19-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు ఆత్మిక కార్యవ్యవహారాలను చేయాలి, ఆత్మగా భావిస్తూ ప్రతి కర్మను చేసినట్లయితే ఆత్మ నిర్వికారిగా అవుతూ ఉంటుంది’’

ప్రశ్న:-
స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు మరియు స్వర్గములో ఉన్నత పదవిని పొందేందుకు ఆధారమేమిటి?

జవాబు:-
బ్రహ్మాకుమార-కుమారీలుగా అయితే స్వర్గ వారసత్వము లభించేస్తుంది, కానీ ఉన్నత పదవికి ఆధారము చదువు. ఒకవేళ తండ్రికి చెందినవారిగా అయి మంచి రీతిలో చదువును చదువుకుంటూ ఉంటే, పూర్తిగా పవిత్రముగా అయితే, రాజ్య పదవి లభిస్తుంది. ఎవరైనా పూర్తిగా చదువుకోకపోతే, కర్మబంధనాలు ఉంటే, పూర్తిగా పవిత్రముగా అవ్వకపోతే, ఈ లోపు శరీరము వదిలితే, వారు ప్రజలలో కూడా సాధారణ పదవిని పొందుతారు.

ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ ఆత్మిక కార్యవ్యవహారాలు ఉన్నాయి. మిగతా ప్రపంచమంతటిలోనూ దైహిక కార్యవ్యవహారాలు ఉన్నాయి. వాస్తవానికి కార్యవ్యవహారాలనేవి ఆత్మలకు సంబంధించి నడుస్తూ ఉంటాయి. ఆత్మయే ఈ శరీరము ద్వారా చదువుకుంటుంది, నడుస్తుంది, వికర్మలు చేస్తుంది, అందుకే పతితాత్మ, పాపాత్మ అని అంటారు. ఆత్మయే అంతా చేస్తుంది. ఈ సమయములో మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు, నేను ఆత్మను అని అనుకునేందుకు బదులుగా నేను ఫలానాను అని అనుకుంటారు. నేను ఈ వ్యాపారము చేస్తున్నాను లేక ఫలానావారు కాముకులు, క్రోధీ అని అంటుంటారు. శరీరాల పేర్లు తీసుకుంటారు. దీనిని దేహాభిమాన ప్రపంచము, దిగే కళ యొక్క ప్రపంచము అని అంటారు. సత్యయుగములో ఇలా ఉండదు. అక్కడ దేహీ-అభిమానులుగా ఉంటారు. మిమ్మల్ని దేహీ-అభిమానులుగా తయారుచేయడము జరుగుతుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి. ఆత్మనైన నేను ఈ శరీరము రూపీ వస్త్రాన్ని ధరించి పాత్రను అభినయిస్తాను. ఆ పాత్రధారులు కూడా రకరకాల వస్త్రాలను మారుస్తూ పాత్రను అభినయిస్తారు. తండ్రి అంటారు, ఆత్మలైన మీరు ముందు శాంతిధామములో ఉండేవారు. మీ ఇల్లు శాంతిధామము. ఎలాగైతే ఆ హద్దు నాటకము ఉంటుందో, అలా ఇది అనంతమైన నాటకము. ఆత్మలందరూ పరంధామము నుండి వచ్చి, శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తారు. ఆత్మల అసలైన ఇల్లు పరంధామము. ఆ పాత్రధారుల ఇళ్ళు అయితే ఇక్కడే ఉంటాయి. కేవలం వస్త్రాలను మార్చుకుని వచ్చి పాత్రను అభినయిస్తారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - మీరు ఆత్మలు. తండ్రి అయితే పిల్లలూ-పిల్లలూ అనే అంటారు. సన్యాసులు పిల్లలూ-పిల్లలూ అని అనరు. తండ్రి అంటారు - పతిత-పావనుడినైన నేను ఆత్మలైన మీ అందరికీ తండ్రిని, నన్ను మీరు గాడ్ ఫాదర్ అని అంటారు. గాడ్ ఫాదర్ అయితే నిరాకారుడు. బ్రహ్మా-విష్ణు-శంకరులను కూడా గాడ్ ఫాదర్ అని అనరు. వారిలో కూడా ఆత్మ ఉంటుంది కానీ వారిని బ్రహ్మా దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః... అని అంటారు. దేవతలు ఏమి చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. డ్రామా ప్లాన్ అనుసారముగా మీరు పాత్రను ఎలా అభినయిస్తారు అనేది తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. ప్రపంచము ఒక్కటే ఉంది. కింద పాతాళము లేక పైన వేరే ప్రపంచము ఉందని కాదు. ప్రపంచము ఒక్కటే, ఆ చక్రము తిరుగుతూ ఉంటుంది. చంద్రునిపై ప్లాటు తీసుకుంటామని మనుష్యులు అంటూ ఉంటారు. పిల్లలు ఎంత దివాలా తీసారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు ఎంత షావుకారులుగా, వివేకవంతులుగా ఉండేవారు - అని భారతవాసుల కోసమే అంటారు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము మొత్తం విశ్వమంతటిపైనా ఉండేది, దానిని ఎవరూ దోచుకోలేరు. అక్కడ పార్టిషన్లు మొదలైనవేవీ ఉండవు. ఇక్కడైతే ఎన్ని పార్టిషన్లు ఉన్నాయి. పరస్పరములో చిన్న-చిన్న భాగాల కోసం కొట్లాడుకుంటూ ఉంటారు. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. మొత్తం ఆకాశము, భూమి, సముద్రము అన్నీ మీవిగా ఉండేవి, మీరు వాటికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడైతే భాగాలు-భాగాలుగా అయిపోయాయి. భారత్ యే విశ్వానికి యజమానిగా ఉండేదని ఎవరికీ తెలియదు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఆత్మకు ఏదైతే పాత్ర లభించిందో, అది ఎప్పటికీ అరిగిపోదు. అది నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. అప్పుడు 84 జన్మలు తీసుకుంటారు. మీ పాత్ర కొనసాగుతూనే ఉంటుంది, అది ఎప్పటికీ ఆగదు. మోక్షాన్ని ఎవరూ పొందరు. ఎంత ఎక్కువమంది గురువులు ఉంటారో, ఎన్ని ఎక్కువ శాస్త్రాలు ఉంటాయో, అన్ని రకాల మతాలు ఉంటాయి. మనుష్యులలో ఎంత అశాంతి ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే, మనసుకు శాంతి ఎలా లభిస్తుందని అడుగుతారు. దేహాభిమానములోకి వచ్చి ఇలా అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మనసు మరియు బుద్ధి ఆత్మ యొక్క ఇంద్రియాలు. మిగిలినవన్నీ శరీరము యొక్క ఇంద్రియాలు. నా మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని ఆత్మ అంటుంది. వాస్తవానికి ఇలా అనడము తప్పు. మీరు ఆత్మ, మీ స్వధర్మమే శాంతి. ఆత్మనైన నాకు శాంతి ఎలా లభిస్తుందని అనండి. ఇక్కడ కర్మలైతే చేయాల్సిందే. ఈ విషయాలను తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. ప్రపంచములో ఈ జ్ఞానము ఎవరికీ లేదు. అక్కడ ఉన్నది భక్తి మార్గము. వారికి జ్ఞానము గురించి తెలియదు. జ్ఞానాన్ని అయితే ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమయుగములో వస్తాను. కలియుగ అంతిమములో అందరూ పతితులుగా ఉన్నారు. ఇది రావణ రాజ్యము. రావణుడిని కాల్చేది కూడా భారతవాసులే. పతిత-పావనుడైన తండ్రి యొక్క జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది మరియు రావణుడి జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. రావణుడు అందరినీ పతితులుగా చేస్తాడు, అందుకే అతడిని కాలుస్తారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు.

ఇప్పుడు భారత్ లో శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటారు. శ్రీకృష్ణుని లీలలు, భజనలు మొదలైనవి చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు - వాస్తవానికి శ్రీకృష్ణుడి లీలలు అంటూ ఏమీ లేవు. శ్రీకృష్ణుడు ఏమి చేసారు! కంసపురిలో జన్మించారని అంటారు. ఇప్పుడు కంసుడు అని రాక్షసుడని అంటారు. సత్యయుగములో రాక్షసుడు ఎక్కడి నుండి వస్తాడు. మీకు తెలుసు - సత్యయుగములో ఉండే శ్రీకృష్ణుని ఆత్మ, 84 జన్మలను అనుభవించి ఈ సమయములో పతితము నుండి పావనముగా అవుతుంది, ఆ ఆత్మ తన పదవిని తిరిగి తీసుకుంటుంది. అలాగే మీరు కూడా కృష్ణపురిలో ఉండేవారు. 84 జన్మలు తీసుకుని ఇప్పుడు మళ్ళీ మీ పదవిని తీసుకుంటున్నారు. వాస్తవానికి శివబాబా జయంతిని జరుపుకోవాలి. ఏ శివబాబా అయితే అందరినీ నరకము నుండి స్వర్గములోకి తీసుకువెళ్తారో, వారి లీల ఏమీ లేదు. మీరు అంటారు - ఓ పతిత-పావన బాబా రండి, వచ్చి మమ్మల్ని నరకము నుండి స్వర్గములోకి తీసుకువెళ్ళండి. మీరు మా తండ్రి కనుక మేము స్వర్గములో ఉండాలి, కానీ ఈ వికారీ ప్రపంచములో ఎందుకు ఉన్నాము? అందుకే, ఓ గాడ్ ఫాదర్, మమ్మల్ని ఈ దుఃఖపు ప్రపంచము నుండి విడిపించండి అని పిలుస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. తండ్రి అంటారు - ఈ డ్రామా గురించి ఎవరికీ తెలియదు. శాస్త్రాలలో డ్రామా ఆయువును ఎక్కువగా వ్రాసేసారు. కొత్త ప్రపంచము పాతగా అవ్వాల్సిందే. సతో, రజో, తమోలలోకి రావాల్సిందే. ఇది అనంతమైన విషయము. ఇప్పుడు మీరు మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతున్నారు. కొత్త ప్రపంచములో ఉండే భారతవాసులే 84 జన్మల పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు మీరు పవిత్రముగా అవుతారు, మిగిలిన మనుష్యులందరూ పతితముగా ఉన్నారు, అందుకే పావనమైనవారి ఎదురుగా వెళ్ళి నమస్కరిస్తారు. పావనమైనవారికి పావనముగా ఉన్నవారు ఎందుకు నమస్కరిస్తారు. సన్యాసులు పావనమైనవారు, అందుకే పతిత మనుష్యులు వారి ముందు తల వంచుతారు. కన్య పవిత్రముగా ఉన్నప్పుడు అందరూ ఆమె ముందు తల వంచుతారు. ఆ కన్యనే వివాహము చేసుకుని అత్తవారింటికి వెళ్తే, ఆమె అందరికీ తల వంచి నమస్కరించాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరినీ పావనముగా చేయడానికి అనంతమైన తండ్రి వచ్చారు. వారంతా కలియుగములో ఉన్నారు. మీరు ఇప్పుడు సంగమములో ఉన్నారు. ఇప్పుడు మీరు పతిత ప్రపంచములోకి వెళ్ళకూడదు. ఇది ఉన్నదే కళ్యాణకారీ యుగము. తండ్రి వచ్చి అందరి కళ్యాణము చేస్తారు. మీరు ఇప్పుడు శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటారు, అలా చేయకపోతే మనుష్యులు మిమ్మల్ని నాస్తికులని అనుకుంటారు. వాస్తవానికి, తమ తండ్రి గురించి మరియు రచన ఆదిమధ్యాంతాల గురించి తెలియనివారిని నాస్తికులని అంటారు. ఈ సమయములో అందరూ అనాథలుగా అయిపోయారు. ప్రతి ఇంటిలో గొడవలు ఉన్నాయి, ఒకరినొకరు కొట్టుకోవడానికి వెనుకాడరు, అందుకే దీనిని నాస్తికుల ప్రపంచమని అంటారు. వారు తండ్రి గురించి తెలియనివారు, మీరు తండ్రి గురించి తెలిసినవారు. మేము రాతిబుద్ధి కలవారిగా ఉండేవారము, తండ్రి మమ్మల్ని పారసబుద్ధి కలవారిగా చేస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇందులో ఇంకే కష్టము లేదు. తండ్రి అంటారు - కేవలం ఒక గంట చదువుకోండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. శరీరాన్ని స్మృతి చేస్తే లౌకిక సంబంధీకులు గుర్తుకువస్తారు. దేహీ-అభిమానులుగా ఉంటే తండ్రినైన నా స్మృతి ఉంటుంది. ఇది ఉన్నదే వికారీ ప్రపంచము. ఇక్కడ విషయ సాగరములో మునకలు వేస్తూ ఉంటారు. విష్ణువును క్షీర సాగరములో చూపిస్తారు. అక్కడ నేతి నదులు ప్రవహిస్తాయని అంటారు. ఇక్కడైతే కిరోసిన్ కూడా లభించదు. తేడా ఉంది కదా. కావున పిల్లలైన మీకు ఎంత సంతోషము ఉండాలి. తండ్రియే నావికుడు కదా. నా నావను తీరానికి చేర్చండి అని పాడుతారు కూడా. మీరంతా నావలు. నావికుడు ఒక్క తండ్రి మాత్రమే. ఈ శరీరాలను ఇక్కడే వదిలేస్తారు. ఇకపోతే, ఆత్మలను ఆవలి తీరములో ఉన్న ఆ శాంతిధామానికి తీసుకువెళ్తారు. అక్కడి నుండి మళ్ళీ సుఖధామానికి పంపిస్తారు. పరమపిత పరమాత్మనే నావికుడని అంటారు. తండ్రి మహిమను అనేక రకాలుగా పాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు పవిత్రముగా అయి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. శ్రీ శ్రీ శివబాబా శ్రేష్ఠముగా తయారుచేయడానికి వచ్చారు. ఇది భ్రష్టాచారీ ప్రపంచమని స్వయంగా భగవంతుడే అంటారు. ఇప్పుడు మీరు పరమపిత పరమాత్ముని శ్రీమతముపై నడుస్తూ శ్రేష్ఠాచారులుగా అవుతారు. ఇవి ఎంత గుప్తమైన, రమణీకమైన విషయాలు, ఇవి పిల్లలైన మీకు మాత్రమే అర్థమవుతాయి. ఇతరులకు అసలు అర్థమే కావు. ఇప్పుడు దేవీ-దేవతా ధర్మము యొక్క అంటు కట్టడము జరుగుతుందని మీకు తెలుసు. దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉన్నారో, వారు ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోయారు, వారే వచ్చి మళ్ళీ బ్రాహ్మణులుగా అవుతారు. బ్రహ్మాకుమార-కుమారీలుగా అవ్వకుండా తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోలేరు. ఇప్పుడు బ్రహ్మాకుమార-కుమారీలైన మీరు స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఎంతగా పురుషార్థము చేస్తారో మరియు ఇతరులతో చేయిస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. అందరూ అంత చేయలేరు. పూర్తిగా చదువుకోకపోతే, ప్రతిఫలం ఏమవుతుంది. ఒకవేళ శరీరము వదిలేస్తే, స్వర్గములోకి వస్తారు కానీ ప్రజలలో చాలా సాధారణమైనవారిగా అవుతారు. ఒకవేళ తండ్రికి చెందినవారిగా అయి మంచి రీతిలో చదువుకుంటే రాజ్య పదవిని పొందగలరు. చదువుకోకపోతే, వారి అదృష్టములో లేదని భావిస్తారు. పవిత్రముగా ఉంటూ, చదువుకుంటే ఉన్నత పదవిని పొందుతారు. అపవిత్రముగా అయితే తండ్రిని స్మృతి చేయలేకపోతారు. కర్మబంధనాల లెక్కలు సమాప్తమై, బండిలోని రెండు చక్రాలు పవిత్రముగా ఉంటే, సరిగ్గా వెళ్ళగలుగుతారు. ఇరువురూ పవిత్రముగా ఉంటే జ్ఞాన చితిపై కూర్చుంటారు, లేదంటే గొడవలు జరుగుతాయి.

కొంతమంది పిల్లలంటారు - బాబా, శ్రీకృష్ణుడు సత్యయుగములోని మొదటి రాకుమారుడని మనకు తెలుసు కదా, మరి మనము ఈ వేడుకను ఎందుకు జరుపుకోకూడదు. అచ్ఛా, మనము శ్రీకృష్ణుని ఆత్మను పిలవగలము కూడా. శ్రీకృష్ణుని ఆత్మ వచ్చి ఆడుతుంది-పాడుతుంది, రాస్ చేస్తుంది, ఇంకా ఏమి చేస్తుంది. గోప-గోపికలైతే ఇక్కడే ఉంటారు. అక్కడైతే రాకుమార-రాకుమారీలు పరస్పరములో కలుసుకున్నప్పుడు రాస్ చేస్తారు. బంగారు మురళిని వాయిస్తారు. ఈ ఆట-పాటలన్నింటినీ మీరు చివరిలో చూస్తారు. ఈ పాత్రలన్నీ నడుస్తాయి. ప్రారంభములో చూపించడము జరిగింది, ఆ తర్వాత మీరు పురుషార్థములో నిమగ్నమైపోయారు. ఇప్పుడు మళ్ళీ చివరిలో సాక్షాత్కారాలు జరగడము మొదలవుతాయి. ఎవరెవరు ఏ పదవిని పొందుతారు అనేది మీరు తెలుసుకుంటారు. తండ్రి కూర్చుని ఈ రహస్యాలన్నింటినీ అర్థం చేయిస్తారు. మీరు వేద-శాస్త్రాలను నమ్ముతారా అని మిమ్మల్ని అడుగుతారు! మీరు చెప్పండి - అవును, మేమెందుకు నమ్మము. ఇవన్నీ భక్తి మార్గపు సామగ్రి, వీటిలో జ్ఞానమేమీ లేదు. జ్ఞానమిచ్చేవారైతే ఒక్కరే. జ్ఞానము లభిస్తే భక్తి దానంతట అదే దూరమైపోతుంది. మీరు మందిరాలకు వెళ్ళినా సరే, ఈ లక్ష్మీ-నారాయణులు ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తారని మీ బుద్ధిలో ఉంటుంది.

తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - రెండు వైపులా సంబంధాలను నిర్వర్తించాలి, గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా అవ్వాలి. పూర్తి పవిత్రులుగా అవ్వండి, పూర్తి వైష్ణవులుగా అవ్వండి మరియు విష్ణుపురి యొక్క రాజ్యాన్ని తీసుకోండి అని శ్రీమతము చెప్తుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. యోగము ద్వారా కర్మబంధనాల లెక్కాచారాలను సమాప్తము చేసుకుని పావనముగా అవ్వాలి. జ్ఞాన చితిపై కూర్చోవాలి. పూర్తి వైష్ణవులుగా అనగా పవిత్రులుగా అవ్వాలి.

2. తమ శాంత స్వధర్మములో స్థితులవ్వాలి. అందరికీ శాంతిధామము యొక్క స్మృతిని కలిగించాలి. ఎప్పుడూ అశాంతి చెందకూడదు.

వరదానము:-
శబ్దము నుండి అతీతమైన స్థితిలో స్థితులై సర్వ గుణాలను అనుభవము చేసే మాస్టర్ బీజరూప భవ

ఏ విధముగా బీజములో మొత్తము వృక్షమంతా ఇమిడి ఉందో, అదే విధముగా శబ్దానికి అతీతమైన స్థితిలో సంగమయుగములోని సర్వ విశేష గుణాలు అనుభవములోకి వస్తాయి. మాస్టర్ బీజరూపులుగా అవ్వడము అనగా కేవలం శాంతి కాదు, కానీ శాంతితో పాటు జ్ఞానము, అతీంద్రియ సుఖము, ఆనందము, శక్తి మొదలైన సర్వ ముఖ్యమైన గుణాలను అనుభవము చేయడము. ఈ అనుభవము కేవలం స్వయానికే కాదు, కానీ ఇతర ఆత్మలు కూడా వారి ముఖము ద్వారా సర్వ గుణాలను అనుభవము చేస్తారు. ఒక్క గుణములో సర్వ గుణాలు ఇమిడి ఉంటాయి.

స్లోగన్:-
మంచితనాన్ని ధారణ చేయండి కానీ మంచితనానికి ప్రభావితులు అవ్వకండి.

అవ్యక్త ప్రేరణలు - అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా) అవ్వండి

పవిత్రత బ్రాహ్మణ ఆత్మలైన మీ యొక్క అనాది, ఆది సంస్కారము, ఇది మీ న్యాచురల్ సంస్కారము కనుక స్వప్నములో కానీ లేక సంకల్పములో కానీ అపవిత్రత ఇమర్జ్ అవ్వకూడదు. సంకల్పము వచ్చి ఆ తర్వాత విజయులుగా అవ్వడము ఒక విషయము, కానీ దాని కంటే కూడా ఉన్నతమైన విషయము ఏమిటంటే, పవిత్రతను న్యాచురల్ సంస్కారముగా తయారుచేసుకోండి. అప్పుడు ఈ సబ్జెక్ట్ లో పురుషార్థము చేయాల్సిన అవసరముండదు.