13-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడిది ఈ మృత్యులోకము యొక్క అంతిమము, అమరలోకము యొక్క స్థాపన జరుగుతోంది, అందుకే మీరు మృత్యులోకము వారిని స్మృతి చేయకూడదు’’

ప్రశ్న:-
తండ్రి తమ పేద పిల్లలకు ఏ స్మృతిని ఇప్పిస్తారు?

జవాబు:-
పిల్లలూ, మీరు నిర్వికారిగా (పవిత్రముగా) ఉన్నప్పుడు చాలా సుఖముగా ఉండేవారు. మీ వంటి షావుకారులు ఇంకెవ్వరూ ఉండేవారు కారు, మీరు అపార సుఖవంతులుగా ఉండేవారు. భూమి, ఆకాశము అన్నీ మీ చేతులలో ఉండేవి. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని మళ్ళీ షావుకారులుగా చేయడానికి వచ్చారు.

పాట:-
నయనహీనులకు దారి చూపించండి ప్రభూ...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, ఆత్మలు పాట విన్నారు. ఇలా ఎవరన్నారు? ఆత్మల యొక్క ఆత్మిక తండ్రి అన్నారు. ఆత్మిక తండ్రితో ఆత్మిక పిల్లలు - బాబా అని అన్నారు. వారిని ఈశ్వరుడని కూడా అంటారు, తండ్రి అని కూడా అంటారు. ఏ తండ్రి? పరమపిత. ఇద్దరు తండ్రులున్నారు. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. లౌకిక తండ్రి పిల్లలు పారలౌకిక తండ్రిని - ‘ఓ బాబా’ అని పిలుస్తారు. బాబా పేరేమిటి? శివ. ఆ నిరాకారుడైన శివుడు పూజించబడతారు. వారిని సుప్రీమ్ ఫాదర్ అని అంటారు. లౌకిక తండ్రిని సుప్రీమ్ అని అనరు. ఉన్నతోన్నతమైనవారు, ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. జీవాత్మలందరూ ఆ తండ్రిని స్మృతి చేస్తారు. మన తండ్రి ఎవరు అనేది ఆత్మలు మర్చిపోయారు. ఇలా పిలుస్తారు - ఓ గాడ్ ఫాదర్, నయనహీనులైన మాకు నయనాలు ఇవ్వండి, అప్పుడు మేము మా తండ్రిని గుర్తించగలము, భక్తి మార్గములో మేము అంధులమై ఎదురుదెబ్బలు తింటూ ఉంటాము, ఇప్పుడు ఆ ఎదురుదెబ్బల నుండి విడిపించండి. తండ్రియే కల్ప-కల్పము వచ్చి భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. ఇప్పుడు ఇది కలియుగము. సత్యయుగము రానున్నది. కలియుగము మరియు సత్యయుగానికి మధ్యన ఉన్న సమయాన్ని సంగమము అని అంటారు. ఇది పురుషోత్తమ సంగమము. అనంతమైన తండ్రి వచ్చి భ్రష్టాచారులుగా అయినవారిని శ్రేష్ఠాచారులుగా, పురుషోత్తములుగా తయారుచేస్తారు. లక్ష్మీ-నారాయణులు పురుషోత్తములుగా ఉండేవారు. లక్ష్మీ-నారాయణుల వంశావళి యొక్క రాజ్యముండేది. తండ్రి వచ్చి దీని స్మృతినిప్పిస్తారు. భారతవాసులైన మీరు నేటికి 5 వేల సంవత్సరాల క్రితం స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా ఉండేది, భారత్ కు చాలా మహిమ ఉండేది. బంగారము-వజ్రాలతో తయారుచేయబడిన మహళ్ళు ఉండేవి. ఇప్పుడు ఏమీ లేవు. ఆ సమయములో వేరే ధర్మాలేవీ ఉండేవి కావు, కేవలం సూర్యవంశీయులు మాత్రమే ఉండేవారు. చంద్రవంశీయులు తర్వాత వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరే సూర్యవంశీయులుగా ఉండేవారు. ఇప్పటికీ లక్ష్మీ-నారాయణుల మందిరాలను నిర్మిస్తూ ఉంటారు. కానీ, లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఎప్పుడు ఉండేది, వారు ఆ రాజ్యాన్ని ఎలా పొందారు, ఇది ఎవ్వరికీ తెలియదు. పూజ చేస్తారు కానీ వారి గురించి తెలియకపోతే, అది అంధ విశ్వాసమైనట్లు కదా. శివుడిని, లక్ష్మీ-నారాయణులను పూజిస్తారు కానీ వారి జీవితచరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు. భారతవాసులు తమంతట తామే అంటారు - మేము పతితులుగా ఉన్నాము, ఓ పతిత-పావనుడైన బాబా రండి, వచ్చి మమ్మల్ని దుఃఖాల నుండి, రావణ రాజ్యము నుండి విముక్తులుగా చేయండి అని. తండ్రి వచ్చి అందరినీ విముక్తులుగా చేస్తారు. సత్యయుగములో ఒకే రాజ్యముండేదని పిల్లలకు తెలుసు. కాంగ్రెస్ వారు మరియు బాపూజీ కూడా అనేవారు - మాకు మళ్ళీ రామరాజ్యము కావాలి, మేము స్వర్గవాసులుగా అవ్వాలని అనుకుంటున్నాము. ఇప్పుడు నరకవాసుల పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారా? దీనిని నరకము, ఆసురీ ప్రపంచమని అంటారు. ఈ భారత్ యే ఒకప్పుడు దైవీ ప్రపంచముగా ఉండేది. ఇప్పుడు ఆసురీ ప్రపంచముగా తయారైంది.

బాబా అర్థం చేయిస్తున్నారు - మీరు 84 జన్మలు తీసుకున్నారు, అంతేకానీ 84 లక్షల జన్మలు కాదు. ఇది శాస్త్రాలలో తప్పుగా వ్రాసేశారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం సద్గతి మార్గముండేది. అక్కడ భక్తి గాని, దుఃఖము యొక్క నామ-రూపాలు గాని ఉండేవి కావు, దానిని సుఖధామమని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు వాస్తవానికి శాంతిధామ నివాసులు. మీరు ఇక్కడికి పాత్రను అభినయించేందుకు వచ్చారు. పునర్జన్మలు 84 ఉంటాయి, అంతేకానీ 84 లక్షలు కాదు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. తండ్రి ఆత్మలైన మీతో మాట్లాడుతారు. ఇతర సత్సంగాలలో మనుష్యులు, మనుష్యులకు భక్తి విషయాలను వినిపిస్తారు. అర్ధకల్పము భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు, పతితులు ఒక్కరు కూడా ఉండేవారు కారు. ఇప్పుడు పావనమైనవారు ఒక్కరు కూడా లేరు. ఇది పతిత ప్రపంచము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - గీతలో శ్రీకృష్ణ భగవానువాచ అని వ్రాసేసారు. శ్రీకృష్ణుడు భగవంతుడు కాదు, అలాగని వారు గీతను వినిపించలేదు. ఈ మనుష్యులకు తమ ధర్మ శాస్త్రాల గురించి కూడా తెలియదు. తమ ధర్మాన్నే మర్చిపోయారు. ముఖ్యమైన ధర్మాలు 4, మొదటిది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము, అందులో ముందు సూర్యవంశీయులు, ఆ తర్వాత చంద్రవంశీయులు, ఇరువురినీ కలిపి దేవీ-దేవతా ధర్మమని అంటారు. అక్కడ దుఃఖము అన్న మాటే లేదు. 21 జన్మలు మీరు సుఖధామములో ఉండేవారు. ఆ తర్వాత రావణ రాజ్యము, భక్తి మార్గము ప్రారంభమవుతుంది. శివబాబా ఎప్పుడు వస్తారు? రాత్రి అయినప్పుడు, భారతవాసులు ఘోర అంధకారములోకి వస్తారు, అప్పుడు బాబా వస్తారు. బొమ్మల పూజ చేస్తూ ఉంటారు, ఒక్కరి జీవితచరిత్ర గురించి కూడా తెలియదు. భక్తి మార్గములో అనేక ఎదురుదెబ్బలు తింటారు. తీర్థ స్థానాలకు వెళ్ళినా, ప్రదక్షిణలు చేసినా, ఏ ప్రాప్తి ఉండదు. తండ్రి అంటారు - నేను వచ్చి బ్రహ్మా ద్వారా మీకు యథార్థ జ్ఞానాన్ని వినిపిస్తాను. మాకు సుఖధామము మరియు శాంతిధామము యొక్క మార్గాన్ని తెలియజేయండి అని పిలుస్తారు.

తండ్రి అంటారు - నేటికి 5 వేల సంవత్సరాల క్రితం నేను మిమ్మల్ని చాలా షావుకారులుగా చేసాను, ఎంతో ధనాన్ని ఇచ్చాను, అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? మీరు ఎంత షావుకారులుగా ఉండేవారు. ఇప్పుడు దీనిని భారత్ అని ఎవరంటారు. భారత్ యే అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన ఖండముగా ఉండేది. వాస్తవానికి ఇది అందరికీ తీర్థ స్థానము, ఎందుకంటే ఇది పతిత-పావనుడైన తండ్రి యొక్క జన్మ స్థలము. అన్ని ధర్మాల వారికి తండ్రి వచ్చి సద్గతినిస్తారు. ఇప్పుడు రావణుడి రాజ్యము మొత్తం సృష్టిలో ఉంది, కేవలం లంకలో మాత్రమే కాదు. సూర్యవంశీ రాజ్యమున్నప్పుడు ఈ వికారాలు ఉండేవి కావు. భారత్ నిర్వికారిగా ఉండేది, ఇప్పుడు వికారిగా ఉంది. అందరూ నరకవాసులుగా ఉన్నారు. సత్యయుగములో ఎవరైతే దైవీ సాంప్రదాయులుగా ఉండేవారో, వారు 84 జన్మలను అనుభవించి ఆసురీ సాంప్రదాయులుగా అయ్యారు, మళ్ళీ దైవీ సాంప్రదాయులుగా అవ్వాలి. భారత్ చాలా షావుకారుగా ఉండేది, ఇప్పుడు నిరుపేదగా అయ్యింది, అందుకే భిక్షము అడుగుతుంది. తండ్రి పేద పిల్లలైన మీకు స్మృతినిప్పిస్తున్నారు - పిల్లలూ, మీరు ఎంత సుఖముగా ఉండేవారు, మీకు లభించినటువంటి సుఖము ఇంకెవ్వరికీ లభించదు. భూమి, ఆకాశము అన్నీ మీ చేతుల్లోనే ఉండేవి. శాస్త్రాలలో కల్పము ఆయువును ఎక్కువగా చెప్పి, అందరినీ కుంభకర్ణుని ఆసురీ నిద్రలో నిద్రపుచ్చారు. ఈ భారత్ శివబాబా స్థాపించిన శివాలయముగా ఉండేది. అక్కడ పవిత్రత ఉండేది, ఆ కొత్త ప్రపంచములో దేవీ-దేవతలు రాజ్యము చేసేవారు. రాధా-కృష్ణులకు పరస్పరములో ఏం సంబంధముంది అనేది కూడా మనుష్యులకు తెలియదు. ఇరువురూ వేర్వేరు రాజధానులకు చెందినవారు, స్వయంవరము తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అయ్యారు. ఈ జ్ఞానము మనుష్యమాత్రులెవ్వరిలోనూ లేదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కేవలం తండ్రి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు - ఆత్మాభిమానులుగా అవ్వండి, మీ పరమపితనైన నన్ను స్మృతి చేయండి. స్మృతి ద్వారా తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు. మీరు ఇక్కడకు మనుష్యుల నుండి దేవతలుగా అనగా పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు వస్తారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. భక్తిలో రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. భక్తి చేసేవారందరూ రావణుడి గుప్పిట్లో ఉన్నారు. మొత్తం ప్రపంచమంతా 5 వికారాల రూపీ రావణుడి జైలులో ఉన్నారు, శోకవాటికలో ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ విముక్తులుగా చేసి, మార్గదర్శకునిగా అయి తమతోపాటు తీసుకువెళ్తారు. దాని కోసమే ఈ మహాభారత యుద్ధము ఉంది, ఇది 5 వేల సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పుడు తండ్రి మళ్ళీ స్వర్గాన్ని తయారుచేస్తున్నారు. అలాగని ధనము ఎక్కువగా ఉన్నవారు స్వర్గములో ఉన్నారని కాదు. ఇప్పుడిక్కడ ఉన్నదే నరకము. పతిత-పావనా అని తండ్రిని అంటారు, అంతేకానీ నదిని కాదు. ఇదంతా భక్తి మార్గము. ఈ విషయాలను బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ విషయమైతే మీకు తెలుసు - ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి, మూడవవారు అలౌకిక తండ్రి. ఇప్పుడు పారలౌకిక తండ్రి అయిన శివబాబా, బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. బ్రాహ్మణులను దేవతలుగా తయారుచేయడానికి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆత్మయే పునర్జన్మలు తీసుకుంటుంది. నేను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటానని ఆత్మయే అంటుంది. తండ్రి అంటారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అవుతారు. ఏ దేహధారినీ స్మృతి చేయకండి. ఇప్పుడు ఇది మృత్యులోకము యొక్క అంతిమము, అమరలోకము యొక్క స్థాపన అవుతోంది. మిగిలిన అనేక ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. సత్యయుగములో ఒక్క దేవీ-దేవతా ధర్మమే ఉండేది, ఆ తర్వాత చంద్రవంశీయులైన సీతా-రాములు త్రేతాలో ఉండేవారు. పిల్లలైన మీకు పూర్తి చక్రము యొక్క స్మృతినిప్పిస్తారు. శాంతిధామము మరియు సుఖధామము యొక్క స్థాపనను తండ్రియే చేస్తారు. మనుష్యులు, మనుష్యులకు సద్గతినివ్వలేరు. వారంతా భక్తి మార్గములోని గురువులు.

ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము. బాబా నుండి రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. ఈ రాజధాని స్థాపనవుతుంది. ప్రజలైతే చాలామంది తయారవ్వనున్నారు. కోట్లలో కొందరే రాజులుగా అవుతారు. సత్యయుగాన్ని పుష్పాల తోట అని అంటారు. ఇప్పుడిది ముళ్ళ అడవి. రావణ రాజ్యము పరివర్తనవుతుంది. వినాశనము జరగనున్నది. ఈ జ్ఞానము ఇప్పుడు మీకు లభిస్తోంది. లక్ష్మీ-నారాయణులకు ఈ జ్ఞానముండదు. ఇది కనుమరుగైపోతుంది. భక్తి మార్గములో తండ్రి గురించి ఎవరికీ యథార్థముగా తెలియదు. తండ్రి రచయిత. బ్రహ్మా, విష్ణు, శంకరులు కూడా రచన. సర్వవ్యాపి అని అనడముతో వారసత్వము యొక్క హక్కు సమాప్తమైపోతుంది. బాబా వచ్చి అందరికీ వారసత్వాన్ని ఇస్తారు. సత్యయుగములో మొట్టమొదట వచ్చేవారే 84 జన్మలను తీసుకుంటారు. క్రిస్టియన్లు మహా అంటే 40 జన్మలు తీసుకుంటూ ఉండవచ్చు. ఒక్క భగవంతుడిని వెతికేందుకు ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు. ఇప్పుడు మీరు ఎదురుదెబ్బలు తినరు. ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు. ఇది యాత్ర. ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. మీ ఆత్మ చదువుకుంటుంది. ఆత్మ నిర్లేపి అని సాధు-సత్పురుషులు అంటారు. కానీ, ఆత్మయే కర్మల అనుసారముగా మరుసటి జన్మ తీసుకుంటుంది. ఆత్మయే మంచి లేక చెడు కర్మలు చేస్తుంది. ఈ సమయములో (కలియుగములో) మీ కర్మలు వికర్మలుగా ఉంటాయి, సత్యయుగములో మీ కర్మలు అకర్మలుగా ఉంటాయి. అక్కడ వికర్మలు జరగవు. అది పుణ్యాత్ముల ప్రపంచము. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క తండ్రి నుండి అనంతమైన వారసత్వము తీసుకోవాలి. శ్రేష్ఠ కర్మలు చేయాలి. తండ్రి లభించారు కావున ఏ రకమైన ఎదురుదెబ్బలు తినకూడదు.

2. తండ్రి ఏదైతే స్మృతిని ఇప్పించారో, దానిని స్మృతిలో ఉంచుకుని అపారమైన సంతోషములో ఉండాలి. ఏ దేహధారిని స్మృతి చేయకూడదు.

వరదానము:-
స్నేహము వెనుక సర్వ బలహీనతలను బలిహారము చేసే సమర్థీ స్వరూప భవ

స్నేహానికి గుర్తు బలిహారము. స్నేహము కోసం బలిహారము చేయడములో ఏదైనా కష్టమైన లేక అసంభవమైన విషయము కూడా సంభవముగా మరియు సహజముగా అనుభవమవుతుంది. కావున సమర్థీ స్వరూపము యొక్క వరదానము ద్వారా సర్వ బలహీనతలను తప్పదు అన్నట్లు కాకుండా హృదయపూర్వకముగా బలిహారము చేయండి ఎందుకంటే సత్యమైన తండ్రి వద్ద సత్యమే స్వీకరించబడుతుంది. కావున కేవలం తండ్రి స్నేహము యొక్క పాటలను పాడటము కాదు, కానీ స్వయం తండ్రి సమానముగా అవ్యక్త స్థితి స్వరూపులుగా అవ్వండి, అప్పుడు అందరూ మీ పాటలు పాడుతారు.

స్లోగన్:-
సంకల్పములో మరియు స్వప్నములో కూడా ఒక్క హృదయాభిరాముని స్మృతి ఉన్నట్లయితే సత్యమైన తపస్వీలు అని అంటారు.

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు -

1) మనుష్యుల లక్ష్యము-ఉద్దేశ్యము ఏమిటి? ఆ లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు యథార్థ విధి ఏమిటి?

తమ జీవితాన్ని మంచిగా తయారుచేసుకునేందుకు అనుగుణమైనది ఏమిటి అనేది మనుష్యులు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆలోచించాలి. మనుష్యుల జీవితము దేనికోసముంది, ఆ జీవితములో ఏమి చేయాలి? ఇప్పుడు మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి - నా జీవితములో ఆ పరివర్తన వస్తుందా? మనుష్య జీవితములో ముందు జ్ఞానము కావాలి, ఆ తర్వాత ఈ జీవితము యొక్క లక్ష్యము-ఉద్దేశ్యము ఏమిటి? ఈ జీవితములో సదా సుఖము మరియు శాంతి కావాలని తప్పకుండా ఒప్పుకుంటారు. మరి ఇప్పుడు అవి మీకు లభిస్తున్నాయా? ఈ ఘోర కలియుగములోనైతే దుఃఖము, అశాంతి తప్ప ఇంకేమీ లేనే లేవు. మరి ఇప్పుడు సుఖ-శాంతులు ఎలా లభిస్తాయి అనేది ఆలోచించాలి. సుఖము మరియు శాంతి అనే ఈ రెండు పదాలు, తప్పకుండా ఈ ప్రపంచములోనే ఎప్పుడో ఒకప్పుడు ఉండి ఉంటాయి, అందుకే కదా ఈ రెండూ కావాలని కోరుకుంటున్నారు. ఒకవేళ మనుష్యులెవరైనా - మేము అటువంటి ప్రపంచాన్ని చూడనే లేదని అంటే, మరి అటువంటి ప్రపంచము ఉందని మీరెలా ఒప్పుకుంటారు? దీని గురించి ఏమని అర్థం చేయించడము జరుగుతుందంటే - పగలు మరియు రాత్రి అనే రెండు పదాలు ఉన్నాయంటే తప్పకుండా పగలు మరియు రాత్రి గడుస్తాయని అర్థం. మేము కేవలం రాత్రిని మాత్రమే చూసాము కనుక పగలు ఉందని ఎలా నమ్మాలి అని ఎవరూ అనలేరు. రెండు పేర్లు ఉన్నాయంటే, వాటి పాత్ర కూడా ఉంటుంది. అలాగే మనము కూడా విన్నాము - ఈ కలియుగము కంటే ఉన్నతమైన స్థితి కూడా ఒకప్పుడు ఉండేది, దానినే సత్యయుగమని అంటారు! ఒకవేళ ఇప్పటిలాంటి సమయమే నడుస్తూ ఉండి ఉంటే, మరి ఆ సమయానికి సత్యయుగము అనే పేరును ఎందుకు ఇచ్చారు! అంటే ఈ సృష్టి తన స్థితిని మార్చుకుంటూ ఉంటుంది. ఎలాగైతే కిషోర, బాల, యువ, వృద్ధ... అవస్థలు మారుతూ ఉంటాయో, అలాగే ఈ సృష్టి కూడా మారుతూ ఉంటుంది. నేటి జీవితానికి మరియు ఆ జీవితానికి ఎంత తేడా ఉంది. కనుక అటువంటి శ్రేష్ఠమైన జీవితాన్ని తయారుచేసుకునేందుకు ప్రయత్నము చేయాలి.

2) నిరాకారీ ప్రపంచము, ఆకారీ ప్రపంచము మరియు సాకారీ ప్రపంచము యొక్క విస్తారము

ఈ పూర్తి బ్రహ్మాండములో మూడు ప్రపంచాలు ఉన్నాయి - ఒకటి నిరాకారీ ప్రపంచము, మరొకటి ఆకారీ ప్రపంచము, మూడవది సాకారీ ప్రపంచము. నిరాకార సృష్టిలో ఆత్మలు నివసిస్తాయని మరియు సాకార సృష్టిలో సాకార మనుష్య సాంప్రదాయము వారు నివసిస్తారని ఇప్పుడు తెలుసుకున్నారు. ఇక మిగిలింది ఆకారీ సూక్ష్మ సృష్టి. ఇప్పుడు, ఈ ఆకారీ సృష్టి సదా ఉంటుందా లేక దాని పాత్ర కొంత సమయము నడుస్తుందా - అనే ఆలోచన కలుగుతుంది. సూక్ష్మ ప్రపంచము ఎక్కడో పైన ఉందని, అక్కడ ఫరిశ్తాలు ఉంటారని, దానినే స్వర్గమని అంటారని, అక్కడకు వెళ్ళి సుఖాన్ని అనుభవిస్తారని ప్రపంచములోని మనుష్యులు భావిస్తారు. కానీ స్వర్గము మరియు నరకము ఈ సృష్టిలోనే ఉంటాయని ఇప్పుడు స్పష్టమైంది. ఇకపోతే, ఈ సూక్ష్మ ఆకారీ సృష్టి, ఎక్కడైతే శుద్ధ ఆత్మల సాక్షాత్కారము జరుగుతుందో, అది ద్వాపరము నుండి ప్రారంభమైంది. భక్తి మార్గము ప్రారంభమైనప్పుడు - నిరాకారీ సృష్టి మరియు సాకారీ సృష్టి సదా ఉండనే ఉంటాయని ఋజువైంది. ఇకపోతే సూక్ష్మ ప్రపంచము సదా ఉంటుందని అనరు, అందులో కూడా ముఖ్యముగా బ్రహ్మా, విష్ణువు, శంకరుల సాక్షాత్కారము మనకు ఈ సమయములోనే జరుగుతుంది, ఎందుకంటే ఈ సమయములోనే పరమాత్మ మూడు కర్తవ్యాలు చేసేందుకు మూడు రూపాలను రచిస్తారు. అచ్ఛా - ఓం శాంతి.

అవ్యక్త ప్రేరణలు - పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి

బాప్ దాదా సదా ఏ శ్రీమతాన్ని ఇస్తారంటే - మనసులో ప్రతి ఆత్మ పట్ల శుభ భావనను మరియు శుభ కామనను పెట్టుకోండి, అపకారుల పట్ల కూడా ఉపకారము చేసే వృత్తిని పెట్టుకోండి, సంకల్పాలు సదా సర్వుల పట్ల శ్రేష్ఠమైనవిగా, నిస్వార్థమైనవిగా, సదా దాతాతనపు భావన కలిగినవిగా ఉండాలి. సదా స్వ పరివర్తన మరియు స్వయం యొక్క శ్రేష్ఠ కర్మల ద్వారా ఇతరులు శ్రేష్ఠ కర్మలు చేయడానికి ప్రేరణను ఇచ్చే కర్మలుగా ఉండాలి, అప్పుడు పరోపకారులు అని అంటారు.