20-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - శ్రీమతముపై నడుస్తూ అందరికీ ముక్తి, జీవన్ముక్తులను పొందే దారిని తెలియజేయండి, రోజంతా ఈ వ్యాపారమే చేస్తూ ఉండండి’’

ప్రశ్న:-
బాగా అర్థం చేసుకోవలసిన ఏ సూక్ష్మమైన విషయాలను తండ్రి వినిపించారు?

జవాబు:-
సత్యయుగము అమరలోకము, అక్కడ ఆత్మ ఒక వస్త్రాన్ని మార్చి ఇంకొక వస్త్రాన్ని ధరిస్తుంది, అంతేకానీ అక్కడ మృత్యువు అన్న పేరే ఉండదు, అందుకే దానిని మృత్యులోకము అని అనరు. శివబాబాకు అనంతమైన రచన ఉంది, బ్రహ్మాకు కేవలము బ్రాహ్మణులైన మీరు మాత్రమే ఈ సమయములో రచనగా ఉన్నారు. త్రిమూర్తి శివ అని అంటారు, అంతేకానీ త్రిమూర్తి బ్రహ్మా అని అనరు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు, వీటిని తండ్రి వినిపించారు. ఇటువంటి విషయాలపై విచార సాగర మంథనము చేసి బుద్ధి కొరకు స్వయమే భోజనము తయారుచేసుకోవాలి.

ఓంశాంతి
త్రిమూర్తి శివ భగవానువాచ. వాళ్ళు త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు. కానీ తండ్రి అంటారు, త్రిమూర్తి శివ భగవానువాచ. త్రిమూర్తి బ్రహ్మా భగవానువాచ అని అనరు. మీరు త్రిమూర్తి శివ భగవానువాచ అని అనవచ్చు. వారైతే శివ-శంకరా అంటూ ఇరువురినీ కలిపేస్తారు. ఇక్కడైతే స్పష్టముగా ఉంది. త్రిమూర్తి బ్రహ్మాకు బదులుగా త్రిమూర్తి శివ భగవానువాచ అని అనాలి. శంకరుడు కన్ను తెరిస్తే వినాశనము అయిపోతుందని మనుష్యులు అంటారు. ఇవన్నీ బుద్ధితో అర్థం చేసుకోవలసిన విషయాలు. ముగ్గురిదే ముఖ్యమైన పాత్ర. బ్రహ్మా మరియు విష్ణువుకు పెద్ద పాత్ర ఉంది, 84 జన్మల పాత్ర. విష్ణువు మరియు ప్రజాపిత బ్రహ్మా యొక్క అర్థాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. పాత్ర ఈ ముగ్గురికే ఉంది. బ్రహ్మాను ఆది దేవ్, ఆడమ్ అన్న పేరుతో మహిమ చేస్తారు. ప్రజాపిత యొక్క మందిరము కూడా ఉంది. ఇది విష్ణువు లేక కృష్ణుని యొక్క అంతిమ 84వ జన్మ, ఇతడికి బ్రహ్మా అన్న పేరును పెట్టడం జరిగింది. బ్రహ్మా మరియు విష్ణువు ఎవరు అన్నది నిరూపించవలసిందే. బ్రహ్మాను అయితే దత్తత తీసుకోబడ్డవారు అని అంటారు. వీరిరువురూ శివబాబా సంతానమే. వాస్తవానికి ఒక్కరే తండ్రి సంతానము. లెక్కప్రకారము బ్రహ్మాయే శివబాబా సంతానము. తండ్రి మరియు దాదా. అందులో విష్ణువు పేరే రాదు. ప్రజాపిత బ్రహ్మా ద్వారా శివబాబా స్థాపన చేస్తున్నారు. విష్ణువు ద్వారా స్థాపన చేయించరు. శివునికి కూడా సంతానము ఉన్నారు, అలాగే బ్రహ్మాకు కూడా సంతానము ఉన్నారు, విష్ణువుకు సంతానము అని అనలేరు. అలాగే లక్ష్మీ-నారాయణులకు ఎక్కువమంది పిల్లలు ఉండే అవకాశము లేదు. ఇదంతా బుద్ధికి భోజనము వంటిది. మీకు మీరే భోజనము తయారుచేసుకోవాలి. అందరికన్నా ఎక్కువ పాత్ర విష్ణువుది అని చెప్పవచ్చు. 84 జన్మల విరాట రూపముగా కూడా విష్ణువునే చూపిస్తారు, అంతేకానీ బ్రహ్మాను కాదు. విరాట రూపము విష్ణువుదే తయారుచేస్తారు, ఎందుకంటే మొట్టమొదట ప్రజాపిత బ్రహ్మా పేరును పెడతారు, బ్రహ్మాకు చాలా తక్కువ పాత్ర ఉంది, అందుకే విరాట రూపము విష్ణువుది చూపిస్తారు. చతుర్భుజ రూపము కూడా విష్ణువుదే తయారుచేస్తారు. వాస్తవానికి ఈ అలంకారాలు మీవే. ఇవి కూడా బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. వీటి గురించి మనుష్యులు ఎవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రి కొత్త-కొత్త రీతులలో అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి అంటారు, త్రిమూర్తి శివ భగవానువాచ అని అనడము కరెక్టు కదా. విష్ణువు, బ్రహ్మా మరియు శివుడు. ఈ ముగ్గురిలో కూడా ప్రజాపిత బ్రహ్మాయే సంతానము. విష్ణువును సంతానము అని అనరు. రచన అని అంటారు కానీ వాస్తవానికి రచన అనేది బ్రహ్మా ద్వారానే రచించడం జరుగుతుంది కదా, ఆ రచనయే తరువాత వేరే నామ-రూపాలను తీసుకుంటారు. ముఖ్యమైన పాత్ర అయితే వారిది. బ్రహ్మా పాత్ర కూడా చాలా తక్కువ ఉంది, ఈ సమయములోనే ఉంది. విష్ణువు యొక్క రాజ్యము ఎంత సమయము ఉంటుంది! ఈ మొత్తము వృక్షానికి బీజరూపుడు శివబాబా. వారి రచనను సాలిగ్రామము అని అంటారు. బ్రహ్మా యొక్క రచనను బ్రాహ్మణ, బ్రాహ్మణీలు అని అంటారు. ఇప్పుడు శివునికి ఎంతైతే రచన ఉందో అంత రచన బ్రహ్మాకు లేదు. శివుని రచన అయితే ఎంతో ఉంది. ఆత్మలందరూ వారి సంతానమే. కేవలము బ్రాహ్మణులైన మీరు మాత్రమే బ్రహ్మాకు రచనగా అవుతారు. హద్దులోకి వచ్చేసారు కదా. శివబాబాకు అనంతమైన రచన ఉంది. ఆత్మలందరూ వారి రచనయే. వారు అనంతమైన ఆత్మల కళ్యాణము చేస్తారు. బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపనను చేస్తారు. బ్రాహ్మణులైన మీరే వెళ్ళి స్వర్గవాసులుగా అవుతారు. ఇంకెవ్వరినీ స్వర్గవాసులు అని అనరు. నిర్వాణవాసులుగా లేక శాంతిధామవాసులుగా అయితే అందరూ అవుతారు. అందరికన్నా ఉన్నతమైన సేవ శివబాబా ద్వారానే జరుగుతుంది. వారు ఆత్మలందరినీ తీసుకునివెళ్తారు. అందరి పాత్రలు వేర్వేరుగా ఉంటాయి. నా పాత్ర వేరు అని శివబాబా కూడా అంటారు. అందరి లెక్కాచారాలను సమాప్తము చేయించి మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారుచేసి నాతోపాటు తీసుకువెళ్తాను. మీరు పావనముగా అయ్యేందుకు ఇక్కడ కష్టపడుతున్నారు. మిగిలిన వారందరూ వినాశన సమయములో లెక్కాచారాలను సమాప్తము చేసుకుని వెళ్తారు. ఆ తరువాత ముక్తిధామములోకి వెళ్ళి కూర్చుంటారు. సృష్టి చక్రము అయితే తిరగవలసిందే.

పిల్లలైన మీరు బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులుగా అయి మళ్ళీ దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులైన మీరు శ్రీమతముపై సేవ చేస్తారు. ముక్తి మరియు జీవన్ముక్తులను పొందాలంటే మీరు ఈ విధముగా పొందవచ్చు అని మీరు మనుష్యులకు కేవలం మార్గాన్ని చూపిస్తారు. రెండు తాళంచెవులు మీ చేతిలో ఉన్నాయి. ఎవరెవరు ముక్తిలోకి వెళ్తారో, ఎవరెవరు జీవన్ముక్తిలోకి వెళ్తారో కూడా మీకు తెలుసు. మీది రోజంతా ఇదే వ్యాపారము. ఎవరైనా ధాన్యము మొదలైనవాటి వ్యాపారము చేస్తే వారికి బుద్ధిలో రోజంతా అదే ఉంటుంది. మీ వ్యాపారము - రచన యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడము మరియు ఇతరులకు ముక్తి-జీవన్ముక్తులకు దారిని చూపించడము. ఈ ధర్మానికి చెందినవారెవరైతే ఉంటారో వారు ఇతర ధర్మాల నుండి బయటకు వస్తారు. ఇలా మారలేనివారు ఎంతోమంది అనేక ధర్మాలలో ఉన్నారు. ఉదాహరణకు ఏంగ్లో క్రిస్టియన్లు నల్లగా ఉంటారు. వారి రూపమైతే మారదు కానీ ధర్మాన్ని మార్చుకుంటారు. వారి ముఖకవళికలు మారతాయని కాదు, వారు కేవలం ఆ ధర్మాన్ని స్వీకరిస్తారు. అలా కొందరు బౌద్ధ ధర్మాన్ని నమ్ముతారు, ఎందుకంటే దేవీ-దేవతా ధర్మమైతే కనుమరుగైపోయింది కదా. మేము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారము అని చెప్పుకోగలిగినవారు ఒక్కరు కూడా లేరు. దేవతల చిత్రాలు ఉపయోగపడుతూ ఉంటాయి. ఆత్మ అయితే అవినాశీ, అది ఎప్పుడూ మరణించదు. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. సత్యయుగాన్ని మృత్యులోకము అని అనరు. అది అమరలోకము. కేవలం శరీరము మారుతుంది. ఈ విషయాలు చాలా సూక్ష్మమైనవి, అర్థం చేసుకోవలసినవి. ఇవి హోల్ సేల్ విషయాలు కావు. ఉదాహరణకు వివాహము జరిగేటప్పుడు కొందరికి విస్తారముగా, కొందరికి హోల్ సేల్ గా ఇస్తారు. కొందరు అన్నీ చూపించి ఇస్తారు, కొందరు పెట్టెలో పెట్టి మూత వేసి ఇస్తారు. రకరకాలుగా ఉంటారు. మీకైతే వారసత్వము హోల్ సేల్ గా లభిస్తుంది, ఎందుకంటే మీరందరూ వధువులు. బాబా వరుడు. పిల్లలైన మిమ్మల్ని అలంకరించి విశ్వ రాజ్యాధికారాన్ని హోల్ సేల్ గా ఇస్తారు. విశ్వానికి యజమానులుగా మీరే అవుతారు.

ముఖ్యమైన విషయము స్మృతియే. జ్ఞానమైతే చాలా సహజమైనది. స్మృతి అంటే కేవలం భగవంతుడిని స్మృతి చేయడమే కదా అని అనిపిస్తుంది, కానీ ఈ స్మృతియే వెంటనే జారిపోతుంది. చాలావరకు - బాబా, మీ స్మృతిని మర్చిపోతున్నాము అని అంటూ ఉంటారు. మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు సదా స్మృతి అనే పదాన్ని ఉపయోగించండి. యోగము అనే పదము తప్పు. టీచర్ కు విద్యార్థి స్మృతి ఉంటుంది. మన తండ్రి సుప్రీమ్ సోల్ (పరమ ఆత్మ). ఆత్మయైన మీరు సుప్రీమ్ కారు. మీరు పతితులు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి. టీచరును, తండ్రిని, గురువును స్మృతి చేయడం జరుగుతుంది. గురువులు కూర్చుని శాస్త్రాలను వినిపిస్తారు, మంత్రము ఇస్తారు. బాబా ఇచ్చే మంత్రము ఒక్కటే - మన్మనాభవ. ఆ తరువాత ఏమవుతుంది? మధ్యాజీభవ. మీరు విష్ణుపురిలోకి వెళ్ళిపోతారు. మీరందరూ అయితే రాజు-రాణులుగా అవ్వరు. రాజు, రాణి మరియు ప్రజలు ఉంటారు. కావున ముఖ్యమైనది త్రిమూర్తి. శివబాబా తరువాత బ్రహ్మా, అతను మనుష్య సృష్టిని అనగా బ్రాహ్మణులను రచిస్తారు. అప్పుడు బ్రాహ్మణులను కూర్చుని చదివిస్తారు. ఇవి కొత్త విషయాలు కదా. బ్రాహ్మణ, బ్రాహ్మణీలైన మీరు సోదరీ-సోదరులు. వృద్ధులు కూడా, మేము సోదరీ-సోదరులము అని అంటారు. ఇవి లోలోపల అర్థం చేసుకోవాలి. అంతేకానీ ఊరికే అలా ఎవరితోనూ అనకూడదు. భగవంతుడు ప్రజాపిత బ్రహ్మా ద్వారా సృష్టిని రచించారు కావున సోదరీ-సోదరులు అయినట్లు కదా. అందరూ ఒక్క ప్రజాపిత బ్రహ్మాకు సంతానమే, ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. మమ్మల్ని చదివిస్తున్నవారు ఎవరు అని పిల్లలైన మీకైతే ఎంతో సంతోషము ఉండాలి. శివబాబా, త్రిమూర్తి శివుడు మనల్ని చదివిస్తున్నారు. బ్రహ్మాకు కూడా చాలా కొద్ది సమయమే పాత్ర ఉంది. విష్ణువుకు సత్యయుగ రాజధానిలో ఎనిమిది జన్మలు పాత్ర ఉంటుంది (ఎనిమిది తరాలు ఉంటాయి). బ్రహ్మాకు అయితే ఒకే జన్మ యొక్క పాత్ర ఉంటుంది. విష్ణువు పాత్ర పెద్దది. త్రిమూర్తి శివుడే ముఖ్యమైనవారు, ఆ తరువాత బ్రహ్మా పాత్ర. వారు పిల్లలైన మిమ్మల్ని విష్ణుపురికి యజమానులుగా తయారుచేస్తారు. బ్రహ్మా నుండి బ్రాహ్మణులుగా, మళ్ళీ ఆ తరువాత దేవతలుగా అవుతారు. కావున ఇతను మీకు అలౌకిక తండ్రి అవుతారు. ఈ తండ్రి కొద్ది సమయమే ఉంటారు, వీరిని ఈ సమయములో తండ్రిగా భావిస్తారు. ఆదిదేవ్, ఆదమ్ మరియు బీబీ, వీరు లేకుండా సృష్టిని ఎలా రచిస్తారు. ఆదిదేవ్ మరియు ఆదిదేవి ఉన్నారు కదా. బ్రహ్మా పాత్ర కూడా కేవలం ఈ సంగమ సమయములోనే ఉంటుంది. దేవతల పాత్ర అయితే ఎక్కువ సమయము ఉంటుంది. దేవతలు అని కూడా కేవలం సత్యయుగములోనే అంటారు. త్రేతాలో క్షత్రియులు అని అంటారు. ఇటువంటి చాలా గుహ్యాతి గుహ్యమైన పాయింట్లు లభిస్తాయి. అన్నింటినీ ఒకేసారి వర్ణించడం వీలు కాదు. వారు త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు. శివుడిని మాయం చేసేసారు. మనమేమో త్రిమూర్తి శివ అని అంటాము. ఈ చిత్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ప్రజలను బ్రహ్మా ద్వారా రచించడం జరుగుతుంది, ఆ తరువాత మీరు దేవతలుగా అవుతారు. వినాశన సమయములో ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. వినాశనమైతే జరగవలసిందే. కలియుగము తరువాత మళ్ళీ సత్యయుగము వస్తుంది. ఈ శరీరాలన్నీ అయితే వినాశనమవ్వవలసిందే. అన్నీ ప్రాక్టికల్ గా జరగాలి కదా. కేవలం కన్ను తెరిచినంతమాత్రాన అలా జరగదు కదా. ఎప్పుడైతే స్వర్గము మాయమవుతుందో, ఆ సమయములో కూడా భూకంపాలు మొదలైనవి వస్తాయి. మరి ఆ సమయములో కూడా శంకరుడు రెప్ప వేస్తాడా? ద్వారక లేక లంక నీటిలోకి వెళ్ళిపోయాయి అని అంటారు కదా.

ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను రాతిబుద్ధి కలవారిని పారసబుద్ధి కలవారిగా తయారుచేయడానికి వచ్చాను. ఓ పతిత-పావనా రండి, మీరు వచ్చి పావన ప్రపంచాన్ని తయారుచేయండి అని మనుష్యులు పిలుస్తారు. కానీ ఇప్పుడు ఉన్నది కలియుగమని, దీని తరువాత సత్యయుగము వస్తుందని వారు అర్థం చేసుకోరు. పిల్లలైన మీరు సంతోషములో నాట్యము చేయాలి. బ్యారిస్టర్ మొదలైనవారు పరీక్షలు పాస్ అయినప్పుడు లోలోపల ఆలోచిస్తూ ఉంటారు కదా - నేను డబ్బు సంపాదిస్తాను, ఆ తరువాత ఇల్లు కడతాను, ఇది చేస్తాను, అది చేస్తాను అని. మీరు ఇప్పుడు సత్యమైన సంపాదన చేసుకుంటున్నారు. స్వర్గములో మీకు అంతా కొత్త సరుకే లభిస్తుంది. సోమనాథ మందిరము ఎలా ఉండేదో ఆలోచించండి! అలా ఒక్క మందిరము మాత్రమే ఉండదు కదా. ఆ మందిరము 2,500 సంవత్సరాల క్రితము ఉండేది. దానిని నిర్మించేందుకు కొంత సమయమైతే పట్టి ఉంటుంది. కొన్నాళ్ళు పూజించిన తరువాతనే వారు దోచుకుని తీసుకువెళ్ళిపోయారు. నిర్మించిన వెంటనే వారు వచ్చి ఉండరు కదా. అలా ఎన్నో మందిరాలు ఉంటాయి. పూజించేందుకని కూర్చుని మందిరాలను నిర్మించారు. ఇప్పుడు మీకు తెలుసు - తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ మనము స్వర్ణిమయుగములోకి వెళ్ళిపోతాము, ఆత్మ పవిత్రముగా అయిపోతుంది, దాని కొరకు కృషి చేయవలసి ఉంటుంది. కృషి చేయకుండా పని నడవదు. క్షణములో జీవన్ముక్తి అని కూడా అంటూ ఉంటారు, కానీ అది ఊరికే అలా లభించదు కదా. పిల్లలుగా అయితే అది తప్పకుండా లభిస్తుందని అర్థం చేయించడం జరిగింది. మీరు ఇప్పుడు ముక్తిధామములోకి వెళ్ళేందుకు కృషి చేస్తున్నారు. తండ్రి స్మృతిలో ఉండవలసి ఉంటుంది. రోజురోజుకు తండ్రి పిల్లలైన మిమ్మల్ని రిఫైన్ బుద్ధి కలవారిగా తయారుచేస్తారు. తండ్రి అంటారు, నేను మీకు చాలా-చాలా గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. ఆత్మ కూడా బిందువు మరియు పరమాత్మ కూడా బిందువు అని ఇంతకుముందు ఇలా వినిపించలేదు కదా. ఈ విషయాలు ముందే ఎందుకు చెప్పలేదు అని అంటారు. డ్రామాలో లేదు. ముందే ఈ విషయాలను మీకు వినిపించినట్లయితే మీరు వీటిని అర్థం చేసుకోలేకపోయేవారు. మెల్లమెల్లగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇది రావణ రాజ్యము. రావణ రాజ్యములో అందరూ దేహాభిమానులుగా అయిపోతారు. సత్యయుగములో ఆత్మాభిమానులు ఉంటారు. వారికి తాము ఆత్మ అన్న విషయము తెలుసు. నా శరీరము పెద్దదైంది, ఇప్పుడు దీనిని వదిలి మళ్ళీ చిన్న శరీరాన్ని ధరించాలి అని భావిస్తారు. ఆత్మ శరీరము మొదట చిన్నగా ఉంటుంది, ఆ తరువాత పెద్దదిగా అవుతుంది. ఇక్కడైతే ఒక్కొక్కరికి ఒక్కో ఆయుష్షు ఉంటుంది. కొందరు అకాల మృత్యువును పొందుతారు. కొందరికి 125 సంవత్సరాల ఆయుష్షు కూడా ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీకు తండ్రి నుండి వారసత్వము తీసుకుంటున్నాము అన్న సంతోషము ఎంతగానే ఉండాలి. గాంధర్వ వివాహము చేసుకోవడమనేది సంతోషకరమైన విషయమేమీ కాదు, అది బలహీనత. నేను పవిత్రముగా ఉంటాను అని ఒకవేళ కుమారి అంటే ఆమెను ఎవ్వరూ కొట్టలేరు. జ్ఞానము తక్కువగా ఉన్నట్లయితే భయపడతారు. చిన్న కుమారినైనా ఒకవేళ ఎవరైనా కొడితే, రక్తము వస్తే, అప్పుడు పోలీసులకు రిపోర్ట్ చేస్తే దానికి కూడా శిక్ష విధిస్తారు. జంతువులను కూడా ఒకవేళ ఎవరైనా కొడితే, వారిపై కేస్ వేస్తారు, వారిని దండిస్తారు. పిల్లలైన మిమ్మల్ని కూడా ఎవ్వరూ కొట్టలేరు. కుమారులను కూడా కొట్టలేరు. వారు తమ సంపాదనను వారు చేసుకోగలరు. తమ శరీర నిర్వహణ చేసుకోగలరు. కడుపు ఎక్కువేమీ తినదు. ఒక మనిషి కడుపు 4-5 రూపాయలతో నిండితే మరొక మనిషి కడుపు 400-500 రూపాయలతో నిండుతుంది. ధనము ఎక్కువగా ఉంటే అత్యాశ పెరిగిపోతుంది. పేదవారి వద్ద ధనమే ఉండదు కావున అత్యాశే ఉండదు. వారు తమ వద్ద ఉన్న ఎండు రొట్టెతోనే సంతోషపడతారు. పిల్లలు అన్నపానాదుల గొడవలోకి కూడా ఎక్కువగా వెళ్ళకూడదు, తినాలి అనే అభిరుచి ఉండకూడదు.

అక్కడ మనకు లభించనిదంటూ ఏదీ ఉండదని మీకు తెలుసు! అనంతమైన రాజ్యము, అనంతమైన సుఖము లభిస్తుంది. అక్కడ రోగాలేవీ ఉండవు. ఆరోగ్యము, సంపద, సుఖము అన్నీ ఉంటాయి. అక్కడ వృద్ధాప్యము కూడా చాలా బాగుంటుంది, సంతోషము ఉంటుంది. ఏ విధమైన కష్టమూ ఉండదు. ప్రజలు కూడా అదే విధముగా ఉంటారు. అలాగని ప్రజలుగా అయినా సరే పర్వాలేదులే అని అనుకోకూడదు. అలా అనుకుంటే ఇక్కడి ఆటవికుల వలె ఉండడముతో సమానము. సూర్యవంశీ లక్ష్మీ-నారాయణుల వలె అవ్వాలంటే మరి అంతటి పురుషార్థము కూడా చేయాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బ్రహ్మా యొక్క కొత్త రచన అయిన మనము పరస్పరము సోదరీ-సోదరులము అని లోలోపల ఈ విధముగా భావించాలే కానీ ఇలా ఎవ్వరితోనూ అనవలసిన అవసరము లేదు. మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు అని సదా ఇదే సంతోషములో ఉండాలి.

2. అన్నపానాదుల గొడవలోకి ఎక్కువగా వెళ్ళకూడదు. అత్యాశను వదిలి అనంతమైన రాజ్య సుఖాలను గుర్తు చేసుకోవాలి.

వరదానము:-
అనేక రకాల ప్రవృత్తుల నుండి నివృత్తులయ్యే నష్టోమోహా స్మృతీ స్వరూప భవ

స్వయం యొక్క ప్రవృత్తి, దైవీ పరివారము యొక్క ప్రవృత్తి, సేవ యొక్క ప్రవృత్తి, హద్దులోని ప్రాప్తుల ప్రవృత్తి, వీటన్నింటి నుండి నష్టోమోహులుగా అనగా అతీతముగా అయ్యేందుకు బాప్ దాదా యొక్క స్నేహ రూపాన్ని ఎదురుగా ఉంచుకుంటూ స్మృతి స్వరూపులుగా అవ్వండి. స్మృతి స్వరూపులుగా అవ్వడము ద్వారా నష్టోమోహులుగా స్వతహాగానే అయిపోతారు. ప్రవృత్తి నుండి నివృత్తులుగా అవ్వడము అనగా ‘నేను’ అన్న భావనను సమాప్తము చేసి నష్టోమోహులుగా అవ్వడము. ఈ విధముగా నష్టోమోహులుగా అయ్యే పిల్లలు బహుకాలపు పురుషార్థము ద్వారా బహుకాలపు ప్రారబ్ధపు ప్రాప్తికి అధికారులుగా అవుతారు.

స్లోగన్:-
కమల పుష్ప సమానముగా అతీతముగా ఉన్నట్లయితే ప్రభు ప్రేమ లభిస్తూ ఉంటుంది.

అవ్యక్త ప్రేరణలు - సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి

ఎవరైతే నంబర్ వన్దీపపు పురుగులో వారు స్వయానికి సంబంధించిన ఏ విషయముపైనా ఆధారపడరు - ఈ దేహ భానము, రాత్రి-పగలు, ఆకలి-దప్పికలు, సుఖ-సాధనాలు, విశ్రాంతి, ఏ విషయముపైనా ఆధారపడరు. వారు అన్ని రకాల దేహ స్మృతుల నుండి దూరముగా ఉంటారు అనగా నిరంతరము దీపముపై ఉన్న ప్రేమలో లవలీనులై ఉంటారు. ఎలా అయితే దీపము జ్యోతి స్వరూపమో, లైట్మైట్రూపమో, అలా దీపము సమానముగా స్వయము కూడా లైట్మైట్రూపముగా అవుతారు.