14-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ప్రాణాలను రక్షించే ప్రాణేశ్వరుడైన తండ్రి పిల్లలైన మీకు జ్ఞానము యొక్క మధురమైన మురళిని వినిపించి ప్రాణాలను రక్షించేందుకు వచ్చారు’’

ప్రశ్న:-
ఏ నిశ్చయము అదృష్టవంతులైన పిల్లలకు మాత్రమే ఉంటుంది?

జవాబు:-
మా శ్రేష్ఠ అదృష్టాన్ని తయారుచేసేందుకు స్వయంగా తండ్రి వచ్చారు. తండ్రి నుండి మనకు భక్తి ఫలము లభిస్తుంది. మాయ ఏ రెక్కలనైతే తెంచివేసిందో, ఆ రెక్కలను ఇచ్చేందుకు, తమతో పాటు తిరిగి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. ఈ నిశ్చయము అదృష్టవంతులైన పిల్లలకు మాత్రమే ఉంటుంది.

పాట:-
ఈ రోజు ఉదయాన్నే ఎవరు వచ్చారు...

ఓంశాంతి
ఉదయాన్నే వచ్చి మురళిని ఎవరు మ్రోగిస్తారు? ప్రపంచమైతే పూర్తిగా ఘోర అంధకారములో ఉంది. జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, ప్రాణేశ్వరుడైన తండ్రి నుండి ఇప్పుడు మీరు మురళిని వింటున్నారు. వారు ప్రాణాలను రక్షించే ఈశ్వరుడు. ఓ ఈశ్వరా, ఈ దుఃఖము నుండి రక్షించండి అని అంటారు కదా. అక్కడ వారు హద్దు సహాయాన్ని కోరుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన సహాయము లభిస్తుంది ఎందుకంటే వీరు అనంతమైన తండ్రి కదా. ఆత్మ కూడా గుప్తము, తండ్రి కూడా గుప్తమని మీకు తెలుసు. పిల్లల శరీరము ప్రత్యక్షముగా ఉంది, అలాగే తండ్రి శరీరము కూడా ప్రత్యక్షముగా ఉంది. ఆత్మ గుప్తముగా ఉంది, తండ్రి కూడా గుప్తముగా ఉన్నారు. తండ్రి మనకు అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నారని మీకు తెలుసు. వారు ఇచ్చేది శ్రీమతము. సర్వ శాస్త్రమయి శిరోమణి గీత ప్రసిద్ధమైనది, అందులో కేవలం పేరు మార్చేశారు. శ్రీమతమనేది భగవానువాచ అని ఇప్పుడు మీకు తెలుసు. భ్రష్టాచారులను శ్రేష్ఠాచారులుగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమేనని, వారే నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తారని కూడా అర్థం చేసుకున్నారు. కథ కూడా సత్యనారాయణునిది. అమరకథ అనేది అమరపురికి యజమానులుగా చేసేటువంటి కథ లేక నరుని నుండి నారాయణునిగా తయారుచేసేటువంటి కథ అని అంటూ ఉంటారు. విషయము ఒక్కటే. ఇది మృత్యులోకము. భారత్ యే అమరపురిగా ఉండేది - ఇది ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ కూడా అమర బాబా భారతవాసులకు వినిపించారు. ఒక్క పార్వతి లేక ఒక్క ద్రౌపది మాత్రమే లేరు. ఇది అనేకమంది పిల్లలు వింటున్నారు. శివబాబా, బ్రహ్మా ద్వారా వినిపిస్తారు. తండ్రి అంటారు - నేను బ్రహ్మా ద్వారా మధురాతి మధురమైన ఆత్మలకు అర్థం చేయిస్తాను. తండ్రి పిల్లలకు అర్థం చేయించారు, ఆత్మాభిమానులుగా తప్పకుండా అవ్వాలి. తండ్రి మాత్రమే అలా తయారుచేయగలరు. ఆత్మ జ్ఞానము ఉన్న మనుష్యులు ప్రపంచములో ఒక్కరు కూడా లేరు. ఆత్మ జ్ఞానమే లేదంటే ఇక పరమపిత పరమాత్ముని జ్ఞానము ఎలా ఉంటుంది. ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. మొత్తం ప్రపంచమంతా ఎంత పెద్ద పొరపాటులో చిక్కుకుని ఉంది. ఈ సమయములో మనుష్యుల బుద్ధి దేనికి పనికి రాకుండా ఉంది. స్వయం యొక్క వినాశనము కోసమే ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలైన మీకు ఇది కొత్త విషయమేమీ కాదు. డ్రామానుసారముగా వారి పాత్ర కూడా ఉందని, వారు డ్రామా యొక్క బంధనములో బంధించబడి ఉన్నారని మీకు తెలుసు.

ఈ రోజుల్లో ప్రపంచములో చాలా హంగామా జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు వినాశ కాలే ప్రీతి బుద్ధి కలవారిగా ఉన్నారు, ఎవరికైతే తండ్రి పట్ల విపరీత బుద్ధి ఉందో, వారి కొరకు వినశ్యంతి అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రపంచము మారనున్నది. తప్పకుండా మహాభారత యుద్ధము జరిగిందని, తండ్రి రాజయోగము నేర్పించారని కూడా మీకు తెలుసు. శాస్త్రాలలో మొత్తం వినాశనమైపోతుందని వ్రాసేసారు. కానీ మొత్తమంతా వినాశనమవ్వదు, అలా జరిగితే ప్రళయము సంభవించాలి, మనుష్యులెవ్వరూ ఉండకూడదు, కేవలం 5 తత్వాలే మిగిలి ఉండాలి. కానీ అలా జరగదు. ప్రళయము జరిగితే, ఇక మనుష్యులెక్కడ నుండి వస్తారు. కృష్ణుడు బొటనువేలును నోటిలో పెట్టుకుని చప్పరిస్తూ సాగరములో రావి ఆకుపై వచ్చినట్లుగా చూపిస్తారు. ఒక చిన్న బాలుడు ఈ విధముగా ఎలా రాగలడు. శాస్త్రాలలో ఎలాంటి విషయాలను వ్రాశారు అంటే, ఇక అడగకండి. ఇప్పుడు కుమారీలైన మీ ద్వారా ఈ విద్వాంసులు, భీష్మ పితామహులు మొదలైనవారికి కూడా జ్ఞాన బాణాలు తగిలేది ఉంది. వారు కూడా మున్ముందు వస్తారు. ఎంతెంతగా మీరు సేవలో తీవ్రతను పెంచుతారో, తండ్రి పరిచయాన్ని అందరికీ ఇస్తూ ఉంటారో, అంతగా మీ ప్రభావము పడుతుంది. అయితే, విఘ్నాలు కూడా వస్తాయి. ఈ జ్ఞాన యజ్ఞములో ఆసురీ సాంప్రదాయము వారి విఘ్నాలు చాలా కలుగుతూ ఉంటాయని అంటూ ఉంటారు. మీరు నేర్పించలేరు. జ్ఞానాన్ని మరియు యోగాన్ని తండ్రియే నేర్పిస్తున్నారు. సద్గతిదాత ఒక్క తండ్రే. వారే పతితులను పావనముగా తయారుచేస్తారు, అంటే తప్పకుండా పతితులకే జ్ఞానాన్ని ఇస్తారు కదా. తండ్రిని ఎప్పుడైనా సర్వవ్యాపి అని అనుకోవచ్చా! మనం పారస బుద్ధి కలవారిగా అయ్యి పారసనాథులుగా అవుతామని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. మనుష్యులు ఎన్ని మందిరాలను తయారుచేసారు. కానీ వారెవరు, ఏం చేసి వెళ్ళారు, ఈ అర్థాన్ని తెలుసుకోరు. పారసనాథుని మందిరము కూడా ఉంది. భారత్ పారసపురిగా ఉండేది. బంగారము, వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. ఇది నిన్నటి విషయమే. వారు కేవలం సత్యయుగానికే లక్షల సంవత్సరాలని అనేస్తారు. కానీ మొత్తం డ్రామా అంతా 5 వేల సంవత్సరాలదని తండ్రి అంటారు, అందుకే - నేడు భారత్ ఎలా ఉంది, నిన్నటి భారత్ ఎలా ఉండేది అని అంటూ ఉంటారు. లక్షల సంవత్సరాల విషయమైతే ఎవ్వరికీ గుర్తుండదు. పిల్లలైన మీకు ఇప్పుడు స్మృతి కలిగింది - ఇది 5 వేల సంవత్సరాల విషయమని మీకు తెలుసు. బాబా అంటారు - యోగములో కూర్చోండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది జ్ఞానము అయినట్లు కదా. వారు హఠయోగులు. ఒక కాలుపై మరొక కాలు పెట్టుకుని కూర్చుంటారు. ఏమేమి చేస్తారు. మాతలైన మీరైతే అలా చేయలేరు. అలా కూర్చోలేరు కూడా. భక్తి మార్గపు చిత్రాలు ఎన్ని ఉన్నాయి. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, మీరు ఇవేవీ చేయాల్సిన అవసరము లేదు. స్కూల్లో విద్యార్థులు నియమానుసారముగా కూర్చుంటారు. ఇక్కడ తండ్రి అది కూడా చెప్పరు. ఎలా కావాలంటే అలా కూర్చోండి, కూర్చుని అలసిపోతే, సరే, చారబడండి. బాబా దేనికీ వద్దని చెప్పరు. ఇది చాలా సహజముగా అర్థం చేసుకునే విషయము, ఇందులో కష్టతరమైన విషయమేమీ లేదు. ఎంత అనారోగ్యముగా ఉన్నా సరే, వింటూ-వింటూనే, శివబాబా స్మృతిలో ఉంటూ-ఉంటూ ప్రాణాలు తనువు నుండి వెళ్ళిపోవాలి. గంగా జలము నోటిలో ఉండగా... తనువు నుండి ప్రాణాలు వెళ్ళిపోవాలని అంటూ ఉంటారు కదా. అవన్నీ భక్తి మార్గానికి చెందిన విషయాలు. వాస్తవానికి ఇవి జ్ఞానామృతానికి సంబంధించిన విషయాలు. నిజంగా ఇలానే తనువు నుండి ప్రాణాలు వెళ్ళిపోవాలని మీకు తెలుసు.

పిల్లలైన మీరు మీ ఇంటి నుండి ఇక్కడకు వచ్చేటప్పుడు నన్ను వదిలేసి వస్తారు. తండ్రి అంటారు, నేనైతే పిల్లలైన మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను. నేను పిల్లలైన మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళేందుకే వచ్చాను. మీకు మీ ఇంటి గురించి తెలియదు, అలానే ఆత్మ గురించి తెలియదు. మాయ పూర్తిగా రెక్కలను తెంచేసింది, అందుకే ఆత్మ ఎగరలేదు, ఎందుకంటే తమోప్రధానముగా ఉంది. ఎప్పటివరకైతే సతోప్రధానముగా అవ్వదో, అప్పటివరకు ఆత్మ శాంతిధామానికి ఎలా వెళ్ళగలదు. డ్రామా ప్లాన్ అనుసారముగా అందరూ తమోప్రధానముగా అవ్వాల్సిందేనని కూడా మీకు తెలుసు. ఈ సమయములో మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ ఎవరికీ సతోప్రధాన అవస్థ ఉండదు. ఆత్మ ఇక్కడ పవిత్రముగా అయినట్లయితే, ఇక ఇక్కడ నిలవదు, వెంటనే వెళ్ళిపోతుంది. అందరూ ముక్తి కోసమే భక్తి చేస్తారు, కానీ ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. నియమము అలా లేదు. ధారణ చేసేందుకని తండ్రి కూర్చుని ఈ రహస్యాలన్నింటినీ అర్థం చేయిస్తారు. అయినా కూడా, ముఖ్యమైన విషయము - తండ్రిని స్మృతి చేయడము, స్వదర్శన చక్రధారులుగా అవ్వడము. బీజాన్ని స్మృతి చేయడముతో మొత్తం వృక్షమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. మీరు ఒక్క క్షణములో అంతా తెలుసుకుంటారు. మనుష్య సృష్టికి బీజరూపుడు అందరికీ తండ్రి అయిన వారొక్కరే అని ప్రపంచములోని వారెవరికీ తెలియదు. శ్రీకృష్ణుడు భగవంతుడు కాదు. శ్రీకృష్ణుడినే శ్యామసుందరుడని అంటారు. అయితే, ఏదో తక్షక సర్పము కాటేసిన కారణముగా నల్లగా అయ్యారని కాదు. కామ చితిపై కూర్చోవడముతో మనుష్యులు నల్లగా అవుతారు. రాముడిని కూడా నల్లగా చూపిస్తారు, మరి అతడిని ఎవరు కాటేసారు! ఏమీ అర్థం చేసుకోరు. కానీ, ఎవరికైనా అదృష్టములో ఉంటే, నిశ్చయముంటే, వారు తప్పకుండా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. నిశ్చయము లేకపోతే ఎప్పటికీ అర్థం చేసుకోరు. అదృష్టములో లేకపోతే పురుషార్థము కూడా ఏం చేస్తారు. అదృష్టములో లేకపోతే, వారికి ఏమీ అర్థం కావడము లేదు అన్నట్లుగా కూర్చుంటారు. తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు అన్న నిశ్చయము కూడా ఉండదు. కొత్తవారు ఎవరైనా వైద్య కళాశాలలోకి వెళ్ళి కూర్చుంటే ఏమి అర్థం చేసుకుంటారు, ఏమీ అర్థం కాదు. ఇక్కడికి కూడా అలాగే వచ్చి కూర్చుంటారు. ఈ అవినాశీ జ్ఞానము వినాశనమవ్వదు. మరి అలాంటి వారు వచ్చి ఏం చేస్తారు. రాజధాని స్థాపనవుతుంది అన్నప్పుడు నౌకర్లు, ప్రజలు, ప్రజలకు కూడా నౌకర్లు మొదలైనవారంతా కావాలి కదా. మున్ముందు ఎంతోకొంత చదువుకునేందుకు ప్రయత్నిస్తారు కానీ కష్టమవుతుంది, ఎందుకంటే ఆ సమయములో చాలా హంగామా ఉంటుంది. రోజురోజుకు తుఫాన్లు పెరుగుతూ ఉంటాయి. ఇన్ని సెంటర్లు ఉన్నాయి, కొంతమంది వచ్చి మంచి రీతిలో అర్థం చేసుకుంటారు కూడా. బ్రహ్మా ద్వారా స్థాపన అని కూడా వ్రాయబడి ఉంది. వినాశనము కూడా ఎదురుగా నిలబడి ఉంది. వినాశనమైతే అవ్వాల్సిందే. జనాభా సంఖ్య తగ్గాలని అంటూ ఉంటారు. కానీ వృక్షము యొక్క వృద్ధి జరిగేదే ఉంది. తండ్రి ఉన్నప్పుడు, అన్ని ధర్మాల ఆత్మలకు ఇక్కడికి రావాల్సే ఉంటుంది. వెళ్ళే సమయము వచ్చినప్పుడు, ఆత్మలు రావడము ఆగిపోతుంది. ఇప్పుడైతే అందరూ రావాల్సిందే, కానీ ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోరు. భక్తుల రక్షకుడు భగవంతుడని అంటారు, అంటే తప్పకుండా భక్తులకు ఏదో ఆపద వస్తుందని అర్థం. రావణ రాజ్యములో అందరూ పూర్తిగా పాపాత్ములుగా అయిపోయారు. రావణ రాజ్యము కలియుగ అంతిమములో ఉంది, రామ రాజ్యము సత్యయుగ ఆదిలో ఉంది. ఈ సమయములో అందరూ ఆసురీ రావణ సాంప్రదాయులు కదా. ఫలానావారు స్వర్గవాసులయ్యారని అంటారు, అంటే దాని అర్థం ఇది నరకమనే కదా. స్వర్గవాసులు అయ్యారంటే మంచిదే. మరి ఇక్కడ ఏమై ఉన్నట్లు, తప్పకుండా నరకవాసులుగా ఉండేవారు. తాము నరకవాసులమని కూడా అర్థం చేసుకోరు. తండ్రియే వచ్చి స్వర్గవాసులుగా తయారుచేస్తారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అని కూడా అంటూ ఉంటారు. వారే వచ్చి హెవెన్ ను (స్వర్గాన్ని) స్థాపన చేస్తారు. పతిత-పావన సీతారామ, మేము పతితులము, పావనముగా చేసేవారు మీరు అని అందరూ పాడుతూ ఉంటారు. వారంతా భక్తి మార్గానికి చెందిన సీతలు. తండ్రి రాముడు. ఎవరికైనా ఇలా నేరుగా చెప్తే అంగీకరించరు. రాముడిని పిలుస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి మూడవ నేత్రాన్ని ఇచ్చారు. మీరు వేరొక ప్రపంచానికి చెందినవారిగా అయిపోయారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు అందరూ తమోప్రధానముగా కూడా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది, అప్పుడే కదా తండ్రి వచ్చి సతోప్రధానముగా తయారుచేస్తారు. తండ్రి కూర్చుని ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు - పిల్లలైన మీరు ఏదైనా సేవ చేస్తున్నా కూడా, కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి - తండ్రిని స్మృతి చేయండి. సతోప్రధానముగా అయ్యే మార్గాన్ని ఇంకెవ్వరూ చెప్పలేరు. సర్వుల ఆత్మిక సర్జన్ ఒక్కరే. వారే వచ్చి ఆత్మలకు ఇంజెక్షన్ వేస్తారు, ఎందుకంటే ఆత్మయే తమోప్రధానముగా అయ్యింది. తండ్రిని అవినాశీ సర్జన్ అని అంటారు. ఆత్మ అవినాశీ, తండ్రి అయిన పరమాత్మ కూడా అవినాశీ. ఇప్పుడు ఆత్మ సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయ్యింది, ఆత్మకు ఇంజెక్షన్ కావాలి. తండ్రి అంటారు - పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి మరియు మీ తండ్రిని స్మృతి చేయండి. బుద్ధియోగాన్ని పైన జోడించినట్లయితే స్వీట్ హోమ్ కు వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం మన స్వీట్, సైలెన్స్ హోమ్ కు వెళ్ళాలని మీ బుద్ధిలో ఉంది. అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానము మరియు యోగముతో బుద్ధిని పారసముగా తయారుచేసుకోవాలి. ఎంత అనారోగ్యముగా ఉన్నా సరే, ఎంత కష్టమున్నా సరే, ఆ సమయములో కూడా ఒక్క తండ్రి స్మృతి ఉండాలి.

2. తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారుచేసుకునేందుకు పూర్తిగా నిశ్చయబుద్ధి కలవారిగా అవ్వాలి. బుద్ధియోగాన్ని తమ స్వీట్ సైలెన్స్ హోమ్ తో జోడించాలి.

వరదానము:-
త్రికాలదర్శులుగా అయి వ్యర్థ సంకల్పాలను మరియు సంస్కారాలను పరివర్తన చేసే విశ్వ కళ్యాణకారి భవ

ఎప్పుడైతే మాస్టర్ త్రికాలదర్శులుగా అయి సంకల్పాలను కర్మలలోకి తీసుకువస్తారో, అప్పుడు ఏ కర్మ వ్యర్థమవ్వదు. ఈ వ్యర్థాన్ని పరివర్తన చేసి సమర్థ సంకల్పాలను మరియు సమర్థ కార్యాలను చేయడాన్నే సంపూర్ణ స్థితి అని అంటారు. కేవలం తమ వ్యర్థ సంకల్పాలను లేదా వికర్మలను భస్మం చేసుకోవడమే కాదు, శక్తి రూపముగా అయి మొత్తం విశ్వము యొక్క వికర్మల భారాన్ని తేలికగా చేసేందుకు మరియు అనేకాత్మల వ్యర్థ సంకల్పాలను నశింపజేసేందుకు మెషినరీని వేగవంతము చేయండి, అప్పుడు విశ్వ కళ్యాణకారి అని అంటారు.

స్లోగన్:-
నష్టోమోహులుగా అవ్వాలంటే సేవార్థము స్నేహాన్ని ఉంచండి, అంతేకానీ స్వార్థముతో కాదు.

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు - ‘‘జ్ఞానము మరియు యోగము మధ్యన వ్యత్యాసము’’

యోగము మరియు జ్ఞానము, ఇవి రెండు పదాలు, పరమాత్మ స్మృతిని యోగమని అంటారు. ఇంకెవరి స్మృతి విషయములోనూ యోగము అనే పదము రాదు. గురువులు ఏ యోగాలనైతే నేర్పిస్తారో, అవి కూడా పరమాత్ముని వైపు జోడించేవే, కానీ వారికి పరమాత్ముని గురించిన పూర్తి పరిచయము లేదు, అందుకే యోగము యొక్క పూర్తి సిద్ధి లభించదు. యోగము మరియు జ్ఞానము, ఇవి రెండూ బలాలు, ఈ రెండింటి పురుషార్థముతో మైట్ (శక్తి) లభిస్తుంది మరియు మనము వికర్మాజీతులుగా అయి శ్రేష్ఠ జీవితాన్ని తయారుచేసుకుంటాము. యోగము అనే పదాన్ని అయితే అందరూ ఉపయోగిస్తారు కానీ ఎవరితో యోగము జోడించబడుతుందో, ముందు వారి పరిచయము కావాలి. ఇప్పుడు పరమాత్మ పరిచయము కూడా మనకు పరమాత్మ ద్వారానే లభిస్తుంది, ఆ పరిచయముతో యోగము జోడించడము ద్వారా పూర్తి సిద్ధి లభిస్తుంది. యోగముతో - మనము గత వికర్మల భారాన్ని భస్మము చేసుకుంటాము మరియు జ్ఞానముతో - మున్ముందు మనం ఎటువంటి కర్మలను చేయాలి మరియు ఎందుకు చేయాలి అనేది తెలుస్తుంది. జీవితానికి మూలం సంస్కారాలు, ఆత్మ కూడా అనాది సంస్కారాలతో తయారై ఉంది, కానీ కర్మల ద్వారా ఆ సంస్కారాలు మారుతూ ఉంటాయి. యోగము మరియు జ్ఞానముతో ఆత్మలో శ్రేష్ఠత వస్తుంది మరియు జీవితములో బలం వస్తుంది, కానీ ఈ రెండు పరమాత్మ నుండి లభిస్తాయి. కర్మ బంధనాల నుండి విముక్తి చెందే మార్గము కూడా మనకు పరమాత్మ నుండి ప్రాప్తిస్తుంది. మనము వికర్మల ద్వారా ఏ కర్మబంధనాలైతే తయారుచేసుకున్నామో, వాటి నుండి విముక్తులుగా అవ్వాలన్నా మరియు మున్ముందు మన కర్మలు వికర్మలుగా అవ్వకుండా ఉండాలన్నా, ఈ రెండు బలాలను పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. యోగము మరియు జ్ఞానము, ఈ రెండింటినీ పరమాత్మయే తీసుకువస్తారు. యోగాగ్నితో మనం చేసిన వికర్మలను భస్మం చేయిస్తారు మరియు జ్ఞానముతో భవిష్యత్తు కోసం శ్రేష్ఠ కర్మలను నేర్పిస్తారు. దీని ద్వారా కర్మ, అకర్మగా అవుతుంది, అందుకే - ఈ కర్మ-అకర్మ-వికర్మల గతి చాలా లోతైనది అని పరమాత్మ చెప్పారు. ఇప్పుడు ఆత్మలమైన మనకు డైరెక్ట్ పరమాత్ముని బలం కావాలి. శాస్త్రాల ద్వారా ఈ యోగము మరియు జ్ఞానము యొక్క బలాలు లభించవు, కానీ బలశాలి అయిన ఆ సర్వశక్తివంతుని ద్వారానే బలం లభిస్తుంది. ఇప్పుడు మనం మన జీవితము యొక్క మూలాన్ని (సంస్కారాలను) ఎలా తయారుచేసుకోవాలంటే, వాటితో జీవితములో సుఖము లభించాలి. కనుక పరమాత్మ వచ్చి జీవితము యొక్క మూలంలో శుద్ధ సంస్కారాల బీజాన్ని వేస్తారు, ఆ శుద్ధ సంస్కారాల ఆధారముగా మనం అర్ధకల్పము జీవన్ముక్తులుగా అవుతాము. అచ్ఛా - ఓంశాంతి.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి

పూర్వజ, పూజ్యాత్మలైన మిమ్మల్ని అనేకమంది ఆత్మలు శాంతి దేవా, శక్తి దేవా అంటూ తలచుకుంటున్నారు. ఇటువంటి సమయములో - ఓ శాంతి దేవ ఆత్మలారా, మాస్టర్ శాంతి సాగరులారా, మాస్టర్ శాంతి సూర్యులారా - మీ శాంతి కిరణాలను, శాంతి అలలను దాత పిల్లలుగా ఇచ్చేవారిగా అయి అందరికీ ఇస్తూ ఉండండి. ఇటువంటి సేవను చేసే విశేష అభ్యాసకులుగా అవ్వండి.