21-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


“మధురమైన పిల్లలూ - పురుషార్థము చేసి దైవీ గుణాలను బాగా ధారణ చేయాలి, ఎవరికీ దుఃఖమునివ్వకూడదు, మీలో ఎటువంటి ఆసురీ నడవడిక ఉండకూడదు”

ప్రశ్న:-
ఏ ఆసురీ గుణాలు మీ అలంకరణను పాడు చేస్తాయి?

జవాబు:-
పరస్పరం కొట్లాడుకోవడం, గొడవపడడం, అలగడం, సెంటర్లో విఘ్నాలు కలిగించడం, దుఃఖమునివ్వడం... ఇవి ఆసురీ గుణాలు, ఇవి మీ అలంకరణను పాడు చేస్తాయి. ఏ పిల్లలైతే తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత కూడా ఈ ఆసురీ గుణాలను త్యాగము చేయరో, తప్పుడు కర్మలు చేస్తూ ఉంటారో, వారికి చాలా నష్టము వాటిల్లుతుంది. లెక్క లెక్కే. తండ్రితోపాటు ధర్మరాజు కూడా ఉన్నారు.

పాట:-
భోళానాథుని కన్నా అతీతమైనవారు...

ఓంశాంతి
ఉన్నతోన్నతమైనవారు భగవంతుడేనని ఆత్మిక పిల్లలు తెలుసుకున్నారు. మనుష్యులు గానము చేస్తారు మరియు మీరు దివ్యదృష్టితో చూస్తారు. మనల్ని వారు చదివిస్తున్నారని మీరు బుద్ధి ద్వారా కూడా తెలుసుకుంటారు. ఆత్మయే చదువుతుంది, శరీరము ద్వారా చదువుతుంది. అన్నీ ఆత్మయే చేస్తుంది, శరీరము ద్వారా చేస్తుంది. శరీరము వినాశీ అయినది, దానిని ఆత్మ ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది. ఆత్మలోనే మొత్తం పాత్ర అంతా నిశ్చితమై ఉంది. 84 జన్మలు కూడా ఆత్మలోనే నిశ్చితమై ఉన్నాయి. మొట్టమొదట అయితే స్వయాన్ని ఆత్మగా భావించాలి. తండ్రి సర్వశక్తివంతుడు. వారి నుండి పిల్లలైన మీకు శక్తి లభిస్తుంది. యోగము ద్వారా శక్తి ఎక్కువగా లభిస్తుంది, తద్వారా మీరు పావనముగా అవుతారు. విశ్వముపై రాజ్యము చేసే శక్తిని తండ్రి మీకు ఇస్తారు. ఇంతటి మహాశక్తిని వారు ఇస్తారు. ఆ విజ్ఞాన గర్వితులు మొదలైనవారు ఇవన్నీ వినాశనము కొరకే తయారుచేస్తారు. వారి బుద్ధి వినాశనము కొరకు ఉంది, మీ బుద్ధి అవినాశీ పదవిని పొందేందుకు ఉంది. మీకు ఎంతో శక్తి లభిస్తుంది, దాని ద్వారా మీరు విశ్వముపై రాజ్యము పొందుతారు. అక్కడ ప్రజలపై ప్రజల రాజ్యము ఉండదు. అక్కడ రాజు, రాణుల రాజ్యమే ఉంటుంది. ఉన్నతోన్నతుడు భగవంతుడు. స్మృతి కూడా వారినే చేస్తారు. లక్ష్మీ-నారాయణులకు కేవలం మందిరాలను తయారుచేసి పూజిస్తారు. అయినా కానీ ఉన్నతోన్నతుడు భగవంతుడని గానం చేయడం జరుగుతుంది. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఉన్నతోన్నతమైన విశ్వ రాజ్యాధికారము అనంతమైన తండ్రి ద్వారా లభిస్తుంది. మీకు ఎంతటి ఉన్నత పదవి లభిస్తుంది. కావున పిల్లలకు ఎంతటి సంతోషము ఉండాలి. ఎవరి నుండైనా ఏదైనా లభిస్తే వారిని తలచుకోవడం జరుగుతుంది కదా. స్త్రీకి తన పతి పట్ల ఎంత ప్రేమ ఉంటుంది, పతి కోసం ఎంతగా తన ప్రాణాలను ఇస్తుంది. పతి చనిపోతే అయ్యో దేవుడా అని మొరపెట్టుకుంటుంది. వీరైతే పతులకే పతి. వీరు ఆ ఉన్నతోన్నతమైన పదవిని ప్రాప్తింపజేసేందుకు మిమ్మల్ని ఎంతగా అలంకరిస్తున్నారు. కావున పిల్లలైన మీకు ఎంతటి నషా ఉండాలి. దైవీ గుణాలను కూడా మీరు ఇక్కడే ధారణ చేయాలి. చాలామందిలో ఇప్పటివరకు ఇంకా ఆసురీ అవగుణాలు ఉన్నాయి, కొట్లాడుకోవడం, గొడవపడడం, అలగడం, సెంటర్లో విఘ్నాలు కలిగించడం... బాబాకు తెలుసు, ఎన్నో రిపోర్టులు వస్తూ ఉంటాయి. కామము మహాశత్రువు, అలాగే క్రోధము కూడా తక్కువ శత్రువేమీ కాదు. ఫలానా వారిపై ప్రేమ ఉంది, నాపై ఎందుకు లేదు! ఫలానా విషయము వీరిని అడిగారు, నన్ను ఎందుకు అడగలేదు! ఇలా, ఇలా మాట్లాడే సంశయబుద్ధి కలవారు ఎందరో ఉన్నారు. రాజధాని స్థాపన అవుతోంది కదా. ఇటువంటివారు ఏ పదవిని పొందుతారు. పదవులలోనైతే ఎంతో తేడా ఉంటుంది. ఊడవడం, శుభ్రం చేయడం వంటి పనులు చేసే పనివారు కూడా మంచి-మంచి మహళ్ళలో ఉంటారు చూడండి, కొందరు మరోచోట ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థము చేసి దైవీ గుణాలను బాగా ధారణ చేయాలి. దేహాభిమానములోకి రావడం వలన ఆసురీ నడవడిక ఉంటుంది. ఎప్పుడైతే దేహీ-అభిమానులుగా అయి మంచిగా ధారణ చేస్తూ ఉంటారో, అప్పుడు ఉన్నత పదవిని పొందుతారు. దైవీ గుణాలను ధారణ చేసే అటువంటి పురుషార్థాన్ని చేయాలి. ఎవరికీ దుఃఖమునివ్వకూడదు. పిల్లలైన మీరు దుఃఖహర్త, సుఖకర్త అయిన తండ్రికి పిల్లలు. మీరు ఎవరికీ దుఃఖమునివ్వకూడదు. ఎవరైతే సెంటర్లను సంభాళిస్తారో వారిపై చాలా బాధ్యత ఉంది. తండ్రి అంటారు - పిల్లలూ, ఒకవేళ ఎవరైనా పొరపాటు చేస్తే 100 రెట్లు శిక్ష పడుతుంది. దేహాభిమానము ఉన్నట్లయితే ఎంతో నష్టము కలుగుతుంది, ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు బాగు చేసేందుకు నిమిత్తము అయ్యారు. ఒకవేళ మీరు స్వయమే బాగుపడకపోతే ఇక ఇతరులను ఎలా బాగుపరుస్తారు. ఎంతో నష్టము వాటిల్లుతుంది. ఇది పాండవ గవర్నమెంట్ కదా. ఇక్కడ ఉన్నతోన్నతుడైన తండ్రి ఉన్నారు, వారితోపాటు ధర్మరాజు కూడా ఉన్నారు. ధర్మరాజు ద్వారా చాలా పెద్ద శిక్షలు పొందుతారు. అటువంటి పనులేవైనా చేస్తే ఎంతో నష్టము వాటిల్లుతుంది. లెక్క లెక్కే, తండ్రి వద్ద పూర్తి లెక్క ఉంటుంది. భక్తి మార్గములో కూడా లెక్క లెక్కే. భగవంతుడు మీ లెక్క తీసుకుంటారు అని అంటారు కూడా. ధర్మరాజు లెక్కను బాగా తీసుకుంటారు అని ఇక్కడ తండ్రి స్వయం అంటారు. మరి అప్పుడు ఆ సమయములో ఏమి చేయగలరు! మేము ఇది, ఇది చేసాము అని సాక్షాత్కారమవుతుంది. అక్కడ భక్తిలోనైతే కొద్దిగా దెబ్బలు పడతాయి కానీ ఇక్కడైతే ఎన్నో దెబ్బలు పొందవలసి వస్తుంది. పిల్లలైన మీరు సత్యయుగములో గర్భ జైలులోకి రారు. అక్కడైతే గర్భ మహలు ఉంటుంది. ఎటువంటి పాపాలు మొదలైనవి చేయరు. కావున అటువంటి రాజ్య భాగ్యాన్ని పొందేందుకు పిల్లలు చాలా అప్రమత్తముగా ఉండాలి. కొంతమంది పిల్లలు బ్రాహ్మణి కన్నా కూడా చురుకుగా తయారవుతారు. వారి భాగ్యము బ్రాహ్మణి కన్నా కూడా ఉన్నతముగా తయారవుతుంది. మంచి సేవ చేయకపోతే జన్మ-జన్మాంతరాలు దాస-దాసీలుగా అవుతారు అని కూడా తండ్రి అర్థం చేయించారు.

తండ్రి సమ్ముఖములోకి రాగానే పిల్లలను అడుగుతారు - పిల్లలూ, దేహీ-అభిమానులుగా అయి కూర్చున్నారా? తండ్రి పిల్లల కోసం వినిపించే మహావాక్యాలు ఏమిటంటే - పిల్లలూ, ఆత్మాభిమానులుగా అయ్యేందుకు ఎంతో పురుషార్థము చేయాలి. నడుస్తూ, తిరుగుతూ కూడా విచార సాగర మంథనము చేస్తూ ఉండాలి. చాలామంది పిల్లలు ఎలా భావిస్తారంటే - మేము త్వరత్వరగా ఈ నరకమనే ఛీ-ఛీ ప్రపంచము నుండి సుఖధామములోకి వెళ్ళాలి. తండ్రి అంటారు, ఎంతోమంది మంచి-మంచి మహారథులు యోగములో ఫెయిల్ అయి ఉన్నారు. వారి చేత కూడా పురుషార్థము చేయించడం జరుగుతుంది. యోగము లేకపోతే పూర్తిగా పడిపోతారు. జ్ఞానమైతే చాలా సహజము. చరిత్ర, భౌగోళికము మొత్తం బుద్ధిలోకి వచ్చేస్తుంది. చాలా మంచి-మంచి కుమార్తెలు ప్రదర్శనీని అర్థం చేయించడములో చాలా చురుకుగా ఉన్నారు, కానీ యోగము లేదు, దైవీ గుణాలు కూడా లేవు. ప్రస్తుతం పిల్లల అవస్థలు ఎలా, ఎలా ఉన్నాయి అని అప్పుడప్పుడూ ఆలోచన కలుగుతూ ఉంటుంది. ప్రపంచములో ఎంత దుఃఖము ఉంది. త్వరత్వరగా ఇది అంతమైపోవాలి. సుఖధామములోకి త్వరగా వెళ్ళాలి అని ఎదురుచూస్తూ కూర్చున్నారు. తపిస్తూ ఉంటారు. బాబా మనకు స్వర్గానికి మార్గము తెలియజేస్తారు కావున బాబాను కలవాలని తపిస్తారు, అటువంటి బాబాను చూడాలని తపిస్తారు. ఇటువంటి తండ్రి సమ్ముఖములోకి వెళ్ళి రోజూ మురళి వినాలి అని భావిస్తారు. ఇక్కడ ఎటువంటి జంజాటపు విషయము లేదు అని ఇప్పుడు భావిస్తారు. బయట ఉన్నట్లయితే అందరితోనూ తోడు నిర్వర్తించవలసి ఉంటుంది, లేకపోతే గొడవలు జరుగుతాయి, అందుకే అందరికీ ఓర్పు వహించమని చెప్తారు. ఇందులో చాలా గుప్తమైన శ్రమ ఉంది. స్మృతి చేసే విషయములో ఎవ్వరూ కూడా ఎంత శ్రమించాలో, అంత చేయలేకపోతున్నారు. గుప్తముగా స్మృతిలో ఉన్నట్లయితే తండ్రి డైరెక్షన్ల అనుసారముగా కూడా నడుచుకోగలరు. దేహాభిమానము కారణముగా తండ్రి డైరెక్షన్లపై నడవనే నడవరు. చార్ట్ నోట్ చేసినట్లయితే ఎంతో ఉన్నతి జరుగుతుంది అని చెప్తారు. ఈ విధంగా ఎవరు చెప్పారు? శివబాబా. టీచర్ పని ఇస్తే అది చేసుకుని వస్తారు కదా. ఇక్కడ మంచి-మంచి పిల్లలను కూడా మాయ చేయనివ్వదు. మంచి-మంచి పిల్లల చార్ట్ బాబా వద్దకు వచ్చినట్లయితే - వీళ్ళు ఏ విధంగా స్మృతిలో ఉంటున్నారో చూడండి అని బాబా అంటారు. ఆత్మలమైన మనం ఒక్క ప్రియునికి ప్రేయసులమని భావిస్తారు. ఆ దైహికమైన ప్రేయసీ-ప్రియులైతే అనేక రకాలవారు ఉంటారు. మీరు చాలా పాత ప్రేయసులు. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఎంతోకొంత సహనం చేయవలసే వస్తుంది. మాకు అన్నీ తెలుసు అని భావించకూడదు. బాబా ఎముకలను ఇచ్చేయండి అని అయితే అనరు కదా. బాబా అంటారు, ఆరోగ్యము మంచిగా ఉంచుకున్నట్లయితే తద్వారా సేవ కూడా బాగా చేయగలరు. రోగగ్రస్థముగా అయినట్లయితే అలా పడి ఉంటారు. కొందరు హాస్పిటళ్ళలో కూడా జ్ఞానాన్ని అర్థం చేయించే సేవను చేస్తే, అప్పుడు డాక్టర్లు వీరు ఫరిశ్తాలు అని అంటారు. చిత్రాలను తమతోపాటు తీసుకువెళ్తారు. ఎవరైతే ఇటువంటి సేవను చేస్తారో, వారిని దయార్ద్ర హృదయులు అని అంటారు. సేవ చేస్తే ఎవరో ఒకరు వెలువడుతారు. ఎంతెంతగా స్మృతి బలములో ఉంటారో, అంతగా మనుష్యులను మీరు ఆకర్షిస్తారు. ఇందులోనే శక్తి ఉంది. పవిత్రతయే మొదట ముఖ్యమైనది. మొదట పవిత్రత, శాంతి, ఆ తర్వాత సంపద అని అంటుంటారు. స్మృతి బలము ద్వారానే మీరు పవిత్రముగా అవుతారు. ఆ తర్వాత ఉన్నది జ్ఞాన బలము. స్మృతిలో బలహీనముగా అవ్వకండి. స్మృతిలోనే విఘ్నాలు కలుగుతాయి. స్మృతిలో ఉండడము ద్వారా మీరు పవిత్రముగానూ అవుతారు మరియు దైవీ గుణాలు కూడా వస్తాయి. తండ్రి మహిమ గురించి అయితే మీకు తెలుసు కదా. తండ్రి ఎంత సుఖాన్ని ఇస్తారు. 21 జన్మల కొరకు మిమ్మల్ని సుఖానికి అర్హులుగా తయారుచేస్తారు. ఎప్పుడూ ఎవరికీ దుఃఖమునివ్వకూడదు.

కొంతమంది పిల్లలు డిస్సర్వీస్ చేసి తమను తాము శపించుకుంటారు, ఇతరులను ఎంతగానో విసిగిస్తారు. కుపుత్రులుగా అయినట్లయితే తమను తామే శపించుకుంటారు. డిస్సర్వీస్ చేయడం వలన పూర్తిగా నేలపై పడిపోతారు. వికారాల్లో పడిపోయే లేక క్రోధములోకి వచ్చి చదువు వదిలేసే పిల్లలు ఎంతోమంది ఉంటారు. అనేక రకాల పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడి నుండి రిఫ్రెష్ అయి వెళ్తే తాము చేసిన తప్పుకు పశ్చాత్తాపపడతారు, కానీ పశ్చాత్తాపము వలన ఎటువంటి క్షమాపణ లభించదు. తండ్రి అంటారు, మిమ్మల్ని మీరే క్షమించుకోండి, స్మృతిలో ఉండండి. తండ్రి ఎవరినీ క్షమించరు. ఇది చదువు. తండ్రి చదివిస్తారు. పిల్లలు తమపై తామే కృప చూపించుకుని చదువుకోవాలి. మంచి మ్యానర్స్ ను అలవర్చుకోవాలి. బాబా బ్రాహ్మణికి - రిజిస్టర్ తీసుకురమ్మని చెప్తారు. ఒక్కొక్కరి సమాచారమును విని వారికి అర్థం చేయించడం జరుగుతుంది, అప్పుడు బ్రాహ్మణి రిపోర్ట్ ఇచ్చారు అని భావిస్తారు, ఇక దాంతో ఇంకా ఎక్కువ డిస్సర్వీస్ చేయడం మొదలుపెడతారు. చాలా కష్టపడవలసి ఉంటుంది. మాయ పెద్ద శత్రువు. కోతి నుండి మందిర యోగ్యులుగా అవ్వనివ్వదు. ఉన్నత పదవిని పొందేందుకు బదులుగా ఇంకా పూర్తిగా కింద పడిపోతారు, ఇక మళ్ళీ ఎప్పుడూ లేవలేరు, చనిపోతారు. తండ్రి పిల్లలకు పదే-పదే అర్థం చేయిస్తున్నారు, ఇది చాలా ఉన్నతమైన గమ్యము, విశ్వాధిపతులుగా అవ్వాలి. గొప్ప వ్యక్తుల పిల్లలు ఎంతో రాయల్టీతో నడుచుకుంటారు. ఎక్కడా తమ తండ్రి పరువు పోకూడదని భావిస్తారు. మీ తండ్రి ఎంత మంచివారు, కానీ నీవు ఎంత కుపుత్రుడవు, నీవు నీ తండ్రి పరువును పోగొడుతున్నావు అని అంటారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ తమ పరువును పోగొట్టుకుంటారు. ఎన్నో శిక్షలను అనుభవించవలసి వస్తుంది. బాబా వార్నింగ్ ఇస్తారు. చాలా అప్రమత్తముగా నడుచుకోండి. జైలు పక్షులలా అవ్వకండి. జైలు పక్షులు కూడా ఇక్కడే ఉంటారు. సత్యయుగంలోనైతే ఎటువంటి జైలూ ఉండదు. అయినా చదువుకుని ఉన్నత పదవిని పొందాలి. నిర్లక్ష్యము చేసి పొరపాట్లు చేయకండి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకండి. స్మృతి యాత్రలో ఉండండి. స్మృతియే ఉపయోగపడుతుంది. ప్రదర్శనీలో కూడా ఈ ముఖ్యమైన విషయాన్నే తెలియజేయండి. తండ్రి స్మృతి ద్వారానే పావనముగా అవుతారు. అందరూ పావనముగా అవ్వాలనుకుంటారు. ఇదంతా పతిత ప్రపంచము. సర్వులకూ సద్గతిని ఇచ్చేందుకు అయితే ఒక్క తండ్రియే వస్తారు. క్రైస్ట్, బుద్ధుడు మొదలైనవారు ఎవరికీ సద్గతిని ఇవ్వలేరు. అలాగే బ్రహ్మా పేరును కూడా తీసుకుంటారు. బ్రహ్మాను కూడా సద్గతిదాత అని అనలేరు. వారు దేవీ-దేవతా ధర్మానికి నిమిత్తులు. దేవీ-దేవతా ధర్మ స్థాపనను అయితే శివబాబాయే చేసినా బ్రహ్మా, విష్ణు, శంకరులు అన్న పేరు అయితే ఉంది కదా. త్రిమూర్తీ బ్రహ్మా అని అనేస్తారు. తండ్రి అంటారు, ఇతను కూడా గురువు కారు. గురువు ఒక్కరే, వారి ద్వారా మీరు ఆత్మిక గురువుగా అవుతారు. మిగిలినవారంతా ధర్మ స్థాపకులు. ధర్మ స్థాపకులను సద్గతిదాత అని ఎలా అనగలరు. ఇవి అర్థం చేసుకోవలసిన చాలా గుహ్యమైన విషయాలు. ఇతర ధర్మ స్థాపకులైతే కేవలం ధర్మ స్థాపన చేస్తారు, వారి వెనుక అందరూ వచ్చేస్తారు, వారు ఎవ్వరినీ తిరిగి తీసుకువెళ్ళలేరు, వారైతే పునర్జన్మలలోకి రావలసిందే. ఇది అందరి కొరకు ఇచ్చే వివరణ. ఒక్క గురువు కూడా సద్గతి కొరకు లేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, గురువు, పతిత-పావనుడు ఒక్కరే, వారే సర్వుల సద్గతిదాత, ముక్తిప్రదాత. మీరు ఇలా చెప్పాలి - మా గురువు ఒక్కరే, వారే సద్గతిని ఇస్తారు, శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్తారు. సత్యయుగ ఆదిలో చాలా కొద్దిమందే ఉంటారు. అక్కడ ఎవరి రాజ్యము ఉండేదో వారి చిత్రాలనైతే చూపిస్తారు కదా. భారతవాసులే అంగీకరిస్తారు. తప్పకుండా వీరు స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు, స్వర్గములో వీరి రాజ్యము ఉండేది అని దేవతల పూజారులు వెంటనే ఒప్పుకుంటారు. అప్పుడు మిగిలిన ఆత్మలంతా ఎక్కడ ఉండేవారు? నిరాకారీ ప్రపంచములో ఉండేవారు అని తప్పకుండా అంటారు. ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. ఇంతకుముందు మీకు ఏమీ తెలియదు. ఇప్పుడు మీ బుద్ధిలో చక్రము తిరుగుతూ ఉంటుంది. తప్పకుండా 5,000 సంవత్సరాల క్రితం భారత్ లో వీరి రాజ్యముండేది. ఎప్పుడైతే జ్ఞాన ప్రారబ్ధము పూర్తి అవుతుందో, అప్పుడు భక్తి మార్గము ప్రారంభమవుతుంది, ఆ తర్వాత పాత ప్రపంచముపై వైరాగ్యము కావాలి. ఇప్పుడు ఇక మనం కొత్త ప్రపంచములోకి వెళ్తాము, పాత ప్రపంచము నుండి మనసు తప్పుకుంటుంది. అక్కడ పతి, పిల్లలు మొదలైనవారందరూ అటువంటివారే లభిస్తారు. అనంతమైన తండ్రి అయితే మనల్ని విశ్వాధిపతులుగా తయారుచేస్తారు.

విశ్వాధిపతులుగా అయ్యే పిల్లల ఎవరైతే ఉంటారో, వారి ఆలోచనలు చాలా ఉన్నతముగా ఉంటాయి మరియు నడవడిక చాలా రాయల్ గా ఉంటుంది. భోజనము కూడా చాలా తక్కువగా ఉండాలి, అత్యాశ ఉండకూడదు. స్మృతిలో ఉండేవారి భోజనము కూడా చాలా సూక్ష్మముగా ఉంటుంది. చాలామంది పిల్లలకు భోజనము వైపు కూడా బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది. పిల్లలైన మీకైతే విశ్వాధిపతులుగా అయ్యే సంతోషము ఉంది. సంతోషము వంటి ఔషధము లేదు అని అంటుంటారు. ఇటువంటి సంతోషములో సదా ఉన్నట్లయితే అన్నపానాదులు కూడా చాలా తగ్గిపోతాయి. ఎక్కువగా తినడం వలన భారీగా అయిపోతారు, ఆపై కునికిపాట్లు పడుతూ ఉంటారు. మళ్ళీ బాబా, నిద్ర వచ్చేస్తోంది అని అంటారు. భోజనము సదా ఒకేలా ఉండాలి, మంచి రుచికరమైన భోజనం ఉంటే ఎక్కువగా తినేయడం కాదు! అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనం దుఃఖహర్త, సుఖకర్త అయిన తండ్రి పిల్లలము, కావున మనం ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. డిస్సర్వీస్ చేసి తమను తాము శపించుకోకూడదు.

2. తమ ఆలోచనలను చాలా ఉన్నతముగా మరియు రాయల్ గా ఉంచుకోవాలి. దయార్ద్ర హృదయులుగా అయి సేవలో తత్పరులై ఉండాలి. అన్నపానాదుల విషయములో అత్యాశను వదిలేయాలి.

వరదానము:-
నిజాయితీగా స్వయాన్ని తండ్రి ఎదురుగా స్పష్టము చేసుకునే ఉన్నత కళ యొక్క అనుభవీ భవ

స్వయాన్ని తాము ఎవరో, ఎలాంటివారో, అలాగే తండ్రి ఎదురుగా ప్రత్యక్షము చేసుకోవటము - ఇదే ఎక్కే కళకు అన్నింటికన్నా అతి పెద్ద సాధనము. బుద్ధిలో అనేక రకాల భారాలేవైతే ఉన్నాయో, వాటినన్నింటినీ సమాప్తము చేసేందుకు సహజమైన యుక్తి ఇదే. నిజాయితీగా ఉంటూ స్వయాన్ని తండ్రి ఎదురుగా స్పష్టము చెయ్యటము అనగా పురుషార్థపు మార్గాన్ని స్పష్టముగా తయారుచేసుకోవటము. ఎప్పుడైనా చతురతతో మన్మతము మరియు పరమతములతో కూడిన ప్లాన్ ను తయారుచేసి తండ్రి లేక నిమిత్త ఆత్మల ఎదురుగా ఏదైనా విషయాన్ని ఉంచినట్లయితే అది నిజాయితీ కాదు. నిజాయితీ అనగా - ఏ విధంగా తండ్రి తాను ఎవరో, ఎలాంటివారో అలాగే పిల్లల ఎదురుగా ప్రత్యక్షమయ్యారో, అలాగే పిల్లలు బాబా ఎదురుగా ప్రత్యక్షమవ్వాలి.

స్లోగన్:-
ఎవరైతే సదా సర్వస్వ త్యాగీ స్థితిలో ఉంటారో, వారే సత్యమైన తపస్వీలు.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి

వర్తమానమనేది భవిష్యత్తు యొక్క దర్పణము వంటిది. వర్తమానము యొక్క స్థితి ద్వారా అనగా దర్పణము ద్వారా మీ భవిష్యత్తును స్పష్టముగా చూసుకోగలరు. భవిష్య రాజ్యాధికారులుగా అయ్యేందుకు చెక్ చేసుకోండి - వర్తమానములో నాలో రూలింగ్ పవర్ ఎంతవరకు ఉంది? ముందుగా విశేష కార్యకర్తలైన మీ సూక్ష్మ శక్తులపై అనగా సంకల్ప శక్తిపై, బుద్ధిపై పూర్తి అధికారము ఉన్నట్లయితే అప్పుడు మీ భవిష్యత్తును ఉజ్వలముగా తయారుచేసుకోగలరు.