14-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 18.01.2007


‘‘ఇప్పుడు స్వయాన్ని ముక్తులుగా చేసుకుని మాస్టర్ ముక్తిదాతలుగా అయ్యి అందరికీ ముక్తిని ఇప్పించేందుకు నిమిత్తులుగా అవ్వండి’’

ఈ రోజు స్నేహసాగరుడైన బాప్ దాదా నలువైపులా ఉన్న స్నేహీ పిల్లలను చూస్తున్నారు. రెండు రకాల పిల్లలను చూస్తూ, చూస్తూ హర్షిస్తున్నారు. ఒకరేమో లవలీనులైన పిల్లలు, మరొకరు లవ్లీ (ప్రియమైన) పిల్లలు, ఇరువురి స్నేహము యొక్క అలలు బాబా వద్దకు అమృతవేళ కన్నా ముందు నుండే చేరుకుంటున్నాయి. ప్రతి ఒక్క బిడ్డ హృదయము నుండి ఆటోమేటిక్ గానే ‘‘నా బాబా’’ అనే పాట మోగుతోంది. బాప్ దాదా హృదయము నుండి కూడా ఇదే పాట మోగుతుంది - ‘‘నా పిల్లలు, ప్రియమైన పిల్లలు, బాప్ దాదాకు శిరోకిరీటము వంటి పిల్లలు’’. ఈ రోజు స్మృతి దివసమైన కారణముగా అందరి మనసులలో స్నేహ అలలు ఎక్కువగా ఉన్నాయి. అనేకమంది పిల్లల యొక్క స్నేహపు ముత్యాల మాలలు బాప్ దాదాల మెడలో వేయబడుతున్నాయి. బాబా కూడా తమ స్నేహపు బాహువుల మాలను పిల్లలపై వేస్తున్నారు. అనంతమైన బాప్ దాదా యొక్క అనంతమైన బాహువులలో ఇమిడిపోయారు. ఈ రోజు అందరూ విశేషముగా స్నేహమనే విమానములో చేరుకున్నారు మరియు దూరదూరాల నుండి కూడా మనసు యొక్క విమానములో అవ్యక్త రూపముతో, ఫరిశ్తా రూపముతో చేరుకున్నారు. పిల్లలందరికీ బాప్ దాదా ఈ రోజు స్మృతి దివసము మరియు సమర్థ దివసము యొక్క పదమాల పదమాల ప్రియస్మృతులను అందిస్తున్నారు. ఈ దివసము ఎన్ని స్మృతులను కలిగిస్తుంది మరియు ప్రతి స్మృతి క్షణములో సమర్థులుగా చేసేస్తుంది. స్మృతుల యొక్క లిస్టు క్షణములో స్మృతిలోకి వచ్చేస్తుంది కదా. స్మృతి ఎదురుగా వస్తూనే సమర్థత యొక్క నషా కలుగుతుంది. మొట్టమొదటి స్మృతి గుర్తుంది కదా! బాబాకు చెందినవారిగా అయినప్పుడు బాబా ఏ స్మృతిని కలిగించారు? మీరు కల్పపూర్వపు భాగ్యవాన్ ఆత్మలు. ఈ మొదటి స్మృతి ద్వారా ఏ పరివర్తన వచ్చిందో గుర్తు చేసుకోండి. ఆత్మాభిమానులుగా అవ్వడము ద్వారా పరమాత్మ తండ్రి యొక్క స్నేహపు నషా కలిగింది. నషా ఎందుకు కలిగింది? హృదయము నుండి మొట్టమొదటి స్నేహపు మాట ఏం వెలువడింది? ‘‘నా మధురమైన బాబా’’ మరియు ఈ ఒక్క బంగారు మాట వెలువడడముతో ఏ నషా కలిగింది? ‘‘నా బాబా’’ అని అనడము వలన, తెలుసుకోవడము వలన మరియు అంగీకరించడము వలన సర్వ పరమాత్మ ప్రాప్తులు మీ ప్రాప్తులుగా అయిపోయాయి. అనుభవము ఉంది కదా! ‘‘నా బాబా’’ అని అనేటప్పటికి ఎన్ని ప్రాప్తులు మీవిగా అయిపోయాయి! ఎక్కడైతే ప్రాప్తులు ఉంటాయో అక్కడ స్మృతి తెచ్చుకోవలసిన అవసరముండదు, స్మృతి అనేది స్వతహాగానే కలుగుతుంది, సహజముగానే కలుగుతుంది, ఎందుకంటే ‘నాదిగా’ అయిపోయింది కదా! బాబా ఖజానా నా ఖజానాగా అయిపోయింది. కావున ‘నాది’ అనే దానిని స్మృతి తెచ్చుకోవలసిన అవసరముండదు, అది స్వతహాగానే స్మృతి ఉంటుంది. ‘నాది’ అన్నదానిని మర్చిపోవడం కష్టమవుతుంది, అంతేకానీ దానిని స్మృతి చేయడం కష్టమవ్వదు. ఉదాహరణకు ‘నా శరీరము’ అని అనుభవముంది కదా, కావున దానిని ఎప్పుడైనా మర్చిపోతారా? దానిని మర్చిపోయేలా ప్రయత్నించవలసి ఉంటుంది కదా, ఎందుకని? ఎందుకంటే అది నాది కదా! కావున ఎక్కడైతే ‘నాది’ అనేది వస్తుందో అక్కడ సహజముగానే అది స్మృతిలో ఉంటుంది. కావున ‘‘నా బాబా’’ అన్న ఒక్క మాట యొక్క స్మృతి సమర్థ ఆత్మగా చేసింది. భాగ్యవిధాతను, తరగని ఖజానాల దాతను ‘నా వారిగా’ చేసుకున్నారు. మీరు ఇటువంటి అద్భుతాన్ని చేసే పిల్లలు కదా! మీరు పరమాత్మ పాలనకు అధికారులుగా అయిపోయారు. ఈ పరమాత్మ పాలన మొత్తం కల్పమంతటిలో ఒకేసారి లభిస్తుంది. ఆత్మలు మరియు దేవాత్మల పాలన అయితే లభిస్తుంది కానీ పరమాత్మ పాలన కేవలం ఒక్క జన్మ కొరకే లభిస్తుంది.

కావున ఈ నాటి స్మృతి సో సమర్థీ దివసము నాడు పరమాత్మ పాలన యొక్క నషా మరియు సంతోషము సహజముగా గుర్తున్నాయి కదా! ఎందుకంటే ఈ రోజు వాయుమండలము సహజ స్మృతిని కలిగించే వాయుమండలము. మరి ఈ రోజు సహజయోగులుగా ఉన్నారా లేక ఈ రోజు కూడా స్మృతి కొరకు యుద్ధము చేయవలసి వచ్చిందా? ఎందుకంటే ఈ రోజును స్నేహపు రోజు అని అంటారు కదా, కావున స్నేహము శ్రమను తొలగించేస్తుంది. స్నేహము అన్ని విషయాలను సహజము చేసేస్తుంది. మరి అందరూ ఈ రోజున విశేషముగా సహజయోగులుగా ఉన్నారా లేక ఏదైనా కష్టము వచ్చిందా? ఎవరికైతే ఈ రోజున కష్టము వచ్చిందో వారు చేతులెత్తండి. ఎవ్వరికీ రాలేదా? అందరూ సహజయోగులుగానే ఉన్నారా. అచ్ఛా, ఎవరైతే సహజయోగులుగా ఉన్నారో వారు చేతులెత్తండి. (అందరూ చేతులెత్తారు). అచ్ఛా - సహజయోగులుగా ఉన్నారా? ఈ రోజు మాయకు శెలవు ఇచ్చేసారు, మరి ఈ రోజు మాయ రాలేదా? ఈ రోజు మాయకు వీడ్కోలు చెప్పేసారా? అచ్ఛా, మరి ఈ రోజు వీడ్కోలు చెప్పేసారు, అందుకు అభినందనలు మరియు ఒకవేళ ఇలాగే స్నేహములో ఇమిడి ఉన్నట్లయితే ఇక మాయకు సదా కొరకు వీడ్కోలు చెప్పినట్లవుతుంది ఎందుకంటే ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తవుతున్నాయి కావున బాప్ దాదా ఈ సంవత్సరాన్ని అతీతమైన సంవత్సరముగా, సర్వులకు ప్రియమైన సంవత్సరముగా, శ్రమ నుండి ముక్తులుగా ఉండే సంవత్సరముగా, సమస్య నుండి ముక్తులుగా ఉండే సంవత్సరముగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ఇది మీ అందరికీ ఇష్టమేనా? ఇష్టమేనా? ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారా? ఎందుకంటే ముక్తిధామానికి వెళ్ళాలి మరియు ముక్తిదాత అయిన తండ్రికి సహచరులుగా అయి దుఃఖములో, అశాంతిలో ఉన్న అనేక ఆత్మలకు ముక్తిని ఇప్పించాలి. కావున మాస్టర్ ముక్తిదాతలు ఎప్పుడైతే స్వయం ముక్తులుగా అవుతారో, అప్పుడే ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారు కదా! ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలైన మీరు స్వయం ముక్తులుగా అయి అనేకులకు ముక్తిని ఇప్పించడానికి నిమిత్తులు. ముక్తిని ఇప్పించేందుకు బదులుగా బంధనములో బంధించేటువంటి, సమస్యకు ఆధీనులుగా చేసేటువంటి ఆ ఒక్క భాష ఏమిటంటే - ఇలా కాదు అలా, అలా కాదు ఇలా. సమస్య వచ్చినప్పుడు ఇలానే అంటారు కదా - బాబా, ఇలా కాదు కదా, అలా కదా, ఇలా జరగకపోయి ఉంటే అలా జరిగి ఉండేది కదా. ఇవన్నీ సాకులు చెప్పే ఆటలు.

బాప్ దాదా అందరి ఫైల్ ను చూసారు, అప్పుడు ఫైల్ లో ఏం చూసారు? మెజారిటీ వారి ఫైలు ప్రతిజ్ఞలు చేసిన కాగితాలతో నిండి ఉంది. ప్రతిజ్ఞ చేసే సమయములో చాలా హృదయపూర్వకముగా చేస్తారు, ఆలోచిస్తారు కూడా. కానీ ఇప్పటివరకు గమనించింది ఏమిటంటే - ఫైల్ పెద్దదిగా అవుతూ ఉంటుంది కానీ ఇప్పటికీ ఫైనల్ అవ్వలేదు. దృఢ ప్రతిజ్ఞ కోసం ఏమని చెప్తారంటే - ప్రాణము పోయినా కానీ ప్రతిజ్ఞ పోకూడదు అని. బాప్ దాదా ఈ రోజు అందరి ఫైళ్ళను చూసారు. మంచి-మంచి ప్రతిజ్ఞలు చాలా చేసారు. మనసుతో కూడా చేసారు మరియు వ్రాసి కూడా చేసారు. మరి ఈ సంవత్సరము ఏం చేస్తారు? ఫైలును పెంచుతారా లేక ప్రతిజ్ఞలను ఫైనల్ చేస్తారా? ఏం చేస్తారు? మొదటి లైన్ వారు చెప్పండి, పాండవులు వినిపించండి, టీచర్లు వినిపించండి. బాప్ దాదా వద్ద ఏదైతే ఫైల్ పెద్దదిగా అవుతూ ఉందో, ఈ సంవత్సరము దానిని ఫైనల్ చేస్తారా లేక ఈ సంవత్సరము కూడా ఆ ఫైలులో కాగితాలు ఇంకా పెడతారా? ఏం చేస్తారు? పాండవులు చెప్పండి, ఫైనల్ చేస్తారా? తల వంచవలసి వచ్చినా, మారవలసి వచ్చినా, సహించవలసి వచ్చినా కూడా, వినవలసి వచ్చినా కూడా, ఏమైనా కానీ మారవలసిందే అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చూడండి, టి.వి.లో అందరి ఫోటోను తీయండి. 2, 3, 4 టి.వి.లు ఉన్నాయి. అన్ని వైపుల నుండి ఫొటో తీయండి. ఇది రికార్డు చేయండి, బాబాకు ఈ ఫోటో తీసి ఇవ్వండి. టి.వి.వారు ఎక్కడ ఉన్నారు? బాప్ దాదా కూడా ఈ ఫైల్ యొక్క లాభాన్ని తీసుకోవాలి కదా. అభినందనలు, అభినందనలు. మీ కోసం మీరే చప్పట్లు కొట్టుకోండి.

చూడండి, ఏ విధంగా ఒక వైపు సైన్స్ వారు, ఇంకొక వైపు భ్రష్టాచారులు, మూడవ వైపు పాపాచారులు, అందరూ తమ-తమ కార్యాలలో ఇంకా వృద్ధిని చేస్తూ వెళ్తున్నారు, చాలా కొత్త-కొత్త ప్లానులను తయారుచేస్తూ ఉన్నారు. మరి మీరైతే విశ్వ రచయిత పిల్లలు, కావున మీరు ఈ సంవత్సరము ఎటువంటి నవీనత యొక్క సాధనాన్ని అలవరచుకోండంటే, దానితో ప్రతిజ్ఞ దృఢమైపోవాలి ఎందుకంటే అందరూ ప్రత్యక్షతను కోరుకుంటారు. ఎంత ఖర్చు చేస్తున్నారు, అనేక స్థానాలలో పెద్ద-పెద్ద కార్యక్రమాలను చేస్తున్నారు, ప్రతి వర్గమువారు బాగా కష్టపడుతున్నారు, కానీ ఇప్పుడు ఈ సంవత్సరము దానికి ఒకటి ఏడ్ చేయండి, అదేమిటంటే - ఏ సేవ చేసినా, ఉదాహరణకు నోటి ద్వారా సేవ చేసారనుకోండి, అప్పుడు కేవలం నోటి ద్వారా మాత్రమే సేవ చేయడం కాదు. మనసా, వాచా మరియు స్నేహ-సహయోగాల రూపీ కర్మలు, ఒకే సమయములో మూడు సేవలు కలిపి జరగాలి, అవి వేర్వేరుగా జరగకూడదు. ఒకే సేవ చేసినప్పుడు ఏం గమనించడం జరిగిందంటే, బాప్ దాదా ఏ రిజల్టునైతే చూడాలనుకుంటున్నారో అది కనిపించడం లేదు. ప్రత్యక్షత జరగాలి అని మీరు కూడా కోరుకుంటున్నారు కదా. పూర్వముతో పోలిస్తే ఇప్పటి రిజల్టు చాలా బాగుంది. అందరూ మంచిగా ఉంది, మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది అని చెప్పి వెళ్తూ ఉంటారు. కానీ మంచిగా తయారవ్వడము అనగా ప్రత్యక్షత జరగడము. కావున ఇప్పుడు ఏమి ఎక్స్ ట్రా కలపండి అంటే - ఒకే సమయములో మనసా, వాచా, కర్మణాలో స్నేహీ, సహయోగీగా అవ్వాలి. అలాగే సహచరులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ, అది సహచరులుగా ఉన్న బ్రాహ్మణులు కావచ్చు లేదా బయటివారు ఎవరైతే సేవ కొరకు నిమిత్తులుగా అవుతారో వారు కావచ్చు, ఎవరికైనా కానీ సహయోగాన్ని మరియు స్నేహాన్ని ఇవ్వాలి - ఇది కర్మణా సేవలో నంబర్ తీసుకోవడము. వీరు ఇలా చేసారు కదా, అందుకే ఇలా చేయవలసి వచ్చింది, స్నేహానికి బదులుగా కొద్ది-కొద్దిగా అనవలసి వచ్చింది - ఈ భాషను వాడకండి. బాబా ఈ పదాలను వాడలేదు. ఇది చేయవలసే ఉంటుంది, అనవలసే ఉంటుంది, చూడవలసే ఉంటుంది... ఇలా కాదు. ఈ పదాలను ఇన్ని సంవత్సరాలలో చూసేసారు, బాప్ దాదా వదిలేసారు. ‘ఇలా కాదు, అలా’ అని అంటూ ఉంటారు, కానీ ఇప్పుడు ఇంకా ఎంతవరకు? బాప్ దాదాతో అందరూ చేసే ఆత్మిక సంభాషణలో మెజారిటీ ఇలా అడుగుతుంటారు - బాబా, చివరికి ఈ పరదా ఎప్పుడు తెరుచుకుంటుంది? ఇది ఎప్పటివరకు నడుస్తుంది? అప్పుడు బాప్ దాదా మిమ్మల్ని అడుగుతారు - నిర్లక్ష్యము మరియు చేదుతనముతో కూడుకున్న ఈ పాత భాష, పాత నడవడిక ఎప్పటివరకు అని? ఇలా ఎప్పటివరకు అని బాప్ దాదా కూడా ప్రశ్నిస్తారు. మీరు ఈ ప్రశ్నకు జవాబు చెప్తే బాప్ దాదా కూడా ‘ఎప్పటికల్లా వినాశనమవుతుంది’ అన్న ప్రశ్నకు జవాబు ఇస్తారు ఎందుకంటే బాప్ దాదా వినాశనము యొక్క పరదాను ఇప్పుడు కూడా, ఈ క్షణములోనే తెరవగలరు కానీ దానికంటే ముందు రాజ్యము చేసేవారైతే తయారవ్వాలి కదా. కావున ఇప్పటినుండి ఏర్పాట్లు చేసుకుంటేనే సమాప్తిని సమీపముగా తీసుకువస్తారు. బలహీనతకు సంబంధించిన ఏ విషయములోనైనా కారణము చెప్పకండి, నివారణ చేయండి. ఈ కారణము ఉంది కదా... అని అనకండి. బాప్ దాదా రోజంతటిలో పిల్లల ఆటనైతే చూస్తారు కదా, వారికి పిల్లలపై ప్రేమ ఉంది కదా, కావున పదే-పదే ఆటను చూస్తూ ఉంటారు. బాప్ దాదా యొక్క టి.వి. చాలా పెద్దది. ఒకే సమయములో మొత్తం ప్రపంచమంతా కనిపించగలదు, నలువైపులా ఉన్న పిల్లలు కనిపించగలరు. అది అమెరికా అయినా లేక గుడ్గావ్ అయినా, అంతా కనిపిస్తుంది. కావున బాప్ దాదా ఎన్నో ఆటలు చూస్తుంటారు. వాయిదా వేసే భాష చాలా బాగుంటుంది. ఈ కారణము ఉంది కదా, బాబా, నా తప్పు లేదు, ఇతను ఇలా చేసారు కదా అని అంటారు. అతను చేసారు సరే, కానీ మీరు దానిని పరిష్కారము చేసారా? కారణాన్ని కారణముగానే ఉండనిచ్చారా లేక కారణాన్ని నివారణలోకి మార్చారా? బాబా, మీ ఆశ ఏమిటి అని అందరూ అడుగుతుంటారు కదా. కావున బాప్ దాదా ఆశను వినిపిస్తున్నారు. బాప్ దాదాకు ఒకే ఆశ ఉంది, అదేమిటంటే - నివారణలు కనిపించాలి, కారణాలు సమాప్తమైపోవాలి, సమస్యలు సమాప్తమైపోవాలి, సమాధానమవుతూ ఉండాలి. ఇది వీలవుతుందా? వీలవుతుందా? మొదటి లైన్ వారు, ఇది వీలవుతుందా? తల అయితే ఊపండి. వెనుక ఉన్నవారు, వీలవుతుందా? (అందరూ చేతులెత్తారు) అచ్ఛా. కావున రేపు టి.వి. ఆన్ చేస్తే, ఎందుకంటే టి.వి.లోనైతే తప్పకుండా చూస్తారు కదా. కావున రేపు టి.వి. చూస్తే, విదేశాలలోనైనా లేక ఇండియాలోనైనా, చిన్న ఊరిలోనైనా, చాలా పెద్ద రాష్ట్రములోనైనా, ఎక్కడా కూడా కారణము కనిపించకుండా ఉంటుందా? పక్కానా? ఇందులో అవును అని అనడము లేదు? వీలవుతుందా? చేతులెత్తండి. చేతులు చాలా బాగా ఎత్తుతారు, బాప్ దాదా సంతోషిస్తారు. చేతులెత్తడము ఒక అద్భుతము. పిల్లలకు సంతోషపెట్టడమైతే వచ్చు ఎందుకంటే బాప్ దాదా చూస్తుంటారు - మీరు ఆలోచించండి, కోట్లాదిమందిలో కొందరు, ఆ కొందరిలో కూడా ఏ ఒక్కరో నిమిత్తము అయ్యారు, ఇప్పుడు ఈ పిల్లలు తప్ప ఇంకెవరు చేస్తారు? మీరే చేయాలి కదా! బాప్ దాదాకు పిల్లలైన మీపై ఆశలు ఉన్నాయి. మిగిలినవారు ఎవరైతే వస్తారో వారు మీ అవస్థను చూడగానే సరి అయిపోతారు, వారు శ్రమించవలసిన అవసరముండదు. మీరు తయారైపోండి సరిపోతుంది, ఎందుకంటే మీరందరూ జన్మ తీసుకోగానే బాబాతో ప్రతిజ్ఞ చేసారు - మీతోనే ఉంటాము, మీకు సహచరులుగా అవుతాము మరియు మీతోపాటు వస్తాము మరియు బ్రహ్మాబాబాతోపాటు రాజ్యములోకి వస్తాము. ఈ ప్రతిజ్ఞను చేసారు కదా? మరి తోడుగా ఉంటాము, మీతోపాటు వస్తాము అన్నప్పుడు మరి సేవలో కూడా సహచరులుగా ఉన్నట్లే కదా!

కావున ఇప్పుడు ఏం చేస్తారు? చేతులైతే చాలా బాగా ఎత్తారు, బాప్ దాదా సంతోషించారు, కానీ ఎప్పుడైనా ఏదైనా విషయము వస్తే ఈ రోజును, ఈ తారీఖును, ఈ సమయాన్ని గుర్తు చేసుకోండి, మేము ఏమని చేయి ఎత్తాము అన్నది గుర్తు చేసుకోండి, అప్పుడు సహాయము లభిస్తుంది. మీరు ఎలాగూ తయారవ్వవలసే ఉంటుంది. ఇప్పుడు కేవలం త్వరగా తయారవ్వండి. మేమే కల్పపూర్వము కూడా ఉన్నాము, ఇప్పుడు కూడా ఉన్నాము మరియు ప్రతి కల్పము మేమే తయారవ్వాలి అని మీరు అనుకుంటారు కదా! ఇది పక్కా కదా! లేక రెండు సంవత్సరాలు తయారై మూడవ సంవత్సరము జారిపోతారా! ఇలాగైతే జరగదు కదా? కావున సదా గుర్తుంచుకోండి - మేమే నిమిత్తులము, మేమే కోట్లలోని కొందరిలోని ఒక్కరము. కోట్లలో కొందరు అయితే వస్తారు కానీ మీరు ఆ కొందరిలో కూడా ఒక్కరు అయినవారు.

ఈ రోజు స్నేహపు రోజు, స్నేహము కోసం ఏది చేయాలన్నా కష్టముగా ఉండదు, అందుకే బాప్ దాదా ఈ రోజే అందరికీ స్మృతిని కలిగిస్తున్నారు. బ్రహ్మాబాబాపై పిల్లలకు ఎంతటి ప్రేమ ఉంది - ఇది చూసి శివబాబాకు చాలా సంతోషము కలుగుతుంది. నలువైపులా చూసారు - 7 రోజుల విద్యార్థి అయినా లేక 70 సంవత్సరాల వారైనా సరే, 70 సంవత్సరాల వారైనా మరియు 7 రోజుల వారైనా, ఈ రోజున అందరూ ప్రేమలో ఇమిడి ఉన్నారు. కావున శివబాబా కూడా బ్రహ్మాబాబాపై పిల్లలకు ఉన్న ప్రేమను చూసి హర్షిస్తున్నారు.

నేటి ఈ రోజుకు సంబంధించిన ఇతర సమాచారాలు వినిపించాలా. ఈ రోజున ఎడ్వాన్స్ పార్టీ కూడా బాప్ దాదా వద్ద ఇమర్జ్ అవుతారు. మీరు బాబాతోపాటు ముక్తిధామము యొక్క ద్వారాలను ఎప్పుడు తెరుస్తారు అని ఎడ్వాన్స్ పార్టీ కూడా మిమ్మల్ని తలుచుకుంటున్నారు! ఈ రోజు మొత్తం ఎడ్వాన్స్ పార్టీవారు అందరూ బాప్ దాదాతో ఇదే అంటున్నారు - మాకు తారీఖు చెప్పండి. మరి ఏం జవాబు ఇవ్వాలి? ఏం జవాబు ఇవ్వాలో చెప్పండి? జవాబు ఇవ్వడములో ఎవరు చురుకైనవారు? బాప్ దాదా అయితే - తొందరలో తొందరగా అయిపోతుంది అని ఇదే జవాబు చెప్తారు. కానీ ఇందులో బాబాకు పిల్లలైన మీ యొక్క సహయోగము కావాలి. అందరూ బాబాతోపాటు వస్తారు కదా! బాబాతోపాటు వస్తారా లేక ఆగి-ఆగి వస్తారా? బాబాతోపాటు వచ్చేవారే కదా! బాబాతోపాటు రావడం ఇష్టమే కదా? మరి దాని కోసం సమానముగా అవ్వవలసి ఉంటుంది. ఒకవేళ బాబాతోపాటు వెళ్ళాలంటే మరి సమానముగా అవ్వవలసే ఉంటుంది కదా! నానుడి ఏముంది? చేతిలో చేయి ఉండాలి, తోడులో తోడు ఉండాలి. మరి చేతిలో చేయి అనగా సమానము. మరి చెప్పండి దాదీలు చెప్పండి, ఏర్పాట్లు అయిపోతాయా? దాదీలు చెప్పండి. దాదీలు చేతులెత్తండి, దాదాలు చేతులెత్తండి. మిమ్మల్ని పెద్ద దాదాలు అని అంటారు కదా. కావున దాదీలు, దాదాలు చెప్పండి, ఏదైనా తారీఖు ఉందా? (ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు). ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు అని అంటే దాని అర్థమేమిటి? ఇప్పుడు సిద్ధముగా ఉన్నారనే కదా! జవాబైతే బాగా ఇచ్చారు. దాదీలు? పూర్తవ్వవలసిందే. చిన్న-పెద్ద ప్రతి ఒక్కరూ ఇందులో మీది బాధ్యతగా భావించాలి. ఇందులో చిన్నగా అవ్వకూడదు. 7 రోజుల బిడ్డది కూడా బాధ్యత ఉంది ఎందుకంటే కలిసి వెళ్ళాలి కదా. బాబా ఒక్కరే వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ బాబా అలా వెళ్ళలేరు, మీరు బాబాతోపాటు వెళ్ళాలి. ప్రతిజ్ఞ అనేది బాబాది కూడా ఉంది మరియు పిల్లలైన మీది కూడా ఉంది. మరి ప్రతిజ్ఞనైతే నిలబెట్టుకోవాలి కదా! నిలబెట్టుకోవాలి కదా? అచ్ఛా.

నలువైపుల నుండి ఉత్తరాలు, స్మృతిపత్రాలు, ఈ-మెయిళ్ళు, ఫోన్లు, నలువైపుల నుండి చాలా-చాలా వచ్చాయి, ఇక్కడకు మధుబన్ కు కూడా వచ్చాయి, అలాగే వతనానికి కూడా చేరుకున్నాయి. ఈ రోజు బంధనములో ఉన్న మాతలెవరైతే ఉన్నారో, వారి స్నేహభరితమైన మనసు యొక్క ప్రియస్మృతులు బాప్ దాదా వద్దకు చేరుకున్నాయి. బాప్ దాదా ఇటువంటి స్నేహీ పిల్లలను ఎంతగానో గుర్తు కూడా చేసుకుంటారు మరియు ఆశీర్వాదాలను కూడా ఇస్తారు. అచ్ఛా!

నలువైపులా ఉన్న స్నేహీ పిల్లలకు, లవ్లీ మరియు లవలీనులైన పిల్లలిరువురికీ, సదా బాబా యొక్క శ్రీమతమనుసారముగా ప్రతి అడుగులోనూ పదమాలను జమ చేసుకునే జ్ఞాన సంపన్నులైన, శక్తి సంపన్నులైన పిల్లలకు, సదా స్నేహీలు కూడా మరియు స్వమానధారులు కూడా, అలాగే సమ్మానధారులు కూడా, ఈ విధంగా సదా బాబా శ్రీమతాన్ని పాటించే విజయీ పిల్లలకు, సదా బాబా యొక్క ప్రతి అడుగులో అడుగులు వేసే సహజయోగీ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-
లైన్ క్లియర్ గా ఉండడము యొక్క ఆధారముపై నంబర్ వన్ లో పాస్ అయ్యే ఎవర్రెడీ భవ

సదా ఎవర్రెడీగా ఉండడము - ఇదే బ్రాహ్మణ జీవితము యొక్క విశేషత. మీ బుద్ధి లైన్ ఎంత క్లియర్ గా (స్పష్టముగా) ఉండాలంటే, బాబా నుండి ఏ సూచన లభించినా దానికి ఎవర్రెడీగా ఉండాలి. ఆ సమయములో ఏమీ ఆలోచించవలసిన అవసరము ఉండకూడదు. అకస్మాత్తుగా ఒకే ప్రశ్న వస్తుంది, ఒకే ఆజ్ఞ వస్తుంది - ఇక్కడే కూర్చుండిపోండి, ఇక్కడికి చేరుకోండి అని అప్పుడు ఏ విషయము లేక సంబంధము గుర్తు రాకూడదు, అప్పుడు నంబర్ వన్ లో పాస్ అవ్వగలరు. కానీ ఈ పరీక్షలన్నీ అకస్మాత్తుగా వస్తాయి - అందుకే ఎవర్రెడీగా అవ్వండి.

స్లోగన్:-
మనసును శక్తిశాలిగా చేసుకునేందుకు ఆత్మకు ఈశ్వరీయ స్మృతి మరియు శక్తి యొక్క భోజనాన్ని ఇవ్వండి.

అవ్యక్త ప్రేరణలు- ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి

కొంతమంది పిల్లలు ఏమంటారంటే - యోగములో కూర్చున్నప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు బదులుగా సేవ గుర్తుకొస్తుంది అని. కానీ అలా జరగకూడదు, ఎందుకంటే చివరి సమయములో ఒకవేళ అశరీరిగా అయ్యేందుకు బదులుగా సేవ యొక్క సంకల్పాలు వచ్చినా సరే, క్షణము యొక్క పేపర్ లో ఫెయిల్ అయిపోతారు. ఆ సమయములో బాబా తప్ప, నిరాకారీ, నిర్వికారీ, నిరహంకారీ స్థితి తప్ప ఇంకేమీ గుర్తుండకూడదు. సేవలో ఎంతైనా సాకారములోకి వచ్చేస్తారు, అందుకే ఏ సమయములో ఏ స్థితి కావాలంటే ఆ స్థితి ఉండాలి, లేకపోతే మోసపోతారు.