17-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - బాప్ (తండ్రి) మరియు దాదా (పెద్ద అన్నయ్య) ల కథ కూడా అద్భుతమైనది, తండ్రి దాదాలో ప్రవేశించినప్పుడు బ్రహ్మాకుమార-కుమారీలైన మీరు వారసత్వానికి అధికారులుగా అవ్వగలరు’’

ప్రశ్న:-
నిశ్చితమైన డ్రామా గురించి తెలిసి కూడా పిల్లలైన మీరు ఏ లక్ష్యాన్ని తప్పకుండా పెట్టుకోవాలి?

జవాబు:-
పురుషార్థము చేసి గ్యాలప్ చేసే లక్ష్యాన్ని (త్వరత్వరగా ముందుకు వెళ్ళే లక్ష్యాన్ని) అనగా వినాశనము కన్నా ముందే తండ్రి స్మృతిలో ఉంటూ కర్మాతీతులుగా అయ్యే లక్ష్యాన్ని తప్పకుండా పెట్టుకోవాలి. కర్మాతీతము అనగా ఇనుప యుగము వారి నుండి బంగారు యుగము వారిగా అవ్వడము. పురుషార్థము చేయడానికి ఈ కొద్ది సమయమే ఉంది, అందుకే వినాశనానికి ముందే మీ అవస్థను అచలముగా, స్థిరముగా తయారుచేసుకోవాలి.

ఓంశాంతి
ఓంశాంతి. ఈ విధముగా ఏ ఇద్దరు అంటారు? ఒకరు బాబా, మరొకరు దాదా. ఒక రాజు ఉండేవారు, ఒక రాణి ఉండేవారని కథను వినిపిస్తారు కదా. ఇప్పుడు ఇవన్నీ కొత్త విషయాలు. ఒకరు బాబా, ఒకరు దాదా. 5 వేల సంవత్సరాల క్రితం కూడా ఒక శివబాబా, ఒక బ్రహ్మాదాదా ఉండేవారని మీరంటారు. ఇప్పుడు అందరూ శివుని పిల్లలే. ఆత్మలందరూ ఒక్క తండ్రి సంతానమే. ఆత్మలందరూ ఎలాగూ తండ్రి సంతానమే. బ్రహ్మాకు పిల్లలైన బ్రాహ్మణులు కూడా ఉండేవారు, ప్రజాపిత బ్రహ్మా సంతానమైన బ్రహ్మాకుమార-కుమారీలు ఉండేవారు. వారిని ఎవరు చదివించేవారు? శివబాబా. ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలైన ఈ బ్రహ్మాకుమార-కుమారీలు అనేకమంది ఉన్నారు కదా. తప్పకుండా మేము శివబాబాకు పిల్లలము కూడా, మనవలము కూడా అని బ్రహ్మాకుమార-కుమారీలు భావిస్తారు. మీరు బాబాకు ఎలాగూ పిల్లలే, ఇప్పుడు బ్రహ్మా ద్వారా తాతగారి నుండి వారసత్వాన్ని తీసుకోవడానికి మనవులుగా అయ్యారు. ఇప్పుడు మీకు తాతగారి నుండి వారసత్వము లభిస్తుంది, వారిని శివబాబా అని అంటారు. కానీ బ్రహ్మాకుమార-కుమారీలమైన కారణముగా వీరిని (బ్రహ్మాను) మనము దాదా అని అంటాము. వారసత్వము తాతగారిది. వారసత్వము బ్రహ్మా దాదాది కాదు. వైకుంఠవాసులుగా అయ్యే వారసత్వము ఆ తండ్రి నుండి లభిస్తుంది. అర్ధకల్పము వారసత్వాన్ని పొందుతారు, తర్వాత మీకు రావణుడి నుండి శాపము లభిస్తుంది. కిందకు దిగుతూ వస్తారు. కిందకు దిగే గ్రహచారము కూర్చున్నట్లుగా ఉంటుంది. మా గ్రహచారము, రాహు దశ పూర్తి అయ్యింది - అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. రాహు దశ అన్నింటికంటే చెడ్డది. ఉన్నతోన్నతమైనది బృహస్పతి దశ, ఆ తర్వాత రాహు దశ కూర్చోవడముతో 5 వికారాల కారణముగా మనము నల్లగా అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ తండ్రి అంటారు - దానమిస్తే గ్రహణము తొలగిపోతుంది. ఇది మీకు సంబంధించిన విషయమే. దీనినే వారు సూర్య గ్రహణము, చంద్ర గ్రహణము అని అనుకున్నారు. అక్కడ వారు - గ్రహణము పట్టినప్పుడు దానమివ్వని అడుగుతారు, కానీ ఇక్కడ తండ్రి మీకు చెప్తున్నారు, 5 వికారాలను దానమిచ్చినట్లయితే గ్రహచారము తొలగిపోతుంది. ఈ వికారాల కారణముగానే మీరు పాపాత్ములుగా అయ్యారు. ముఖ్యమైనది దేహాభిమానము. ముందు సతోప్రధానముగా ఉండేవారు, తర్వాత సతో, రజో, తమోగా అయ్యారు, 84 జన్మలను తీసుకున్నారు. తప్పకుండా దేవతలే 84 జన్మలు తీసుకుంటారని పక్కా నిశ్చయముంది. ముందు వారే తండ్రిని కలుసుకోవాలి. ఆత్మలు పరమాత్మ చాలాకాలం వేరుగా ఉన్నారు... అని అంటూ ఉంటారు కూడా.

తండ్రి అంటారు - మొట్టమొదట మిమ్మల్ని సత్యయుగములోకి పంపించాను, మళ్ళీ ఇప్పుడు మీరే వచ్చి కలుసుకున్నారు. ఇంతకుముందైతే కేవలం పాడుతూ ఉండేవారు, కానీ దాని యథార్థ అర్థాన్ని ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వేద-శాస్త్రాలు, జప-తపాదులు, స్లోగన్లు మొదలైనవేవైతే ఉన్నాయో, వాటన్నింటి సారాన్ని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. చక్రాన్ని అయితే చాలా సులభముగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కలియుగము మరియు సత్యయుగము యొక్క సంగమము. యుద్ధము కూడా ఎదురుగా నిలబడి ఉంది. సత్యయుగము స్థాపనవుతోందని కూడా మీకు నిశ్చయముంది. కలియుగములో ఎంతమందైతే ఉన్నారో, వారందరి శరీరాలు సమాప్తమైపోతాయి, ఇకపోతే ఆత్మలు పవిత్రముగా అయి, లెక్కాచారాలను పూర్తి చేసుకుని వెళ్తారు. ఇది అందరి వినాశన సమయము. ఆత్మలు శరీరాలను వదిలి వెళ్ళిపోతారు. ఇది మీ బుద్ధిలో ఇప్పుడు ఉంది. ఎప్పటివరకైతే మనము కర్మాతీత అవస్థను పొందమో, అప్పటివరకు సంగమములో ఉంటాము. ఒకవైపు కోట్లాది మంది మనుష్యులు ఉన్నారు, ఇంకొకవైపు కేవలం కొద్దిమందైన మీరు మాత్రమే ఉన్నారు. మీలో కూడా నిశ్చయబుద్ధి కలవారిగా అవుతూ ఉన్నవారు ఎంతమంది ఉన్నారు. నిశ్చయబుద్ధి కలవారు విజయము పొంది విష్ణు మెడలో హారముగా అవుతారు. ఒకటి రుద్రాక్ష మాల, రెండవది రుండ మాల. ఆ రుండ మాలలో చిన్న-చిన్న ముఖాలు ఉంటాయి. ఇది దేనికి గుర్తు అంటే - ఆత్మలమైన మనము వచ్చి తండ్రి మెడలోని హారములో మణులుగా అయి, మళ్ళీ ఇక్కడకు నంబరువారుగా వస్తాము. 8 మణుల మాల కూడా ఉంది, 108 మణుల మాల కూడా ఉంది, 16108 మణుల మాల కూడా ఉంది. ఇప్పుడు 16000 మంది ఉన్నారా లేక 5-10 వేల మంది ఉన్నారా అన్న లెక్కను ఏమీ తీయరు. ఈ మాలలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. బాబా అంటారు, ఇదంతా మీరెందుకు ఆలోచిస్తారు. కల్పక్రితం ఎంతమంది సత్య, త్రేతాయుగాలలో రాజులుగా అయ్యారో, ఇప్పుడు కూడా అంతమందే అవుతారు. 100 మంది అయ్యారా లేక 2-3 వందల మంది అయ్యారా అని అడగకూడదు.

తండ్రి అంటారు - మీరు ఎంతగా సమీపముగా వస్తూ ఉంటారో, అంతగా ఇవన్నీ అర్థం చేసుకుంటారు. ఈ రోజు మనము ఇక్కడ ఉన్నాము, రేపు వినాశనమవుతుంది, తర్వాత సత్యయుగములో కొద్దిమంది దేవీ-దేవతలు ఉంటారు. తర్వాత సంఖ్య పెరుగుతుంది. సత్యయుగపు గుర్తులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే, లక్షలాది మంది వెళ్ళి ఉంటారా, లక్ష మంది ఉంటారా లేక 9-10 లక్షల మంది ఉంటారా అనేది ఖచ్చితముగా చెప్పలేము. అయితే, ఎప్పుడైతే మీరు ఏక్యురేట్ గా సంపూర్ణముగా అయ్యేందుకు యోగ్యులుగా అవుతారో, అప్పుడు మీకు ఇంకా ఎక్కువ సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇప్పుడైతే ఇంకా చాలా అర్థం చేసుకోవాల్సిన సమయము ఉంది. చాలా సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. యుద్ధము కోసం ఏర్పాట్లు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. అన్ని వస్తువులు ఖరీదైనవిగా అవుతూ ఉంటాయి. విదేశాలలో కూడా ఇప్పుడు పన్నులు మొదలైనవి ఎక్కువ వేస్తుంటారు. ధరలు బాగా పెరుగుతూ-పెరుగుతూ తర్వాత ఒక్కసారిగా చౌకగా అయిపోతాయి. సత్యయుగములో ఏ వస్తువు పైనా ఖర్చు అవ్వదు. గనులు మొదలైనవన్నీ నిండుగా అయిపోతాయి. కొత్త ప్రపంచములో వైభవాలు చాలా ఉంటాయి. లక్ష్మీ-నారాయణుల వద్ద చాలా వైభవాలు ఉండేవి కదా. శ్రీనాథ ద్వారములో విగ్రహాల ముందు కూడా ఎన్ని రకాల భోగ్ లను పెడతారు. అక్కడ చాలా రకాల పదార్థాలను తయారుచేస్తారు మరియు తింటూ ఉంటారు. మేము దేవతలకు భోగ్ పెడుతున్నాము, దేవతలకు భోగ్ పెట్టకపోతే వారు కోపగించుకుంటారు - అని అంటారు. వాస్తవానికి ఇందులో కోపగించుకునే విషయమే లేదు. మీరు ఎవ్వరి పైనా కోపగించుకోరు. డ్రామానుసారముగా ఈ వినాశనము జరగాల్సిందేనని మీకు తెలుసు. కలియుగము మారి సత్యయుగముగా అవుతుంది. డ్రామానుసారముగా ఇప్పుడు కొత్త చక్రము మొదలవ్వనున్నదని మీకు డ్రామా గురించి తెలుసు. మీరు కూడా డ్రామాకు వశమై ఉన్నారు. డ్రామానుసారముగా తండ్రి కూడా వచ్చి ఉన్నారు. డ్రామాలోని ఒక్క నిమిషము కూడా కింద-మీద అవ్వలేదు. ఎలాగైతే బాబా వచ్చారు, మీరు చూసారు, కల్పము తర్వాత కూడా యథావిధిగా ఇలాగే జరుగుతుంది. శాస్త్రాలలోనైతే కల్పము ఆయువును చాలా పెద్దగా వ్రాసేసారు. తప్పకుండా వినాశనము ఎదురుగా నిలబడి ఉందని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు గ్యాలప్ చేస్తున్నారు (త్వరత్వరగా ముందుకు వెళ్తున్నారు). మనము తండ్రిని స్మృతి చేసి కర్మాతీత అవస్థను తప్పకుండా పొందాలని అనగా ఇనుప యుగము వారి నుండి బంగారు యుగము వారిగా అవ్వాలని మీకు తెలుసు. ఇప్పుడు ఒకవేళ పురుషార్థము చేయకపోతే పదవి భ్రష్టమైపోతుంది. ఓ ఆత్మలూ, ఇప్పుడు మీరు పతితులుగా అయిపోయారు. ఇది కూడా మీకు తెలుసు, చాలా రకాల వారు వస్తారు, ఎవరైతే ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారో, వారు అక్కడ నుండి బయటకు వచ్చి ఇక్కడకు వస్తూ ఉంటారు. వారు వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు తమ పురుషార్థము చేస్తూ ఉంటారు. బ్రాహ్మణ ధర్మములోకి వచ్చి తర్వాత దేవతా ధర్మములోకి వస్తారు. బ్రాహ్మణ ధర్మములోకి రాకపోతే దేవతా ధర్మములోకి ఎలా వస్తారు. బ్రాహ్మణులు రోజురోజుకు వృద్ధి చెందుతూ ఉంటారు. వినాశనము ఎదురుగా రావడాన్ని చూసినప్పుడు, వీరు కరక్టే చెప్తున్నారని అనుకుంటారు, అప్పుడిక వృద్ధి జరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణుల వృక్షము వృద్ధి చెంది ఫుల్ అయినప్పుడు, అందరూ తిరిగి వెళ్తారు. దేవతల వృక్షము పెరుగుతుంది.

ఇప్పుడు మీరు సంగమములో రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఈ సంగమాన్ని కళ్యాణకారీ యుగమని అంటారు. సంగమానికే మహిమ ఉంది - గంగా సాగరము యొక్క మేళాను చూపిస్తారు. అదంతా భక్తి మార్గానికి చెందినది. ఇక్కడున్నది జ్ఞాన సాగరుడు మరియు జ్ఞాన సాగరుడి నుండి వెలువడిన జ్ఞాన గంగలు. జ్ఞాన సాగరుడు అన్న పదానికి పతిత-పావనుడు అనే పదము సరిపోతుంది. వారు గంగను పతిత-పావనిగా భావిస్తూ గంగలో స్నానాలు చేస్తూ వచ్చారు. ఈ నదులైతే సత్యయుగము నుండి ప్రవహిస్తూ ఉన్నాయి, ఈ రోజుల్లో నదులు కూడా అక్కడక్కడ ముంచేస్తూ ఉంటాయి. ప్రకృతి కూడా తమోప్రధానముగా అయిపోయింది, సాగరము కూడా తమోప్రధానముగా అయిపోయింది. సాగరము కొద్దిగా పొంగినా సరే అంతా సమాప్తము చేసేస్తుంది. సత్యయుగములో భారత్ లో యమునా నది ఒడ్డున కేవలం మనము కొద్దిమంది మాత్రమే ఉంటాము. ఢిల్లీ పరిస్తాన్ గా ఉండేది, మళ్ళీ అలా తయారవ్వనున్నది. సత్యయుగములో కొంతమంది జీవాత్మలే ఉంటారు, తర్వాత నెమ్మది-నెమ్మదిగా వస్తూ ఉంటారు. ఇప్పుడిది కలియుగ అంతిమము. మనుష్యుల సంఖ్య ఎంతగా పెరిగిపోయింది, ఇది అనంతమైన నాటకము, దీనిని మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. కొంతమంది స్వయాన్ని పాత్రధారులుగా భావిస్తారు కానీ కల్పము 5 వేల సంవత్సరాలదని ఎవ్వరికీ తెలియదు. 84 జన్మలు ఎక్కడ, 84 లక్షల జన్మలు ఎక్కడ. ఇప్పుడు మీరు ప్రకాశములో ఉన్నారు. మీకు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. తండ్రి అంటారు - మన్మనాభవ, తండ్రిని స్మృతి చేయాలి. శివ భగవానువాచ - భగవంతుని మహిమకు మరియు దేవతల మహిమకు చాలా తేడా ఉంది. తండ్రి ఏదైతే కొత్త రచనను రచిస్తారో, వారి మహిమ ఏమిటంటే - సర్వగుణ సంపన్నులు... ఇప్పుడు మీరు ఈ విధముగా తయారవుతున్నారు. తండ్రి మహిమకు మరియు వీరి (దేవతలు) మహిమకు రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇది రాజయోగము కదా. భగవంతుడు రాజయోగాన్ని నేర్పిస్తారని అంటూ ఉంటారు కూడా. వారు నిరాకారుడు, అందుకే తప్పకుండా నిరాకార లోకము నుండి సాకార లోకములోకి రావాల్సి ఉంటుంది. భగవంతునికి ఇంత మహిమ ఉంది కావున వారు తప్పకుండా రావాల్సి ఉంటుంది. వారిది దివ్య అలౌకిక జన్మ, ఇంకెవరి జన్మను దివ్య జన్మ అని అనరు. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించడము జరిగింది - ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి, ఆ పారలౌకిక తండ్రినే భగవంతుడు అని అంటూ స్మృతి చేస్తారు మరియు మూడవవారు అలౌకిక తండ్రి, వీరు అద్భుతమైన తండ్రి. ఎప్పుడైతే పారలౌకిక తండ్రి పిల్లలను దత్తత తీసుకుంటారో, అప్పుడు మధ్యలో ఈ అలౌకిక తండ్రి వస్తారు. ప్రజాపిత బ్రహ్మాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు. శివబాబా వచ్చి బ్రహ్మా ద్వారా మిమ్మల్ని తమవారిగా చేసుకుంటారు. ఎంతమంది బ్రహ్మాకుమార-కుమారీలుగా అవుతారు. లౌకిక తండ్రికి మహా అయితే 8-10 మంది పిల్లలు ఉంటారు. అచ్ఛా, పారలౌకిక తండ్రి అయిన శివబాబా కూడా ఉన్నారు. వారికైతే అనేకమంది పిల్లలు ఉన్నారు. మనమంతా సోదరులమని ఆత్మలందరూ అంటారు. ఇప్పుడు ఈ సంగమములో మళ్ళీ అలౌకిక తండ్రి లభిస్తారు. ఈ జ్ఞానము మీకు అక్కడ ఉండదు. ఎప్పుడైతే తండ్రి వచ్చి కొత్త సృష్టిని రచిస్తారో, అప్పుడే ప్రజాపిత బ్రహ్మా తండ్రి లభిస్తారు. కావున ఇది అలౌకిక జన్మ అయినట్లు కదా, దీనిని ఎవరూ అర్థం చేసుకోలేరు. అతను లౌకిక తండ్రి, వారు పారలౌకిక తండ్రి మరియు వీరు సంగమయుగీ అలౌకిక తండ్రి. లౌకిక తండ్రి అయితే సత్యయుగము నుండి మొదలుకుని ఉండనే ఉన్నారు. అక్కడ పారలౌకిక తండ్రిని ఎవరూ స్మృతి చేయరు. అక్కడ ఉండేది ఒక్క తండ్రి మాత్రమే. ఓ భగవంతుడా, ఓ పరమాత్మ అని పిలుస్తూ స్మృతి చేయరు, తర్వాత ద్వాపరములో భక్తి మార్గము మొదలైనప్పుడు ఇద్దరు తండ్రులు ఉంటారు. సంగమములో ముగ్గురు తండ్రులు ఉంటారు. ప్రజాపిత బ్రహ్మా కూడా ఇప్పుడే లభిస్తారు, ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మాకు చెందినవారిగా అయ్యారు. వీరు అలౌకిక తండ్రి అని మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఈ విషయాలను మంచి రీతిలో తెలుసుకుంటారు మరియు స్మృతి చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. సత్యయుగములో స్మృతి చేసే అవసరమే లేదు. దుఃఖములో పారలౌకిక తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. ఇది చాలా సహజమైన విషయము. సత్య, త్రేతాయుగాలలో ఒక్క తండ్రి ఉంటారు, ద్వాపరములో ఇద్దరు తండ్రులు ఉంటారు. ఈ సమయములో మీరు అలౌకిక తండ్రికి పిల్లలుగా అయ్యారు, వారి ద్వారా మీరు వారసత్వాన్ని తీసుకుంటారు. పిల్లలైన మీరే బ్రాహ్మణులుగా అవుతారు, తర్వాత మీరే దేవతలుగా అవుతారు. వినాశనము కూడా మీరే చూడాల్సి ఉంటుంది, దానిని మీరు ఈ స్థూల నేత్రాలతో చూస్తారు. బాంబులు వేస్తారు, అప్పుడు మనుష్యులు మరణిస్తారు కదా. జపానులో కూడా బాంబు వేసినప్పుడు మనుష్యులు ఎలా మరణించారో చూసారు కదా. ఇప్పుడిక ఇక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మేము విసిగిపోతున్నామని స్వయము కూడా అంటారు. 10-10 సంవత్సరాల వరకు కూడా యుద్ధము నడుస్తూ ఉంటుంది. బాంబులతోనైతే క్షణములో అంతా సమాప్తమైపోతుంది. నిప్పురవ్వ అంటుకుందంటే, పట్టణాలకు పట్టణాలే సమాప్తమైపోతాయి. ఇవేమో బాంబులు. నిప్పు కూడా అంటుకోనున్నది.

స్థాపన మరియు వినాశనము చేయించేందుకే తండ్రి వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. కావున తప్పకుండా ఇవన్నీ జరుగుతాయి. పురుషార్థము చేసే సమయము ఇదే. మాయ పదే-పదే మీ బుద్ధియోగాన్ని తెంచి వేస్తుంది. ఇప్పుడింకా మీరు చలించనివారిగా, స్థిరమైనవారిగా ఎక్కడయ్యారు. బాబా, మాయ తుఫానులు చాలా వస్తున్నాయని అంటారు. కొందరైతే రోజంతటిలో గంట, అరగంట కూడా స్మృతి చేయరు. తండ్రి అంటారు - మీరు కర్మయోగులు, 8 గంటలు ఈ సేవ చేస్తారు, 8 గంటలు స్మృతి చేయగలగాలి, అంతటి పురుషార్థము చేయాలి. స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి, దీనినే యోగాగ్ని అని అంటారు. ఇది శ్రమతో కూడినది. గృహస్థ వ్యవహారములో ఉంటూ కేవలం స్మృతి చేయాలి. ఇది కూడా బాబా చెప్తారు - ఎవరైతే గృహస్థాన్ని విడిచిపెట్టి పిల్లలుగా అయ్యారో, వారు కూడా అంతగా స్మృతి చేయరు. ఇంటిలో ఉండేవారు ఇంకా ఎక్కువగా స్మృతి చేస్తారు. అర్జునుడు మరియు ఏకలవ్యుడి ఉదాహరణను కూడా చెప్తారు కదా. తండ్రిని స్మృతి చేయడము మరియు చక్రాన్ని అర్థం చేసుకోవడములోనే శ్రమ ఉంది. మహాభారత యుద్ధము కూడా తప్పకుండా జరుగుతుంది. అది సత్యయుగములో జరగదు. పిల్లలైన మీరు అంధులకు చేతికర్రగా కూడా అవ్వాలి. అందరికీ ఈ మార్గాన్ని తెలియజేయాలి - తండ్రిని స్మృతి చేయండి మరియు చక్రాన్ని స్మృతి చేయండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతిలో ఉండే పురుషార్థము చేయాలి. తమ అవస్థను అచలముగా-స్థిరముగా ఉంచుకునేందుకు స్మృతి చేసే అభ్యాసాన్ని పెంచుకోవాలి. నిర్లక్ష్యము చేయకూడదు.

2. ఈ డ్రామా పూర్తిగా ఏక్యురేట్ గా తయారై ఉంది, అందుకే ఎవరిపైనా కోపగించుకోకూడదు. నిశ్చయబుద్ధి కలవారిగా అవ్వాలి.

వరదానము:-
తెంచడము, మలచడము మరియు జోడించడము - ఈ మూడు పదాల స్మృతి ద్వారా సదా విజయీ భవ

మొత్తము చదువు మరియు శిక్షణల సారమంతా ఈ మూడు పదాలే - 1. కర్మ బంధనాలను తెంచాలి 2. తమ స్వభావ-సంస్కారాలను మలచుకోవాలి మరియు 3. ఒక్క తండ్రితోనే సర్వ సంబంధాలను జోడించాలి - ఈ మూడు పదాలే సంపూర్ణ విజయులుగా చేస్తాయి. దీని కొరకు సదా ఇదే స్మృతి ఉండాలి - ఈ కళ్ళతో ఏవైతే వినాశీ వస్తువులను చూస్తారో, అవన్నీ వినాశనమయ్యే ఉన్నాయి. వాటిని చూస్తూ కూడా మీ కొత్త సంబంధాలను, కొత్త సృష్టిని చూస్తూ ఉండండి, అప్పుడిక ఎప్పుడూ ఓటమి కలగదు.

స్లోగన్:-
సదా క్లీన్ అండ్ క్లియర్ (శుద్ధముగా మరియు స్పష్టముగా) ఉండటమే - యోగీ యొక్క గుర్తు.

అవ్యక్త ప్రేరణలు - అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా) అవ్వండి

ఒకవేళ బ్రాహ్మణ జీవితములో సంకల్పములోనైనా అపవిత్రత లేక అమర్యాద వచ్చినట్లయితే సింహాసనాధికారులకు బదులుగా పడిపోయే కళలోకి అనగా కిందకు వచ్చేస్తారు. వికర్మ ఏమీ జరగకపోయినా కానీ, ఒకవేళ వ్యర్థ కర్మ జరిగినా సరే, పశ్చాత్తాపానికి బదులుగా రియలైజేషన్ యొక్క స్టేజ్ వస్తుంది. ఇది రాంగ్, ఇలా జరగకూడదు... అన్న రియలైజేషన్ అయితే కలుగుతుంది. ఆ విషయము ముల్లులా గుచ్చుకుంటూ ఉంటుంది, అందుకే ఈ వ్యర్థము నుండి కూడా ముక్తులుగా అవ్వండి.