14-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రితో నిజాయితీగా ఉండండి, మీ సత్యమైన చార్టును వ్రాయండి, ఎవ్వరికీ దుఃఖమునివ్వకండి, ఒక్క తండ్రి ఇచ్చే శ్రేష్ఠ మతముపై నడుస్తూ ఉండండి’’

ప్రశ్న:-
ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో, వారి పురుషార్థము ఏముంటుంది?

జవాబు:-
వారి విశేష పురుషార్థము నరుడి నుండి నారాయణుడిగా అయ్యే విధముగా ఉంటుంది. తమ కర్మేంద్రియాలపై వారికి పూర్తి నిగ్రహము ఉంటుంది. వారి నేత్రాలు వికారీగా ఉండవు. ఒకవేళ ఇప్పటికీ కూడా ఎవరినైనా చూసినప్పుడు వికారీ ఆలోచనలు వస్తున్నట్లయితే, దృష్టి వికారీగా అవుతున్నట్లయితే, వారు పూర్తి 84 జన్మలు తీసుకునే ఆత్మ కాదని అర్థం చేసుకోండి.

పాట:-
ఈ పాపపు ప్రపంచము నుండి...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఇది పాపపు ప్రపంచమని తెలుసు. పుణ్య ప్రపంచము గురించి కూడా మనుష్యులకు తెలుసు. ముక్తి మరియు జీవన్ముక్తులను పుణ్య ప్రపంచము అని అంటారు, అక్కడ పాపము ఉండదు. దుఃఖధామమైన రావణ రాజ్యములో పాపము ఉంటుంది. దుఃఖాన్ని ఇచ్చే రావణుడిని కూడా చూసారు. రావణుడంటే ఎవరో వ్యక్తి అని కాదు, అయినా కానీ అతని దిష్టిబొమ్మను కాలుస్తారు. ఈ సమయములో మనము రావణ రాజ్యములో ఉన్నామని, అయినా దాని నుండి దూరముగా వచ్చేసామని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనము పురుషోత్తమ సంగమయుగములో ఉన్నాము. పిల్లలు ఇక్కడకు వచ్చినప్పుడు వారి బుద్ధిలో ఏముంటుందంటే - ఏ తండ్రి అయితే మమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారో, సుఖధామానికి యజమానులుగా తయారుచేస్తారో, మేము ఆ తండ్రి వద్దకు వెళ్తున్నాము. సుఖధామానికి యజమానిగా తయారుచేసేది బ్రహ్మా కాదు, అలాగే ఏ దేహధారీ కాదు. అలా తయారుచేసేది శివబాబాయే, వారికి దేహము లేదు. మీకు కూడా ఒకప్పుడు దేహము ఉండేది కాదు, కానీ తరువాత మీరు దేహాన్ని తీసుకుని జనన-మరణాలలోకి వస్తారు కావున మేము ఆ అనంతమైన తండ్రి వద్దకు వెళ్తాము అని మీరు భావిస్తారు. వారు మనకు శ్రేష్ఠ మతాన్ని ఇస్తారు. మీరు ఇటువంటి పురుషార్థము చేసినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవ్వగలరు. స్వర్గాన్ని అయితే అందరూ తలచుకుంటారు. కొత్త ప్రపంచము తప్పకుండా ఉంటుందని వారు భావిస్తారు, మరి దానిని స్థాపించేవారు కూడా తప్పకుండా ఎవరో ఉంటారు కదా. నరకాన్ని కూడా ఎవరో స్థాపన చేస్తారు. మీ సుఖధామపు పాత్ర ఎప్పుడు పూర్తవుతుంది, అది కూడా మీకు తెలుసు. ఆ తరువాత రావణ రాజ్యములో మీరు దుఃఖితులుగా అవుతూ ఉంటారు. ఈ సమయములో ఇది దుఃఖధామము. ఎంత కోటీశ్వరులు ఉన్నా, పదమపతులు ఉన్నా, ఈ ప్రపంచాన్ని పతిత ప్రపంచము అనైతే తప్పకుండా అంటారు కదా. ఇది నిరుపేద ప్రపంచము, దుఃఖమయ ప్రపంచము. ఎంత పెద్ద-పెద్ద భవనాలు, సుఖపు సాధనాలు అన్నీ ఉన్నా కూడా, దీనిని పతిత పురాతన ప్రపంచము అనే అంటారు. విషయ వైతరిణీ నదిలో మునకలు వేస్తూ ఉంటారు. వికారాలలోకి వెళ్ళడము పాపము అని కూడా అర్థం చేసుకోరు. అది లేకుండా సృష్టి వృద్ధిని ఎలా పొందుతుంది అని అంటారు. ఇంకొకవైపు - ఓ భగవంతుడా, ఓ పతిత-పావనుడా, మీరు వచ్చి ఈ పతిత ప్రపంచాన్ని పావనముగా తయారుచేయండి అని పిలుస్తూ ఉంటారు కూడా. ఆత్మ శరీరము ద్వారా ఇలా అంటుంది. ఆత్మయే పతితముగా అయింది, అందుకే పిలుస్తుంది. స్వర్గములో పతితులు ఒక్కరు కూడా ఉండరు.

పిల్లలైన మీకు తెలుసు - సంగమయుగములో మంచి పురుషార్థులు ఎవరైతే ఉంటారో, వారే - మేము 84 జన్మలు తీసుకున్నాము, ఈ లక్ష్మీ-నారాయణులతోపాటే మేము సత్యయుగములో రాజ్యము చేస్తాము అని భావిస్తారు. 84 జన్మలను ఒక్కరు మాత్రమే తీసుకోలేదు కదా. రాజుతోపాటు ప్రజలు కూడా కావాలి. బ్రాహ్మణులైన మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. కొందరు రాజా-రాణులుగా అవుతారు, కొందరు ప్రజలుగా అవుతారు. తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడే మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి. ఈ నేత్రాలు వికారీగా ఉన్నాయి, ఎవరినైనా చూసినప్పుడు వికారీ దృష్టి కలిగినట్లయితే వారికి 84 జన్మలు ఉండవు. వారు నరుడి నుండి నారాయణుడిగా అవ్వలేరు. ఎప్పుడైతే ఈ నేత్రాలపై విజయము పొందుతారో అప్పుడే కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. ఆధారమంతా ఈ నేత్రాలపైనే ఉంది, నేత్రాలే మోసము చేస్తాయి. ఆత్మ ఈ కిటికీల నుండి చూస్తుంది. వీరిలోనైతే డబుల్ ఆత్మ ఉంది. తండ్రి కూడా ఈ కిటికీల ద్వారానే చూస్తున్నారు. నా దృష్టి కూడా ఆత్మ వైపుకే వెళ్తుంది. తండ్రి ఆత్మకే అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, నేను కూడా శరీరాన్ని తీసుకున్నాను కావుననే మాట్లాడగలుగుతున్నాను. బాబా మమ్మల్ని సుఖమయ ప్రపంచములోకి తీసుకువెళ్తారని మీకు తెలుసు. ఇది రావణ రాజ్యము. మీరు ఈ పతిత ప్రపంచము నుండి దూరముగా వచ్చేసారు. కొందరు చాలా ముందుకు వెళ్ళిపోయారు, కొందరు వెనుకకు జరిగిపోయారు. తీరానికి చేర్చండి అని ప్రతి ఒక్కరూ అంటారు కూడా. ఇప్పుడు సత్యయుగ తీరానికైతే చేరుకుంటారు కానీ, అక్కడ ఉన్నత పదవిని పొందాలంటే పవిత్రముగా అవ్వాలి. ఇందులో కష్టపడాలి. ముఖ్యమైన విషయమేమిటంటే - తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఇది మొట్టమొదటి సబ్జెక్టు.

ఆత్మలమైన మనము పాత్రధారులము అని ఇప్పుడు మీకు తెలుసు. మొట్టమొదట మనము సుఖధామములోకి వచ్చాము, ఇప్పుడు మళ్ళీ దుఃఖధామములోకి వచ్చాము. ఇప్పుడు తండ్రి మళ్ళీ సుఖధామములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. వారు అంటారు, నన్ను స్మృతి చేయండి మరియు పవిత్రముగా అవ్వండి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకండి. మనుష్యులు ఒకరికొకరు చాలా దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. కొందరిలోకి కామమనే భూతము వస్తుంది, కొందరిలోకి క్రోధమనే భూతము వస్తుంది, చేయి చేసుకుంటారు. తండ్రి అంటారు, వారు దుఃఖమునిచ్చే పాపాత్ములు. మరి పుణ్యాత్మగా ఎలా అవుతారు. ఇప్పటికీ ఇంకా పాపము చేస్తూనే ఉంటారు. తండ్రి అంటారు, ఇటువంటివారు పేరును అప్రతిష్టపాలు చేస్తారు. అందరూ ఏమంటారు! మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని అంటారు, మేము మనుష్యుల నుండి దేవతలుగా, విశ్వానికి యజమానులుగా అవుతామని అంటారు, మరి అటువంటివారు ఇటువంటి పనులు చేస్తారా ఏమిటి! అందుకే బాబా అంటారు, రోజూ రాత్రివేళ మిమ్మల్ని మీరు చూసుకోండి. ఒకవేళ సుపుత్రులైన పిల్లలైతే మరి చార్టును పంపించాలి. కొందరు చార్టు వ్రాస్తారు కానీ - తాము ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చారా అన్న విషయాన్ని లేక వారు చేసిన పొరపాట్లను అందులో వ్రాయరు. ఒకవైపు స్మృతి చేస్తూ ఇంకొకవైపు తప్పుడు కర్మలు చేస్తూ ఉన్నట్లయితే అది కూడా కరక్టు కాదు. ఎప్పుడైతే దేహాభిమానులుగా అవుతారో అప్పుడే తప్పుడు కర్మలు చేస్తారు.

ఈ చక్రము ఎలా తిరుగుతుంది అన్న విషయము చాలా సహజమైనది. ఒక్క రోజులో కూడా టీచరుగా అవ్వవచ్చు. తండ్రి మీకు 84 జన్మల రహస్యాన్ని అర్థం చేయిస్తారు, శిక్షణనిస్తారు. ఆ తరువాత వెళ్ళి - మనము 84 జన్మలు ఎలా తీసుకున్నాము అని దాని గురించి మననము చేయాలి. శిక్షణను ఇచ్చే ఆ టీచర్ నుండి దైవీ గుణాలు కూడా ఎక్కువగా ధారణ చేస్తారు. బాబా నిరూపించి తెలియజేయగలరు. బాబా, నా చార్టు చూడండి, నేను కొద్దిగా కూడా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు అని బాబాకు చూపిస్తారు. బాబా అంటారు, ఈ బిడ్డ అయితే చాలా మధురమైనవారు, వీరి నుండి మంచి సుగంధము వెలువడుతోంది. టీచరుగా అవ్వడమనేది ఒక్క సెకండు పని. టీచరు కంటే కూడా విద్యార్థి స్మృతియాత్రలో చురుకుగా వెళ్ళిపోయినట్లయితే వారు టీచరు కంటే కూడా ఉన్నత పదవిని పొందుతారు. బాబా అయితే పిల్లలను అడుగుతారు - ఎవరికి నేర్పిస్తున్నారు? రోజూ శివుని మందిరాలలోకి వెళ్ళి - శివబాబా ఏ విధముగా వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు, ఏ విధముగా స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు అన్నది నేర్పించండి. ఇది అర్థం చేయించడం చాలా సహజము. బాబా, మా అవస్థ ఈ విధముగా ఉంది అని బాబాకు చార్టు పంపిస్తారు. బాబా అడుగుతారు - పిల్లలూ, వికర్మలేవీ చేయరు కదా? వికారీ దృష్టి తప్పుడు పనులేవీ చేయించడం లేదు కదా? మీ మ్యానర్స్ ను, క్యారెక్టర్ ను చూసుకోవాలి. నడత-నడవడిక యొక్క ఆధారమంతా నేత్రాలపైనే ఉంది. నేత్రాలు అనేక రకాలుగా మోసము చేస్తూ ఉంటాయి. అడగకుండా ఏ చిన్న వస్తువునైనా తీసుకుని తిన్నట్లయితే అది కూడా పాపమైపోతుంది, ఎందుకంటే అనుమతి లేకుండా తీసుకున్నారు కదా. ఇక్కడ నియమాలు చాలా ఉన్నాయి. ఇది శివబాబా యజ్ఞము కదా. అక్కడ దానికి ఎవరు నిమిత్తమో, వారిని అడగకుండా ఏ వస్తువునూ తినడానికి వీల్లేదు. ఒక్కరు తిన్నట్లయితే ఇక మిగిలినవారు కూడా అలాగే తినడం మొదలుపెడతారు. వాస్తవానికి ఇక్కడ ఏ వస్తువును తాళము వేసి దాచవలసిన అవసరము లేదు. నియమమేమిటంటే - ఈ ఇంటిలోకి, వంటింటి ముందుకు అపవిత్రులు ఎవ్వరూ రాకూడదు. బయటైతే అపవిత్రులు, పవిత్రులు అన్న ప్రశ్నే లేదు. కానీ స్వయాన్ని అయితే పతితులము అని పిలుచుకుంటారు కదా. అందరూ పతితులే. వల్లభాచార్యులను, శంకరాచార్యులను ఎవ్వరూ ముట్టుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే వారు స్వయాన్ని పావనులుగా, ఇతరులను పతితులుగా భావిస్తారు. వాస్తవానికి ఇక్కడ అందరి శరీరాలూ పతితమైనవే అయినా కానీ, పురుషార్థానుసారముగా వికారాలను సన్యసిస్తారు. నిర్వికారుల ఎదురుగా వికారీ మనుష్యులు తల వంచి నమస్కరిస్తారు. ఇతను చాలా గొప్ప స్వచ్ఛమైన ధర్మాత్ముడు అని అంటారు. సత్యయుగములోనైతే అపవిత్రులు ఉండరు. ఆ ప్రపంచమే పవిత్ర ప్రపంచము. అక్కడ ఒకే క్యాటగరీవారు ఉంటారు. మీకు ఈ రహస్యాలన్నీ తెలుసు. ప్రారంభము నుండి మొదలుకుని సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాలు బుద్ధిలో ఉండాలి. మనకు అన్నీ తెలుసు. మనము తెలుసుకోవలసింది ఇంకేదీ ఉండదు. రచయిత అయిన తండ్రిని తెలుసుకున్నాము, సూక్ష్మవతనాన్ని తెలుసుకున్నాము, భవిష్య పదవి గురించి తెలుసుకున్నాము, దాని కోసమే పురుషార్థము చేస్తున్నాము. కానీ నడవడిక మళ్ళీ అలా మారిపోతే ఇక ఉన్నత పదవిని పొందలేరు. ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తే, వికారాలలోకి వెళ్తే, చెడు దృష్టిని పెట్టుకుంటే, ఇవన్నీ పాపాలే. దృష్టి పరివర్తన అవ్వడము అంటే అది ఎంతో కష్టము. దృష్టి చాలా బాగుండాలి. ఇతను క్రోధము చేస్తున్నారు అని నేత్రాలు చూసినప్పుడు ఇక స్వయం కూడా గొడవపడడం మొదలుపెడతారు. శివబాబాపై వారికి కొద్దిగా కూడా ప్రేమ లేదు, అసలు స్మృతే చేయరు. గొప్పతనమంతా శివబాబాదే. ఓ గురు, గొప్పతనమంతా మీదే... గోవిందుడైన శ్రీకృష్ణుని సాక్షాత్కారము చేయించిన ఆ సద్గురువుదే గొప్పతనము. గురువు ద్వారా మీరు గోవిందులుగా అవుతారు. కేవలము సాక్షాత్కారము ద్వారా నోరు తీపి అవ్వదు. మీరా నోరు తీపి అయ్యిందా ఏమిటి? కేవలము సాక్షాత్కారమే అయ్యింది కానీ నిజముగా అయితే స్వర్గములోకి వెళ్ళలేదు కదా. అది భక్తి మార్గము, దానిని స్వర్గ సుఖము అని అనరు. కేవలము గోవిందుడిని చూడడము కాదు, అతనిలా తయారవ్వాలి. మీరు ఇక్కడికి వచ్చిందే అలా తయారవ్వడానికి. మమ్మల్ని ఆ విధముగా తయారుచేసేవారి వద్దకు మేము వెళ్తున్నాము అని మీకు నషా ఉండాలి. బాబా అందరికీ సలహాను ఇస్తున్నారు - నేత్రాలు మోసగించలేదు కదా, పాపము చేయలేదు కదా అని చార్టులో ఇది కూడా వ్రాయండి. నేత్రాలు ఏదో ఒక విషయములో తప్పకుండా మోసగిస్తూ ఉంటాయి. నేత్రాలు పూర్తిగా శీతలముగా అయిపోవాలి. స్వయాన్ని అశరీరిగా భావించండి. ఇటువంటి కర్మాతీత అవస్థ అంతిమములో తయారవుతుంది, అది కూడా ఎప్పుడైతే బాబాకు తమ చార్టును పంపిస్తారో అప్పుడే అవుతుంది. అయితే, ధర్మరాజు రిజిస్టర్లో ఆటోమేటిక్ గా లెక్క అంతా జమ అయిపోతుంది, కానీ తండ్రి సాకారములో వచ్చారు కావున సాకారునికి తెలియాలి అని అంటున్నారు. కావుననే అప్రమత్తము చేస్తున్నారు. వికారీ దృష్టి కలవారు లేక దేహాభిమానము కలవారు ఉంటే వారు వాయుమండలాన్ని అశుద్ధముగా చేస్తారు. ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా వారి బుద్ధియోగము బయటికి వెళ్ళిపోతుంది. మాయ చాలా మోసము చేస్తుంది. మనసు చాలా తుఫానులు తీసుకువస్తుంది. అలా తయారయ్యేందుకు ఎంత కష్టపడవలసి ఉంటుంది. బాబా వద్దకు వస్తారు, బాబా ఆత్మకు జ్ఞాన అలంకరణ చేయిస్తారు. ఆత్మ అయిన నేను జ్ఞానము ద్వారా పవిత్రముగా అవుతాను అని కూడా అర్థం చేసుకుంటారు, అప్పుడు శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మ మరియు శరీరము, రెండూ సత్యయుగములో పవిత్రముగా ఉంటాయి. మళ్ళీ అర్ధకల్పము తరువాత రావణ రాజ్యము వస్తుంది. భగవంతుడు ఇలా ఎందుకు చేసారు అని మనుష్యులు అంటారు. కానీ ఈ అనాది డ్రామా తయారై ఉంది. ఇందులో భగవంతుడేమీ చేయలేదు. సత్యయుగములో ఒకే ఒక్క దేవీ-దేవతా ధర్మము ఉంటుంది. మరి అటువంటి భగవంతుడిని అసలు మేము ఎందుకు తలచుకోవాలి అని కొందరు అంటూ ఉంటారు. కానీ మీకు ఇతర ధర్మాలతో పనేమీ లేదు. ఎవరైతే ముళ్ళగా అయ్యారో వారే వచ్చి పుష్పాలుగా అవుతారు. మనుష్యులు ఏమంటారంటే - భగవంతుడు కేవలము భారతవాసులనే స్వర్గములోకి తీసుకువెళ్తారా, మేము ఇది నమ్మము, భగవంతునికి కూడా రెండు రకాల దృష్టి ఉంటుందా ఏమిటి? కానీ ఇది డ్రామా తయారై ఉంది. అందరూ స్వర్గములోకి వస్తే ఇక అనేక ధర్మాల పాత్ర ఎలా నడుస్తుంది? స్వర్గములో ఇన్ని కోట్లమంది ఉండరు. అసలు భగవంతుడు ఎవరు అన్నది మొట్టమొదటి ముఖ్యమైన విషయము, ముందు వారి గురించి అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతేనే అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే, అప్పుడు అంటారు - ఈ విషయము నిజమే, మేము పతితుల నుండి పావనులుగా తప్పకుండా అవ్వాలి. ఆ ఒక్కరినే స్మృతి చేయాలి. అన్ని ధర్మాలలోనూ భగవంతుడిని తలచుకుంటారు.

పిల్లలైన మీకు ఇప్పుడు ఈ జ్ఞానము లభిస్తోంది. ఈ సృష్టిచక్రము ఎలా తిరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకున్నారు. మీరు ప్రదర్శనీలో కూడా ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ చాలా కొద్దిమందే వెలువడుతారు. కానీ ఈ కారణము వలన ప్రదర్శనీ చేయకూడదు అని అనరు. డ్రామాలో ఉంది, చేసాము, అయినా కొన్ని చోట్ల ప్రదర్శనీలో నుండి కొంతమంది వెలువడతారు, కొన్ని చోట్ల ఎవ్వరూ వెలువడరు. మున్ముందు వస్తారు, ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థము చేస్తారు. ఎవరైనా తక్కువ పదవి పొందవలసి ఉంటే వారు అంత పురుషార్థము చేయరు. అయినా తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు, వికర్మలు ఏవీ చేయకండి. ఇది కూడా నోట్ చేసుకోండి - నేను ఎవ్వరికీ దుఃఖమునివ్వలేదు కదా? ఎవరితోనూ గొడవపడలేదు, కొట్లాడలేదు కదా? తప్పుగా ఏమీ మాట్లాడలేదు కదా? చేయకూడని కార్యము ఏదీ చేయలేదు కదా? బాబా అంటారు, మీరు ఏవైనా వికర్మలు చేసి ఉంటే వాటిని వ్రాయండి. ద్వాపరము నుండి మొదలుకుని వికర్మలు చేస్తూ-చేస్తూ ఇప్పుడు చాలా వికర్మలు చేసేవారిగా అయిపోయారని కూడా మీకు తెలుసు. బాబాకు వ్రాసి ఇవ్వడం ద్వారా భారము తేలికగా అయిపోతుంది. మేము ఎవ్వరికీ దుఃఖము ఇవ్వము అని వ్రాస్తారు. బాబా అంటారు - అచ్ఛా, మరి చార్టు తీసుకువచ్చినట్లయితే చూస్తాము. బాబా కూడా, ఎవ్వరికీ దుఃఖమునివ్వని ఇటువంటి మంచి పిల్లలను ఒకసారి చూద్దాము అని పిలుస్తారు. సుపుత్రులైన పిల్లలను తండ్రి చాలా ప్రేమిస్తారు. ప్రస్తుతము ఇంకా ఎవ్వరూ సంపూర్ణముగా అవ్వలేదు అని బాబాకు తెలుసు. ఎలా పురుషార్థము చేస్తున్నారు అని బాబా ప్రతి ఒక్కరినీ చూస్తారు. పిల్లలు చార్టు వ్రాయడం లేదంటే తప్పకుండా ఏవో లోపాలు ఉన్నాయని అర్థము, వాటిని బాబా నుండి దాస్తున్నారు. ఎవరైతే చార్టు వ్రాస్తారో, వారినే సత్యమైన నిజాయితీపరులైన పిల్లలుగా భావిస్తాను. చార్టుతోపాటు మళ్ళీ మ్యానర్స్ కూడా కావాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయము యొక్క భారాన్ని తేలిక చేసుకునేందుకు ఏయే వికర్మలైతే జరిగాయో వాటిని తండ్రికి వ్రాసి ఇవ్వాలి. ఇప్పుడు ఇక ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. సుపుత్రులుగా ఉండాలి.

2. మీ దృష్టిని చాలా బాగా తయారుచేసుకోవాలి. నేత్రాలు మోసగించకుండా ఉండేలా సంభాళించుకోవాలి. మీ మ్యానర్స్ ను చాలా-చాలా బాగా ఉంచుకోవాలి. కామ, క్రోధాలకు వశమై ఎటువంటి పాపము చేయకూడదు.

వరదానము:-
లక్ష్యాన్ని మరియు గమ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకుని తీవ్ర పురుషార్థము చేసే సదా హోలీ మరియు హ్యాపీ భవ

బ్రాహ్మణ జీవితము యొక్క లక్ష్యము ఏమిటంటే - ఎటువంటి హద్దులోని ఆధారమూ లేకుండా సదా ఆంతరిక సంతోషములో ఉండడము. ఎప్పుడైతే ఈ లక్ష్యము మారి హద్దులోని ప్రాప్తుల యొక్క చిన్న-చిన్న వీధులలో చిక్కుకుపోతారో, అప్పుడు గమ్యము నుండి దూరమైపోతారు. అందుకే ఏమి జరిగినా కానీ, హద్దులోని ప్రాప్తులను త్యాగము చేయవలసి వచ్చినా కూడా, వాటిని వదిలేయండి కానీ అవినాశీ సంతోషాన్ని ఎప్పుడూ వదలకండి. హోలీ మరియు హ్యాపీ భవ అన్న వరదానాన్ని స్మృతిలో ఉంచుకుని తీవ్ర పురుషార్థము ద్వారా అవినాశీ ప్రాప్తులను పొందండి.

స్లోగన్:-
గుణమూర్తులుగా అయి గుణాలను దానము చేస్తూ వెళ్ళండి, ఇదే అన్నింటికన్నా పెద్ద సేవ.

అవ్యక్త ప్రేరణలు - సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి

మాస్టర్ నాలెడ్జ్ ఫుల్, మాస్టర్ సర్వశక్తివాన్ అన్న స్థితిలో స్థితులై రకరకాల క్యూల నుండి బయటపడి, తండ్రితోపాటు సదా మిలనాన్ని జరుపుకునే లగనములో మీ సమయాన్ని పెట్టండి మరియు లవలీన స్థితిలో ఉండండి, అప్పుడు ఇతర విషయాలన్నీ సహజముగానే సమాప్తమైపోతాయి, అప్పుడు ఇక మీ ఎదురుగా మీ ప్రజలు మరియు భక్తుల క్యూ ఏర్పడుతుంది.