23-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మౌనముగా ఉండటము కూడా చాలా గొప్ప గుణము, మీరు మౌనముగా ఉంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే చాలా సంపాదనను జమ చేసుకుంటారు’’

ప్రశ్న:-
కర్మ సన్యాసాన్ని ఏ మాట ఋజువు చేస్తుంది, ఆ మాటను మీరు మాట్లాడలేరు?

జవాబు:-
డ్రామాలో ఉంటే చేస్తాములే - బాబా అంటారు, ఇది కర్మ సన్యాసము అయినట్లు. మీరు కర్మలైతే తప్పకుండా చేయాలి. పురుషార్థము లేకుండానైతే నీరు కూడా లభించదు, అందుకే డ్రామా అని అంటూ వదిలేయకూడదు. కొత్త రాజధానిలో ఉన్నత పదవిని పొందాలంటే బాగా పురుషార్థము చేయండి.

ఓంశాంతి
మొట్టమొదట పిల్లలకు అటెన్షన్ ఇవ్వడము జరుగుతుంది - తండ్రిని స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. మన్మనాభవ, ఈ పదాన్ని కూడా వ్యాసుడే వ్రాశారు. తండ్రి సంస్కృతములోనైతే అర్థం చేయించలేదు, తండ్రి అయితే హిందీలోనే అర్థం చేయిస్తారు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని పిల్లలకు చెప్తారు. ఓ పిల్లలూ, తండ్రినైన నన్ను స్మృతి చేయండి - ఇవి సహజమైన పదాలు. ఓ పిల్లలూ, మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని లౌకిక తండ్రి ఈ విధముగా చెప్పరు. ఇది కొత్త విషయము. తండ్రి అంటారు, ఓ పిల్లలూ, మీ నిరాకార తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఆత్మిక తండ్రి ఆత్మలైన మనతో మాట్లాడుతున్నారని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. ఆత్మిక తండ్రిని స్మృతి చేయడము మా బాధ్యత అని, అప్పుడే వికర్మలు వినాశనమవుతాయని పిల్లలకు తెలుసు అన్నప్పుడు, ఇక తండ్రిని స్మృతి చేయండి అని పదే-పదే వారికి చెప్పడము శోభించదు. పిల్లలు నిరంతరము స్మృతి చేసే ప్రయత్నము చేయవలసి ఉంటుంది. ఈ సమయములో ఎవ్వరూ నిరంతరము స్మృతి చేయలేరు, దానికి సమయము పడుతుంది. నేను కూడా నిరంతరము స్మృతి చేయలేను అని ఈ బాబా అంటారు. ఆ అవస్థ చివరికి ఏర్పడుతుంది. పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేసే పురుషార్థమునే మొట్టమొదట చేయాలి. శివబాబా నుండి వారసత్వము లభిస్తుంది, ఇది భారతవాసుల విషయమే. దైవీ రాజధాని యొక్క స్థాపన జరుగుతోంది. మిగతా ధర్మాలేవైతే స్థాపన చేస్తారో, వాటిని స్థాపన చేయడములో ఎటువంటి కష్టము ఉండదు, ఆ ధర్మ స్థాపకుల వెనుక ఆ ధర్మానికి చెందినవారు వస్తూనే ఉంటారు. ఇక్కడ ఎవరైతే దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు ఉన్నారో, వారిని జ్ఞానముతో మేలుకొలపవలసి ఉంటుంది, ఇందులో శ్రమ ఉంటుంది. తండ్రి సంగమములో రాజధానిని స్థాపన చేస్తారని గీత, భాగవతము మొదలైన శాస్త్రాలలో లేదు. గీతలో - పాండవులు పర్వతాలపైకి వెళ్ళిపోయారని, ప్రళయము జరిగిందని... మొదలైన విషయాలను వ్రాశారు. వాస్తవానికి అలా జరగలేదు. మీరు ఇప్పుడు భవిష్య 21 జన్మల కోసం చదువుకుంటున్నారు. ఇతర స్కూల్లలో ఇక్కడి కోసమే చదివిస్తారు. సాధు-సన్యాసులు మొదలైన వారందరూ భవిష్యత్తు కోసమే చదివిస్తారు ఎందుకంటే వారు - మేము శరీరాన్ని వదిలి ముక్తిధామానికి వెళ్ళిపోతామని, బ్రహ్మతత్వములో లీనమైపోతామని, ఆత్మ పరమాత్మలో కలిసిపోతుందని భావిస్తారు, అంటే అది కూడా భవిష్యత్తు కోసమే. కానీ వాస్తవానికి భవిష్యత్తు కోసం చదివించేది ఒక్క ఆత్మిక తండ్రి మాత్రమే, ఇతరులెవ్వరూ కాదు. సర్వుల సద్గతిదాత ఒక్కరేనని అంటూ ఉంటారు కూడా. కావున మిగతావన్నీ అయథార్థమైపోయినట్లు. ఈ విషయాలను తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. సన్యాసులు కూడా సాధన చేస్తూ ఉంటారు. బ్రహ్మతత్వములో లీనమయ్యే సాధన అయథార్థము. లీనమైతే ఎవ్వరూ అవ్వరు. బ్రహ్మ మహాతత్వము భగవంతుడేమీ కాదు. అదంతా రాంగ్. అసత్య ఖండములో అందరూ అసత్యము చెప్పేవారే ఉన్నారు. సత్య ఖండములో అందరూ సత్యము చెప్పేవారే ఉంటారు. భారత్ లో సత్య ఖండము ఉండేదని, ఇప్పుడు అసత్య ఖండము ఉందని మీకు తెలుసు. తండ్రి కూడా భారత్ లోనే వస్తారు. శివజయంతిని జరుపుకుంటారు కానీ శివుడు వచ్చి భారత్ ను సత్య ఖండముగా తయారుచేసారని వారికి తెలియదు. శివుడు రానే రారని, వారు నామ-రూపాలకు అతీతమైనవారని వారు భావిస్తారు. పతిత-పావనుడు, జ్ఞానసాగరుడు అని ఏ మహిమనైతే పాడుతారో, దానిని కేవలం చిలుక వలె పలుకుతారు. తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటారు, గీతా జయంతి కూడా ఉంది. శివుడు వచ్చి ఏమి చేస్తారు అని శివజయంతి గురించి ఎవ్వరికీ తెలియదు. వారు నామ-రూపాలకు అతీతమైనవారని అన్నప్పుడు మరి వారు ఎలా వస్తారు? తండ్రి అంటారు, నేనే కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తాను, ఇక తర్వాత ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది. నేను వచ్చి భారత్ ను మళ్ళీ స్వర్గముగా తయారుచేస్తానని తండ్రి స్వయముగా చెప్తున్నారు. పతిత-పావనుడు అనేవారు ఎవరో ఒకరైతే ఉంటారు కదా. ముఖ్యమైనది భారత్ యొక్క విషయమే. భారత్ యే పతితముగా ఉంది. పతిత-పావనుడిని కూడా భారత్ లోనే పిలుస్తారు. విశ్వములో ఆసురీ రాజ్యము నడుస్తుందని మనుష్యులు స్వయమే అంటారు. బాంబులు మొదలైనవి తయారుచేస్తూ ఉంటారు, వాటి ద్వారా వినాశనము జరగనున్నది, దాని కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారు రావణుడి ద్వారా ప్రేరేపించబడినట్లుగా ఉన్నారు. రావణుడి రాజ్యము ఎప్పుడు సమాప్తమవుతుంది. శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు సమాప్తమవుతుందని భారతవాసులు అంటారు. శివబాబా వచ్చి ఉన్నారని మీరు అర్థం చేయిస్తారు. వారే సర్వుల సద్గతిదాత. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. ఈ మాట ఇంకెవ్వరూ అనలేరు. నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యము తొలగిపోతుందని తండ్రియే అంటారు. మీరు సతోప్రధానముగా ఉండేవారు. ఇప్పుడు మీ ఆత్మలో మాలిన్యము చేరుకుంది, అది స్మృతి ద్వారానే తొలగుతుంది, దీనిని స్మృతియాత్ర అని అంటారు. నేనే పతిత-పావనుడను, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి, దీనిని యోగాగ్ని అని అంటారు. బంగారాన్ని అగ్నిలో వేసి దాని నుండి మాలిన్యాన్ని తొలగిస్తారు. బంగారములో మాలిన్యాన్ని కలిపేందుకు కూడా దానిని అగ్నిలో వేస్తారు. తండ్రి అంటారు - అది కామ చితి, ఇది జ్ఞాన చితి. ఈ యోగాగ్ని ద్వారానే మాలిన్యము తొలగుతుంది మరియు మీరు శ్రీకృష్ణపురిలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా అవుతారు. శ్రీకృష్ణజయంతి రోజున శ్రీకృష్ణుడిని పిలుస్తారు. శ్రీకృష్ణుడికి కూడా తండ్రి నుండి వారసత్వము లభిస్తుందని మీకు తెలుసు. శ్రీకృష్ణుడు స్వర్గానికి యజమానిగా ఉండేవారు, తండ్రి శ్రీకృష్ణునికి ఈ పదవిని ఇచ్చారు. రాధా-కృష్ణులే తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. రాధా-కృష్ణుల జన్మదినాన్ని జరుపుతారు. లక్ష్మీ-నారాయణుల గురించి ఎవ్వరికీ తెలియదు. మనుష్యులు పూర్తిగా తికమకలో ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు కావున ఇతరులకు అర్థం చేయించాలి. మొట్టమొదట ఇలా అడగాలి - నన్నొక్కరినే స్మృతి చేయండి అని గీతలో ఏదైతే చెప్పారో, అది ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు చెప్పారని వారు భావిస్తారు. మీరు భావిస్తారు - భగవంతుడు నిరాకారుడు, వారి ద్వారానే ఉన్నతమైన అనగా శ్రేష్ఠమైన మతము లభిస్తుంది అని. ఉన్నతోన్నతమైనవారు పరమపిత పరమాత్మయే, తప్పకుండా వారిదే శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతము. ఆ ఒక్కరి శ్రీమతము ద్వారానే సర్వుల సద్గతి జరుగుతుంది. గీతా భగవానుడు అని బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా అనలేరు. వారేమో శరీరధారి అయిన శ్రీకృష్ణుడిని గీతా భగవానుడని అంటారు. కనుక తప్పకుండా ఎక్కడో పొరపాటు జరిగిందని దీని ద్వారా ఋజువవుతుంది. మనుష్యులు పెద్ద పొరపాటు చేసారని మీరు అర్థం చేసుకుంటారు. రాజయోగాన్ని అయితే తండ్రి నేర్పించారు, వారే పతిత-పావనుడు. చాలా పెద్ద-పెద్ద పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యముగా వాటి గురించి చెప్పాలి. ఒకటేమో - ఈశ్వరుడిని సర్వవ్యాపి అని అనడము, రెండవది - గీతా భగవానుడు అని కృష్ణుడిని అనడము, కల్పము లక్షల సంవత్సరాలని అనడము - ఇవి చాలా పెద్ద పొరపాట్లు. కల్పము లక్షల సంవత్సరాలు కలదిగా ఉండదు. పరమాత్మ సర్వవ్యాపి కాలేరు. వారు ప్రేరణతో అన్నీ చేస్తారని అంటారు, కానీ అలా కాదు. ప్రేరణ ద్వారా పావనముగా తయారుచేయరు. నన్నొక్కరినే స్మృతి చేయండి అన్నది తండ్రి సమ్ముఖముగా కూర్చుని అర్థం చేయిస్తారు. ప్రేరణ అన్న పదము తప్పు. శంకరుని ప్రేరణతో బాంబులు మొదలైనవి తయారుచేస్తారని అంటారు కానీ అదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఈ యజ్ఞము ద్వారానే ఆ వినాశ జ్వాల వెలువడింది, ఎవ్వరూ ప్రేరేపించరు. వారు వినాశనము కోసం నిమిత్తముగా అయ్యారు, డ్రామాలో నిశ్చితమై ఉంది. శివబాబాదే మొత్తం పాత్ర, వారి తర్వాత బ్రహ్మా, విష్ణు, శంకరుల పాత్ర ఉంటుంది. బ్రహ్మా బ్రాహ్మణులను రచిస్తారు, వారే మళ్ళీ విష్ణుపురికి యజమానులుగా అవుతారు, ఆ తర్వాత 84 జన్మల చక్రములో తిరిగి వచ్చి మీరు బ్రహ్మా వంశీయులుగా అయ్యారు. లక్ష్మీ-నారాయణులే మళ్ళీ వచ్చి బ్రహ్మా-సరస్వతులుగా అవుతారు. వీరి (బ్రహ్మా) ద్వారా దత్తత తీసుకుంటారని కూడా మీకు అర్థం చేయించారు, అందుకే వీరిని పెద్ద తల్లి అని అంటారు. వీరు (మమ్మా) కూడా నిమిత్తమయ్యారు. కలశము మాతలకు ఇవ్వడము జరుగుతుంది. అందరికన్నా పెద్ద వీణను సరస్వతికి ఇచ్చారు, వారు అందరికన్నా చురుకైనవారు. ఇకపోతే, వీణ లేక వాయిద్యాలు మొదలైనవేవీ లేవు. సరస్వతి యొక్క జ్ఞాన మురళీ బాగుండేది. వారికి చాలా మహిమ ఉండేది, పేర్లు అయితే ఎన్నో పెట్టేసారు. దేవీలకు పూజలు జరుగుతాయి. ఇప్పుడు మీకు తెలుసు - మనమే ఇక్కడ పూజ్యులుగా అవుతాము, మళ్ళీ పూజారులుగా అయి మనల్ని మనమే పూజించుకుంటాము. ఇప్పుడు మనము బ్రాహ్మణులము, ఆ తర్వాత మనమే పూజ్య దేవీ-దేవతలుగా అవుతాము, యథా రాజా రాణి తథా ప్రజా. దేవీలలో ఎవరైతే ఉన్నత పదవిని పొందుతారో, వారికి మందిరాలు కూడా చాలా తయారవుతాయి, ఎవరైతే మంచి రీతిలో చదువుతారో మరియు చదివిస్తారో, పేరు కూడా వారిదే ప్రసిద్ధమవుతుంది. పూజ్యులుగా, పూజారులుగా మనమే అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. శివబాబా అయితే సదా పూజ్యులు. సూర్యవంశీ దేవీ-దేవతలుగా ఎవరైతే ఉండేవారో, వారే పూజారులుగా, భక్తులుగా అవుతారు. తామే పూజ్యులు, తామే పూజారులు అన్న విషయాన్ని తెలిపే మెట్ల వరుస చిత్రాన్ని చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తారు. చిత్రాలు లేకుండా కూడా మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఎవరైతే నేర్చుకుని వెళ్తారో, వారి బుద్ధిలో మొత్తము జ్ఞానమంతా ఉంటుంది. 84 జన్మల మెట్లను భారతవాసులే ఎక్కుతారు మరియు దిగుతారు, వారికి 84 జన్మలు ఉంటాయి. పూజ్యులుగా ఉండేవారము, మళ్ళీ మనమే పూజారులుగా అయ్యాము. హమ్ సో, సో హమ్ అర్థాన్ని కూడా మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఆత్మయే పరమాత్మ కాలేదు. తండ్రి హమ్ సో, సో హమ్ యొక్క అర్థాన్ని తెలియజేసారు. మనమే దేవతలుగా, క్షత్రియులుగా... అయ్యాము. హమ్ సో కు మరో అర్థమేమీ లేదు. పూజ్యులుగా, పూజారులుగా కూడా భారతవాసులే అవుతారు, ఇతర ధర్మాలలో ఎవ్వరూ పూజ్యులుగా, పూజారులుగా అవ్వరు. మీరే సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతారు. ఎంత మంచి వివరణ లభించింది. మనమే దేవీ-దేవతలుగా ఉండేవారము. ఆత్మలమైన మనము నిర్వాణధామములో నివసించేవారము. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. దుఃఖము ఎదురుగా వచ్చినప్పుడు తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రి అంటారు, నేను దుఃఖమయ సమయములోనే వచ్చి సృష్టిని మారుస్తాను. కొత్త సృష్టిని రచిస్తానని కాదు, అలా కాదు. పాతదానిని కొత్తదిగా చేయడానికి నేను వస్తాను. తండ్రి సంగమములోనే వస్తారు. ఇప్పుడు కొత్త ప్రపంచము తయారవుతోంది, పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. ఇది అనంతమైన విషయము.

మీరు తయారైనట్లయితే మొత్తము రాజధాని అంతా తయారైపోతుంది. కల్ప-కల్పము ఎవరు ఏ పదవిని పొందారో, దాని అనుసారముగా పురుషార్థము నడుస్తూ ఉంటుంది. అలాగని డ్రామాలో ఏ పురుషార్థము చేసి ఉంటే, అదే జరుగుతుందని కాదు. పురుషార్థము చేయవలసి ఉంటుంది, అప్పుడు - కల్పక్రితము కూడా ఇటువంటి పురుషార్థాన్నే చేసారని అంటారు. ఎల్లప్పుడూ పురుషార్థానికే ప్రాముఖ్యతను ఇవ్వడము జరుగుతుంది. ప్రారబ్ధముపై ఆధారపడి కూర్చుండిపోకూడదు. పురుషార్థము లేకుండా ప్రారబ్ధము లభించదు. పురుషార్థము చేయకుండా నీరు కూడా తాగలేరు. కర్మ సన్యాసము అన్న పదము తప్పు. తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారములో కూడా ఉండండి. బాబా అందరినీ ఇక్కడే కూర్చోబెట్టరు. శరణాగతి అని అంటూ ఉంటారు. భట్టీని ఏర్పాటు చేయవలసి వచ్చింది ఎందుకంటే వారిని విసిగిస్తూ ఉన్నారు, కావున వారు వచ్చి తండ్రి వద్ద శరణు తీసుకున్నారు. శరణు అయితే ఇవ్వవలసి ఉంటుంది కదా. శరణు ఒక్క పరమపిత పరమాత్మ నుండే తీసుకోవడము జరుగుతుంది. గురువులు మొదలైనవారి నుండి శరణు తీసుకోవడము జరగదు. చాలా దుఃఖము కలిగినప్పుడు, విసిగిపోయి వచ్చి శరణు తీసుకుంటారు. గురువుల వద్దకు ఎవరూ విసిగిపోయి వెళ్ళరు, అక్కడికైతే మామూలుగానే వెళ్తారు. మీరు రావణుడితో చాలా విసిగిపోయారు. రావణుడి నుండి విడిపించడానికి ఇప్పుడు రాముడు వచ్చారు. వారు మిమ్మల్ని శరణులోకి తీసుకుంటారు. బాబా, మేము మీ వారము అని మీరంటారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ కూడా మీరు శివబాబా శరణు తీసుకున్నారు. బాబా, మేము మీ మతముపైనే నడుస్తాము.

తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు - గృహస్థ వ్యవహారములో ఉంటూ నన్ను స్మృతి చేయండి, మిగిలిన వారందరి స్మృతిని విడిచిపెట్టండి. నా స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. కేవలం శరణు తీసుకునే విషయము కాదు. ఆధారమంతా స్మృతిపైనే ఉంది. తండ్రి తప్ప ఎవ్వరూ ఈ విధముగా అర్థం చేయించలేరు. ఇన్ని లక్షలమంది బాబా వద్దకు వచ్చి ఎక్కడ ఉంటారని పిల్లలు అనుకుంటారు. ప్రజలు కూడా తమ-తమ ఇళ్ళల్లో ఉంటారు, రాజు వద్ద ఉండరు. ఒక్కరినే స్మృతి చేయండి అని మీకు కేవలం ఇదే చెప్పడము జరుగుతుంది. బాబా, మేము మీ వారము, మీరే క్షణములో సద్గతి యొక్క వారసత్వాన్ని ఇస్తారు, రాజయోగాన్ని నేర్పించి రాజులకే రాజులుగా తయారుచేస్తారు. తండ్రి అంటారు, ఎవరైతే కల్పక్రితం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారో, వారే వచ్చి తీసుకుంటారు. చివరి కల్లా అందరూ వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మీరు పతితముగా ఉన్న కారణముగా, మిమ్మల్ని మీరు దేవతలుగా చెప్పుకోలేరు. తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. బాబా అంటారు, నా కంటి రత్నాల్లారా, మీరు సత్యయుగములోకి వచ్చినప్పుడు, మీరు 1-1 నుండి రాజ్యము చేస్తారు. ఇతరుల విషయములోనైతే, వృద్ధి జరిగి, జనాభా లక్షల సంఖ్యకు చేరుకున్నప్పుడు రాజ్యము మొదలవుతుంది. మీరు యుద్ధము చేయవలసిన అవసరము లేదు. మీరు యోగబలముతో తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మౌనముగా ఉంటూ కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. చివరిలో మీరు మౌనముగా ఉంటారు, అప్పుడు ఈ చిత్రాలు మొదలైనవి ఉపయోగపడవు. మీరు వివేకవంతులుగా అయిపోతారు. తండ్రి అంటారు - కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడిక చేయండి, చేయకపోండి, మీ ఇష్టము. ఏ దేహధారి నామ-రూపాల్లోనూ చిక్కుకోకూడదు. తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమ స్మృతిని బట్టి గతి ఏర్పడుతుంది, మీరు నా వద్దకు వచ్చేస్తారు. ఫుల్ పాస్ అయ్యేవారికి రాజ్యము లభిస్తుంది. అంతా స్మృతియాత్రపైనే ఆధారపడి ఉంది. మున్ముందు కొత్తవారు కూడా బాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ దేహధారి నామ-రూపాలలోనూ చిక్కుకోకూడదు. ఒక్క తండ్రి శ్రీమతముపై నడుస్తూ సద్గతిని పొందాలి. మౌనముగా ఉండాలి.

2. భవిష్య 21 జన్మల కోసం మంచి రీతిలో చదువుకోవాలి మరియు ఇతరులను చదివించాలి. చదువుకోవడము మరియు చదివించడముతోనే పేరు ప్రసిద్ధమవుతుంది.

వరదానము:-
మన్మతాన్ని, పరమతాన్ని సమాప్తము చేసి శ్రీమతము ఆధారముగా పదమాల సంపాదనను జమ చేసుకునే పదమాపదమ భాగ్యశాలీ భవ

శ్రీమతముపై నడిచేవారు ఒక్క సంకల్పాన్ని కూడా మన్మతము లేక పరమతము ఆధారముగా చెయ్యలేరు. స్థితి యొక్క స్పీడ్ ఒకవేళ తీవ్రముగా లేకపోతే తప్పకుండా శ్రీమతములో మన్మతమో లేక పరమతమో ఏదో ఒకటి కలుస్తుంది. మన్మతము అనగా ఆత్మలో తక్కువ జ్ఞానము ఉండటము వలన ఏ సంస్కారాలైతే ఉన్నాయో, వాటి అనుసారముగా ఏ సంకల్పాలైతే ఉత్పన్నమవుతాయో, అవి స్థితిని కింద-మీద చేస్తాయి. అందుకే చెక్ చేసుకోండి మరియు చెక్ చేయించుకోండి, ఒక్క అడుగు కూడా శ్రీమతానికి విరుద్ధముగా లేకపోతే, అప్పుడు పదమాల సంపాదనను జమ చేసుకుని పదమాపదమ భాగ్యశాలిగా అవ్వగలుగుతారు.

స్లోగన్:-
మనసులో సర్వుల కళ్యాణము యొక్క భావన నిలిచి ఉండటము - ఇదే విశ్వ కళ్యాణకారీ ఆత్మ యొక్క కర్తవ్యము.

అవ్యక్త సూచనలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’

పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నిశ్చయబుద్ధి కల పిల్లలు పరిస్థితులు వచ్చినప్పుడు తమ స్వ స్థితి యొక్క శక్తి ద్వారా సదా విజయులుగా అనుభవము చేస్తారు. ప్రపంచములోని వారైనా లేక బ్రాహ్మణ పరివారము యొక్క సంబంధ-సంపర్కములోని వారైనా - వీరు ఓడిపోయారు అని భావించినా కానీ అది ఓటమి కాదు, గెలుపు. సేవలోని పరిస్థితి అయినా, సంగఠనలోని పరిస్థితి అయినా, ప్రకృతి ద్వారా వచ్చే పరిస్థితి అయినా, అవి స్వ స్థితిని లేక శ్రేష్ఠ స్థితిని కింద-మీద చేసినట్లయితే, అది కూడా బంధనముక్త స్థితి కాదు. ఆ బంధనము నుండి కూడా ముక్తులుగా అవ్వండి.