16-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 02.03.2011


‘‘మనసా ద్వారా ప్రకృతిని సతోగుణీగా చేసే సేవను చేయండి, శుభ భావన, శుభ కామనలను ఉంచుతూ సంస్కార మిలనము యొక్క రాస్ ను చేయండి’’

ఈ రోజు హోలియెస్ట్ (అత్యంత పవిత్రమైన) తండ్రి తమ పిల్లలతో హోలీని జరుపుకోవడానికి వచ్చారు. మీరందరూ కూడా హోలీని జరుపుకోవడానికి వచ్చారు. నలువైపులా దూరంగా కూర్చుని ఉన్న పిల్లలు కూడా హోలీ జరుపుకోవడానికి కూర్చున్నారు. మీరందరూ ఏ రంగు యొక్క హోలీని జరుపుకోవడానికి వచ్చారు! అన్నింటికన్నా శ్రేష్ఠమైన రంగు పరమాత్ముని సాంగత్యపు రంగు అని మీకు తెలుసు. ఈ రంగు సదా శ్రేష్ఠాతి శ్రేష్ఠముగా తయారుచేసేది. ఎలా అయితే బాబా ఉన్నతోన్నతమైనవారో అలాగే ఈ పరమాత్ముని సాంగత్యము ఉన్నతోన్నతముగా తయారుచేసేది. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకములో మెరుస్తున్న భాగ్య సితారను చూస్తున్నారు. ఈ భాగ్య సితారను పూర్తి కల్పములో భాగ్యశాలి పిల్లలైన మీరు తప్ప మరెవ్వరూ పొందలేరు. ఆ శ్రేష్ఠ భాగ్యమేమిటంటే పిల్లలైన మీరే డబుల్ పవిత్రులుగా అనగా హోలీగా అవుతారు. ఆ మాటకొస్తే ధర్మాత్ములు కూడా ఉన్నారు కానీ వారు శరీరము ద్వారా పవిత్రముగా అవ్వరు. బ్రాహ్మణ ఆత్మలైన మీకు భవిష్యత్తులో ఆత్మ కూడా పవిత్రముగా అవుతుంది మరియు శరీరము కూడా పవిత్రముగా అవుతుంది. ఇటువంటి డబుల్ పవిత్రతకు గుర్తుగా డబుల్ కిరీటము ప్రాప్తిస్తుంది. పూర్తి కల్పములో మీరు సంగమయుగములో బాబా సాంగత్యపు రంగుతో డబుల్ పవిత్రులుగా, డబుల్ కిరీటధారులుగా అవుతారు. సంగమయుగములోని పరమాత్ముని సాంగత్యము డబుల్ పవిత్రులుగా చేస్తుంది. కనుక మీరు పవిత్రమైన బాబాతోపాటు ఉండటము ద్వారా, బాబాను కంబైండుగా చేసుకోవడము ద్వారా డబుల్ పవిత్రులుగా అవుతారు. సదా హృదయములో బాబా సాంగత్యము ఉంటుంది. ఈ రంగు ఎంత శ్రేష్ఠమైనది, అందుకే ఇది ఎంతో శ్రేష్ఠముగా తయారుచేస్తుంది. మనుష్యులైతే స్థూల రంగులతో హోలీని జరుపుకుంటారు కానీ మీరు బాబా సాంగత్యపు రంగుతో పవిత్రముగా అవుతారు, అది కూడా డబుల్ పవిత్రముగా అవుతారు. కావున మీ హోలీ ప్రపంచానికి భిన్నముగా ఉంది, పరమాత్మునికి ప్రియముగా ఉంది. మరి నషా ఉంటుంది కదా, మా హోలీ ప్రభు సాంగత్యపు రంగు కారణముగా అర్ధకల్పము ఎంతటి పవిత్రులుగా చేస్తుందంటే ఇప్పటివరకు కూడా మీ చిత్రాలు నియమపూర్వకముగా పూజింపబడుతున్నాయి. మరెవ్వరి చిత్రాలు ఇలా ప్రేమపూర్వకముగా పూజింపబడవు. మీరు స్వయముగా మీ చిత్రాలను చూస్తున్నారు. ఇతరులు కూడా పూజింపబడతారు కానీ వారికి ఇంత సమయము మరియు ఇంత విధిపూర్వకముగా పూజ జరగదు. మీరు సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఉంటారు. ఉంటారు కదా! ఉల్లాస-ఉత్సాహాలలో ఉంటారా? చేతులెత్తండి. ఉంటారా, అప్పుడప్పుడూ ఉంటారా లేక సదా ఉంటారా? మేము సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఉంటున్నాము కూడా మరియు ఇతరులకు కూడా ఉల్లాస-ఉత్సాహాలను ఇప్పిస్తున్నాము అనేవారు చేతులెత్తండి. అప్పుడప్పుడూ కాదు, సదా. సదా అన్న పదాన్ని అండర్ లైన్ చేస్తున్నారు కదా! కానీ మీ స్మృతిచిహ్నము, మీ స్థితి ఎలా ఉందో దానికి స్మృతిచిహ్నముగా మీ భక్తులు ఉత్సవ రూపములో జరుపుకుంటున్నారు. మీరు ప్రభువు యొక్క సాంగత్యపు రంగును వేసుకున్నారు కనుక వారు కూడా రంగులు వేసుకుంటున్నారు, కానీ దేహాభిమానము ఉంది కదా కావున స్థూల రంగును వేసుకుంటున్నారు. ఆ రంగులో ఖర్చు కూడా ఉంటుంది మరియు రిజల్టు కూడా కొంత మంచిగా ఉంటుంది, కొంత మంచిగా ఉండదు, ఇలా జరుపుకుంటున్నారు. కానీ మీ ఉత్సాహానికి స్మృతిచిహ్నముగా ఉత్సవాన్ని తప్పకుండా జరుపుకుంటున్నారు. మీరు పరమాత్మునికి చెందినవారిగా అవ్వడానికి ముందుగా మీలోని పాత సంస్కారాలను కాల్చివేస్తారు మరియు ఆ తర్వాత ప్రభువు యొక్క సాంగత్యపు రంగు అంటుకోవడముతో సదా జరుపుకుంటూనే ఉంటారు. వారు కూడా ముందు కాలుస్తారు, ఆ తర్వాత జరుపుకుంటారు. కానీ మీరు జరుపుకోవడానికి మరియు వారు జరుపుకోవడానికి రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారు దేహాభిమానులు, మీరు ఆత్మాభిమానులు. వారు దేహ భానములో, మీరు ఆత్మిక భానములో ఉన్నారు.

మీకు బాప్ దాదా ఇచ్చిన డైరెక్షన్ ఏమిటంటే, హోలీ అనగా గతం గతః (గతించిపోయిందేదో గతించిపోయింది). గతం గతః అని అంటారు కూడా, కానీ దాని అర్థాన్ని ప్రాక్టికల్ లోకి తీసుకురాలేరు. మీరందరూ హో లీ అనగా గతం గతః చేస్తుంటారు. చేస్తుంటారు కదా! లేక అప్పుడప్పుడూ చేస్తున్నారా? ఎందుకంటే గతాన్ని తలచుకోవడము వలన వ్యర్థ సంకల్పాలు చాలా నడుస్తాయి. సమయము కూడా వ్యర్థముగా పోతుంది. చాలా సమయము నుండి ఉన్న సంస్కారాలు వద్దన్నా కూడా వస్తూ ఉంటాయి, మరి ఈ సంగమయుగములోని ఒక్కొక్క నిమిషము ఒక్క జన్మలో 21 జన్మల ప్రారబ్ధాన్ని తయారుచేస్తుంది, అటువంటి ఒక్కొక్క సంకల్పము, ఒక్కొక్క నిమిషము ఎంతటి విలువైనది. వ్యర్థముగా పోయింది ఒక్క సెకండు కాదు, అనేక జన్మల ప్రారబ్ధములో తేడా వచ్చేస్తుంది. బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నారు, సంగమ సమయములో సమయాన్ని మరియు సంకల్పాలను ఎప్పుడూ కూడా వ్యర్థముగా పోనివ్వద్దు. ఒకవేళ సదా ప్రభువు యొక్క సాంగత్యపు రంగులో రంగరించబడి ఉన్నట్లయితే అనగా బాబాను సదా సహచరుడిగా చేసుకుని ఉన్నట్లయితే అప్పుడు సంగమయుగములోని ఒక్కొక్క సంకల్పాన్ని మరియు సమయాన్ని అనగా ఒక్కొక్క నిమిషాన్ని సఫలం చేసుకోగలుగుతారు. కనుక స్వయాన్ని చెక్ చేసుకోండి, ఒక్కొక్క నిమిషము, ఒక్కొక్క సంకల్పము సఫలమవుతున్నాయా? లేక వ్యర్థముగా కూడా పోతున్నాయా? ఎందుకంటే ఒక్క నిమిషము కాదు, 21 జన్మల కనెక్షన్ ప్రతి నిమిషము మరియు ప్రతి సంకల్పముతో ఉంది. అంతటి విలువ ఉంది. మరి మీ హృదయములో ఆలోచించండి - అంతటి విలువ సదా ఉంటుందా! ఈ సంగమ సమయము గురించి ఏమని చెప్తూ ఉంటారంటే - ‘‘ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు’’. ఇంతటి విలువ సదా స్మృతిలో ఉండాలి. మరి ఈ రోజు మీరందరూ హోలీని జరుపుకున్నారు అనగా సదా బాబా సాంగత్యపు రంగును వేసుకున్నారు. మరి మొత్తము రోజంతా చెక్ చేసుకున్నారా - బాబా రంగు రోజంతా అంటుకుని ఉందా? పరమాత్ముని సాంగత్యములోనే ఉన్నారా లేక ఇంకెక్కడికైనా కూడా సమయము మరియు సంకల్పాలు వెళ్ళాయా? చెక్ చేసుకున్నారా? తల ఊపండి, చేతులు కాదు, ఇలా అనండి.

బాప్ దాదా సదా ఈ సూచనను ఇస్తూ ఉన్నారు - మీ మనసు యొక్క శుభ సతోగుణీ సంకల్పాల ద్వారా ప్రకృతిని కూడా సతోగుణీగా తయారుచేస్తూ ఉండండి. మరి ఆ మనసా సేవ గుర్తుంటుందా? ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి పెద్ద రూపములో తన కార్యాన్ని చేయనున్నది. ఇది చిన్న విషయమే కానీ ప్రకృతిని మనుష్యాత్మలు విసిగిస్తే అది కూడా విసిగించడము మొదలుపెడుతుంది, అందుకే తండ్రి అంటారు - ఎలా అయితే మాయాజీతులుగా అవ్వాలని అటెన్షన్ ఉంచుతారో, ఉంచుతారు కదా! మాయాతో మీ ప్రతిజ్ఞ ఏమిటంటే - నీ పని రావడము మరియు మా పని విజయము పొందడము. అందరూ ఈ ప్రతిజ్ఞను చేసారు కదా? చేసారా? మాయాజీతులుగా అవ్వాలి కదా! అలాగే ప్రకృతీజీతులుగా కూడా అవ్వాలి ఎందుకంటే మీరు రాజ్యము చేయాలి కదా. మీ రాజ్యము వస్తూ ఉంది కదా! నషా ఉంది కదా! పాపం మనుష్యులైతే ఏమవుతుందో అని ఆలోచిస్తారు, భయపడతారు. కానీ మీకైతే తెలుసు, ఇప్పుడు సంగమయుగము అనే అమృతవేళ జరుగుతుంది. మరి అమృతవేళ తర్వాత ఏమి వస్తుంది? ఉదయము. ఆ ఉదయములోనే మన రాజ్యము రానున్నది. ఉంది కదా నషా! మన రాజ్యమా లేక కేవలం మహారథుల రాజ్యమా? మీ అందరి రాజ్యము. ఏమి అవుతుందో అని మీకు చింత లేదు! ఎంతో ఎంతో మంచి అవుతుంది. మీ రాజ్యములో ప్రకృతి కూడా సతోప్రధానముగా ఉండబోతుంది. మరి ప్రకృతిని తమోగుణీ నుండి సతోగుణీగా ఎవరు తయారుచేస్తారు? లేక ప్రకృతి ఎలా ఉన్నా పర్వాలేదంటారా? మీ రాజ్యములో ఎలా ఉన్నా పర్వాలేదా? అవును అని అయినా చెప్పండి లేక కాదు అని అయినా చెప్పండి. ఎలా ఉన్నా పర్వాలేదా? వద్దా? మరి ప్రకృతిని సతోగుణీగా ఎవరు తయారుచేస్తారు? మీరే తయారుచేస్తారు కదా! అందుకే ఇప్పుడు అకస్మాత్తు యొక్క మొదటి దృశ్యము, ఇది చిన్నదే, కానీ ప్రారంభమయ్యింది. ఇప్పుడింకా పెద్దపెద్దవి రానున్నాయి మరియు అకస్మాత్తుగా రానున్నాయి. ఏదైతే ఎప్పుడూ అనుకోను కూడా అనుకోలేదో, అదే జరగనున్నది.

బాప్ దాదా అయితే ఎంతో సమయము నుండి అకస్మాత్తు యొక్క పాఠాన్ని చదివిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రత్యక్షముగా చూసిన తర్వాత అయినా మీ పనిని ప్రారంభించండి. భయపడకండి. నలువైపులా నిప్పు అంటుకుంది కానీ పరమాత్ముని పిల్లలు సురక్షితముగా ఉన్నారు అని కథను వినిపిస్తారు కదా. ఇప్పుడు కూడా పిల్లలు సురక్షితముగా ఉన్నారు కదా! పరీక్షలు అయితే వచ్చేదే ఉంది, కానీ మీకు డబుల్ పని ఉంది. ఒకటి, నిర్భయులుగా అయ్యి ఎదుర్కోండి, రెండు, మీ భక్తులు మరియు దుఃఖముతో ఉన్న మీ సోదర-సోదరీల సేవను ఎవరు చేస్తారు? మీరు ప్రభువు సాంగత్యపు రంగును అంటించుకుని ఉన్నారు. మరి పరమాత్ముని సాంగత్యపు రంగులో ఏదైతే ప్రాప్తిని పొంది ఉన్నారో, దానిని మీరు మీ సోదర-సోదరీలకు, భక్తులకు ఎంతో ప్రేమతో మనస్ఫూర్తిగా పంచండి. దుఃఖములో ఉన్న సమయములో ఎవరు గుర్తుకువస్తారు? పరమాత్ముని గురించి తెలిసినా, తెలియకపోయినా కానీ, నిస్సహాయతతోనైనా సరే - ఓ తండ్రీ, ఓ పరమాత్మా అని తప్పకుండా అంటారు. కనుక పరమాత్ముని పిల్లలైన మీరు ఇప్పుడు దుఃఖితులకు ఆధారముగా అవ్వాలి. వారికి శుభ భావన, శుభ కామనల ద్వారా, బాబా ద్వారా ప్రాప్తించిన కిరణాల ద్వారా ఆధారముగా అవ్వండి. ఎంతైనా వారు మీ పరివారమే కదా! మరి పరివారములో ఒకరికొకరు సహయోగాన్ని అందించుకుంటారు కదా! పేరే ఉంది సహ యోగము, శ్రేష్ఠ యోగము. ఆధారాన్ని అందించడానికి అదే సాధనము. సమయాన్ని ఫిక్స్ చేయండి అని సందేశము కూడా పంపించాము. అయిపోతుందిలే అని అనకండి. ఏ విధముగా ట్రాఫిక్ కంట్రోల్ సమయము, అమృతవేళ సమయము నిశ్చితమై ఉన్నాయి, కావున చేస్తున్నారు కదా, అదే విధముగా మీ కార్యము అనుసారముగా ఈ మనసా సేవ కూడా ఇప్పటి సమయమనుసారముగా అత్యంత అవసరము. కావున సమయాన్ని కేటాయించండి, దయార్ద్ర హృదయులుగా అవ్వండి, కళ్యాణకారులుగా అవ్వండి. మీ స్వమానము ఏమిటి? విశ్వ కళ్యాణకారి. మరి దయ కలుగుతుందా? లేక అయిపోతుందా? ఇందులో నిర్లక్ష్యులుగా అవ్వద్దు ఎందుకంటే ఎవరికైతే మీరు సకాష్ ను ఇస్తారో, వారే మీ భక్తులుగా అవుతారు, అందుకే ఏమి చేయాలి? ఉందా, అటెన్షన్ ఉందా? ఎవరైతే - మాకు అటెన్షన్ ఉంది, అది మరింత పెరుగుతుంది అని అంటారో, వారు చేతులెత్తండి. చేతులు కిందకు, మీదకు చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది. (టి.వి.లో) ఒకవేళ ఇంతమంది తమ స్వమానాన్ని ప్రాక్టికల్లోకి తీసుకువచ్చినట్లయితే ఇక ఆత్మలందరూ ఇప్పుడు సంగమములోనే మీ పాటను పాడుతారు - వాహ్ పరమాత్ముని పిల్లలూ వాహ్! మాకు ఆధారాన్ని ఇచ్చారు! ఇప్పుడు మీరు ఇచ్చిన ఆధారము కారణముగా అర్ధకల్పము మీ మహిమను పాడుతుంటారు. మీరు వారి పూర్వజులు అవుతారు. మీరు పూర్వజులు. వృక్షములో బ్రాహ్మణులు ఎక్కడ కూర్చున్నారు! కింద కూర్చున్నారు కదా. అంటే పూర్వజులే కదా! మరి భక్తుల మొర వినిపిస్తుందా? కొద్దిగా స్వయాన్ని సావధానపర్చుకోండి, దుఃఖితులకు ఆధారముగా నిలవవలసిందే అని అనుకుంటే వారి మొర వినిపిస్తుంది.

మరి అందరూ హోలీనైతే జరుపుకున్నారు, మీకైతే పూర్తి సంగమమే హోలీ. పరమాత్ముని సాంగత్యపు రంగులోనే ఉంటారు. దీనికి స్మృతిచిహ్నముగా వారు ఒకటి-రెండు రోజులు జరుపుకుంటారు, కానీ మీరైతే పూర్తి సంగమమంతా ప్రభువు యొక్క సాంగత్యములో ఉండేవారు. నషా ఉంది కదా! మనుష్యులు పాపం - ఓ ప్రభూ, ఇది చేయండి, అది చేయండి అని అడుగుతూ ఉంటారు, కానీ మీకైతే 21 జన్మల గ్యారంటీ లభించింది, ఎప్పుడూ స్వప్నములో కూడా దుఃఖపు దృశ్యాలు రావు. సంకల్పములో కూడా దుఃఖపు అల రాదు. కనుక సదా ప్రతి ఒక్కరూ ఒకవేళ రాజ్యాన్ని తీసుకోవాలనుకుంటే, ఇప్పుడు మీ పరివారాన్ని, సత్యయుగ సహచరులను మరియు రాయల్ ప్రజలను, సాధారణ ప్రజలను, అందరినీ ఇప్పుడే తయారుచేసుకోగలరు. 21 జన్మల గ్యారంటీ ఉంది. కొద్దిగా సేవ చేయండి, సమయాన్ని కేటాయించండి ఎందుకంటే మీ వద్ద సంకల్ప శక్తి అయితే ఉంది. కేవలం ఏదైతే బాబా నుండి లభించిందో, అది మీ సోదరీ-సోదరులకు కూడా ఇవ్వండి.

బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నారు, సదా ఇది చెక్ చేసుకోండి - నాకు బ్రాహ్మణ పరివారములో సంస్కార మిలనము అనే రాస్ ను చెయ్యటం వస్తుందా? ఆ రాస్ ను ఎప్పుడు చేస్తారో దాని డేట్ ను కూడా ఫిక్స్ చేసుకోండి అని బాప్ దాదా చెప్పి ఉన్నారు. ఫిక్స్ అవ్వగలదా? అవ్వగలదా? మొదటి లైన్ లోనివారు చెప్పండి. చేతులెత్తండి. వీలవుతుందా? పాండవులు కూడా చేతులెత్తండి. పాండవులు లేనిదే గతి లేదు. అచ్ఛా. ఇప్పుడిది లాస్ట్ టర్న్, ఇంకా ఒక్క టర్న్ మిగిలి ఉంది. ఈ లోపు అందరికీ స్వయము గురించి ఎటువంటి దృఢ సంకల్పము ఉంది అన్నది ఫిక్స్ చేసి వ్రాయండి. బ్రాహ్మణ పరివారములో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా సంస్కారాలు తమ పని చేయకూడదు, దానికి ఎంత సమయము పడుతుంది? అవి నా సంస్కారాలు కావచ్చు, ఇతరుల సంస్కారాలు కావచ్చు, నాపై ప్రభావము చూపకూడదు. ఆ డేట్ ఫిక్స్ అవ్వగలదా? అవ్వగలదా? చేతులెత్తండి. అచ్ఛా. అందరి ఫోటో తీసారా! ఎందుకంటే ఎలా అయితే ఈ అకస్మాత్తు యొక్క దృశ్యాన్ని చూసారో (జపానులో భూకంపము మరియు సునామీ వచ్చాయి, వాటి మూలంగా చాలా నష్టము జరిగింది) అలాగే అన్నీ అకస్మాత్తుగానే జరగనున్నాయి. అందుకే బాప్ దాదా ఏర్పాట్లనైతే చూస్తారు కదా! ఇతరులకు శుభ భావన, శుభ కామనలను ఇస్తున్నారు... బాప్ దాదా చూసారు, ఇతరులకు ఇచ్చే ఇటువంటి ప్రోగ్రామ్ ను కూడా గతంలో తయారుచేసారు. మరి అలా ఒకవేళ ప్రతి ఆత్మ పట్ల సదా శుభ భావనను మరియు శుభ కామనను ఉంచినట్లయితే, ఎలాగూ నంబరువారుగానే అవ్వనున్నది. మీకు స్మృతిచిహ్నమైన మాలలో అందరూ మొదటి నంబరులో ఉన్నారా ఏమిటి? నంబరువారుగానే ఉన్నారు కానీ మాలలోకైతే వచ్చారు కదా! నంబరు ఎందుకు వచ్చింది? భిన్న-భిన్న సంస్కారాలు ఉన్నాయి కానీ మనము సంస్కారాలను చూడటానికి బదులుగా శుభ భావన, శుభ కామనను ఉంచాలి. ఎంతైనా బ్రాహ్మణ పరివారమే కదా. ఎలా ఉన్నా కానీ పరివారమైతే నాదే కదా. ఎలా అయితే నా బాబా అని అంటారో, అలాగే నా పరివారము కూడా కదా. మంచిది, మెజారిటీ చేతులెత్తారు. అందరికీ ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి, అందుకే చేతులెత్తారు కదా! మరి ఒకరికొకరు సహయోగులుగా అయ్యి శుభ భావన, శుభ కామనల దృష్టి-వృత్తి-స్మృతి ఉంచుకున్నట్లయితే ఈ రాస్ జరగడము పెద్ద విషయమేమీ కాదు. ఇందులో ఎవరైతే చాలా మంచి నంబర్ తీసుకుంటారో, ఇచ్చిన డేట్ కు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారో, వారికి అతీతమైన మరియు ప్రియమైన బహుమతి లభిస్తుంది. బహుమతి ఏమిటో ఇప్పుడే చెప్పము. కానీ బాప్ దాదా బహుమతిని ఇస్తారు. ఎందుకని? సేవ చేయడానికి సమయాన్ని కేటాయించాలి కదా. ఈ సంస్కారాల ఘర్షణ అనేది సమయాన్ని తనవైపుకు లాగేస్తుంది, అందుకే సమయము ఇప్పుడు చాలా అవసరము. సరేనా!

వీరందరూ మధుబన్ వారే కదా! (ముందు కూర్చున్నవారిని చూస్తూ బాబా అన్నారు) ఇష్టమే కదా! ఎందుకంటే మధుబన్ నివాసులు విశేషమైనవారు. బాప్ దాదాకు కూడా మధుబన్ నివాసుల పట్ల మనస్ఫూర్వకమైన ప్రేమ ఉంది. అంతేకాక మధుబన్ వారికి కూడా ప్రేమ ఉంది. ఇది కూడా బాబా చెప్తున్నారు, బాబాపై ప్రేమ ఉంది మరియు ఉంటుంది కూడా. అది తొలగదు. ఇందులో అమరులుగా ఉన్నారు. అందుకే మధుబన్ వాసులుగా అయ్యారు కదా! మధుబన్ నివాసులు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ గౌరవముతో చూస్తారు? వీరు మధుబన్ వారు, మధుబన్ వారు అని. అందుకే ఈ అటెన్షన్ ను ఉంచండి, లాస్ట్ టర్న్ కంటే ముందుగానే, మధుబన్ లో మీ చిట్టీని వేయడానికి అందరూ ఒక స్థానాన్ని నిర్ణయించండి. కానీ లాస్ట్ టర్న్ కంటే ముందే జరగాలి.

అందరూ హోలీని జరుపుకున్నారా? మీకైతే రోజూ హోలీయే. ఇప్పుడు కూడా ఇది బాహ్యముగా కొద్దిగా జరుపుకోవలసి వస్తుంది. జరుపుకోవడానికి ఇంకెక్కడికి వెళ్తారు, ఇక్కడే జరుపుకుంటారు కదా. కానీ అదైతే ఆచార-వ్యవహారము. నలువైపులా ఉన్న బాప్ దాదా యొక్క అతి స్నేహీ పిల్లలకు, అతి ప్రియమైనవారికి, గారాబాల పిల్లలకు, సికీలధే పిల్లలకు, స్వమానధారీ పిల్లలకు, ప్రతి బిడ్డకు బాప్ దాదా పదమాల రెట్లు ప్రియస్మృతులను కూడా ఇస్తున్నారు మరియు హృదయపూర్వకమైన ప్రేమను కూడా ఇస్తున్నారు. బాప్ దాదా చూస్తున్నారు, నలువైపులా అందరూ ఇది చూస్తూ, వింటూ హర్షిస్తున్నారు.

అచ్ఛా, ఈ రోజు మొదటిసారిగా ఎవరు వచ్చారు? లేవండి. వీరందరూ మొదటిసారి వచ్చారు. అచ్ఛా. మొదటిసారి మధుబన్ నివాసులుగా అయ్యే భాగ్యము లభించింది. మీ సోదర-సోదరీలందరూ మరియు బాప్ దాదా కూడా మీ అందరికీ మొదటిసారిగా వచ్చినందుకు అభినందనలను తెలియజేస్తున్నారు. ఇప్పుడు బాప్ దాదా చూస్తారు ఎందుకంటే అవకాశమైతే ఉంది, కొద్దిగా ఆలస్యముగా వచ్చారు కానీ ఏది కావాలనుకుంటే అది ఇప్పుడు కూడా లాస్ట్ సో ఫాస్ట్ గా వెళ్ళి ఫస్ట్ నంబరు తీసుకుని ఫస్ట్ డివిజన్ లోకి రాగలరు. బాప్ దాదా ఈ రోజు ఎవరైతే వచ్చారో, ఆ పిల్లలందరికీ ఇస్తున్న వరదానము ఇది. కేవలం బాబా చెప్పిన మహావాక్యాలేవైతే ఉన్నాయో, ఆ శ్రీమతముపై నడుస్తూ ఉన్నట్లయితే, శ్రీమతము మిమ్మల్ని శ్రేష్ఠ డివిజన్ లోకి తీసుకురాగలదు, తీసుకువస్తుంది. బాబా నుండి వరదానమైతే ఉంది, అంతేకాక ఇంతమంది పరివారము యొక్క శుభ భావన, శుభ కామన మీకు ఉన్నాయి కనుక మీరు ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. అందరూ మీకు హృదయపూర్వకముగా ఆశీర్వాదాలను ఇస్తారు. మీరు ఎక్కడ క్లాసుకు వెళ్తుంటారో, అక్కడ మీకు ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ఆ ఆశీర్వాదాలు మిమ్మల్ని తీవ్ర పురుషార్థులుగా చేసి ముందుకు తీసుకువెళ్తాయి, ఈ నిశ్చయము ఉంచండి. అచ్ఛా. ఇప్పుడు బాప్ దాదా అందరికీ చాలా గొప్పగా, సుందరముగా గుడ్ నైట్ చెప్తున్నారు. అచ్ఛా!

వరదానము:-
ప్రతి సంకల్పములో మరియు కర్మలో సిద్ధిని అనగా సఫలతను ప్రాప్తి చేసుకునే సంపూర్ణ మూర్త భవ

సంకల్ప సిద్ధి ఎప్పుడు ప్రాప్తిస్తుందంటే, ఎప్పుడైతే సమర్థ సంకల్పాలను రచిస్తారో అప్పుడు. ఎవరైతే ఎక్కువ సంకల్పాలను రచిస్తారో, వారు వాటిని పాలన చేయలేరు. అందుకే రచన ఎంత ఎక్కువగా ఉంటుందో, అంత శక్తిహీనముగా అవుతారు. కావున ముందు వ్యర్థాన్ని రచించడము ఆపు చేయండి, అప్పుడు సఫలత ప్రాప్తిస్తుంది మరియు కర్మలలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు యుక్తి ఏమిటంటే - కర్మ చేసేకంటే ముందు ఆదిమధ్యాంతాలను తెలుసుకుని ఆ తర్వాత కర్మలు చేయండి. దీని ద్వారానే సంపూర్ణ మూర్తులుగా అవుతారు.

స్లోగన్:-
సమయానికి దుఃఖము మరియు మోసము నుండి సురక్షితముగా ఉంటూ సఫలురుగా అయ్యేవారే జ్ఞానులు (తెలివైనవారు).

అవ్యక్త ప్రేరణలు - అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా) అవ్వండి

హోలీహంస పిల్లలైన మీ ఆహారము కూడా శుద్ధముగా ఉండాలి, వ్యవహారము కూడా శుద్ధముగా ఉండాలి, అశుద్ధతకు చెందిన నామ-రూపాలు కూడా ఉండకూడదు ఎందుకంటే శుద్ధమైన ప్రపంచములోకి వెళ్తున్నారు, అక్కడ అపవిత్రత లేక అశుద్ధత యొక్క నామ-రూపాలు ఉండవు. ఎప్పుడైతే ఈ విధముగా హోలీహంసలుగా అవుతారో, అప్పుడు భవిష్యత్తులో హిజ్ హోలీనెస్ (మహాశయులు) అని పిలవబడతారు.

విశేష సూచన - నెలలోని ముడవ ఆదివారము యొక్క యోగాభ్యాసము

ఈ రోజు నెలలోని మూడవ ఆదివారము, సోదర-సోదరీలందరూ సంగఠిత రూపములో ఏకాగ్రచిత్తులై సా.6.30 గం.ల నుండి 7.30 గం.ల వరకు తమ పరమ పవిత్రమైన స్వరూపములో స్థితులై పవిత్రత యొక్క దివ్య కిరణాలను వ్యాపింపజేస్తూ సర్వాత్మలకు ‘‘పవిత్ర భవ, యోగీ భవ’’ యొక్క శుభ ప్రేరణలను సకాష్ రూపములో ఇచ్చేటువంటి సేవను చేయండి.