22-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మిమ్మల్ని ఎవరు చదివించడానికి వచ్చారు అన్నది ఆలోచిస్తే సంతోషములో రోమాలు నిక్కబొడుచుకుంటాయి, ఉన్నతోన్నతుడైన తండ్రి చదివిస్తున్నారు, ఇటువంటి చదువును ఎప్పుడూ వదలకూడదు’’

ప్రశ్న:-
ఇప్పుడు పిల్లలైన మీకు ఏ నిశ్చయము కలిగింది? నిశ్చయబుద్ధి కలవారి గుర్తులు ఏమిటి?

జవాబు:-
మీకు ఏ నిశ్చయము కలిగిందంటే - మేము ఇప్పుడు ఎటువంటి చదువును చదువుతున్నామంటే, దీని ద్వారా ద్వికిరీటధారులుగా, రాజులకే రాజులుగా అవుతాము, స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివించి విశ్వానికి యజమానులుగా తయారుచేస్తున్నారు. ఇప్పుడు మనము వారికి పిల్లలుగా అయ్యాము కావున ఇక ఈ చదువులో నిమగ్నమైపోవాలి. ఏ విధముగా చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల వద్దకు తప్ప ఇంకెవ్వరి వద్దకు వెళ్ళరో, అదే విధముగా అనంతమైన తండ్రి లభించిన తర్వాత ఇంకెవ్వరూ మంచిగా అనిపించకూడదు. ఒక్కరి స్మృతి మాత్రమే ఉండాలి.

పాట:-
ఈ రోజు ఉదయముదయమే ఎవరు వచ్చారు...

ఓంశాంతి
ఎవరు వచ్చారు మరియు ఎవరు చదివిస్తున్నారు - అని మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. కొందరు చాలా తెలివైనవారిగా ఉంటారు, కొందరు తక్కువ తెలివి కలవారిగా ఉంటారు. ఎవరైతే బాగా చదువుకుని ఉంటారో, వారిని చాలా తెలివైనవారు అని అంటారు. శాస్త్రాలు మొదలైనవి ఎవరైతే బాగా చదివి ఉంటారో, వారికి బాగా గౌరవము ఉంటుంది. తక్కువగా చదివినవారికి తక్కువ గౌరవము లభిస్తుంది. చదివించడానికి ఎవరు వచ్చారు - అన్న పదాలను ఇప్పుడు పాటలో విన్నారు. టీచరు వస్తారు కదా. టీచరు వచ్చారు అని స్కూల్లో చదువుకుంటున్నవారికి తెలుస్తుంది. అలాగే ఇక్కడికి ఎవరు వచ్చారు? ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకోవాలి. ఉన్నతోన్నతుడైన తండ్రి మళ్ళీ చదివించడానికి వచ్చారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా! దీనికి అదృష్టము కూడా ఉండాలి. అసలు చదివించేది ఎవరు? భగవంతుడు. వారు వచ్చి చదివిస్తున్నారు. ఎవరు ఎంత పెద్ద చదువును చదువుతున్నా సరే ఒక్కసారిగా ఆ చదువును వదిలేసి వచ్చి భగవంతుడి ద్వారా చదువుకోవాలి అని వివేకము చెప్తుంది. ఒక్క క్షణములో సర్వస్వాన్నీ వదిలి తండ్రి వద్దకు చదువుకోవడానికి రావాలి.

ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగ వాసులుగా అయ్యారని బాబా అర్థం చేయించారు. ఉత్తమోత్తమ పురుషులు ఈ లక్ష్మీ-నారాయణులు. వీరు ఏ విద్య ద్వారా ఇటువంటి పదవిని పొందారు అన్నది ప్రపంచములోని వారికెవ్వరికీ తెలియదు. ఈ పదవిని పొందేందుకు మీరు చదువుతున్నారు. ఎవరు చదివిస్తున్నారు? భగవంతుడు. కావున మిగిలిన చదువులన్నింటినీ వదిలి ఈ చదువులో నిమగ్నమైపోవాలి, ఎందుకంటే తండ్రి రావడమే కల్పము తరువాత వస్తారు. తండ్రి అంటారు - నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తరువాత సమ్ముఖముగా చదివించేందుకు వస్తాను. ఇది అద్భుతము కదా. ఈ పదవిని ప్రాప్తింపజేసేందుకు భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అని అంటారు కూడా, అయినా చదవరు. అప్పుడు మరి తండ్రి వారిని - వీరు తెలివైనవారు కాదు అని అంటారు కదా. తండ్రి చెప్పే చదువుపై వారు పూర్తి ధ్యానము ఉంచరు, తండ్రిని మర్చిపోతారు. బాబా, మేము మర్చిపోతున్నాము అని మీరు అంటారు. టీచరును కూడా మర్చిపోతారు. ఇవి మాయ తుఫానులు. కానీ చదువునైతే చదవాలి కదా. భగవంతుడు చదివిస్తున్నారంటే ఇక ఆ చదువులో పూర్తిగా నిమగ్నమైపోవాలి కదా అని వివేకము చెప్తుంది. చిన్న పిల్లలే చదువుకోవలసి ఉంటుంది. ఆత్మ అయితే అందరిలోనూ ఉంది. ఇకపోతే శరీరమే చిన్నగా, పెద్దగా అవుతుంది. బాబా, నేను మీ చిన్న పిల్లవాడిని అని ఆత్మయే అంటుంది. అచ్ఛా, మరి నా వారిగా అయ్యారంటే ఇప్పుడు ఇక చదువుకోండి. మీరు పాలు తాగే పిల్లలైతే కాదు కదా. చదువు ముఖ్యము. ఇందులో చాలా అటెన్షన్ పెట్టాలి. ఇక్కడ సుప్రీమ్ టీచరు వద్దకు విద్యార్థులు వస్తారు. చదివించేందుకు ఆ టీచర్లు కూడా నిమిత్తమై ఉన్నారు, అయినా కానీ సుప్రీమ్ టీచర్ అయితే ఉన్నారు కదా. ఏడు రోజుల భట్టీ కూడా ప్రసిద్ధమైనది. తండ్రి అంటారు, పవిత్రముగా ఉండండి మరియు నన్ను స్మృతి చేయండి. దైవీ గుణాలను ధారణ చేసినట్లయితే మీరు ఈ విధముగా తయారవుతారు. అనంతమైన తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. చిన్న పిల్లలను తమ తల్లిదండ్రులు తప్ప ఇంకెవరైనా ఎత్తుకుంటే వారి వద్దకు వెళ్ళరు. మీరు కూడా అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యాక ఇక ఇతరులెవ్వరినీ చూడడం కూడా మీకు ఇష్టమనిపించదు, అది ఎవరైనా సరే! మేము ఉన్నతోన్నతమైన తండ్రికి చెందినవారిగా అయ్యామని మీకు తెలుసు. వారు మనల్ని ద్వికిరీటధారులుగా, రాజులకే రాజులుగా తయారుచేస్తారు. ప్రకాశ కిరీటము మన్మనాభవ మరియు రత్నజడిత కిరీటము మధ్యాజీభవ. మేము ఈ చదువు ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతామని నిశ్చయము ఏర్పడుతుంది. ఐదు వేల సంవత్సరాల తరువాత చరిత్ర రిపీట్ అవుతుంది కదా. మీకు రాజ్యము లభిస్తుంది. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామమైన తమ ఇంటికి వెళ్ళిపోతాయి. వాస్తవానికి ఆత్మలమైన మనము తండ్రితోపాటు మన ఇంట్లో ఉంటాము అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసింది. తండ్రికి చెందినవారిగా అవ్వడముతో ఇప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు, ఆ తరువాత మళ్ళీ తండ్రిని మరచి అనాథలుగా అయిపోతారు. భారత్ ఈ సమయములో అనాథగా ఉంది. తల్లిదండ్రులు లేనివారిని అనాథలు అని అంటారు. వారు ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. మీకైతే ఇప్పుడు తండ్రి లభించారు. మీకు మొత్తం సృష్టి చక్రము గురించి తెలుసు కావున సంతోషములో పులకరించిపోవాలి. మనము అనంతమైన తండ్రికి పిల్లలము. పరమపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మా ద్వారా బ్రాహ్మణుల కొత్త సృష్టిని రచిస్తారు. ఇది చాలా సహజముగా అర్థం చేసుకోవలసిన విషయము. మీ చిత్రాలు కూడా ఉన్నాయి, విరాట రూప చిత్రాన్ని కూడా తయారుచేసారు. అందులో 84 జన్మల కథను చూపించారు. మనమే దేవతలుగా, మళ్ళీ క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఈ విషయము మనుష్యులెవ్వరికీ తెలియదు, ఎందుకంటే ఆ చిత్రములో బ్రాహ్మణులను మరియు బ్రాహ్మణులను చదివించే తండ్రి యొక్క నామ-రూపాలను మాయం చేసేసారు. ఇంగ్లీష్ లో కూడా మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు. ఎవరికైతే ఇంగ్లీష్ తెలుసో వారు అనువాదము చేసి అర్థం చేయించాలి. ఫాదర్ నాలెడ్జ్ ఫుల్, ఈ సృష్టి చక్రము ఏ విధముగా తిరుగుతుంది అన్న నాలెడ్జ్ వారికే ఉంది. ఇది ఒక చదువు. యోగాన్ని కూడా తండ్రి స్మృతి అని అనడం జరుగుతుంది, దీనినే ఇంగ్లీష్ లో కమ్యూనియన్ అని అంటారు. తండ్రితో కమ్యూనియన్ (యోగము), టీచర్ తో కమ్యూనియన్, గురువుతో కమ్యూనియన్. ఇది గాడ్ ఫాదర్ తో కమ్యూనియన్. స్వయంగా తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేయండి, ఇంకే దేహధారులను స్మృతి చేయకండి. మనుష్యులు గురువులు మొదలైనవారిని ఆశ్రయిస్తారు, శాస్త్రాలను చదువుతారు, కానీ లక్ష్యము-ఉద్దేశ్యము ఏమీ ఉండదు, దాని వల్ల సద్గతి ఏమీ లభించదు. తండ్రి అయితే అంటారు, నేను అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. ఇప్పుడు మీ తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించినట్లయితే మీరు అక్కడికి చేరుకుంటారు. బాగా స్మృతి చేసినట్లయితే విశ్వానికి యజమానులుగా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు కదా. ఈ విధంగా అర్థం చేయిస్తున్నవారు ఎవరు. తండ్రిని నాలెడ్జ్ ఫుల్ అని అంటారు, కానీ మనుష్యులు వారిని అంతర్యామి అని అంటారు. వాస్తవానికి అంతర్యామి అన్న పదమే లేదు. లోపల ఉండేది, లోపల నివసించేది ఆత్మయే. ఆత్మ ఏమి చేస్తుంది అనేదైతే అందరికీ తెలుసు. మనుష్యులందరూ అంతర్యాములే, ఆత్మయే అన్నీ నేర్చుకుంటుంది. తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారుచేస్తారు. ఆత్మ అయిన నీవు మూలవతన నివాసివి. ఆత్మ అయిన నీవు ఎంత చిన్నగా ఉన్నావు. నీవు పాత్రను అభినయించేందుకు అనేక సార్లు వచ్చావు. తండ్రి అంటారు, నేను ఒక బిందువును, నా పూజనైతే చేయలేరు. అయినా నన్ను ఎందుకు పూజిస్తారు, అవసరమే లేదు. నేను ఆత్మలైన మిమ్మల్ని చదివించేందుకు వస్తాను. మీకే రాజ్యాన్ని ఇస్తాను. ఆ తరువాత రావణ రాజ్యములోకి వెళ్ళిపోయి ఇక నన్నే మర్చిపోతారు. మొట్టమొదట పాత్రను అభినయించేందుకు ఆత్మ వస్తుంది. 84 లక్షల జన్మలు తీసుకుంటారని మనుష్యులు అంటారు. కానీ తండ్రి అంటారు, ఎక్కువలో ఎక్కువ ఉన్నది 84 జన్మలే. విదేశాలకు వెళ్ళి ఈ విషయాలను వినిపించినట్లయితే వారు అంటారు - మీరు ఈ జ్ఞానాన్ని ఇక్కడే కూర్చుని మాకు వినిపించండి, మీకు భారత్ లో అయితే వేయి రూపాయలు లభిస్తాయి, మేము ఇక్కడ పది-ఇరవై వేలు రూపాయలు ఇస్తాము, మాకు కూడా జ్ఞానాన్ని వినిపించండి. గాడ్ ఫాదర్ ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు. ఆత్మయే జడ్జి మొదలైనవారిగా అవుతుంది. ఇకపోతే మనుష్యులందరూ అయితే దేహాభిమానులుగా ఉన్నారు. ఎవ్వరిలోనూ జ్ఞానము లేదు. పెద్ద-పెద్ద తత్వవేత్తలు మొదలైనవారు ఎంతోమంది ఉన్నారు కానీ ఈ జ్ఞానము ఎవ్వరిలోనూ లేదు. నిరాకారుడైన గాడ్ ఫాదర్ చదివించడానికి వస్తారని, మనము వారి నుండి చదువుకుంటున్నామని ఈ విషయాలు విని వారు (విదేశీయులు) ఆశ్చర్యపోతారు. ఈ విషయాలను వారు ఎప్పుడూ ఎక్కడా వినలేదు, చదవలేదు. మీరు వారికి చెప్పండి - ఒక్క తండ్రినే ముక్తిప్రదాత, మార్గదర్శకుడు అని అంటారు, వారే ముక్తిప్రదాత అన్నప్పుడు మరి మీరు క్రైస్టును ఎందుకు తలచుకుంటారు? ఈ విషయాలను బాగా అర్థం చేయించినట్లయితే వారు ఆశ్చర్యపోతారు. ఈ విషయాలను ఒకసారి విని చూద్దాము అని వారు అంటారు. స్వర్గ స్థాపన జరుగుతోంది, దాని కొరకే ఈ మహాభారత యుద్ధము కూడా ఉంది. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా, ద్వికిరీటధారులుగా తయారుచేస్తాను. అక్కడ పవిత్రత, శాంతి, సమృద్ధి అన్నీ ఉండేవి. అది గడిచి ఎన్ని సంవత్సరాలయ్యిందో ఒక్కసారి ఆలోచించండి. క్రైస్టుకు ముందు మూడు వేల సంవత్సరాల క్రితం వీరి రాజ్యము ఉండేది కదా. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము అని వారు అంటారు. ఇతను అయితే డైరెక్ట్ ఆ సుప్రీమ్ తండ్రికి సంతానము, వారి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. సృష్టి యొక్క చరిత్ర, భౌగోళికము ఏ విధముగా రిపీట్ అవుతుంది అన్న జ్ఞానమంతా ఉంది. ఆత్మ అయిన మనలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఈ యోగము యొక్క శక్తితో ఆత్మలు సతోప్రధానముగా అయి స్వర్ణిమయుగములోకి వెళ్ళిపోతాయి, అప్పుడు ఆ ఆత్మల కొరకు రాజ్యము కావాలి, అలాగే పాత ప్రపంచపు వినాశనము కూడా జరగాలి, అది ఇప్పుడు ఎదురుగా ఉంది, ఇక తరువాత ఒకే ధర్మము యొక్క రాజ్యము ఉంటుంది. ఇది పాపాత్ముల ప్రపంచము కదా. ఇప్పుడు మీరు పావనముగా అవుతున్నారు. మీరు ఇలా చెప్పండి - ఈ స్మృతి బలముతో మేము పవిత్రముగా అవుతాము, మిగిలిన వారందరి వినాశనము జరుగుతుంది, ప్రకృతి వైపరీత్యాలు కూడా రానున్నాయి, ఇది మేము రియలైజ్ అయ్యాము మరియు దివ్యదృష్టితో చూసాము. ఇదంతా అంతమవ్వనున్నది. తండ్రి దైవీ ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. ఈ విషయాలు వింటే - ఓహో, వీరైతే ఆ గాడ్ ఫాదర్ పిల్లలే అని అంటారు. ఈ యుద్ధము జరిగి తీరుతుందని, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని పిల్లలైన మీకు తెలుసు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ పెద్ద-పెద్ద భవనాలన్నీ కూలిపోవడం మొదలవుతాయి. ఈ బాంబులు మొదలైనవాటన్నింటినీ ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా తమ వినాశనం కొరకే వారు తయారుచేసారని మీకు తెలుసు. ఇప్పుడు కూడా బాంబులు తయారుగా ఉన్నాయి. ఏ యోగబలము ద్వారానైతే మీరు విశ్వముపై విజయాన్ని పొందుతారో, ఆ యోగబలము ఏమిటి అనేది ఇంకెవ్వరికీ తెలియదు. మీరు చెప్పండి - సైన్స్ మిమ్మల్నే వినాశనము చేస్తుంది, మాకు తండ్రితో యోగము ఉంది కావున ఆ సైలెన్స్ బలముతో మేము విశ్వముపై విజయాన్ని పొంది సతోప్రధానముగా అయిపోతాము. తండ్రియే పతిత-పావనుడు. వారు తప్పకుండా పావన ప్రపంచాన్ని స్థాపన చేసే తీరుతారు. డ్రామానుసారముగా ఇది నిశ్చితమై ఉంది. వారు తయారుచేసిన బాంబులను దాచుకుని పెట్టుకోరు కదా. ఈ విధముగా అర్థం చేయించినట్లయితే - ఇక్కడ ఎవరో అథారిటీ ఉన్నారు, వీరిలోకి స్వయముగా భగవంతుడే వచ్చి ప్రవేశించారు అని వారు భావిస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇటువంటి విషయాలను వినిపిస్తూ ఉన్నట్లయితే వారు సంతోషిస్తారు. ఆత్మలో పాత్ర ఏ విధముగా ఉంది, ఇది కూడా అనాదిగా తయారై, తయారుచేయబడిన డ్రామా. మళ్ళీ తన సమయానికి క్రైస్టు వచ్చి మీ ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ విధముగా అథారిటీతో వినిపించినట్లయితే - తండ్రి పిల్లలందరికీ కూర్చుని అర్థం చేయిస్తున్నారని వారు అర్థం చేసుకుంటారు. ఈ చదువులో పిల్లలు నిమగ్నమైపోవాలి. తండ్రి, టీచరు మరియు గురువు, ముగ్గురూ ఒక్కరే. వారు ఏ విధముగా జ్ఞానాన్ని ఇస్తారు అనేది కూడా మీరు అర్థం చేసుకుంటారు. వారు అందరినీ పవిత్రముగా తయారుచేసి తనతోపాటు తీసుకునివెళ్తారు. దైవీ రాజ్యము ఉన్నప్పుడు పవిత్రముగా ఉండేవారు. దేవీ-దేవతలుగా ఉండేవారు. ఈ విధముగా మాట్లాడటములో చాలా చురుకుగా ఉండాలి, స్పీడ్ కూడా బాగుండాలి. మిగిలిన ఆత్మలన్నీ స్వీట్ హోమ్ లో ఉంటాయి అని చెప్పండి. తండ్రియే అక్కడికి తీసుకువెళ్తారు. సర్వులకు సద్గతిదాత ఆ తండ్రి ఒక్కరే. వారి జన్మస్థలము భారత్. ఇది ఎంత గొప్ప తీర్థ స్థలమయ్యింది.

అందరూ తమోప్రధానముగా అవ్వవలసిందేనని మీకు తెలుసు. పునర్జన్మలు అందరూ తీసుకోవలసిందే, ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఈ విధమైన విషయాలను అర్థం చేయించినట్లయితే వారు చాలా ఆశ్చర్యపోతారు. బాబా అంటారు - యుగళులు ఇద్దరూ జంటగా కలిసి ఉన్నట్లయితే చాలా బాగా అర్థం చేయించవచ్చు. భారత్ లో మొదట పవిత్రత ఉండేది, ఆ తరువాత అపవిత్రముగా ఎలా అవుతారో, అది కూడా తెలియజేయవచ్చు. పూజ్యులే పూజారులుగా అయిపోతారు. అపవిత్రముగా అవ్వడముతో ఇక తమను తామే పూజించుకోవడం మొదలుపెడతారు. రాజుల ఇళ్ళల్లో కూడా ఈ దేవతల చిత్రాలు ఉంటాయి. పవిత్రులైన, ద్వికిరీటధారులైన దేవతలను అపవిత్రులైన, కిరీటములేనివారు పూజిస్తూ ఉంటారు. వారు పూజారులైన రాజులు, వారిని దేవీ-దేవతలు అని అనరు ఎందుకంటే వారు కూడా ఈ దేవతలను పూజిస్తూ ఉంటారు. తామే పూజ్యులుగా, తామే పూజారులుగా, పతితులుగా అవ్వడముతో రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. ఈ సమయములో రావణ రాజ్యము ఉంది. ఈ విధముగా కూర్చుని అర్థం చేయించినట్లయితే వారు ఎంతో ఆనందిస్తారు. బండికి రెండు చక్రాల వలె, జంటగా వెళ్ళి అర్థం చేయించినట్లయితే చాలా అద్భుతము చేసి చూపించగలుగుతారు. పతి-పత్ని అయిన మేమే మళ్ళీ పూజ్యులుగా అవుతాము, మేము పవిత్రత, సుఖము, సమృద్ధి యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని చెప్పండి. మీ చిత్రాలు కూడా తయారవుతూ ఉంటాయి. ఇది ఈశ్వరీయ పరివారము. తండ్రికి మీరు పిల్లలు, అలాగే మనువలు, మనువరాళ్ళు కూడా, అంతే, ఇంకే సంబంధమూ లేదు. కొత్త సృష్టి అని దీనినే అంటారు. దేవీ-దేవతలుగా అయితే కొద్దిమందే అవుతారు, ఆ తరువాత మెల్లమెల్లగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ జ్ఞానము ఎంతగా అర్థం చేసుకోవలసినది. ఈ బాబా కూడా వ్యాపారములో నవాబు వలె ఉండేవారు. ఏ విషయము యొక్క చింతా ఉండేది కాదు. స్వయముగా ఆ తండ్రియే ఇప్పుడు చదివిస్తున్నారని అర్థం చేసుకున్నాక, వినాశనము ఎదురుగా ఉందని గమనించాక వెంటనే అంతా వదిలేసారు. నాకు రాజ్యాధికారము లభిస్తుంది కావున ఇక ఈ గాడిదతనమును ఏం చేసుకోను అని తప్పకుండా అర్థం చేసుకున్నారు. భగవంతుడు చదివిస్తున్నారు అని మీరు కూడా అర్థం చేసుకున్నారు కావున మరి పూర్తిగా చదువుకోవాలి కదా. వారి మతముపై నడవాలి. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. మీరు తండ్రిని మర్చిపోతున్నారే, మీకు సిగ్గుగా అనిపించడం లేదా, ఆ నషా ఎక్కడము లేదు. ఇక్కడ చాలా బాగా రిఫ్రెష్ అయి వెళ్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తరువాత సోడా నీరులా అయిపోతారు. ఇప్పుడు పిల్లలైన మీరు పల్లె-పల్లెలోనూ సేవ చేసేందుకు పురుషార్థము చేస్తారు. తండ్రి అంటారు, ఆత్మలకు తండ్రి ఎవరు అన్న విషయాన్ని మొట్టమొదట తెలియజేయండి. భగవంతుడైతే నిరాకారుడే, వారే ఈ పతిత ప్రపంచాన్ని పావనముగా తయారుచేస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయముగా భగవంతుడే సుప్రీమ్ టీచరుగా అయి చదివిస్తున్నారు, అందుకే బాగా చదువుకోవాలి, వారి మతముపై నడవాలి.

2. తండ్రితో యోగాన్ని ఏ విధముగా జోడించాలంటే, దాని ద్వారా సైలెన్స్ బలము జమ అవ్వాలి. సైలెన్స్ బలము ద్వారా విశ్వముపై విజయము పొందాలి, పతితుల నుండి పావనులుగా అవ్వాలి.

వరదానము:-
సమయాన్ని మరియు సంకల్పాలను సేవలో అర్పణ చేసే విధాత, వరదాతా భవ

ఇప్పుడు స్వయానికి సంబంధించిన చిన్న-చిన్న విషయాల వెనుక, తనువు వెనుక, మనసు వెనుక, సాధనాల వెనుక, సంబంధాలను నిర్వర్తించడం వెనుక సమయాన్ని మరియు సంకల్పాలను వినియోగించేందుకు బదులుగా వాటిని సేవలో అర్పణ చేయండి, ఈ సమర్పణ సమారోహాన్ని జరపండి. శ్వాసశ్వాసలోనూ సేవా లగనము ఉండాలి, సేవలో మగనమై ఉండండి, అలా సేవలో వినియోగించడము ద్వారా స్వ ఉన్నతి అనే కానుక స్వతహాగానే ప్రాప్తిస్తుంది. విశ్వ కళ్యాణములో స్వ కళ్యాణము ఇమిడి ఉంది, అందుకే నిరంతర మహాదానులుగా, విధాతలుగా మరియు వరదాతలుగా అవ్వండి.

స్లోగన్:-
మీ కోరికలను తగ్గించుకున్నట్లయితే సమస్యలు తగ్గిపోతాయి.

అవ్యక్త ప్రేరణలు - సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి

లౌకిక రీతిలో ఎవరైనా ఎవరి స్నేహములోనైనా లవలీనులై ఉన్నట్లయితే వారి ముఖము ద్వారా, నయనాల ద్వారా, మాటల ద్వారా - వీరు లవలీనులై ఉన్నారు, ప్రేమికులై ఉన్నారు అని తెలుస్తుంది, అలాగే ఏ సమయములోనైతే స్టేజ్పైకి వస్తారో, అప్పుడు ఎంతగానైతే మీలో తండ్రి స్నేహము ఇమర్జ్అయ్యి ఉంటుందో అంతగానే మీ స్నేహ బాణాలు ఇతరులను కూడా స్నేహములో గాయపరుస్తాయి.