19-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఏ విధముగా బాప్-దాదా, ఇరువురూ
నిరహంకారిగా ఉన్నారో, దేహీ-అభిమానిగా ఉన్నారో, అలా ఫాలో ఫాదర్ చేయండి, అప్పుడు సదా
ఉన్నతి జరుగుతూ ఉంటుంది’’
ప్రశ్న:-
ఉన్నత పదవిని ప్రాప్తించుకునేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవడము తప్పనిసరి?
జవాబు:-
ఉన్నత పదవిని
పొందేందుకు, వీటి పట్ల జాగ్రత్త వహించండి, 1. మనసా ద్వారా కూడా ఎవరికీ నా వలన దుఃఖము
కలగకూడదు, 2. ఎటువంటి పరిస్థితిలోనూ క్రోధము రాకూడదు, 3. తండ్రికి చెందినవారిగా అయి
తండ్రి కార్యములో, ఈ రుద్ర యజ్ఞములో విఘ్నరూపులుగా అవ్వకూడదు. ఒకవేళ ఎవరైనా నోటితో
బాబా-బాబా అని అంటున్నా, వారి నడవడిక రాయల్ గా లేకపోతే ఉన్నత పదవి లభించజాలదు.
ఓంశాంతి
తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలని పిల్లలకు మంచి రీతిలో తెలుసు. ఎలా?
శ్రీమతాన్ని అనుసరించి. ఒక్క గీతా శాస్త్రములో మాత్రమే శ్రీమత్ భగవానువాచ ఉంది అని
తండ్రి అర్థం చేయించారు. భగవంతుడైతే అందరికీ తండ్రి. శ్రీమత్ భగవానువాచ. భగవంతుడు
తప్పకుండా వచ్చి శ్రేష్ఠముగా తయారుచేసి ఉంటారు, అందుకే వారికి మహిమ ఉంది. శ్రీమత్
భగవద్గీత అనగా శ్రీమత్ భగవానువాచ. భగవంతుడైతే తప్పకుండా ఉన్నతోన్నతమైనవారు. శ్రీమతము
కూడా ఆ ఒక్క శాస్త్రములోనే వినిపించడము జరిగింది, ఇంకే శాస్త్రములోనూ శ్రీమత్
భగవానువాచ లేదు. శ్రీమతము ఎవరిది ఉండాలి అనేది గీతను వ్రాసినవారు కూడా అర్థం
చేసుకోలేరు. అందులో పొరపాటు ఎందుకు జరిగింది? అది కూడా తండ్రి వచ్చి అర్థం
చేయిస్తారు. రావణ రాజ్యము ప్రారంభమవ్వడముతోనే రావణుడి మతముపై నడవడము మొదలుపెడతారు.
మొట్టమొదట అన్నింటికన్నా కఠినమైన పొరపాటును ఈ రావణ మతము వారే చేసారు. రావణుడి
చెంపదెబ్బ తగులుతుంది. ఏ విధముగా శంకరుడు ప్రేరేపించి బాంబులు మొదలైనవి
తయారుచేయించారని అంటారో, అదే విధముగా 5 వికారాల రూపీ రావణుడు ప్రేరకుడు, మనుష్యులను
పతితముగా తయారుచేయడానికి. అందుకే ఓ పతిత-పావనా, రండి అని పిలుస్తారు. కావున
పతిత-పావనుడు ఒక్కరే ఉన్నట్లు కదా. దీని ద్వారా పతితముగా చేసేవారు వేరు మరియు
పావనముగా చేసేవారు వేరు అన్నది ఋజువవుతుంది. ఇరువురూ ఒక్కరు కాలేరు. ఈ విషయాలను
నంబరువారు పురుషార్థానుసారముగా మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. అందరికీ
నిశ్చయముందని అనుకోకండి. నంబరువారుగా ఉన్నారు. ఎంత నిశ్చయముంటే, అంత సంతోషము
పెరుగుతుంది. తండ్రి మతముపై నడవవలసి ఉంటుంది. శ్రీమతముపై మనము ఈ స్వరాజ్య పదవిని
పొందాలి. మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వడానికి సమయము పట్టదు. మీరు పురుషార్థము
చేస్తారు. మమ్మా-బాబాలను ఫాలో చేస్తారు. ఎలాగైతే వారు తమ సమానముగా తయారుచేసే సేవను
చేస్తున్నారో, మీరు కూడా - మేము ఏ సేవ చేస్తున్నాము, మమ్మా-బాబా ఏ సేవ చేస్తున్నారు
అన్నది అర్థం చేసుకుంటారు. శివబాబా మరియు బ్రహ్మా దాదా, ఇరువురూ కలిసి ఉన్నారని బాబా
అర్థం చేయించారు. కావున వారు (బ్రహ్మాబాబా) అందరికన్నా సమీపముగా ఉన్నారని అర్థం
చేసుకోవాలి. వీరి సంపూర్ణ రూపాన్నే సూక్ష్మవతనములో చూస్తారు, కావున తప్పకుండా వీరు
చురుకుగా ఉన్నట్లు. కానీ ఏ విధముగా తండ్రి నిరహంకారిగా ఉన్నారో, దేహీ-అభిమానిగా
ఉన్నారో, అదే విధముగా ఈ దాదా కూడా నిరహంకారిగా ఉన్నారు. శివబాబాయే అర్థం చేయిస్తూ
ఉంటారని వీరు అంటారు. మురళీ వినిపించినప్పుడు, శివబాబా వీరి ద్వారా
వినిపిస్తున్నారని భావించండని స్వయంగా బాబానే అంటారు. ఈ బ్రహ్మా కూడా తప్పకుండా
వింటూ ఉండవచ్చు. వీరు వినకుండా, ఇతరులకు వినిపించకుండా ఉంటే ఉన్నత పదవిని ఎలా
పొందగలరు. కానీ వీరు తమ దేహాభిమానాన్ని విడిచి ఏమంటారంటే - శివబాబాయే
వినిపిస్తున్నట్లుగా భావించండి, నేను పురుషార్థము చేస్తూ ఉంటాను, శివబాబాయే అర్థం
చేయిస్తారు. వీరు పతితత్వాన్ని దాటి వేసేసారు. మమ్మా అయితే కుమారీ. మమ్మా ఉన్నతముగా
తయారయ్యారు. కుమారీలైన మీరు కూడా మమ్మాను ఫాలో చేయండి. గృహస్థులు బాబాను ఫాలో చేయాలి.
నేను పతితముగా ఉన్నాను, నేను పావనముగా అవ్వాలి అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి.
ముఖ్యమైన విషయముగా తండ్రి స్మృతియాత్రను నేర్పించారు. ఇందులో దేహాభిమానము ఉండకూడదు.
అచ్ఛా, ఎవరైనా మురళీని వినిపించలేకపోతే, స్మృతియాత్రలో ఉండండి. యాత్రలో ఉంటూ మురళీని
వినిపించవచ్చు కానీ అప్పుడు యాత్రను మర్చిపోయినా పర్వాలేదు. మురళీని వినిపించి మళ్ళీ
యాత్రలో నిమగ్నమైపోండి, ఎందుకంటే అది వాణి నుండి అతీతమైన వానప్రస్థావస్థ. ముఖ్యమైన
విషయమేమిటంటే, దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి మరియు చక్రాన్ని
స్మృతి చేస్తూ ఉండాలి. ఎవ్వరికీ దుఃఖము ఇవ్వకండి. తండ్రిని స్మృతి చేయండి అని
అందరికీ ఇదే అర్థం చేయిస్తూ ఉండాలి. ఇది యాత్ర. మనుష్యులు మరణించినప్పుడు
స్వర్గస్థులయ్యారని అంటారు. అజ్ఞాన కాలములో ఎవరూ స్వర్గాన్ని స్మృతి చేయరు.
స్వర్గాన్ని స్మృతి చేయడము అనగా ఇక్కడ నుండి మరణించడము. ఊరికే ఎవరూ స్మృతి చేయరు.
మనము తిరిగి వెళ్ళాలని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అంటారు, ఎంతగా మీరు
స్మృతి చేస్తారో, అంతగా సంతోషపు పాదరసము పైకెక్కుతుంది, వారసత్వము గుర్తుంటుంది.
ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంత హర్షితముగా కూడా ఉంటారు. తండ్రిని స్మృతి
చేయకపోతే తికమకపడతారు. గుటకలు మింగుతూ ఉంటారు. మీరు అంత సమయము స్మృతి చేయలేరు. బాబా
ప్రేయసీ-ప్రియుడు యొక్క ఉదాహరణను చెప్పారు. ప్రియుడు వ్యాపారము చేస్తూ ఉన్నా సరే
మరియు ప్రేయసి చరఖా తిప్పుతూ ఉన్నా సరే, ప్రేయసి ఎదురుగా ప్రియుడు వచ్చి
నిలబడిపోతాడు. ప్రేయసి, ప్రియుడిని స్మృతి చేస్తుంది. ప్రియుడు తిరిగి ప్రేయసిని
స్మృతి చేస్తాడు. ఇక్కడైతే మీరు కేవలం ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. వారు అందరికీ
ప్రియుడు. బాబా, మీరు మమ్మల్ని స్మృతి చేస్తారా అని పిల్లలైన మీరు వ్రాస్తారు. అరే,
ఎవరైతే అందరికీ ప్రియుడో, వారు తిరిగి ప్రేయసులైన మిమ్మల్ని ఎలా స్మృతి చేస్తారు?
అది జరగదు. వారు ఉన్నదే ప్రియుడు, వారు ప్రేయసి కాలేరు. మీరే స్మృతి చేయాలి. ఆ ఒక్క
ప్రియునికి మీలోని ప్రతి ఒక్కరూ ప్రేయసులుగా అవ్వాలి. ఒకవేళ వారు ప్రేయసిగా
అయినట్లయితే ఎంతమందిని స్మృతి చేయాలి. అది వీలు కాదు. బాబా ఏమంటారంటే - ఎవరినైనా
స్మృతి చేయడానికి నా పై ఎటువంటి పాపాల భారము లేదు. మీ పైన భారముంది. తండ్రిని స్మృతి
చేయకపోతే పాపాల భారము తొలగదు. ఇకపోతే, నేను ఎవరినైనా ఎందుకు స్మృతి చేయాలి. స్మృతి
చేయవలసినది ఆత్మలైన మీరు. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా పుణ్యాత్ములుగా అవుతారు,
పాపాలు తొలగిపోతూ ఉంటాయి. ఇది చాలా గొప్ప గమ్యము. దేహీ-అభిమానులుగా అవ్వడములోనే
శ్రమ ఉంది. ఈ జ్ఞానమంతా మీకు లభిస్తూ ఉంది. నంబరువారు పురుషార్థానుసారముగా మీరు
త్రికాలదర్శులుగా అయ్యారు. మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉండాలి. తండ్రి అర్థం
చేయిస్తున్నారు, మీరు లైట్ హౌస్ లు కదా. ప్రతి ఒక్కరికీ శాంతిధామానికి మరియు
సుఖధామానికి మార్గాన్ని తెలియజేసేవారు. ఈ కొత్త విషయాలన్నింటినీ మీరు వింటారు.
వాస్తవానికి ఆత్మలమైన మనమంతా శాంతిధామ నివాసులమని మీకు తెలుసు. పాత్రను
అభినయించడానికి ఇక్కడకు వస్తాము. మనము పాత్రధారులము. ఇదే చింతన బుద్ధిలో నడుస్తూ
ఉన్నట్లయితే నషా ఎక్కుతుంది. ఆది నుండి అంతిమము వరకు మీ పాత్ర ఉంది అని తండ్రి అర్థం
చేయించారు. ఇప్పుడు కర్మాతీత అవస్థలోకి తప్పకుండా వెళ్ళాలి, ఆ తర్వాత
బంగారుయుగములోకి రావాలి. ఇదే తపనలో, ధ్యాసలో ఉంటూ తమ కళ్యాణము చేసుకోవాలి. కేవలం
పండితులుగా అవ్వకూడదు. ఇతరులకు నేర్పిస్తూ, స్వయము ఆ అవస్థలో ఉండకపోతే, ప్రభావము
పడదు. స్వయము యొక్క పురుషార్థము కూడా చేయాలి. నేను కూడా స్మృతి చేసేందుకు ప్రయత్నము
చేస్తూ ఉంటాను అని తండ్రి (బ్రహ్మా) కూడా అంటారు. ఒక్కోసారి, మాయా తుఫాన్లు ఎలా
వస్తాయంటే అవి బుద్ధియోగాన్ని తెంచివేస్తాయి. చాలామంది పిల్లలు చార్టును పంపుతారు.
వీరు నా కన్నా చురుకుగా ముందుకు వెళ్తున్నారే అని ఆశ్చర్యపోతాను. బహుశా వారు
ఉత్సాహము కలిగినప్పుడు చార్టు వ్రాయడములో నిమగ్నమైపోతారేమో, కానీ ఒకవేళ వారు ఇదే
విధముగా తీవ్ర వేగముతో పరుగు తీసినట్లయితే నంబర్ వన్ లోకి వెళ్ళిపోతారు. కానీ అలా
జరగటము లేదు, అది కేవలం చార్టు వ్రాయడము వరకు మాత్రమే ఉంటుంది. అంతేకానీ, బాబా,
ఇంతమందిని నా సమానముగా తయారుచేసాను అని వ్రాయటము లేదు. అలాగే, బాబా, వీరు మాకు
మార్గాన్ని చూపారు అని అవతలివారు కూడా వ్రాయాలి. అటువంటి సమాచారము రావటము లేదు. మరి,
బాబా ఏమనుకుంటారు? కేవలం చార్టు పంపడము వలన పనేమీ అవ్వదు. తమ సమానముగా కూడా
తయారుచేయాలి. రూప్ మరియు బసంత్, రెండు విధాలగానూ అవ్వాలి. లేకపోతే తండ్రి సమానముగా
లేనట్లే. రూప్ గా కూడా, బసంత్ గా కూడా, ఏక్యురేట్ గా తయారవ్వాలి, ఇందులోనే శ్రమ ఉంది.
దేహాభిమానము హతమార్చేస్తుంది. రావణుడు దేహాభిమానిగా తయారుచేసాడు. ఇప్పుడు మీరు
దేహీ-అభిమానులుగా అవుతారు. మళ్ళీ అర్ధకల్పము తర్వాత మాయా రావణుడు, దేహాభిమానులుగా
చేస్తాడు. దేహీ-అభిమానులైతే చాలా మధురముగా అవుతారు. సంపూర్ణులుగానైతే ఇప్పుడు ఇంకా
ఎవ్వరూ అవ్వలేదు, అందుకే బాబా ఎప్పుడూ ఏమంటారంటే, ఎవ్వరి మనసునూ బాధపెట్టకూడదు,
దుఃఖము కలిగించకూడదు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. మాటలో, నడవడికలో కూడా చాలా
రాయల్టీ ఉండాలి. ఈశ్వరీయ పిల్లల నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. మీరు మనుష్యులకు
ప్రాణ దానము ఇస్తారు. మార్గాన్ని తెలియజేయాలి మరియు అర్థం చేయించాలి. మీరు
పరమాత్ముని పిల్లలు కదా. వారి నుండి మీకు స్వర్గ రాజ్యాధికారము లభించాలి. మరి అది
ఇప్పుడు ఎందుకు లేదు. నిజంగా తండ్రి నుండి వారసత్వము లభించింది కదా, గుర్తు
తెచ్చుకోండి. భారతవాసులైన మీరు దేవీ-దేవతలుగా ఉండేవారు, మీరే 84 జన్మలు తీసుకున్నారు.
మేమే లక్ష్మీ-నారాయణుల కులానికి చెందినవారిగా ఉండేవారమని మీరు భావించండి. స్వయాన్ని
తక్కువగా ఎందుకు భావిస్తారు. బాబా, అందరూ అలా అవ్వరు కదా అని అంటున్నారంటే బాబా
అనుకుంటారు - వీరు ఈ కులానికి చెందినవారు కాదు, ఇప్పటినుండే చంచలమైపోతున్నారే అని.
మీరు 84 జన్మలు తీసుకున్నారు. తండ్రి 21 జన్మల ప్రారబ్ధాన్ని జమ చేయించారు, అది
తినేసారు, ఇక తర్వాత సమాప్తమవ్వడము ప్రారంభమయ్యింది. తుప్పు పడుతూ-పడుతూ
తమోప్రధానముగా, గవ్వ సమానముగా అయిపోయారు. భారత్ యే 100 శాతము సంపన్నముగా ఉండేది.
వారికి ఆ వారసత్వము ఎక్కడి నుండి లభించింది, అది పాత్రధారులే చెప్పగలరు కదా.
మనుష్యులే పాత్రధారులు. ఈ లక్ష్మీ-నారాయణులకు రాజ్యాధికారము ఎక్కడి నుండి లభించింది
అనేది వారికి తెలిసి ఉండాలి. ఎంత మంచి-మంచి పాయింట్లు ఉన్నాయి. తప్పకుండా, వారు గత
జన్మలోనే ఈ రాజ్య భాగ్యాన్ని పొంది ఉంటారు.
తండ్రియే పతిత-పావనుడు. తండ్రి అంటారు, నేను మీకు కర్మ-అకర్మ-వికర్మల గతిని అర్థం
చేయిస్తాను. రావణ రాజ్యములో మనుష్యుల కర్మలు వికర్మలుగా అయిపోతాయి. అక్కడ మీ కర్మలు
అకర్మలుగా ఉంటాయి. అది దైవీ సృష్టి. నేను రచయితను, కావున తప్పకుండా నేను సంగమములో
రావలసి ఉంటుంది. ఇది రావణ రాజ్యము. అది ఈశ్వరీయ రాజ్యము. ఈశ్వరుడు ఇప్పుడు స్థాపన
చేయిస్తున్నారు. మీరందరూ ఈశ్వరుని పిల్లలు, మీకు వారసత్వము లభిస్తోంది. భారతవాసులే
సంపన్నముగా ఉండేవారు, ఇప్పుడు దివాలా తీసారు. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా,
ఇందులో తేడా రాదు. ఎవరి వృక్షము వారిదే. ఇది వెరైటీ వృక్షము కదా. దేవతా ధర్మము వారే
మళ్ళీ దేవతా ధర్మములోకి వస్తారు. క్రిస్టియన్ ధర్మము వారు తమ ధర్మములో సంతోషముగా
ఉన్నారు, వారు ఇతరులను కూడా తమ ధర్మములోకి లాగేసారు. భారతవాసులు తమ ధర్మాన్ని
మర్చిపోయిన కారణముగా, ఆ ధర్మము బాగుందని భావించి అందులోకి వెళ్ళిపోతారు. విదేశాలకు
ఉద్యోగము కోసం ఎంతమంది వెళ్తారు, ఎందుకంటే అక్కడ చాలా సంపాదన ఉంటుంది. డ్రామా చాలా
అద్భుతముగా తయారుచేయబడి ఉంది. దీనిని అర్థం చేసుకునేందుకు మంచి బుద్ధి కావాలి.
విచార సాగర మంథనము చేసినట్లయితే అంతా అర్థమైపోతుంది. ఇది తయారై, తయారుచేయబడిన అనాది
డ్రామా. పిల్లలైన మీరు మీ సమానముగా సదా సుఖమయముగా తయారుచేయాలి. పతితులను పావనముగా
తయారుచేయడము మీ వ్యాపారము. తండ్రి వ్యాపారమే మీ వ్యాపారము. మీ ముఖము సదా దేవతల వలె
సంతోషములో హర్షితముగా ఉండాలి. మేము విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు.
మీరు లవ్లీ చిల్డ్రన్ (ప్రియమైన పిల్లలు). క్రోధము పట్ల చాలా జాగ్రత్త వహించాలి.
పిల్లలకు సుఖ వారసత్వాన్ని ఇవ్వడానికి తండ్రి వచ్చారు. స్వర్గము యొక్క మార్గాన్ని
అందరికీ తెలియజేయాలి. తండ్రి సుఖకర్త, దుఃఖహర్త, కావున మీరు కూడా సుఖకర్తలుగా
అవ్వాలి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. దుఃఖము ఇస్తే మీ శిక్ష 100 రెట్లు
పెరిగిపోతుంది. ఎవ్వరూ శిక్షల నుండి రక్షింపబడలేరు. పిల్లల కోసమైతే ప్రత్యేకముగా
న్యాయసభ కూర్చుంటుంది. తండ్రి అంటారు, మీరు విఘ్నాలు వేస్తే చాలా శిక్షలు తింటారు.
ఫలానావారు ఇలా అవుతారని కల్ప-కల్పాంతరాలు మీకు సాక్షాత్కారము కలుగుతుంది. ఇంతకుముందు
సాక్షాత్కారాలలో చూసేటప్పుడు, అది వినిపించవద్దు అని బాబా చెప్పేవారు. అంతిమములోనైతే
ఏక్యురేట్ గా తెలుస్తూ ఉంటుంది. మున్ముందు చాలా ఎక్కువ సాక్షాత్కారాలు జరుగుతాయి.
వృద్ధి అయితే జరుగుతూనే ఉంటుంది. ఆబూ వరకు క్యూ ఏర్పడుతుంది. బాబాను ఎవ్వరూ
కలవలేకపోతారు. ఓహో ప్రభూ, మీ లీల అని అంటారు. ఇది కూడా గాయనము చేయబడింది కదా.
విద్వాంసులు, పండితులు మొదలైనవారు కూడా చివరిలో వస్తారు. వారి సింహాసనాలు కూడా
కదులుతాయి. పిల్లలైన మీరు మాత్రము చాలా సంతోషముగా ఉంటారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు. ఇటువంటి
ప్రియస్మృతులు ఒక్కసారి మాత్రమే లభిస్తాయి. ఎంతగా మీరు స్మృతి చేస్తారో, అంతగా
ప్రేమను పొందుతారు, వికర్మలు వినాశనమవుతాయి మరియు ధారణ కూడా జరుగుతుంది. పిల్లలకు
సంతోషపు పాదరసము ఎక్కి ఉండాలి. ఎవరు వచ్చినా వారికి మార్గాన్ని తెలియజేయాలి.
అనంతమైన వారసత్వాన్ని అనంతమైన తండ్రి నుండి పొందాలి. ఇదేమైనా తక్కువ విషయమా? అటువంటి
పురుషార్థము చేయాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మాట్లాడటములో, నడవడికలో చాలా రాయల్ గా ఉండాలి. నోటి నుండి సదా రత్నాలే
వెలువడాలి. తమ సమానముగా తయారుచేసే సేవ చేయాలి. ఎవరి హృదయాన్ని బాధపెట్టకూడదు.
2. క్రోధము పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ముఖాన్ని సదా దేవతల వలె హర్షితముగా
ఉంచుకోవాలి. స్వయాన్ని జ్ఞాన-యోగాల బలముతో దేవతగా తయారుచేసుకోవాలి.
వరదానము:-
శక్తిశాలి దర్పణము ద్వారా అందరికీ స్వయము యొక్క సాక్షాత్కారము
చేయించే సాక్షాత్కారమూర్త భవ
దర్పణము (అద్దము) ముందుకు ఎవరు వెళ్ళినా, వారికి
స్పష్టముగా స్వయము యొక్క సాక్షాత్కారమవుతుంది. కానీ ఒకవేళ దర్పణము శక్తిశాలిగా
లేనట్లయితే అసలు రూపానికి బదులుగా మరొక రూపము కనిపిస్తుంది. ఉండటము సన్నగా ఉంటారు
కానీ కనిపించడము లావుగా కనిపిస్తారు. అందుకే మీరు ఎటువంటి శక్తిశాలి దర్పణముగా
అవ్వండి అంటే దాని ద్వారా అందరికీ స్వయము యొక్క సాక్షాత్కారము చేయించగలగాలి అనగా మీ
ఎదురుగా రాగానే దేహాన్ని మరచి తమ దేహీ రూపములో స్థితులైపోవాలి - వాస్తవికమైన సేవ ఇదే,
దీని ద్వారానే జయజయకారాలు జరుగుతాయి.
స్లోగన్:-
శిక్షణలను స్వరూపములోకి తీసుకువచ్చేవారే జ్ఞాన స్వరూప, ప్రేమ స్వరూప ఆత్మలు.
అవ్యక్త సూచనలు -
‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’
తండ్రిపైనైతే నిశ్చయము
ఉంది కానీ స్వయము పట్ల కూడా నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి కార్యాన్ని చేసినట్లయితే
ఇక విజయమే విజయము లభిస్తుంది. విజయము ముందు సమస్య అసలేమీ కాదు. అప్పుడిక అది సమస్యగా
అనిపించదు, ఆటలా అనిపిస్తుంది. ఆటను సంతోషముగా ఆడుతారు. ఏదైనా కార్యము సహజమైనది
అయినట్లయితే, ఇది ఎడమచేతి ఆట అని అంటారు కదా అనగా అది సహజము అని అర్థము. అలా ఇది
కూడా బుద్ధి యొక్క ఆటలా అయిపోతుంది. ఆటలో భయపడరు.
| | | |