24-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 30.11.2006


‘‘జ్వాలాముఖి తపస్య ద్వారా మైపన్ (నేను) అనే తోకను కాల్చి బాప్ దాదాసమానముగా అవ్వండి, అప్పుడు సమాప్తి సమీపముగా వస్తుంది’’

ఈ రోజు తరగని అవినాశీ ఖజానాలకు యజమాని అయిన బాప్ దాదా తమ నలువైపులా ఉన్న సంపన్నులైన పిల్లల యొక్క జమా ఖాతాను చూస్తున్నారు. మూడు రకాల ఖాతాలను చూస్తున్నారు - ఒకటేమో, తమ పురుషార్థము ద్వారా శ్రేష్ఠ ప్రారబ్ధపు జమా ఖాతా. రెండవది, సదా సంతుష్టముగా ఉండడము మరియు సంతుష్టపరచడము, ఈ సంతుష్టత ద్వారా ఆశీర్వాదాల ఖాతా. మూడవది, మనసా-వాచా-కర్మణా, సంబంధ-సంపర్కాల ద్వారా అనంతమైన నిస్వార్థ సేవ ద్వారా పుణ్య ఖాతా. మీరందరూ కూడా ఈ మూడు ఖాతాలను చెక్ చేసుకుంటూనే ఉంటారు. ఈ మూడు ఖాతాలు ఎంత జమ అయి ఉన్నాయి, జమ అయ్యాయా లేదా అన్నదానికి గుర్తు - సదా సర్వుల పట్ల, స్వయం పట్ల సంతుష్టతా స్వరూపముగా ఉండటము, సర్వుల పట్ల శుభ భావన, శుభ కామన ఉండటము మరియు సదా స్వయాన్ని సంతోషకరమైన, భాగ్యశాలి స్థితిలో అనుభవము చెయ్యటము. కనుక చెక్ చేసుకోండి - రెండు ఖాతాల లక్షణాలు స్వయములో అనుభవమవుతున్నాయా? ఈ సర్వ ఖజానాలను జమ చేసుకునేందుకు తాళంచెవి - నిమిత్త భావము, నిర్మాన భావము, నిస్వార్థ భావము. చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంతకీ ఆ తాళంచెవి నంబరు తెలుసా! తాళంచెవి నంబరు - మూడు బిందువులు. మూడు చుక్కలు. ఒకటి - ఆత్మ బిందువు, రెండవది - బాబా బిందువు, మూడవది - డ్రామా యొక్క ఫుల్ స్టాప్, బిందువు. మీ అందరి వద్ద తాళంచెవి అయితే ఉంది కదా! ఖజానాలను తెరిచి చూసుకుంటూ ఉంటారు కదా! ఈ సర్వ ఖజానాల వృద్ధికి విధి - దృఢత. దృఢత ఉన్నట్లయితే ఏ కార్యములోనూ కూడా - ఇది అవుతుందా, అవ్వదా అన్న ఇటువంటి సంకల్పము నడవదు. దృఢతా స్థితి ఏమిటంటే - ఇది జరిగే ఉంది, తయారయ్యే ఉంది. తయారవుతుందా, జమ అవుతుందా, అవ్వదా అన్నట్లు ఉండదు. చెయ్యటమైతే చేస్తున్నాము, మరి అవ్వటమైతే అవ్వాలి... అని ఇలా ‘అయితే, అయితే’ అని అనరు. దృఢత కలవారు నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారు, నిశ్చింతగా ఉంటారు మరియు నిశ్చితము అన్నట్లు అనుభవం చేస్తారు.

బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించి ఉన్నారు - ఒకవేళ సర్వ ఖజానాల ఖాతాను ఎక్కువలో ఎక్కువ జమ చేసుకోవాలనుకుంటే ‘మన్మనాభవ’ అనే మంత్రాన్ని యంత్రముగా చేసుకోండి. దీని వలన సదా బాబాతోపాటుగా మరియు సమీపముగా ఉన్నట్లు స్వతహాగా అనుభవమవుతుంది. పాస్ అవ్వాల్సిందే, మూడు రూపాలలో పాస్ - 1. పాస్ గా (దగ్గరగా) ఉండటము, 2. ఏదైతే జరిగిపోయిందో దానిని పాస్ చేయటము (దాటేయటము), 3. పాస్ విత్ ఆనర్ గా అవ్వటము (గౌరవప్రదముగా ఉత్తీర్ణులవ్వటము). ఒకవేళ ఈ మూడు రకాల పాస్ లు ఉన్నట్లయితే మీ అందరికీ రాజ్యాధికారులుగా అయ్యేందుకు ఫుల్ పాస్ ఉంటుంది. మరి ఫుల్ పాస్ ను తీసేసుకున్నారా లేక తీసుకోవాలా? ఎవరైతే ఫుల్ పాస్ ను తీసుకున్నారో వారు చేతులెత్తండి. ఇంకా తీసుకోవాలి అని అనటము కాదు, తీసేసుకున్నారా? మొదటి లైన్ లోనివారు చేతులెత్తటం లేదు, మీరు తీసుకోవాలా? ఇప్పుడు ఇంకా సంపూర్ణము అవ్వలేదు కదా అని ఆలోచిస్తున్నారు, అందుకని చేతులెత్తటం లేదు. కానీ నిశ్చయబుద్ధి కలవారు తప్పకుండా విజయులుగా అవుతారు, లేక అవ్వాలా? ప్రస్తుతము సమయము యొక్క పిలుపు, భక్తుల పిలుపు వినిపిస్తుందా? మీ మనసులో నుండి ఏం ధ్వని వస్తుంది? ఇప్పటికిప్పుడే సంపన్నముగా మరియు సమానముగా అవ్వాల్సిందే అని వస్తుందా లేక అవుతాములే, ఆలోచిస్తాములే, చేస్తాములే... అని ఇలా ఆలోచిస్తున్నారా! ఇప్పుడు సమయమనుసారముగా ప్రతి సమయము ఎవర్రెడీ అన్న పాఠములో పక్కాగా ఉండాల్సిందే. ‘నా బాబా’ అని అన్నారు కావున ‘మధురమైన బాబా, ప్రియమైన బాబా’ అన్నది తప్పకుండా అంగీకరించారు. మరి ప్రియమైనవారు ఎవరైతే ఉంటారో, వారి సమానముగా అవ్వటము కష్టమనిపించదు.

బాప్ దాదా చూసారు - ఎప్పటికప్పుడు సమానముగా అవ్వటములో ఏదైతే విఘ్నము కలుగుతుందో, అది చాలా ప్రసిద్ధమైన ఒక పదము, అది అందరికీ తెలుసు కూడా, అందరూ అనుభవజ్ఞులే. అదేమిటంటే - ‘‘నేను’’, నేను అనే భావన, అందుకని బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నారు - ‘నేను’ అన్న పదాన్ని ఎప్పుడు ఉపయోగించినా - కేవలము ‘నేను’ అని అనకండి, ‘నేను ఆత్మను’ అని అనండి. ఈ రెండు పదాలను కలిపి పలకండి. దేహాభిమానానికి సంబంధించిన ‘నేను’ అనేది ఒక్కోసారి అభిమానాన్ని తీసుకువస్తుంది. అది ‘నేను ఆత్మను’ అన్నదానికి సంబంధించిన నేను కాదు. ‘నేను’ అనేది ఒక్కోసారి అభిమానాన్ని తీసుకువస్తుంది, ఒక్కోసారి అవమానాన్ని తీసుకువస్తుంది, ఒక్కోసారి నిరాశకలవారిగా కూడా చేస్తుంది, అందుకే దేహాభిమానానికి చెందిన ‘నేను అన్న భావన’ను స్వప్నములో కూడా రానివ్వకండి.

బాప్ దాదా చూసారు - స్నేహమనే సబ్జెక్ట్ లో మెజారిటీ పాస్ అయ్యారు. మీ అందరినీ ఇక్కడకు ఎవరు తీసుకువచ్చారు? అందరూ కూడా, విమానములో వచ్చినా, రైల్లో వచ్చినా, బస్ లో వచ్చినా కానీ వాస్తవానికి బాప్ దాదా స్నేహము అనే విమానములో ఇక్కడకు చేరుకున్నారు. కావున ఏ విధముగానైతే స్నేహమనే సబ్జెక్టులో పాస్ అయ్యారో, అలాగే ఇప్పుడు - సమానముగా అయ్యే సబ్జెక్టులో కూడా పాస్ విత్ ఆనర్ గా అయ్యి చూపించండి. ఇష్టమేనా? సమానముగా అవ్వటము ఇష్టమేనా? ఇష్టమే కానీ అలా అవ్వటములో కాస్త కష్టముందా! సమానముగా అయినట్లయితే సమాప్తి ఎదురుగా వస్తుంది. కానీ ‘అవ్వాల్సిందే’ అని మనసులో అప్పుడప్పుడు ఏదైతే ప్రతిజ్ఞను చేస్తారో, ఆ ప్రతిజ్ఞ బలహీనమైపోతుంది మరియు పరీక్ష బలమైనదైపోతుంది. కోరుకోవటము అందరూ కోరుకుంటారు కానీ కోరుకునేది ఒకటి మరియు ప్రాక్టికల్ గా జరిగేది మరొకటి, ఎందుకంటే ప్రతిజ్ఞను చేస్తారు కానీ దృఢతలో లోపము వచ్చేస్తుంది. దాని వలన సమానత దూరమైపోతుంది, సమస్య శక్తివంతమైపోతుంది. మరి ఇప్పుడు ఏం చేస్తారు?

బాప్ దాదాకు ఒక విషయములో చాలా నవ్వు వస్తూ ఉంది. అది ఏ విషయము? ఉండటము మహావీరులుగా ఉన్నారు కానీ ఏ విధముగా శాస్త్రాలలో హనుమంతుడిని మహావీరుడు అని కూడా అన్నారు కానీ అతనికి తోకను కూడా చూపించారు. మైపన్ (నేను అన్న భావన) కు గుర్తుగా తోకను చూపించారు. ఎప్పటివరకైతే మహావీరులు ఈ తోకను కాల్చరో అప్పటివరకు లంక అనగా పాత ప్రపంచము కూడా సమాప్తమవ్వదు. కనుక ఇప్పుడు ఈ ‘నేను, నేను’ అనే తోకను కాల్చండి, అప్పుడు సమాప్తి సమీపముగా వస్తుంది. దానిని కాల్చటానికి జ్వాలాముఖి తపస్య కావాలి, సాధారణ స్మృతి కాదు. జ్వాలాముఖి స్మృతి యొక్క అవసరముంది. అందుకే జ్వాలా దేవి యొక్క స్మృతిచిహ్నము కూడా ఉంది. శక్తిశాలీ స్మృతి ఉండాలి. మరి ఏం చెయ్యాలో విన్నారా? ఇప్పుడిక మనసులో ఈ ధ్వని నిత్యము ఉండాలి - సమానముగా అవ్వాల్సిందే, సమాప్తిని సమీపముగా తీసుకురావాల్సిందే. సంగమయుగము చాలా బాగుంది కదా, మరైతే సమాప్తి ఎందుకు అవ్వాలి అని మీరు అంటారు. కానీ మీరు బాబా సమానముగా దయాళు, కృపాళు, దయాహృదయ ఆత్మలు. కనుక నేటి దుఃఖిత ఆత్మలు మరియు భక్త ఆత్మలపై ఓ దయాహృదయ ఆత్మల్లారా, దయ చూపించండి, దయాహృదయులుగా అవ్వండి. దుఃఖము పెరిగిపోతూ ఉంది, దుఃఖితులపై దయ చూపించి వారిని ముక్తిధామములోకైతే పంపించండి. కేవలము వాణితో చేసే సేవే కాకుండా ఇప్పుడు మనసా మరియు వాణి యొక్క సేవ కలిపి-కలిపి జరగాల్సిన అవసరముంది. ఒకే సమయములో రెండు సేవలూ కలిపి జరగాలి. సేవ కోసము అవకాశము లభించాలి అని ఆలోచించకండి. నడుస్తూ-తిరుగుతూ మీ ముఖము మరియు నడవడిక ద్వారా బాబా పరిచయాన్ని ఇస్తూ వెళ్ళండి. మీ ముఖము బాబా పరిచయాన్ని ఇవ్వాలి. మీ నడవడిక బాబాను ప్రత్యక్షము చేస్తూ ఉండాలి. ఈ విధంగా సదా సేవాధారీ భవ! అచ్ఛా!

బాప్ దాదా ఎదురుగా స్థూలముగా అయితే మీరందరూ కూర్చుని ఉన్నారు, కానీ సూక్ష్మ స్వరూపముతో నలువైపులా ఉన్న పిల్లలు హృదయములో ఉన్నారు. చూస్తూ కూడా ఉన్నారు, వింటూ కూడా ఉన్నారు. దేశ-విదేశాలకు చెందిన అనేకమంది పిల్లలు ఈ-మెయిల్స్ ద్వారా, ఉత్తరాల ద్వారా, సందేశాల ద్వారా ప్రియస్మృతులను పంపారు. అందరి నుండి పేరు సహితముగా బాప్ దాదాకు స్మృతి లభించింది మరియు బాప్ దాదా మనసు లోపలే పిల్లలందరినీ ఎదురుగా చూస్తూ - వాహ్ పిల్లలూ వాహ్! అన్న పాటను పాడుతున్నారు. ప్రతి ఒక్కరికీ ఈ సమయములో స్మృతి ఇమర్జ్ రూపములో ఉంటుంది. ఫలానావారు స్మృతిని పంపించారని బాబాకు చెప్పండి, ఫలానావారు స్మృతిని పంపించారు అని బాబాకు చెప్పండి అని అందరూ సందేశీకి వేరు-వేరుగా చెప్తారు. బాబా అంటారు, బాబా వద్దకు అయితే మీరు ఎప్పుడైతే సంకల్పము చేస్తారో అప్పుడే చేరుకుంటుంది, సాధనాల ద్వారా తరువాత చేరుకుంటుంది కానీ స్నేహ సంకల్పము సాధనాల కంటే ముందే చేరుకుంటుంది. సరేనా! చాలామందికి స్మృతి లభించింది కదా! అచ్ఛా!

అచ్ఛా - ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు ముందుగా చేతులెత్తండి. ఈ సేవలో కూడా మొదటిసారి వచ్చారు. అచ్ఛా, బాప్ దాదా అంటున్నారు, మంచిది, రండి, మీరు వచ్చేందుకు ఇది సమయము. అచ్ఛా!

ఇండోర్ జోన్:- (అందరి చేతులలో ‘‘నా బాబా’’ అని హృదయము ఆకారములో సింబల్ ఉంది) చేతులనైతే చాలా బాగా ఊపుతున్నారు, కానీ మనసును కూడా కదిలించండి. నా అన్నవారిని సదా గుర్తు పెట్టుకోండి, నా అన్నవారిని మర్చిపోకండి. మంచి అవకాశాన్ని తీసుకున్నారు. బాప్ దాదా సదా అంటుంటారు, ధైర్యము ఉంచేవారికి బాప్ దాదా పదమాల రెట్లు సహాయము అందిస్తారు. మరి ధైర్యాన్ని ఉంచారు కదా! ఇండోర్ జోన్ వారు మంచిగా చేసారు. మంచిది, ఇండోర్ జోన్ సాకార బాబాకు చివరి స్మృతి స్థానము. మంచిది. అందరూ చాలా సంతోషిస్తున్నారు కదా! బంగారు లాటరీ లభించింది. జోన్ సేవ లభించటముతో సేవాధారులందరికీ అవకాశము దొరుకుతుంది. మామూలుగా అయితే ఇంతమందిని తీసుకురండి అన్న సంఖ్య లభిస్తుంది కానీ ఇప్పుడు చూడండి, ఎంతమంది ఉన్నారు! ఇది కూడా ప్రతి జోన్ వారికి మంచి అవకాశము కదా, ఎంతమందిని తీసుకురావాలనుకుంటే అంతమందిని తీసుకురండి. మరి మీ అందరికీ కొద్ది సమయములోనే ఎంత పెద్ద పుణ్య ఖాతా జమ అయ్యింది. యజ్ఞ సేవను మనస్ఫూర్తిగా చెయ్యటము అనగా మీ పుణ్య ఖాతాను తీవ్రగతితో పెంచుకోవటము, ఎందుకంటే సంకల్పాలను, సమయాన్ని మరియు శరీరాన్ని, ఈ మూడింటిని సఫలము చేసారు. సంకల్పాలు నడిచినా యజ్ఞ సేవ గురించే సంకల్పాలు నడుస్తాయి, సమయము కూడా యజ్ఞ సేవలోనే గడిచింది మరియు శరీరాన్ని కూడా యజ్ఞ సేవలో అర్పణ చేసారు. మరి ఇది సేవనా లేక మేవానా (ఫలమా)? ఇది ప్రత్యక్ష ఫలము! యజ్ఞ సేవను చేస్తున్నప్పుడు ఎవరి వద్దకైనా ఎటువంటి వ్యర్థ సంకల్పాలైనా వచ్చాయా? ఎవరి వద్దకైనా వచ్చాయా? సంతోషముగా ఉన్నారు మరియు సంతోషాన్ని పంచారు. కావున ఇక్కడ ఏదైతే బంగారు అనుభవాన్ని పొందారో, ఈ అనుభవాన్ని అక్కడ కూడా ఇమర్జ్ చేసి పెంచుకుంటూ ఉండండి. ఎప్పుడైనా ఏవైనా మాయకు చెందిన సంకల్పాలు వచ్చినా కూడా మనసు అనే విమానములో శాంతివన్ కు చేరుకోండి. మనసు అనే విమానమైతే ఉంది కదా! అందరి వద్ద మనసు అనే విమానము ఉంది. బాప్ దాదా ప్రతి బ్రాహ్మణాత్మకు జన్మ కానుకగా శ్రేష్ఠ మనసు అనే విమానాన్ని ఇచ్చారు. ఈ విమానములో ఎక్కడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరము ఉండదు. స్టార్ట్ చెయ్యాలంటే ‘నా బాబా’ అని అనండి, అంతే. విమానాన్ని నడపటం వస్తుంది కదా! కనుక ఎప్పుడైనా ఏదైనా జరిగితే మధుబన్ కు చేరుకోండి. భక్తి మార్గములో నాలుగు ధామాల యాత్రను చేసేవారు తమను తాము చాలా భాగ్యవంతులుగా భావిస్తారు, మరి మధుబన్ లో కూడా నాలుగు ధామాలు ఉన్నాయి. మరి నాలుగు ధామాల యాత్ర చేసేరా? పాండవ భవన్ లో చూడండి, నాలుగు ధామాలు ఉన్నాయి. ఎవరు వచ్చినా పాండవ భవన్ కు అయితే వెళ్తారు కదా, 1. శాంతి స్తంభము, ఇది మహాధామము, 2. బాప్ దాదా గది, ఇది స్నేహ ధామము, 3. బాబా కుటీరము, ఇది స్నేహ మిలన ధామము మరియు 4. హిస్టరీ హాల్. మరి మీరందరూ నాలుగు ధామాల యాత్ర చేసారా? కావున మహా భాగ్యవంతులుగా అయిపోయారు. ఇప్పుడు ఏ ధామమునైనా గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా ఉదాసీనులుగా అయితే ఆత్మిక సంభాషణ చేసేందుకు కుటీరములోకి రండి. శక్తిశాలిగా అయ్యే అవసరము ఉన్నప్పుడు శాంతి స్తంభము వద్దకు చేరుకోండి మరియు వ్యర్థ ఆలోచనలు చాలా తీవ్రముగా ఉంటే, వేగవంతముగా ఉంటే హిస్టరీ హాల్ కు చేరుకోండి. సమానముగా అవ్వాలి అన్న దృఢ సంకల్పము ఉత్పన్నమైనట్లయితే బాప్ దాదా గదిలోకి రండి. మంచిది. అందరూ సువర్ణావకాశాన్ని తీసుకున్నారు కానీ అక్కడ ఉంటూ కూడా సదా సువర్ణావకాశాన్ని తీసుకుంటూ ఉండండి. అచ్ఛా. మంచి ధైర్యవంతులుగా ఉన్నారు.

క్యాడ్ గ్రూప్ (హృదయము కలవారు కూర్చుని ఉన్నారు, అందరూ కలిసి చాలా మంచి కాన్ఫరెన్స్ చేసారు):- బాగా చేసారు, పరస్పరములో మీటింగ్ కూడా చేసుకున్నారు మరియు ప్రెసిడెంట్ కు కూడా ఈ కార్యము జరగాలి అన్న కోరిక ఉంది. వారికి కూడా కోరిక ఉంది కావున వారిని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి, అంతేకాక బ్రాహ్మణుల మీటింగ్ ఏదైతే ఉందో, అందులో కూడా మీ ప్రోగ్రామ్ సమాచారాన్ని వినిపించి సలహా తీసుకోండి, అలా తీసుకుంటే బ్రాహ్మణులందరి సలహాలతో మరింత శక్తి నిండుతుంది. ఇకపోతే, కార్యము చాలా మంచిది, చేస్తూ ఉండండి, వ్యాపింపజేస్తూ ఉండండి మరియు భారత్ యొక్క విశేషతను ప్రత్యక్షము చేస్తూ వెళ్ళండి. చాలా బాగా కృషి చేస్తున్నారు. ప్రోగ్రామ్ కూడా బాగా చేసారు, అంతేకాక హృదయము కలవారు తమ విశాల హృదయాన్ని చూపించారు, దానికి అభినందనలు. అచ్ఛా!

డబుల్ విదేశీ సోదరీ-సోదరులు:- మంచిది, ప్రతి టర్న్ లోనూ డబుల్ విదేశీయులు రావటము వలన ఈ సంగఠనకు శోభనిస్తుంది. డబుల్ విదేశీయులను చూస్తే అందరికీ ఉల్లాసము కూడా కలుగుతుంది, డబుల్ విదేశీయులందరూ డబుల్ ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు ఎగురుతూ ఉన్నారు, నడవటం లేదు, ఎగురుతున్నారు, అంతే కదా! మీరు ఎగిరేవారా లేక నడిచేవారా? ఎవరైతే నడవకుండా సదా ఎగురుతూనే ఉంటారో వారు చేతులెత్తండి. అచ్ఛా. మామూలుగా కూడా చూడండి, విమానములో ఎగురుతూనే రావాల్సి వస్తుంది కదా, కావున ఎగిరే అభ్యాసమైతే మీకు ఉండనే ఉంది. అది శరీరముతో ఎగరటము, ఇది మనసుతో ఎగరటము, ధైర్యము కూడా చాలా మంచిగా ఉంచారు. బాప్ దాదా చూసారు, తన పిల్లలను ఎక్కడెక్కడో మూల మూలల నుండి వెతుకున్నారు కదా! చాలా మంచిది, చెప్పటానికైతే డబుల్ విదేశీయులు, కానీ మామూలుగా అయితే ఒరిజినల్ గా భారత్ వారు. అంతేకాక రాజ్యము కూడా ఎక్కడ చెయ్యాలి? భారత్ లోనే చెయ్యాలి కదా! కానీ సేవార్థము 5 ఖండాలకు చేరుకున్నారు. అంతేకాక 5 ఖండాలలోనూ భిన్న-భిన్న స్థానాలలో సేవను కూడా మంచి ఉల్లాస-ఉత్సాహాలతో చేస్తున్నారు. మీరు విఘ్న వినాశకులు కదా! ఏ విఘ్నము వచ్చినా సరే - ఇది ఎందుకు జరుగుతూ ఉంది, ఇది ఏమిటి ఇలా జరుగుతూ ఉంది అని గాభరాపడేవారైతే కారు కదా. ఏదైతే జరుగుతుందో అది మనలో ఇంకా ధైర్యాన్ని పెంచేందుకు సాధనము. గాభరాపడేందుకు కాదు, ఉల్లాస-ఉత్సాహాలను పెంచేందుకు సాధనము. ఇలా పక్కాగా ఉన్నారు కదా! పక్కానేనా? లేక కొద్ది-కొద్దిగా కచ్చాగా ఉన్నారా? అలా ఉండకూడదు. కచ్చా అన్న మాట మంచిగా అనిపించదు. పక్కాగా ఉన్నారు, పక్కాగా ఉంటారు, పక్కాగా అయ్యి తోడుగా వస్తారు. అచ్ఛా!

జానకి దాది ఆస్ట్రేలియాకు వెళ్ళి వచ్చారు, వారు చాలా స్మృతిని ఇచ్చారు:- బాప్ దాదా వద్దకు ఈ-మెయిల్ లో కూడా సందేశము వచ్చింది మరియు బాప్ దాదా చూస్తున్నారు, ఈ రోజుల్లో పెద్ద ప్రోగ్రామ్ లు కూడా ఎలా అయిపోయాయంటే అవి ముందే జరిగే ఉన్నాయి అన్నట్లుగా అనిపిస్తుంది. అందరూ నేర్చేసుకున్నారు. సేవా సాధనాలను కార్యములో వినియోగించటము బాగా అభ్యాసమైపోయింది. బాప్ దాదాకు ఆస్ట్రేలియా నంబర వన్ గా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు యు.కె. నంబరులో కాస్త ముందుకు వెళ్తూ ఉంది. మొట్టమొదట ఆస్ట్రేలియా నంబర్ వన్ తీసుకుంది, ఇప్పుడు మళ్ళీ ఆస్ట్రేలియా నంబరవన్ గా అవ్వాల్సిందే. అలాగని యు.కె. రెండో నంబర్ గా అవ్వదు, అది కూడా నంబర్ వన్ గానే అవుతుంది. ఆస్ట్రేలియాకు చెందిన పాత-పాత పిల్లలు బాప్ దాదాకు గుర్తున్నారు. బాప్ దాదాకు ప్రియమైన నిర్మల ఆశ్రమ్, వీరిని మీరు నిర్మలా దీదీ అని అంటారు. దీదీ అని అంటారు కదా, కానీ బాప్ దాదా వారికి ముందు నుండీ నిర్మల ఆశ్రమ్ అన్న టైటిల్ ను ఇచ్చారు. ఈ ఆశ్రమము నుండి అనేక ఆత్మలు ఆధారాన్ని పొందారు మరియు బాబాకు చెందినవారిగా అయ్యారు మరియు అవుతూ ఉన్నారు, అలాగే అవుతూ ఉంటారు. కనుక ఆస్ట్రేలియా నివాసులైన పిల్లలు ప్రతి ఒక్కరికీ విశేష స్మృతిని ఇస్తున్నాము, ఎదురుగా కూర్చున్న వీరు ఆస్ట్రేలియాకు చెందినవారు కదా! ఆస్ట్రేలియావారు లేవండి. చాలా మంచిది. వీరికి ఎంత మంచి ఉల్లాసము వస్తూ ఉంది, విశ్వ సేవ కొరకు చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. బాప్ దాదా సహాయము ఉంది మరియు సఫలత కూడా ఉండనే ఉంది. అచ్ఛా - ఇప్పుడు ఏ దృఢ సంకల్పము చేస్తున్నారు? ఇప్పుడు ఇదే సంకల్పములో కూర్చోండి - సఫలత మా జన్మసిద్ధ అధికారము, విజయము మా మెడలోని హారము. ఈ నిశ్చయము మరియు ఆత్మిక నషాలో అనుభవీ స్వరూపులై కూర్చోండి. అచ్ఛా!

నలువైపులా ఉన్న చింత నుండి దూరముగా ఉండే నిశ్చింత చక్రవర్తులకు, సదా నిశ్చింతపురికి చక్రవర్తులము అన్న స్వరూపములో స్థితులై ఉండే పిల్లలకు, సర్వ ఖజానాలతో సంపన్నమైన, ప్రపంచములోనే అతి సంపన్నులైన పిల్లలందరికీ, సదా ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరేకళ కల పిల్లలకు, సదా సమాప్తిని సమీపముగా తీసుకువచ్చే బాప్ దాదా సమానమైన పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు, మనస్ఫూర్వకమైన ఆశీర్వాదాలు, వరదాత యొక్క వరదానాలు మరియు నమస్తే.

వరదానము:-
స్వయం యొక్క సర్వ బలహీనతలను దానము యొక్క విధి ద్వారా సమాప్తము చేసే దాత, విధాత భవ

భక్తిలో ఒక నియమము ఏముంటుందంటే - ఏదైనా వస్తువు యొక్క లోటు ఉన్నట్లయితే దానమివ్వండి అని అంటారు. దానమిచ్చినట్లయితే ఆ ఇవ్వడమనేది తీసుకోవడముగా అయిపోతుంది. కావున ఏ బలహీనతనైనా సమాప్తము చేసుకునేందుకు దాత మరియు విధాతగా అవ్వండి. ఒకవేళ మీరు ఇతరులకు బాబా ఖజానాను ఇచ్చేందుకు నిమిత్త ఆధారముగా అయినట్లయితే బలహీనతలు స్వతహాగానే దూరమైపోతాయి. మీ దాత-విధాతతనపు శక్తిశాలి సంస్కారాలను ఇమర్జ్ చేసుకున్నట్లయితే బలహీన సంస్కారాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి.

స్లోగన్:-
మీ శ్రేష్ఠ భాగ్యము యొక్క గుణగానము చేయండి, అంతేకానీ బలహీనతలను కాదు.

అవ్యక్త ప్రేరణలు-సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి

ఎవరి పైనైతే ప్రేమ ఉంటుందో వారికి ఏది ఇష్టమైతే అదే చెయ్యటం జరుగుతుంది. పిల్లలు అప్సెట్ అవ్వటము (మాససిక అలజడిలోకి రావటము) బాబాకు మంచిగా అనిపించదు, అందుకే ఎప్పుడూ కూడా - ఏం చెయ్యాలి, విషయమే అటువంటిది, అందుకే అప్సెట్అయ్యాము... అని అనకండి. ఒకవేళ అప్సెట్చేసే విషయము వచ్చినా కూడా మీరు అప్సెట్స్థితిలోకి రాకండి. మనస్ఫూర్తిగా బాబా అని అనండి మరియు ఆ ప్రేమలోనే ఇమిడిపోండి.