20-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మిమ్మల్ని ఈ పాపపు ప్రపంచము
నుండి బయటకు తీసి ప్రశాంతమైన ప్రపంచములోకి తీసుకువెళ్ళడానికి వచ్చారు, తండ్రి ద్వారా
మీకు సుఖము-శాంతి అనే రెండు కానుకలు లభిస్తాయి’’
ప్రశ్న:-
మొత్తం
ప్రపంచములో సత్యాతి-సత్యమైన నన్స్ మీరు, సత్యమైన నన్స్ అని ఎవరిని అంటారు?
జవాబు:-
సత్యమైన నన్స్
అనగా ఎవరి బుద్ధిలోనైతే ఒక్కరి స్మృతి ఉంటుందో వారు, అనగా నన్ బట్ వన్ (ఒక్కరు తప్ప
ఇంకెవ్వరూ లేరు). ఆ నన్స్ తమను తాము నన్స్ అని పిలుచుకుంటారు కానీ వారి బుద్ధిలో
ఒక్క క్రైస్టు యొక్క స్మృతి మాత్రమే ఉండదు, క్రైస్టును కూడా భగవంతుని బిడ్డ అని
అంటారు. కావున వారి బుద్ధిలో ఇద్దరు ఉన్నారు మరియు మీ బుద్ధిలో ఒక్క తండ్రి ఉన్నారు,
అందుకే మీరు సత్యాతి-సత్యమైన నన్స్. పవిత్రముగా ఉండాలి అని మీకు తండ్రి ఆజ్ఞ
లభించింది.
పాట:-
ఈ పాపపు
ప్రపంచము నుండి...
ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఎవరు విన్నారు? ఆత్మలు. ఆత్మను
పరమాత్మ అని అనలేరు. మనిషిని భగవంతుడని అనలేరు. అచ్ఛా, ఇప్పుడు మీరు బ్రాహ్మణులు.
ప్రస్తుతం మిమ్మల్ని దేవతలు అని అనడము జరగదు. బ్రహ్మాను కూడా దేవత అని అనలేరు.
బ్రహ్మా దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః... అని అంటారు కానీ బ్రహ్మాకు మరియు
విష్ణువుకు మధ్యన చాలా తేడా ఉంది. విష్ణువును దేవత అని అంటారు, బ్రహ్మాను దేవత అని
అనలేరు ఎందుకంటే వారు బ్రాహ్మణుల తండ్రి. బ్రాహ్మణులను దేవతలు అని అనలేరు. ఇప్పుడు
ఈ విషయాలను మనుష్యులు మనుష్యులకు అర్థం చేయించలేరు, భగవంతుడే అర్థం చేయిస్తారు.
మనుష్యులైతే అంధవిశ్వాసములో ఏది తోస్తే అది అనేస్తారు. ఆత్మిక తండ్రి పిల్లలైన
మనల్ని చదివిస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. స్వయాన్ని ఆత్మగా
భావించాలి. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని తీసుకుంటాను. ఆత్మనైన నేను 84 జన్మలు
తీసుకున్నాను. ఎలాంటి కర్మలు చేస్తూ ఉంటారో, అలాంటి శరీరము లభిస్తుంది. శరీరము నుండి
ఆత్మ వేరు అయితే, ఇక శరీరము పట్ల ప్రేమ ఉండదు, ఆత్మ పట్ల ప్రేమ ఉంటుంది. ఎప్పుడైతే
ఆత్మ శరీరములో ఉంటుందో, అప్పుడే ఆత్మ పట్ల కూడా ప్రేమ ఉంటుంది. మనుష్యులు పితృలను
పిలుస్తారు, వారి శరీరమైతే సమాప్తమైపోయింది, అయినా కూడా వారి ఆత్మను స్మృతి చేస్తారు,
అందుకే బ్రాహ్మణుడిలోకి పిలుస్తారు. ఫలానావారి ఆత్మ, మీరు రండి, వచ్చి ఈ భోజనాన్ని
స్వీకరించండి అని అంటారు. అనగా ఆత్మ పట్ల మోహముంటుంది. కానీ అంతకుముందు శరీరము పట్ల
మోహము ఉండేది కావున ఆ శరీరము గుర్తుకువచ్చేది. వారు - మేము ఆత్మను పిలుస్తున్నామని
భావించరు. ఆత్మయే అంతా చేస్తుంది. ఆత్మలో మంచి మరియు చెడు సంస్కారాలు ఉంటాయి.
మొట్టమొదట దేహాభిమానము వస్తుంది, దాని తర్వాత మిగిలిన వికారాలు వస్తాయి. అన్నింటినీ
కలిపి వికారులు అని అంటారు. ఎవరిలోనైతే ఈ వికారాలు లేవో, వారిని నిర్వికారులని
అంటారు. తప్పకుండా భారత్ లో దేవీ-దేవతలు ఉన్నప్పుడు, వారిలో దైవీ గుణాలు ఉండేవని
మీకు అర్థమవుతుంది. ఈ లక్ష్మీ-నారాయణులది దేవీ-దేవతా ధర్మము. ఎలాగైతే క్రిస్టియన్
ధర్మములో స్త్రీలు మరియు పురుషులు అందరూ క్రిస్టియన్లో, అలా వీరిని కూడా
దేవీ-దేవతలని అంటారు. అక్కడ రాజు-రాణి, ప్రజలు అందరూ దేవీ-దేవతా ధర్మానికి
చెందినవారు. ఇది సుఖమిచ్చే చాలా ఉన్నతమైన ధర్మము. పిల్లలు పాటను కూడా విన్నారు.
ఆత్మ ఈ విధముగా అంటుంది - బాబా, నన్ను ప్రశాంతత మరియు శాంతి ఉండే చోటుకు
తీసుకువెళ్ళండి. అవి సుఖధామము మరియు శాంతిధామము. ఇక్కడ చాలా అశాంతిగా ఉన్నారు.
సత్యయుగములో అశాంతి ఉండదు. బాబా తప్ప ఇంకెవ్వరూ ప్రశాంతమైన ప్రపంచములోకి
తీసుకువెళ్ళలేరని ఆత్మకు తెలుసు. తండ్రి అంటారు - ముక్తి మరియు జీవన్ముక్తి అనే ఈ
రెండు కానుకలను నేను కల్ప-కల్పము తీసుకువస్తాను. కానీ మీరు మర్చిపోతారు, డ్రామాలో
మర్చిపోయేదే ఉంది. అందరూ మర్చిపోయినప్పుడే నేను వస్తాను. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా
అయ్యారు, మేము 84 జన్మలు తీసుకున్నామని మీకు నిశ్చయముంది. ఎవరైతే పూర్తి జ్ఞానాన్ని
తీసుకోరో, వారు కొత్త ప్రపంచములో కూడా ప్రారంభములో రారు. త్రేతాలో లేదా త్రేతా
అంతిమములో వస్తారు. అంతా పురుషార్థముపై ఆధారపడి ఉంటుంది. సత్యయుగములో సుఖముండేది, ఈ
లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. అచ్ఛా, దాని కన్నా ముందు జన్మలో వారు ఎవరు, ఇది
ఎవరికీ తెలియదు. వారు (లక్ష్మీ-నారాయణులు) ముందు జన్మలో బ్రాహ్మణులుగా ఉండేవారు.
అంతకుముందు శూద్రులుగా ఉండేవారు. వర్ణాల గురించి మీరు మంచి రీతిలో అర్థం చేయించగలరు.
మనము 21 జన్మలకు ప్రశాంతతను పొందుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. బాబా మనకు
ఆ మార్గాన్ని తెలియజేస్తున్నారు. మనము ఇప్పుడు పతితముగా ఉన్నాము, అందుకే అశాంతిగా,
దుఃఖితులుగా ఉన్నాము. ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో, అక్కడ సుఖ-శాంతులు ఉన్నట్లు
చెప్పవచ్చు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. తప్పకుండా
సత్యయుగములో భారత్ ఎంతో సుఖముగా ఉండేదని, దుఃఖము లేక అశాంతి అన్న మాటే ఉండేది కాదని
మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు స్వర్గములోకి వెళ్ళేందుకు పురుషార్థము
చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారిగా అయ్యారు, వారు
ఆసురీ సాంప్రదాయానికి చెందినవారిగా ఉన్నారు. పాపాత్ములు అని అంటారు కదా. ఆత్మలు
అనేకమంది ఉన్నారు, పరమాత్మ ఒక్కరే. అందరూ సోదరులే, అందరూ పరమాత్మ అవ్వలేరు. ఇంత
చిన్నని విషయము కూడా మనుష్యుల బుద్ధిలో లేదు. బాబా అర్థం చేయించారు - ఈ మొత్తం
ప్రపంచమంతా పెద్ద అనంతమైన ద్వీపము. అక్కడ చిన్న-చిన్న ద్వీపాలు కూడా ఉంటాయి. ఈ
అనంతమైన ద్వీపముపై రావణ రాజ్యము ఉంది. ఈ విషయాలను మనుష్యులు అర్థం చేసుకోరు. వారైతే
కేవలం కథలను వినిపిస్తూ ఉంటారు. కథలను జ్ఞానమని అనరు. వాటి ద్వారా మనుష్యులు
సద్గతిని పొందలేరు. జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. జ్ఞానమిచ్చేవారు ఒక్క
తండ్రియే, ఇంకెవ్వరూ కాదు. భక్తులను భగవంతుడే వచ్చి రక్షిస్తారు. మనుష్యులు
మనుష్యులను రక్షించలేరు. శివబాబా పిల్లలందరికీ వారసత్వాన్ని ఇస్తారు. వారు తండ్రి
కూడా, శిక్షకుడు కూడా, సద్గురువు కూడా. వారు వకీలు లేక బ్యారిస్టరు కూడా, ఎందుకంటే
వారు యమదూతల శిక్షల నుండి విముక్తులుగా చేసేవారు. సత్యయుగములో ఎవరూ జైలుకు వెళ్ళరు.
తండ్రి అందరినీ జైలు నుండి విడిపిస్తారు. పిల్లల సర్వ శ్రేష్ఠ మనోకామనలన్నీ
పూర్తవుతాయి. రావణుడి ద్వారా అశుద్ధ కామనలు పూర్తవుతాయి. తండ్రి ద్వారా శుద్ధ కామనలు
పూర్తవుతాయి. శుద్ధ కామనలు పూర్తి అవ్వడముతో మీరు సదా సుఖమయముగా అవుతారు. పతితముగా,
వికారీగా అవ్వడము అనేది అశుద్ధ కామన. పావనముగా ఉండేవారిని బ్రహ్మచారులని అంటారు.
మీరు కూడా పవిత్రముగా ఉండాలి. పవిత్రముగా అయి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి.
పతితుల నుండి పావనులుగా ఒక్క తండ్రి మాత్రమే తయారుచేస్తారు. సాధు-సత్పురుషులు
మొదలైనవారైతే వికారాలతో జన్మిస్తారు, దేవతల విషయములో ఇలా అనరు. అక్కడ అసలు వికారాలు
ఉండనే ఉండవు. అది ఉన్నదే పావన ప్రపంచము. లక్ష్మీ-నారాయణులు సంపూర్ణ నిర్వికారులుగా
ఉండేవారు, భారత్ పవిత్రముగా ఉండేది. ఈ విషయాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు.
సత్యయుగములో పవిత్రత ఉన్నప్పుడు శాంతి-సంపదలు ఉండేవి, అందరూ సుఖముగా ఉండేవారు, రావణ
రాజ్యము మొదలైనప్పటి నుండి పడిపోతూ వచ్చారు. ఇప్పుడైతే దేనికి పనికిరాకుండా
అయిపోయారు. పూర్తిగా గవ్వ సమానముగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా వజ్ర
సమానముగా అవుతారు. భారత్ సత్యయుగముగా ఉన్నప్పుడు వజ్ర సమానముగా ఉండేది. ఇప్పుడైతే
గవ్వ సమానముగా కూడా లేదు. తమ ధర్మము గురించే ఎవరికీ తెలియడము లేదు. పాపాలు చేస్తూ
ఉంటారు. అక్కడైతే పాపము అన్న మాటే ఉండదు. మీరు దేవీ-దేవతా ధర్మములోని
ప్రసిద్ధమైనవారు, దేవతల చిత్రాలు చాలా ఉన్నాయి. వేరే ధర్మాలలో చూసినట్లయితే ఒకే
చిత్రము ఉంటుంది, క్రిస్టియన్ల వద్ద క్రైస్టు చిత్రము ఒక్కటే ఉంటుంది. బౌద్ధుల వద్ద
బుద్ధుని చిత్రము ఒక్కటే ఉంటుంది. క్రిస్టియన్లు క్రైస్టునే స్మృతి చేస్తారు, వారిని
నన్స్ అని అంటారు. నన్స్ అనగా - ఒక్క క్రైస్టు తప్ప ఇంకెవ్వరూ లేరు అని భావించేవారు,
అందుకే నన్ బట్ క్రైస్ట్ (క్రైస్టు తప్ప ఇంకెవ్వరూ లేరు) అని అంటారు, వారు
బ్రహ్మచారులుగా ఉంటారు. మీరు కూడా నన్స్. మీరు మీ గృహస్థ వ్యవహారములో ఉంటూ నన్స్ గా
అవుతారు. ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు. నన్ బట్ వన్, ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ
లేరు. వారి బుద్ధిలో ఎంతైనా ఇద్దరు ఉంటారు. క్రైస్టును భగవంతుని బిడ్డ అని
అనుకుంటారు. కానీ వారికి భగవంతుని గురించిన జ్ఞానము లేదు. పిల్లలైన మీకు జ్ఞానముంది.
మొత్తం ప్రపంచములో పరమాత్ముని గురించి జ్ఞానము ఉన్నవారు ఇంకెవ్వరూ లేరు. పరమాత్మ
ఎక్కడ ఉంటారు, ఎప్పుడు వస్తారు, వారి పాత్ర ఏమిటి, ఇది ఎవరికీ తెలియదు. భగవంతుడిని
జానీ జాననహార్ (అన్నీ తెలిసినవారు) అని అంటారు. వారికి మా మనసులోని విషయాలు తెలుసు
అని అనుకుంటారు. తండ్రి అంటారు - నాకు తెలియదు, ప్రతి ఒక్కరి మనసును కూర్చుని
చదవాల్సిన అవసరము నాకేముంది, నేను వచ్చింది పతితులను పావనముగా చేయడానికే. ఒకవేళ
ఎవరైనా పవిత్రముగా ఉండకపోతే, అబద్ధము చెప్తే, వారు తమకు తామే నష్టము కలిగించుకుంటారు.
దేవతల సభలో అసురులు వెళ్ళి కూర్చునేవారని, అక్కడ అమృతాన్ని పంచేవారని అంటూ ఉంటారు.
ఎవరైనా వికారాలలోకి వెళ్ళి, మళ్ళీ ఇక్కడకు వచ్చి దాక్కుని కూర్చున్నారంటే వారు
అసురులు అయినట్లే కదా. తమకు తామే తమ పదవిని భ్రష్టము చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ
పురుషార్థము చేయాలి లేకపోతే తమను తామే సర్వనాశనము చేసుకుంటారు. చాలామంది ఎలా
ఉన్నారంటే, వారు దాక్కుని వచ్చి కూర్చుండిపోతారు. మేము వికారాలలోకి వెళ్ళడము లేదని
అంటారు, కానీ వికారాలలోకి వెళ్తూ ఉంటారు. ఇది తమను తాము మోసం చేసుకున్నట్లే. తమను
తాము సర్వనాశనము చేసుకుంటారు. పరమపిత పరమాత్ముని కుడి భుజమైన ధర్మరాజు ఎదురుగా
అబద్ధము చెప్పినట్లయితే, తమంతట తామే శిక్షకు పాత్రులుగా అవుతారు. చాలా సెంటర్లలో
కూడా ఇటువంటివారు ఉంటారు. బాబా మొదటిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు, అక్కడకు రోజూ ఒక
వ్యక్తి వచ్చేవారు, అతను వికారాలలోకి వెళ్తూ ఉండేవారు. పవిత్రముగా ఉండనప్పుడు ఎందుకు
వస్తున్నారు అని అతడిని అడిగితే అతను ఇలా అనేవారు - నేను రాకపోతే నిర్వికారిగా ఎలా
అవుతాను, పవిత్రత బాగా అనిపిస్తుంది కానీ ఉండలేకపోతున్నాను, చివరికైతే మారతాను,
ఒకవేళ రాకపోతే నావ మునిగిపోతుంది, ఇంకే మార్గము లేదు కదా, అందుకే నేను ఇక్కడికి
రావాల్సి వస్తుంది.
బాబా అర్థం చేయిస్తున్నారు - మీరు వాయుమండలాన్ని పాడు చేస్తారు, ఎప్పటివరకని ఇలా
వస్తూ ఉంటారు. పావనముగా అయ్యేవారికి పతితుల పట్ల ద్వేషము కలిగినట్లు అవుతుంది. బాబా,
వీరి చేతి వంట కూడా బాగా అనిపించదని అంటారు. బాబా యుక్తిని కూడా తెలియజేశారు,
ఆహార-పానీయాలకు సంబంధించి గొడవలు జరుగుతాయి, అలాగని ఉద్యోగము వదిలేయాలని కాదు,
యుక్తిగా నడిపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా అర్థం చేయిస్తే వారు - పవిత్రముగా
ఎలా ఉంటాము, ఇలాంటివి ఎప్పుడూ వినలేదు, సన్యాసులు కూడా ఉండలేరు, ఇళ్ళు-వాకిళ్ళను
వదిలి వెళ్ళినప్పుడే పవిత్రముగా ఉండగలము అని అంటూ డిస్టర్బ్ అవుతారు. కానీ ఎవరికీ
తెలియని విషయమేమిటంటే, ఇక్కడ పతిత-పావనుడైన పరమపిత పరమాత్మ చదివిస్తున్నారు. వాళ్ళు
నమ్మరు, అందుకే వ్యతిరేకిస్తారు. శివబాబా బ్రహ్మా తనువులోకి వస్తారు అనే మాటను ఏ
శాస్త్రములోనైనా చూపించండి అని అంటారు. నేను సాధారణ వృద్ధ తనువులోకి వస్తానని,
ఎవరిలోకైతే వస్తానో, వారికి తమ జన్మల గురించి తెలియదని గీతలో వ్రాయబడి ఉంది. ఇలా
వ్రాయబడి ఉంది కావున పరమాత్మ మనుష్య శరీరములోకి ఎలా వస్తారని మీరు ఎలా ప్రశ్నిస్తారు.
వారు పతిత తనువులోకే వచ్చి మార్గాన్ని తెలియజేస్తారు కదా. ఇంతకుముందు కూడా వచ్చారు
మరియు నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్పారు. వారే పరంధామములో ఉంటారు మరియు
నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్తారు. అలా నన్నొక్కరినే స్మృతి చేయండి అని
చెప్పేందుకు శ్రీకృష్ణుని శరీరము మూలవతనములోనైతే ఉండదు. ఒక్క పరమపిత పరమాత్మయే
సాధారణ తనువులోకి ప్రవేశించి పిల్లలైన మీకు చెప్తున్నారు - నన్నొక్కరినే స్మృతి
చేసినట్లయితే ఈ యోగాగ్ని ద్వారా మీ పాపాలు కట్ అయిపోతాయి, అందుకే నన్ను
పతిత-పావనుడని అంటారు. తప్పకుండా ఆత్మల విషయములో పతిత-పావనుడిగా ఉంటారు కదా.
పతితముగా కూడా ఆత్మయే అవుతుంది.
తండ్రి అంటారు - పవిత్ర ఆత్మలైన మీరు 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు. ఇప్పుడు
కళాహీనులుగా, పూర్తిగా పతితులుగా అయిపోయారు. నేను కల్ప-కల్పము వచ్చి మీకు అర్థం
చేయిస్తాను. మీరు కామ చితిపై కూర్చుని పతితముగా అయిపోతారు, ఇప్పుడు జ్ఞాన చితిపై
కూర్చోబెట్టి మిమ్మల్ని పావనముగా చేస్తాను. భారత్ లో పవిత్రమైన ప్రవృత్తి
మార్గముండేది, ఇప్పుడు అపవిత్రమైన ప్రవృత్తి మార్గము ఉంది. ఎవ్వరికీ ప్రశాంతత లేదు.
ఇప్పుడు తండ్రి అంటారు, ఇద్దరూ జ్ఞాన చితిపై కూర్చోండి. ప్రతి ఆత్మకు తమ-తమ కర్మల
అనుసారముగా శరీరము లభిస్తుంది. అలాగని మరుసటి జన్మలో కూడా వారే పతి-పత్నిగా అవుతారని
కాదు. అలా కాదు. అంత రేస్ చేయలేరు. ఇదైతే చదువుకు సంబంధించిన విషయము కదా. అజ్ఞాన
కాలములో అలా జరగచ్చు, పరస్పరములో చాలా ప్రేమ ఉన్నట్లయితే వారి మనోకామనలు పూర్తి
అవ్వవచ్చు, అది పతిత వికారీ మార్గము. పతి చనిపోతే అతని చితిపై పత్ని కూర్చుంటుంది.
మరుసటి జన్మలో కూడా వెళ్ళి అతడిని కలుసుకుంటుంది. కానీ మరుసటి జన్మలో వారికి ఆ
విషయము తెలియదు. మీరు కూడా బాబాతో పాటు జ్ఞాన చితిపై కూర్చుంటారు. ఈ ఛీ-ఛీ శరీరాలను
వదిలి వెళ్ళిపోతారు. ఇది మీకు ఇప్పుడే తెలుసు. మేము గత జన్మలో ఇలా జంటగా ఉన్నామని
వారికి తెలియదు. తర్వాత మీకు కూడా ఈ విషయాలు అక్కడ గుర్తుండవు. ఇప్పుడు మీ బుద్ధిలో
లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది. మమ్మా-బాబాలు లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. విష్ణువు
దేవత. ప్రజాపిత బ్రహ్మాను దేవత అని అనలేరు. బ్రహ్మా నుండి దేవతగా అవుతారు. బ్రహ్మా
నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా ఎలా అవుతారు - ఇది ఇప్పుడు మీరు అర్థం
చేసుకున్నారు. ప్రశాంతత కేవలం స్వర్గములోనే ఉంటుందని ఇప్పుడు మీకు తెలుసు. ఎవరైనా
మరణిస్తే, స్వర్గానికి వెళ్ళారని అనగా ప్రశాంతతలోకి వెళ్ళారని అంటారు. పతితులు
అశాంతిగా ఉంటారు. అయినా కూడా బాబా అంటారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని
స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మిగిలినవి విస్తారముగా అర్థం
చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి నాలెడ్జ్ ఫుల్ కనుక మిమ్మల్ని కూడా వారి వలె నాలెడ్జ్
ఫుల్ గా తయారుచేస్తారు. తండ్రి స్మృతితో మీరు సతోప్రధానముగా అవుతారు, ఇది ఆత్మల రేస్.
ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో, వారు త్వరగా తయారవుతారు. ఇది యోగము మరియు చదువు
యొక్క రేస్. స్కూలులో కూడా రేస్ జరుగుతుంది కదా. చాలామంది విద్యార్థులు ఉంటారు.
వారిలో ఎవరైతే నంబర్ వన్ అవుతారో, వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. ఒకే చదువు లక్షల,
కోట్ల ఆత్మల కోసం ఉన్నప్పుడు, మరి అన్ని స్కూళ్ళు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఈ
చదువును చదువుకోవాలి. అందరికీ మార్గాన్ని తెలియజేయండి, అంధులకు చేతికర్రగా అవ్వండి.
ఇంటింటికీ సందేశాన్ని అందించాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇప్పుడు అశుద్ధ కామనలను త్యజించి శుద్ధ కామనలు పెట్టుకోవాలి. అన్నింటికంటే
శుద్ధమైన కామన ఏమిటంటే - పవిత్రముగా తయారై పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి...
ఏ పొరపాటును దాచిపెట్టి స్వయాన్ని మోసం చేసుకోకూడదు. ధర్మరాజు అయిన తండ్రితో సదా
సత్యముగా ఉండాలి.
2. జ్ఞాన చితిపై కూర్చుని ఈ చదువులో రేస్ చేసి భవిష్య కొత్త ప్రపంచములో ఉన్నత
పదవిని పొందాలి. యోగాగ్ని ద్వారా వికర్మల ఖాతాను భస్మము చేసుకోవాలి.
వరదానము:-
బుద్ధి యొక్క ప్రీతిని ఒక్క ప్రియతమునితో జోడించి సదా
సమ్ముఖము యొక్క అనుభూతిని చేసే విజయీ రత్న భవ
ప్రీతి బుద్ధి అనగా బుద్ధి యొక్క ప్రేమ ఒక్క
ప్రియతమునితోనే జోడించబడి ఉండాలి. ఎవరికైతే ఒక్కరితో ప్రీతి ఉంటుందో, వారికి వేరే ఏ
వ్యక్తితో కానీ, వైభవాలతో కానీ ప్రీతి జోడించబడదు. వారు సదా బాప్ దాదాను తమ
సమ్ముఖముగా అనుభవం చేస్తారు. వారికి మనసులో కూడా శ్రీమతానికి విరుద్ధమైన వ్యర్థ
సంకల్పాలు కానీ, వికల్పాలు కానీ రాలేవు. వారి నోటి నుండి మరియు హృదయము నుండి ఈ మాటలే
వెలువడుతాయి - మీతోనే తింటాను, మీతోనే కూర్చుంటాను... మీతోనే సర్వ సంబంధాలు
నిర్వర్తిస్తాను... ఈ విధముగా సదా ప్రీతి బుద్ధి కలిగి ఉండేవారే విజయీ రత్నాలుగా
అవుతారు.
స్లోగన్:-
కావాలి-కావాలి
అనే సంకల్పము రావడము కూడా రాయల్ రూపములో యాచించడమే.
అవ్యక్త ప్రేరణలు -
అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా)
అవ్వండి
సంగమయుగములో బాప్ దాదా
పిల్లలందరికీ ఇచ్చిన మొదటి వ్రతము ఏమిటంటే - ‘‘సంపూర్ణ పవిత్ర భవ’’. ఈ పవిత్రతా
వ్రతము కేవలం బ్రహ్మచర్య వ్రతమే కాదు, కానీ బ్రహ్మాబాబా సమానముగా ప్రతి మాటలోనూ
పవిత్రతకు చెందిన వైబ్రేషన్లు ఇమిడి ఉండాలి, ప్రతి సంకల్పములోనూ పవిత్రత యొక్క
మహత్వము ఉండాలి, ప్రతి కర్మలోనూ కర్మయోగీ జీవితము యొక్క అనుభవము ఉండాలి - దీనినే
బ్రహ్మచారి మరియు బ్రహ్మాచారి అని అంటారు.