24-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల
పుష్ప సమానముగా పవిత్రముగా తయారవ్వాలి, ఒక్క తండ్రి మతముపైనే నడుచుకోవాలి, ఎటువంటి
డిస్సర్వీస్ చేయకూడదు’’
ప్రశ్న:-
ఏ
పిల్లలపై మాయ జోరుగా తన పంజాను విసురుతుంది? పెద్ద గమ్యమేమిటి?
జవాబు:-
ఏ పిల్లలైతే
దేహాభిమానములో ఉంటారో, వారిపై మాయ జోరుగా పంజా విసురుతుంది, అప్పుడు వారు
నామ-రూపాలలో చిక్కుకుంటారు. దేహాభిమానము రావడముతోనే చెంపదెబ్బ తగులుతుంది, దీని వలన
పదవి భ్రష్టమైపోతుంది. దేహాభిమానాన్ని తెంచడము, ఇదే పెద్ద గమ్యము. బాబా అంటారు,
పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి. ఎలాగైతే తండ్రి విధేయత కల సేవాధారిగా ఉన్నారో,
ఎంతో నిరహంకారిగా ఉన్నారో, అలా నిరహంకారిగా అవ్వండి, ఎటువంటి అహంకారము ఉండకూడదు.
పాట:-
వారు మా నుండి
వేరు కారు...
ఓంశాంతి
పిల్లలు పాటను విన్నారు. పిల్లలు అంటారు, మూలవతనములో ఉన్నప్పుడు, మేము బాబాకు
చెందినవారిగా ఉండేవారము మరియు బాబా మావారిగా ఉండేవారు. పిల్లలైన మీకు జ్ఞానమైతే మంచి
రీతిలో లభించింది. మనము చక్రములో తిరిగి వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనము
వారికి చెందినవారిగా అయ్యాము. వారు రాజయోగాన్ని నేర్పించి స్వర్గానికి యజమానులుగా
తయారుచేయడానికి వచ్చారు. కల్పక్రితము వలె మళ్ళీ వచ్చారు. ఇప్పుడు తండ్రి - ఓ పిల్లలూ
అని అంటారు, కానీ పిల్లలుగా అయి ఇక్కడ మధుబన్ లో కూర్చుండిపోకూడదు. మీరు మీ గృహస్థ
వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా పవిత్రముగా ఉండండి. కమల పుష్పము నీటిలో ఉంటుంది
కానీ నీటి పైన ఉంటుంది, దానికి నీరు అంటుకోదు. తండ్రి అంటారు, మీరు ఉండటము ఇంటిలోనే
ఉండాలి, కానీ కేవలం పవిత్రముగా అవ్వాలి. ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ.
మనుష్యమాత్రులంతా ఎవరైతే ఉన్నారో, వారందరినీ పావనముగా తయారుచేయడానికి నేను వచ్చాను.
పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత ఒక్కరే. వారు తప్ప ఇంకెవ్వరూ పావనముగా చేయలేరు.
అర్ధకల్పము నుండి మనము మెట్లు దిగుతూ వచ్చామని మీకు తెలుసు. 84 జన్మలను మీరు
తప్పకుండా పూర్తి చేయాలి మరియు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసి ఎప్పుడైతే మళ్ళీ
శిథిలావస్థకు చేరుకుంటారో, అప్పుడు నేను రావలసి ఉంటుంది. మధ్యలో ఇంకెవ్వరూ పతితుల
నుండి పావనులుగా చేయలేరు. తండ్రి గురించి గాని, రచన గురించి గాని ఎవ్వరికీ తెలియదు.
డ్రామానుసారముగా అందరూ కలియుగములో పతితముగా, తమోప్రధానముగా అవ్వవలసిందే. తండ్రి
వచ్చి అందరినీ పావనముగా తయారుచేసి శాంతిధామానికి తీసుకువెళ్తారు, మరియు మీరు తండ్రి
నుండి సుఖధామము యొక్క వారసత్వాన్ని పొందుతారు. సత్యయుగములో ఎటువంటి దుఃఖము ఉండదు.
ఇప్పుడు మీరు జీవిస్తూ తండ్రికి చెందినవారిగా అయ్యారు. తండ్రి అంటారు, మీరు గృహస్థ
వ్యవహారములో ఉండాలి. మీరు ఇళ్ళు-వాకిళ్ళను వదలండి అని బాబా ఎప్పుడూ ఎవరికీ చెప్పరు.
లేదు. గృహస్థ వ్యవహారములో ఉంటూ కేవలం ఈ అంతిమ జన్మ పవిత్రముగా అవ్వాలి. మీరు
ఇళ్ళు-వాకిళ్ళను వదలండి అని బాబా ఎప్పుడైనా చెప్పారా. లేదు. ఈశ్వరీయ సేవార్థము మీకు
మీరే వదిలేశారు. చాలామంది పిల్లలు ఇంటిలో, గృహస్థములో ఉంటూ కూడా ఈశ్వరీయ సేవ
చేస్తున్నారు. వారిని విడిపించడము జరగదు. బాబా ఎవ్వరినీ గృహస్థము నుండి విడిపించరు.
మీ అంతట మీరే సేవ చేయడానికని వచ్చారు. బాబా ఎవ్వరినీ విడిపించలేదు. మీ లౌకిక తండ్రి
వివాహము చేసుకోమని చెప్తారు. కానీ మీరు చేసుకోరు, ఎందుకంటే ఇప్పుడిది మృత్యులోకము
యొక్క అంతిమమని మీకు తెలుసు. వివాహము సర్వనాశనమే చేస్తుంది, ఇక మనము పావనముగా ఎలా
అవుతాము. మనము భారత్ ను స్వర్గముగా తయారుచేసే సేవలో ఎందుకు నిమగ్నమవ్వకూడదు.
రామరాజ్యము కావాలని పిల్లలు కోరుకుంటారు. ఓ పతిత-పావన సీతారామ అని పిలుస్తారు కదా.
ఓ రామ, వచ్చి భారత్ ను స్వర్గముగా తయారుచేయండి అని అంటారు. అంటారు కానీ ఏమీ అర్థం
చేసుకోరు. ఈ సమయములోని సుఖము కాకిరెట్టతో సమానమని సన్యాసులు అంటారు. నిజంగా అలాగే
ఉంది. ఇక్కడ సుఖమనేది లేనే లేదు. ఇలా అంటూ ఉంటారు కానీ ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు.
తండ్రి దుఃఖాన్ని కలిగించేందుకేమీ ఈ సృష్టిని రచించరు. తండ్రి అంటారు, స్వర్గములో
దుఃఖము యొక్క నామ-రూపాలే ఉండవని మీరు మర్చిపోయారా. అక్కడ కంసుడు మొదలైనవారు ఎక్కడ
నుండి వస్తారు.
ఇప్పుడు అనంతమైన తండ్రి ఏదైతే వినిపిస్తారో, వారి మతముపై నడుచుకోవాలి. మీ
మన్మతముపై నడుచుకున్నట్లయితే సర్వనాశనము చేసుకుంటారు. ఆశ్చర్యము కలిగేలా వింటారు,
వినిపిస్తారు, పారిపోతారు మరియు ట్రెయిటర్లుగా అవుతారు. వెళ్ళి ఎంతగా డిస్సర్వీస్
చేస్తారు. అటువంటివారి పరిస్థితి ఏమవుతుంది? వజ్ర సమానమైన జీవితాన్ని
తయారుచేసుకునేందుకు బదులుగా గవ్వలా చేసుకుంటారు. ఇటువంటి నడవడిక కారణముగా ఈ పదవిని
పొందారు అని చివరిలో మీకు మీదంతా సాక్షాత్కారమవుతుంది. ఇక్కడైతే మీరు ఎలాంటి పాపము
చేయకూడదు, ఎందుకంటే మీరు పుణ్యాత్ములుగా అవుతారు. పాపం చేస్తే వంద రెట్లు శిక్ష
పడుతుంది. అయితే, స్వర్గములోకైతే వస్తారు కానీ చాలా తక్కువ పదవిని పొందుతారు.
ఇక్కడికి మీరు రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చారు కానీ ప్రజలుగా అవుతారు.
పదవులలోనైతే చాలా తేడా ఉంటుంది కదా. యజ్ఞానికి ఏదైనా ఇచ్చి మళ్ళీ తిరిగి
తీసుకున్నట్లయితే చండాలుని జన్మ లభిస్తుందని కూడా అర్థం చేయించారు. చాలామంది పిల్లలు
పదవి తగ్గిపోయే విధమైన నడవడికను నడుచుకుంటూ ఉంటారు.
బాబా అర్థం చేయిస్తున్నారు, రాజు-రాణికి బదులుగా ప్రజలలో కూడా తక్కువ పదవిని
పొందే కర్మలు చేయకండి. యజ్ఞములో స్వాహా అయిన తర్వాత పారిపోతే, వారు అక్కడికి
వెళ్ళిన తర్వాత ఏమవుతారు. తండ్రి ఇది కూడా అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఎలాంటి
వికర్మలను చేయకండి, లేకపోతే వంద రెట్లు శిక్షలు లభిస్తాయి. మరి అటువంటప్పుడు ఎందుకు
నష్టపర్చుకోవాలి. ఇక్కడ ఉన్నవారి కంటే కూడా, ఎవరైతే ఇంటిలో, గృహస్థములో ఉంటున్నారో,
సేవ చేస్తున్నారో, వారు ఎంతో ఉన్నతమైన పదవిని పొందుతారు. 8 అణాలు లేక ఒక్క రూపాయిని
పంపించే పేదవారు చాలామంది ఉన్నారు, ఇంకెవరైనా ఇక్కడ వెయ్యి రూపాయలు ఇచ్చినా కానీ
పేదవారికే ఉన్నతమైన పదవి లభిస్తుంది ఎందుకంటే పేదవారు ఎలాంటి పాప కర్మలు చేయరు.
పాపము చేస్తే వంద రెట్లు అయిపోతుంది. మీరు పుణ్యాత్ములుగా అయి అందరికీ సుఖాన్ని
ఇవ్వాలి. దుఃఖము ఇచ్చినట్లయితే న్యాయసభ కూర్చుంటుంది. మీరు ఇవి-ఇవి చేసారు, ఇప్పుడు
శిక్ష అనుభవించండి అని సాక్షాత్కారము కలుగుతుంది. పదవి కూడా భ్రష్టమైపోతుంది. వింటూ
కూడా ఉంటారు కానీ చాలామంది పిల్లలు తప్పుడు నడవడికను నడుస్తూ ఉంటారు. తండ్రి అంటారు,
సదా క్షీరఖండము వలె ఉండండి. ఒకవేళ ఉప్పునీరులా ఉన్నట్లయితే, చాలా డిస్సర్వీస్
చేస్తారు. ఎవరి నామ-రూపాలలోనైనా చిక్కుకుంటే, అది కూడా చాలా పాపమైపోతుంది. మాయ ఒక
ఎలుక వంటిది, ఊదుతుంది కూడా, కరుస్తుంది కూడా, రక్తము కూడా వస్తుంది, అయినా అసలు
తెలియనే తెలియదు. మాయ కూడా రక్తము వచ్చేలా చేస్తుంది. ఎలాంటి కర్మలు చేయిస్తుందంటే,
అసలు ఏమి చేస్తున్నారనేది అర్థం కూడా కాదు. 5 వికారాలు ఒక్కసారిగా తలను తిప్పేస్తాయి.
బాబా అయితే సావధానపరుస్తూ ఉంటారు కదా. మమ్మల్ని సావధానపరచలేదని న్యాయసభ ఎదురుగా అనే
విధముగా ఉండకూడదు. ఈశ్వరుడు చదివిస్తున్నారని మీకు తెలుసు. వారు ఎంత నిరహంకారి. నేను
విధేయత కల సేవకుడిని అని అంటారు. కొంతమంది పిల్లల్లో ఎంత అహంకారము ఉంటుంది. బాబాకు
చెందినవారిగా అయినా కూడా ఎటువంటి కర్మలను చేస్తారంటే, ఇక అడగకండి. వారికన్నా, బయట
గృహస్థ వ్యవహారములో ఉండేవారు చాలా ఉన్నతిలోకి వెళ్ళిపోతారు. దేహాభిమానము రావడముతోనే
మాయ జోరుగా పంజాను విసురుతుంది. దేహాభిమానాన్ని తెంచడము పెద్ద గమ్యము. దేహాభిమానము
రాగానే చెంపదెబ్బ తగులుతుంది. మరి అటువంటప్పుడు పదవి భ్రష్టమయ్యే విధముగా
దేహాభిమానములోకి అసలు ఎందుకు రావాలి. అక్కడికి వెళ్ళి ఊడ్చే పని చేయవలసి వచ్చేలా
ఉండకూడదు. ఇప్పుడు ఒకవేళ బాబాను ఎవరైనా అడిగితే బాబా చెప్పగలరు. నేను ఎంత సేవ
చేస్తున్నాను, నేను ఎంతమందికి సుఖాన్ని ఇచ్చాను అనేది స్వయము కూడా అర్థం చేసుకోగలరు.
బాబా, మమ్మా అందరికీ సుఖాన్ని ఇస్తారు. అందరూ ఎంత సంతోషపడతారు. బాబా బొంబాయిలో ఎంత
జ్ఞాన డ్యాన్స్ చేసేవారు, చాలామంది ఛాత్రకులు ఉండేవారు కదా. తండ్రి అంటారు, చాలామంది
ఛాత్రకులు ఉన్నప్పుడు వారి ఎదురుగా జ్ఞాన డ్యాన్స్ చేస్తాను, అప్పుడు మంచి-మంచి
పాయింట్లు వెలువడుతాయి. ఛాత్రకులు ఆకర్షిస్తారు. మీరు కూడా అలా అవ్వాలి, అప్పుడే
మీరు ఫాలో చేయగలుగుతారు కదా. శ్రీమతముపై నడవాలి. స్వయము యొక్క మతముపై నడుచుకుని
అప్రతిష్ఠపాలు చేసినట్లయితే చాలా నష్టము కలుగుతుంది. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని
తెలివైనవారిగా చేస్తున్నారు. భారత్ స్వర్గముగా ఉండేది కదా. ఇప్పుడు అలా ఉందని ఎవ్వరూ
భావించరు. భారత్ వంటి పావనమైన దేశము ఏదీ లేదు అని అంటారు కానీ భారతవాసులైన మనమే
స్వర్గవాసులుగా ఉండేవారమని, అక్కడ అపారమైన సుఖముండేదని అర్థం చేసుకోరు. భగవంతుడు
వచ్చి మురికి పట్టిన వస్త్రాలను శుభ్రము చేస్తారని గురునానక్ భగవంతుని మహిమను చేసారు.
ఏక్ ఓంకార్... అని వారినే మహిమ చేస్తారు. శివలింగానికి బదులుగా అకాల్ తక్త్ (అకాల
సింహాసనము) అనే పేరును పెట్టారు. ఇప్పుడు తండ్రి మీకు మొత్తం సృష్టి యొక్క
రహస్యాన్ని అర్థం చేయిస్తారు. పిల్లలూ, ఒక్క పాపము కూడా చేయకండి, లేకపోతే అది వంద
రెట్లు అయిపోతుంది. నన్ను నిందింపజేస్తే పదవి భ్రష్టమైపోతుంది. చాలా సంభాళించుకోవాలి.
తమ జీవితాన్ని వజ్ర సమానముగా చేసుకోండి, లేకపోతే చాలా పశ్చాత్తాపపడతారు. తప్పుడు
కర్మలు ఏవైతే చేశారో, అవి లోపల తింటూ ఉంటాయి. మేము కల్ప-కల్పము ఇటువంటి పనులే చేసి
నీచమైన పదవిని పొందుతామా అని అనిపిస్తుంది. తండ్రి అంటారు, తల్లి-తండ్రులను ఫాలో
చేయాలనుకుంటే సత్యతతో సేవ చేయండి. మాయ అయితే ఎక్కడో ఒకచోట నుండి లోపలికి దూరి
వచ్చేస్తుంది. సెంటర్ హెడ్స్ అయితే పూర్తిగా నిరహంకారిగా ఉండాలి. తండ్రిని చూడండి,
ఎంత నిరహంకారిగా ఉన్నారు. కొంతమంది పిల్లలు ఇతరుల నుండి సేవ తీసుకుంటారు. తండ్రి
ఎంత నిరహంకారి. ఎప్పుడూ ఎవరిపైనా కోప్పడరు. పిల్లలు ఒకవేళ ఆజ్ఞను పాటించనివారైతే,
తండ్రి వారికి అర్థం చేయించగలరు. మీరు ఏమి చేస్తున్నారు అనేది అనంతమైన తండ్రికి
మాత్రమే తెలుసు. పిల్లలందరూ ఒకే లాంటి సుపుత్రులుగా ఉండరు, కుపుత్రులు కూడా ఉంటారు.
బాబా వివరణను ఇస్తున్నారు. ఎంతోమంది పిల్లలు ఉన్నారు. వృద్ధి చెందుతూ సంఖ్య వేలకు
చేరుకుంటుంది. తండ్రి పిల్లలను సావధానపరుస్తున్నారు కూడా - ఎటువంటి పొరపాట్లు
చేయకండి. ఇక్కడికి పతితుల నుండి పావనముగా అయ్యేందుకు వచ్చారు కనుక ఎటువంటి పతిత
కర్మ చేయకండి. నామ-రూపాలలో కూడా చిక్కుకోకూడదు, దేహాభిమానములోకి కూడా రాకూడదు.
దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. శ్రీమతముపై నడుస్తూ ఉండండి.
మాయ చాలా శక్తివంతమైనది. బాబా అంతా అర్థం చేయిస్తారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి సమానముగా నిరహంకారిగా అవ్వాలి. ఎవరి నుండి సేవ తీసుకోకూడదు. ఎవరికీ
దుఃఖమునివ్వకూడదు. శిక్షలు అనుభవించవలసి వచ్చే విధమైన పాప కర్మలేవీ జరగకూడదు.
పరస్పరము క్షీరఖండము వలె ఉండాలి.
2. ఒక్క తండ్రి యొక్క శ్రీమతముపైనే నడవాలి, స్వయము యొక్క మతముపై కాదు.
వరదానము:-
క్షణములో దేహము రూపీ వస్త్రము నుండి అతీతముగా అయ్యి
కర్మభోగముపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే సర్వ శక్తి సంపన్న భవ
కర్మభోగము యొక్క తీవ్రత ఉన్నప్పుడు, కర్మేంద్రియాలు
కర్మభోగానికి వశమై తమవైపుకు ఆకర్షితము చేస్తాయి అనగా ఏ సమయములోనైతే చాలా ఎక్కువ
నొప్పి ఉంటుందో, అటువంటి సమయములో కర్మభోగాన్ని కర్మయోగములోకి పరివర్తన చేసేవారు,
సాక్షీగా అయ్యి కర్మేంద్రియాల ద్వారా అనుభవింపచేసేవారే సర్వ శక్తి సంపన్నమైన అష్ట
రత్న విజయులుగా పిలవబడతారు. దాని కోసం బహుకాలము నుండి దేహము రూపీ వస్త్రము నుండి
అతీతముగా అయ్యే అభ్యాసము ఉండాలి. ఈ వస్త్రము ప్రాపంచిక ఆకర్షణ లేక మాయా ఆకర్షణ వలన
టైట్ గా అవ్వకూడదు, అప్పుడే సహజముగా వదలగలుగుతారు.
స్లోగన్:-
సర్వుల
నుండి గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేందుకు నిర్మానచిత్తులుగా అవ్వండి - నిర్మానత
మహానతకు గుర్తు.
మాతేశ్వరి గారి
అమూల్యమైన మహావాక్యాలు -
1. ‘‘ఈశ్వరుడు
సర్వవ్యాపి కారు, అందుకు ఋజువు ఏమిటి?’’
శిరోమణి అయిన గీతలోని
భగవానువాచ ఏమిటంటే - పిల్లలూ, ఎక్కడైతే విజయము ఉందో అక్కడ నేను ఉన్నాను. ఇది కూడా
పరమాత్ముని మహావాక్యము - పర్వతాలలో హిమాలయ పర్వతమేదైతే ఉందో అందులో నేను ఉన్నాను
మరియు సర్పాలలో కాలనాగులో నేను ఉన్నాను. అందుకే పర్వతాలలో ఉన్నతమైన పర్వతముగా కైలాస
పర్వతాన్ని చూపిస్తారు మరియు సర్పాలలో కాలనాగును చూపిస్తారు. దీని బట్టి ఏమి ఋజువు
అవుతుందంటే, పరమాత్మ ఒకవేళ అన్ని సర్పాలలోనూ లేకుండా కాలనాగులోనే ఉన్నట్లయితే, మరి
అన్ని సర్పాలలోనూ వారి నివాసము లేనట్లే కదా. ఒకవేళ పరమాత్మ ఉన్నతోన్నతమైన
పర్వతములోనే ఉన్నట్లయితే మరి చిన్న పర్వతాలలో లేనట్లే కదా. అంతేకాక ఎక్కడైతే విజయము
ఉంటుందో అక్కడ నా జన్మ ఉంటుంది అన్నప్పుడు మరి ఓటమిలో లేనట్లే కదా. ఈ విషయాలు
పరమాత్మ సర్వవ్యాపి కాదు అని నిరూపిస్తున్నాయి. ఒకవైపు ఇలా కూడా అంటారు, మరియు
మరోవైపు - పరమాత్మ అనేక రూపాలలోకి వస్తారు అని కూడా అంటారు. పరమాత్మను 24 అవతారాలలో
చూపించారు, తాబేలు, చేప మొదలగు అన్ని రూపాలూ పరమాత్మవే అని అంటారు. ఇది వారి భ్రమ.
పరమాత్మ సర్వత్ర ఉంటారు అని భావిస్తూ కూర్చున్నారు. వాస్తవానికి కలియుగములో సర్వత్ర
మాయయే వ్యాపించి ఉంది, మరి అటువంటప్పుడు పరమాత్మ వ్యాపించి ఎలా ఉంటారు? నేను మాయలో
వ్యాపించి ఉండను అని గీతలో కూడా చెప్తారు, దీని బట్టి పరమాత్మ సర్వత్ర లేరు అని
నిరూపణ అవుతుంది.
2. ‘‘నిరాకారీ
ప్రపంచము ఆత్మ మరియు పరమాత్మ ఉండే స్థానము’’
మనకు తెలుసు, మనము
నిరాకారీ ప్రపంచము అని అన్నప్పుడు నిరాకారీ అనగా ఎటువంటి ఆకారము ఉండదని అర్థము కాదు.
మనము నిరాకారీ ప్రపంచము అని అన్నప్పుడు దాని అర్థమేమిటంటే, తప్పకుండా ఒక ప్రపంచము
ఉంది కానీ దానికి స్థూల సృష్టి వంటి ఆకారము లేదు. అలాగే పరమాత్ముడు నిరాకారుడు కానీ
వారికి తమ సూక్ష్మ రూపము తప్పకుండా ఉంది. ఆత్మలమైన మన యొక్క మరియు పరమాత్ముని యొక్క
ధామము నిరాకారీ ప్రపంచము. మనము ప్రపంచము అని అంటున్నప్పుడు దాని బట్టి ఏమి నిరూపణ
అవుతుందంటే - అది ఒక ప్రపంచము మరియు అక్కడ నివసిస్తారు, అందుకే దానికి ప్రపంచము
అన్న పేరు వచ్చింది. ప్రపంచములోనివారైతే పరమాత్ముని రూపము కూడా అఖండ జ్యోతి తత్వము
అని భావిస్తారు కానీ అది పరమాత్మ నివసించే స్థానము, దానిని రిటైర్డ్ హోమ్ అంటారు.
కావున మనము పరమాత్ముని ఇంటిని పరమాత్మ అని అనలేము. మరొకటి ఆకారీ ప్రపంచము, అక్కడ
బ్రహ్మా-విష్ణు-శంకరులైన దేవతలు ఆకారీ రూపములో ఉంటారు. ఇది సాకారీ ప్రపంచము, ఇందులో
రెండు భాగాలు ఉన్నాయి - ఒకటి నిర్వికారీ స్వర్గ ప్రపంచము, అక్కడ అర్ధకల్పము నిత్యము
సుఖము ఉంది, పవిత్రత మరియు శాంతి ఉన్నాయి, రెండవది వికారీ కలియుగీ ప్రపంచము,
దుఃఖము-అశాంతులతో కూడిన ప్రపంచము. ఇప్పుడు రెండు ప్రపంచాలు అని ఎందుకు అంటారు?
ఎందుకంటే, స్వర్గము మరియు నరకము, రెండూ పరమాత్మ రచించిన ప్రపంచాలు అని మనుష్యులు
ఏదైతే అంటారో, దాని గురించి పరమాత్ముని మహావాక్యము ఏమిటంటే - పిల్లలూ, నేనేమీ దుఃఖ
ప్రపంచాన్ని రచించలేదు, నేను రచించిన ప్రపంచము సుఖ ప్రపంచము. ఈ దుఃఖము, అశాంతుల
ప్రపంచము ఏదైతే ఉందో, ఇక్కడ మనుష్యాత్మలు తమను తాము మర్చిపోయిన కారణముగా మరియు
పరమాత్మనైన నన్ను మర్చిపోయిన కారణముగా ఈ లెక్కాచారాలు అనుభవిస్తున్నారు. ఇకపోతే, ఏ
సమయములోనైతే సుఖము మరియు పుణ్య ప్రపంచము ఉంటుందో అక్కడ ఎటువంటి సృష్టి ఉండదు అని
కాదు. అది దేవతల నివాస స్థానముగా ఉండేది అని మనము చెప్పినప్పుడు, తప్పకుండా అక్కడ
ప్రవృత్తి అంతా నడిచేది, కానీ అక్కడ వికారీ జన్మలు ఉండేవి కావు, ఆ కారణము చేత ఇంతటి
కర్మ బంధనము ఉండేది కాదు. ఆ ప్రపంచాన్ని కర్మ బంధన రహితమైన స్వర్గ ప్రపంచము అని
అంటారు. కావున ఒకటేమో నిరాకారీ ప్రపంచము, మరొకటి ఆకారీ ప్రపంచము, మూడవది సాకారీ
ప్రపంచము. అచ్ఛా - ఓం శాంతి.
అవ్యక్త సూచనలు -
‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా, నిశ్చింతగా ఉండండి’’
సాకారములో ఒకవేళ
ఎవరైనా నిమిత్త శ్రేష్ఠ ఆత్మ తోడుగా ఉంటే అప్పుడు ఏ విషయాన్ని అయినా వారి ద్వారా
వెరిఫై చేయించుకుని, ఆ తర్వాత చేసినట్లయితే ఆ కార్యాన్ని నిశ్చయబుద్ధి కలవారిగా
అయ్యి చేస్తారు. నిర్భయత మరియు నిశ్చయము, ఈ రెండు గుణాలను ఎదురుగా పెట్టుకుని
చేస్తారు. కనుక ఎక్కడైతే సదా నిశ్చయము మరియు నిర్భయత ఉంటాయో అక్కడ సదా శ్రేష్ఠ
సంకల్పాల విజయము ఉంటుంది. ఏ సంకల్పము చేసినా గాని, ఒకవేళ సదా నిరాకారుడు మరియు
సాకారుడు తోడుగా లేక సమ్ముఖములో ఉన్నట్లయితే, వెరిఫై చేయించుకున్న తర్వాత నిశ్చయము
మరియు నిర్భయతతో చేయండి, ఇలా చేస్తే సమయము కూడా వ్యర్థమవ్వదు.