23-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 31.12.2007


‘‘కొత్త సంవత్సరములో అఖండ మహాదానిగా, అఖండ నిర్విఘ్నముగా, అఖండ యోగిగా మరియు సదా సఫలతామూర్తిగా తయారవ్వండి’’

ఈ రోజు బాప్ దాదా తమ ఎదురుగా డబుల్ సభను చూస్తున్నారు. ఒకటి సాకారములో సమ్ముఖముగా కూర్చుని ఉన్నవారి సభ, రెండవది, దూరముగా కూర్చుని ఉన్నా కూడా హృదయానికి సమీపముగా కనిపిస్తున్నవారి సభ. రెండు సభలలోని శ్రేష్ట ఆత్మల మస్తకముపై ఆత్మ దీపము మెరుస్తోంది. ఇది ఎంతటి సుందరమైన మెరుస్తూ ఉన్న దృశ్యము. ఇంతమంది ఒకే సంకల్పములో, ఏకరస స్థితిలో స్థితులై, పరమాత్మ ప్రేమలో లవలీనమై, ఏకాగ్ర బుద్ధితో, స్నేహములో ఇమిడిపోయి ఎంత ప్రియముగా అనిపిస్తున్నారు. మీరందరూ కూడా ఈ రోజు విశేషముగా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి చేరుకున్నారు. బాప్ దాదా కూడా పిల్లలందరి ఉల్లాస-ఉత్సాహాలను చూసి, మెరుస్తున్న ఆత్మ దీపాలను చూసి హర్షిస్తున్నారు.

ఈ రోజు సంగమము యొక్క రోజు. పాత సంవత్సరానికి వీడ్కోలు మరియు కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు జరగనున్నది. కొత్త సంవత్సరము అనగా కొత్త ఉల్లాసము మరియు ఉత్సాహము, స్వ పరివర్తన కొరకు ఉల్లాసము, సర్వ ప్రాప్తులు స్వయములో ప్రాప్తించి ఉండటాన్ని చూసి హృదయములో ఉత్సాహము ఉంది. ప్రపంచమువారు కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. వారికైతే ఇది ఒక్క రోజు యొక్క ఉత్సవము కానీ లక్కీ, లవ్లీ పిల్లలైన మీకు సంగమయుగములోని ప్రతి రోజూ ఉత్సవమే ఎందుకంటే మీకు సంతోషముతో కూడిన ఉత్సాహము ఉంది. ప్రపంచములోనివారు ఆరిపోయి ఉన్న దీపాలను వెలిగించి కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు కానీ బాప్ దాదా మరియు మీరు ఇంతమంది నలువైపులా ఉన్న వెలుగుతున్న దీపాలతో కొత్త సంవత్సరపు ఉత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చారు. ఈ ఆచారాలను మరియు పద్ధతులను జరుపుకోవడమనేది మీరు నిమిత్తమాత్రముగా చేస్తారు కానీ మీరందరూ వెలిగి ఉన్న దీపాలు. మెరుస్తున్న మీ దీపము కనిపిస్తుంది కదా! అది అవినాశీ దీపము.

కొత్త సంవత్సరములో ప్రతి ఒక్కరూ తమ హృదయములో స్వయం కోసం మరియు విశ్వములోని ఆత్మల కోసం ఏదైనా కొత్త ప్లాన్ ను తయారుచేసారా? 12 గంటల తర్వాత కొత్త సంవత్సరము ప్రారంభమవుతుంది, మరి ఈ సంవత్సరాన్ని విశేషముగా ఏ రూపములో జరుపుకుంటారు? ఈ పాత సంవత్సరము వీడ్కోలు తీసుకుంటుంది, మరి మీరందరూ కూడా పాత సంకల్పాలకు, పాత సంస్కారాలకు వీడ్కోలు చెప్పాలని సంకల్పము చేసారా? సంవత్సరానికే కాక మీరు కూడా పాతవాటికి వీడ్కోలు చెప్పి కొత్త ఉల్లాస-ఉత్సాహాల సంకల్పాలను ప్రాక్టికల్ లోకి తీసుకువస్తారు కదా! మరి ఆలోచించండి, స్వయములో ఎటువంటి నవీనతను తీసుకువస్తారు? ఎటువంటి కొత్త ఉల్లాస-ఉత్సాహాల అలను వ్యాపింపజేస్తారు? ఎటువంటి విశేష సంకల్పాల వైబ్రేషన్లను వ్యాపింపజేస్తారు? ఆలోచించారా? ఎందుకంటే బ్రాహ్మణులైన మీరందరూ పూర్తి విశ్వాత్మల పరివర్తనకు నిమిత్తమైన ఆత్మలు. మీరు విశ్వానికి పునాది, మీరు పూర్వజులు, పూజ్యులు. మరి ఈ సంవత్సరము మీ శ్రేష్ఠ వృత్తి ద్వారా ఏ వైబ్రేషన్లను వ్యాపింపజేస్తారు? ప్రకృతి నలువైపులా ఒక్కోసారి వేడి, ఒక్కోసారి చలి, ఒక్కోసారి వసంతము యొక్క వైబ్రేషన్లను వ్యాపింపజేస్తుంది. మరి ప్రకృతికి యజమానులు, ప్రకృతిజీతులైన మీరు ఎటువంటి వైబ్రేషన్లను వ్యాపింపజేస్తారు? దీని ద్వారా ఆత్మలకు కొద్ది సమయము కోసమైనా సుఖ-శాంతుల అనుభవం చేయించగలగాలి. ఇందుకోసం బాప్ దాదా ఇచ్చే సూచన ఏమిటంటే ఏయే ఖజానాలైతే ప్రాప్తించాయో, ఆ ఖజానాలను సఫలము చేయండి మరియు సఫలతా స్వరూపులుగా అవ్వండి. విశేషముగా సమయము యొక్క ఖజానా ఎప్పుడూ వ్యర్థముగా పోకూడదు. ఒక్క క్షణము కూడా వ్యర్థాన్ని కార్యములో వినియోగించకండి. సమయాన్ని సఫలము చేయండి, ప్రతి శ్వాసను సఫలము చేయండి, ప్రతి సంకల్పాన్ని సఫలము చేయండి, ప్రతి శక్తిని సఫలము చేయండి, ప్రతి గుణాన్ని సఫలము చేయండి. ఈ సంవత్సరాన్ని విశేషముగా సఫలతామూర్తులుగా అయ్యేందుకు జరుపుకోండి ఎందుకంటే సఫలత మీ జన్మ సిద్ధ అధికారము. ఆ అధికారాన్ని మీ కార్యములో వినియోగించి సఫలతామూర్తులుగా అవ్వండి ఎందుకంటే ఇప్పటి మీ సఫలత అనేక జన్మలు మీతోపాటు ఉంటుంది. మీరు సమయము సఫలము చేసినందుకు ప్రారబ్ధముగా పూర్తిగా అర్ధకల్పము సఫలత యొక్క ఫలము ప్రాప్తిస్తుంది. ఇప్పుడు సమయము సఫలము చేసినందుకు ప్రారబ్ధము పూర్తి సమయము ప్రాప్తిస్తుంది. శ్వాసను సఫలము చేయడము ద్వారా భవిష్యత్తులో కూడా చూడండి - మీరు శ్వాసను సఫలము చేసినందుకు పరిణామముగా భవిష్యత్తులో ఆత్మలందరూ పూర్తి సమయము ఆరోగ్యముగా ఉంటారు. అనారోగ్యము యొక్క పేరు కూడా ఉండదు. డాక్టర్ల డిపార్టుమెంటే ఉండదు ఎందుకంటే డాక్టర్లు ఏమవుతారు? రాజులుగా అయిపోతారు కదా! విశ్వ యజమానులుగా అవుతారు! కానీ ఈ సమయములో మీరు శ్వాసను సఫలము చేస్తారు మరియు సర్వాత్మలకు ఆరోగ్యముగా ఉండే ప్రారబ్ధము ప్రాప్తిస్తుంది. అదే విధముగా జ్ఞాన ఖజానా, దీని ఫల స్వరూపముగా స్వర్గములో మీరు మీ రాజ్యములో ఎంత తెలివైనవారిగా, శక్తివంతులుగా అవుతారంటే అక్కడ మంత్రులతో సలహాలు తీసుకోవలసిన అవసరముండదు, స్వయమే తెలివైనవారిగా, శక్తివంతులుగా ఉంటారు. శక్తులను సఫలము చేస్తారు, దానికి ప్రారబ్ధముగా అక్కడ సర్వ శక్తులు, విశేషముగా ధర్మ సత్తా, రాజ్య సత్తా, ఈ రెండు విశేషమైన శక్తులూ, సత్తాలు అక్కడ ప్రాప్తిస్తాయి. గుణాల ఖజానాను సఫలము చేస్తారు, దీనికి ప్రారబ్ధముగా దేవతా పదవి యొక్క అర్థమే దివ్యగుణధారి. దీనితో పాటుగా ఇప్పుడు చివరి జన్మలో మీ జడ మూర్తికి పూజ చేసినప్పుడు ఏమని మహిమ చేస్తారు? సర్వగుణ సంపన్నులు. మరి ఈ సమయము యొక్క సఫలత యొక్క ప్రారబ్ధము స్వతహాగానే ప్రాప్తిస్తుంది, అందుకే చెక్ చేసుకోండి - ఖజానాలు లభించాయి, ఖజానాలతో సంపన్నముగా అయ్యారు, కానీ స్వయము కోసము మరియు విశ్వము కోసము ఎంత సఫలము చేసారు? పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్తారు, మరి పాత సంవత్సరములో జమ అయిన ఖజానాను సఫలము చేసారా, ఎంత సఫలము చేసారు? ఇది చెక్ చేసుకోండి మరియు రాబోయే సంవత్సరములో కూడా ఈ ఖజానాలను వ్యర్థానికి బదులుగా సఫలము చెయ్యవలసిందే. ఒక్క క్షణము కూడా మరియు ఇతర ఏ ఖజానా కూడా వ్యర్థముగా పోకూడదు. ఇంతకుముందు వినిపించి ఉన్నాము కదా, సంగమ సమయము యొక్క సెకండు, సెకండు కాదు, అది ఒక సంవత్సరముతో సమానము. అంతేకానీ ఒక్క క్షణమే, ఒక్క నిమిషమే కదా పోయింది అని అనుకోకండి. వ్యర్థముగా పోవడాన్నే నిర్లక్ష్యము అని అంటారు. బ్రహ్మాబాబా సమానముగా సంపన్నముగా మరియు సంపూర్ణముగా అవ్వాలి అన్నది మీ అందరి లక్ష్యము. బ్రహ్మాబాబా సర్వ ఖజానాలను ఆది నుండి అంతిమ రోజు వరకు సఫలము చేసారు. దీనికి ప్రత్యక్ష ప్రమాణమును చూసారు, వారు సంపూర్ణ ఫరిశ్తాగా అయ్యారు. మీ ప్రియమైన దాదీని కూడా చూసారు కదా, సఫలము చేసారు మరియు ఇతరులలో కూడా సఫలము చెయ్యాలి అన్న ఉల్లాస-ఉత్సాహాలను పెంచారు. డ్రామా అనుసారముగా విశేషముగా విశ్వ సేవ కోసము అలౌకిక పాత్రకు నిమిత్తమయ్యారు.

ఈ సంవత్సరము, రేపటి నుండి ప్రతి రోజూ మీ చార్ట్ పెట్టుకోండి - సఫలము మరియు వ్యర్థము - ఏమైంది, ఎంత అయింది? సఫలత నా జన్మ సిద్ధ అధికారము, సఫలత నా మెడలోని హారము - అని అమృతవేళలోనే దృఢ సంకల్పము చేయండి, స్మృతి స్వరూపులుగా అవ్వండి. సఫలత స్వరూపముగా అవ్వడమే సమానముగా అవ్వడము. బ్రహ్మాబాబాపై ప్రేమ ఉంది కదా. మరి బ్రహ్మాబాబాకు అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమ దేనిపై ఉండేది? తెలుసా? దేనిపై ప్రేమ ఉండేది? మురళిపై. చివరి రోజు కూడా మురళి యొక్క పాత్రను మిస్ చెయ్యలేదు. మరి సమానముగా అవ్వడములో ఇది చెక్ చేసుకోండి - బ్రహ్మాబాబాకు దేనిపై అయితే ప్రేమ ఉండేదో, బ్రహ్మాబాబాపై ఉన్న ప్రేమకు ఋజువు ఏమిటంటే - బాబాకు దేనిపై ప్రేమ ఉండేదో దానిపై నా ప్రేమ స్వతహాగా మరియు సహజముగా ఉండాలి. బ్రహ్మాబాబా యొక్క మరో విశేషత ఏమిటి? సదా అలర్ట్. నిర్లక్ష్యము లేదు. చివరి రోజు కూడా ఎంత అలర్ట్ రూపములో తమ సేవా పాత్రను వహించారు. శరీరము బలహీనముగా ఉన్నా కానీ ఏ విధముగా అలర్ట్ గా ఉన్నారు, ఆధారము తీసుకుని కూర్చోలేదు, మరియు అందరినీ అలర్ట్ చేసి వెళ్ళారు. మూడు విషయాల మంత్రాన్ని ఇచ్చి వెళ్ళారు. అందరికీ గుర్తుంది కదా. మరి ఎంత అలర్ట్ గా ఉంటారో, ఫాలో చేస్తారో, అంతగా నిర్లక్ష్యము సమాప్తము అవుతుంది. నిర్లక్ష్యముతో కూడిన విశేషమైన మాటలను బాప్ దాదా చాలా వింటూ ఉంటారు. తెలుసు కదా! ఒకవేళ ఈ మూడు పదాలను (నిరాకారీ, నిర్వికారీ మరియు నిరహంకారీ) సదా మీ మనసులో రివైజ్ మరియు రియలైజ్ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆటోమేటిక్ గా, సహజముగా మరియు స్వతహాగా సమానముగా తప్పకుండా అవుతారు. కావున ఒక విషయము - సఫలము చెయ్యండి, సఫలతా మూర్తులుగా అవ్వండి.

పిల్లల యొక్క సంవత్సరపు రిజల్టును బాప్ దాదా చూసారు. ఏమి చూసారు? మహాదానిగా అయ్యారు కానీ అఖండ మహాదాని, అఖండ అన్న పదాన్ని అండర్ లైన్ చేయండి. అఖండ మహాదానిగా, అఖండ యోగిగా, అఖండ నిర్విఘ్నముగా, ఇప్పుడు ఇలా అవ్వవలసిన అవసరముంది. మరి అఖండముగా అవ్వడము వీలవుతుందా? వీలవుతుందా? మొదటి లైన్ వారు చెప్పండి, అఖండముగా అవ్వడము వీలవుతుందా? వీలవుతుంది అని అనుకుంటే చేతులెత్తండి? ఎవరైతే చేయగలరో, వారు చేయగలరా? మధుబన్ వారు కూడా చేతులు ఎత్తుతున్నారు. బాప్ దాదా మధుబన్ వారిని ముందుగా చూస్తారు. మధుబన్ పై ప్రేమ ఉంది. శాంతివన్ లేక పాండవ భవన్ లేక ఎవరెవరైతే దాదీల భుజాలుగా ఉన్నారో, వారందరినీ బాప్ దాదా శ్రద్ధతో చూస్తారు. ఒకవేళ అఖండముగా అయినట్లయితే, మనసుతో శక్తిని వ్యాపింపజేసే సేవలో బిజీగా ఉండండి, వాచాతో జ్ఞాన సేవ మరియు కర్మలతో గుణాల దానాన్ని లేక గుణాల సహయోగాన్ని ఇచ్చే సేవ చేయండి.

ఈ రోజుల్లో అజ్ఞానీ ఆత్మలు కావచ్చు, బ్రాహ్మణ ఆత్మలు కావచ్చు, అందరికీ గుణాల దానము, గుణాల సహయోగాన్ని ఇవ్వడము అవసరము. ఒకవేళ స్వయము సహజముగా, సింపుల్ రూపములో శ్యాంపుల్ గా అయి ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఇతరులకు మీ గుణమూర్తి యొక్క సహయోగము స్వతహాగానే లభిస్తుంది. ఈ రోజుల్లో బ్రాహ్మణ ఆత్మలు కూడా శ్యాంపుల్ చూడాలనుకుంటున్నారు, వినాలనుకోవడము లేదు. పరస్పరములో కూడా ఏమని మాట్లాడుకుంటారు? ఎవరు తయారయ్యారని - ఇలా అనుకుంటారు. కావున ప్రత్యక్ష రూపములో గుణమూర్తిని చూడాలని కోరుకుంటున్నారు. కావున కర్మలతో విశేషముగా గుణాల సహయోగాన్ని, గుణాల దానాన్ని చేయవలసిన అవసరముంది. ఎవ్వరూ వినాలని కోరుకోవటము లేదు, చూడాలని కోరుకుంటున్నారు. కావున ఇప్పుడు విశేషముగా ఈ విషయము పట్ల శ్రద్ధ పెట్టండి - జ్ఞానముతో, వాచాతో అయితే సేవ చేస్తూనే ఉంటారు మరియు చేస్తూనే ఉండాలి, వదిలిపెట్టకూడదు. కానీ ఇప్పుడు మనసా మరియు కర్మలు... మనసా ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపజేయండి, సకాష్ ను వ్యాపింపజేయండి. వైబ్రేషన్లను మరియు సకాష్ ను దూరముగా కూర్చుని కూడా అందించవచ్చు. శుభ భావన, శుభ కామన ద్వారా ఏ ఆత్మకైనా మనసా సేవ ద్వారా వైబ్రేషన్లను మరియు శక్తిని ఇవ్వవచ్చు. కావున ఇప్పుడు ఈ సంవత్సరము, ఒకటేమో, మనసా శక్తుల వైబ్రేషన్లను, శక్తుల ద్వారా సకాష్ ను మరియు కర్మల ద్వారా గుణాల సహయోగాన్ని మరియు అజ్ఞానీ ఆత్మలకు గుణ దానాన్ని ఇవ్వండి.

కొత్త సంవత్సరములో కానుకను కూడా ఇస్తారు కదా. కావున ఈ సంవత్సరము స్వయం గుణమూర్తులుగా అయి గుణాల కానుకను ఇవ్వండి. గుణాల టోలీని తినిపిస్తారు కదా. కలిసినప్పుడు టోలీ తినిపిస్తారు కదా. టోలీని తినిపించడములో సంతోషపడతారు కదా. కొంతమంది ఆత్మలు, ఇక్కడ నుండి వెళ్ళిపోయినవారు కూడా టోలీని గుర్తు చేసుకుంటారు. వేరే విషయాలను మర్చిపోతారు కానీ టోలీ గుర్తుంటుంది. మరి ఈ సంవత్సరము ఏ టోలీని తినిపిస్తారు? గుణాల టోలీని తినిపించండి, గుణాల పిక్నిక్ ను చెయ్యండి, ఎందుకంటే బాబా సమానముగా సమయము యొక్క సమీపత అనుసారముగా మరియు దాదీ యొక్క సూచన అనుసారముగా సమయము యొక్క సమీపత అకస్మాత్తుగా ఎప్పుడైనా జరిగే అవకాశము ఉంది. అందుకే బాబా సమానముగా అవ్వాలి మరియు దాదీకు ప్రేమ యొక్క రిటర్న్ ను ఇవ్వాలి. మనసా మరియు కర్మల ద్వారా సహయోగిగా అవ్వడము చాలా అవసరము, ఎవరు ఎటువంటివారైనా సరే, వీరు తయారైతే నేను తయారవుతాను అని ఇలా ఆలోచించకండి. నంబర్ వన్ గా అవ్వాలంటే ఎప్పుడూ కూడా - వీరు తయారైతే నేను తయారవుతాను అని అనుకోకండి. అలా చేస్తే మొదటి నంబరులో తయారయ్యేవారు తయారైపోతారు, కానీ మీరు రెండవ నంబరులోకి వచ్చేస్తారు. మీరు రెండవ నంబరువారిగా అవ్వాలనుకుంటున్నారా లేక మొదటి నంబరువారుగా అవ్వాలనుకుంటున్నారా? మామూలుగా ఎవరినైనా, మీరు రెండవ నంబరు తీసుకోండి అని అంటే ఒప్పుకుంటారా? అందరూ మొదటి నంబరు తీసుకుంటాము అనే అంటారు. కావున ముందుగా నిమిత్తముగా అవ్వాలి. ఇతరులను నిమిత్తముగా ఎందుకు చేస్తారు? స్వయాన్ని నిమిత్తముగా చేసుకోండి కదా. బ్రహ్మాబాబా ఏమన్నారు? ప్రతి విషయములోనూ స్వయాన్ని నిమిత్తము చేసుకుని ఆ తర్వాత నిమిత్తము చేసారు. హే అర్జున్ గా అయి పాత్రను వహించారు. నేను నిమిత్తము అవ్వాలి, నేను చెయ్యాలి అని అనుకున్నారు. ఇతరులు చేస్తారు కానీ నన్ను చూసి ఇతరులు చేస్తారు అని అనుకున్నారు. ఇతరులు చేస్తే నేను చేస్తాను అని అనుకోలేదు. నన్ను చూసి ఇతరులు చేస్తారు - ఇది బ్రహ్మాబాబా యొక్క మొదటి పాఠము. మరి విన్నారా ఏమి చెయ్యాలో? సఫలతా మూర్తులు, సఫలమైన సఫలతా మూర్తులు, అఖండ దాని, అప్పుడు మాయకు రావడానికి ధైర్యమే ఉండదు. ఎప్పుడైతే అఖండ మహాదానిగా అవుతారో, నిరంతర సేవాధారిగా ఉంటారో, బిజీగా ఉంటారో, మనసు, బుద్ధి సేవాధారిగా ఉంటాయో, అప్పుడు మాయ ఎక్కడి నుండి వస్తుంది? మరి ఇప్పుడు ఈ సంవత్సరము ఎలా తయారవ్వాలి? అందరి హృదయాల నుండి ఒకే మాట రావాలి, దీనినే బాప్ దాదా కోరుకుంటున్నారు. అది ఏమిటి? నో ప్రాబ్లమ్ మరియు కంప్లీట్. ప్రాబ్లమ్ కాదు, కంప్లీట్ అవ్వాల్సిందే (సంపన్నముగా అవ్వాల్సిందే). దృఢ నిశ్చయ బుద్ధి కలవారిగా, విజయమాలలోని సమీప మణిగా అవ్వాల్సిందే. సరేనా! అవ్వాలి కదా! మధుబన్ వారు, అవ్వాల్సిందేనా? నో కంప్లయింట్? నో కంప్లయింట్? (ఫిర్యాదులు ఏమీ లేవా?) ధైర్యము ఉంచేవారు చేతులెత్తండి. నో ప్రాబ్లమ్! వాహ్! అభినందనలు, అభినందనలు, అభినందనలు.

చూడండి, నిశ్చయానికి ప్రత్యక్ష ప్రమాణము - ఆత్మిక నషా. ఒకవేళ ఆత్మిక నషా లేకపోతే నిశ్చయము కూడా ఉండదు. పూర్తి నిశ్చయము లేదు, కొద్దో-గొప్పో ఉంది. కావున నషా ఉంచుకోండి - ఇదేమంత పెద్ద విషయము! ఎన్ని కల్పాలు మీరే తండ్రి సమానముగా అయ్యారు, గుర్తుందా? లెక్కలేనన్ని సార్లు అయ్యారు. కావున ఈ నషా పెట్టుకోండి - మేమే అయ్యాము, మేమే అలా ఉన్నాము మరియు మేమే మళ్ళీ-మళ్ళీ అవుతూ ఉంటాము. ఈ నషా సదా కర్మలలో కనిపించాలి. సంకల్పములో కాదు, మాటలలో కాదు, కానీ కర్మలలో కనిపించాలి, కర్మలలో అనగా నడవడికలో, ముఖముపై కనిపించాలి. కావున హోమ్ వర్క్ లభించిందా. లభించింది కదా? ఇప్పుడు చూస్తాము, నంబరువారులోకి వస్తారా లేక నంబరువన్ లోకి వస్తారా? అచ్ఛా!

బాప్ దాదా వద్దకు కార్డులు, ఉత్తరాలు, ఈ-మెయిల్స్, ప్రియస్మృతులు, కంప్యూటర్ ద్వారా కూడా చాలా వచ్చాయి మరియు బాప్ దాదా దూరముగా కూర్చుని ఉన్న హృదయ సింహాసనాధికారీ పిల్లలకు, ప్రతి ఒక్కరికీ పేరు సహితముగా, విశేషతా సహితముగా ప్రియస్మృతులను మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలను సమ్ముఖముగా ఇమర్జ్ చేసుకుని ఇస్తున్నారు. బాప్ దాదాకు తెలుసు, ప్రేమ అయితే అందరికీ ఉంది మరియు బాప్ దాదా సదా అమృతవేళలో విశేషముగా బ్రాహ్మణ ఆత్మలకు ప్రియస్మృతుల యొక్క రెస్పాన్స్ ను విశేషముగా ఇస్తారు. అందుకే కార్డులు కూడా చాలా మంచివి-మంచివి చేసారు. వాటిని ఇక్కడ (స్టేజ్ పై) పెడతారు, కానీ బాప్ దాదా వద్దకైతే వతనములోకి అంతకంటే ముందే చేరుకుంటాయి. అచ్ఛా!

నలువైపులా మెరుస్తున్న ఆత్మిక దీపాలైన పిల్లలకు, సదా సఫలము చేసే సఫలతా స్వరూపులైన పిలల్లకు, సదా అఖండ మహాదాని, అఖండ నిర్విఘ్న, అఖండ జ్ఞానయుక్తులు మరియు యోగయుక్తులు, సదా ఒకే సమయములో మూడు సేవలను చేసేవారు, మనసా వైబ్రేషన్ల ద్వారా, వాయుమండలము ద్వారా, వాచా వాణి ద్వారా, నడవడిక మరియు ముఖము మరియు కర్మల ద్వారా, మూడు సేవలూ ఒకే సమయములో కలిపి జరగాలి, అప్పుడు మీ ప్రభావము ఉంటుంది. బాగుంది అని అనేవారు కాదు, బాగా తయారయ్యేవారి మీద మీ ప్రభావము పడుతుంది. అనుభవీ మూర్తి ద్వారా అనుభవము చేయించే ఇటువంటి పిల్లలకు బాప్ దాదా యొక్క కొత్త సంవత్సరానికి పదమాల, పదమాల రెట్లు ప్రియస్మృతులు, ఆశీర్వాదాలు మరియు హృదయ సింహాసనము సదా సింహాసనాధికారులుగా చేస్తుంది, అందుకే నలువైపులా ఉన్న పిల్లలకు, ఎవరైతే సమ్ముఖములో ఉన్నారో లేక దూరముగా ఉన్నా కానీ హృదయ సింహాసనముపై ఉన్నారో, వారందరికీ పేరు సహితముగా మరియు విశేషతా సహితముగా ప్రియస్మృతులు మరియు నమస్తే.

అచ్ఛా, ఎవరైతే మొదటిసారి వచ్చారో, వారు లేచి నిలబడండి, చేతులు ఊపండి. చూడండి, సగం క్లాస్ మొదటిసారి వచ్చినవారే ఉన్నారు. వెనుక ఉన్నవారు చేతులు ఊపండి. టి.వీ.లో కనిపిస్తుంది. చాలామంది ఉన్నారు. మొదటిసారిగా వచ్చినవారికి బాప్ దాదా నుండి చాలా-చాలా హృదయపూర్వక అభినందనలు కూడా మరియు హృదయపూర్వక ప్రియస్మృతులు కూడా. ఇప్పుడు ఎలా అయితే వచ్చారో, ఇప్పుడు వచ్చినవారికి బాప్ దాదా ‘‘అమర భవ’’ అని వరదానాన్ని ఇస్తున్నారు.

వరదానము:-
నిందించేవారికి కూడా గుణ మాలను వేసే ఇష్ట దేవ మహానాత్మా భవ

ఏ విధముగా ఈ రోజుల్లో విశేష ఆత్మలైన మీకు స్వాగతము పలికే సమయములో ఎవరైనా మీ మెడలో స్థూల మాలను వేస్తే మీరు వెంటనే దానిని తిరిగి ఆ వేసినవారి మెడలోనే వేసేస్తారో, అదే విధముగా నిందించేవారికి కూడా మీరు గుణ మాలను వేసినట్లయితే వారు స్వతహాగానే మీకు గుణ మాలను రిటర్న్ చేస్తారు ఎందుకంటే నిందించేవారికి గుణ మాలను వేయడము అనగా జన్మ-జన్మల కొరకు వారిని భక్తులుగా నిశ్చితము చేసుకోవడము. ఇలా ఇవ్వడమే అనేక సార్లు కోసం తీసుకోవడముగా అవుతుంది. ఈ విశేషతయే ఇష్టదేవులుగా, మహానాత్మలుగా చేస్తుంది.

స్లోగన్:-
మీ మనసా వృత్తిని సదా మంచిగా, శక్తిశాలిగా చేసుకున్నట్లయితే చెడు కూడా మంచిగా అయిపోతుంది.

అవ్యక్త సూచనలు - అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి

నలువైపులా కార్యానికి సంబంధించి ఎంతటి పెనుగులాట ఉన్నా కానీ, బుద్ధి సేవా కార్యములో అతి బిజీగా ఉన్నా కానీ, అటువంటి సమయములో అశరీరిగా అయ్యే అభ్యాసము చేసి చూడండి. యథార్థ సేవ ఎప్పుడూ బంధనము అవ్వదు, ఎందుకంటే యోగయుక్తమైన, యుక్తియుక్తమైన సేవాధారి సదా సేవ చేస్తూ కూడా ఉపరామముగా ఉంటారు. సేవ ఎక్కువగా ఉంది, అందుకే అశరీరిగా అవ్వలేకపోతున్నాను అన్నది కాదు. ఇది నా సేవ కాదు, బాబా ఇచ్చారు అని గుర్తు పెట్టుకోండి, అప్పుడు నిర్బంధనులుగా ఉంటారు.