24-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఈ చదువు ద్వారా వయా శాంతిధామము మీ సుఖధామానికి వెళ్తారు, ఇదే మీ లక్ష్యము-ఉద్దేశ్యము, ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు’’

ప్రశ్న:-
పిల్లలైన మీరు సాక్షీగా అయి ఈ సమయములో డ్రామాలోని ఏ దృశ్యాలను చూస్తున్నారు?

జవాబు:-
ఈ సమయములో డ్రామాలో మొత్తమంతా దుఃఖపు దృశ్యాలు ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా సుఖము ఉన్నా కూడా అది అల్పకాలికమైన కాకిరెట్ట సమానమైనది. మిగిలినదంతా దుఃఖమే దుఃఖము. పిల్లలైన మీరు ఇప్పుడు ప్రకాశములోకి వచ్చారు. మీకు తెలుసు, క్షణక్షణము అనంతమైన సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది, ఒక రోజు మరో రోజుతో కలవదు. మొత్తం ప్రపంచము యొక్క పాత్ర పరివర్తన చెందుతూ ఉంటుంది. కొత్త దృశ్యాలు వస్తూ ఉంటాయి.

పాట:-
ఎవరైతే ప్రియమైనవారితో ఉన్నారో...

డబుల్ ఓం శాంతి. ఒకటేమో -
తండ్రి తన స్వధర్మములో స్థితులై ఉన్నారు, రెండు - మీ స్వధర్మములో స్థితులవ్వండి మరియు తండ్రిని స్మృతి చేయండి అని పిల్లలకు కూడా చెప్తారు. స్వధర్మములో స్థితులవ్వండి అని ఇంకెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు. పిల్లలైన మీ బుద్ధిలో నిశ్చయము ఉంది. నిశ్చయబుద్ధి విజయంతి. వారే విజయము పొందుతారు. ఏ విజయము పొందుతారు? తండ్రి వారసత్వాన్ని పొందడములో విజయము పొందుతారు. స్వర్గములోకి వెళ్ళడమంటే అది తండ్రి వారసత్వాన్ని పొందడములో విజయము పొందడము. ఇక మిగిలినదంతా పదవి కొరకు పురుషార్థము. స్వర్గములోకి అయితే తప్పకుండా వెళ్ళాలి. ఇది ఛీ-ఛీ ప్రపంచమని పిల్లలకు తెలుసు. ఎన్నో అపారమైన దుఃఖాలు రానున్నాయి. డ్రామా చక్రము గురించి కూడా మీకు తెలుసు. పావనముగా తయారుచేసి ఆత్మలందరినీ దోమల గుంపు వలె తీసుకువెళ్ళేందుకు అనేక సార్లు బాబా వచ్చారు, ఆ తర్వాత వారు స్వయం కూడా వెళ్ళి నిర్వాణధామములో నివసిస్తారు, పిల్లలు కూడా వెళ్తారు! ఈ చదువు ద్వారా మనం వయా శాంతిధామము మన సుఖధామములోకి వెళ్తాము అని పిల్లలైన మీకు ఈ సంతోషమైతే ఉండాలి. ఇదే మీ లక్ష్యము-ఉద్దేశ్యము. దీనిని మర్చిపోకూడదు. ప్రతి రోజు వింటూ ఉంటారు, మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారుచేసేందుకు తండ్రి చదివిస్తున్నారు అని భావిస్తారు. పావనముగా అయ్యేందుకు సహజమైన ఉపాయాన్ని తెలియజేస్తున్నారు - స్మృతి. ఇది కూడా కొత్త విషయమేమీ కాదు. భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు అని వ్రాయబడి ఉంది. కానీ శ్రీకృష్ణుని పేరు రాసేసారు, కేవలం ఈ పొరపాటు చేసారు. పిల్లలకు ఏ జ్ఞానమైతే లభిస్తూ ఉందో, అది గీతలో కాకుండా వేరే ఏదో శాస్త్రములో ఉందని కాదు. తండ్రికి ఎటువంటి మహిమ అయితే ఉందో, అటువంటి మహిమ ఇతర మనుష్యులెవ్వరికీ లేదు అని పిల్లలకు తెలుసు. తండ్రి రాకపోతే సృష్టి చక్రమే తిరగదు. మరి అప్పుడు దుఃఖధామము నుండి సుఖధామముగా ఎలా అవుతుంది? సృష్టి చక్రమైతే తిరగవలసిందే. తండ్రి కూడా తప్పకుండా రావలసిందే. తండ్రి అందరినీ తీసుకువెళ్ళేందుకు వస్తారు, మళ్ళీ చక్రము తిరుగుతుంది. తండ్రి రాకపోతే కలియుగము నుండి సత్యయుగముగా ఎలా అవుతుంది? ఇకపోతే ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. రాజయోగము ఉన్నది గీతలోనే. ఒకవేళ భగవంతుడు ఆబూలో వచ్చారు అని అర్థం చేసుకున్నారంటే, ఇక కలుసుకునేందుకు ఒక్కసారిగా పరుగులు తీస్తారు. భగవంతుడిని కలుసుకోవాలి అని సన్యాసులు కూడా కోరుకుంటారు కదా. తిరిగి వెళ్ళేందుకని పతిత-పావనుడిని స్మృతి చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు పదమాపదమ భాగ్యశాలులుగా అవుతున్నారు. అక్కడ అపారమైన సుఖాలు ఉంటాయి. కొత్త ప్రపంచములో దేవీ-దేవతా ధర్మము ఏదైతే ఉండేదో, అది ఇప్పుడు లేదు. తండ్రి బ్రహ్మా ద్వారానే దైవీ రాజ్యము యొక్క స్థాపన చేస్తారు. ఇదైతే స్పష్టముగా ఉంది. ఇదే మీ లక్ష్యము-ఉద్దేశ్యము. ఇందులో సంశయము యొక్క విషయమే లేదు. మున్ముందు అర్థం చేసుకుంటారు, రాజధాని తప్పకుండా స్థాపన అవుతుంది. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉంది. మీరు స్వర్గములో ఉండేటప్పుడు దీనికి భారత్ అన్న పేరే ఉంటుంది, మళ్ళీ ఎప్పుడైతే మీరు నరకములోకి వస్తారో, అప్పుడు హిందుస్థాన్ అన్న పేరు వస్తుంది. ఇక్కడ ఎంతో దుఃఖమే దుఃఖము ఉంది. ఇప్పుడు ఈ సృష్టి మారుతుంది, ఆ తర్వాత స్వర్గములో సుఖధామమే ఉంటుంది. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఉంది. ప్రపంచములోని మనుష్యులకు ఏమీ తెలియదు. ఇప్పుడు ఇది అంధకారమయమైన రాత్రి అని తండ్రి స్వయం అంటున్నారు. రాత్రివేళలో మనుష్యులు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. పిల్లలైన మీరు ప్రకాశములో ఉన్నారు. దీనిని కూడా సాక్షీగా అయి బుద్ధిలో ధారణ చేయాలి. క్షణక్షణము అనంతమైన సృష్టి యొక్క చక్రము తిరుగుతూ ఉంటుంది. ఒక రోజు మరో రోజుతో కలవదు. మొత్తం ప్రపంచము యొక్క పాత్ర పరివర్తన చెందుతూ ఉంటుంది, కొత్త దృశ్యాలు వస్తూ ఉంటాయి. ఈ సమయములో మొత్తమంతా ఉన్నవి దుఃఖపు దృశ్యాలే. ఒకవేళ సుఖము ఉన్నా కూడా అది కాకిరెట్ట సమానమైనది. మిగిలినదంతా దుఃఖమే దుఃఖము. ఈ జన్మలో ఒకవేళ సుఖము ఉన్నా కానీ మళ్ళీ మరుసటి జన్మలో దుఃఖము ఉంటుంది. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్తున్నాము అని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంటుంది. ఇందులో పావనముగా అయ్యేందుకు శ్రమించాలి. శ్రీ లక్ష్మీ-నారాయణులుగా అవ్వమని శ్రీశ్రీ శ్రీమతాన్ని ఇచ్చారు. బ్యారిస్టర్ అయితే - బ్యారిస్టర్ భవ అన్న మతాన్ని ఇస్తారు. శ్రీమతము ద్వారా ఈ విధంగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి కూడా చెప్తారు.

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి - నాలో ఎటువంటి అవగుణాలైతే లేవు కదా? నిర్గుణుడినైన నాలో ఏ గుణము లేదు, మీరే దయ చూపించండి అని ఈ సమయములో గానం చేస్తారు కూడా. దయ అంటే కరుణ. బాబా అంటారు - పిల్లలూ, నేనైతే ఎవరిపైనా దయ అనేది చూపించను. దయ అనేది ప్రతి ఒక్కరూ తమపై తామే చూపించుకోవాలి. ఈ డ్రామా తయారుచేయబడి ఉంది. నిర్దయుడైన రావణుడు మిమ్మల్ని దుఃఖములోకి తీసుకువస్తాడు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇందులో రావణుడి దోషము కూడా ఏమీ లేదు. తండ్రి వచ్చి కేవలం సలహా ఇస్తారు, ఇదే వారు చూపే దయ. ఇకపోతే, ఈ రావణ రాజ్యమైతే ఇంకా కొనసాగుతుంది. డ్రామా అనాది అయినది. ఇందులో రావణుడి దోషమూ లేదు, మనుష్యుల దోషమూ లేదు. చక్రము తిరగవలసిందే. రావణుడి నుండి విడిపించేందుకు తండ్రి యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. రావణ మతముపై మీరు ఎంతగా పాపాత్మగా అయ్యారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచము. మళ్ళీ తప్పకుండా కొత్త ప్రపంచము వస్తుంది. చక్రమైతే తిరుగుతుంది కదా. సత్యయుగము మళ్ళీ తప్పకుండా వచ్చేది ఉంది. ఇప్పుడు ఇది సంగమయుగము. మహాభారత యుద్ధము కూడా ఈ సమయానికి చెందినదే. వినాశన కాలములో పరమాత్ముని పట్ల విపరీత బుద్ధి కలిగినవారు వినాశనము చెందుతారు. ఇది జరగనున్నది. మరియు విజయులమైన మనము స్వర్గానికి యజమానులుగా అవుతాము. మిగిలినవారెవరూ ఉండనే ఉండరు. పవిత్రముగా అవ్వకుండా దేవతగా అవ్వడం కష్టము అని కూడా అర్థం చేసుకుంటారు. శ్రేష్ఠమైన దేవతలుగా అయ్యేందుకు ఇప్పుడు తండ్రి నుండి శ్రీమతము లభిస్తుంది. ఇటువంటి మతము ఎప్పుడూ లభించదు. శ్రీమతమునిచ్చే పాత్ర కూడా వారికి సంగమములోనే ఉంది. ఇంకెవ్వరిలోనూ ఈ జ్ఞానమే లేదు. భక్తి అంటే భక్తి. దానిని జ్ఞానము అని అనరు. ఆత్మిక జ్ఞానాన్ని, జ్ఞాన-సాగరుడైన పరమాత్మయే ఇస్తారు. జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు అని వారికే మహిమ ఉంది. తండ్రి పురుషార్థము యొక్క యుక్తులను కూడా తెలియజేస్తారు. ఈ విషయము గుర్తుంచుకోవాలి - ఇప్పుడు ఫెయిల్ అయితే ఇక కల్ప-కల్పము ఫెయిల్ అయిపోతారు, చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. శ్రీమతముపై నడవకపోతే దెబ్బ తగులుతుంది. బ్రాహ్మణుల వృక్షము తప్పకుండా పెరగవలసిందే. దేవతల వృక్షము ఎంతగా పెరిగిందో ఇది కూడా అంతగానే పెరుగుతుంది. మీరు పురుషార్థము చేయాలి మరియు చేయించాలి. అంటు కట్టబడుతూ ఉంటుంది. వృక్షము పెద్దదవుతుంది. ఇప్పుడు మన కళ్యాణము జరుగుతోందని మీకు తెలుసు. పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచములోకి వెళ్ళే కళ్యాణము జరుగుతోంది. పిల్లలైన మీ బుద్ధి తాళము ఇప్పుడు తెరుచుకుంది. తండ్రి వివేకవంతుల వివేకము వంటివారు కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, ఎవరెవరి తాళము తెరుచుకుంటుంది అనేది ఇంకా మున్ముందు చూడండి. ఇది కూడా డ్రామాగా కొనసాగుతుంది, మళ్ళీ సత్యయుగము నుండి రిపీట్ అవుతుంది. లక్ష్మీ-నారాయణులు ఎప్పుడైతే సింహాసనముపై కూర్చుంటారో అప్పుడు వారి కాలము ప్రారంభమవుతుంది. 1 నుండి 1250 సంవత్సరాల వరకు స్వర్గము అని మీరు వ్రాస్తారు కూడా, ఇది ఎంత స్పష్టముగా ఉంది. ఇది సత్య నారాయణుని కథ. ఇది అమరనాథుని కథ కదా. ఇప్పుడు మీరు సత్యాతి-సత్యమైన అమరనాథుని కథను వింటున్నారు, తర్వాత దీనికే గాయనము కొనసాగుతుంది. పండుగలు మొదలైనవన్నీ ఈ సమయానికి చెందినవే. నంబరువన్ పండుగ శివబాబా యొక్క జయంతి. ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు కలియుగము తర్వాత తప్పకుండా తండ్రి రావలసే ఉంటుంది. చిత్రాలను ఎవరైనా బాగా పరిశీలించినట్లయితే, పూర్తి లెక్కంతా ఎలా నిశ్చితమై ఉందో చూస్తారు. మీకు గ్యారంటీ ఉంది, కల్పక్రితము ఎంతగా పురుషార్థము చేసారో, అంతగా తప్పకుండా చేస్తారు. సాక్షీగా అయి ఇతరులను కూడా చూస్తారు, తమ పురుషార్థము గురించి కూడా తెలుసు. మీకు కూడా తెలుసు. విద్యార్థులకు తమ చదువు గురించి తెలియకుండా ఉంటుందా? మేము ఈ సబ్జెక్ట్ లో చాలా అపరిపక్వముగా ఉన్నాము అని మనసు తప్పకుండా తింటుంది. ఇక ఫెయిల్ అయిపోతారు. ఎవరైతే కచ్చాగా ఉంటారో, పరీక్షల సమయములో వారికి గుండెదడగా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలైన మీరు కూడా సాక్షాత్కారములో చూస్తారు. కానీ అప్పటికే ఫెయిల్ అయిపోయారు, ఇక ఏమి చేయగలరు! స్కూలులో ఫెయిల్ అయితే సంబంధీకులు కూడా అసంతుష్టులవుతారు, టీచరు కూడా అసంతుష్టమవుతారు. మా స్కూలు నుండి తక్కువమంది పాస్ అయితే టీచరు అంత బాగా లేరేమో, అందుకే తక్కువమంది పాస్ అయ్యారేమో అని అనుకుంటారు కదా అని భావిస్తారు. సెంటర్లలో ఎవరెవరు మంచి టీచర్లు ఉన్నారు, వారు ఎలా చదివిస్తారు, ఎవరెవరు బాగా చదివించి తీసుకువస్తారు అన్నది బాబాకు కూడా తెలుసు. అన్నీ తెలుస్తాయి. బాబా అంటారు, మేఘాలను తీసుకురావాలి. చిన్న పిల్లలను తీసుకువస్తే వారి పట్ల మోహం ఉంటుంది. కావున ఒంటరిగా రావాలి, అప్పుడు బుద్ధి బాగా నిలుస్తుంది. పిల్లలనైతే అక్కడ కూడా చూసుకుంటూనే ఉంటారు.

తండ్రి అంటారు, ఈ పాత ప్రపంచమైతే స్మశానవాటికగా అవ్వనున్నది. కొత్త ఇల్లును తయారుచేస్తే - మా కొత్త ఇల్లు తయారవుతోంది అని బుద్ధిలో ఉంటుంది కదా. వ్యాపారాలు మొదలైనవైతే చేసుకుంటూనే ఉంటారు కానీ బుద్ధి కొత్త ఇంటివైపు ఉంటుంది. మౌనముగా అయితే కూర్చుండిపోరు కదా. అది హద్దులోని విషయము. ఇది అనంతమైన విషయము. ప్రతి కార్యము చేస్తూ స్మృతిలో ఉండాలి - ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ మా రాజధానిలోకి వస్తాము అని, అప్పుడు అపారమైన సంతోషము ఉంటుంది. తండ్రి అంటారు - పిల్లలూ, మీ పిల్లలు మొదలైనవారిని కూడా సంభాళించాలి, కానీ బుద్ధి అక్కడ జోడించబడి ఉండాలి. స్మృతి చేయకపోతే మరి పవిత్రముగా కూడా అవ్వలేరు. స్మృతి ద్వారా పవిత్రముగా అవుతారు, జ్ఞానము ద్వారా సంపాదన పొందుతారు. ఇక్కడైతే అందరూ పతితులుగానే ఉన్నారు. రెండు తీరాలు ఉన్నాయి. బాబాను నావికుడు అని అంటారు, కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. తండ్రి ఆవలి తీరానికి తీసుకువెళ్తారని మీకు తెలుసు. మేము ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి చాలా సమీపముగా వెళ్తున్నాము అని ఆత్మకు తెలుసు. నావికుడు అన్న పేరును కూడా అర్థ సహితముగా పెట్టారు కదా. నా నావను ఆవలి తీరానికి తీసుకువెళ్ళండి అని అందరూ మహిమ చేస్తారు. సత్యయుగములో ఇలా అంటారా? కలియుగములోనే పిలుస్తారు. పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోనివారైతే ఇక్కడకు రాకూడదు. తండ్రి వారిని ఎట్టి పరిస్థితులోనూ వద్దంటారు. నిశ్చయము లేకపోతే వారిని ఎప్పుడూ తీసుకురాకూడదు. వారు ఏమీ అర్థం చేసుకోరు. మొదట 7 రోజుల కోర్సు ఇవ్వండి. కొందరికైతే 2 రోజుల్లోనే బాణము తగులుతుంది. అది బాగా తగిలితే ఇక వారు వదలరు. మేము ఇంకా 7 రోజులు నేర్చుకుంటాము అని అంటారు. వారు ఈ కులానికి చెందినవారు అని మీరు వెంటనే అర్థం చేసుకుంటారు. చురుకైన బుద్ధి కలవారు ఎవరైతే ఉంటారో, వారు ఏ విషయాన్ని లెక్క చేయరు. అచ్ఛా, ఒక ఉద్యోగము పోతే ఇంకొకటి దొరుకుతుంది. మంచి మనసు కల పిల్లలెవరైతే ఉంటారో, వారి ఉద్యోగము మొదలైనవి పోనే పోవు, వారు స్వయమే ఆశ్చర్యపోతారు. మా పతి బుద్ధిని మార్చండి అని కుమార్తెలు అంటారు. బాబా అంటారు, అది నాకు చెప్పకండి, మీరు యోగబలముతో ఉంటూ జ్ఞానాన్ని వినిపించండి. బాబా ఏమీ అలా బుద్ధిని తిప్పరు కదా. అలాగైతే ఇక అందరూ ఇదే పని చేస్తూ ఉంటారు. ఏ ఆచారము వెలువడితే, ఇకదానినే పట్టుకుంటారు. ఎవరైనా గురువు ద్వారా ఎవరికైనా లాభము కలిగింది అని వింటే ఇక అందరూ అతని వెనుకపడతారు. కొత్త ఆత్మ వచ్చినప్పుడు మరి తన మహిమ వెలువడుతుంది కదా! దానితో ఎంతోమంది అనుచరులుగా అయిపోతారు. కావున ఈ విషయాలన్నింటినీ చూడకూడదు. మేము ఎంతవరకు చదువుతున్నాము అని మీరు స్వయాన్ని చూసుకోవాలి. బాబా ఈ విషయాలను విస్తారముగా చిట్-చాట్ చేస్తారు. ఇకపోతే సారములో తండ్రిని స్మృతి చేయండి అని చెప్తారు, దీనిని ఇంట్లో ఉంటూ కూడా చేయవచ్చు. కానీ వారు జ్ఞానసాగరుడు కావున తప్పకుండా జ్ఞానము కూడా ఇస్తారు కదా. ముఖ్యమైన విషయము మన్మనాభవ. దానితోపాటు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. చిత్రాలు కూడా ఈ సమయములో చాలా మంచి-మంచివి వెలువడ్డాయి. వాటి అర్థాన్ని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. విష్ణు నాభి నుండి బ్రహ్మా వచ్చినట్లుగా చూపించారు. త్రిమూర్తులు కూడా ఉన్నారు. మరి విష్ణు నాభి నుండి బ్రహ్మా వెలువడడమేమిటి? ఇది రైటా లేక రాంగా అన్నది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మనోహరమైన చిత్రాలను కూడా ఎన్నో తయారుచేస్తారు కదా. కొన్ని శాస్త్రాలలో చక్రాన్ని కూడా చూపించారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయువును వ్రాసేసారు. అనేక అభిప్రాయాలు ఉన్నాయి కదా. శాస్త్రాలలో హద్దులోని విషయాలను వ్రాసేసారు. మొత్తం ప్రపంచములో రావణ రాజ్యము ఉంది అని తండ్రి అనంతమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. మనము ఏ విధంగా పతితులమయ్యాము, మళ్ళీ పావనముగా ఎలా అవుతాము, ఈ జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. ఇతర ధర్మాలు తర్వాత వస్తాయి, అనేక వెరైటీలు ఉన్నాయి. ఒకటి ఇంకొకదానితో కలవదు. ఒకే విధమైన ముఖకవళికలు కలవారు ఇద్దరు ఉండరు. ఇది తయారై, తయారుచేయబడిన ఆట, ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. సమయము తగ్గిపోతూ ఉంటుంది. స్వయాన్ని చెక్ చేసుకోండి - మేము ఎంతవరకు సంతోషములో ఉంటున్నాము? మనము ఎటువంటి వికర్మలూ చేయకూడదు. తుఫానులైతే వస్తాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, అంతర్ముఖులుగా అయి మీ చార్ట్ పెట్టుకున్నట్లయితే ఏ తప్పులైతే జరుగుతాయో వాటి గురించి పశ్చాత్తాపపడగలరు. ఇది యోగబలము ద్వారా మిమ్మల్ని మీరు క్షమించుకున్నట్లవుతుంది. బాబా ఏమీ క్షమించరు. డ్రామాలో క్షమాపణ అన్న పదమే లేదు. మీ కృషి మీరు చేయాలి. పాపాల దండనను మనుష్యులు స్వయమే అనుభవిస్తారు. క్షమించడం అన్న మాటే లేదు. తండ్రి అంటారు, ప్రతి విషయములోనూ కష్టపడండి. తండ్రి కూర్చుని ఆత్మలకు యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. పురాతన రావణ దేశములోకి రండి, పతితులైన మమ్మల్ని మీరు వచ్చి పావనముగా తయారుచేయండి అని తండ్రిని పిలుస్తారు. కానీ మనుష్యులు అర్థం చేసుకోరు. వారు ఆసురీ సాంప్రదాయులుగా ఉన్నారు. మీరు బ్రాహ్మణ సాంప్రదాయులు. మీరు దైవీ సాంప్రదాయులుగా అవుతున్నారు. పురుషార్థము కూడా పిల్లలు నంబరువారుగా చేస్తారు, ఇక అప్పుడు వీరి భాగ్యములో ఇంతే ఉంది అని అనేస్తారు. తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఇక జన్మ-జన్మాంతరాలు, కల్ప-కల్పాంతరాలు ఉన్నత పదవిని పొందలేరు. మిమ్మల్ని మీరు నష్టపర్చుకోకూడదు ఎందుకంటే ఇప్పుడే జమ అవుతుంది, ఆ తర్వాత నష్టములోకి వెళ్ళిపోతారు. రావణ రాజ్యములో ఎంతగా నష్టము జరుగుతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అంతర్ముఖులుగా అయి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఏయే పొరపాట్లు అయితే జరుగుతాయో వాటి గురించి హృదయపూర్వకముగా పశ్చాత్తాపపడి యోగబలము ద్వారా మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి, మీ కృషి మీరు చేయాలి.

2. తండ్రి నుండి ఏ సలహా అయితే లభిస్తుందో, దానిపై పూర్తిగా నడుస్తూ మీపై మీరే దయ చూపించుకోవాలి. సాక్షీగా అయి స్వయం మరియు ఇతరుల యొక్క పురుషార్థాన్ని చూడాలి. ఎప్పుడూ కూడా తమను తాము నష్టపర్చుకోకూడదు.

వరదానము:-
విశ్వ కళ్యాణ భావన ద్వారా ప్రతి ఆత్మ యొక్క రక్షణ గురించి ప్లాన్ ను తయారుచేసే సత్యమైన దయార్ద్ర హృదయ భవ

వర్తమాన సమయములో చాలామంది ఆత్మలు వారికి వారే స్వయము యొక్క అకళ్యాణానికి నిమిత్తులుగా అవుతున్నారు. మీరు దయార్ద్ర హృదయులుగా అయి వారి కొరకు ఏదైనా ప్లాన్ ను తయారుచెయ్యండి. ఏ ఆత్మ పాత్రనైనా చూసినప్పుడు స్వయం అలజడిలోకి రాకండి, కానీ వారి రక్షణా సాధనము గురించి ఆలోచించండి. ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది కదా, వృక్షమైతే పడిపోయేదే ఉంది కదా అని ఆలోచించకండి. అలా కాదు. వచ్చిన విఘ్నాలను సమాప్తము చెయ్యండి. విశ్వ కళ్యాణకారులు మరియు విఘ్న వినాశకులు అన్న టైటిల్స్ ఏవైతే ఉన్నాయో, వాటి అనుసారముగా సంకల్పము, వాణి మరియు కర్మలో దయార్ద్ర హృదయులై వాయుమండలాన్ని మార్చడములో సహయోగులుగా అవ్వండి.

స్లోగన్:-
ఎవరైతే బుద్ధిపై అటెన్షన్ అనే కాపలాను ఉంచుతారో, వారే కర్మయోగులుగా అవ్వగలరు.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి

చివరిలో ఫైనల్ పరీక్షలో ఉండే ప్రశ్న ఏమిటంటే - క్షణములో ఫుల్ స్టాప్. దీని ఆధారముగానే నంబర్ దొరుకుతుంది. క్షణము కంటే ఎక్కువ సమయము పట్టిందంటే ఫెయిల్ అయిపోతారు. ‘‘ఒక్క తండ్రి మరియు నేను’’, మూడవ విషయము ఏదీ రాకూడదు. ఇది చేయాలి, ఇది చూడాలి, ఇది జరిగింది, ఇది జరగలేదు, ఇది ఎందుకు జరిగింది, ఇదేమిటి ఇలా జరిగింది - ఇటువంటి సంకల్పమేదైనా వచ్చిందంటే ఫైనల్ పరీక్షలో పాస్ అవ్వరు.