18-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురాతి మధురమైన సర్వీసబుల్ పిల్లలూ - సేవలో విఘ్నాలు కలిగేటువంటి పనులేవీ చేయకండి’’

ప్రశ్న:-
సంగమయుగములో పిల్లలైన మీరు పూర్తిగా ఏక్యురేట్ గా తయారవ్వాలి, ఏక్యురేట్ గా ఎవరు అవ్వగలరు?

జవాబు:-
1. ఎవరైతే సత్యమైన తండ్రితో సదా సత్యముగా ఉంటారో వారు. లోపల ఒకటి, బయట ఒకటి - ఇలా ఉండకూడదు. 2. ఎవరైతే శివబాబా గురించి తప్ప ఇతర విషయాలలోకి వెళ్ళరో వారు 3. ఎవరైతే ప్రతి అడుగు శ్రీమతముపై నడుచుకుంటారో, ఎటువంటి పొరపాట్లు చేయరో, వారే ఏక్యురేట్ గా అవుతారు.

పాట:-
బాల్యపు రోజులను మర్చిపోకూడదు...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని రెండు పదాలను విన్నారు. అనంతమైన తండ్రి ఇప్పుడు అనంతమైన సుఖపు వారసత్వాన్ని ఇస్తున్నారని మీకు నిశ్చయముంది. ఇటువంటి తండ్రికి మనము పిల్లలుగా అయ్యాము కావున తండ్రి శ్రీమతముపై కూడా నడుచుకోవాలి. లేకపోతే ఏమి జరుగుతుంది! ఇప్పుడిప్పుడే నవ్వుతారు, మేము మహారాజా, మహారాణులుగా అవుతామని అంటారు కానీ ఒకవేళ చేయి వదిలేస్తే, వెళ్ళి సాధారణ ప్రజలుగా అవుతారు. స్వర్గములోకైతే తప్పకుండా వస్తారు. అలాగని అందరూ స్వర్గములోకి వచ్చేవారని కాదు. ఎవరైతే సత్య, త్రేతాయుగాలలోకి వచ్చేవారు ఉంటారో, వారే వస్తారు. సత్యయుగము మరియు త్రేతాయుగము, ఈ రెండింటినీ కలిపి స్వర్గమని అంటారు. అయినా, కొత్త ప్రపంచములోకి ఎవరైతే మొట్టమొదట వస్తారో, వారు చాలా సుఖాన్ని పొందుతారు, తర్వాత వచ్చేవారు ఎవరూ ఇక్కడికి వచ్చి జ్ఞానము తీసుకోరు. జ్ఞానాన్ని తీసుకునేవారు సత్య, త్రేతాయుగాలలోకి వస్తారు. మిగిలినవారు రావణ రాజ్యములోకే వస్తారు, వారు కొంత సుఖాన్ని పొందగలరు. సత్య, త్రేతాయుగాలలోనైతే చాలా సుఖముంటుంది కదా, అందుకే పురుషార్థము చేసి తండ్రి నుండి అనంతమైన సుఖము యొక్క వారసత్వాన్ని పొందాలి. ఈ గొప్ప శుభవార్తను వ్రాయండి - మీరు ముద్రించే కార్డులపై కూడా ఈ విధముగా వ్రాయాలి - ఉన్నతోన్నతమైన అనంతమైన తండ్రి తెలిపే శుభవార్త. కొత్త ప్రపంచము ఎలా స్థాపనవుతుంది అనేది మీరు ప్రదర్శనీలలో చూపిస్తారు. కావున స్పష్టముగా మరియు పెద్ద అక్షరాలలో ఇలా వ్రాయాలి - అనంతమైన తండ్రి, జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు, సద్గతిదాత, గీతా భగవానుడైన శివుడు బ్రహ్మాకుమార, బ్రహ్మాకుమారీల ద్వారా మళ్ళీ కలియుగీ సంపూర్ణ వికారీ, భ్రష్టాచారీ పతిత ప్రపంచాన్ని, సత్యయుగీ సంపూర్ణ నిర్వికారీ, పావన శ్రేష్ఠాచారీ ప్రపంచముగా ఎలా తయారుచేస్తున్నారు, మీరు వచ్చి ఈ శుభవార్తను వినండి మరియు అర్థం చేసుకోండి. గవర్నమెంట్ వారితో కూడా మీరు ఈ ప్రతిజ్ఞను చేస్తారు - మేము భారత్ లో మళ్ళీ సత్యయుగీ శ్రేష్ఠాచారీ, 100 శాతము పవిత్రత, సుఖ-శాంతుల దైవీ స్వరాజ్యాన్ని ఎలా స్థాపన చేస్తున్నాము మరియు ఈ వికారీ ప్రపంచ వినాశనము ఎలా జరుగుతుంది అనేది వచ్చి తెలుసుకోండి. ఈ విధముగా స్పష్టముగా వ్రాయాలి. మనుష్యులు మంచి రీతిలో అర్థం చేసుకోగలిగేలా కార్డులపై వ్రాయండి. ఈ ప్రజాపిత బ్రహ్మాకుమార, బ్రహ్మాకుమారీలు కల్పక్రితం వలె డ్రామా ప్లాన్ అనుసారముగా పరమపిత పరమాత్మ శివుని శ్రీమతముపై, సహజ రాజయోగము మరియు పవిత్రతా బలము ద్వారా, తమ తనువు-మనసు-ధనముల ద్వారా భారత్ ను ఈ విధముగా శ్రేష్ఠాచారిగా, పావనముగా ఎలా తయారుచేస్తున్నారు అనేది వచ్చి అర్థం చేసుకోండి. ఎవరైనా సరే అర్థం చేసుకోగలిగే విధముగా కార్డులపై ఇలా స్పష్టముగా ముద్రించాలి - ఈ బి.కె.లు శివబాబా మతముపై రామ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఇది గాంధీజీ కోరిక. వార్తాపత్రికలలో కూడా ఈ విధముగా పూర్తి ఆహ్వానాన్ని ముద్రించాలి. ప్రజాపిత బ్రహ్మాకుమార, బ్రహ్మాకుమారీలు తమ తనువు-మనసు-ధనముల ద్వారా ఇది చేస్తున్నారని వారికి తప్పకుండా అర్థం చేయించాలి. అప్పుడు, వీరు భిక్ష లేదా డొనేషన్లు మొదలైనవి అడుగుతారని మనుష్యులు అనుకోకుండా ఉంటారు. ప్రపంచములోనైతే అన్నీ డొనేషన్ల పైనే నడుస్తాయి. ఇక్కడ మీరు - బి.కె.లైన మేము మా తనువు-మనసు-ధనములతో చేస్తున్నామని అంటారు. స్వయమే స్వరాజ్యాన్ని తీసుకుంటాము కావున తప్పకుండా స్వంత ఖర్చునే పెట్టుకుంటాము. ఎవరైతే కృషి చేస్తారో, వారికే 21 జన్మల కోసం వారసత్వము లభిస్తుంది. భారతవాసులే 21 జన్మల కొరకు శ్రేష్ఠాచారులుగా, డబల్ కిరీటధారులుగా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులు డబల్ కిరీటధారులు కదా. ఇప్పుడైతే ఏ కిరీటమూ మిగల్లేదు. కావున ఇది మంచి రీతిలో అర్థం చేయించవలసి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ విధముగా వ్రాయండి, అప్పుడు బి.కె.లు ఏమి చేస్తున్నారు అనేది పాపం వారికి తెలుస్తుంది. పెద్దవారి నుండి శబ్దము వ్యాపిస్తే పేదవారి నుండి కూడా వింటారు, లేకపోతే పేదవారి మాటలను ఎవ్వరూ వినరు. షావుకారుల శబ్దము వెంటనే వినిపిస్తుంది. మేము విశేషముగా భారత్ ను స్వర్గముగా తయారుచేస్తున్నాము, మిగిలినవారందరినీ శాంతిధామానికి పంపిస్తాము అని మీరు నిరూపించి తెలియజేస్తారు. ఇలా అర్థం చేయించాలి - భారత్ 5 వేల సంవత్సరాల క్రితం ఈ విధముగా స్వర్గముగా ఉండేది, ఇప్పుడిది కలియుగము, అది సత్యయుగముగా ఉండేది. మరి ఇప్పుడు చెప్పండి, సత్యయుగములో ఎంతమంది మనుష్యులు ఉండేవారు. ఇప్పుడిది కలియుగాంతము. ఇది అదే మహాభారత మహాభారీ యుద్ధము, ఇంకే సమయములోనూ ఇటువంటి యుద్ధము జరగనే లేదు. అంతిమములో మూడవ ప్రపంచ యుద్ధము జరిగింది, ప్రయత్నిస్తూ ఉంటారు కదా. ఇప్పుడైతే అటామిక్ బాంబులను తయారుచేస్తూ ఉంటారు, ఎవరి మాట వినరు. మీరు తయారుచేసిన బాంబులన్నీ సముద్రములో వేసినట్లయితే మేము కూడా తయారుచేయము, మీరు బాంబులను పెట్టుకుంటూ, మేము మాత్రం తయారుచేయకూడదని అంటే అది ఎలా కుదురుతుంది అని అంటారు. కానీ ఈ విధి తయారుచేయబడి ఉందని పిల్లలైన మీకు తెలుసు. వారికి ఎంత చెప్పినా, అర్థం చేసుకోరు. వినాశనము జరగకపోతే రాజ్యమెలా చేస్తారు. పిల్లలైన మీకైతే నిశ్చయముంది కదా. ఎవరైతే సంశయ బుద్ధికలవారు ఉంటారో, వారు పారిపోతారు, ద్రోహులుగా అయిపోతారు. తండ్రికి చెందినవారిగా అయి మళ్ళీ ద్రోహులుగా అవ్వకూడదు. మీరైతే శివబాబాను స్మృతి చేయాలి, ఇతర విషయాలతో ఏమి లాభముంటుంది. సత్యమైన తండ్రితో సత్యముగా ఉండాలి. లోపల ఒకటి, బయట ఒకటి పెట్టుకున్నట్లయితే తమ పదవిని భ్రష్టము చేసుకుంటారు, తమను తామే నష్టపర్చుకుంటారు, కల్ప-కల్పాంతరాలకు ఇక ఎప్పటికీ ఉన్నత పదవిని పొందలేరు, అందుకే ఈ సమయములో చాలా ఏక్యురేట్ గా తయారవ్వాలి. ఎటువంటి నిర్లక్ష్యము చేయకూడదు. ఎంత వీలైతే అంత శ్రీమతముపై నడుచుకోవాలి. నిరంతర స్మృతి అయితే చివరిలో ఉంటుంది. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరి స్మృతి ఉండకూడదు. అంతిమ సమయములో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో... అని కూడా అంటూ ఉంటారు. ఎవరిపైనైతే మోహము ఉంటుందో, వారు గుర్తుకువస్తారు. మున్ముందు మీరు ఎంతగా సమీపముగా వస్తూ ఉంటారో, అంతగా సాక్షాత్కారాలు కలుగుతూ ఉంటాయి. నీవు ఫలానా, ఫలానా పనులు చేసావని బాబా ప్రతి ఒక్కరికీ చూపిస్తారు. ప్రారంభములో కూడా మీకు సాక్షాత్కారాలు కలిగాయి. ఎవరైతే శిక్షలు అనుభవించేవారో, వారు చాలా ఆర్తనాదాలు చేసేవారు. బాబా అంటారు, మీకు చూపించేందుకని వాళ్ళ శిక్షలను 100 రెట్లు తగ్గించి చూపించాను.

పిల్లలైన మీరు తండ్రి సేవలో విఘ్నాలను కలిగించేటువంటి పనులేవీ చేయకూడదు. ఈ విధముగా నీవు తండ్రి సేవలో చాలా విఘ్నాలను కలిగించి నష్టపరిచావని చివరిలో కూడా మీకు అన్నీ సాక్షాత్కారమవుతాయి. అది ఆసురీ సంప్రదాయము కదా. ఎవరైతే విఘ్నాలను కలిగించారో, వారికి చాలా శిక్షలు లభిస్తాయి. శివబాబాది చాలా పెద్ద దర్బారు, రైట్ హ్యాండ్ గా (కుడి భుజముగా) ధర్మరాజు కూడా ఉన్నారు. అవి హద్దులోని శిక్షలు. ఇక్కడైతే 21 జన్మల కొరకు నష్టము వాటిల్లుతుంది, పదవి భ్రష్టమైపోతుంది. తండ్రి ప్రతి విషయములోనూ అర్థం చేయిస్తూ ఉంటారు. మాకు తెలియదని ఎవ్వరూ అనకూడదు, అందుకే బాబా అన్ని రకాలుగా సావధానపరుస్తూ ఉంటారు. బాబా చూస్తూ ఉంటారు - ప్రతి ఒక్క సెంటరు నుండి ఎంతమంది పారిపోయారు అని, అటువంటివారు విసిగిస్తారు, వికారులుగా అయిపోతారు. స్కూల్లో అయితే పూర్తిగా చదువుకోవాలి, లేకపోతే ఏ పదవిని పొందుతారు. పదవిలో చాలా తేడా వచ్చేస్తుంది. ఎలాగైతే ఇక్కడ దుఃఖధామములో, ఒకరు ప్రెసిడెంటుగా ఉంటారు, ఒకరు షావుకారుగా ఉంటారు, ఒకరు పేదవారిగా ఉంటారు, అదే విధముగా అక్కడ సుఖధామములో కూడా పదవులైతే నంబరువారుగా ఉంటాయి. ఎవరైతే రాయల్, వివేకవంతులైన పిల్లలు ఉంటారో, వారు తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది మాయ యొక్క బాక్సింగ్ కదా. మాయ చాలా శక్తివంతమైనది, గెలుపు-ఓటములు జరుగుతూ ఉంటాయి. ఎంతమంది వస్తారు, మళ్ళీ ద్రోహులుగా అయ్యి వెళ్ళిపోతారు. నడుస్తూ-నడుస్తూ ఫెయిల్ అయిపోతారు. ఇదెలా సాధ్యము అని చాలామంది అంటారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా ఉండగలరని ఎప్పుడూ వినలేదని అంటారు. అరే, భగవానువాచ కదా - కామము మహాశత్రువు. గీతలో కూడా ఈ పదాలు ఉన్నాయి కదా. సత్యయుగములో దైవీ గుణాలు కల మనుష్యులు ఉన్నారని మరియు కలియుగములో ఆసురీ అవగుణాలు కల మనుష్యులు ఉన్నారని మీకు తెలుసు. ఆసురీ గుణాలు కలవారు దైవీ గుణాలు కలవారి మహిమను పాడుతారు. ఎంత తేడా ఉంది. మనము ఎలా ఉండేవారము, ఎలా తయారవుతున్నాము అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ మీరు అన్ని గుణాలను ధారణ చేయాలి. ఆహార-పానీయాలు మొదలైనవి కూడా సతోగుణము కలవి తీసుకోవాలి. దేవతలకు ఏమి తినిపిస్తారు అనేది గమనించాలి. శ్రీనాథ ద్వారానికి వెళ్ళి చూడండి - ఎంత సంపన్నమైన మరియు శుద్ధమైన భోజనము తయారవుతుంది. అక్కడ ఉండేది వైష్ణవులు. కానీ అక్కడ జగన్నాథపురిలో ఏమి లభిస్తుందో చూడండి - అన్నము. అక్కడ వామ మార్గానికి చెందిన చాలా అశుద్ధమైన చిత్రాలున్నాయి. రాజ్యము ఉన్నప్పుడు 36 రకాల భోజనము లభించేది. కనుక శ్రీనాథ ద్వారములో చాలా సంపన్నమైన భోజనము తయారవుతుంది. పూరీ జగన్నాథుడు మరియు శ్రీనాథుడు వేర్వేరు. పూరీ మందిరములో దేవతల వస్త్ర ధారణలో చాలా అశుద్ధమైన చిత్రాలు ఉన్నాయి. కనుక భోగ్ లో కూడా విశేషముగా అన్నము పెడతారు, అందులో నెయ్యి కూడా వేయరు. ఈ తేడాను చూపిస్తారు. భారత్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా తయారయ్యింది. ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉందో చూడండి, అన్నము కూడా పూర్తిగా లభించదు. వారి ప్లాన్ కు మరియు శివబాబా ప్లాన్ కు రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఆ ప్లాన్ లన్నీ మట్టిలో కలిసిపోతాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ధాన్యము మొదలైనవేవీ లభించవు. అక్కడక్కడ వర్షము చాలా ఎక్కువగా పడుతుంది, అక్కడక్కడ అసలు పడనే పడదు, ఎంత నష్టము కలిగిస్తుంది. ఈ సమయములో తత్వాలు కూడా తమోప్రధానముగా ఉన్నాయి, అందుకే వర్షాలు కూడా సమయము కానీ సమయములో పడుతూ ఉంటాయి. తుఫానులు కూడా తమోప్రధానముగా ఉన్నాయి, సూర్యుని వేడి కూడా ఎంతగా ఉంటుంది అంటే ఇక అడగకండి. ఈ ప్రకృతి వైపరీత్యాలు డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. వారిది వినాశన కాలములో విపరీత బుద్ధి, మీది తండ్రితో ప్రీతి బుద్ధి. అజ్ఞాన కాలములో కూడా సుపుత్రులైన పిల్లల పట్ల తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది, అందుకే బాబా అంటారు కూడా - నంబరువారు పురుషార్థానుసారముగా ప్రియస్మృతులు అని. ఎంతెంతగా సేవ చేస్తారో అంతగా లభిస్తుంది. సేవ అయితే చేయాలి కదా. విశేషముగా భారత్ కు మరియు మొత్తము ప్రపంచానికి సేవ చేయాలి, భారత్ ను స్వర్గముగా తయారుచేయాలి. మిగిలినవారందరినీ శాంతిధామానికి పంపించేయాలి. భారత్ కు స్వర్గ వారసత్వము లభిస్తుంది, మిగిలిన వారందరికీ ముక్తి యొక్క వారసత్వము లభిస్తుంది. అందరూ వెళ్ళిపోతారు. హాహాకారాల తర్వాత జయజయకారాలు జరుగుతాయి. ఎన్ని హాహాకారాలు జరుగుతాయి. ఇది అనవసరమైన రక్తసిక్తమైన ఆట. ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. అందరి మృత్యువు జరగవలసిందే.

తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, పూర్తి పురుషార్థము చేయండి. తండ్రితో సదా ఆజ్ఞాకారులుగా, విశ్వాసపాత్రులుగా ఉండాలి, సర్వీసబుల్ గా అవ్వాలి. కల్పక్రితం ఎవరు ఎటువంటి సేవను చేసారు అనేది సాక్షాత్కారమవుతూ ఉంటుంది. మీరు సాక్షీగా అయి చూస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. సదా బుద్ధిలో స్వదర్శన చక్రము తిరుగుతూ ఉండాలి. మనము 84 జన్మలను ఈ విధముగా తీసుకున్నాము, ఇప్పుడు మనము ఇంటికి తిరిగి వెళ్తాము. తండ్రి కూడా గుర్తుండాలి, ఇల్లు కూడా గుర్తుండాలి, సత్యయుగము కూడా గుర్తుండాలి, రోజంతా బుద్ధిలో ఇదే చింతన చేయాలి. ఇప్పుడు మనము విశ్వానికి మహారాజకుమారులుగా అవుతాము, మనము శ్రీలక్ష్మిగా, శ్రీనారాయణునిగా అవుతాము, నషా ఎక్కాలి కదా. బాబాకు నషా ఉంటుంది. బాబా రోజూ ఈ (లక్ష్మీ-నారాయణుల) చిత్రాన్ని చూస్తూ ఉంటారు, లోపల నషా ఉంటుంది కదా. ఇక రేపు నేను వెళ్ళి ఈ శ్రీకృష్ణునిగా అవుతాను, అంతే, మళ్ళీ స్వయంవరము తర్వాత శ్రీనారాయణునిగా అవుతాను, తతత్వమ్, మీరు కూడా అలా అవుతారు కదా. ఇది ఉన్నదే రాజయోగము. ప్రజాయోగము కాదు. ఆత్మలకు మళ్ళీ తమ రాజ్యభాగ్యము లభిస్తుంది. పిల్లలు తమ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, ఇప్పుడు మళ్ళీ రాజ్యాన్ని తీసుకుంటున్నారు. బాబా ఈ చిత్రాలు మొదలైనవాటిని, పిల్లలైన మీరు చూసి సంతోషపడేందుకనే తయారుచేయిస్తారు. 21 జన్మల కొరకు మనము స్వర్గము యొక్క రాజ్య భాగ్యాన్ని పొందుతున్నాము, ఎంత సహజము. ఈ శివబాబా, ఈ ప్రజాపిత బ్రహ్మా ద్వారా ఈ రాజయోగాన్ని నేర్పిస్తారు. తర్వాత మనము వెళ్ళి అలా అవుతాము. చూడగానే సంతోషపు పాదరసము ఎక్కుతుంది. మనము తండ్రి స్మృతిలో ఉండటముతో విశ్వ రాకుమారులుగా అవుతాము, ఎంత సంతోషము ఉండాలి. నేను కూడా (బ్రహ్మా) చదువుకుంటున్నాను, మీరు కూడా చదువుకుంటున్నారు. ఈ చదువు తర్వాత మనము వెళ్ళి ఈ విధముగా అవుతాము. మొత్తము ఆధారమంతా చదువుపైనే ఉంది. ఎంతగా చదువుకుంటారో, అంత సంపాదన జరుగుతుంది కదా. బాబా చెప్పారు, కొంతమంది సర్జన్ల అయితే ఎంత తెలివైనవారిగా ఉంటారంటే, ఒక్క కేసుకు లక్ష రూపాయలు కూడా సంపాదిస్తారు. బ్యారిస్టర్లలో కూడా ఈ విధముగా ఉంటారు, కొందరు చాలా సంపాదిస్తారు, కొందరిని చూస్తే వారి కోట్ కూడా చిరిగిపోయి ఉంటుంది. ఇది కూడా అటువంటిదే, అందుకే బాబా పదే-పదే చెప్తున్నారు - పిల్లలూ, ఎటువంటి నిర్లక్ష్యము చేయకండి, సదా శ్రీమతముపై నడుచుకోండి. శ్రీ శ్రీ శివబాబా ద్వారా మీరు శ్రేష్ఠముగా తయారవుతారు. పిల్లలైన మీరు తండ్రి నుండి అనేక సార్లు వారసత్వాన్ని తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు. 21 జన్మల వారసత్వము అర్ధకల్పము కోసం లభిస్తుంది, అర్ధకల్పము అనగా 2500 సంవత్సరాలు సుఖాన్ని పొందుతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. లోపల-బయట సత్యముగా ఉండాలి. చదువులో ఎప్పుడూ నిర్లక్ష్యము చేయకూడదు. ఎప్పుడూ కూడా సంశయబుద్ధి కలవారిగా అయి చదువును వదిలిపెట్టకూడదు. సేవలో విఘ్న రూపులుగా అవ్వకూడదు.

2. అందరికీ ఇదే శుభవార్తను వినిపించండి - మేము పవిత్రతా బలముతో, శ్రీమతముపై మా తనువు-మనసు-ధనముల సహయోగముతో 21 జన్మల కొరకు భారత్ ను శ్రేష్ఠాచారీ డబల్ కిరీటధారులుగా తయారుచేసే సేవను చేస్తున్నాము.

వరదానము:-
సదా పుణ్యఖాతాను జమ చేసుకునే మరియు చేయించే మాస్టర్ శిక్షక భవ

మనము మాస్టర్ శిక్షకులము, మాస్టర్ అని అనటముతో తండ్రి స్వతహాగానే గుర్తుకువస్తారు. తయారుచేయించేవారి స్మృతి రావటము వలన నేను స్వయము నిమిత్తము - అన్నది స్వతహాగా స్మృతిలోకి వచ్చేస్తుంది. మేము పుణ్యాత్ములము అన్నది విశేషముగా స్మృతిలో ఉండాలి, పుణ్యఖాతాను జమ చేసుకోవటము మరియు జమ చేయించటము - ఇదే విశేష సేవ. పుణ్యాత్మ ఎప్పుడూ ఒక్క శాతము పాపము కూడా సంకల్పమాత్రముగా కూడా చేయలేరు. మాస్టర్ శిక్షకులు అనగా తండ్రి సమానముగా సదా పుణ్యఖాతాను జమ చేసుకునేవారు మరియు చేయించేవారు.

స్లోగన్:-
సంగఠన యొక్క మహత్వాన్ని తెలుసుకునేవారు సంగఠనలోనే స్వయం యొక్క రక్షణను అనుభవము చేస్తారు.

అవ్యక్త ప్రేరణలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’

ఎవరు ఎంత నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారో, అంతగానే వారు అన్ని విషయాలలో విజయులుగా అవుతారు. నిశ్చయబుద్ధి కలవారికి ఎప్పుడూ ఓటమి ఉండదు. ఒకవేళ ఓటమి జరిగితే నిశ్చయములో లోపముంది అని భావించాలి. నిశ్చయబుద్ధి విజయీ రత్నాలలో నేను ఒక రత్నాన్ని అని స్వయాన్ని భావించాలి. ఏ విఘ్నము వచ్చినా దానిని పరీక్షగా భావించి దాటి వేయాలి. విషయాన్ని చూడకూడదు, దానిని పరీక్షగా భావించి పాస్ అవ్వాలి.