిది. సంఖ్య అయితే చాలా బాగుంది. పిల్లలకు బాబా పట్ల మరియు మధుబన్ పట్ల హృదయపూర్వకమైన ప్రేమ ఉన్నందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. చాలా మంచిది, ఇప్పుడు గుజరాత్ అద్భుతాన్ని చేసి చూపించాలి. ఈ ఒక్క నెల రిజల్టులో నంబర్ వన్ లోకి వచ్చి చూపించండి. అసలైతే అందరూ నంబర్ వన్ లోకి రావాలి. మధుబన్ వారు నంబర్ వన్ లోకి వస్తారు కదా, చేతులెత్తండి. ఏమి జరిగినా కానీ, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ, పరిస్థితులు వస్తాయి, మాయ వింటోంది కదా, కనుక మాయ తన రూపాన్ని అయితే చూపిస్తుంది, కానీ మాయ పని రావడము మరియు మీ పని విజయాన్ని పొందడము. ఇది జరిగింది, అది జరిగింది, ఇది చేయకూడదు అని అనకండి. వస్తాయి, జరుగుతాయి, ఇదైతే బాప్ దాదా ముందుగానే చెప్పేస్తున్నారు ఎందుకంటే మాయ వింటోంది, అది చాలా తెలివైనది. కానీ మీరు? మాయ ఎంత తెలివైనదైనా కానీ మీరైతే సర్వశక్తివంతుని సహచరులు, మాయ ఏమి చెయ్యగలుగుతుంది. బాప్ దాదా చూస్తున్నారు, టి.వి.లో చూస్తున్నారు. మరి అందరూ నంబర్ వన్ తెచ్చుకోవాలి. ఎవ్వరూ రెండవ నంబర్ వారిగా అవ్వకండి, వన్ నంబర్ గా అవ్వాలి. అచ్ఛా!

బాప్ దాదా ఇప్పుడు పిల్లలందరికీ ఒకే ఒక్క శ్రేష్ఠమైన సంకల్పాన్ని వినిపించాలని అనుకుంటున్నారు - ఇప్పుడు స్వయం కూడా నిర్విఘ్నముగా ఉండండి మరియు మీ తోటివారిని, సంబంధములోకి వచ్చేవారిని కూడా నిర్విఘ్నముగా చేయండి. సమయాన్ని సమీపముగా తీసుకురండి. పిల్లల దుఃఖము మరియు అశాంతిని బాప్ దాదా చూడలేరు. ఇప్పుడు మీ రాజ్యాన్ని త్వరత్వరగా ఈ భూమిపైకి తీసుకురండి. బాప్ దాదాకు ప్రతి ఒక్క బిడ్డ ప్రియమైనవారే, చివరి నంబరు బిడ్డ ఎవరైతే ఉన్నారో, వారు కూడా ప్రియమైనవారే ఎందుకంటే బలహీనముగా ఉన్నారు కదా. బలహీనులపై ఇంకా ఎక్కువ దయ కలుగుతుంది. మీరందరూ కూడా ఎటువంటి స్థితిలో ఉన్నవారైనా, ఎటువంటి స్వభావము కలవారైనా సరే, అందరూ మనవారే, ఎలా అయితే బాబా మనవారో, అలా పరివారము మనది, కనుక వారి స్వభావ-సంస్కారాలను చూడకుండా వారికి ఇంకా ఎక్కువగా సహయోగాన్ని ఇవ్వండి, సద్భావనను ఇవ్వండి, శుభ భావనను ఇవ్వండి. అచ్ఛా, ఎదురుగా ఉన్న పిల్లలకైనా లేక దూరంగా కూర్చుని చూస్తున్న పిల్లలకైనా సరే, బాప్ దాదా ఒక్కొక్క బిడ్డను తన ఎదురుగా చూస్తూ దృష్టి కూడా ఇస్తున్నారు మరియు అభినందనలను కూడా ఇస్తున్నారు. అచ్ఛా!

వరదానము:-
వాచా ద్వారా జ్ఞాన రత్నాలను దానం చేసే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ భవ

ఎవరైతే వాచా ద్వారా జ్ఞాన రత్నాలను దానం చేస్తారో, వారికి మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ యొక్క వరదానము ప్రాప్తిస్తుంది. వారి ఒక్కొక్క మాటకు చాలా విలువ ఉంటుంది. వారి ఒక్కొక్క మాటను వినేందుకు అనేకాత్మలు దాహముతో ఉంటారు. వారి ప్రతి మాటలో సారము నిండి ఉంటుంది. వారికి విశేషమైన సంతోషము ప్రాప్తిస్తుంది. వారి వద్ద ఖజానా నిండుగా ఉంటుంది, అందుకే వారు సదా సంతుష్టముగా మరియు హర్షితముగా ఉంటారు. వారి మాటలు ప్రభావశాలిగా అవుతూ ఉంటాయి. వాణిని దానము చేయడముతో వారి వాణిలో ఎన్నో గుణాలు వస్తాయి.

స్లోగన్:-
స్వరాజ్యానికి యజమానులుగా అయినట్లయితే సంపూర్ణ వారసత్వము యొక్క అధికారము లభిస్తుంది.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి

మాస్టర్ దాత, ప్రాప్తి స్వరూప పిల్లలైన మీకు విశ్వములోని ఆత్మల పట్ల దయ కలగాలి మరియు వారి కోసం ఉల్లాస-ఉత్సాహాలు కలగాలి - మా సోదరులు అల్పకాలికమైన కోరికల వెనుక ఎంతగా భ్రమిస్తున్నారు. దాత పిల్లలైన మీరు మీ సోదరుల పట్ల దయ మరియు కరుణతో కూడిన దృష్టిని సారించండి. మహాదానులుగా, వరదానులుగా అవ్వండి. మెరుస్తున్న సంతుష్టమణులుగా అయ్యి సర్వులకు సంతుష్టతను ఇవ్వండి.