17-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు ఈ ప్రపంచానిది హోప్ లెస్ కేసులా (ఆశ లేనటువంటిదిగా) ఉంది, అందరూ మరణిస్తారు, అందుకే దీని నుండి మమకారాన్ని తొలగించండి, నన్నొక్కరినే స్మృతి చేయండి’’

ప్రశ్న:-
సేవ చేయడానికి ఉత్సాహము కలగకపోవడానికి కారణాలేమిటి?

జవాబు:-
1. ఒకవేళ లక్షణాలు సరిగ్గా లేకపోతే, తండ్రిని స్మృతి చేయకపోతే, సేవ చేయడానికి ఉత్సాహము కలగదు. ఏవో ఒక తప్పుడు కర్మలు జరుగుతూ ఉంటాయి, అందుకే సేవ చేయలేరు. 2. మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచము మరణించినట్లే - అని తండ్రి ఇచ్చిన మొదటి డైరెక్షన్ ఏదైతే ఉందో, దానిని అమలులోకి తీసుకురాకపోతే, బుద్ధి దేహము మరియు దేహ సంబంధాలలో చిక్కుకుని ఉన్నట్లయితే సేవ చేయలేరు.

పాట:-
ఓం నమః శివాయ...

ఓంశాంతి
ఇప్పుడు ఈ భక్తి మార్గపు పాటను విన్నారు. శివాయ నమః అని అంటారు. శివుని పేరును పదే-పదే తీసుకుంటారు. శివుని మందిరానికి రోజూ వెళ్తారు మరియు ఏవైతే పండుగలు ఉన్నాయో, వాటిని ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. పురుషోత్తమ మాసము కూడా ఉంటుంది, పురుషోత్తమ సంవత్సరము కూడా ఉంటుంది. శివాయ నమః అని రోజూ అంటూ ఉంటారు. శివుని పూజారులు చాలామంది ఉన్నారు. రచయిత శివుడు, వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు. పతిత-పావనుడు పరమపిత పరమాత్మ శివుడు అని కూడా అంటారు. రోజూ పూజ కూడా చేస్తారు. ఈ సంగమయుగము పురుషోత్తములుగా తయారయ్యే యుగమని పిల్లలైన మీకు తెలుసు. ఉదాహరణకు భౌతిక చదువు ద్వారా ఏదో ఒక ఉన్నతమైన పదవిని పొందుతారు కదా. ఈ లక్ష్మీ-నారాయణులు ఈ పదవిని ఎలా పొందారు, విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు అనేది ఎవరికీ తెలియదు. శివాయ నమః అని కూడా అంటారు. నీవే తల్లివి-తండ్రివి... అని అంటూ రోజూ వారి మహిమను పాడుతారు కానీ వారు ఎప్పుడు వచ్చి తల్లి-తండ్రిగా అయి వారసత్వాన్ని ఇస్తారు అనేది తెలియదు. ప్రపంచములోని మనుష్యులకు ఏమీ తెలియదని మీకు తెలుసు. భక్తి మార్గములో ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు. అమరనాథ్ కు గుంపులు గుంపులుగా ఎంతమంది వెళ్తారు. ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు. ఈ మాట ఎవరితోనైనా అంటే డిస్టర్బ్ అవుతారు. పిల్లలైన మీలో కొంతమందికి మాత్రమే లోలోపల చాలా సంతోషముంది. బాబా, మిమ్మల్ని గుర్తించినప్పటి నుండి, ఇక మా సంతోషానికి అవధులు లేవు అని వ్రాస్తూ ఉంటారు కూడా. ఏదైనా కష్టము వచ్చినా కూడా, సంతోషముగా ఉండాలి. మేము తండ్రికి చెందినవారిగా అయ్యాము అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు. మేము శివబాబాను పొందాము - అని పిల్లలైన మీకు తెలుసు కనుక ఇక మీ సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కి ఉండాలి. మాయ పదే-పదే మర్చిపోయేలా చేస్తుంది. మాకు నిశ్చయముంది, మాకు బాబా తెలుసు అని వ్రాస్తారు కూడా, అయినా కానీ నడుస్తూ-నడుస్తూ చల్లబడిపోతారు. 6-8 నెలలు, 2-3 సంవత్సరాలు రాకపోతే, ఈ పిల్లలు పూర్తి నిశ్చయబుద్ధి కలవారు కాదని, వారికి పూర్తి నషా ఎక్కలేదని బాబాకు అర్థమైపోతుంది. ఇలాంటి అనంతమైన తండ్రి నుండి 21 జన్మల వారసత్వము లభిస్తుంది అన్న నిశ్చయము ఏర్పడితే, ఇక సంతోషము యొక్క నషా చాలా ఉండాలి. ఉదాహరణకు ఎవరి కొడుకునైనా రాజు దత్తత తీసుకోవాలని అనుకున్నప్పుడు, రాజు అతడిని వారసునిగా చేసుకుంటారని మాటలు జరుగుతున్నాయని ఆ పిల్లవాడికి తెలిస్తే, అతనికి చాలా సంతోషము కలుగుతుంది కదా. నేను రాజుకు కొడుకుగా అవుతున్నానని అనిపిస్తుంది. పేదవారి కొడుకును షావుకారులు దత్తత తీసుకుంటే అతనికి చాలా సంతోషము కలుగుతుంది కదా. నన్ను ఫలానావారు దత్తత తీసుకుంటున్నారని తెలిస్తే పేదరికపు దుఃఖాన్ని మర్చిపోతాడు. కానీ ఎంతైనా అది ఒక్క జన్మకు సంబంధించిన విషయము. ఇక్కడ పిల్లలకు, 21 జన్మలకు వారసత్వము తీసుకుంటామనే సంతోషము ఉంటుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి మరియు ఇతరులకు మార్గాన్ని తెలియజేయాలి. పతిత-పావనుడైన శివబాబా వచ్చి ఉన్నారు. నేను మీ తండ్రిని అని వారు అర్థం చేయిస్తారు. ఈ విధముగా - నేను మీ అనంతమైన తండ్రిని అని మనుష్యులెవరూ చెప్పలేరు. నేను 5 వేల సంవత్సరాల క్రితం వచ్చానని తండ్రియే అర్థం చేయిస్తారు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని మాత్రమే చెప్పారు. పతిత-పావన తండ్రినైన నన్ను స్మృతి చేస్తేనే మీరు పతితుల నుండి పావనముగా అవుతారు. పతితుల నుండి పావనముగా అయ్యేందుకు ఇంకే ఉపాయము లేదు. పతిత-పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. గీతా భగవానుడు ఒక్క పతిత-పావనుడు మాత్రమే, వారు పునర్జన్మ రహితుడు. మొట్టమొదట ఈ విషయములో అభిప్రాయాన్ని వ్రాయించండి. పెద్ద-పెద్దవారు వ్రాసింది చూస్తే, ఇది సరియైనదేనని భావిస్తారు. ఎవరైనా సాధారణ వ్యక్తులు వ్రాసింది చూస్తే, బ్రహ్మాకుమారీలు వీరికి గారడి చేసారు, అందుకే ఇలా వ్రాసారు అని అంటారు, అదే పెద్ద వ్యక్తుల వ్రాస్తే ఇలా అనరు. మీరు ఏదైనా చెప్తే, చిన్న నోటితో భగవంతుడు వచ్చారనే పెద్ద మాటలు మాట్లాడుతున్నారని భావిస్తారు. పిల్లలైన మీరు కేవలం భగవంతుడు వచ్చారని చెప్పడము కాదు, అలా చెప్తే ఎవరూ అర్థం చేసుకోరు, ఇంకా నవ్వుకుంటారు. ఇద్దరు తండ్రులు ఉన్నారని అర్థం చేయించాలి. భగవంతుడు వచ్చారని ముందే డైరెక్టుగా చెప్పకూడదు, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచములో కూడా స్వయాన్ని భగవంతుడని చెప్పుకునేవారు చాలామంది అయిపోయారు. వారంతా తమను తాము భగవంతుని అవతారముగా భావిస్తారు. అందుకే యుక్తితో ఇద్దరు తండ్రుల రహస్యాన్ని అర్థం చేయించాలి. ఒకరు హద్దు తండ్రి, మరొకరు అనంతమైన తండ్రి. తండ్రి పేరు శివ. వారు ఆత్మలందరికీ తండ్రి కనుక తప్పకుండా పిల్లలకు వారసత్వాన్ని ఇస్తూ ఉండవచ్చు. శివజయంతిని కూడా జరుపుకుంటారు. వారే వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు, అంటే తప్పకుండా నరకము యొక్క వినాశనము అవ్వనున్నది. దానికి గుర్తుగా ఈ మహాభారత యుద్ధము ఉంది. ఇకపోతే, కేవలం భగవంతుడు వచ్చారని చెప్తే ఎవరూ అర్థం చేసుకోరు. దండోరా వేస్తూ ఉంటారు. ఇలా తప్పుగా సేవ చేస్తే, సేవలో ఇంకా ఢీలాతనము వచ్చేస్తుంది. ఒక వైపు భగవంతుడు వచ్చారని, భగవంతుడు చదివిస్తున్నారని అంటారు, మరో వైపు వెళ్ళి వివాహము చేసుకుంటారు. అప్పుడు మనుష్యులు - మీకు ఏమైంది, మీరు భగవంతుడు చదివిస్తున్నారని చెప్పేవారు కదా అని అడుగుతారు. అప్పుడు వారు - మేము ఏది విన్నామో, అది చెప్పాము అని అంటారు. ఇక్కడ కూడా పిల్లల ద్వారా అనేక రకాల విఘ్నాలు ఏర్పడతాయి, ఎలాగైతే హిందు ధర్మము వారు తమకు తామే చెంపదెబ్బ వేసుకున్నారో, అలా. వాస్తవానికి వారు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు కానీ మేము హిందువులమని చెప్పుకుంటారు. అంటే, తమకు తాము చెంపదెబ్బ వేసుకున్నట్లు కదా. ఇప్పుడు మీకు తెలుసు - మనమే పూజ్యులుగా ఉన్నప్పుడు శ్రేష్ఠ కర్మలు ఉండేవి, శ్రేష్ఠ ధర్మము ఉండేది, ఆసురీ మతము అనుసారముగా కర్మలు మరియు ధర్మము భ్రష్టమయ్యాయి. ఆసురీ మాయావి మతం కారణముగా మనమే మన ధర్మాన్ని నిందించడము మొదలుపెడతాము, అందుకే బాబా స్వయంగా చెప్పారు - వారు ఆసురీ సాంప్రదాయము వారు, ఇది దైవీ సాంప్రదాయము, వీరికి నేను రాజయోగము నేర్పిస్తాను. ఇప్పుడిది కలియుగము. ఎవరైతే వచ్చి ఈ జ్ఞానాన్ని వింటారో, వారు అసురుల నుండి మారి దేవతలుగా అవుతారు. దేవతలుగా తయారయ్యేందుకే ఈ జ్ఞానము ఉంది. 5 వికారాలపై విజయము పొందినట్లయితే దేవతలుగా అవుతారు, అంతేకానీ, అసురులకు, దేవతలకు మధ్యన యుద్ధమేమీ జరగలేదు. ఇలా అని పొరపాటు చేసారు. ఇంకా ఏమి చూపిస్తారంటే, ఎవరి వైపైతే సాక్షాత్తు భగవంతుడు ఉన్నారో, వారికి విజయము లభించింది అని, అందులో శ్రీకృష్ణుడి పేరు పెట్టేసారు. వాస్తవానికి మీకు మాయతో యుద్ధము జరుగుతుంది.

తండ్రి కూర్చుని పిల్లలకు ఎన్ని విషయాలను అర్థం చేయిస్తారు, కానీ ఎంత తమోప్రధానముగా ఉన్నారంటే అసలేమీ అర్థం చేసుకోవడము లేదు. తండ్రిని స్మృతి చేయలేకపోతారు. నా బుద్ధి ఎంత తమోప్రధానముగా ఉందంటే, అసలు స్మృతి నిలవడమే లేదు, అందుకే తప్పుడు పనులు చేస్తూ ఉంటాను - అని కూడా వారు అర్థం చేసుకుంటారు. మంచి-మంచి పిల్లలు కూడా అసలు స్మృతి చేయరు. లక్షణాలు బాగు అవ్వనే అవ్వవు, అందుకే సేవ చేయాలనే ఉత్సాహము కలగదు. తండ్రి అంటారు - దేహ సహితముగా దేహ సంబంధాలేవైతే ఉన్నాయో, వాటన్నింటినీ హతమార్చండి అనగా మర్చిపోండి. వాస్తవానికి ఇక్కడ హతమార్చడము అనే పదము ఉండదు. మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచము మరణించినట్లే అని అంటారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీరు నాకు చెందినవారిగా అయ్యారు కనుక వీటన్నింటినీ బుద్ధితో మర్చిపోండి, ఒక్క తండ్రిని స్మృతి చేయండి. ఎవరి విషయములోనైనా వ్యాధి హోప్ లెస్ కేసుగా అయిపోతే, వాళ్ళ పట్ల మమకారాన్ని తొలగించాల్సి ఉంటుంది. అప్పుడు వారిని రామ-రామ అనమని చెప్తారు. ఈ ప్రపంచము యొక్క కేసు చాలా హోప్ లెస్ గా ఉందని తండ్రి కూడా అంటారు. ఇది సమాప్తము అయ్యేదే ఉంది, అందరూ మరణిస్తారు, అందుకే దీని నుండి మమకారాన్ని తొలగించండి. వారు రామ-రామ అన్న జపం మొదలుపెడతారు. ఇక్కడ ఇది ఒక్కరి విషయము కాదు. మొత్తం ప్రపంచమంతా వినాశనమవ్వనున్నది, అందుకే మీకు ఒకే మంత్రాన్ని ఇస్తున్నాను - నన్నొక్కరినే స్మృతి చేయండి. రకరకాల పద్ధతులలో ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు పురుషోత్తమ మాసము వచ్చింది కనుక పురుషోత్తమ యుగము గురించి కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. అర్థం చేయించేందుకు చాలా వివేకముండాలి, ధారణ బాగుండాలి. ఏ పాప కర్మలు చేయకూడదు. అనుమతి లేకుండా ఏదైనా వస్తువును తీసుకోవడము, తినడము - ఇది కూడా చాలా గుప్తమైన పాపము. నియమాలు చాలా కఠినముగా ఉన్నాయి, పాపాలు చేసి కూడా చెప్పకపోతే, ఇక పాపాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక్కడైతే పిల్లలైన మీరు పుణ్యాత్ములుగా అవ్వాలి. నాకు పుణ్యాత్ముల పట్ల స్నేహము ఉంది, పాపాత్ముల పట్ల విరోధము ఉంది. భక్తి మార్గములో కూడా, మంచి కర్మలు చేస్తే మంచి ఫలం లభిస్తుందని చెప్పి దాన-పుణ్యాలు మొదలైన మంచి కర్మలు చేస్తారు కదా. ఇది డ్రామా, అయినా కానీ భగవంతుడు మంచి కర్మలకు మంచి ఫలాన్ని ఇస్తారని అంటారు. తండ్రి అంటారు, నేను కేవలం ఈ పనే చేస్తూ ఉండను. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. డ్రామానుసారముగా తండ్రి తప్పకుండా రావాల్సి ఉంటుంది.

తండ్రి అంటారు - నేను వచ్చి అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. ఇకపోతే ఇందులో కృప మొదలైన విషయమేమీ లేదు. కొందరు ఇలా వ్రాస్తూ ఉంటారు - బాబా, మీ కృప ఉంటే మేము మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము అని. తండ్రి అంటారు - నేను ఎప్పుడూ కృప మొదలైనవి చూపించను, అవి భక్తి మార్గానికి చెందిన విషయాలు. మీరు మీపై కృప చూపించుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. భక్తి మార్గానికి చెందిన విషయాలు జ్ఞాన మార్గములో ఉండవు. జ్ఞాన మార్గమంటేనే చదువు. టీచర్ ఎవరిపైనా కృప చూపించరు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు, దానిపై నడుచుకోవాలి కదా. కానీ స్వంత మతముపై నడుస్తున్న కారణముగా ఏ సేవ చేయరు. పిల్లలు పూర్తిగా పుణ్యాత్ములుగా అవ్వాలి. కొంచెం కూడా పాపము జరగకూడదు. కొంతమంది పిల్లలు వారు చేసిన పాపాలను అసలెప్పుడూ చెప్పరు. అటువంటివారు ఎప్పటికీ ఉన్నత పదవిని పొందరని తండ్రి కూడా అంటారు. ఎక్కితే వైకుంఠ రసాన్ని ఆస్వాదిస్తారు కానీ ఒకవేళ తప్పటడుగు వేసి మాయకు వశమై దిగజారితే అధఃపాతాళము తప్పదు అని అంటూ ఉంటారు. ఇది చాలా ఉన్నతమైన పదవి అని పిల్లలకు తెలుసు. పడిపోతే దేనికి పనికి రాకుండా అయిపోతారు. అశుద్ధ అహంకారము మొదటి నంబరు, తర్వాత కామము, క్రోధము, లోభము కూడా తక్కువేమీ కాదు. లోభము, మోహము కూడా సర్వనాశనము చేసేస్తాయి. పిల్లలు మొదలైనవారి పట్ల మోహముంటే వారు గుర్తుకువస్తూ ఉంటారు. ఆత్మ అంటుంది - నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు, ఇతరులెవ్వరూ గుర్తుకురాకూడదు, ఇటువంటి పురుషార్థము చేయాలి. ఇదంతా సమాప్తమవ్వనున్నది. వినాశనము ఎదురుగా నిలబడి ఉంది, ఇక తర్వాత వారసత్వాన్ని తీసుకోలేరు. ఈ ప్రపంచము పట్ల ఏమి మోహం పెట్టుకోవాలి. ఈ విధముగా మీతో మీరు మాట్లాడుకోవాలి. మొత్తం ప్రపంచమంతటినీ బుద్ధితో మర్చిపోవాలి. ఇదంతా సమాప్తమవ్వాల్సిందే. ఒక్కసారిగా సమాప్తమయ్యే విధముగా తుఫానులు వస్తాయి. ఎక్కడో నిప్పు అంటుకుంటుంది, అప్పుడు గాలి వేగముగా వీచిందంటే ఒక్కసారిగా మొత్తం సమాప్తము చేసేస్తుంది. అరగంటలో 100-150 గుడిసెలను సమాప్తము చేసేస్తుంది. ఈ ప్రపంచానికి నిప్పు తప్పకుండా అంటుకునేదే ఉందని మీకు తెలుసు, లేదంటే ఇంతమంది మనుష్యులు ఎలా మరణిస్తారు. ఎవరైతే మంచి పిల్లలు ఉన్నారో, లక్షణాలు కూడా బాగున్నాయో, వారు సేవ కూడా బాగా చేస్తారు. పిల్లలైన మీకు నషా ఉండాలి. అంతిమములో ఎప్పుడైతే కర్మాతీత అవస్థకు చేరుకుంటారో, అప్పుడు పూర్తి నషా ఉంటుంది, అయినా కూడా పురుషార్థము చేస్తూ ఉంటారు. బనారస్ లోని శివుని మందిరానికి చాలామంది వెళ్తారు ఎందుకంటే వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు. అక్కడ శివుని భక్తి చాలా ఉంటుంది. బాబా అయితే చెప్తూ ఉంటారు - అక్కడికి వెళ్ళి వారికి ఇలా అర్థం చేయించండి - ఈ శివ భగవానుడు ఈ లక్ష్మీ-నారాయణులకు ఈ వారసత్వాన్ని ఇస్తారు, సంగమములోనే వారికి శివుని నుండి ఈ వారసత్వము లభిస్తుంది. ఇలా అర్థం చేయిస్తే, బ్రహ్మా-సరస్వతుల గురించి కూడా అర్థమవుతుంది. వారికి ఆ రాజ్యము ఎలా లభించింది అనేది చిత్రాలపై చాలా స్పష్టముగా అర్థం చేయించవచ్చు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యములో భక్తి మార్గము లేదు. భక్తి అయితే అనాదిగా ఉండనే ఉందని వారంటారు. ఇప్పుడు మీకు ఎంత జ్ఞానము లభించింది కావున మీకు నషా ఎక్కాలి కదా. 21 జన్మల రాజ్య భాగ్యాన్ని ఇచ్చేందుకు మనల్ని భగవంతుడు చదివిస్తున్నారు. మీరు విద్యార్థులు కదా. నిశ్చయము ఉన్నవారు ఏమనుకుంటారంటే - ఈ బ్రహ్మాకుమారీలు ఎవరి ద్వారానైతే విని మాకు నిశ్చయము కలిగిస్తున్నారో, ఆ వినిపించేవారు స్వయం ఎలా ఉంటారో, అటువంటి తండ్రిని ముందు కలుసుకోవాలి. ఎప్పటివరకైతే పూర్తి నిశ్చయము కలగదో, అంతవరకు ముందుకు రారు. నిశ్చయమున్నవారే వెంటనే పరుగెడతారు. అటువంటి తండ్రిని మేము వెళ్ళి కలుసుకుంటాము, విడిచిపెట్టము అని అంటారు. బాబా, ఇక మేము మీ వారిగా అయిపోయాము, అంతే, ఇక మేము వెళ్ళము అని అంటారు. పాట కూడా ఉంది కదా - మీరు ప్రేమించినా, తిరస్కరించినా, ఈ పిచ్చివాడు మీ ద్వారాన్ని విడిచిపెట్టరు అని. కానీ, ఇక్కడ కూర్చోబెట్టలేము. సేవకు పంపించాల్సి ఉంటుంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా తయారవ్వాలి. అలా వ్రాసి ఇస్తారు కూడా, కానీ బయటకు వెళ్ళిన తర్వాత మాయ చక్రములో చిక్కుకుపోతారు. మాయ అంతటి ప్రబలమైనది. మాయ విఘ్నాలు చాలా కలుగుతాయి. చిన్న దీపానికి మాయ తుఫానులు ఎన్ని వస్తాయి. ఈ పాటల సారాన్ని కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. మీ పురుషోత్తమ యుగము నడుస్తూ ఉంది, భక్తుల పురుషోత్తమ మాసము గడిచిపోయింది. తండ్రి అంటారు - పతితులను పావనముగా చేయడానికి ఈ సంగమయుగములోనే నేను వస్తాను. వివరణ ఎంత బాగుంది.

అచ్ఛా - రోజురోజుకూ సేవ వృద్ధి కోసం కొత్త-కొత్త యుక్తులు వెలువడుతూ ఉంటాయి. మంచి-మంచి చిత్రాలు తయారవుతూ ఉంటాయి. ఆలస్యమైనా సరే, కార్యము బాగా అవుతుందని అంటారు కదా. తయారుగా ఉన్న సరుకు లభిస్తుంది, దానితో ఎవరైనా వెంటనే అర్థం చేసుకోగలరు. మెట్ల వరుస చిత్రము చాలా బాగుంది. ఈ సమయములో ఎవరూ, మేము పావనముగా ఉన్నామని అనలేరు. పావన ప్రపంచమని సత్యయుగాన్నే అంటారు. పావన ప్రపంచానికి యజమానులు ఈ లక్ష్మీ-నారాయణులు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. కొద్దిగా కూడా ఏ పెద్ద పాపము లేక సూక్ష్మ పాపము జరగకూడదు, దీని పట్ల చాలా-చాలా అటెన్షన్ పెట్టాలి. ఎప్పుడూ ఏ వస్తువును దాచిపెట్టి తీసుకోకూడదు. లోభము, మోహము నుండి కూడా జాగ్రత్తగా ఉండాలి.

2. సర్వనాశనము చేసే అశుద్ధ అహంకారాన్ని త్యాగము చేయాలి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తుకురాకూడదు - ఈ పురుషార్థమే చేయాలి.

వరదానము:-
దేహ భానాన్ని అర్పణ చేసి సమర్పణ అయ్యే యోగయుక్త, బంధనముక్త భవ

ఎవరైతే దేహాభిమానాన్ని అర్పణ చేస్తారో, వారి ప్రతి కర్మ దర్పణముగా అయిపోతుంది. ఎలాగైతే, ఏదైనా వస్తువును అర్పణ చేస్తే, ఆ అర్పణ చేయబడిన వస్తువును తమదిగా భావించడము జరగదు. అలాగే దేహ భానాన్ని కూడా అర్పణ చేసినప్పుడు ఎప్పుడైతే నాది అనేది తొలగిపోతుందో, అప్పుడు మోహము కూడా తొలగిపోతుంది. వారినే సంపూర్ణ సమర్పణ అయినవారు అంటారు. ఇలా సమర్పణ అయ్యేవారు సదా యోగయుక్తులుగా మరియు బంధనముక్తులుగా ఉంటారు. వారి ప్రతి సంకల్పము, ప్రతి కర్మ యుక్తియుక్తముగా ఉంటుంది.

స్లోగన్:-
సర్వశక్తివంతుడిని సహచరునిగా చేసుకున్నట్లయితే సఫలత మీ చరణాల చెంతకు వచ్చేస్తుంది.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి

స్వయాన్ని సదా దాతగా మరియు మహాదానిగా భావించాలి. మహాజ్ఞానిగా అయిన తర్వాత మహాదాని కర్తవ్యము నడుస్తుంది. మహాజ్ఞాని యొక్క పరిశీలన మహాదానిగా అవ్వటములో ఉంటుంది. ఇప్పుడు మీ మూర్తిలో ఎటువంటి మెరుపు ఉండాలంటే ఎవ్వరూ కూడా వారి వారసత్వాన్ని తీసుకోవటము నుండి వంచితులవ్వకూడదు. ఇలా స్వయాన్ని దాత పిల్లలుగా, దాతలుగా భావించాలి. ఇచ్చేవారిలో ఏ నషా మరియు మెరుపు ఉంటాయో, ఇప్పుడు ఆ సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి.