21-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తమ కంటే పెద్దవారి పట్ల గౌరవముంచడము, ఇది కూడా దైవీ గుణమే, ఎవరైతే తెలివైనవారిగా, బాగా అర్థం చేయించేవారిగా ఉంటారో, వారిని ఫాలో చేయాలి’’

ప్రశ్న:-
సత్యయుగములో భక్తికి సంబంధించిన ఆచార-పద్ధతులేవీ ఉండవు - ఎందుకు?

జవాబు:-
ఎందుకంటే జ్ఞానసాగరుడైన తండ్రి జ్ఞానాన్ని ఇచ్చి సద్గతిలోకి పంపిస్తారు. భక్తికి ఫలము లభిస్తుంది. జ్ఞానము లభిస్తే, భక్తి నుండి విడాకులు లభించినట్లే. ఇది ఉన్నదే జ్ఞానము యొక్క ప్రారబ్ధ సమయము కావున ఇక భక్తి, తపస్సు, దాన-పుణ్యాలు చేయాల్సిన అవసరమేముంది! అక్కడ ఈ పద్ధతులేవీ ఉండవు.

ఓంశాంతి
పతిత-పావనుడైన శివ భగవానువాచ. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలకు జ్ఞానాన్ని వినిపిస్తారు. నేను ఇక్కడకు వచ్చినప్పుడు పతితులను పావనముగా చేసే జ్ఞానాన్ని వినిపిస్తానని, ఇంకెవ్వరూ ఈ జ్ఞానాన్ని నేర్పించలేరని పిల్లలకు అర్థం చేయించడము జరిగింది. ఇక్కడి వారు భక్తినే నేర్పిస్తారు. స్వయాన్ని బ్రహ్మాకుమార-కుమారీలుగా భావించే పిల్లలైన మీరు మాత్రమే జ్ఞానాన్ని నేర్చుకుంటారు. దిల్వాడా మందిరము మీ ఎదురుగా నిలబడి ఉంది. అక్కడ కూడా రాజయోగ తపస్సులో కూర్చున్నారు. జగదంబ కూడా ఉన్నారు, ప్రజాపిత కూడా ఉన్నారు. కుమారీ కన్య, అధర్ కుమారీ కూడా ఉన్నారు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పై భాగములో రాజ్యము యొక్క చిత్రాలు కూడా ఉన్నాయి. తండ్రి భక్తినేమీ నేర్పించరు. ఎవరైతే నేర్పించి వెళ్ళారో వారికే భక్తి చేస్తారు కానీ రాజయోగాన్ని నేర్పించి, రాజ్యాన్ని స్థాపన చేసి వెళ్ళినవారు ఎవరు అనేది వారికి తెలియదు. భక్తి వేరు, జ్ఞానము వేరు అని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. జ్ఞానము వినిపించేవారు ఒక్కరే, ఇంకెవరూ వినిపించలేరు. జ్ఞానసాగరుడు ఒక్కరే. వారే వచ్చి జ్ఞానము ద్వారా పతితులను పావనముగా తయారుచేస్తారు. ఇతర సత్సంగాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఎవరూ జ్ఞానాన్ని నేర్పించలేరు. తమను తాము శ్రీ శ్రీ 108 జగద్గురువు అని, భగవంతుడని పిలుచుకుంటారు కానీ - నేను అందరి పరమపితను, జ్ఞానసాగరుడిని అని ఎవరూ చెప్పుకోరు, వాళ్ళను ఎవరూ అసలు పరమపిత అని పిలవరు. పరమపిత పతిత-పావనుడు అని అయితే తెలుసు. ఈ పాయింట్లను బుద్ధిలో మంచి రీతిలో ఉంచుకోవాలి. ఈ బ్రహ్మాకుమారీలైతే భక్తికి విడాకులు ఇస్తారని మనుష్యులు అంటూ ఉంటారు. కానీ జ్ఞానము లభించినప్పుడు భక్తికి విడాకులు ఇవ్వాల్సిందే. భక్తిలోకి వెళ్ళినప్పుడు మనము జ్ఞానానికి విడాకులు ఇస్తున్నామని ఆ సమయములో తెలియదు. అలా జరగదు. ఆ సమయములో ఆటోమేటిక్ గా రావణ రాజ్యములోకి వెళ్ళిపోతారు. బాబా మనకు రాజయోగము నేర్పిస్తున్నారని ఇప్పుడు మీకు అర్థమైంది. ఇది రాజయోగము యొక్క జ్ఞానము, దీనిని భక్తి అని అనరు. భగవంతుడు జ్ఞానసాగరుడు, వారెప్పుడూ భక్తిని నేర్పించరు. భక్తి ఫలమే జ్ఞానము. జ్ఞానముతో సద్గతి కలుగుతుంది. కలియుగ అంతిమములో అందరూ దుఃఖితులుగా ఉన్నారు, అందుకే ఈ పాత ప్రపంచాన్ని దుఃఖధామము అని అంటారు. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. భక్తి ఫలాన్ని అనగా సద్గతినిచ్చేందుకు తండ్రి వచ్చి ఉన్నారు. వారు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది పాత ప్రపంచము, దీని వినాశనము జరగనున్నది. మనకు కొత్త ప్రపంచములో రాజ్యము కావాలి. ఇది రాజయోగము యొక్క జ్ఞానము. జ్ఞానము నేర్పించేవారు ఒక్క పరమపిత పరమాత్మ శివుడు మాత్రమే. వారినే జ్ఞానసాగరుడని అంటారు, శ్రీకృష్ణుడిని అలా అనరు. శ్రీకృష్ణుని మహిమ వేరు. అతను తప్పకుండా గత జన్మలో రాకుమారునిగా తయారయ్యేటువంటి కర్తవ్యాన్ని చేసారు.

మనము రాజయోగ జ్ఞానాన్ని తీసుకుని కొత్త ప్రపంచములో స్వర్గము యొక్క రాకుమార-రాకుమారీలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. స్వర్గాన్ని సద్గతి అని, నరకాన్ని దుర్గతి అని అంటారు. మనము మన కోసం రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము. ఇకపోతే, ఎవరైతే ఈ జ్ఞానాన్ని తీసుకోరో, పావనముగా అవ్వరో, వారు రాజధానిలోకి రాలేరు, ఎందుకంటే సత్యయుగములో చాలా కొద్దిమంది ఉంటారు. ఆ సమయములో కలియుగ అంతిమములో ఉన్న ఈ అనేకమంది మనుష్యులు తప్పకుండా ముక్తిధామములో ఉంటారు. వారు మాయమైపోరు, అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తవుతుంది కావున ఇప్పుడు పిల్లలకు ఇల్లు గుర్తుంటుంది. నాటకము పూర్తవుతుంది. అనేక సార్లు చక్రములో తిరిగారు. ఇది బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బ్రాహ్మణులైతే తయారవుతూ ఉంటారు. 16,108 మాల ఉంది. సత్యయుగములోనైతే ఎక్కువమంది ఉండరు. సత్యయుగము యొక్క మోడల్ రూపాన్ని కూడా చూపిస్తారు కదా. పెద్ద వస్తువుకు సంబంధించిన మోడల్ చిన్నగా ఉంటుంది. ఉదాహరణకు బంగారు ద్వారకను చూపిస్తారు. ద్వారకలో శ్రీకృష్ణుని రాజ్యము ఉండేదని అంటూ ఉంటారు. ఇప్పుడు ఇంతకీ రాజ్యము ద్వారకలో ఉండేదా లేక ఢిల్లీలో ఉండేదా? యమునా నదీ తీరమైతే ఇక్కడ ఢిల్లీలో ఉంది. అక్కడ (ద్వారకలో) అయితే సాగరము ఉంది. యమునా నదీ తీరమున రాజధాని ఉండేదని పిల్లలు అర్థం చేసుకుంటారు. ద్వారక రాజధాని కాదు. ఢిల్లీ ప్రసిద్ధమైనది. యమునా నది కూడా కావాలి. యమునా నదికి మహిమ ఉంది. పరిస్తాన్ అని ఢిల్లీనే అంటారు. ముఖ్య సింహాసనము ఢిల్లీలోనే ఉంటుంది. భక్తి మార్గము సమాప్తమై జ్ఞాన మార్గము ఉంటుందని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇక్కడ దైవీ రాజధాని స్థాపనవుతూ ఉంది. తండ్రి అంటారు - ఎవరెవరు ఎంత పాస్ అవుతారు అనేది మున్ముందు మీకు అంతా తెలిసిపోతుంది. స్కూల్లో కూడా ఫలానావారు ఇన్ని మార్కులతో పాస్ అయ్యారని, ఇప్పుడు మరుసటి క్లాసులోకి వెళ్తారని తెలుస్తుంది కదా. చివరి సమయములో - ఎవరెవరు పాస్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతారు అనేది ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. క్లాసు అయితే పెద్దది కదా. ఇది అనంతమైన క్లాసు. సెంటర్లు రోజురోజుకు వృద్ధి చెందుతూ ఉంటాయి. కొంతమంది వచ్చి 7 రోజుల కోర్సును మంచి రీతిలో తీసుకుంటారు. ఒకటి-రెండు రోజుల కోర్సు కూడా తక్కువేమీ కాదు. కలియుగ వినాశనము ఎదురుగా నిలబడి ఉందని చూస్తారు. ఇప్పుడు సతోప్రధానముగా అవ్వాలి. తండ్రి అన్నారు - బుద్ధియోగాన్ని నాతో జోడించినట్లయితే సతోప్రధానముగా అవుతారు, పవిత్ర ప్రపంచములోకి వస్తారు. డ్రామాలో కల్పక్రితం పాత్రను అభినయించినట్లుగా, పాత్రనైతే తప్పకుండా అభినయించాలి. భారతవాసులే రాజ్యము చేసేవారు, తర్వాత వృద్ధి చెందారు. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఎలాగైతే క్రిస్టియన్లు క్రైస్టును పూజిస్తారో, అలా భారతవాసులు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారైనా కానీ పావనముగా లేనందుకు ఆ పావన దేవతలను పూజిస్తారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము సత్యయుగములో ఉంటుంది. సత్యయుగాన్ని స్థాపన చేసేవారు తండ్రి. తప్పకుండా సత్యయుగములో ఈ దేవతల రాజ్యముండేది, అంటే తప్పకుండా ఆ ముందు జన్మలో వారు పురుషార్థము చేసి ఉంటారు. తప్పకుండా ఆ సమయము సంగమమే అయ్యి ఉంటుంది. అప్పుడే పాత ప్రపంచము మారి కొత్త ప్రపంచముగా అవుతుంది. కలియుగము పరివర్తనై సత్యయుగము రానున్నది, అంటే కలియుగములో పతితులు ఉన్నారని అర్థం. బాబా అర్థం చేయించారు - ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని తయారుచేసినప్పుడు లేక సాహిత్యము ముద్రించేటప్పుడు, అందులో - వీరు ఈ సహజ రాజయోగ జ్ఞానముతో ముందు జన్మలో ఈ పురుషార్థము చేసారని వ్రాయాలి. కేవలం రాజు-రాణి మాత్రమే ఉండరు, ప్రజలు కూడా తయారవుతారు కదా. అజ్ఞానములోనైతే మనుష్యులకు ఏమీ తెలియదు, కేవలం పూజలు చేస్తూ ఉంటారు. వారు పూజలు చేసేటప్పుడు కేవలం లక్ష్మీ-నారాయణులను చూస్తూ ఉంటారు, అంతేకానీ జ్ఞానమేమీ ఉండదు, ఇది మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. భక్తి చేయకుండా భగవంతుడు లభించనే లభించరని మనుష్యులు భావిస్తారు. భగవంతుడు వచ్చి ఉన్నారని మీరు ఎవరికైనా చెప్తే, వారు నవ్వుకుంటారు. భగవంతుడైతే కలియుగ అంతిమములోనే వస్తారు కదా, మరి ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చారని అంటారు. కలియుగ అంతిమములో వస్తారని కూడా ఎందుకంటారు, ఇది కూడా అర్థం చేసుకోరు. వారు శ్రీకృష్ణుడిని ద్వాపరములోకి తీసుకువెళ్ళారు. మనుష్యులు అర్థం తెలియకుండా ఏది తోస్తే అది మాట్లాడుతారు, అందుకే తండ్రి అంటారు - మీరు పూర్తిగా తెలివిహీనులుగా అయిపోయారు. తండ్రిని సర్వవ్యాపి అని అనేస్తారు. భక్తి బయటకు చాలా సుందరముగా కనిపిస్తుంది. భక్తి యొక్క మెరుపు ఎంతగా ఉంది! మీ వద్దనైతే ఏమీ లేదు. వేరే ఏ సత్సంగాలకు వెళ్ళినా సరే శబ్దము తప్పకుండా ఉంటుంది, పాటలు కూడా పాడుతూ ఉంటారు. ఇక్కడైతే బాబా పాటలు కూడా ఇష్టపడరు. ఇక మున్ముందు బహుశా ఇవి కూడా సమాప్తము అయిపోవచ్చు.

తండ్రి అంటారు - ఈ పాటలు మొదలైనవాటి సారాన్ని అంతా మీకు అర్థం చేయిస్తాను. మీకు వీటి అర్థం తెలుసు. ఇది చదువు. పిల్లలకు తెలుసు - మేము రాజయోగము నేర్చుకుంటున్నాము, ఒకవేళ తక్కువగా చదువుకుంటే ప్రజలలోకి వెళ్ళిపోతాము, అందుకే ఎవరైతే చాలా తెలివైనవారిగా ఉంటారో, వారిని ఫాలో చేయాలి, ఎందుకంటే వారికి చదువు పట్ల అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది కనుక దాని వలన లాభముంటుంది. ఎవరైతే బాగా అర్థం చేయించేవారు ఉంటారో, వారి నుండి నేర్చుకోవాలి. ఎవరైతే బాగా అర్థం చేయిస్తారో, వారిని సెంటర్లలో గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. బ్రహ్మాకుమారి కూర్చుని ఉన్నప్పటికీ ఫలానా అక్కయ్య రావాలని కోరుకుంటారు ఎందుకంటే ఆమె చాలా తెలివైనవారని భావిస్తారు. అలాంటప్పుడు ఆ వచ్చేవారిని గౌరవించాల్సి ఉంటుంది కూడా. పెద్దవారికి ఈ రకంగా గౌరవము ఇవ్వాల్సి ఉంటుంది. వీరు జ్ఞానములో మా కన్నా చురుకైనవారు, తప్పకుండా వీరికి ఉన్నతమైన పదవి లభిస్తుందని అనుకుంటారు, ఈ విషయములో అహంకారము రాకూడదు. పెద్దవారికి చాలా గౌరవము ఉంటుంది. ప్రెసిడెంటు పట్ల తప్పకుండా ఎక్కువ గౌరవము ఉంటుంది. ప్రతి ఒక్కరికీ నంబరువారుగా గౌరవముంటుంది. పరస్పరములో ఒకరినొకరు గౌరవించుకుంటారు కదా. బ్యారిస్టర్లలో కూడా నంబరువారుగా ఉంటారు. పెద్ద కేసు కోసం మంచి తెలివైన వకీలును ఎంచుకుంటారు. కొందరైతే లక్షల రూపాయల కేసులను కూడా తీసుకుంటారు. తప్పకుండా నంబరువారుగా ఉంటారు. మనకన్నా చురుకైనవారు ఉంటే, తప్పకుండా గౌరవము ఉంచాలి. సెంటర్లను సంభాళించాలి, అన్ని పనులు కూడా చేయాలి. ప్రదర్శనీలు ఏ విధముగా ఏర్పాటు చేయాలి అని బాబాకు రోజంతా ఆలోచన నడుస్తుంది కదా. మనము తమోప్రధానము నుండి సతోప్రధానముగా ఎలా అవ్వాలి అన్నదాని పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. తండ్రి సతోప్రధానముగా తయారుచేసేందుకే వచ్చారు. పతిత-పావనుడు తండ్రి మాత్రమే. ఇక్కడ గంగను పతిత-పావని అంటారు, ఇందులో జన్మ-జన్మలుగా స్నానాలు చేస్తూ వచ్చారు. కానీ పావనముగా ఎవ్వరూ అవ్వలేదు. ఇదంతా భక్తి. ఓ పతిత-పావనా రండి అని పిలుస్తారు. వారు తప్పకుండా సంగమములోనే వస్తారు మరియు ఒక్కసారి మాత్రమే వస్తారు. ప్రతి ఒక్కరి ఆచార-పద్ధతులు ఎవరివి వారివే. ఉదాహరణకు నేపాల్ లో అష్టమి నాడు బలి ఇస్తారు. చిన్న పిల్లల చేతికి తుపాకీ ఇచ్చి కాల్చేలా చేస్తారు. వారు కూడా బలి ఇస్తారు. పెద్దవారైతే ఒక్క వేటుతో దూడను హతమారుస్తారు. ఎవరైనా తక్కువ శక్తిని ఉపయోగిస్తే, అది ఒక్క వేటుతో మరణించకపోతే, దానిని బలిగా భావించరు, అది దేవికి అర్పించరు. ఇదంతా భక్తి మార్గము. ప్రతి ఒక్కరి ఊహలు ఎవరివి వారివే. చాలా మంది ఆ ఊహ వెనుక ఫాలోవర్స్ గా అయిపోతారు. ఇక్కడ ఇవి కొత్త విషయాలు. వీటి గురించి పిల్లలే తెలుసుకోగలరు. ఒక్క తండ్రియే కూర్చుని సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. మీరు స్వదర్శన చక్రధారులని మీకు సంతోషము ఉంటుంది, ఇంకెవరూ దీనిని అర్థం చేసుకోలేరు. నేను మిమ్మల్ని సభలో - సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులు, స్వదర్శన చక్రధారులు అని సంబోధిస్తే, దాని అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటారు. ఎవరైనా కొత్తవారు ఉంటే, ఇదేమిటి ఇలా అన్నారు అని తికమకపడతారు. స్వదర్శన చక్రధారి విష్ణువు కదా అని అనుకుంటారు. ఇది కొత్త విషయము కదా, అందుకే మీరు బయట (సేవా) మైదానములోకి వస్తే మీకు తెలుస్తుందని మీకు చెప్పడము జరుగుతుంది.

మీది జ్ఞాన మార్గము. మీరు 5 వికారాలపై విజయము పొందుతారు. ఈ అసురులతో (5 వికారాలతో) మీకు యుద్ధము జరుగుతుంది. తర్వాత మీరు దేవతలుగా అవుతారు, అప్పుడిక యుద్ధానికి సంబంధించిన విషయమేమీ ఉండదు. అసురులు ఉన్న చోట దేవతలు ఉండరు. మీరు బ్రాహ్మణులు, దేవతలుగా అవ్వనున్నారు, అందుకే పురుషార్థము చేస్తున్నారు. రుద్ర జ్ఞాన యజ్ఞములో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. బ్రాహ్మణులు లేకుండా యజ్ఞము జరగదు. రుద్రుడు అనగా శివుడు, మరి శ్రీకృష్ణుని పేరు ఎక్కడ నుండి వచ్చింది. మీరు ప్రపంచానికి పూర్తిగా అతీతముగా ఉన్నారు మరియు మీరు ఎంత తక్కువమంది ఉన్నారు. పిచ్చుకలు సాగరాన్ని మింగేసాయని శాస్త్రాలలో కల్పిత కథలు ఎన్ని ఉన్నాయి. తండ్రి అంటారు - ఇప్పుడు వాటన్నింటినీ మర్చిపోయి నన్నొక్కరినే స్మృతి చేయండి. ఆత్మయే తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి అయితే ఒక్కరే కదా. ఓ పరమాత్మ లేక ప్రభూ అని అంటారు, ఆ సమయములో లింగము కూడా గుర్తుకు రాదు, కేవలం ఈశ్వరా లేక ప్రభు అని అంటారు. ఆత్మకు తండ్రి నుండి అర్ధకల్పము యొక్క సుఖము లభించింది, అందుకే భక్తి మార్గములో స్మృతి చేస్తుంది. ఆత్మ ఏమిటి, పరమాత్మ ఎవరు అనే జ్ఞానము ఇప్పుడు మీకు లభించింది. ఆత్మలమైన మనమందరము మూలవతనములో నివసించేవారము. అక్కడి నుండి నంబరువారుగా పాత్రను అభినయించేందుకు వస్తాము. ముందు దేవీ-దేవతలు వస్తారు. క్రైస్టుకు ముందు దేవీ-దేవతా ధర్మముండేదని అంటారు. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము. వారేమో - ఫలానా వస్తువు 50 వేల సంవత్సరాల పాతది అని అంటారు, కానీ 50 వేల సంవత్సరాల పాత వస్తువు ఏదీ ఉండదు. డ్రామా ఉన్నదే 5 వేల సంవత్సరాలది. ముఖ్యమైన ధర్మాలు ఇవే. ఈ ధర్మాలకు చెందినవారికే ఇళ్ళు మొదలైనవి ఉంటాయి. ముందు వారు రజోగుణీ బుద్ధి కలవారిగా ఉండేవారు కానీ ఇప్పుడు ఇంకా తమోగుణీ బుద్ధి కలవారిగా ఉన్నారు. ప్రదర్శనీలలో ఎంతగా అర్థం చేయిస్తారు కానీ ఎవరికీ అర్థం కాదు. బ్రాహ్మణుల అంటు కట్టబడుతుంది. జ్ఞానము వేరు, భక్తి వేరు అని పిల్లలకు అర్థం చేయించడము జరిగింది. జ్ఞానముతో సద్గతి లభిస్తుంది, అందుకే - ఓ పతిత-పావనా రండి, దుఃఖము నుండి విడిపించండి అని పిలుస్తారు కూడా. వారు గైడ్ గా అయి తమతోపాటు తీసుకువెళ్తారు. తండ్రి వచ్చి ఆత్మలను తీసుకువెళ్తారు. శరీరాలన్నీ సమాప్తమైపోతాయి. వినాశనము జరుగుతుంది కదా. శాస్త్రాలలో ఒక్క మహాభారత యుద్ధము గురించే చెప్తూ ఉంటారు. ఇది ఆ మహాభారత యుద్ధమేనని అంటారు కూడా. ఇది జరగాల్సిందే. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉండండి. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యేందుకు ఉపాయము ఒక్కటే. తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు ఆత్మ నాతో పాటు వచ్చేస్తుంది. అందరికీ సందేశాన్ని ఇస్తూ ఉన్నట్లయితే, అనేకుల కళ్యాణము జరుగుతుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరైతే చదువులో చురుకైనవారిగా ఉంటారో, బాగా అర్థం చేయిస్తారో - వారి సాంగత్యము చేయాలి, వారిని గౌరవించాలి. ఎప్పుడూ అహంకారములోకి రాకూడదు.

2. జ్ఞానానికి సంబంధించిన కొత్త-కొత్త విషయాలను మంచి రీతిలో అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించాలి. మేము స్వదర్శన చక్రధారులము అనే సంతోషములోనే ఉండాలి.

వరదానము:-
అతీతముగా మరియు ప్రియముగా ఉండే యోగ్యత ద్వారా మోహముక్తులుగా అయ్యే సహజయోగీ భవ

సహజయోగీ జీవితాన్ని అనుభవం చేసేందుకు, జ్ఞాన సహితముగా అతీతముగా అవ్వండి. కేవలం బాహ్యముగా అతీతము అవ్వడము కాదు, మనసు యొక్క మోహము ఉండకూడదు. ఎవరు ఎంత అతీతముగా అవుతారో, అంత ప్రియముగా తప్పకుండా అవుతారు. అతీతమైన అవస్థ ప్రియమనిపిస్తుంది. ఎవరైతే బాహ్య మోహాల నుండి అతీతముగా అవ్వరో, వారు ప్రియముగా అయ్యేందుకు బదులుగా చింతాగ్రస్తులుగా అవుతారు. అందుకే సహజయోగీ అనగా అతీతముగా మరియు ప్రియముగా ఉండే యోగ్యత కలవారు, వారు సర్వ మోహాల నుండి ముక్తులుగా ఉండేవారు.

స్లోగన్:-
స్వ పురుషార్థము మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా బంధనమనేది సంబంధములోకి మారిపోతుంది.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి

దాత పిల్లలు ప్రతి క్షణము, ప్రతి సంకల్పములోనూ ఇవ్వాలి. దాత యొక్క ముఖ్య గుణము ఉదారచిత్తము. వారు ఇతరుల ఉద్దరణకు నిమిత్తులవుతారు. కనుక మేము దాత పిల్లలము అని సదా భావించండి. ఒక్క క్షణము కూడా ఇవ్వకుండా ఉండకూడదు, వారినే మహాదాని అని అంటారు. ఇచ్చే ద్వారాలు సదా తెరిచి ఉండాలి. ఎలా అయితే మందిర ద్వారాలు సదా తెరిచి ఉంటాయో, అలా దాత పిల్లల యొక్క ఇచ్చే ద్వారము ఎప్పుడూ మూసి ఉండకూడదు.