16-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - పరస్పరములో ఒకరికొకరు తండ్రి స్మృతిలో ఉండేందుకు సూచనలు ఇచ్చుకుంటూ, సావధానపర్చుకుంటూ ఉన్నతిని పొందుతూ ఉండండి’’

ప్రశ్న:-
తండ్రి సమానముగా నాలెడ్జ్ ఫుల్ గా అయ్యే పిల్లల జీవితములోని ముఖ్య ధారణలను వినిపించండి?

జవాబు:-
వారు సదా చిరునవ్వుతో ఉంటారు, వారికి ఎప్పుడూ ఏ విషయములోనూ ఏడుపు రాదు. ఏం జరిగినా, కొత్తేమీ కాదు అని భావిస్తారు. అలా, ఎవరైతే ఇప్పుడు నాలెడ్జ్ ఫుల్ గా అనగా ఏడుపు-ప్రూఫ్ గా అవుతారో, ఎప్పుడూ ఏ విషయములోనూ అశాంతి చెందరో, వారికే స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది. ఎవరైతే ఏడుస్తారో, వారు పోగొట్టుకుంటారు, ఏడ్చేవారు తమ పదవిని పోగొట్టుకుంటారు.

పాట:-
మిమ్మల్ని పొంది మేము సర్వమును పొందాము...

ఓంశాంతి
మధురాతి-మధురమైన పిల్లలు స్వయము తాము పాడిన పాటనే విన్నారు. మనము అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చున్నామని పిల్లలకు తెలుసు. పిల్లలంటారు - బాబా, ఒకప్పుడు మీ నుండి పొందిన విశ్వ రాజ్యాధికారాన్ని ఇప్పుడు మళ్ళీ పొందుతున్నాము. సత్యయుగములో ఈ విధముగా పాడరు. ఈ సంగమయుగములోనే మీరు ఇలా పాడగలరు. ఇంటిలో కూర్చుని ఉన్నా లేక ఉద్యోగము చేస్తూ ఉన్నా, మనము అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని మళ్ళీ తీసుకుంటున్నామని మీకు తెలుసు. తండ్రిని స్మృతి చేయండి అని మరియు మనము విశ్వానికి యజమానులుగా అవుతున్నాము అన్నదానిని గుర్తుంచుకోండి అని సెంటర్లలో కూడా సావధానపరుస్తారు. ఇది కొత్త విషయమేమీ కాదు. మనము కల్ప-కల్పము తండ్రి నుండి విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటాము. కొత్తవారు ఎవరైనా వింటే, వీరు బ్రహ్మాను శివబాబా అని పిలుస్తున్నారని అనుకుంటారు. ఇప్పుడు వారైతే నిరాకార ఆత్మల తండ్రి. ఆత్మ నిరాకారి, అలానే తండ్రి అయిన పరమాత్మ కూడా నిరాకారి. సాకార రూపము తీసుకోనంతవరకు ఆత్మను నిరాకారి అని అంటారు. మనము అనంతమైన తండ్రి నుండి ఈ జ్ఞానాన్ని వింటున్నామని పిల్లలు తెలుసుకున్నారు. మీరు పరస్పరము ఒకరినొకరు సావధానపర్చుకోవాలని, ఆత్మిక టీచరు చదివిస్తున్నారు. ముందు ఈ ఆత్మిక అటెన్షన్ లభిస్తుంది. అందరూ అనంతమైన తండ్రి స్మృతిలోనే ఉంటారు మరియు సూచననిస్తారు - తండ్రి స్మృతిలో ఉండండి మరియు బుద్ధి ఇంకెక్కడికి వెళ్ళకూడదు అని. అందుకే, ఆత్మాభిమాని భవ మరియు తండ్రిని స్మృతి చేయండి అని అంటారు. వారు పతిత-పావనుడైన తండ్రి. ఇప్పుడు వారు సమ్ముఖముగా కూర్చుని, నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. ఇది ఎంత సులభమైన యుక్తి. మన్మనాభవ అనే పదము కూడా ఉంది కానీ దానిని ఎవరైనా అర్థం చేసుకోవాలి కదా. స్మృతియాత్రను నేర్పించేవారు ఒక్క తండ్రి మాత్రమే. మనము ఆత్మిక యాత్రలో ఉన్నామని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. అది దైహిక యాత్ర. ఇప్పుడు మనము దైహిక యాత్రికులము కాదు. మనము ఆత్మిక యాత్రికులము. ఈ స్మృతితోనే వికర్మలు వినాశనమవుతాయి, మీరు వికర్మాజీతులుగా అయిపోతారు. మీరు వికర్మాజీతులుగా అవ్వడానికి ఇంకే ఉపాయము లేదు. ఒకటి వికర్మాజీతుల కాలము, రెండవది వికర్మలు చేసేవారి కాలము, అప్పటినుండి వికర్మలు మొదలవుతాయి. రావణ రాజ్యము మొదలవ్వగానే వికారాలు మొదలయ్యాయి. ఇప్పుడు మీరు వికర్మాజీతులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. అక్కడ వికర్మలేవీ జరగవు, అక్కడ రావణుడే ఉండడు. ప్రపంచములో ఈ విషయము ఎవ్వరికీ తెలియదు. మీరు తండ్రి ద్వారా అంతా తెలుసుకున్నారు. తండ్రినే నాలెడ్జ్ ఫుల్ అని అంటారు, వారు పిల్లలకే నాలెడ్జ్ ఇస్తారు కదా. గాడ్ ఫాదర్ కు పేరు కూడా ఉండాలి. వారు నామ-రూపాలకు అతీతమైనవారేమీ కాదు. వారిని పూజిస్తారు, వారి పేరు శివ. వారే పతిత-పావనుడు, జ్ఞానసాగరుడు. ఆత్మ ఆ పరమపిత పరమాత్మ తండ్రిని స్మృతి చేస్తుంది. ఆత్మ తండ్రిని మహిమ చేస్తుంది. వారు సుఖ-శాంతుల సాగరుడు. తండ్రి అయితే పిల్లలకు తప్పకుండా వారసత్వాన్నే ఇస్తారు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్తారో, వారి స్మృతిచిహ్నాలను తయారుచేస్తారు. ఒక్క శివబాబాకు మాత్రమే గాయనము కూడా జరుగుతుంది మరియు పూజ కూడా జరుగుతుంది. తప్పకుండా వారు శరీరము ద్వారా కర్తవ్యాన్ని చేస్తారు, అందుకే వారికి గాయనముంది. వారు సదా పవిత్రమైనవారు. తండ్రి ఎప్పుడూ పూజారిగా అవ్వరు, వారు సదా పూజ్యులు. తండ్రి అంటారు, నేను ఎప్పుడూ పూజారిగా అవ్వను. నేను పూజించబడతాను. పూజారులు నన్ను పూజిస్తారు. సత్యయుగములోనైతే నాకు పూజ చేయరు. భక్తి మార్గములో పతిత-పావన తండ్రినైన నన్ను స్మృతి చేస్తారు. మొట్టమొదట అవ్యభిచారీ భక్తి అనేది ఆ ఒక్కరికి మాత్రమే జరుగుతుంది, ఆ తర్వాత వ్యభిచారీ భక్తిగా అయిపోతుంది. బ్రహ్మా-సరస్వతులను కూడా ఆ శివబాబా విశ్వానికి యజమానులుగా చేస్తారు. భక్తికి ఎంత విస్తారముంది. బీజానికి విస్తారమేమీ ఉండదు.

తండ్రి అంటారు - నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, అంతే. ఎలాగైతే వృక్షానికి విస్తారముంటుందో, అలా భక్తికి కూడా చాలా విస్తారముంటుంది. జ్ఞానము బీజము వంటిది. మీకు జ్ఞానము లభించినప్పుడు సద్గతిని పొందుతారు. మీరు తల బాదుకోవాల్సిన అవసరమేమీ లేదు. జ్ఞానము మరియు భక్తి ఉన్నాయి కదా. సత్య, త్రేతాయుగాలలో భక్తి యొక్క వృక్షము ఉండదు. తర్వాత అర్ధకల్పము ఈ భక్తి యొక్క వృక్షము కొనసాగుతుంది. అన్ని ధర్మాల వారికి తమ-తమ ఆచార-పద్ధతులు ఉన్నాయి. భక్తి ఎంత పెద్దది. జ్ఞానమైతే అందరికీ ఒక్కటే - మన్మనాభవ, అంతే. భగవంతుడైన ఆ తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వారసత్వము తప్పకుండా గుర్తుకువస్తుంది. వారసత్వానికి విస్తారముంటుంది కదా. అది హద్దు ఆస్తి. ఇక్కడ మీకు అనంతమైన ఆస్తి గుర్తుకువస్తుంది. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన వారసత్వాన్ని భారతవాసులకు ఇస్తారు. వారి జన్మ కూడా ఇక్కడే జరుగుతుందని అంటూ ఉంటారు. ఇది ఈ డ్రామాలో అనాదిగా నిశ్చితమై ఉంది. ఎలాగైతే భగవంతుడు ఉన్నతోన్నతమైనవారో, అలా భారత ఖండము కూడా ఉన్నతోన్నతమైనది. ఇక్కడికి తండ్రి వచ్చి మొత్తం ప్రపంచమంతటికీ సద్గతినిస్తారు. కావున ఇది అన్నింటికంటే గొప్ప తీర్థ స్థానము అయినట్లు కదా. ఓ గాడ్ ఫాదర్, మమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటారు. భారత్ పట్ల అందరికీ ప్రేమ ఉంది. తండ్రి కూడా భారత్ లోనే వస్తారు. ఇప్పుడు మీరు కృషి చేస్తున్నారు. గోపీ-వల్లభుని గోప-గోపికలు మీరే. సత్యయుగములో గోప-గోపికల మాట ఉండదు. అక్కడైతే నియమానుసారముగా రాజ్యము నడుస్తుంది. చరిత్ర అనేది శ్రీకృష్ణునికి ఏమీ లేదు, చరిత్ర ఒక్క తండ్రికి మాత్రమే ఉంది. వారి చరిత్ర ఎంత పెద్దది. మొత్తం పతిత సృష్టిని పావనముగా చేస్తారు. ఇది ఎంతటి చతురత. ఈ సమయములో మనుష్యమాత్రులందరూ అజామిళుడి వంటి పాపులుగా ఉన్నారు. ఈ సాధువులు మొదలైనవారు శ్రేష్ఠాచారులని మనుష్యులు భావిస్తారు. తండ్రి అంటారు, వారి ఉద్దరణను కూడా నేనే చేయాలి. ఎలాగైతే మీరు పాత్రధారులో, అలా తండ్రి కూడా పాత్రధారియే కదా. మీరు 84 జన్మలు తీసుకుని పాత్రను అభినయిస్తారు. వారు కూడా క్రియేటర్, డైరెక్టర్, ముఖ్య యాక్టర్, చేసేవారు-చేయించేవారు కదా. ఏం చేస్తారు? పతితులను పావనముగా చేస్తారు. తండ్రి అంటారు - మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని మీరు నన్ను పిలుస్తారు. నేను కూడా ఈ పాత్రలో బంధించబడి ఉన్నాను. ఈ డ్రామా ఎందుకు తయారయ్యిందని లేక ఎప్పుడు తయారయ్యిందని ఎవరూ అడగలేరు. ఇదైతే అనాదిగా తయారై, తయారుచేయబడిన డ్రామా. దీనికి ఆదిమధ్యాంతాలు లేవు. ప్రళయమేమీ జరగదు. ఆత్మ అవినాశీ, ఎప్పుడూ వినాశనము అవ్వదు. ఆత్మకు పాత్ర కూడా అవినాశీ అయినది లభించింది. ఇది అనంతమైన డ్రామా కదా. ఈ డ్రామా పాత్ర ఎలా నడుస్తుంది అనేది తండ్రి కూర్చుని సారములో అర్థం చేయిస్తారు. అంతేకానీ పరమాత్మ ఉన్నారు అంటే, వారు మరణించినవారిని బ్రతికించగలరని కాదు. ఈ అంధవిశ్వాసానికి సంబంధించిన విషయాలు, రిద్ధి-సిద్ధుల విషయాలు ఇక్కడ లేవు. ఓ పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనముగా చేయండి అనే నన్ను పిలుస్తారు. కావున వారు తప్పకుండా వస్తారు. గీత సర్వశాస్త్రమయీ శిరోమణి. భగవంతుడే గీతను వినిపించారు. అచ్ఛా, సహజ రాజయోగాన్ని ఎప్పుడు నేర్పించారు, ఇది కూడా మీకు తెలుసు. తండ్రి కల్పము యొక్క సంగమయుగములోనే వస్తారు. వారు వచ్చి పావన ప్రపంచాన్ని, కొత్త రాజధానిని స్థాపన చేస్తారు. సత్యయుగములో స్థాపన చేయరు కదా. అక్కడైతే ఎలాగూ పావన ప్రపంచమే ఉంది. కల్పము యొక్క సంగమయుగములోనే కుంభ మేళా జరుగుతుంది. ఆ కుంభ మేళా 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ పెద్ద కుంభ మేళా 5 వేల సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది ఆత్మలు మరియు పరమాత్మల మేళా. ఇప్పుడు పరమపిత పరమాత్మ వచ్చి ఆత్మలందరినీ పావనముగా తయారుచేసి తీసుకువెళ్తారు. కల్పము ఆయువును ఎక్కువగా చేయడము వలనే మనుష్యులు తికమకపడిపోయారు. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీ మ్యాగజీన్స్ ఏవైతే వెలువడుతాయో, వాటిని కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు, ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి అన్నారు, ఇలా వ్రాయండి - ఏదైతే గతించిందో, అది 5 వేల సంవత్సరాల క్రితం వలె జరిగింది, కొత్తేమీ కాదు, 5 వేల సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో, అదే ఇప్పుడు రిపీట్ అవుతుంది, ఎవరైనా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే వచ్చి తెలుసుకోండి. ఇటువంటి యుక్తులను రచించాలి. మనము వార్తాపత్రికలలో ఏమని ముద్రించాలి! మీరు ఇది కూడా వ్రాయవచ్చు - ఈ మహాభారత యుద్ధము పావన ప్రపంచము యొక్క గేట్లను ఎలా తెరుస్తుంది, సత్యయుగ స్థాపన కల్పక్రితం వలె ఎలా జరుగుతుంది, దేవీ-దేవతల రాజధాని ఎలా స్థాపన అవుతుంది, వచ్చి తెలుసుకోండి. గాడ్ ఫాదర్ నుండి బర్త్ రైట్ (జన్మ సిద్ధ అధికారము) తీసుకోవాలంటే వచ్చి తీసుకోండి. ఇలా-ఇలా విచార సాగర మంథనము చేయాలి. మనుష్యులు కథలు మొదలైనవి తయారుచేస్తారు, అది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది, అందుకే వారు ఆ పాత్రను అభినయిస్తారు. వ్యాసుడు కూడా డ్రామా ప్లాన్ అనుసారముగా శాస్త్రాలు మొదలైనవి తయారుచేసారు. అతనికి పాత్రే అటువంటిది లభించింది. ఇప్పుడు మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు. మళ్ళీ ఇదే డ్రామా రిపీట్ అవుతుంది. ఇప్పుడు మీరు వచ్చారు, మళ్ళీ జ్ఞానాన్ని వింటున్నారు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము మళ్ళీ ఉంటుందని మీకు తెలుసు. మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి.

ఇప్పుడు మీరు నాలెడ్జ్ ఫుల్ గా అవుతూ ఉన్నారు. బాబా మిమ్మల్ని తమ సమానముగా నాలెడ్జ్ ఫుల్ గా తయారుచేస్తారు. అర్ధకల్పము మనము పీస్ ఫుల్ గా (శాంతిగా) ఉంటామని మీకు తెలుసు. ఏ విధమైన అశాంతి ఉండదు. అక్కడ పిల్లలు మొదలైనవారు ఎప్పుడూ ఏడవరు, సదా చిరునవ్వుతో ఉంటారు. ఇక్కడ కూడా మీరు ఏడవకూడదు. తల్లి మరణించినా హల్వా తినండి... అని అంటూ ఉంటారు. ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. పదవి కూడా భ్రష్టమైపోతుంది. మీకు పతులకే పతి లభించారు, వారు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తారు. వారైతే ఎప్పుడూ మరణించరు కూడా. ఇక ఏడవాల్సిన అవసరము ఏముంది. ఎవరైతే ఏడుపు-ప్రూఫ్ గా అవుతారో, వారే రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. మిగిలినవారైతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఈ పరిస్థితిలో మేము ఏమవుతామని ఒకవేళ బాబాను ఎవరైనా అడిగితే, బాబా చెప్తారు. పిల్లలకు చివరిలో అంతా సాక్షాత్కారము అవుతుంది. ఎలాగైతే స్కూల్లో అందరికీ రిజల్ట్ తెలిసిపోతుంది కదా. అలాగే రుద్ర మాలలో ఎవరెవరు ఉంటారు అనేది చివరిలో మీకు తెలిసిపోతుంది. విద్యార్థులు చివరి రోజుల్లో చాలా పురుషార్థము చేస్తారు. మేము ఫలానా సబ్జెక్టులో ఫెయిల్ అవుతామని అర్థం చేసుకుంటారు. అలా, మీకు కూడా తెలిసిపోతుంది. మాకు పిల్లల పట్ల మోహముందని చాలామంది అంటారు. దానిని తొలగించుకోవాల్సిందే. మోహము ఒక్కరి పట్లనే ఉంచుకోవాలి. ఇకపోతే, ట్రస్టీగా ఉంటూ సంభాళించాలి. ఇదంతా తండ్రి ఇచ్చారని అంటారు కూడా కదా, మరి ట్రస్టీగా ఉంటూ నడుచుకోండి. మమకారాన్ని తొలగించండి. తండ్రి స్వయంగా వచ్చి చెప్తున్నారు, అందరి నుండి మమకారాన్ని తొలగించండి. అంతా వారికి చేందినదే అని భావించండి, వారి మతముపైనే నడవండి. వారి కార్యములోనే నిమగ్నమైపోండి. అవినాశీ జ్ఞాన రత్నాలను దానము చేస్తూ ఉండండి. ఇక్కడ తండ్రికి కన్యల పట్ల అందరికంటే ఎక్కువ గౌరవముంది. కన్య కర్మ బంధనాల నుండి ఫ్రీ గా ఉంటుంది. కొడుకులకైతే లౌకిక తండ్రి ఇచ్చే వారసత్వము యొక్క నషా ఉంటుంది. కన్యలు లౌకిక తండ్రి యొక్క వారసత్వాన్ని పొందరు. ఇక్కడ ఈ తండ్రి వద్ద స్త్రీ-పురుషుల బేధము లేదు. తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు. మనమంతా సోదరులమని, తండ్రి నుండి వారసత్వము తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఆత్మ చదువుకుంటుంది, తండ్రి నుండి వారసత్వము తీసుకుంటుంది. ఎంత ఎక్కువ వారసత్వము తీసుకుంటే, అంత ఉన్నత పదవిని పొందుతారు. బాబా వచ్చి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. శివబాబా నిరాకారుడు, వారిని పూజిస్తారు కూడా. సోమనాథ మందిరాన్ని నిర్మించారు. శివబాబా వచ్చి ఏం చేసారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. వారి స్మృతిచిహ్నముగా మందిరాన్ని ఎందుకు నిర్మించారు అనేది కూడా మీరు అర్థం చేసుకుంటారు. కల్ప-కల్పము ఇలాగే జరుగుతుంది. డ్రామాలో నిశ్చితమై ఉంది, అది రిపీట్ అవుతుంది. తండ్రి రావాల్సిందే. పాత ప్రపంచ వినాశనము జరగనున్నది. ఇందులో దుఃఖము యొక్క విషయమేమీ లేదు. ఇది అనవసర రక్తసిక్తమైన ఆట. అనవసరంగా అందరూ హతమార్చబడతారు. లేదంటే ఎవరైనా ఎవరినైనా హత్య చేస్తే, వారికి ఉరి శిక్ష ఉంటుంది. మరి ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి. ఈ ప్రకృతి వైపరీత్యాలు రావాల్సిందే. వినాశనము జరగాల్సిందే. అమరలోకము, మృత్యులోకము యొక్క అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ రోజు మనము మృత్యులోకములో ఉన్నామని, రేపు మనము అమరలోకములో ఉంటామని, అందుకే మనము చదువుకుంటున్నామని మీకు తెలుసు. మనుష్యులైతే ఘోర అంధకారములో ఉన్నారు. మీరు జ్ఞానామృతాన్ని తాగిస్తారు. సరే, సరే అని అంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు. అనంతమైన తండ్రి వారసత్వాన్ని ఇస్తున్నారని వింటారు కూడా. ఇది అదే మహాభారత యుద్ధము, దీనితో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. చాలా బాగుంది, ఈ జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు, మేము ఒప్పుకుంటున్నాము అని వ్రాస్తారు కూడా, అంతే. స్వయము కొంచెం కూడా జ్ఞానాన్ని తీసుకోరు, మళ్ళీ నిద్రపోతారు. ఇటువంటివారిని కుంభకర్ణులని అంటారు. మీరు ఇలా చెప్పవచ్చు - మీరు వ్రాసి అయితే ఇస్తున్నారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నిద్రపోవడము కాదు. వారిని కుంభకర్ణుని చిత్రము వద్దకు తీసుకువెళ్ళాలి, వీరి వలె నిద్రపోకండి అని చెప్పండి. అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి కదా.

బాబా అంటారు - పిల్లలూ, మీ దుకాణాలలో కూడా ముఖ్యమైన చిత్రాలను పెట్టండి. ఎవరైనా వస్తే, వాటిని చూపించి అర్థం చేయించండి. దుకాణములో ఆ వ్యాపారము కూడా కానివ్వండి, ఇది కూడా సత్యమైన వ్యాపారము. దీనితో మీరు అనేకుల కళ్యాణము చేయగలరు. ఇందులో సిగ్గుపడే విషయమేమీ లేదు. కొంతమంది, మీరు బి.కె.లుగా అయ్యారా అని అంటారు. వారికి ఇలా చెప్పండి - అరే, మీరు కూడా ప్రజాపిత బ్రహ్మా యొక్క కుమార-కుమారీలే కదా, తండ్రి కొత్త సృష్టిని రచిస్తున్నారు, పాతదానికి నిప్పు అంటుకుంటుంది, మీరు కూడా బి.కె.లుగా అవ్వనంత వరకు స్వర్గానికి వెళ్ళలేరు. ఈ విధముగా దుకాణాలలో సేవ చేసినట్లయితే ఎంత అనంతమైన సేవ జరుగుతుంది. పరస్పరములో చర్చించుకోండి. దుకాణము చిన్నదైనా కూడా గోడలకు చిత్రాలు తగిలించవచ్చు. దానము ఇంటి నుండే మొదలవుతుంది. మొట్టమొదట వారి కళ్యాణము చేయాలి. తండ్రి అంటారు - ఇప్పుడు ఏ దేహధారినీ గుర్తు చేయకండి. శివబాబాను స్మృతి చేయండి, వారి నుండి వారసత్వము లభిస్తుంది. మనుష్యులైతే పాపం తికమకలో ఉన్నారు. దైవీ ప్రపంచ రాజ్యాధికారాన్ని పొందాలంటే, నరుని నుండి నారాయణునిగా తయారవ్వాలంటే, వచ్చి అలా తయారవ్వండి అని వారికి తెలియజేయాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క తండ్రి పట్లనే శుద్ధమైన, సత్యమైన మోహము పెట్టుకోవాలి, వారినే స్మృతి చేయాలి. దేహధారుల నుండి మమకారాన్ని తొలగించాలి. ట్రస్టీగా ఉంటూ సంభాళించాలి.

2. వికర్మాజీతులుగా అవ్వాలి, అందుకే కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి వికర్మలు జరగకూడదు, దీని పట్ల చాలా-చాలా అటెన్షన్ పెట్టాలి.

వరదానము:-
తమ శ్రేష్ఠ స్వరూపము మరియు శ్రేష్ఠ నషాలో స్థితులై అలౌకికతను అనుభవం చేయించే అంతర్ముఖీ భవ

ఎలాగైతే నక్షత్రాల సంగఠనలో విశేషమైన నక్షత్రాల ప్రకాశము దూరం నుండే అతీతముగా, ప్రియముగా అనిపిస్తుందో, అలా నక్షత్రాలైన మీరు, సాధారణ ఆత్మల మధ్యన ఒక విశేష ఆత్మగా కనిపించాలి. సాధారణ రూపములో ఉంటూ అసాధారణమైన మరియు అలౌకిక స్థితి ఉన్నట్లయితే సంగఠన మధ్యలో అల్లాకు చెందినవారిగా కనిపిస్తారు. దీని కోసం అంతర్ముఖులుగా అయి తర్వాత బాహ్యముఖతలోకి వచ్చే అభ్యాసముండాలి. సదా తమ శ్రేష్ఠ స్వరూపములో మరియు నషాలో స్థితులై నాలెడ్జ్ ఫుల్ గా ఉండడముతో పాటు పవర్ ఫుల్ గా అయి నాలెడ్జ్ ను ఇవ్వండి, అప్పుడు అనేకాత్మలను అనుభవీలుగా చేయగలరు.

స్లోగన్:-
రావణుడి ఆస్తిని మీ వద్ద పెట్టుకున్నట్లయితే, హృదయములో హృదయాభిరాముడు నిలవలేరు.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి

దాత పిల్లలైన మీరు అందరికీ ఇచ్చేటటువంటి మాస్టర్ దాతలు. మీరు మీ ఒక్క క్షణకాలపు దృష్టి ద్వారా, అమూల్యమైన మాటల ద్వారా దాహముతో ఉన్నవారి దాహాన్ని తీర్చండి. మీ ముంగిట వద్దకు వచ్చిన ఆకలితో ఉన్న ఏ ఆత్మలు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఎలా అయితే సాకారములో వారు చేసి చూపించారు, ఎవ్వరూ కూడా అసంతుష్టులై వెళ్ళలేదు, అలా ఎవరు ఎటువంటి ఆత్మ అయినా కానీ, వారు సంతుష్టులై వెళ్ళాలి.