19-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు విదేహీగా అయ్యే అభ్యాసము చేయండి, మీ ఈ వినాశీ దేహము పట్ల ఉన్న ప్రేమను తొలగించి ఒక్క శివబాబాను ప్రేమించండి’’

ప్రశ్న:-
ఈ అనంతమైన పాత ప్రపంచము పట్ల ఎవరికైతే వైరాగ్యము కలిగిందో, వారి గుర్తులు ఏమిటి?

జవాబు:-
వారు ఈ కనులతో ఏదైతే చూస్తారో - అది చూస్తూ కూడా చూడనట్లుగా ఉంటారు. వారి బుద్ధిలో ఏముంటుందంటే - ఇదంతా సమాప్తమవ్వనున్నది, వీరంతా మరణించి ఉన్నారు, మేమైతే శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళాలి. వారి మమకారము తొలగిపోతూ ఉంటుంది. యోగములో ఉంటూ ఎవరితోనైనా మాట్లాడితే ఎదుటివారికి కూడా ఆకర్షణ కలుగుతుంది. జ్ఞానము యొక్క నషా ఎక్కి ఉంటుంది.

పాట:-
ఓం నమః శివాయ...

ఓంశాంతి
తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, మీరు శివబాబాను తెలుసుకున్నారు. కావున ఈ పాటలు పాడటము అనేది భక్తి మార్గానికి సంబంధించినదిగా అయిపోతుంది. భక్తి మార్గము వారు శివాయ నమః అని కూడా అంటారు, మాత-పిత అని కూడా అంటారు, కానీ వారి గురించి తెలియదు. శివబాబా నుండి స్వర్గ వారసత్వము లభించాలి. పిల్లలైన మీకైతే తండ్రి లభించారు, వారి నుండి వారసత్వము లభిస్తూ ఉంది, అందుకే తండ్రిని స్మృతి చేస్తారు. శివబాబా మీకు లభించారు, ప్రపంచానికి లభించలేదు. ఎవరికైతే లభించారో, వారు కూడా మంచి రీతిలో నడుచుకోలేకపోతున్నారు. బాబా డైరెక్షన్లు చాలా మధురమైనవి - ఆత్మ-అభిమాని భవ, దేహీ-అభిమాని భవ. వారు ఆత్మలతోనే మాట్లాడుతారు. దేహీ-అభిమాని అయిన తండ్రి దేహీ-అభిమానులైన పిల్లలతో మాట్లాడుతారు. వారు ఒక్కరే. ఇప్పుడు వారు మధుబన్ లో పిల్లలైన మీతోపాటు కూర్చున్నారు. తప్పకుండా తండ్రి చదివించేందుకే వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. ఈ చదువును శివబాబా తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు. బ్రహ్మా చదివించలేరు, విష్ణువు చదివించలేరు. తండ్రియే వచ్చి పతితులను పావనముగా తయారుచేస్తారు, అమరకథను వినిపిస్తారు. అది కూడా ఇక్కడే వినిపిస్తారు కదా. అమరనాథ్ లో వినిపించరు కదా. ఇదే అమర కథ, సత్యనారాయణుడి కథ. తండ్రి అంటారు - నేను మీకు ఇక్కడే వినిపిస్తాను. మిగిలినవన్నీ భక్తి మార్గము యొక్క ఎదురుదెబ్బలు. సర్వుల సద్గతిదాత అయిన రాముడు నిరాకారుడు ఒక్కరే. వారే పతిత-పావనుడు, జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు. వినాశన సమయము వచ్చినప్పుడే వారు వస్తారు. మొత్తం జగత్తుకు గురువుగా ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే అవ్వగలరు. వారు నిరాకారుడు కదా. దేవతలను కూడా మనుష్యులనే అంటారు. కానీ వారు దైవీ గుణాల కల మనుష్యులు కనుక వారిని దేవతలని అంటారు.

మీకు ఇప్పుడు జ్ఞానము లభించింది. జ్ఞాన మార్గములో అవస్థను చాలా దృఢముగా ఉంచుకోవాలి. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయాలి. విదేహీగా అవ్వాలి. అటువంటప్పుడు అసలు దేహాన్ని ఎందుకు ప్రేమించాలి! బాబా మీకు చెప్తున్నారు - శివబాబాను స్మృతి చేయండి, తర్వాత వీరి (బ్రహ్మా) వద్దకు రండి. వీళ్ళు దాదాను కలుసుకునేందుకు వెళ్తున్నారని మనుష్యులు భావిస్తారు. మనము శివబాబాను స్మృతి చేస్తూ వీరిని (బ్రహ్మా) కలుస్తామని మీకు తెలుసు. అక్కడ ఉండేదే నిరాకారీ ఆత్మలు, బిందువు వలె ఉంటాయి. బిందువునైతే మీరు కలుసుకోలేరు. అటువంటప్పుడు శివబాబాను ఎలా కలుసుకుంటారు, అందుకే ఇక్కడ ఏమని అర్థం చేయించడము జరుగుతుందంటే - ఓ ఆత్మలూ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బుద్ధిలో ఉంచుకోండి - మేము శివబాబాను కలుసుకుంటున్నాము అని. ఇది చాలా గుహ్యమైన రహస్యము కదా. చాలామందికి శివబాబా స్మృతి ఉండదు. బాబా అర్థం చేయిస్తున్నారు - సదా శివబాబాను స్మృతి చేయండి. శివబాబా మిమ్మల్ని కలుసుకునేందుకు వస్తారు. బాబా, ఇప్పుడు నేను మీకు చెందినవానిగా అయ్యాను, అంతే. శివబాబా వీరిలోకి వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు. శివబాబా కూడా నిరాకార ఆత్మ, మీరు కూడా ఒక ఆత్మ. ఒక్క తండ్రి మాత్రమే పిల్లలకు - నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్తారు. అది కూడా బుద్ధితో స్మృతి చేయాలి. మనము తండ్రి వద్దకు వచ్చాము. బాబా ఈ పతిత శరీరములోకి వచ్చారు. మనము వారి ఎదురుగా వస్తూనే - శివబాబా, మేము మీ వారిగా అయ్యామని నిశ్చయము ఏర్పర్చుకుంటాము. మురళీలలో కూడా - నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి అని వింటూ ఉంటారు.

వీరు ఆ పతిత-పావనుడైన తండ్రియే అని మీకు తెలుసు. సత్యాతి-సత్యమైన సద్గురువు వీరే. ఇప్పుడు పాండవులైన మీకు పరమపిత పరమాత్మతో ప్రీతి బుద్ధి ఉంది. మిగిలినవారందరికీ ఎవరో ఒకరితో విపరీత బుద్ధి ఉంది. శివబాబాకు చెందినవారిగా అయినవారికైతే సంతోషపు పాదరసము చాలా తీవ్రముగా ఎక్కి ఉండాలి. సమయము ఎంత సమీపముగా వస్తూ ఉంటుందో, అంత సంతోషము కలుగుతుంది. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడిది అంతిమ జన్మ. మనము మన ఇంటికి వెళ్తాము. ఈ మెట్ల వరస చిత్రమైతే చాలా బాగుంది, ఇందులో స్పష్టముగా ఉంది. పిల్లలు రోజంతా బుద్ధిని ఉపయోగించాలి. చిత్రాలను తయారుచేసేవారైతే చాలా విచార సాగర మంథనము చేయాలి, హెడ్స్ ఎవరైతే ఉన్నారో, వారికి ఆలోచన నడవాలి. సత్యయుగీ శేష్ఠాచారీ దైవీ రాజ్యములో 9 లక్షల మంది ఉంటారని మీరు ఛాలెంజ్ చేస్తారు. దీనికి ఋజువేమిటి అని ఎవరైనా అడిగితే, ఇది అర్థం చేసుకునే విషయము కదా అని వారికి చెప్పండి. సత్యయుగములో వృక్షము చిన్నగానే ఉంటుంది, ధర్మము కూడా ఒక్కటే ఉంటుంది, కావున తప్పకుండా మనుష్యులు కూడా కొద్దిమందే ఉంటారు. మెట్ల వరస చిత్రములో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. ఉదాహరణకు ఈ కుంభకర్ణుని చిత్రముంది. ఈ చిత్రాన్ని ఎలా తయారుచేయాలంటే - బి.కె.లు జ్ఞానామృతాన్ని తాగిస్తున్నట్లుగా, వారేమో విషాన్ని (వికారాలను) అడుగుతున్నట్లుగా చూపించాలి. బాబా మురళీలో అన్ని డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. ప్రతి చిత్రములోని వివరణ చాలా బాగుంది. లక్ష్మీ-నారాయణుల చిత్రము చూపించి ఈ విధముగా చెప్పండి - ఈ భారత్ స్వర్గముగా ఉండేది, ఒకే ధర్మముండేది, కావున ఎంతమంది మనుష్యులుంటారు. ఇప్పుడు ఎంత పెద్ద వృక్షముగా అయిపోయింది. ఇప్పుడు వినాశనము అవ్వనున్నది. పాత సృష్టిని పరివర్తన చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. 4-5 చిత్రాలు ముఖ్యమైనవి - వాటి ద్వారా ఎవరికైనా వెంటనే బాణము తగులుతుంది. డ్రామానుసారముగా రోజురోజుకు జ్ఞానము యొక్క పాయింట్లు గుహ్యమవుతూ ఉంటాయి. కావున చిత్రాలలో కూడా మార్పులు జరుగుతాయి. పిల్లల బుద్ధిలో కూడా మార్పు జరుగుతుంది. ఇంతకుముందు, శివబాబా బిందువని అర్థం చేసుకునేవారు కాదు. ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదని అనడానికి లేదు. తండ్రి అంటారు - అన్ని విషయాలను ముందే అర్థం చేయించడము జరగదు. తండ్రి జ్ఞానసాగరుడు కనుక జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటారు. కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. ముందు నుండే అన్నీ చెప్పరు. అలా చెప్తే, అది ఆర్టిఫీషియల్ అయిపోతుంది. ఏవైనా సంగఠనలు అకస్మాత్తుగా జరిగితే, దానిని డ్రామా అని అంటారు. మమ్మా అయితే అసలు చివరి వరకు ఉండాలి, మరి మమ్మా ఎందుకు వెళ్ళిపోయారు, ఇది జరగకూడదు అని అనకూడదు. డ్రామాలో ఏది జరిగితే అది రైట్. బాబా కూడా ఏదైతే చెప్పారో, అది డ్రామానుసారముగా చెప్పారు. డ్రామాలో నా పాత్ర ఇలా ఉంది. బాబా కూడా డ్రామాపై వదిలేస్తారు. మనుష్యులేమో ఈశ్వరుడి ఇచ్ఛ అని అంటారు. ఈశ్వరుడేమో డ్రామా వ్రాత అని అంటారు. ఈశ్వరుడు చెప్పినా లేక వీరు (బ్రహ్మా) చెప్పినా, అది డ్రామాలో ఉంది. ఏదైనా తప్పుడు కర్మ జరిగినా, అది డ్రామాలో ఉంది, తర్వాత అది సరైపోతుంది. ఎక్కే కళ తప్పకుండా ఉంది. బాగా పైకి ఎక్కేటప్పుడు, కొన్ని సార్లు ఊగిసలాడతారు. ఇవన్నీ మాయా తుఫానులు. మాయ ఉన్నంతవరకు వికల్పాలు తప్పకుండా వస్తాయి. సత్యయుగములో మాయే ఉండదు కనుక వికల్పాల విషయమే ఉండదు. సత్యయుగములో ఎప్పుడూ కర్మలు వికర్మలుగా అవ్వవు. ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. ఇది మా అంతిమ జన్మ అని సంతోషముంటుంది. ఇప్పుడు అమరలోకానికి వెళ్ళేందుకు శివబాబా నుండి అమరకథను వింటారు. ఈ విషయాలను మీరే అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడో అమర్ నాథ్ కు వెళ్ళి ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. పార్వతికి కథను వినిపించింది ఎవరు అనేది అర్థం చేసుకోరు. అక్కడ శివుని చిత్రాన్ని చూపిస్తారు. అచ్ఛా, శివుడు ఎవరిలో కూర్చున్నారు? శివుడిని మరియు శంకరుడిని చూపిస్తారు. అంటే శివుడు, శంకరునిలో కూర్చుని కథను వినిపించారా? ఏమీ అర్థం చేసుకోరు, భక్తి మార్గము వారు ఇప్పటికీ తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. కథ కూడా వాస్తవానికి పెద్దదేమీ కాదు. అసలైనది - మన్మనాభవ. కేవలం బీజాన్ని స్మృతి చేయండి. డ్రామా చక్రాన్ని స్మృతి చేయండి. బాబా వద్ద ఏ జ్ఞానమైతే ఉందో, ఆ జ్ఞానము ఆత్మలైన మనలో కూడా ఉంది. వారు కూడా జ్ఞానసాగరుడు, అలాగే ఆత్మలమైన మనము కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతాము. నషా ఎక్కాలి కదా. వారు సోదరులైన మనకు (ఆత్మలకు) వినిపిస్తారు. శరీరము ద్వారానే వినిపిస్తారు కదా. ఇందులో సంశయము రానివ్వకూడదు. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి, మమకారము తొలగిపోతూ ఉంటుంది. కొందరికి నామమాత్రముగా ప్రేమ ఉంటుంది. మనది కూడా అలాంటిదే. ఇప్పుడు మనము సుఖధామానికి వెళ్తాము. ఇక్కడ అందరూ మరణించి ఉన్నట్లుగా ఉన్నారు, వీరి పట్ల ఏం మనసు పెట్టుకోవాలి. శాంతిధామానికి వెళ్ళి తర్వాత సుఖధామములోకి వచ్చి రాజ్యము చేస్తాము. దీనినే పాత ప్రపంచము పట్ల వైరాగ్యము అని అంటారు. తండ్రి అంటారు - ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తారో, అదంతా సమాప్తమవ్వనున్నది. వినాశనము తర్వాత స్వర్గాన్ని చూస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు చాలా మధురముగా తయారవ్వాలి. ఎవరైనా యోగములో ఉంటూ మాట్లాడితే ఎదుటివారికి చాలా ఆకర్షణ కలుగుతుంది. ఈ జ్ఞానము ఎటువంటిదంటే, ఇక మిగిలినదంతా మర్చిపోతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞాన మార్గములో తమ అవస్థను చాలా దృఢముగా తయారుచేసుకోవాలి. విదేహీగా అవ్వాలి. ఒక్క తండ్రి పట్ల మాత్రమే సత్యాతి-సత్యమైన ప్రీతిని పెట్టుకోవాలి.

2. డ్రామా వ్రాతపై అచలంగా ఉండాలి. డ్రామాలో ఏది జరిగితే, అది రైట్. ఎప్పుడూ స్థిరత్వము కోల్పోకూడదు, ఏ విషయములోనూ సంశయము రానివ్వకూడదు.

వరదానము:-
బలహీనతలకు ఫుల్ స్టాప్ పెట్టి తమ సంపన్న స్వరూపాన్ని ప్రఖ్యాతము చేసే సాక్షాత్కార మూర్త భవ

విశ్వము మీ కల్పక్రితపు సంపన్న స్వరూపాన్ని, పూజ్య స్వరూపాన్ని స్మరణ చేస్తూ ఉంది, అందుకే ఇప్పుడు మీ సంపన్న స్వరూపాన్ని ప్రాక్టికల్ గా ప్రఖ్యాతము చేయండి. గతించిన బలహీనతలకు ఫుల్ స్టాప్ పెట్టండి, దృఢ సంకల్పము ద్వారా పాత స్వభావ, సంస్కారాలను సమాప్తము చేయండి, ఇతరుల బలహీనతలను కాపీ చేయకండి, అవగుణాలను ధారణ చేసే బుద్ధిని సమాప్తము చేయండి, దివ్య గుణాలను ధారణ చేసే సతోప్రధాన బుద్ధిని ధారణ చేయండి, అప్పుడు సాక్షాత్కార మూర్తులుగా అవుతారు.

స్లోగన్:-
తమ అనాది మరియు ఆది గుణాలను స్మృతిలో ఉంచుకుని వాటిని స్వరూపములోకి తీసుకురండి.

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

1. నిరాకార పరమాత్ముని రిజర్వు తనువు - బ్రహ్మా తనువు

పరమాత్మ తమ సాకార బ్రహ్మా తనువు ద్వారా వచ్చి చదివిస్తున్నారని మీకు పూర్తిగా నిశ్చయముంది. ఈ పాయింటుపై చాలామంది జిజ్ఞాసువులు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు - అమృతవేళ సమయములో నిరాకార పరమాత్మ తమ సాకార తనువులోకి ప్రవేశించినప్పుడు, ఆ సమయములో శరీరములో ఏ మార్పు జరుగుతుంది? ఆ సమయములో మీరు కూర్చుని పరమాత్మ ఎలా వస్తారు అని వారిని చూస్తూ ఉంటారా? ఇప్పుడు దీని గురించి ఏమని అర్థం చేయించడము జరుగుతుందంటే, పరమాత్మ ప్రవేశించే సమయములో ఆ శరీరము యొక్క నయనాలు, ముఖము మారిపోతాయని కాదు. అలా కాదు. మనము ధ్యానములోకి వెళ్ళినప్పుడు నయనాలు, ముఖము మారిపోతాయి కానీ ఈ సాకార బ్రహ్మా యొక్క పాత్రయే గుప్తమైనది. పరమాత్మ వీరి తనువులోకి వచ్చినప్పుడు ఎవ్వరికీ తెలియదు, వారికి ఈ తనువు రిజర్వు చేయబడి ఉంది, అందుకే సెకండులో వస్తారు, సెకండులో వెళ్ళిపోతారు, ఇప్పుడు ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకానీ, ఏదైనా పాయింటు అర్థం కాకపోతే ఇక ఈ చదువు యొక్క కోర్సును వదిలేయడము కాదు. చదువు అనేది రోజురోజుకు గుహ్యముగా మరియు స్పష్టముగా అవుతూ ఉంటుంది. మొత్తం కోర్సు అంతా ఒకేసారి చదువుకోలేరు కదా, అలా మీకు అర్థం చేయించడము జరుగుతుంది. మిగిలిన ధర్మ పితలు ఎవరైతే వస్తారో, వారిలోకి కూడా, ఆయా ధర్మాలకు చెందిన పవిత్ర ఆత్మలు వచ్చి తమ పాత్రను అభినయిస్తారు. ఆ తర్వాత, ఆ ఆత్మలు సుఖ-దుఃఖాల ఆటలోకి రావాల్సి ఉంటుంది. వారు తిరిగి వెళ్ళరు. కానీ ఆ నిరాకార పరమాత్మ వచ్చినప్పుడు, పరమాత్మ సుఖ-దుఃఖాలకు అతీతమైనవారు కనుక వారు కేవలం తమ పాత్రను అభినయించి వెళ్ళిపోతారు. ఈ పాయింటునే మనము బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి.

2. ఆత్మ మరియు పరమాత్మకు మధ్య గుణాలు మరియు శక్తిలో వ్యత్యాసము

ఆత్మ మరియు పరమాత్మకు మధ్యన వ్యత్యాసము ఈ విధముగా అర్థం చేయించడము జరుగుతుంది - ఆత్మ మరియు పరమాత్మ యొక్క రూపము ఒకేలాంటి జ్యోతి రూపము. ఆత్మ మరియు పరమాత్ముని ఆత్మ, వీరి సైజు కూడా ఒకేలా ఉంటుంది. ఇకపోతే, ఆత్మ మరియు పరమాత్మల మధ్యన గుణాలు మరియు శక్తులలో వ్యత్యాసము తప్పకుండా ఉంది. ఇప్పుడున్న ఈ గుణాలన్నింటి మహిమ పరమాత్మదే. పరమాత్మ సుఖ-దుఃఖాలకు అతీతమైనవారు, సర్వశక్తివంతుడు, వారి శక్తియే మొత్తం పని అంతా చేస్తుంది. ఇకపోతే, మనుష్యాత్మల శక్తులేవీ పని చేయవు. మొత్తం పాత్ర అంతా పరమాత్మదే నడుస్తుంది. పరమాత్మ పాత్రలోకి వచ్చినా కూడా వారు స్వయం అతీతముగా ఉంటారు, కానీ ఆత్మ పాత్రలోకి వచ్చినప్పుడు పాత్రధారి రూపములో వస్తుంది. పరమాత్మ పాత్రలోకి వచ్చినా కర్మ బంధనము నుండి అతీతముగా ఉంటారు. ఆత్మ పాత్రలోకి వచ్చినప్పుడు కర్మ బంధనానికి వశమవుతుంది. ఇది ఆత్మ మరియు పరమాత్మలకు మధ్యన వ్యత్యాసము, బేధము. అచ్ఛా. ఓంశాంతి.

అవ్యక్త ప్రేరణలు - పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి

ఎవరైనా నిందించినా, అసత్యమైన ఆరోపణలు చేసినా, మీకు కోపము రాకూడదు. అపకారులకు ఉపకారము చెయ్యటము, ఇదే బ్రాహ్మణులైన మీ కర్మ. వారు నిందిస్తే మీరు ఆలింగనము చేసుకోండి, ఇదే అద్భుతము. దీనినే పరివర్తన అని అంటారు. ఆలింగనము చేసుకునేవారిని ఆలింగనము చేసుకోవటము, ఇదేమంత పెద్ద విషయము కాదు కానీ నిందించేవారిని సత్యమైన మిత్రునిగా మనసుతో ఒప్పుకోండి, అప్పుడు ఉపకారము చేసేవారు అని అంటారు.