22-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - విశాల బుద్ధి కలవారిగా అయి
పెద్ద-పెద్దవారి అభిప్రాయాలను తీసుకుని అనేకాత్మల కళ్యాణము చేయండి, వారి నుండి
హాల్స్ మొదలైనవి తీసుకుని చాలా ప్రదర్శనీలను ఏర్పాటు చేయండి’’
ప్రశ్న:-
ఇప్పుడు మీకు
ఏ స్మృతి కలిగింది, దానిని స్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే ఎప్పుడూ దుఃఖితులుగా అవ్వరు?
జవాబు:-
ఇప్పుడు ఏ
స్మృతి కలిగిందంటే - మేము పూజ్య రాజులుగా ఉండేవారము, తర్వాత నిరుపేదలుగా అయ్యాము.
ఇప్పుడు మళ్ళీ బాబా మమ్మల్ని రాజులుగా తయారుచేస్తున్నారు. బాబా ఇప్పుడు మాకు మొత్తము
విశ్వము యొక్క సమాచారాన్ని వినిపిస్తున్నారు, మేము ప్రపంచ చరిత్ర-భౌగోళికాల గురించి
తెలుసుకున్నాము. ఈ స్మృతులను స్మరించుకుంటూ ఉన్నట్లయితే ఎప్పుడూ స్వయాన్ని
దుఃఖితులుగా భావించరు. సదా సంతోషముగా ఉంటారు.
పాట:-
నయనహీనులకు
మార్గము చూపించండి ప్రభూ...
ఓంశాంతి
మధురాతి మధురమైన, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు.
తండ్రిని కలుసుకోవడము మరియు తండ్రి నుండి వారసత్వము తీసుకోవడము చాలా సహజమని పిల్లలు
అర్థం చేసుకుంటారు. తండ్రి నుండి ఒక్క సెకండులో జీవన్ముక్తి యొక్క వారసత్వము
లభిస్తుందని అంటూ ఉంటారు. జీవన్ముక్తి అనగా సుఖము, శాంతి, సంపద మొదలైనవాటి వారసత్వము.
ఇప్పుడు జీవన్ముక్తి మరియు జీవన బంధనము అనేవి రెండు పదాలు. ఈ సమయములో భక్తి మార్గము
మరియు రావణ రాజ్యము ఉన్న కారణముగా అందరూ జీవన బంధనములో ఉన్నారని పిల్లలకు తెలుసు.
తండ్రి వచ్చి బంధనాల నుండి ముక్తులుగా చేస్తారు, వారసత్వాన్ని ఇస్తారు. కొడుకు
జన్మించగానే తల్లిదండ్రులు, మిత్ర-సంబంధీకులు మొదలైనవారు వారసుడు జన్మించాడని
భావిస్తారు. ఇలా భావించడము ఎంత సహజమో, అలా అది కూడా సహజమే. పిల్లలంటారు - బాబా!
కల్పక్రితం వలె మీరు వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు. మీ నుండే వారసత్వాన్ని పొందే
సహజమైన మార్గము లభించింది. కొత్త సృష్టి రచయిత భగవంతుడేనని ప్రతి ఒక్కరికీ తెలుసు.
వారు మనల్ని భ్రమించడము నుండి రక్షిస్తారు. నిన్న భక్తి చేసేవారము, ఈ రోజు తండ్రి
నుండి సహజ జ్ఞానము మరియు రాజయోగము యొక్క మార్గము లభించింది. మేము బి.కె.ల ద్వారా
ఇద్దరు తండ్రులుంటారని విన్నామని పిల్లలు తమ అనుభవాన్ని వినిపిస్తారు. ఇద్దరు
తండ్రులుంటారని మీరు తప్ప ఇంకెవరూ నోటితో చెప్పలేరు. మీ ప్రతి విషయము అద్భుతమైనదే.
ఇప్పుడు స్మృతి కలుగుతుంది. ఎవరైతే ఇక్కడికి చెందినవారో, వారికి వెంటనే స్మృతి
కలుగుతుంది. అయితే, స్మృతి కలిగినవారికి కూడా మాయ ఏదో ఒక సమయములో గట్టిగా చెంపదెబ్బ
వేసి విస్మృతి కలిగిస్తుంది. ఇందులో పిల్లలు చాలా అప్రమత్తముగా ఉండాలి. తండ్రియే
స్మృతినిప్పించారు. పవిత్రతా కంకణాన్ని కూడా పూర్తిగా కట్టుకోవాలి. రక్షాబంధన
రహస్యమేమిటి అనేది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఈ ప్రతిజ్ఞను ఎవరు చేయించారు. కామము
మహాశత్రువు. తండ్రి అంటారు - ఎప్పుడూ పతితముగా అవ్వను అని నాకు ప్రతిజ్ఞ చేయండి
మరియు నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అర్ధకల్పము యొక్క పాపాలు కాలిపోయి
సమాప్తమైపోతాయి. తండ్రి గ్యారంటీ ఇస్తారు. తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు అంటే ఈ
విషయము సరైనదే కదా అని పిల్లలు అర్థం చేసుకుంటారు కూడా. కంసాలి కూడా ఏమని గ్యారంటీ
ఇస్తారు, నేను పాత ఆభరణాన్ని కొత్తదిగా చేస్తానని చెప్తారు. అతని పనే అది. అగ్నిలో
వేయడముతో అది తప్పకుండా స్వచ్ఛమైన బంగారముగా అవుతుంది. అలా ఆత్మలో కూడా మాలిన్యము
చేరిందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. సతో, రజో, తమోలలోకి ఎలా వస్తారు అనేది అర్థం
చేయించడము చాలా సులభము. చిత్రాలు కూడా సహజముగా అర్థం చేయించగలిగేందుకని
తయారుచేయబడ్డాయి. యూనివర్శిటీలు, కాలేజీలు మొదలైనవాటిలో కూడా అనేక రకాల మ్యాపులు (చిత్రపటాలు)
ఉంటాయి కదా. అలాగే ఇవి కూడా మీకు మ్యాపుల వంటివి. మీరు ఎవరికైనా మంచి రీతిలో అర్థం
చేయించగలరు. జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడైన తండ్రియే వచ్చి ఈ మార్గాన్ని
తెలియజేస్తారు. ఇంకెవ్వరూ పతితులను పావనముగా చేయలేరు. మనుష్యులు నయనహీనులుగా,
దుఃఖితులుగా ఉన్నారు. మొదటి రెండు యుగాలలో దుఃఖము ఉండదని, అలాగే భక్తి కూడా ఉండదని
పిల్లలైన మీకు తెలుసు. అది ఉన్నదే స్వర్గము. భారత్ లో ఈ సమయములో ఉన్న మనుష్యులకు
మరియు భారత్ లో ప్రాచీన కాలములోని మనుష్యులకు తేడా ఉంది కదా. కానీ ఈ విషయాన్ని
ఇంకెవ్వరూ అర్థం చేసుకోరు. ఎన్ని పూజలు జరుగుతుంటాయి. ఎవరు ఎంతగా షావుకారులుగా
ఉంటారో, అంతగా దేవీ-దేవతలకు మంచి ఆభరణాలను వేస్తారు. ఈ విషయములో బాబా స్వయం
అనుభవజ్ఞులు. బొంబాయిలో లక్ష్మీ-నారాయణుల మందిరము ఏదైతే ఉందో, దాని యొక్క ట్రస్టీ
లక్ష్మీ-నారాయణుల కోసం వజ్రాల హారాన్ని తయారుచేయించారు. బాబాకు ఆ ట్రస్టీ పేరు కూడా
గుర్తుంది. ముందు శివబాబా మందిరాన్ని తయారుచేసారు, అప్పుడు దానిని చాలా అలంకరించారు.
ఆ తర్వాత దేవతల మందిరాలను తయారుచేసారు, అప్పుడు లక్ష్మీ-నారాయణులు మొదలైనవారికి కూడా
ఎన్ని ఆభరణాలను వేసారు. ఆ సమయములో ఎంత ధనముండి ఉంటుంది. మహమ్మద్ గజనీ ఎన్ని ఒంటెలను
నింపుకుని తీసుకువెళ్ళారు. భారత్ లో ఎంత అపారమైన ధనముండేది. ఇప్పుడు మీరు యథార్థ
రీతిలో అర్థం చేసుకుంటారు. మన భారత్ ఎలా ఉండేది! మన భారత్ లో కుబేర ఖజానా ఉండేది.
వజ్ర-వైఢూర్యాలతో కూడిన మందిరాలను తయారుచేసేవారు. ఇప్పుడు ఆ వస్తువులేవీ లేవు,
అన్నింటినీ దోచుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడింది.
మీరే పూజ్యులైన రాజులుగా ఉండేవారు, తర్వాత మీరే 84 జన్మలు తీసుకుని పూర్తిగా
పేదవారిగా అయ్యారు. ఇటువంటి విషయాలను పదే-పదే స్మరించుకుంటూ ఉండాలి. అప్పుడిక మీరు
ఎప్పుడూ మిమ్మల్ని మీరు దుఃఖితులుగా భావించరు. మేము బాబా నుండి ఏం తీసుకుంటున్నాము
అని మనసులో స్మరించుకుంటూ ఉంటారు. తండ్రి వచ్చి మనకు మొత్తం విశ్వమంతటి సమాచారాన్ని
వినిపిస్తారు. ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికాల గురించి ఎవ్వరికీ తెలియదు. మొదట ఒకే ధర్మము,
ఒకే రాజ్యము, ఒకే మతము, ఒకే భాష ఉండేవని మీకు తెలుసు. అందరూ సుఖముగా ఉండేవారు. ఆ
తర్వాత అంతా పరస్పరములో కొట్లాడుకోవడము-గొడవపడడము మొదలుపెట్టారు మరియు భారత్
ముక్కలు-ముక్కలుగా అయిపోవడము మొదలయ్యింది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. అక్కడ ఏ
రకమైన దుఃఖము ఉండేది కాదు. అనారోగ్యము యొక్క నామ-రూపాలే ఉండేవి కావు. దాని పేరే
స్వర్గము. ఇప్పుడు మీకు స్వయం యొక్క స్మృతి కలిగింది. తప్పకుండా కల్ప-కల్పము మనకు
విస్మృతి కలుగుతుంది, తర్వాత స్మృతిలోకి వస్తుంది. ముందు ఒకే ఒక పొరపాటు జరిగింది,
అదేమిటంటే రచయిత మరియు రచనలను మర్చిపోయారు. ఇప్పుడు మీకు ఆదిమధ్యాంతాల గురించి
తెలుసు. సత్యయుగములో కూడా ఈ జ్ఞానముండదు అన్నప్పుడు అది పరంపరగా ఎలా నడవగలదు. ఆ
సమయములో రాజులే ముఖ్యులుగా ఉండేవారు. ఋషులు, మునులు ఉండేవారు కాదు. వారు ద్వాపరము
నుండి వస్తారు. ఋషులు, మునులు మొదలైనవారికి ఆహార-పానీయాలు కూడా రాజుల నుండే
లభిస్తాయి. వారిని రాజులే చూసుకుంటారు ఎందుకంటే ఎంతైనా సన్యాసము చేస్తున్నారు కదా.
ప్రాచీన భారత్ యొక్క ప్రాచీన రాజయోగము అని అంటూ ఉంటారు. ప్రాచీన ఋషులు, మునులు అని
అనరు. వారు ద్వాపరములోనే వస్తారు. వారు రాజుల ఆధారముపై నడుస్తారు. మాకు రచయిత మరియు
రచనల గురించి తెలియదని అంటారు. ఇది స్వయంగా రాజులకు కూడా తెలియదని తండ్రి అంటారు. ఈ
ప్రపంచములో ఎవ్వరికీ ఈ జ్ఞానము గురించి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు
తెలివైనవారిగా అయ్యారు. ఎవరైతే లక్ష్మీ-నారాయణుల మందిరాలను తయారుచేస్తారో, వారికి
మీరు ఇలా వ్రాయవచ్చు - ఇన్ని లక్షల రూపాయలను ఖర్చు చేసి మందిరాలను నిర్మించారు, కానీ
వారి జీవిత కథ గురించి మీకు తెలుసా? వారు రాజ్యాన్ని ఎలా పొందారు, తర్వాత ఎక్కడికి
వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎక్కడున్నారు, మేము మీకు అన్ని రహస్యాలను తెలపగలమని వారికి
మీరు వ్రాయవచ్చు. పిల్లలైన మీరైతే ప్రతి ఒక్కరి జీవిత కథ గురించి తెలుసుకున్నారు
కనుక ఎందుకు వ్రాయకూడదు. మాకు సమయమిస్తే మేము ఒక్కొక్కరి జీవిత కథ గురించి
తెలియజేస్తాము. ఇలా శివుని మందిరాలను తయారుచేసేవారికి కూడా మీరు వ్రాయవచ్చు. బనారస్
లో శివుని మందిరము ఎంత పెద్దది. అక్కడ కూడా ట్రస్టీలు ఉంటారు. పెద్ద-పెద్దవారికి
అర్థం చేయించేందుకు ప్రయత్నించాలి. పెద్ద వ్యక్తులు అర్థం చేసుకుంటే వారి ద్వారా
వచ్చే శబ్దము బాగా వ్యాపిస్తుంది. పేదవారు వెంటనే వింటారు. పెద్దవారి సహాయము
తీసుకోవాలి. అభిప్రాయాలు కూడా పెద్దవారి చేత వ్రాయించాలి ఎందుకంటే వారి మాట కూడా
సహాయము చేస్తుంది. వాస్తవానికి వారు ఎంత శబ్దాన్ని వ్యాపింపజేయాలో, అంత చేయడము లేదు.
మీరు ప్రెసిడెంటుకు కూడా అర్థం చేయిస్తారు. బాగుంది, బాగుంది అని కూడా అంటారు. చీఫ్
మినిస్టర్, గవర్నర్ మొదలైనవారు ప్రారంభోత్సవము చేసినప్పుడు - ఈ బి.కె.లు ఈశ్వరుడిని
కలుసుకునేందుకు చాలా మంచి సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారని వ్రాస్తారు. కానీ
ఈశ్వరుడు ఎవరు అనేది ఏమీ అర్థం చేసుకోరు. కేవలం ఆ సమయములో, ఇది చాలా మంచి మార్గమని,
శాంతి పొందడానికి ఇది మంచి మార్గమని అంటారు. కానీ స్వయం అర్థం చేసుకోరు.
బాబా పెద్ద-పెద్దవారికి అర్థం చేయించమని కూడా చెప్తారు. పెద్ద-పెద్ద వ్యక్తుల నుండి
ప్రసిద్ధి గాంచిన పెద్ద-పెద్ద హాళ్లు తీసుకోండి. మేము మనుష్యులందరి కళ్యాణము కోసం ఈ
ప్రదర్శనీని సదా కోసం పెట్టాలనుకుంటున్నామని వారికి చెప్పండి. కేవలం అడ్వర్టైజ్
చేయవలసి ఉంటుంది. ఈ విధముగా 50 లేక 100 హాళ్లు తీసుకోవాలి. భారత్ అయితే చాలా పెద్దది
కదా. ఒక్కొక్క పట్టణములో 10-12 హాళ్లు తీసుకోండి. ఇన్ని హాళ్లలో ప్రదర్శనీలు
జరుగుతున్నాయి, తెలుసుకోవాలనుకునే వారు వచ్చి తెలుసుకోండి అని పత్రికలలో ముద్రించాలి.
అప్పుడు ఎంతమంది కళ్యాణము జరుగుతుంది. పిల్లలు చాలా విశాల బుద్ధి కలవారిగా అవ్వాలి.
సేవను పిల్లలు చేయాలి కదా. ప్రదర్శనీలను చాలా ఎక్కువగా చేయండి అని తండ్రి
పిల్లలందరికీ చెప్తారు. బాబా ఏర్పాట్లు చేయిస్తున్నారు. పిల్లలు ప్రయత్నము చేయాలి.
ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భగవంతుడు వస్తారు, ప్రజాపిత బ్రహ్మా ద్వారా
ప్రజలు అనే రచనను రచిస్తారు కనుక తప్పకుండా ఎంతమంది బ్రాహ్మణులను రచించి ఉంటారు.
ఇప్పుడు మళ్ళీ రచిస్తున్నారు. ఎంతమంది బ్రాహ్మణ-బ్రాహ్మణీలు ఉన్నారు. బాబా ఈ
బ్రాహ్మణ ధర్మాన్ని సంగమములో రచిస్తారు. మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నారు మరియు
అర్థం చేసుకుంటున్నారు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. పతిత ప్రపంచము పావనముగా
అవ్వాల్సి ఉన్నప్పుడే బాబా వస్తారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. పరమాత్మ
ప్రజాపిత బ్రహ్మా ద్వారానే రచనను రచిస్తారని కూడా మీకు తెలుసు. కానీ ఎప్పుడు
రచిస్తారు అనేది అర్థం చేసుకోరు. ఏదో కొత్త రచనను రచిస్తూ ఉండవచ్చని వారు భావిస్తారు.
బ్రహ్మా గురించి, వారు సూక్ష్మవతనములో ఉంటారన్నట్లుగా భావిస్తారు. ప్రజాపిత బ్రహ్మా
అయితే ఇక్కడే ఉన్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరు సూక్ష్మవతనములోకి
వెళ్తారు. పవిత్రముగా అయి, ఫరిశ్తాలుగా అయిపోతారు. సాక్షాత్కారాలు పొందుతారు. అక్కడ
మూవీ నడుస్తుందని పిల్లలు వచ్చి వినిపిస్తారు. అది ఉన్నదే మూవీ ప్రపంచము (సైగల
ప్రపంచము), మీరు మూవీ బయోస్కోప్ ను (సైగల సినిమా) కూడా చూసారు. ఇప్పుడు మీరు
ప్రాక్టికల్ గా అన్ని విషయాలను తెలుసుకున్నారు. మూలవతనము సైలెన్స్ ప్రపంచము, అక్కడ
ఆత్మలు నివసిస్తాయి. సూక్ష్మవతనములో సూక్ష్మ శరీరాలు కూడా ఉంటాయి కనుక తప్పకుండా
అక్కడ ఏదో ఒక భాష కూడా ఉంటుంది. ఆత్మలమైన మన స్థానము శాంతిధామమని పిల్లలైన మీ
బుద్ధిలో ఉంది. తర్వాత సూక్ష్మవతనము ఉంటుంది. అక్కడ బ్రహ్మా-విష్ణు-శంకరులు ఉంటారు.
ఇది కలియుగము మరియు సత్యయుగము యొక్క సంగమము. ఇక్కడికి తండ్రి వస్తారు, ఇక్కడ నుండి
బ్రాహ్మణులైన మీరు వెళ్తారు. పుట్టినిల్లు మరియు అత్తవారిల్లు ఉంటాయి కదా. ఇక్కడ
వీరివురూ మీ తండ్రులే. పిల్లలను పుష్పాలుగా తయారుచేయడానికి బాప్ దాదా, ఇరువురూ
శ్రమిస్తారు. గార్డెన్ ఆఫ్ అల్లాహ్ అని ముస్లింలు కూడా అంటారు. కరాచీలో ఒక పఠాన్
ఉండేవారు - అతను ఎదురుగా నిలబడేవారు - బాబాను చూస్తూ-చూస్తూ కింద పడిపోయేవారు.
అతడిని అడిగితే, నేను ఖుదా యొక్క పూలతోటలోకి వెళ్ళాను, ఖుదా నాకు పుష్పమిచ్చారు అని
చెప్పేవారు. ఇప్పుడు, అతనికి జ్ఞానమైతే లేదు. పూలతోట అని దేనినంటారు అనేది ఇప్పుడు
మీరు అర్థం చేసుకున్నారు. ఇది ముళ్ళ అడవి మరియు అది పూలతోట. మీ బుద్ధిలో అన్ని
రహస్యాలు ఉన్నాయి. సత్యయుగమంటే ఏమిటి, కలియుగమంటే ఏమిటి... మీకు చాలా సంతోషము కలగాలి.
మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. దీని విస్తారము చాలా ఉంది. మీ బుద్ధిలో ఎంత
క్లుప్తముగా కూర్చుని ఉంది.
పిల్లలైన మీరు రచయిత అయిన తండ్రి ద్వారా రచయిత మరియు రచనల గురించి తెలుసుకున్నారు.
బ్రహ్మాను రచయిత అని అనరు. రచయిత ఒక్కరే, గొప్పతనము కూడా ఆ ఒక్కరిదే. మొట్టమొదటి
రచన బ్రహ్మాది, ఆ తర్వాత శ్రీకృష్ణునిది. బ్రహ్మా అయితే ఉన్నారు, బ్రాహ్మణులు కూడా
తప్పకుండా కావాలి. పాండవులను బ్రాహ్మణులుగా భావించరు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులు
కావాలి. ఇది ఆత్మిక యజ్ఞము, దీనిని ఆధ్యాత్మిక జ్ఞానమని అంటారు. ఆత్మకు ఆ తండ్రియే
జ్ఞానాన్ని ఇస్తారు. మనల్ని మనుష్యులు చదివించడము లేదని మీకు తెలుసు. ఆత్మలందరినీ
తండ్రి చదివిస్తారు. బ్రహ్మా ద్వారా స్థాపన అని అంటారు కూడా. శ్రీకృష్ణుని ద్వారా
స్థాపన అని అనరు. అలా జరగదు కూడా. బ్రహ్మా ద్వారా స్థాపనను ఎవరు చేయిస్తారు?
శ్రీకృష్ణుడు చేయిస్తారా? కాదు. పరమపిత పరమాత్మ చేయిస్తారు. విష్ణువు ద్వారా పాలన
జరుగుతుంది. బ్రహ్మా మరియు విష్ణువులకు ఎంత పాత్ర ఉంది. బ్రహ్మా ముఖ వంశావళి
అయినవారే తర్వాత వెళ్ళి విష్ణుపురిలోని దేవతలుగా అవుతారు. బ్రహ్మా నుండి విష్ణువుగా,
విష్ణువు నుండి బ్రహ్మాగా అవుతారు. ఈ విషయము కూడా పిల్లలకు అర్థం చేయించారు -
బ్రహ్మా నుండి విష్ణువుగా అవ్వడానికి ఒక్క సెకండు పడుతుంది, విష్ణువు నుండి
బ్రహ్మాగా అవ్వడానికి 84 జన్మలు పడతాయి. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. ఎవ్వరూ అర్థం
చేసుకోలేరు. ఇవి అనంతమైన విషయాలు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన చదువును చదువుకుని
అనంతమైన రాజ్యాన్ని తీసుకోవాలి. సృష్టి చక్రాన్ని తెలుసుకోవాలి. ఆత్మయే శరీరము
ద్వారా తెలుసుకుంటుంది. అంతేకానీ, ఆత్మ ద్వారా శరీరము జ్ఞానము తీసుకుంటుందని కాదు.
అలా కాదు. ఆత్మ జ్ఞానము తీసుకుంటుంది. మీకు ఎంత సంతోషము ఉంది. ఈ ఆంతరిక గుప్తమైన
సంతోషముండాలి. చదువు యొక్క సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. దుఃఖము కూడా ఆత్మకే
కలుగుతుంది. నా ఆత్మను దుఃఖితముగా చేయకండి అని అంటారు. పిల్లలకు ఇప్పుడు ఎంతటి
ప్రకాశము లభిస్తూ ఉంది. మీకు సంతోషముంటుంది. సాగరుని ద్వారా రిఫ్రెష్ అయి మేఘాలన్నీ
కలిసి వర్షాన్ని కురిపించాలి. పరస్పరములో కలుసుకుని ప్రదర్శనీలు మొదలైనవి
తయారుచేయడములో సహాయము చేయండి, అభిరుచి ఉండాలి. సర్వీస్, సర్వీస్ మరియు సర్వీస్.
అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి ద్వారా లభించిన జ్ఞానాన్ని స్మరిస్తూ అపారమైన సంతోషములో ఉండాలి. విశాల
బుద్ధి కలవారిగా అయి చాలా ఎక్కువ సేవ చేయాలి.
2. తండ్రి ద్వారా ఏ స్మృతి అయితే లభించిందో, దానిని మర్చిపోకూడదు. పవిత్రముగా
ఉంటాము అని తండ్రితో ఏదైతే ప్రతిజ్ఞను చేసారో, దానిని పూర్తిగా నిర్వర్తించాలి.
వరదానము:-
అతీతత్వము యొక్క అభ్యాసము ద్వారా ఫరిశ్తా రూపాన్ని
సాక్షాత్కారము చేయించే నిరంతర సహజయోగీ భవ
ఏ విధముగా ఏవైనా వస్త్రాలను ధరించడము లేదా ధరించకపోవడము
అనేది మన చేతుల్లో ఉంటుందో, అటువంటి అనుభవము ఈ శరీరము రూపీ వస్త్రము విషయములో ఉండాలి.
ఏ విధముగా వస్త్రాన్ని ధరించి కార్యము చేస్తారు మరియు ఆ కార్యము పూర్తవ్వగానే
వస్త్రము నుండి వేరవుతారు. శరీరము మరియు ఆత్మ, ఈ రెండింటి అతీతత్వము
నడుస్తూ-తిరుగుతూ అనుభవమవ్వాలి - అప్పుడు నిరంతర సహజయోగులు అని అంటారు. ఈ విధముగా
డిటాచ్ (అతీతము) గా ఉండే పిల్లల ద్వారా అనేకాత్మలకు ఫరిశ్తా రూపము మరియు భవిష్య
రాజ్య పదవి యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. అంతిమములో ఈ సేవ ద్వారానే ప్రభావము
వెలువడుతుంది.
స్లోగన్:-
సంగమము యొక్క
ఒక్క క్షణాన్ని వ్యర్థముగా పోగొట్టుకున్నా, అది ఒక సంవత్సరాన్ని పోగొట్టుకోవడము
వంటిది.
అవ్యక్త ప్రేరణలు -
అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా)
అవ్వండి
బ్రాహ్మణ జీవితము
యొక్క ఆంతరిక వారసత్వము - సదా సుఖ స్వరూపము, శాంత స్వరూపము, మనసు యొక్క సంతుష్టత
ఏవైతే ఉన్నాయో, వీటిని అనుభవము చెయ్యటానికి మనసు యొక్క పవిత్రత కావాలి. అవి జమ
చేసుకునేందుకు విధి - మనసా-వాచా-కర్మణా పవిత్రత. పునాది పవిత్రత. సేవలలో సఫలతకు
ఆధారము కూడా పవిత్రత. సంకల్పములో మరియు మాటలలో వేరే ఏ భావము మిక్స్ అవ్వకూడదు.
భావములో కూడా పవిత్రత, భావనలో కూడా పవిత్రత ఉండాలి.