18-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఎప్పుడైతే పుష్పాలుగా అవుతారో అప్పుడు ఈ భారత్ ముళ్ళ అడవి నుండి సంపూర్ణ పుష్పాలతోటగా అవుతుంది, బాబా మిమ్మల్ని పుష్పాలుగా తయారుచేసేందుకు వచ్చారు’’

ప్రశ్న:-
మందిర యోగ్యులుగా అయ్యేందుకు ఏ విషయాలపై విశేషముగా అటెన్షన్ పెట్టాలి?

జవాబు:-
మందిర యోగ్యులుగా అవ్వాలంటే నడవడికపై విశేషమైన అటెన్షన్ పెట్టండి - నడవడిక చాలా మధురముగా మరియు రాయల్ గా ఉండాలి. ఎంతటి మధురత ఉండాలంటే, ఇతరులకు అది అనుభవమవ్వాలి. అనేకులకు తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. మీ కళ్యాణము చేసుకునేందుకు బాగా పురుషార్థము చేసి సేవలో నిమగ్నమై ఉండండి.

పాట:-
ప్రపంచము మారినా మేము మారము...

ఓంశాంతి
తండ్రి బ్రహ్మా ద్వారా అర్థం చేయిస్తున్నారు అని ఆత్మిక పిల్లలకు తెలుసు. బ్రహ్మా యొక్క రథము ద్వారానే అర్థం చేయిస్తూ ఉంటారు. మేము శ్రీమతము ఆధారముగా ఈ భారత భూమిని పతితము నుండి పావనముగా తయారుచేస్తాము అని మనము ప్రతిజ్ఞ చేస్తాము. విశేషముగా భారత్ కు, అలాగే మిగిలిన ప్రపంచమంతటికీ, అందరికీ మనము పతితము నుండి పావనముగా అయ్యేందుకు మార్గాన్ని తెలియజేస్తాము. ఈ ఆలోచనను ప్రతి ఒక్కరూ తమ బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి చెప్తున్నారు, డ్రామానుసారముగా మీరు పుష్పాలుగా అయినప్పుడు మరియు సమయము వచ్చినప్పుడు, సంపూర్ణ పుష్పాలతోట తయారవుతుంది. తోట యజమాని అని కూడా నిరాకారుడినే అంటారు, తోటమాలి అని కూడా నిరాకార ఆత్మనే అంటారు, అంతేకానీ సాకారములో ఉన్నవారిని కాదు. తోటమాలి కూడా ఆత్మనే, అంతేకానీ శరీరము కాదు. తోట యజమాని కూడా ఆత్మనే. తండ్రి అయితే తప్పకుండా శరీరము ద్వారానే అర్థం చేయిస్తారు కదా. శరీర సహితముగానే తోట మాలి, తోట యజమాని అని అంటారు, వారు ఈ విశ్వాన్ని పుష్పాలతోటగా తయారుచేస్తారు. ఒకప్పుడు పుష్పాలతోట ఉండేది, అక్కడ ఈ దేవతలు ఉండేవారు. అక్కడ ఎటువంటి దుఃఖము ఉండేది కాదు. ఇక్కడ ఈ ముళ్ళ అడవిలోనైతే దుఃఖము ఉంది. ఇది రావణ రాజ్యము, ముళ్ళ అడవి. వెంటనే ఎవ్వరూ పుష్పాలుగా అవ్వరు. మేము జన్మ-జన్మాంతరాల పాపులము, అజామిళ్ వంటివారము అని దేవతల ఎదురుగా వెళ్ళి పాడుతారు కూడా. ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని పుణ్యాత్ములుగా చేయండి అని ఈ విధంగా ప్రార్థిస్తారు. ఇప్పుడు మేము పాపాత్ములుగా ఉన్నాము, కానీ ఒకానొక సమయములో పుణ్యాత్ములుగా ఉండేవారము అని భావిస్తారు. ఇప్పుడు ఈ ప్రపంచములో పుణ్యాత్ములవి కేవలం చిత్రాలు మాత్రమే ఉన్నాయి. రాజధాని యొక్క ముఖ్యులు ఎవరైతే ఉండేవారో, వారి చిత్రాలు ఉన్నాయి మరియు వారిని ఆ విధంగా తయారుచేసినవారు నిరాకార శివుడు, వారి చిత్రము కూడా ఉంది, అంతే, ఇంకెవ్వరి చిత్రాలు లేవు. అందులోనూ శివుడిని పెద్ద లింగముగా చూపిస్తారు. ఆత్మ నక్షత్రము వలె ఉంటుందని అంటారు కూడా, కావున తండ్రి కూడా అదే విధముగా ఉంటారు కదా. కానీ వారి పూర్తి పరిచయము లేదు. విశ్వములో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. వీరి గురించి ఎక్కడా ఎవ్వరూ నిందించే విషయాలను వ్రాయరు. కానీ శ్రీకృష్ణుడిని అప్పుడప్పుడు ద్వాపరములో, అప్పుడప్పుడు ఇంకెక్కడో చూపిస్తారు. లక్ష్మీ-నారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని వారి గురించి అందరూ చెప్తుంటారు. ఇదే మీ లక్ష్యము-ఉద్దేశ్యము. రాధ-కృష్ణులు ఎవరు అన్నది తెలియక మనుష్యులు పాపం పూర్తిగా తికమకలో ఉన్నారు. ఏమీ అర్థం చేసుకోరు. ఎవరైతే తండ్రి ద్వారా అర్థం చేసుకుంటారో, వారు అర్థం చేయించేందుకు కూడా యోగ్యులుగా అవుతారు. లేదంటే ఎంత అర్థం చేయించినా కానీ యోగ్యులుగా అవ్వలేరు, దైవీ గుణాలను ధారణ చేయలేరు. కానీ డ్రామానుసారముగా అలా జరగాల్సిందే. మీరు ఇప్పుడు స్వయమే అర్థం చేసుకుంటున్నారు - పిల్లలమైన మనమందరము తండ్రి శ్రీమతము ఆధారముగా మన తనువు-మనసు-ధనము ద్వారానే భారత్ యొక్క ఆత్మిక సేవను చేస్తున్నాము. ప్రదర్శినీ లేక మ్యూజియం మొదలైనవాటిలో, మీరు భారత్ కు ఏం సేవ చేస్తున్నారు అని అడుగుతారు. మేము భారత్ కు చాలా మంచి సేవ చేస్తున్నాము, అడవి నుండి పుష్పాలతోటగా తయారుచేస్తున్నాము అని మీకు తెలుసు. సత్యయుగము పుష్పాలతోట. ఇది ముళ్ళ అడవి. ఒకరికొకరు దుఃఖమునిచ్చుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేయించవచ్చు. లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని కూడా చాలా బాగా తయారుచేయాలి. మందిరాలలో చాలా సుందరమైన మూర్తులను తయారుచేస్తారు. కొన్ని చోట్ల తెల్లని మూర్తులను, కొన్ని చోట్ల నల్లని మూర్తులను తయారుచేస్తారు, దాని వెనుక ఉన్న రహస్యమేమిటి అనేది కూడా అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు ఇప్పుడు ఈ జ్ఞానమంతా ఉంది. తండ్రి అంటారు, నేను వచ్చి అందరినీ మందిర యోగ్యులుగా తయారుచేస్తాను కానీ అందరూ మందిర యోగ్యలుగా అవ్వరు. ప్రజలనైతే మందిర యోగ్యులు అని అనరు కదా. ఎవరైతే పురుషార్థము చేసి చాలా సేవ చేస్తారో వారికి ప్రజలు ఉంటారు.

పిల్లలైన మీరు ఆత్మిక సమాజ సేవను కూడా చేయాలి, ఈ సేవలో మీ జీవితాన్ని సఫలం చేసుకోవాలి. నడవడిక కూడా చాలా మధురముగా, సుందరముగా ఉండాలి, దాని ద్వారా ఇతరులకు కూడా మధురతతో అర్థం చేయించగలగాలి. స్వయమే ముల్లులా ఉంటే ఇక ఇతరులను పుష్పాలుగా ఎలా తయారుచేస్తారు, అటువంటివారి బాణము పూర్తిగా తగలదు. తండ్రిని స్మృతి చేయడం లేదంటే మరి బాణము ఎలా తగులుతుంది. మీ కళ్యాణము కోసం బాగా పురుషార్థము చేసి సేవలో నిమగ్నమై ఉండండి. తండ్రి కూడా సేవలో ఉన్నారు కదా. పిల్లలైన మీరు కూడా రాత్రింబవళ్ళు సేవలో ఉండండి.

రెండవ విషయమేమిటంటే - శివజయంతికి చాలామంది పిల్లలు టెలిగ్రాములు పంపిస్తూ ఉంటారు, వాటిలో కూడా ఎటువంటి వివరణ రాయాలంటే, ఆ టెలిగ్రాములను ఎవరికి చూపించినా వారు అర్థం చేసుకోగలగాలి. మున్ముందు ఏమి చేయాలి అని దాని కోసం పురుషార్థము చేయడం జరుగుతుంది. అనేకులకు తండ్రి పరిచయం లభించేందుకు ఏయే సేవలు చేయాలి అని దీని కోసమే సెమినార్ లు కూడా చేస్తారు. ఎన్నో టెలిగ్రాములు ఉన్నాయి, వీటి బాగా ఉపయోగించుకోవచ్చు. శివబాబా, కేర్ ఆఫ్ బ్రహ్మా అని అడ్రస్ వ్రాస్తారు. ప్రజాపిత బ్రహ్మా కూడా ఉన్నారు. వారు ఆత్మిక తండ్రి, వీరు దైహిక తండ్రి. వీరి ద్వారా దైహిక రచన రచింపబడుతుంది. తండ్రి మనుష్య సృష్టికి రచయిత. వారు రచనను ఎలా రచిస్తారు అనేది మొత్తం ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. తండ్రి బ్రహ్మా ద్వారా ఇప్పుడు కొత్త రచనను రచిస్తున్నారు. బ్రాహ్మణులు పిలక వంటివారు. మొట్టమొదట బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. విరాట రూపానికి వీరు పిలక వంటివారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులు. శూద్రులు అయితే మొట్టమొదట ఉండరు. తండ్రి బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు. శూద్రులను ఎలా రచిస్తారు మరియు ఎవరి ద్వారా రచిస్తారు?

కొత్త రచనను ఎలా రచిస్తారు అనేది పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ తండ్రి దత్తత తీసుకుంటారు. కల్ప-కల్పము తండ్రి వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తారు, ఆ తర్వాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. బ్రాహ్మణుల సేవ చాలా ఉన్నతమైనది. ఆ బ్రాహ్మణులు స్వయమే పవిత్రముగా లేనప్పుడు మరి ఇతరులను పవిత్రముగా ఎలా తయారుచేస్తారు. ఆ బ్రాహ్మణులెవ్వరూ సన్యాసులకు రాఖీ కట్టరు. సన్యాసులు ఏమంటారంటే - మేమైతే పవిత్రముగానే ఉన్నాము, మీరు మీ ముఖాన్ని చూసుకోండి. పిల్లలైన మీరు కూడా ఎవ్వరితోనూ రాఖీ కట్టించుకోలేరు. ప్రపంచములోనైతే అందరూ ఒకరికొకరు కట్టుకుంటూ ఉంటారు. సోదరి, సోదరునికి కడుతుంది, ఈ ఆచారము ఇప్పుడే వెలువడింది. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తారు. స్త్రీ-పురుషులివురూ పవిత్రతా ప్రతిజ్ఞను చేస్తారు అని అర్థం చేయించవలసి ఉంటుంది. మేము తండ్రి శ్రీమతము ద్వారా ఏ విధముగా పవిత్రముగా ఉంటున్నాము అన్నది ఇద్దరూ చెప్పవచ్చు. అంతిమము వరకు ఈ కామ వికారముపై విజయులుగా ఉన్నట్లయితే ఇక పవిత్ర జగత్తుకు యజమానులుగా అవుతారు. పవిత్ర ప్రపంచము అని సత్యయుగాన్ని అంటారు, అది ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. మీరందరూ పవిత్రముగా ఉన్నారు. వికారాలలోకి పడిపోయేవారికి రాఖీ కట్టవచ్చు. ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితముగా అయినట్లయితే - మీరు వచ్చి రాఖీ కట్టించుకున్నారు కదా, మరి ఇప్పుడు ఏమయ్యింది అని అంటారు. మాయతో ఓడిపోయామని చెప్తారు, ఇది యుద్ధ మైదానము. వికారాలు పెద్ద శత్రువు. దానిపై విజయము పొందినట్లయితేనే జగత్ జీతులుగా అనగా రాజా-రాణులుగా అవుతారు. ప్రజలను జగత్ జీతులు అని అనరు. రాజు-రాణులే శ్రమిస్తారు కదా. మేమైతే లక్ష్మీ-నారాయణులుగా అవుతామని అంటారు కూడా. లక్ష్మీ-నారాయణుల తర్వాత వారి పిల్లలే వారి సింహాసనాన్ని గెలుచుకుంటారు. ఆ లక్ష్మీ-నారాయణులు అప్పుడు మరుసటి జన్మలో కిందకి వెళ్ళిపోతారు. భిన్న నామ-రూపాలతో వారి పిల్లలకు సింహాసనము లభిస్తుంది, అప్పుడు వారి పిల్లల పదవి ఉన్నతముగా భావించబడుతుంది. పునర్జన్మలైతే తీసుకుంటారు కదా. పిల్లలు సింహాసనముపై కూర్చుంటే ఆ తల్లి-తండ్రులు సెకండ్ గ్రేడ్ వారిగా అయిపోతారు. పైన ఉన్న వారు కిందకు, కింద ఉన్నవారు పైకి వస్తారు. ఇప్పుడు పిల్లలు అలా ఉన్నతముగా అవ్వాలంటే సేవలో నిమగ్నమైపోవాలి. పవిత్రముగా అవ్వడం కూడా చాలా అవసరము. తండ్రి చెప్తున్నారు, నేను పవిత్ర ప్రపంచాన్ని తయారుచేస్తాను. మంచి పురుషార్థము కొద్దిమందే చేస్తారు, పవిత్రముగానైతే మొత్తం ప్రపంచమంతా అవుతుంది. మీ కోసం స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఇది డ్రామానుసారముగా జరగాల్సిందే, ఈ ఆట తయారై ఉంది. మీరు పవిత్రముగా అవుతారు, అప్పుడు వినాశనము మొదలైపోతుంది, సత్యయుగ స్థాపన జరిగిపోతుంది. డ్రామానైతే మీరు అర్థం చేసుకోగలరు. సత్యయుగములో దేవతల రాజ్యము ఉండేది, అది ఇప్పుడు లేదు, మళ్ళీ రాబోతుంది.

మీరు ఆత్మిక మిలటరీ. మీరు పంచ వికారాలపై విజయము పొందడము ద్వారా జగత్ జీతులుగా అవ్వనున్నారు. జన్మ-జన్మాంతరాల పాపాలు నశించేందుకు బాబా యుక్తులను తెలియజేస్తున్నారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి యుక్తులను తెలియజేస్తారు. రాజధాని స్థాపన అవ్వనంతవరకు వినాశనము జరగదు. మీరు చాలా గుప్తమైన యోధులు. కలియుగము తర్వాతనే సత్యయుగము రావాలి. ఇక సత్యయుగములో ఎప్పుడూ యుద్ధాలు జరగవు. ఆత్మలన్నీ ఏ పాత్రనైతే అభినయిస్తున్నాయో, అదంతా నిశ్చితమై ఉంది అని పిల్లలైన మీకు తెలుసు. తోలుబొమ్మలు ఉంటాయి కదా, ఆత్మలు ఆ విధముగా నాట్యము చేస్తూ ఉంటాయి. ఇది కూడా డ్రామా, ప్రతి ఒక్కరికీ ఈ డ్రామాలో పాత్ర ఉంది. పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ మీరు తమోప్రధానముగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తారు, సతోప్రధానముగా అవుతారు. జ్ఞానమైతే ఒక సెకెండుకు సంబంధించినది. సతోప్రధానముగా అవుతారు, మళ్ళీ కిందకు పడిపోతూ-పడిపోతూ తమోప్రధానముగా అవుతారు, మళ్ళీ తండ్రి పైకి తీసుకువెళ్తారు. వాస్తవానికి ఆ బొమ్మలో చేపలు తీగకు వేలాడుతూ ఉంటాయి, ఈ తీగకు మనుష్యులను వేలాడదీయాలి. ఈ విధంగా దిగే కళ, మళ్ళీ ఎక్కే కళ జరుగుతూ ఉంటుంది. మీరు కూడా ఆ బొమ్మలో చేపల వలె అదే విధంగా ఎక్కుతారు, మళ్ళీ దిగుతూ-దిగుతూ కిందకు వచ్చేస్తారు. పైకి వెళ్ళి మళ్ళీ కిందకు దిగడానికి 5 వేల సంవత్సరాలు పడుతుంది. ఈ 84 జన్మల చక్రము మీ బుద్ధిలో ఉంది. దిగే కళ మరియు పైకి ఎక్కే కళ యొక్క రహస్యాన్ని తండ్రియే అర్థం చేయించారు. మీకు కూడా నంబరువారుగా తెలుసు మరియు మీరు పురుషార్థము చేస్తూ ఉంటారు. ఎవరైతే తండ్రిని స్మృతి చేస్తారో వారు త్వరగా పైకి వెళ్తారు. ఇది ప్రవృత్తి మార్గము. జంటల పరుగుపందెము ఉంటుంది, అందులో జంటలోని ఒకరి కాలును మరొకరి కాలుకు కడతారు, అప్పుడు పరుగెడతారు. ఇది కూడా మీ పరుగుపందెము కదా. అక్కడ ఎవరికైనా ప్రాక్టీస్ లేకపోతే కింద పడిపోతారు, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఒకరు ముందుకు పరుగెడుతూ ఉంటే మరొకరు ఆపుతూ ఉంటారు, కొన్నిచోట్ల ఇద్దరూ కింద పడిపోతారు. వృద్ధులకు కూడా కామము యొక్క అగ్ని అంటుకున్నప్పుడు వారు కూడా కింద పడిపోతారు, ఇది బాబాకు విచిత్రమనిపిస్తుంది. అవతలివారు పడేసారు అని కాదు. పడిపోవడం, పడకపోవడం అనేది మీ చేతిలోనే ఉంది. మిమ్మల్ని ఎవ్వరూ తోయడం లేదు, మరి మీరెందుకు కింద పడాలి? ఏమి జరిగినా కానీ నేను పడను. కింద పడితే భాగ్యము పాడైపోతుంది, గట్టిగా చెంపదెబ్బ తగులుతుంది, ఆ తర్వాత పశ్చాత్తాపపడతారు కూడా, ఎముకులన్నీ విరిగిపోతాయి, బాగా దెబ్బ తగులుతుంది. బాబా రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు.

శివజయంతి నాడు, మనుష్యులు చదివి అర్థం చేసుకునే విధమైన టెలిగ్రాములు పంపించాలని కూడా బాబా అర్థం చేయించారు. విచార సాగర మంథనము చేయడానికి బాబా సమయము ఇస్తారు. ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోతారు. ఎన్ని ఉత్తరాలు వస్తాయి, అందరూ బాప్ దాదా అని వ్రాస్తారు. శివబాబాను తండ్రి అని, బ్రహ్మాను దాదా అని అంటారని మీరు అర్థం చేయించవచ్చు కూడా. ఎప్పుడైనా ఒకే వ్యక్తిని బాప్ దాదా అని పిలుస్తారా ఏమిటి? ఇది అద్భుతమైన విషయము, ఇందులో సత్యాతి-సత్యమైన జ్ఞానముంది. కానీ స్మృతిలో ఉన్నప్పుడే ఎవరికైనా బాణము కూడా తగులుతుంది. పదే-పదే దేహాభిమానములోకి వచ్చేస్తారు. తండ్రి చెప్తున్నారు, ఆత్మాభిమానులుగా అవ్వండి. ఆత్మయే శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది. ఎవరైనా మరణించినా కూడా ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు. ఆత్మలో ఏ పాత్ర అయితే నిశ్చితమై ఉందో, దానిని మనం సాక్షీగా అయి చూస్తాము. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుని పాత్రను అభినయించాలి. ఇందులో అసలు మనమేమి చెయ్యగలము? ఈ జ్ఞానము కూడా మీ బుద్ధిలో ఉంది. అది కూడా నంబరువారుగా ఉంది. చాలామంది బుద్ధిలోనైతే అసలు నిలవనే నిలవదు, అందుకే వారు ఎవ్వరికీ అర్థం చేయించలేరు. ఆత్మ పూర్తిగా వేడి పెనము వలె, తమోప్రధానముగా, పతితముగా ఉంది. దానిపై జ్ఞానామృతము పోసినా అది నిలవదు. ఎవరైతే చాలా భక్తి చేసారో, వారికే బాణము తగులుతుంది, వెంటనే ధారణ అవుతుంది. ఈ లెక్క అద్భుతమైనది - మొదటి నంబరులో పావనముగా ఉన్నవారే మళ్ళీ పతితముగా అవుతారు. ఇవి కూడా ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరి భాగ్యములోనైనా లేకపోతే, వారు చదువును వదిలేస్తారు. ఒకవేళ బాల్యము నుండే జ్ఞానములో నిమగ్నమై ఉన్నట్లయితే, ధారణ జరుగుతూ ఉంటుంది. వీరు చాలా భక్తి చేసారు, వీరు చాలా చురుకుగా అవుతారు అని భావిస్తారు ఎందుకంటే అవయవాలు పెద్దవి అవ్వడముతో వివేకము కూడా పెరుగుతూ ఉంటుంది. దైహిక, ఆత్మిక, రెండు వైపులా అటెన్షన్ పెట్టినట్లయితే వేరే ఏదైనా ప్రభావము ఉంటే అది తొలగిపోతుంది. ఇది ఈశ్వరీయ చదువు. తేడా ఉంది కదా. కానీ ఆ తపన కూడా ఉండాలి కదా. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మిక మిలటరీగా అయి పంచ వికారాలపై విజయము పొందాలి, పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. శ్రీమతము ఆధారముగా భారత్ ను పావనముగా తయారుచేసే సేవ చేయాలి.

2. ఈ అనంతమైన నాటకములో ప్రతి పాత్రను ఆత్మాభిమానిగా అయి అభినయించాలి, ఎప్పుడూ దేహాభిమానములోకి రాకూడదు. సాక్షీగా అయి ప్రతి పాత్రధారి యొక్క పాత్రను చూడాలి.

వరదానము:-
సదా సంతోషము లేక ఆనందమయ స్థితిలో ఉండే కంబైండ్ స్వరూపపు అనుభవీ భవ

బాప్ దాదా పిల్లలకు సదా చెప్తూ ఉంటారు - పిల్లలూ, బాబా చేతిలో చేయి వేసి నడవండి, ఒంటరిగా నడవకండి. ఒంటరిగా నడుస్తూ వెళ్ళడం ద్వారా అప్పుడప్పుడు బోర్ అయిపోతారు, ఇంకెవరి దృష్టి అయినా పడవచ్చు కూడా. నేను బాబాతోపాటు కంబైండుగా ఉన్నాను - ఈ స్వరూపాన్ని అనుభవం చేస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా మాయ దృష్టి పడదు మరియు తోడు యొక్క అనుభవం అవుతున్న కారణముగా సంతోషముగా, ఆనందముగా తింటూ, నడుస్తూ, వేడుక జరుపుకుంటూ ఉంటారు. మోసగించే లేక దుఃఖమునిచ్చే సంబంధాలలో చిక్కుకోవడం నుండి కూడా రక్షింపబడతారు.

స్లోగన్:-
యోగము రూపీ కవచాన్ని ధరించి ఉన్నట్లయితే మాయా రూపీ శత్రువు యొక్క దాడి జరగదు.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి

ఏ విధంగా దుఃఖములో ఉన్న ఆత్మల మనసులో, ‘ఇప్పుడు ఇక వినాశనమవ్వాలి’ అన్న శబ్దము మొదలైందో, అదే విధంగా విశ్వ కళ్యాణకారీ ఆత్మలైన మీ మనసులో ‘ఇప్పుడు ఇక త్వరగానే సర్వుల కళ్యాణము జరగాలి’ అన్న సంకల్పము ఉత్పన్నమవ్వాలి, అప్పుడే సమాప్తి జరుగుతుంది. వినాశకారులకు కళ్యాణకారీ ఆత్మల యొక్క సంకల్పమనే సూచన కావాలి, అందుకే ఎవర్రెడీగా అవ్వాలి అనే మీ శక్తిశాలి సంకల్పముతో జ్వాలా రూపపు యోగము ద్వారా వినాశ జ్వాలను తీవ్రతరము చేయండి.