17-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - చెడు వినకండి, ఒక్క తండ్రి నుండే వినాలి, గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా ఉండాలి’’

ప్రశ్న:-
ఏ ఆట గురించి యథార్థముగా తెలిసిన పిల్లలు ఎప్పుడూ తికమకపడరు?

జవాబు:-
దుఃఖము మరియు సుఖము, భక్తి మరియు జ్ఞానము యొక్క ఆట ఏదైతే నడుస్తుందో, దాని గురించి యథార్థ రీతిలో తెలిసినవారు ఎప్పుడూ తికమకపడరు. భగవంతుడు ఎవరికీ దుఃఖము ఇవ్వరని మీకు తెలుసు, వారు దుఃఖహర్త-సుఖకర్త. ఎప్పుడైతే అందరూ దుఃఖితులుగా అవుతారో, అప్పుడు దుఃఖాల నుండి విముక్తులుగా చేయడానికి వారు వస్తారు.

పాట:-
ఈ రోజు ఉదయాన్నే ఎవరు వచ్చారు...

ఓంశాంతి
పిల్లలు ఏం విన్నారు? ఇది భక్తిలోని పాట. భక్తిని ఇంగ్లీషులో ఫిలాసఫీ అని అంటారు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పి.హెచ్.డి) అనే టైటిల్ లభిస్తుంది. ఇప్పుడు ఫిలాసఫీ (భక్తి) గురించైతే చిన్న, పెద్ద అందరికీ తెలుసు. ఈశ్వరుడు ఎక్కడ ఉంటారు అని ఎవరినైనా అడగండి, అప్పుడు వారు సర్వవ్యాపి అని అంటారు. ఇది కూడా ఒక ఫిలాసఫీయే కదా. ఇప్పుడు శాస్త్రాల విషయాలనేవీ తండ్రి వినిపించరు. భక్తులెవ్వరినీ జ్ఞానసాగరుడు అని అనరు. వారిలో జ్ఞానము లేదు, అలాగని వారు జ్ఞానసాగరుని పిల్లలు కూడా కారు. జ్ఞానసాగరుడైన తండ్రి గురించి ఎవరికీ తెలియదు. అలాగే ఎవరూ తమను తాము వారి సంతానముగా కూడా భావించరు. వారంతా భగవంతుడిని కలుసుకునేందుకని భక్తి చేస్తారు కానీ భగవంతుని గురించే తెలియనప్పుడు ఇక భక్తితో లాభమేముంటుంది? చాలామందికి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనే టైటిల్ లభిస్తూ ఉంటుంది. వారి బుద్ధిలో, ఈశ్వరుడు సర్వవ్యాపి అన్న మాట ఒక్కటే ఉంటుంది. వారు దానిని ఫిలాసఫీగా భావిస్తారు, దీని కారణముగానే పడిపోతూ వచ్చారు, దీనినే ధర్మ గ్లాని అని అంటారు. మనము మనుష్యులెవ్వరితోనూ శాస్త్రాల గురించి వాదోపవాదాలు చేయకూడదు. మనము ఏ మనుష్యుల ద్వారా చదువుకోవడము లేదు. మిగిలిన మనుష్యులందరూ మనుష్యుల ద్వారా చదువుకుంటారు. వేద-శాస్త్రాలు మొదలైనవన్నీ మనుష్యుల ద్వారానే చదువుకుంటారు. వాటిని తయారుచేసింది కూడా మనుష్యులే. మీకు ఈ జ్ఞానాన్ని వినిపించేవారు ఆత్మిక తండ్రి ఒక్కరే. వారు ఒక్కసారి మాత్రమే వచ్చి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మనకు మనుష్యులెవ్వరి నుండి ఏమీ నేర్చుకోవాల్సిన అవసరము లేదు. మీరు ఇప్పుడు ఆత్మిక తండ్రి నుండి మాత్రమే వినాలి. వినేవారు ఆత్మిక పిల్లలు, ఆత్మలు. ఆ మనుష్యులందరూ మనుష్యులకు వినిపిస్తారు. ఇది ఆత్మిక తండ్రి ఇచ్చే జ్ఞానము, అది మనుష్యుల జ్ఞానము. ఈ బాబా (సాకార బాబా) కూడా మనిషే కదా. వాళ్ళకు చెప్పండి - ఆత్మిక తండ్రి వీరి ద్వారా వినిపిస్తారు, ఆత్మలమైన మేము వింటాము, తర్వాత ఆత్మలమైన మేము శరీరము ద్వారా ఇతరులకు వినిపిస్తాము. ఇది ఆత్మిక జ్ఞానము. మిగతా అంతా భౌతిక జ్ఞానము. భక్తిలో శరీరాలను పూజిస్తారు. తండ్రి అంటారు - మీరు స్వయాన్ని ఒక మనిషిగా లేక భక్తునిగా భావించకండి, మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఆత్మలైన మీరు పరస్పరములో సోదరులు. ఆత్మ-పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారని అంటూ ఉంటారు కూడా. మనము మనుష్యులెవ్వరి నుండి వినకూడదు. ఎవరైనా ప్రశ్న అడిగితే, మాది శాస్త్రాల జ్ఞానమేమీ కాదు అని చెప్పండి. మనము దానిని ఫిలాసఫీ అని అంటాము అనగా అది భక్తి మార్గపు జ్ఞానము. సద్గతినిచ్చే జ్ఞానాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. సర్వుల సద్గతిదాత ఒక్కరే అని అంటూ ఉంటారు. పిల్లలైన మీరు ఎవరితోనూ వాదించకూడదు.

తండ్రి అంటారు, జ్ఞానము యొక్క అథారిటీ - జ్ఞాన సాగరుడినైన నేను. నేను మీకు శాస్త్రాలు మొదలైనవేవీ వినిపించను. నేను అందిస్తున్న ఈ జ్ఞానము ఆత్మిక జ్ఞానము, మిగిలినదంతా భౌతిక జ్ఞానము. ఆ సత్సంగాలు మొదలైనవన్నీ భక్తి మార్గము కోసం ఉన్నవి. ఈ ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. అందుకే దేహీ-అభిమానులుగా అవ్వడములో పిల్లలకు శ్రమ అనిపిస్తుంది. ఆత్మలమైన మనము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి పిల్లలు తప్పకుండా తండ్రి సింహాసనానికే వారసులు అవుతారు కదా. లక్ష్మీ-నారాయణులు కూడా దేహధారులే. వారి పిల్లలు దైహిక తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. ఈ విషయము అతీతమైనది. సత్యయుగములో కూడా ఇది ఒక దైహిక విషయములానే ఉంటుంది. అక్కడ ఆత్మిక తండ్రి నుండి వారసత్వము లభిస్తుందని అనరు. దేహాభిమానాన్ని తెంచివేయాలి. నేను ఒక ఆత్మను మరియు నేను తండ్రిని స్మృతి చేయాలి, దీనినే భారత్ యొక్క ప్రాచీన యోగమని అంటూ ఉంటారు. యాద్ (స్మృతి) అనేది హిందీ పదము. ఈ జ్ఞానాన్ని మీకు ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు? ఇది మనుష్యులెవ్వరికీ తెలియదు. జన్మజన్మలుగా మనుష్యులు మనుష్యులతో మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆత్మ వినిపిస్తుంది, అందుకే దీనిని ఆత్మిక స్పిరిచ్యుల్ నాలెడ్జ్ అని అంటారు. గీతను కూడా వారు స్పిరిచ్యుల్ నాలెడ్జ్ (ఆధ్యాత్మిక జ్ఞానము) గా భావిస్తారు కానీ అందులో దేహధారి అయిన శ్రీకృష్ణుని పేరును వేసేశారు. తండ్రి అంటారు, మనుష్యులెవ్వరిలోనూ ఈ జ్ఞానము ఉండదు. ఎప్పుడైనా ఎవరైనా మీతో వాదిస్తే, వారికి ఇలా చెప్పండి - మీది భక్తికి సంబంధించిన జ్ఞానము, అది మనుష్యుల ద్వారా తయారుచేయబడిన శాస్త్రాల జ్ఞానము. సత్యమైన జ్ఞానమైతే ఒక్క జ్ఞానసాగరుడైన తండ్రి వద్ద మాత్రమే ఉంది, స్వయంగా వారే జ్ఞానాన్ని ఇస్తున్నారు. వారిని సుప్రీమ్ తండ్రి అని అంటారు. పూజ కూడా ఆ నిరాకారునికి జరుగుతుంది. ఒకవేళ నిరాకారిగా ఉన్న ఇంకెవరికైనా పూజ జరుగుతుందంటే, అది ఈ తండ్రి పిల్లలే. మట్టితో సాలిగ్రామాలను తయారుచేసి పూజ చేస్తారు. రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు.

ఆ పరమపిత పరమాత్మ నిరాకారీ ప్రపంచములో ఉంటారని మీకు తెలుసు. ఆత్మలమైన మనము కూడా అక్కడే ఉంటాము. ఆ జ్ఞాన సాగరుడు వచ్చి జ్ఞానాన్ని వినిపించి అందరికీ సద్గతినిస్తారు. వారు అత్యంత అతీతమైన, దూరమైన స్థానములో ఉండే పరమపిత పరమాత్మ. సోదరులైన ఆత్మలందరికీ పాత్ర లభించి ఉంది, వారే తర్వాత శరీరాలను ధారణ చేసి సోదరీ-సోదరులుగా అవుతారు. ఆత్మలందరూ ఒక్క తండ్రి పిల్లలు. ఆత్మ శరీరాన్ని ధారణ చేసినప్పుడు స్వర్గములో సుఖాన్ని మరియు నరకములో దుఃఖాన్ని పొందుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? జ్ఞానము మరియు భక్తి ఉంటాయని అర్థం చేయించడము జరుగుతుంది. అది పగలు, ఇది రాత్రి. జ్ఞానముతో సుఖము, భక్తితో దుఃఖము కలుగుతుంది, ఈ ఆట ఈ విధముగా తయారుచేయబడింది. అంతేకానీ, దుఃఖము, సుఖము అన్నీ భగవంతుడే రచిస్తారని కాదు. దుఃఖితులైనప్పుడే భగవంతుడిని పిలుస్తారు. వారిని సుఖాన్ని ఇచ్చేవారిగా భావిస్తారు. తర్వాత సుఖము యొక్క సమయము పూర్తయినప్పుడు పంచ వికారాలు అనే రావణుడి కారణముగా దుఃఖము మొదలవుతుంది. ఇదే ఆట, దీనిని యథార్థ రీతిలో అర్థం చేసుకోవాలి. దీనినే ఆత్మిక జ్ఞానమని అంటారు. మిగిలినదంతా భౌతిక జ్ఞానము, అది మనం వినాలని అనుకోము. మనకు లభించిన ఆజ్ఞ ఏమిటంటే - కేవలం నిరాకార తండ్రినైన నా ద్వారా మాత్రమే వినండి. తండ్రి అంటారు - చెడు వినకండి... మేము ఒక్క భగవంతుడి నుండి మాత్రమే వింటాము మరియు మీరు మనుష్యుల నుండి వింటారు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. పెద్ద-పెద్ద విద్వాంసులు శాస్త్రాలు మొదలైనవాటిని చదువుతారు. వాటినైతే మనము కూడా చాలా చదివాము. ఇప్పుడు భగవంతుడు అంటారు, మీరు చాలామంది గురువులను ఆశ్రయించారు, ఇప్పుడు వారిని వదిలేయండి, నేను ఏదైతే వినిపిస్తున్నానో అది మాత్రమే వినండి. భగవంతుడు ఉన్నదే నిరాకారుడు. వారి పేరు శివ. ఇప్పుడు మనము వారి నుండి వింటున్నాము. తండ్రి స్వయంగా తమ పరిచయాన్ని మరియు తమ రచన యొక్క ఆదిమధ్యాంతాల పరిచయాన్ని ఇస్తారు, అలాంటప్పుడు మేము శాస్త్రాలు మొదలైనవాటికి సంబంధించిన విషయాలను మీ నుండి ఎందుకు వినాలి! మేము మీకు ఆత్మిక జ్ఞానాన్ని వినిపిస్తాము. వినాలనుకుంటే వినండి. ఇందులో తికమకపడే విషయమేమీ లేదు. మొత్తం ప్రపంచమంతా ఒకవైపు ఉంది, ఇంకొక వైపు మీరు ఎంత తక్కువమంది ఉన్నారు. తండ్రి ఇప్పుడు అంటున్నారు - నన్ను స్మృతి చేస్తే మీ పై ఏదైతే పాపాల భారము ఉందో, అది తొలగిపోతుంది మరియు మీరు పవిత్రముగా అవుతారు. ఎవరైతే పవిత్రముగా అవుతారో, వారే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు పాత ప్రపంచము మారనున్నది. కలియుగము తర్వాత సత్యయుగము రానున్నది. సత్యయుగము పావన ప్రపంచము. మీరు వచ్చి పావన ప్రపంచాన్ని తయారుచేయండి అని కలియుగములోనే నన్ను పిలుస్తారు. అందుకే ఇప్పుడు నేను వచ్చాను, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇప్పుడు ప్రపంచము మారుతోంది. ఇది అంతిమ జన్మ. ఈ పాత ప్రపంచములో ఆసురీ రాజ్యము సమాప్తమై రామ రాజ్యము స్థాపనవుతూ ఉంది, అందుకే ఇప్పుడు ఈ అంతిమ జన్మలో గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా అవ్వండి. ఇది విషయ సాగరము కదా. కమలపుష్పము నీటిపై ఉంటుంది. ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా అవ్వండి. మనము రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా మారనున్నది. ఆ ధర్మ స్థాపకులు కేవలం తమ-తమ ధర్మాలను స్థాపన చేస్తారు. వారు ముందు పావనముగా ఉంటారు, తర్వాత పతితముగా అవుతారు. ఒక్క సద్గురువు మాత్రమే సద్గతిదాత. మనుష్యులు సద్గతిలోకి వెళ్ళాలనుకున్నప్పుడే గురువులను ఆశ్రయిస్తారు. పాపాలు బాగా పెరిగినప్పుడు ఆత్మిక తండ్రి జ్ఞానాన్ని వినిపిస్తారు. భక్తికి ఫలమైన జ్ఞానము మీకు భగవంతుడి ద్వారా లభిస్తుంది. భగవంతుడు భక్తినేమీ నేర్పించరు. వారు జ్ఞానాన్ని ఇస్తారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని అంటారు. పావనముగా అయ్యేందుకు వేరే మార్గమేమీ లేదు. కొత్త ప్రపంచములో అందరూ స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడు పాత ప్రపంచములో అందరూ నరకవాసులుగా ఉన్నారు, అందుకే తండ్రి అంటారు - నేను అందరినీ ఉద్ధరించేందుకు వస్తాను, నేనే వచ్చి ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తాను. నేను మీ తండ్రిని అని తండ్రి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. ఇప్పుడిది నరకము. కొత్త ప్రపంచాన్ని స్వర్గమని అంటారు. స్వర్గము, నరకము ఇక్కడే ఉన్నాయని ఎలా అంటారు. ఎవరి వద్దనైతే చాలా ధనముందో, వారు స్వర్గములో ఉన్నారని భావిస్తారు. కానీ స్వర్గమనేది కొత్త ప్రపంచములోనే ఉంటుంది. ఇక్కడ స్వర్గము ఎక్కడ నుండి వస్తుంది! అందుకే మనము మనుష్యులెవ్వరి మాటలు వినము. తండ్రి అంటారు, మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలంటే నన్నొక్కరినే స్మృతి చేయండి. రోజంతా బుద్ధిలో ఈ జ్ఞానము ఉండాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క తండ్రి నుండే ఆత్మిక విషయాలను వినాలి. ఎవరితోనూ వేరే విషయాల గురించి వాదోపవాదాలు చేయకూడదు.

2. దేహీ-అభిమానులుగా అయ్యే కృషి చేయాలి. సతోప్రధానముగా అయ్యేందుకు ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి.

వరదానము:-
కర్మల ద్వారా గుణాల దానము చేసే డబల్ లైట్ ఫరిశ్తా మూర్తి భవ

ఏ పిల్లలైతే కర్మణా ద్వారా గుణాలను దానము చేస్తారో, వారి నడవడిక మరియు ముఖము రెండూ ఫరిశ్తా వలె కనిపిస్తాయి. వారు డబల్ లైట్ గా అనగా ప్రకాశమయముగా ఉంటారు మరియు తేలికదనాన్ని అనుభూతి చేస్తారు. వారికి ఎటువంటి భారము అనుభవమవ్వదు. ప్రతి కర్మలోనూ సహాయాన్ని అనుభవం చేస్తారు. ఏదో శక్తి నడిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ప్రతి కర్మ ద్వారా మహాదానులుగా అయిన కారణముగా వారికి సర్వుల ఆశీర్వాదాలను మరియు సర్వుల వరదానాలను పొందినట్లు అనుభవమవుతుంది.

స్లోగన్:-
సేవలో సఫలతా సితారగా అవ్వండి, బలహీనముగా అవ్వకండి.

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

1. జ్ఞానము, యోగము మరియు దైవీ గుణాల ధారణ జీవితానికి ఆధారము

మనకు పరమపిత పరమాత్ముని ద్వారా జ్ఞానము లభిస్తుందని మనకు నిశ్చయముంది. ఈ జ్ఞానములో ముఖ్యముగా మూడు పాయింట్లు ఉన్నాయి. వాటి కోసం మనము పూర్తి పురుషార్థము చేయాలనే అటెన్షన్ పెట్టుకోవాలి. ఇందులో మొదటిది - యోగము అనగా నిరంతర ఈశ్వరీయ స్మృతి, దీనితో వికర్మలు వినాశనమవుతాయి. రెండవది - జ్ఞానము అనగా ఈ మొత్తం బ్రహ్మాండము మరియు సృష్టి ఆదిమధ్యాంతాలు ఎలా ఉంటాయి అనేదాని జ్ఞానము. ఈ జ్ఞానమున్నప్పుడే ఈ జీవితములో ప్రాక్టికల్ చేంజ్ (పరివర్తన) వస్తుంది మరియు మనము భవిష్య ప్రారబ్ధాన్ని బాగా తయారుచేసుకోగలము. మూడవ పాయింటు - క్వాలిఫికేషన్ అనగా మనము సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా తప్పకుండా అవ్వాలి, అప్పుడే దేవతలుగా అవ్వగలము. కావున మనము నడుస్తూ-తిరుగుతూ, తింటూ-తాగుతూ ఈ మూడు పాయింట్ల పట్ల తప్పకుండా అటెన్షన్ పెట్టాలి. ఈ ఒక్క జన్మలోనే జ్ఞానబలము, యోగబలము ఉంటాయి మరియు దైవీ గుణాల ధారణ జరుగుతుంది. ఈ మూడింటికి పరస్పరములో కనెక్షన్ ఉంది. జ్ఞానము లేకుండా యోగము కుదరదు మరియు యోగము లేకుండా దైవీ గుణాల ధారణ జరగదు. ఈ మూడు పాయింట్ల పైనే మొత్తం జీవితమంతా ఆధారపడి ఉంది. అప్పుడే వికర్మల ఖాతా సమాప్తమై మంచి కర్మలు తయారవుతాయి. దీనినే ఈశ్వరీయ జీవితము అని అంటారు.

2. భారత్ యొక్క ప్రాచీన యోగము పరమాత్మ ద్వారా నేర్పించబడినది

మన ఈ ఈశ్వరీయ యోగము భారత్ లో ‘ప్రాచీన యోగము’ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ యోగాన్ని అవినాశీ యోగమని ఎందుకు అంటారు? ఎందుకంటే ఇది అవినాశీ పరమపిత పరమాత్ముని ద్వారా నేర్పించబడినది. యోగాన్ని ఇతర మనుష్యాత్మలు కూడా నేర్పిస్తూ ఉండవచ్చు, అందుకే యోగాశ్రమాలు మొదలైనవాటిని తెరుస్తూ ఉంటారు. కానీ వారు ప్రాచీన యోగాన్ని నేర్పించలేరు. ఒకవేళ అది యోగమే కనుక అయితే, ఆ బలం ఎక్కడుంది! భారత్ అయితే రోజురోజుకు బలహీనమవుతూ ఉంది. కావున వారు నేర్పించే యోగము అవినాశీ యోగము కాదని ఋజువవుతుంది. ఎవరితోనైతే యోగము జోడించాలో, స్వయం వారు మాత్రమే ఆ యోగాన్ని నేర్పించగలరు. ఇకపోతే, మిగతా ఎవరితోనూ యోగమే జోడించకూడదు అన్నప్పుడు ఇక మిగతావారు ఎలా నేర్పిస్తారు? ఈ కార్యాన్ని స్వయంగా పరమాత్మయే చేయగలరు, వారే మనకు పూర్తి బేధాన్ని తెలపగలరు. ఇకపోతే అన్ని వైపులా, మేము యోగాన్ని నేర్పిస్తామని అంటూ ఉంటారు. సత్యమైన యోగాన్ని అయితే స్వయంగా పరమాత్మయే నేర్పించి సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యాలను మరియు దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తారని మనకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రాచీన యోగాన్ని పరమాత్మ వచ్చి కల్పకల్పము మనకు నేర్పిస్తారు. వారంటారు, ఓ ఆత్మ - పరమాత్మనైన నాతో నిరంతరము యోగాన్ని జోడించినట్లయితే నీ పాపాలు నశిస్తాయి. అచ్ఛా. ఓం శాంతి.

అవ్యక్త ప్రేరణలు - పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి

ఎటువంటి ఆత్మ సంపర్కములోకి వచ్చినా కానీ - సతోగుణము కలవారైనా, తమోగుణము కలవారైనా, అందరి పట్ల శుభ చింతకులుగా అనగా అపకారులకు కూడా ఉపకారము చేసేవారిగా ఉండాలి. ఎప్పుడూ ఏ ఆత్మ పట్ల ద్వేష దృష్టి ఉండకూడదు ఎందుకంటే వారు అజ్ఞానానికి వశమై ఉన్నారని అనగా వివేకము లేని పిల్లలని మీకు తెలుసు. వివేకము లేని పిల్లలు చేసే ఏ కర్మ పట్ల కూడా ద్వేషము కలగదు, ఇంకా అటువంటి పిల్లలపై దయ మరియు స్నేహము కలుగుతుంది.