23-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - రక్త సంబంధాలలోనే దుఃఖముంది, మీరు ఆ సంబంధాలను త్యజించి పరస్పరములో ఆత్మిక ప్రేమను ఉంచుకోవాలి, ఇదే సుఖానికి మరియు ఆనందానికి ఆధారము’’

ప్రశ్న:-
విజయమాలలోకి వచ్చేందుకు విశేషముగా ఏ పురుషార్థము కావాలి?

జవాబు:-
విజయమాలలోకి రావాలి అంటే విశేషముగా హోలీగా (పవిత్రముగా) అయ్యే పురుషార్థము చేయండి. ఎప్పుడైతే పక్కా సన్యాసులుగా అనగా నిర్వికారులుగా అవుతారో, అప్పుడు విజయమాలలోని మణులుగా అవుతారు. ఎలాంటి కర్మ బంధనాల లెక్కాచారాలు ఉన్నా వారసులుగా అవ్వలేరు, ప్రజల్లోకి వెళ్ళిపోతారు.

పాట:-
దీపపు పురుగుల కోసం సభలో దీపము వెలిగింది...

ఓంశాంతి
చూడండి, మనము మన తండ్రి మహిమను చేస్తాము. ఆత్మనైన నేను తప్పకుండా నా ఫాదర్ ను షో (ప్రత్యక్షము) చేస్తాను కదా. సన్ షోస్ ఫాదర్ (కొడుకు తండ్రిని ప్రత్యక్షము చేస్తాడు). నేను ఆత్మను, మీరు కూడా అంటారు - మనము ఆత్మలము, మనందరి ఫాదర్ ఒక్క పరమాత్మ, వారు అందరికీ తండ్రి. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. ఆత్మలైన మనకు వేర్వేరు తండ్రులున్నారని అనరు. ఫాదర్ అందరికీ ఒక్కరే. ఇప్పుడు మనము వారి పిల్లలైన కారణముగా మనకు వారి కర్తవ్యము గురించి తెలుసు. మనము పరమాత్మను సర్వవ్యాపి అని అనలేము. అలాగైతే అందరిలోనూ పరమాత్మ ఉండాలి. ఫాదర్ ను స్మృతి చేసుకుంటూ పిల్లలు సంతోషిస్తారు ఎందుకంటే తండ్రి వద్ద ఏదైతే ఉంటుందో, అది పిల్లలకు వారసత్వముగా లభిస్తుంది. ఇప్పుడు మనము పరమాత్ముని వారసులము, వారి వద్ద ఏముంది? వారు ఆనంద సాగరుడు, జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు. ఈ విషయము మనకు తెలుసు, అందుకే మనము వారిని మహిమ చేస్తాము. ఇతరులు వారి గురించి ఇలా చెప్పరు. ఒకవేళ చెప్పినా, వారు ఎలా ఉంటారు అనేది తెలియనే తెలియదు. ఇకపోతే, పరమాత్మ సర్వవ్యాపి అని అందరూ అంటారు. కానీ మనము వారి పిల్లలము కనుక మన నిరాకార అవినాశీ తండ్రి మహిమను ఈ విధముగా వర్ణిస్తాము - వారు ఆనంద సాగరుడు, జ్ఞాన సాగరుడు, ప్రేమ భాండాగారము అని. కానీ కొందరు ఇలా ప్రశ్నిస్తారు - అక్కడ నిరాకారీ ప్రపంచములో సుఖ-దుఃఖాలకు అతీతమైన అవస్థ ఉంటుందని మీరు అంటారు, అలాంటప్పుడు స్వర్గములో సుఖము లేక ఆనందము లేక ప్రేమ ఎక్కడ నుండి వచ్చాయి? ఇప్పుడివి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ ఆనందము, సుఖము మరియు ప్రేమ అని అంటూ ఉంటారు కదా, ఇవి సుఖమయ అవస్థకు గుర్తులు. కానీ అక్కడ శాంతిదేశములో ఆనందము, ప్రేమ మరియు జ్ఞానము ఎక్కడ నుండి వచ్చాయి? ఆ సుఖ సాగరుడు ఈ సాకార సృష్టిలోకి వచ్చినప్పుడు సుఖాన్ని ఇస్తారు. అక్కడైతే (శాంతిధామములో) సుఖ-దుఃఖాలకు అతీతమైన అవస్థలో ఉంటారు ఎందుకంటే మీకు అర్థం చేయించినది ఏమిటంటే - ఒకటి సుఖ-దుఃఖాలకు అతీతమైన ప్రపంచము, దానిని నిరాకారీ ప్రపంచమని అంటారు. రెండవది, సుఖమయ ప్రపంచము, అక్కడ సదా సుఖము, ఆనందము ఉంటాయి, దానిని స్వర్గమని అంటారు. మరియు ఇది దుఃఖమయ ప్రపంచము, దీనిని నరకము లేక ఇనుపయుగ ప్రపంచము అని అంటారు. ఇప్పుడు ఈ ఇనుపయుగ ప్రపంచాన్ని సుఖసాగరుడైన పరమపిత పరమాత్మ వచ్చి పరివర్తన చేసి ఆనందము, సుఖము, ప్రేమ యొక్క భాండాగారముగా తయారుచేస్తారు, అక్కడ సుఖమే సుఖముంటుంది, ప్రేమయే ప్రేమ ఉంటుంది. అక్కడ జంతువులలో కూడా చాలా ప్రేమ ఉంటుంది. సింహము, ఆవు కూడా కలిసి ఒకేచోట నీరు తాగుతాయి. వాటి మధ్యన పరస్పరములో అంతటి ప్రేమ ఉంటుంది. కనుక పరమాత్మ వచ్చి స్థాపన చేసే రాజధానిలో సుఖము మరియు ఆనందము ఉంటాయి. ఇకపోతే, నిరాకారీ ప్రపంచములోనైతే సుఖము మరియు ఆనందము యొక్క మాటే ఉండదు, ప్రేమ యొక్క మాటే ఉండదు. అది నిరాకారీ ఆత్మల నివాస స్థానము. అక్కడ అందరిదీ వానప్రస్థ జీవితము లేక నిర్వాణ అవస్థ వంటిది. అక్కడ సుఖ-దుఃఖాల ఫీలింగ్స్ ఏమీ ఉండవు. సుఖ-దుఃఖాల పాత్ర అనేది ఈ సాకార ప్రపంచములో నడుస్తుంది. ఈ సృష్టిపైనే స్వర్గమున్నప్పుడు అవినాశీ ఆత్మిక ప్రేమ ఉంటుంది ఎందుకంటే దుఃఖమనేది రక్త సంబంధాలలో ఉంటుంది. సన్యాసులలో కూడా రక్త సంబంధాలు ఉండవు, అందుకే వారి విషయములో కూడా దుఃఖమన్న మాట ఏమీ ఉండదు. వారు స్వయానికి సంబంధించి - నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడను అని చెప్పుకుంటారు, ఎందుకంటే వారు రక్త సంబంధాలను త్యజిస్తారు. అలాగే ఇక్కడ కూడా మీకు ఎటువంటి రక్త సంబంధాలు లేవు. ఇక్కడ మనందరికీ పరస్పరములో ఆత్మిక ప్రేమ ఉంటుంది, దీనిని పరమాత్మ నేర్పిస్తారు.

తండ్రి అంటారు - మీరు నా ప్రియమైన పుత్రులు. నా ఆనందము, ప్రేమ, సుఖము అన్నీ మీవే, ఎందుకంటే మీరు ఆ ప్రపంచాన్ని వదిలి నా ఒడిలోకి వచ్చారు, అది కూడా మీరు ప్రాక్టికల్ జీవితములో నా ఒడిలోకి వచ్చి కూర్చున్నారు. అక్కడ అలా కాదు. అక్కడ ఎవరైతే సన్యసించి గురువులకు దత్తతగా వెళ్తారో, వారే ప్రియమైన పుత్రులుగా అవుతారు ఎందుకంటే వారే గురువు తర్వాత గద్దెపై కూర్చుంటారు. పిల్లలకు మరియు ప్రజలకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. పుత్రులు వారసులుగా అయి వారసత్వాన్ని తీసుకుంటారు. మీరు కూడా రక్త సంబంధాలను తెంచి ఈ నిరాకార తండ్రి మరియు సాకార తండ్రి ఒడిలోకి వచ్చారు కనుక వారసులుగా అయ్యారు. ఇందులో కూడా ఎంతగా జ్ఞానాన్ని తీసుకుంటారో, అంతగా ఆనందాన్ని అనుభూతి చేస్తారు. ఎడ్యుకేషన్ (చదువు)ను ఆనందము అని అంటారు. కనుక ఎవరు ఎంతగా చదువుకుంటారో, అంతగా ఆ రాజధానిలో ప్రజలుగా సుఖము తీసుకుంటారు. ఈ ఈశ్వరీయ చదువు ఆనందదాయకమైనది కదా, దీనితో సుప్రీమ్ (పరమ) శాంతి మరియు సంతోషము లభిస్తాయి. ఈ స్థిరమైన, అఖండమైన, సుఖ-శాంతిమయమైన స్వరాజ్యము గాడ్ యొక్క ప్రాపర్టీ, ఇది పిల్లలకు లభిస్తుంది. ఇక ఎంతగా జ్ఞానాన్ని తీసుకుంటారో, అంతగా తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. మీ వద్దకు ఇంతమంది జిజ్ఞాసువులు వస్తారు, వారు మీ ప్రియమైన ప్రజలుగా అవుతారు, అంతేకానీ పిల్లలుగా అవ్వరు ఎందుకంటే వారు వస్తూ-వెళ్తూ ఉంటారు. వారు పిల్లలుగా కూడా అవ్వవచ్చు ఎందుకంటే కొంతమంది ప్రజల నుండి తర్వాత వారసులుగా కూడా అవుతారు. వారు జ్ఞానము తీసుకుంటూ-తీసుకుంటూ ఇక్కడ అపారమైన సుఖము మరియు శాంతి ఉండటాన్ని చూసినప్పుడు, అలానే ఆ ప్రపంచములో దుఃఖము ఉండటాన్ని చూసినప్పుడు, ఇక ఒడిలోకి వచ్చేస్తారు. వెంటనే ఎవ్వరూ పిల్లలుగా అవ్వరు. మీరు కూడా ముందు వస్తూ-వెళ్తూ ఉండేవారు, తర్వాత వింటూ-వింటూ కూర్చుండిపోయారు మరియు వారసులుగా అయిపోయారు. సన్యాసుల వద్ద కూడా ఇలాగే జరుగుతుంది. వారు వింటూ-వింటూ, సన్యాసములో సుఖ-శాంతులు ఉన్నాయి అని ఎప్పుడైతే భావిస్తారో, అప్పుడు సన్యసిస్తారు. ఇక్కడ కూడా ఎప్పుడైతే అభిరుచి కలుగుతుందో, అప్పుడు ప్రియమైన పుత్రులుగా అవుతారు, ఇక జన్మజన్మల కోసం వారసత్వము లభిస్తుంది. వారు తర్వాత దైవీ వంశ వృక్షములోకి వస్తూ ఉంటారు. ప్రజలైతే మీతో పాటు ఉండరు. వారు ఎక్కడెక్కడో కర్మ బంధనాలలోకి వెళ్ళిపోతారు.

సభలో దీపపు పురుగుల కోసం దీపం వెలిగింది అని పాటలో అన్నారు కదా. దీపపు పురుగులు కూడా దీపముపై డ్యాన్స్ చేస్తూ-చేస్తూ మరణిస్తాయి. కొన్ని చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి. ఈ తనువు కూడా ఒక దీపము, ఇందులో ఆల్మైటీ (సర్వశక్తివంతుడైన) బాబా ప్రవేశించి ఉన్నారు. మీరు దీపపు పురుగులై వచ్చారు, అలా వస్తూ-వెళ్తూ ఎప్పుడైతే రహస్యాలను అర్థం చేసుకున్నారో, అప్పుడిక కూర్చుండిపోయారు. రావడమైతే వేలాది, లక్షలాది మంది వస్తారు. మీ ద్వారా కూడా వింటూ ఉంటారు. వారు ఎంతగా వింటారో, అంతగా శాంతి మరియు ఆనందము యొక్క వరదానాలను తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే అవినాశీ తండ్రి యొక్క ఈ శిక్షణలు వినాశనమవ్వవు. దీనినే అవినాశీ జ్ఞాన ధనము అని అంటారు. ఇది వినాశనమవ్వదు. అందుకే, కొద్దిగా విన్నా కూడా, వారు తప్పకుండా ప్రజల్లోకి వస్తారు. అక్కడైతే ప్రజలు కూడా చాలా-చాలా సుఖమయముగా ఉంటారు. వారికి అవినాశీ ఆనందముంటుంది, ఎందుకంటే అక్కడ అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు. ఇక్కడ దేహాభిమానులుగా అయ్యారు కావుననే దుఃఖితులుగా ఉన్నారు. అక్కడ ఉన్నదే స్వర్గము, అక్కడ దుఃఖము యొక్క నామ-రూపాలే ఉండవు. జంతువులే ఎంతో సుఖ-శాంతులతో ఉంటాయి అన్నప్పుడు ప్రజలలో ఎంత ప్రేమ మరియు సుఖము ఉంటాయి. అందరూ వారసులుగా అవ్వలేరు అనేది వాస్తవము. ఇక్కడైతే, 108 మంది పక్కా సన్యాసులు విజయమాలలోని మణులుగా అవ్వనున్నారు. వారు కూడా ఇప్పుడింకా తయారవ్వలేదు, తయారవుతూ ఉన్నారు. వారితో పాటు ప్రజలు కూడా తయారవుతున్నారు. వారు కూడా బయట ఉంటూ వింటూ ఉంటారు. ఇంటిలో కూర్చుని యోగము జోడిస్తున్నారు. యోగము జోడిస్తూ- జోడిస్తూ ఎవరైనా లోపలికి వస్తే, వారు ప్రజల నుండి వారసులుగా అవుతారు. ఎప్పటివరకైతే వారికి కర్మ బంధనాల లెక్కాచారాలు ఉంటాయో, అప్పటివరకు బయటే ఉంటూ యోగము జోడిస్తారు, నిర్వికారులుగా అవుతూ ఉంటారు. ఎవరైతే ఇంటిలో ఉంటూ నిర్వికారులుగా ఉంటారో, వారికి తప్పకుండా ఇంటిలో గొడవలు జరుగుతాయి ఎందుకంటే కామేషు, క్రోధేషు... లాంటి వారుంటారు. ఎప్పుడైతే కామమనే మహాశత్రువుపై మీరు విజయము పొందుతారో, విషము ఇవ్వడము ఆపేస్తారో, అప్పుడు గొడవలు జరుగుతాయి.

తండ్రి అంటారు - పిల్లలూ, మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. మొత్తం ప్రపంచమంతా వినాశనమవ్వనున్నది. ఎలాగైతే వృద్ధులకు - మృత్యువు ఎదురుగా ఉంది, పరమాత్మను స్మృతి చేయండి అని చెప్తారో, అలాగే తండ్రి కూడా అంటారు - పిల్లలూ, నిర్వికారులుగా అవ్వండి, పరమాత్మను స్మృతి చేయండి. తీర్థ యాత్రలకు వెళ్ళినప్పుడు కామ-క్రోధాలన్నింటినీ ఆపేస్తారు. దారిలో కామ చేష్టలు చేయరు. వారు దారి పొడవునా, అమరనాథునికి జయజయకారాలు చేస్తూ వెళ్తారు, కానీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అవే వికారాలలో మునకలు వేస్తూ ఉంటారు. మీరైతే తిరిగి వచ్చేది లేదు. కామ-క్రోధాలలోకి రాకూడదు. వికారాల్లోకి వెళ్ళినట్లయితే పద భ్రష్టులవుతారు. హోలినెస్ (పవిత్రము)గా అవ్వలేరు. ఎవరైతే హోలీ (పవిత్రము)గా అవుతారో, వారు విజయమాలలోకి వస్తారు. ఎవరైతే ఫెయిల్ అవుతారో, వారు చంద్రవంశములోకి వెళ్ళిపోతారు.

ఇక్కడ మీ అందరినీ పరమపిత పరమాత్మ కూర్చుని చదివిస్తారు. వారే జ్ఞానసాగరుడు కదా. ఆత్మలకు, అక్కడ నిరాకారీ ప్రపంచములో కూర్చుని జ్ఞానము వినిపించరు. ఇక్కడికి వచ్చి మీకు జ్ఞానము వినిపిస్తారు. వారంటారు - మీరు నా పిల్లలు, నేను ఎలాగైతే పవిత్రముగా ఉన్నానో, అలా మీరు కూడా పవిత్రముగా అవ్వండి. అప్పుడు మీరు సత్యయుగములో సుఖమయమైన, ప్రేమమయమైన రాజ్యము చేస్తారు, దానిని వైకుంఠమని అంటారు. ఇప్పుడు ఈ ప్రపంచము మారుతోంది ఎందుకంటే ఇనుప యుగము నుండి బంగారు యుగముగా తయారవుతుంది, ఆ తర్వాత బంగారు యుగము నుండి వెండి యుగముగా మారుతుంది. వెండి యుగము నుండి రాగి యుగముగా, ఆ తర్వాత రాగి యుగము నుండి ఇనుప యుగముగా మారుతూ ఉంటుంది. ప్రపంచము ఈ విధముగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచము మారుతూ ఉంది. దీనిని ఎవరు మారుస్తున్నారు? స్వయంగా భగవంతుడు మారుస్తున్నారు. మీరు వారికి ప్రియమైన పిల్లలుగా అయ్యారు. ప్రజలు కూడా తయారవుతూ ఉన్నారు కానీ పిల్లలు పిల్లలే, ప్రజలు ప్రజలే. ఎవరైతే సన్యసిస్తారో, వారు వారసులుగా అవుతారు. వారిని రాయల్ వంశములోకి తప్పకుండా తీసుకువెళ్ళాలి. కానీ ఒకవేళ జ్ఞానము అంతగా తీసుకోకపోతే, పదవిని పొందలేరు. ఎవరైతే చదువుకుంటారో, వారు నవాబులుగా అవుతారు. ఎవరైతే వస్తూ-వెళ్తూ ఉంటారో, వారు ప్రజల్లోకి వస్తారు. తర్వాత ఎంతగా పవిత్రముగా అవుతారో, అంతగా సుఖము లభిస్తుంది. వారు కూడా ప్రియమైనవారిగా అవుతారు కానీ పూర్తి ప్రియమైనవారిగా ఎప్పుడు అవుతారంటే, ఎప్పుడైతే పిల్లలుగా అవుతారో అప్పుడు. అర్థమయిందా?

సన్యాసులు కూడా చాలా రకాల వారు ఉంటారు. ఒక రకం వారు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్ళిపోతారు, మరొక రకం వారు గృహస్థములో ఉంటూ వికారాల్లోకి వెళ్ళకుండా ఉంటారు. సన్యాసులు కూర్చుని ఫాలోవర్స్ కు శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తారు, ఆత్మ జ్ఞానాన్ని ఇస్తారు. వారికి కూడా శిష్యులుంటారు. కానీ వారి శిష్యులు వారికి ప్రియమైన పుత్రులుగా అవ్వలేరు ఎందుకంటే ఆ శిష్యులు ఇళ్ళు-వాకిళ్ళు మరియు పిల్లలు కలవారిగా ఉంటారు, కనుక ఆ శిష్యులను తమ వద్ద కూర్చోబెట్టుకోలేరు. అలాంటివారు స్వయం కూడా సన్యాసులుగా అవ్వరు, అలాగే ఇతరుల చేత కూడా సన్యాసము చేయించలేరు. వారి శిష్యులు కూడా గృహస్థములోనే ఉంటారు. కేవలం సన్యాసి వద్దకు వస్తూ-వెళ్తూ ఉంటారు. ఆ సన్యాసులు కేవలం ఆ శిష్యులకు జ్ఞానము ఇస్తూ ఉంటారు లేక మంత్రము ఇస్తారు, అంతే. మరి ఆ సన్యాసులకు వారసులుగా తయారవనప్పుడు వారి వృద్ధి ఎలా జరుగుతుంది? కేవలం జ్ఞానము ఇస్తూ-ఇస్తూ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు.

చూడండి, ఒకటేమో 108 మణుల మాల ఉంటుంది, రెండవది దానికంటే పెద్దది 16,108 మణుల మాల ఉంటుంది. ఇది చంద్రవంశపు రాయల్ రాకుమార-రాకుమారీల మాల. ఎవరైతే ఇక్కడ అంత జ్ఞానము తీసుకోలేరో, పవిత్రముగా అవ్వరో, వారు శిక్షలు అనుభవించి చంద్రవంశీయుల మాలలోకి వస్తారు. రాకుమారులు-రాకుమారీలైతే చాలామంది ఉంటారు.

ఈ రహస్యాలను కూడా మీరిప్పుడే వింటారు, తెలుసుకుంటారు. అక్కడ ఈ జ్ఞానము యొక్క విషయాలుండవు. ఈ జ్ఞానము ఇప్పుడు దైవీ ధర్మ స్థాపన జరిగే ఈ సంగమములో మాత్రమే లభిస్తుంది. ఎవరైతే కర్మేంద్రియాలను పూర్తిగా జయించరో, వారు చంద్రవంశీయుల మాలలోకి వెళ్ళిపోతారని వినిపించాను. ఎవరైతే జయిస్తారో, వారు సూర్యవంశములోకి వస్తారు. వారిలో కూడా తప్పకుండా నంబరువారుగా ఉంటారు. శరీరము కూడా అవస్థ అనుసారముగానే లభిస్తుంది. చూడండి, మమ్మా అందరికంటే చురుకుగా ముందుకు వెళ్ళారు కనుక వారికి స్కాలర్షిప్ లభించింది, క్లాస్ లీడర్ గా అయ్యారు. వారికి మొత్తం జ్ఞాన కలశాన్ని ఇచ్చారు. నేను కూడా వారిని ‘తల్లి’ అని సంబోధిస్తాను ఎందుకంటే నేను కూడా మొత్తం నా తనువు, మనసు, ధనాన్ని వారి చరణాలలో స్వాహా చేసాను. నేను లౌకిక పిల్లలకు ఇవ్వలేదు ఎందుకంటే వారు రక్త సంబంధీకులు. వీరు అవినాశీ పిల్లలు అవుతారు, అంతా సన్యసించి వస్తారు కనుక వీరిపై ఎక్కువ ప్రేమ ఉంటుంది. అవినాశీ ప్రేమ అన్నింటికంటే శక్తివంతమైనది. సన్యాసులైతే ఇళ్ళు-వాకిళ్ళను వదిలి ఒంటరిగా పారిపోతారు. ఇక్కడైతే అంతా తీసుకువచ్చి స్వాహా చేసారు. పరమాత్మ స్వయం ప్రాక్టికల్ గా అభినయించి చూపిస్తారు.

ఇక్కడ మీకు ఏ ప్రశ్నకైనా సమాధానము లభిస్తుంది. అది ఆ పరమాత్మ స్వయంగా వచ్చి తెలియజేయగలరు. వారు ఇంద్రజాలికుడు. వారి ఈ ఇంద్రజాలపు పాత్ర ఇప్పుడు నడుస్తుంది. మీరు చాలా ప్రియమైన పిల్లలు, బాబా మిమ్మల్ని ఎప్పుడూ అసంతృప్త పరచలేరు. అసంతృప్త పరిస్తే పిల్లలు కూడా కోపం చేయడము నేర్చుకుంటారు. ఇక్కడైతే అందరికీ ఆంతరిక ప్రేమ ఉంటుంది. స్వర్గములో కూడా ఎంత ప్రేమ ఉంటుంది. అక్కడైతే సతోప్రధానముగా ఉంటారు.

ఇక్కడికి వచ్చే విజిటర్స్ కు కూడా చాలా సేవ జరుగుతుంది ఎందుకంటే వారిపై కూడా శాంతి మరియు సంతోషాల వర్షము కురుస్తుంది. వారు ప్రియమైన ప్రజలుగా అయ్యేవారు. తల్లి-తండ్రి, పిల్లలు అందరూ వారి సేవలో నిమగ్నమవుతారు. దేవీ-దేవతలుగా అవుతున్నారు కానీ ఇక్కడ ఆ పదవిని గురించిన అహంకారముండదు. అందరూ విధేయులైన సేవకులుగా అయి సేవలో హాజరవుతారు. గాడ్ కూడా విధేయుడైన సేవకుడిగా అయి తన ప్రియమైన పిల్లల సేవను మరియు ప్రజల సేవను చేస్తారు. వారు పిల్లలపైనే ఆనందాన్ని కురిపిస్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు, కంటి రత్నాలకు, కల్ప-కల్పము విడిపోయి మళ్ళీ వచ్చి కలుసుకున్నవారికి, అటువంటి పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ విధముగా బాప్ దాదా పిల్లలను ఎప్పుడూ అసంతృప్త పరచరో, అదే విధముగా పిల్లలైన మీరు కూడా ఎవరినీ అసంతృప్త పరచకూడదు. పరస్పరములో ఆంతరిక ప్రేమతో వ్యవహరించాలి. ఎప్పుడూ కోపం చేయకూడదు.

2. శాంతి మరియు ఆనందము యొక్క వరదానాన్ని తీసుకునేందుకు దీపముపై పూర్తిగా బలిహారమవ్వాలి. చదువుతో సుప్రీమ్ శాంతి మరియు సంతోషము యొక్క ఈశ్వరీయ అధికారాన్ని తీసుకోవాలి.

వరదానము:-
మీ ప్రత్యక్ష ప్రమాణము ద్వారా తండ్రిని ప్రత్యక్షము చేసే శ్రేష్ఠ భాగ్యశాలి భవ

ఏ విషయాన్ని అయినా స్పష్టము చేసేందుకు అనేక రకాల ఋజువులు ఇవ్వడము జరుగుతుంది. కానీ అన్నింటికన్నా శ్రేష్ఠమైన ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణము. ప్రత్యక్ష ప్రమాణము అనగా మీరు ఎవరో, ఎవరికి చెందినవారో, వారి స్మృతిలో ఉండటము. ఏ పిల్లలైతే తమ యథార్థమైన మరియు అనాది స్వరూపములో స్థితులై ఉంటారో, వారే తండ్రిని ప్రత్యక్షము చేసేందుకు నిమిత్తులు. వారి భాగ్యాన్ని చూసి భాగ్యాన్ని తయారుచేసేవారి స్మృతి స్వతహాగా వస్తుంది.

స్లోగన్:-
తమ దయాదృష్టి ద్వారా ప్రతి ఆత్మను పరివర్తన చేసేవారే పుణ్యాత్ములు.

అవ్యక్త ప్రేరణలు - పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి

ఎవరైనా వారి సంస్కారము లేక స్వభావము కారణముగా మీ ఎదురుగా పరీక్ష రూపములో వచ్చినా కానీ మీరు సెకెండులో మీ శ్రేష్ఠ సంస్కారము ద్వారా, ఒక్కరి స్మృతి ద్వారా అటువంటివారి పట్ల కూడా దయాహృదయ సంస్కారాన్ని మరియు స్వభావాన్ని ధారణ చేయండి - ఇదే ఉపకారము చెయ్యటము.