14-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఏ విధముగా బాబా ప్రేమ సాగరుడో, ఏ విధముగా ప్రపంచములో ఎవరూ వారిలా ప్రేమించలేరో, అలా పిల్లలైన మీరు కూడా తండ్రి సమానముగా అవ్వండి, ఎవరినీ బాధపెట్టకండి’’

ప్రశ్న:-
ఏ రకమైన ఆలోచనలు నడుస్తూ ఉన్నట్లయితే సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కి ఉంటుంది?

జవాబు:-
ఇప్పుడు మేము జ్ఞాన రత్నాలతో మా జోలెను నింపుకుంటున్నాము, తర్వాత ఈ గనులు మొదలైనవన్నీ నిండుగా అయిపోతాయి. అక్కడ (సత్యయుగములో) మేము బంగారు మహళ్ళను నిర్మిస్తాము. 2. మా ఈ బ్రాహ్మణ కులము ఉత్తమమైన కులము, మేము సత్యాతి-సత్యమైన సత్యనారాయణుని కథను, అమరకథను వింటాము మరియు వినిపిస్తాము... ఇటువంటి ఆలోచనలు నడుస్తూ ఉన్నట్లయితే సంతోషపు పాదరసము పైకి ఎక్కి ఉంటుంది.

ఓంశాంతి
పిల్లలు తండ్రి స్మృతిలో కూర్చున్నారు, ఈ శ్రీమతము అనగా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతము లభిస్తుంది. స్మృతి యాత్ర చాలా మధురమైనది. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో, అంతగా బాబా మధురముగా అనిపిస్తారని పిల్లలకు నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. బాబా సాక్కిరిన్ కదా. ఒక్క తండ్రి మాత్రమే ప్రేమిస్తారు, మిగిలినవారంతా కొడతారు. ప్రపంచమంతా ఒకరినొకరు తిరస్కరించుకుంటూ ఉంటారు, తండ్రి ప్రేమిస్తారు, వారిని కేవలం పిల్లలైన మీరు మాత్రమే తెలుసుకున్నారు. తండ్రి అంటారు - నేను ఎవరై ఉన్నా, ఎలా ఉన్నా, ఎంత గొప్పవాడిని! మీ తండ్రి ఎంత గొప్పవారో చెప్పండి. అప్పుడు మీరు - వారు ఒక బిందువు అని అంటారు, మిగిలినవారెవరికీ ఈ విషయము తెలియదు. పిల్లలు కూడా ఘడియ-ఘడియ మర్చిపోతూ ఉంటారు. భక్తి మార్గములో పెద్ద-పెద్ద చిత్రాలను పూజించేవారము, ఇప్పుడు బిందువును ఎలా స్మృతి చేయాలి అని అడుగుతారు. బిందువు బిందువునే స్మృతి చేస్తుంది కదా. నేను ఒక బిందువునని, నా తండ్రి కూడా అలాగే ఉంటారని ఆత్మకు తెలుసు. ఆత్మయే ప్రెసిడెంట్ గా అవుతుంది, ఆత్మయే నౌకరుగా అవుతుంది. పాత్రను ఆత్మయే అభినయిస్తుంది. తండ్రి అందరికన్నా మధురమైనవారు. ఓ పతిత-పావనా, దుఃఖహర్త-సుఖకర్త రండి అని అందరూ స్మృతి చేస్తారు. మేము ఎవరినైతే బిందువు అని అంటున్నామో, వారు చాలా సూక్ష్మమైనవారు కానీ వారి మహిమ ఎంతో గొప్పది అని ఇప్పుడు పిల్లలైన మీకు నిశ్చయముంది. వారు జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు అన్న మహిమను పాడుతారు కూడా, కానీ వారు ఎలా వచ్చి సుఖాన్ని ఇస్తారు అనేది అర్థం చేసుకోరు. శ్రీమతముపై ఎవరెవరు ఎంతెంత నడుచుకుంటున్నారు అనేది మధురాతి-మధురమైన పిల్లలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. సేవ చేయడానికి శ్రీమతము లభిస్తుంది. చాలామంది మనుష్యులు అనారోగ్యముతో రోగగ్రస్తులుగా ఉన్నారు, చాలామంది ఆరోగ్యవంతులుగా కూడా ఉన్నారు. సత్యయుగములో ఆయుష్షు చాలా ఎక్కువగా ఉండేదని, సగటున 125-150 సంవత్సరాలు ఉండేదని భారతవాసులకు తెలుసు. ప్రతి ఒక్కరూ తమ సంపూర్ణ ఆయుష్షు జీవిస్తారు. ఇదైతే పూర్తిగా ఛీ-ఛీ ప్రపంచము, ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది.

మనుష్యులు ఇప్పటికీ పెద్ద-పెద్ద ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తూ ఉంటారు. అవి ఇంకా ఎంత సమయము ఉంటాయనేది వారికి తెలియదు. మందిరాలు మొదలైనవి నిర్మిస్తారు, లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. వాటి ఆయువు ఇంకా ఎంత సమయము ఉంటుంది? అవి త్వరలోనే సమాప్తమవ్వనున్నాయని మీకు తెలుసు. ఇళ్ళు మొదలైనవి నిర్మించుకోవడానికి బాబా మిమ్మల్ని ఎప్పుడూ వద్దనరు. మీరు మీ ఇంటిలోనే, ఒక గదిలో హాస్పిటల్ కమ్ యూనివర్సిటీని తెరవండి. ఏ ఖర్చు లేకుండా ఈ జ్ఞానము ద్వారా 21 జన్మల కోసం ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషాలను పొందాలి. మీకు చాలా సుఖము లభిస్తుందని కూడా అర్థం చేయించారు. ఎప్పుడైతే తమోప్రధానముగా అవుతారో, అప్పుడు ఎక్కువ దుఃఖము కలుగుతుంది. ఎంతెంతగా తమోప్రధానముగా అవుతూ ఉంటారో, అంతగా ప్రపంచములో దుఃఖము-అశాంతి పెరుగుతూ ఉంటాయి. మనుష్యులు చాలా దుఃఖితులు అవుతారు. ఆ తర్వాత జయజయకారాలు జరుగుతాయి. పిల్లలైన మీరు దివ్యదృష్టితో ఏ వినాశనాన్ని అయితే చూసారో, దానిని మళ్ళీ ప్రాక్టికల్ గా చూడనున్నారు. స్థాపన యొక్క సాక్షాత్కారము కూడా చాలామందికి కలిగింది. చిన్న కుమార్తెలకు చాలా సాక్షాత్కారాలు కలిగేవి. వారికి జ్ఞానమేమీ ఉండేది కాదు. పాత ప్రపంచ వినాశనము కూడా తప్పకుండా జరగనున్నది. తండ్రియే వచ్చి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారని పిల్లలైన మీకు తెలుసు. కానీ ఉన్నత పదవిని పొందేందుకు పిల్లలు పురుషార్థము చేయాలి. పిల్లలైన మీకు తండ్రి కూర్చుని ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తారు. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉందని వాళ్ళకు తెలియదు. తండ్రి అంటారు - నేను దాతను, నేను మీకు ఇవ్వడానికి వచ్చాను. పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని మనుష్యులు అంటారు.

తండ్రి అంటారు - మొదట మీరు ఎంత తెలివైనవారిగా ఉండేవారు, సతోప్రధానముగా ఉండేవారు. ఇప్పుడైతే తమోప్రధానముగా అయ్యారు. ఈ విషయము మీ బుద్ధిలోకి కూడా ఇప్పుడు వచ్చింది. మేము విశ్వముపై రాజ్యము చేసేవారము అని ఇంతకుముందు భావించేవారు కాదు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, మళ్ళీ తప్పకుండా అలా అవుతారు. చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతాయి. తండ్రి అర్థం చేయించారు - 5 వేల సంవత్సరాల క్రితం నేను వచ్చాను, మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేసాను, తర్వాత మీరు 84 జన్మల మెట్లు దిగుతారు. ఈ విస్తారము ఏ శాస్త్రములోనూ లేదు. శివబాబా శాస్త్రాలు మొదలైనవి ఏమైనా చదివారా? వారినైతే జ్ఞానము యొక్క అథారిటీ అని అంటారు. అలాగే మనుష్యులు కూడా శాస్త్రాలు మొదలైనవి చదివి శాస్త్రాల అథారిటీగా అవుతారు. వారు కూడా పతిత-పావనా రండి, అని పాడుతారు. గంగా స్నానాలు చేయడానికి వెళ్తారు. వాస్తవానికి ఈ భక్తి అనేది గృహస్థుల కోసమే ఉంది. సద్గతిదాత ఎవరు అనేది వారికి కూడా తెలియదు, తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఓ పతిత-పావనా రండి, అని మీరు నన్ను పిలుస్తారు కూడా. నేను మిమ్మల్ని పావనముగా తయారుచేస్తాను. నేను మిమ్మల్ని చదివించడానికి వస్తాను, అంతేకానీ మాపై కృప చూపించండి అని అడగకూడదు. నేను టీచరును, మీరు కృప మొదలైనవి ఎందుకు అడుగుతారు? ఆశీర్వాదాలనైతే అనేక జన్మలుగా తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వచ్చి తల్లిదండ్రుల ఆస్తికి యజమానులుగా అవ్వండి, ఇంకేమని ఆశీర్వదించాలి! బిడ్డ జన్మించగానే తండ్రి ఆస్తికి యజమానిగా అవుతారు. కృప చూపించండి అని లౌకిక తండ్రితో అంటారు. ఇక్కడైతే కృప చూపించే విషయమేమీ లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. బాబా ఒక బిందువు అని కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి తెలియజేశారు. అందరూ వారిని పరమపిత పరమాత్మ, గాడ్ ఫాదర్, సుప్రీమ్ సోల్ అని అంటారు కూడా, కావున వారు పరమ ఆత్మ అయినట్లు కదా. వారు సుప్రీమ్ (ఉన్నతోన్నతమైనవారు). మిగిలినవారంతా ఆత్మలు కదా. సుప్రీమ్ తండ్రి వచ్చి తమ సమానముగా తయారుచేస్తారు, ఇంకేమీ కాదు. స్వర్గ రచయిత అయిన అనంతమైన తండ్రి వచ్చి స్వర్గానికి యజమానులుగా చేస్తారని ఎవరి బుద్ధిలోనైనా ఉంటుందా ఏమిటి! శ్రీకృష్ణుని చేతిలో స్వర్గము యొక్క గ్లోబ్ ఉందని ఇప్పుడు మీకు తెలుసు. గర్భము నుండి బిడ్డ బయటకు వచ్చినప్పటి నుండి ఆయుష్షు ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణుడైతే పూర్తి 84 జన్మలను తీసుకుంటారు. గర్భము నుండి బయటకు వచ్చిన రోజు నుండి 84 జన్మలను లెక్కిస్తారు. లక్ష్మీ-నారాయణులకైతే పెద్దవారిగా అవ్వడానికి 30-35 సంవత్సరాలు పడుతుంది కదా. మరి ఆ 30-35 సంవత్సరాలను, 5 వేల సంవత్సరాల నుండి తగ్గించవలసి ఉంటుంది. శివబాబా విషయములో ఇలా లెక్కపెట్టలేరు, శివబాబా ఎప్పుడు వచ్చారు అన్న సమయాన్ని చెప్పలేరు. ప్రారంభము నుండి సాక్షాత్కారాలు కలిగేవి. ముసల్మానులు కూడా పుష్పాలతోట మొదలైనవి సాక్షాత్కారములో చూసేవారు. ఇప్పుడు దీని కోసం ఎవరూ నవవిధ భక్తిని చేయలేదు. ఇంటిలో కూర్చుని తమకు తామే ధ్యానములోకి వెళ్తూ ఉండేవారు. భక్తిలో వారు ఎంతగా నవవిధ భక్తిని చేస్తారు.

ఇప్పుడు తండ్రి కూర్చుని సమ్ముఖముగా అర్థం చేయిస్తున్నారు. బాబా దూరదేశము నుండి వచ్చారని పిల్లలకు తెలుసు. వీరిలో ప్రవేశించి మనల్ని చదివిస్తారు. కానీ మళ్ళీ బయటకు వెళ్ళడముతో నషా తగ్గిపోతుంది. ఈ విషయాలు గుర్తు ఉన్నట్లయితే సంతోషపు పాదరసము కూడా పైకి ఎక్కుతుంది మరియు కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది, కానీ దీనికి సమయము పడుతుంది. ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణుని ఆత్మకు అంతిమ జన్మలో పూర్తి జ్ఞానముంది, మళ్ళీ గర్భము నుండి బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా కూడా జ్ఞానము ఉండదు. శ్రీకృష్ణుడేమీ మురళీని మోగించలేదని, అతనికి ఈ జ్ఞానము తెలియనే తెలియదని తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. లక్ష్మీ-నారాయణులకే తెలియనప్పుడు, ఇక ఋషులు, మునులు, సన్యాసులు మొదలైనవారు ఎలా తెలుసుకోగలరు. విశ్వానికి యజమానులైన లక్ష్మీ-నారాయణులకే తెలియనప్పుడు ఇక ఈ సన్యాసులు ఎలా తెలుసుకోగలరు. శ్రీకృష్ణుడు సాగరములో రావి ఆకుపై వచ్చారు, ఇది చేసారు, అది చేసారు... అని అంటారు. ఇవన్నీ కథలు, వీటిని కూర్చుని వ్రాశారు. నదిలో అడుగు పెట్టగానే, అది కిందకు వెళ్ళిపోయిందని అంటారు. మనుష్యులు ఎలాంటి విషయాలను తయారుచేయగలరో ఆలోచించండి. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎటువంటి తప్పుడు మాటలను ఎప్పుడూ విశ్వసించకండి. శాస్త్రాలు మొదలైనవాటిని ఎంతమంది మనుష్యులు చదువుతారు. తండ్రి అంటారు - మీరు చదివినదంతా మర్చిపోండి, ఈ దేహాన్ని కూడా మర్చిపోండి. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుని, రకరకాల నామ, రూప, దేశాలతో, రకరకాల వస్త్రాలను ధరించి పాత్రను అభినయిస్తుంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు - ఇది ఛీ-ఛీ వస్త్రము. ఆత్మ మరియు శరీరము, రెండూ పతితముగా ఉన్నాయి. ఆత్మ గురించే శ్యామము మరియు సుందరము అని అంటారు. ఆత్మ పవిత్రముగా ఉన్నప్పుడు సుందరముగా ఉండేది, తర్వాత కామ చితిపై కూర్చోవడముతో నల్లగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి జ్ఞాన చితిపై కూర్చోబెడతారు. పతిత-పావనుడైన తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే ఈ మాలిన్యము తొలగిపోతుంది. ఆత్మలోనే మాలిన్యము చేరుకుంటుంది. కలియుగాంతములో మీరు నిరుపేదలుగా ఉన్నారు. అక్కడ సత్యయుగములో మీరు మళ్ళీ బంగారు మహళ్ళను నిర్మిస్తారు. ఇక్కడ వజ్రాలకు ఎంత విలువ ఉందో చూడండి, అక్కడైతే అవి రాళ్ళ వలె ఉంటాయి, ఎంత విచిత్రము. ఇప్పుడు మీరు తండ్రి నుండి జ్ఞాన రత్నాలతో జోలెను నింపుకుంటున్నారు. సాగరము నుండి రత్నాల పళ్ళెములను నింపుకుని తీసుకువస్తారని వ్రాయబడి ఉంది. సాగరము నుండి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోండి. ఇప్పుడిక గనులన్నీ నిండిపోతాయి. మీకు సాక్షాత్కారము కలిగింది. మాయా మశ్చీంద్రుని ఆటను కూడా చూపిస్తారు. అతను బంగారు ఇటుకలు పడి ఉండటాన్ని చూసి, నేను తీసుకువెళ్తానని అనుకుంటాడు. కానీ సాక్షాత్కారము పూర్తి అయి కిందకు వచ్చేటప్పటికి చూస్తే ఏమీ లేదు. అక్కడైతే బంగారు ఇటుకలతో మహళ్ళు నిర్మిస్తారు. ఇటువంటి ఆలోచనలు రావాలి, అప్పుడు సంతోషపు పాదరసము పైకి ఎక్కుతుంది. తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. శివబాబా 5 వేల సంవత్సరాల క్రితం కూడా వచ్చారు, ఇది ఎవరికీ తెలియదు. 5 వేల సంవత్సరాల క్రితం వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పించారని, కల్ప-కల్పము మీకే నేర్పిస్తారని మీకు తెలుసు. ఎవరెవరైతే వచ్చి బ్రాహ్మణులుగా అవుతారో, వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. విరాట రూపాన్ని కూడా తయారుచేస్తారు. అందులో బ్రాహ్మణుల పిలకను మాయం చేసేసారు. బ్రాహ్మణుల కులము చాలా ఉత్తమమైనది అని అంటూ ఉంటారు. వారు దైహిక బ్రాహ్మణులు, మీరు ఆత్మికమైనవారు. మీరు సత్యాతి-సత్యమైన కథను వినిపిస్తారు. ఇదే సత్యనారాయణుడి కథ, అమరకథ. మీకు అమరకథను వినిపించి అమరులుగా తయారుచేస్తున్నారు. ఈ మృత్యులోకము సమాప్తమవ్వనున్నది.

శివబాబా అంటారు - నేను మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చాను. ఎంతమంది ఆత్మలు ఉంటారు. ఆత్మలు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి శబ్దము రాదు. అదే తేనెటీగల గుంపు వెళ్ళేటప్పుడు ఎంత శబ్దము వస్తుంది. రాణి ఈగ వెనుక తేనెటీగలన్నీ పరుగెడతాయి. వాటికి పరస్పరము ఎంత ఐకమత్యముంటుంది. భ్రమరము ఉదాహరణ కూడా ఇక్కడకు సంబంధించినదే. మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. మీరు పతితులకు జ్ఞానము యొక్క భూ-భూ చేస్తారు, అప్పుడు వారు పావన విశ్వానికి యజమానులుగా అయిపోతారు. మీది ప్రవృత్తి మార్గము, అందులో కూడా మెజారిటీ మాతలది, అందుకే వందేమాతరం అని అనడము జరుగుతుంది. బ్రహ్మాకుమారీ అంటేనే తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వాన్ని ఇప్పించేవారు. తండ్రి సదా సుఖము యొక్క వారసత్వాన్ని ఇస్తారు. ఎవరైతే సేవ చేస్తారో, బాగా చదువుకుంటారో వారే నవాబులుగా అవుతారు... రాజుగా అవ్వడము మంచిదా లేక నౌకరుగా అవ్వడము మంచిదా. మేము ఏమవుతాము అనేది అంతిమ సమయములో మీకు అంతా తెలిసిపోతుంది. అప్పుడు - మేము శ్రీమతముపై ఎందుకు నడవలేదు అని పశ్చాత్తాపపడతారు! తండ్రి అంటారు - శ్రీమతాన్ని ఫాలో చేయండి. ఎవరైనా సెంటరు కోసం ఒక గదిని ఇచ్చి, వారు స్వయము ఆ ఇంటిలో మాంసం మొదలైనవి తింటూ ఉండటము కాదు. ఒకరు పుణ్యాత్మ, ఒకరు పాపాత్మ, అప్పుడది ఆశ్రమము అవ్వదు. ఇంటిలో స్వర్గాన్ని తయారుచేస్తున్నప్పుడు, స్వయము కూడా స్వర్గములో ఉండాలి కదా. కేవలం ఆశీర్వాదాలపైనే ఆధారపడకూడదు. తండ్రిని స్మృతి చేయాలి. పవిత్రముగా తయారుచేసే తమతో పాటు తీసుకువెళ్తారు. మీకైతే చాలా సంతోషము ఉండాలి, ఎంత గొప్ప లాటరీ లభిస్తుంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి ఇచ్చేంతటి ప్రేమను, ప్రపంచములో ఇంకెవ్వరూ ఇవ్వలేరు. అందుకే వారిని ప్రేమ సాగరుడు అని అంటారు. మీరు కూడా ఆ విధముగా తయారవ్వండి. ఒకవేళ ఎవరికైనా దుఃఖము ఇచ్చినా, బాధపెట్టినా దుఃఖితులై మరణిస్తారు. బాబా శాపమేమీ ఇవ్వడము లేదు, అర్థం చేయిస్తున్నారు. సుఖము ఇచ్చినట్లయితే సుఖమయముగా ఉంటారు. అందరినీ ప్రేమించండి. బాబా కూడా ప్రేమ సాగరుడు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎటువంటి తప్పుడు మాటలను విశ్వసించకూడదు. ఇంతవరకు ఏవైతే తప్పుడు విషయాలను చదివారో, వాటిని మరచి అశరీరిగా అయ్యే అభ్యాసము చేయాలి.

2. కేవలం ఆశీర్వాదాలపైనే ఆధారపడకూడదు, స్వయాన్ని పవిత్రముగా తయారుచేసుకోవాలి. తండ్రిని ప్రతి అడుగులోనూ ఫాలో చేయాలి, ఎవరికీ దుఃఖము ఇవ్వకూడదు, ఎవరినీ బాధపెట్టకూడదు.

వరదానము:-
సత్యమైన లగనము (తపన, ప్రేమ) ఆధారముగా ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించే సంపూర్ణ విశ్వాసపాత్ర భవ

సంపూర్ణ విశ్వాసపాత్రులు అని ఎవరిని అంటారంటే - ఎవరి సంకల్పము మరియు స్వప్నములో కూడా కేవలం తండ్రి, తండ్రి కర్తవ్యాలు, తండ్రి మహిమ మరియు తండ్రి జ్ఞానము తప్ప ఇంకేదీ కనిపించదో, వారిని. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు... బుద్ధి యొక్క లగనము సదా ఒక్కరి సాంగత్యములోనే ఉంటే అనేక సాంగత్యాల రంగు అంటుకోదు. అందుకే మొదటి ప్రతిజ్ఞ ఏమిటంటే - ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడిస్తాను - ఈ ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం అనగా సంపూర్ణ విశ్వాసపాత్రులుగా అవ్వడము.

స్లోగన్:-
సత్యత యొక్క స్వ-స్థితి అనేది పరిస్థితుల మధ్యన కూడా సంపూర్ణముగా తయారుచేస్తుంది.

అవ్యక్త ప్రేరణలు - ‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి’’

మనము ఉన్నతోన్నతుడైన తండ్రికి పిల్లలము, ఇది గుర్తున్నట్లయితే ఏకరస అవస్థ ఉంటుంది. ఎప్పుడైతే ఒక్కరితోనే సంబంధము ఉంటుందో, అప్పుడు అవస్థ కూడా ఏకరసముగా ఉంటుంది. ఒకవేళ ఇంకే సంబంధము వైపు అయినా మోహము కలుగుతున్నట్లయితే ఏకరస అవస్థ ఉండదు. కావున ఏకరస అవస్థను తయారుచేసుకునేందుకు ఒక్కరిని తప్ప ఇంకెవరినైనా చూస్తూ కూడా చూడకండి.